గుంజకు కట్టేశారు. పశువుని కాదు, మనిషిని. కట్టేసిన వాళ్ళు మనుషులు కాదు, భక్తులు!
అప్పటికే వొంటిమీది దుస్తులే కాదు, చర్మమూ కాస్తంత చిరిగింది.
“జై శ్రీరామ్”
అన్నా సరే, ముక్కుమీద గుద్దితే మూతి కూడా పగిలింది.
“జై శ్రీరామ్”
ఏడుపు గొంతుతో యెలుగెత్తి అన్నాడు. అయినా గూబ గుయ్మంది.
“జై శ్రీరామ్… జై శ్రీరామ్… జై శ్రీరామ్…”
కొట్టడం ఆపుతారని అరుస్తూనే వున్నాడు. దెబ్బలు పడుతూనే వున్నాయి.
జై శ్రీరామ్ అనడం ఆగిపోయింది.
సొమ్మసిల్లిపోయాడు.
ముఖమ్మీద నీళ్ళు చల్లారు. జుత్తుపట్టి తల పైకెత్తి ముఖమ్మీద నీళ్ళు చల్లారు. ఉబ్బిన కళ్ళతో నోటివెంట చొంగ కారుస్తూ చూస్తున్నాడు.
“చెప్పు”
గద్దించింది గొంతు. చుట్టూ వున్మాదాకారాలు. విస్పోటన వికారాలు.
“జై శ్రీరామ్”
వణికాడు. వెంటనే దవడ చిట్లిపోయింది.
“జై శ్రీరామ్ కాదు… యేం అనాలి?”
అరిచాడు. కోరస్గా అరుపులు.
“జై సీతారామ్”
ఈ సారి డొక్కలో తన్నారు.
‘అమ్మా’ అని మెలికలు తిరిగాడు. ప్రాణం నలిగిపోతున్నట్టు.
“చెప్పు?”
అర్థం కాలేదు. భయంతో వారు అంతకు ముందు చెప్పింది మర్చిపోయినట్టున్నాడు. తోవ తప్పినా గొర్రెపిల్లలా చూశాడు.
“జయ్ షియారామ్”
చెప్పమన్నట్టు చెప్పి మరీ చూశారు.
“జై శ్రీరామ్”
అలవాటుగానో ఆందోళనతోనో అన్నాడు. అంతే, జుత్తుపట్టి గుంజకు గుద్ది గుద్ది వదిలారు.
“జయ్ షియారామ్”
బుద్ధిగా ప్రశాంతమైన గొంతుతో బుజ్జగించినట్టు చెప్పారు.
“జయ్ షిరామ్…”
ఏడుస్తూ చెప్పాడు.
తలడ్డంగా వూపారు. కాదన్నట్టు.
“జయ్ షియారామ్”
బోధ పరిచినట్టు చెప్పారు.
“జై కాదు జయ్ సి… షి…”
“యా…”
కరెక్ట్ అన్నట్టు చెప్పమన్నట్టు తలాడించాడు.
“షి… యా… షియా… రామ్… జై షియారామ్…”
ఈలలు… చప్పట్లు… గోలలు.
గుంజకు కట్టిన కట్లు విడిపోయాయి?!




