విప్లవం ఒక చిన్నారిని కవిగా మలిచింది . విప్లవకారుడిగా తీర్చి దిద్దింది . ఈ కవి సల్వాజుడుం రోజుల్లో తల్లి వేలు పట్టుకొని వచ్చి బీ.ఆర్.ను తొలిసారి చూశాడు , తరువాత ఉద్యమంలో చేరాడు. కంప్యూటర్ గురూజీగా పేరు పొందిన సుప్రసిద్ధ రచయిత్రి, అమర యోధ రేణుక అలియాస్ మిడ్కో వద్ద కంప్యూటర్ శిక్షణ పొందాడు.
1 . మా ప్రాణం బీ.ఆర్
నా కళ్ల నుండి నెత్తుటి ధారలు
నేల రాలుతుంటే,
నీ త్యాగం, నీతో, నే గడిపిన క్షణాలను
పదే పదే గుర్తు చేస్తున్నాయి
నీతో గడిపిన ప్రతి క్షణం
నాలో నీ త్యాగాన్ని ఎత్తిపడుతోంది
నీ అమర స్మృతులను
విశ్వ పీడిత ప్రజ సదా స్మరిస్తారు
రణభూమిలో నీ ముకుళిత నేత్రాల
ముఖాన్ని చూస్తే నీ ముఖంలో, నే చూసిన
తొలినాటి గాంభీర్యం
నా మదిలో మెదిలింది.
నీ అధ్యయనం, అధ్యాపనం, నీ
మాటా, నీ స్వరం, నీ ఆకారం
నీ మార్గదర్శనం ఆ మూసిన కళ్లు
మమ్మల్ని మరువనీయకుండా
పచ్చి పచ్చిగా గుర్తుచేస్తున్నాయి.
ఆ కళ్లు మా కళ్లల్లో నీ ఆశల,
ఆశయాల ప్రపంచాన్ని చూస్తున్నాయి.
ఆ చూపులకు మరణం లేదు
ఆ చూపులు వెలుగులను ప్రసరిస్తున్నాయి
నీ మూసిన కళ్లల్లో నాకు
నా చిన్ననాటి సల్వాజుడుం దారుణాలు
ఎదుర్కొన్న అనుభవాలు గుర్తొస్తున్నాయి.
నీ ప్రతిఘటన మా జీవితాలకు
యుద్ధరావాన్ని విన్పించి
పోరాట అక్షరాలను మాతో దిద్దించింది.
మా ‘పడియోర్’ (ప్రజాయోధులు) రక్తతర్పణం చేసిన
నేలను నీ అరుణవర్ణ పతాక రాజకీయాల
రక్తంతో పుణీతం చేశావు,
ప్రజాయుద్ధ రణస్థలిగా మలిచావు
కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ల మధ్య
సాగిన మా జీవితాలలో
వయసు, ఆరోగ్యం హద్దులు విధిస్తున్నా
నీ అలుపెరుగని కృషి
మాకు తోడై, నీడై, సాహసమై, సంగమమై
మాతో సాగుతూ, మము ముందుకు నడిపింది.
నీ దీర్ఘ విప్లవ ప్రస్తానం
నా జీవితానికి, నా అక్షరాలకు
అందనంతటి విలువైనది, ఉన్నతమైనది
ఇక మాకు ఆ ప్రస్తానమే
మా ప్రస్తానానికి మార్గదర్శిగా మిగిలింది.
2 . కంప్యూటర్ గురూజీ
విప్లవ శిబిరంలో కంప్యూటర్ గురూజీ చైతే దీదీ
నాలో పొటమరించే రెండు విషయాలు
పదే పదే గుర్తు చేస్తున్నాయి
తుపాకులు, బాయ్ నెట్లతో చెలిమి చేసే
అనేకమంది అక్షరాలు రాని ఆదివాసీ పిల్లల
వేళ్లతో కీ బోర్డు పై అక్షరాలతో కుస్తీ పట్టించావు
కంప్యూటర్ అంటేనే వింతగా చూసే
నా బోటి పిల్లలకు దాని బిషాదెంత
అని ధైర్యాన్నిచ్చి, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ల
మూలాలన్నీ సాఫ్ట్ గా మా మెదళ్లలోకి
అంతర్ చలనంలా ప్రవహింపచేశావు.
ఈ రోజు నీ జ్ఞాపకాలను డిజిటల్
అక్షరాలలో మేం చదువుకోవడమే కాదు,
ప్రపంచానికి అందించే శక్తిని మాకు ఇచ్చావు.
చైతేదీ,
2005 జుడుం మా జీవితాలలో
కుటుంబాలలో చీకట్లను నింపితే,
నా కన్నతండ్రిని నా కళ్లముందే కత్తులతో
జుడుం గూండాలు పొడిచి చంపితే,
ఆ భయానక దృశ్యాన్ని భరించలేని నా చిన్ని కళ్లు
అమ్మ ఒడిలో ఏడుస్తూ మూసుకుపోయాయి.
ఆ రోజుల్లో నీవు మా అమ్మను
కలిసావు, మా వెత విన్నావు,
మా బతుకులను ప్రపంచానికి
నీ రాతలతో పరిచయం చేశావు.
ఆ నాటి చేదు జ్ఞాపకాలను,
మా బాపు స్మృతులను,
నీవు నేర్పిన విద్యాబుద్ధులతో
ఈనాడు అంతర్జాలంలో చదువుకుంటూ
మాకోసం త్యాగం చేసిన మీ జీవితాదర్శాల
గొప్పతనాన్ని మరువలేకపోతున్నాం.
ఆ జ్ఞాపకాల సాక్షిగా,
మీ జీవితాశయాల సాధనకై
మా జీవితాలను అంకితం చేస్తాం.
తెలుగు: చరియా
Related