బహిరంగ జియోనిస్టు మద్దతుదారుడు మయిమ్ బియాలిక్ ఫిబ్రవరి 2024లో నిర్వహించిన ‘పెన్ అవుట్ లౌడ్’1 సమావేశం నుంచి బయటకు ఈడ్చుకెళ్తుంటే, “ఒక పాలస్తీనీయుడితో పెన్‌లో ఇలా వ్యవహరిస్తున్నారు?” అని రండా జర్రర్ నినదించింది. గాజాపైన ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గురించి మయిమ్ చాలా మొరటు హాస్యం చేసాడు. నిరసనగా, జర్రర్ తదితరులు అప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ చంపిన 13 మంది పాలస్తీనా రచయితల పేర్లను చదివారు.

2023 అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు (సెప్టెంబర్ 2025) గాజాలో 270 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ చంపింది.  భావప్రకటనా స్వేచ్ఛ, సాహిత్యం, కళల కోసం పనిచేసే లాభాపేక్ష లేని సంస్థ ‘పెఎన్ అమెరికా’లో జర్రర్ దాదాపు రెండు దశాబ్దాలుగా స్వచ్ఛందంగా పనిచేశారు. ఆమె నిరసన తెలిపిన రాండా జర్రర్‌ను పెన్ అమెరికా  మాట్లాడనీయకుండా చేయడంతో ఉత్ప్రేరక తరంగంలా  పెన్ వార్షిక వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్ నుంచి చాలామంది తమ పేర్లను ఉపసంహరించు కోవడంతో చివరికి ఆ ఉత్సవాన్ని గత సంవత్సరం రద్దు చేయాల్సి వచ్చింది.

రాండా జర్రర్ ఒక పాలస్తీనా-ఈజిప్షియన్ అమెరికన్ నవలా రచయిత్రి, వ్యాసకర్త, ప్రదర్శకురాలు, అనువాదకురాలు. ఆమె రచనలు తరచుగా విచిత్రమైన, చీకటి హాస్యాన్ని ఉపయోగించి ప్రవాసము-ఇల్లు, సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, రాజ్య హింస, క్వీర్ కోరిక వంటి లోతైన ఇతివృత్తాలను అన్వేషిస్తాయి.

అవార్డు వచ్చిన ఆమె తొలి నవల, ఎ మ్యాప్ ఆఫ్ హోమ్ (2008), ఒక యువ పాలస్తీనా-ఈజిప్షియన్ మహిళ తన యుక్తవయస్సులోకి అడుగుపెట్టడం గురించిన కథ. ఆమె జర్రర్ లాగే కువైట్, ఈజిప్ట్‌లో పెరిగి, యుక్తవయసులో అమెరికాకు వెళ్తుంది. ఆమె  హిమ్, మీ, ముహమ్మద్ అలీ (2016) అనే ఒక చిన్న కథల సంకలనాన్ని, లవ్ ఈజ్ ఎన్ ఎక్స్-కంట్రీ (2021) అనే ఒక జ్ఞాపకాల పుస్తకాన్ని కూడా ప్రచురించింది.  ఈ పుస్తకంలో ఆమె ఒక క్వీర్‌గానూ, లావుగానూ ఉండే అరబ్ అమెరికన్‌గా తన అనుభవాలను వివరిస్తుంది.

జర్రర్ తన పదునైన అమర్యాదకి కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె 2014లో రాసిన “వై ఐ కాంట్ స్టాండ్ వైట్ బెల్లీ డాన్సర్స్” (శ్వేత బెల్లీ డ్యాన్సర్‌ను నేను ఎందుకు భరించలేను) అనే వ్యాసం సాంస్కృతిక అనుకరణ, పాశ్చ్యాత సంస్కృతి పైన  ఒక చర్చను లేవనెత్తింది. అలాగే, 92 సంవత్సరాల వయసులో మరణించిన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ భార్య బార్బరా బుష్ గురించి ఆమె 2018లో చేసిన ట్వీట్లు కూడా చాలా వివాదాస్పదమయ్యాయి.  అప్పట్లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో క్రియేటివ్ రైటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న జర్రర్: “బార్బరా బుష్ ఒక గొప్ప, తెలివైన, అద్భుతమైన జాత్యాహంకార యువతి; ఆమె తన భర్తతో కలిసి ఒక యుద్ధ నేరగాడిని పెంచింది. మీ మర్యాదపు మాటలు మాకు వద్దు” అని రాసింది.

పాశ్చాత్య సాంస్కృతిక సంస్థల గురించి, పాలస్తీనాపైన వాటికి ఉండే ద్వంద్వ ప్రమాణాల వైఖరి గురించి మాట్లాడేటప్పుడు కూడా జర్రర్ అదే దృఢమైన నైతిక స్పష్టతను కలిగి ఉంటుంది. “జియోనిజం చాలా వరకు ఉదారవాద ప్రమాణాలకు మినహాయింపు” అని ఆమె నాతో అన్నది; దీనిని ఆమె ఏమాత్రం సహించదు. ఉదాహరణకు, ఈ జూలైలో,  ‘గాజాలో ఇజ్రాయెల్ చర్యలు మారణహోమం కాదని’ ప్రకటించిన ఇజ్రాయెలీ రచయిత ఎట్గార్ కరట్‌కు ఎడిన్‌బర్గ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ వేదిక కల్పించడాన్ని నిరసిస్తూ జర్రర్ ఆ ఉత్సవం నుంచి బయటకు వచ్చేసింది.

 “నేను నా సమయాన్ని మీకు నేర్పించడానికి వృథా చేయను. నా పాలస్తీనియన్ క్వీర్‌నెస్‌ను మారణహోమం చేసేవారితో మీ సంబంధాలను బాగు చేసుకోవడానికి ఈ ఫెస్టివల్‌కు అనుమతించను,” అని జర్రర్ బుక్ ఫెస్టివల్ బృందానికి పంపిన ఇమెయిల్‌లో రాసింది; తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నది. “ఈ మొత్తం ప్రపంచం ఇచ్చే దానికన్నా మెరుగైన దాన్ని అందుకోడానికి నా ప్రజలు అర్హులు. మీ ఉత్సవానికి నన్ను ఉపయోగించుకోవడానికి నేను అనుమతించను.” దీని తర్వాత, కవి ఫాడీ జౌదా, జర్నలిస్ట్ ఒమర్ ఎల్ అకాద్ కూడా అదే విధంగా వైదొలిగారు.

జర్రర్ ఇటీవల ప్రదర్శనలలో కూడా పాల్గొంటున్నది.  రామీ యూసెఫ్ చేసిన, 9/11 తర్వాత ఒక ఈజిప్షియన్-అమెరికన్ కుటుంబపు జీవితాన్ని అనుసరించే యానిమేటెడ్ కామెడీ సిరీస్ #1 హ్యాపీ ఫ్యామిలీ యుఎస్‌ఎలో ఆమె అమ్మమ్మ పాత్రకు గాత్రదానం చేసింది. ఈ సంవత్సరం తన సోలో నాటకం ‘ది లాస్ట్ పాలస్తీనియన్’ను స్వయంగా రాసి ప్రదర్శించింది. ఈ నాటకం 2055 కాలంలో జరుగుతుంది. చివరిగా మిగిలిన పాలస్తీనియన్, చివరికి భూమిపై మిగిలిన చివరి వ్యక్తి కూడా అయిన అషీరా అనే పాత్ర, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్ నమూనాలో రూపొందించిన ఒక కృత్రిమ మేధస్సు గల  సహచరుడి సహాయంతో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో, గాయకురాలు బ్జోర్క్2 నుండి దేవత అనాట్ (అనాత్)3 వరకు వివిధ పాత్రల పునరుత్పాదనలు మనకు కనిపిస్తాయి.

ఈ ప్రదర్శన నిగూఢమైనదిగానో  లేదా అధునాతనంగా కానీ లేదు; కానీ అది వికారమైన హాస్యమూ, విపరీతమైన ఊహాగానాల పట్ల జర్రర్‌కి ఉన్న పచ్చి కోపాన్ని వెల్లడిస్తుంది. గాజా కోలా తాగుతూ వేడిగా ఉన్న కునాఫేను (అరబ్ సాంప్రసాయకా తీపి వంటకం)చిన్న, ఒకేలాంటి మనసున్న ప్రేక్షకులతో పంచుకుని తింటూ గత నెల లండన్‌లోని పాలస్తీనా హౌస్‌లో దీనిని చూసాను. రంగస్థలం ఈ విలక్షణమైన, ఉద్వేగభరితమైన కళాకారిణిని కాయితం నుండి బయటకు వచ్చి తన శరీరంలోకి అడుగుపెట్టడానికి అనుమతించినట్లు అనిపించింది. జర్రర్ వేదికపై ఆరు విభిన్న పాత్రల మధ్య తిరుగుతూ, వారి వివిధ యాసలు, ఉచ్ఛారణలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నప్పుడు, నాకు అపారమైన ఆనందం, భావవిముక్తి, సాముదాయక భావన కలిగింది. ఇది సమిష్టి దుఃఖాన్ని పంచుకోవడానికి మాత్రమే కాకుండా, న్యాయాన్ని తిరిగి ఊహించుకోవడానికి, ప్రతీకార కల్పనలను కూడా ఆస్వాదించడానికి ఒక స్థలంగా ఉంది.

కొన్ని వారాల తర్వాత రండా జర్రర్‌తో, ఆమె పశ్చిమ దేశాల సాంస్కృతిక వేదికల్లో ఎలా వ్యవహరిస్తుంది, ది లాస్ట్ పాలస్తీనియన్ను ఎలా రాసి, ప్రదర్శించింది, యూసెఫ్ టీవీ షోలో ఎలా పనిచేసింది; పాలస్తీనియన్లతో నిజమైన సంఘీభావం ఎలా ఉంటుందనే విషయాలపైన మాట్లాడాను. మా సంభాషణలోని కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

కాషిఫ్ హాజీ: ఒక రచయితగా, సాంస్కృతిక నిర్మాతగా, నిస్సంకోచ కార్యకర్తగా మీ గొంతును తీర్చిదిద్దిన అత్యంత ముఖ్యమైన సంఘటనలు ఏమిటి?

రండా జర్రర్: నేను 1978లో పుట్టాను, అందుకే మొదటి ఇంటిఫాడా [1987]కు4  ముందు పాలస్తీనాను సందర్శించే అదృష్టం నాకు కలిగింది. నా కుటుంబమూ,  నేనూ పాలస్తీనాలోని చాలా ప్రాంతాలకు కారులో వెళ్ళగలిగాము – అయినప్పటికీ నేను జెరూసలేంను ఎప్పుడూ చూడలేకపోయాను. పాలస్తీనాకు ప్రయాణించడం, అలెన్బీ బ్రిడ్జ్ [జోర్డాన్- ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ల మధ్య ఉన్న ఏకైక క్రాసింగ్] మీదుగా వెళ్ళడం; ఒక చిన్న అమ్మాయిగా నన్ను బట్టలు విప్పి తనిఖీ చేయడం చాలా రాజకీయంగా ఉత్తేజపరిచే అనుభవం: చాలా తెల్లగా కనిపించే యూనిఫారంలో ఉన్నవారు, పెద్ద తుపాకులతో లైంగికంగా వేధించడం. నా శరీరంలోనే వలసవాదాన్ని అనుభవించడం – ఒక పిల్లగా నా వ్యక్తిగత సరిహద్దులను తుడిచివేయడం, వాటిపైన దాడి జరగడం – దాని గురించి మాట్లాడటానికి భాష లేకపోవడం నా జీవితంలో ఒక కీలకమైన భాగం అయ్యింది.

ఆ తర్వాత, నా కుటుంబపూర్వీకుల గురించి కథలు వినడం, జరార్ల (పాలేస్తీనాలో ఇంటి పేరు – గొప్ప యుద్ధవీరుడు, నాయకుడు, ధైర్యశాలి అనే అర్థం వస్తుంది) గురించి చారిత్రక వాస్తవాలు తెలుసుకోవాలనే ఆసక్తి నన్ను ఈ ప్రయాణంలో ముందుకు నడిపింది: 1799లో నెపోలియన్ మా పాలస్తీనా భాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు, నా తండ్రి పూర్వీకుడు ఒక మౌఖిక పద్యం రాశారని, అది పాలస్తీనాలోని ఉత్తర ప్రాంత తెగలనన్నింటినీ నెపోలియన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేరేపించి, ఏకం చేసిందని చదివాను. వారు గెలిచారు. ఆ తర్వాత, నెపోలియన్ తన చరిత్రలో “ఖైదీలకు తగినంత స్థలం లేకపోవడం వల్ల పాలస్తీనాను జయించడాన్ని కొనసాగించలేకపోయాను” అని రాశారని నేను చదివాను. ఇది చరిత్ర ఎలా తిరిగి వ్రాయబడుతుందో చూపిస్తుంది.

నేను సంవత్సరాలుగా వివిధ గ్రంథాలను చదివాను, ముఖ్యంగా నల్లజాతి, ఆఫ్రికన్ మహిళలు రాసినవి. వీటిలో టిట్సి డంగరేంబగా రాసిన నర్వస్ కండిషన్స్ (1988) వంటి పుస్తకాలు, ఫ్రాంజ్ ఫానన్ రచనలు ఉన్నాయి. హింస అనేది వలసవాదులు మాత్రమే ప్రదర్శించేది కాదని, అది వారికి వ్యతిరేకంగా కూడా ఉపయోగించవచ్చని అర్థం చేసుకోవడానికి ఇవి నాకు సహాయపడ్డాయి.

కె.హెచ్: మీరు తరచుగా నిరాకరించడాన్ని, బయటకు వెళ్లిపోవడాన్ని, ఉపసంహరించుకోవడాన్ని లేదా వద్దు అని చెప్పడాన్ని వివిధ పాశ్చాత్య సాంస్కృతిక సంస్థలకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనా రూపంగా ఎంచుకున్నారు. రచయితగా ఈ నిరాకరణ మీకు ఏమి ఇస్తుంది?

ర.జా: ఇది నాకు ఒక ఇల్లునిస్తుంది. ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. నేను నిజంగా అమలు చేయగలిగే, నిర్వహించగలిగే సరిహద్దులను ఇస్తుంది. నిరాకరణను కూడా తెలియచేయగలిగే  ప్రజల సముదాయాన్ని నాకు ఇస్తుంది. ఇది కేవలం ప్రతిఘటిస్తున్నట్లు నటించేవారే కాకుండా, నిజంగా ప్రతిఘటించే వారికి దమ్ము ఉందో లేదో బయటపెడుతుంది. ఇది ప్రపంచానికి కూడా చాలా సంస్థలు తమ సంపదను, అధికారాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పేవాళ్లేనని చూపిస్తుంది. కాబట్టి, ఇది నాకు శక్తిని ఇస్తుంది.

కె.హెచ్: ఈ నిరాకరణ వల్ల వ్యక్తిగత మూల్యామేమైనా చెల్లించాల్సి వచ్చిందా?

ర.జా: లేదు. నాకు, ఈ సంస్థలు, వేదికలు లేదా స్థలాలు అసహ్యకరమైనవి. వాటి కపటత్వం నాకు వికారాన్ని కలిగిస్తుంది. అవి నేను ఎవరిని, ఏమి చేయాలనుకుంటున్నాను, ప్రపంచం ఎలా ఉండాలని కోరుకుంటున్నానుఅనే దానికి సరిపోవు. దాదాపు గత రెండు సంవత్సరాల మారణహోమంలో మూడు లక్షల మంది పాలస్తీనియన్లను చంపగలిగినప్పుడు, ఉద్యోగం కోల్పోవడం అనేది ఏ విధంగానైనా ముఖ్యమని భావించడం ఈ సమయంలో కేవలం హాస్యాస్పదంగా ఉంటుంది. గత 76 సంవత్సరాలలో ఎంతమందిని చంపారో చెప్పనవసరం లేదు. ఇంకా నా ప్రజలను, గ్లోబల్ సౌత్‌లోని తన ఆధిపత్య ప్రాజెక్టులు, ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న ఏ రకమైన ప్రతిఘటననైనా నాశనం చేయడం తన పనిగా పెట్టుకున్న వలసవాద ప్రాజెక్ట్‌ల ను కూడా పరిగణించాలి.

“నాకు, ఒక కెరీర్ అంటే ఏమీ కాదు. ఒక ఉద్యోగం అంటే ఏమీ కాదు. అది ప్రజలతో, సంస్థలతో కలిసి ఉండే అవకాశాలను కోల్పోవడం. అధికారం అనేది ఒక వరం. నా వెనుక ఒక వంతెన కాలిపోతుండటం చూస్తే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ సంస్థ—ఆ అసహ్యమైన నేరగాళ్లు—నాకు ఇకపై అందుబాటులో ఉండరని దాని అర్థం. ఇతర సాంస్కృతిక సృష్టికర్తలు కూడా దానిని ఆ విధంగా చూస్తారని నేను కోరుకుంటున్నాను: కళాకారులుగా మనకు నిజంగా అధికారం ఉంది; మనం కలిసి సృష్టించేది చాలా శక్తివంతమైనది. మనకు గొంతు ఇవ్వడానికి పెద్ద ప్రచురణలు లేదా వేదికలు అవసరమయ్యే ప్రపంచాన్ని మనం దాటి వచ్చాము. మనం మనకు మనమే గొంతు ఇచ్చుకోగలం. ఉత్పత్తి సాధనాలు మనకు ఉన్నప్పుడు వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు?

కాషిఫ్ హాజీ:  pen అమెరికాతో గత సంవత్సరం మీరు చేసిన నిరసన చర్య గురించి నాకు చెప్పండి. మిమ్మల్ని బలవంతంగా తొలగించిన తర్వాత వచ్చిన ఉపసంహరణల తరంగం గురించి మీరు ఊహించారా?

ర.జా: నేను నమ్మిన దానిని చేసినందుకు ప్రజల ముందు కొరడా దెబ్బలు పడటం అది మొదటిసారి కాదు కాబట్టి అలాంటి ప్రతిస్పందనను నేను ఊహించలేదు. నా పక్కన నిలబడి ప్రతిఘటించడానికి ప్రజలు లేవడం నేను గతంలో చూడలేదు.

వాస్తవమేమిటంటే, తనని నమ్మి[దశాబ్దాలుగా ఉచితంగా]  చాలా మంది తనతో పనిచేస్తున్నప్పటికీ, వారి మాట వినడానికి పెన్‌ నిరాకరించింది. ఆపై అకస్మాత్తుగా, ఆ మారణహోమం పోర్టల్ చూసేటప్పటికి, ఆ ముసుగు తొలగిన తర్వాత “ఓహ్ ఆగండి, వారు తాము చెప్పుకున్నట్లు కాదు” అని తెలిసింది.  కళాకారులు, రచయితలు “నేను నిజంగా అవసరమైన దానికి సహకరించడం లేదు, కాబట్టి నేను ఉపసంహరించుకోవాలి” అని గ్రహించారు. చూడటానికి అది చాలా శక్తివంతంగా ఉంది.

కాషిఫ్ హాజీ: మీరు ఇటీవల ఎడిన్‌బర్గ్ అంతర్జాతీయ పుస్తక ఉత్సవం నుండి కూడా ఉపసంహరించుకున్నారు. మీరు పాల్గొనకపోతే, అక్కడ పాలస్తీనాకు చెందిన పురుషులు కానివారి గొంతు ఏదీ ఉండదు అని మీరు ఎప్పుడైనా ఆందోళన చెందారా?”

ర.జా:  “నేను అక్కడ లేకపోతే, ఆ గొంతు వినిపించదు” అనే వాదంతో నేను పూర్తిగా ఏకీభవించను, ఎందుకంటే అది వారి ఇష్టం. నన్ను, నేను చేసిన పనిని నిజంగా గౌరవించే ఒక స్థలాన్ని సృష్టించే బాధ్యత ఆహ్వానించే వారిపైనే ఉంటుంది. వారు అలా చేయలేదు, కాబట్టి వారు కోల్పోయారు. నేను ఎడిన్‌బర్గ్‌కు వెల్‌కమ్ టు ది ఫ్రింజ్, పాలస్తీనా అనే సంస్థతో వెళ్ళాను. ఆ సంస్థ సంవత్సరాలుగా పాలస్తీనియన్లతో కలిసి పనిచేసిన అద్భుతమైన స్వచ్ఛంద కార్యకర్తలు, నిర్మాతలతో కూడిన బృందం. వారు మమ్మల్ని గౌరవించాలనుకున్నారు. వారు మమ్మల్ని ఆహ్వానించారు. అస్సలు జియోనిస్టులనెవరినీ ఆహ్వానించలేదు.

ఉపసంహరించుకోవడం ద్వారా, మేము ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతాము. “ఉదాహరణకు, ఎడిన్‌బర్గ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ నిజంగా పాలస్తీనియన్ గొంతులను గౌరవించాలనుకుంటే, అక్కడ మారణహోమం జరుగుతోందని నిరాకరించే వారిని ఆహ్వానించకండి; ఎందుకంటే అలా చేయడం ద్వారా వారు “మేము మనుషులం కాద”ని చెబుతున్నారు. “మేము మనుషులం కాదని” మీరు అంగీకరిస్తున్నారు. అలా చెప్పే ఒక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఏమి ప్రయోజనం? కాబట్టి, మరోసారి, మన హంతకులను ఆహ్వానించకండి. దీని గురించి చర్చించడానికి ఏమీ లేదు. దానికి చెప్పడానికి ఏ సాకూ లేదు.

కె.హెచ్: రాజకీయాల్లో క్షేత్ర స్థాయిలో జరిగే వాటికి, సంభాషణలకు మధ్యవర్తిత్వం వహించడంలోను, సమ్మతిని కల్పించడంలోను సాంస్కృతిక సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తాయని మీరు భావిస్తున్నారు?

ర.జా: సాంస్కృతిక సంస్థలకు మారణహోమాన్ని అంగీకరించే లేదా తిరస్కరించే శక్తి ఉంది. ఇది తమకు లేదని వారు నటించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఉదాహరణకు, ది న్యూయార్క్ టైమ్స్ ఐఒఎఫ్[ఇజ్రాయెల్ అఫెన్సివ్/ఆక్యుపేషన్ ఫోర్సెస్] చెప్పిన అబద్ధాలను నిలకడగా పునరావృతం చేస్తూ వస్తోంది; అవి పాలస్తీనియన్లను అమానవీయం చేసి, వారిని నీచస్థాయి మానవులుగా కనిపించేలా చేస్తాయి. పాలస్తీనాలో ది న్యూయార్క్ టైమ్స్ కోసం పనిచేసే వ్యక్తులు అందరూ స్థిరపడినవారు లేదా స్థిరపడినవారి కుటుంబ సభ్యులు, మిలిటెంట్లు లేదా ఐఒఎఫ్‌లో ఉన్న వ్యక్తులే. కాబట్టి తటస్థత అనే ఆలోచన లేదా సాకు ఒక కల్పన; ఇది భయంకరమైన యుద్ధ నేరాలను, మరిన్నింటిని కప్పిపుచ్చడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది ఒక బాధ్యత; సంస్కృతికి ఉండే ప్రభావాన్ని మనం తక్కువ అంచనా వేయలేము.

కె.హెచ్: “మీరు శరీరాన్ని, హాస్యాన్ని రెండింటినీ మనుగడ కోసం, ప్రతిఘటన కోసం, లేదా దుఃఖాన్ని మింగేయకుండా పంచుకొనే వ్యూహాలుగా ఎలా భావిస్తారు?”

ర.జా: మానవ శరీరంలో జీవించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అని నేను అనుకుంటాను. బహుశా నేను ప్రపంచంలో ఉపరితల స్థాయిలో ఎలా జీవిస్తానో దాని వల్ల కావచ్చు: నాకు లేత చర్మం, లేత కళ్ళు ఉండడం వల్ల, నేను వారి అసహ్యకరమైన, జాత్యాహంకార ఆలోచనలను వ్యక్తం చేయడానికి సురక్షితమైన వ్యక్తిగా భావించే సముదాయాలలోకి, ప్రదేశాలకు వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. కాబట్టి, ఒక రకంగా నేను ఒక గూఢచారిలా అనిపిస్తుంది. అదే సమయంలో, నేను వారిలా అనిపించనని, నా రూపాన్ని బట్టి నేను అరబ్ లేదా పాలస్తీనా లేదా ముస్లింను కాదని నా సొంత ప్రజలే నాకు చెబుతారు.

ఇక నేను లావుగా ఉండడం వల్ల అస్సలు అలా అనిపించనని చెబుతారు. కుర్చీ చాలా చిన్నదిగా ఉంటుంది; లేదా నా ఊబకాయం వారికి అంటుకుంటుందేమో అన్నట్లుగా నేను విమానం ఎక్కుతున్నప్పుడు నా నుండి చాలా దూరంగా వెళ్తారు. ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్న వ్యక్తిలాగా, నేను అనుకున్నట్లుగా నా శరీరం లేదని నేను నిరంతరం ఆలోచిస్తూ, దాని గురించి బాధపడుతున్నాను. మీకు తెలిసినట్లుగా కేవలం శక్తివంతమైనది.

నాకు ఎప్పుడూ కూడా నిషేధానికి గురి అయిన విషయాలను చెప్పడానికి హాస్యం ఒక మార్గంగా ఉంది. ఇది పాలస్తీనియన్లు చేసే చాలా పాత విషయం. వాస్తవానికి, అంతరించిపోవడానికి లేదా అంతరించిపోవడానికి ప్రయత్నించిన అన్ని స్థానిక సమూహాలకు ఆ ఉరికంబపు హాస్యం ఉంటుంది. హాస్యం ద్వారా శక్తివంతమైన వారిని సంబోధించడం నేను ఎల్లప్పుడూ ఆధారపడిన ఒక ఉపాయం; ముఖ్యంగా ఖచ్ఛితంగా ఉండే తండ్రితో ఉన్న ఇంట్లో ఒక అమ్మాయిగా పెరిగినప్పుడు. స్వేచ్ఛను పొందడానికి ఒక మార్గం అతడిని నవ్వించడం; అతనికి కథలు చెప్పడం.

రాసేటప్పుడు హాస్యాన్ని, కథలను వాడడం నాకు స్వేచ్ఛనిచ్చింది; కానీ అదే సమయంలో బయటి వ్యక్తిగా ఒక వింత గందరగోళమైన స్థానాన్ని సృష్టించింది. అయితే నాకు అది ఇష్టం, ఎందుకంటే అప్పుడు నేను మధ్యలో, ఒక బుడగలో ఉండకుండా మొత్తం సంస్కృతిని అంచు నుండి చూడగలుగుతాను.

కె.హెచ్.: ‘ది లాస్ట్ పాలస్తీనియన్’ గురించి చెప్పండి. ఈ భావనకు మీ స్ఫూర్తి ఏమిటి? మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ప్రదర్శన రూపంలో ఎందుకు చేసారు?

ర.జా: 2023 అక్టోబరులో, ఇది ఒక మారణహోమం కాబోతోందని, లేదా తమని నిర్మూలించడానికి 76 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ప్రాజెక్టుకు కొనసాగింపు అని చాలామంది పాలస్తీనియన్లు చెప్పగలిగారు. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది: ఒకవేళ వారు పాలస్తీనియన్లందరినీ నిర్మూలించి ఒక్కరిని మాత్రమే వదిలేస్తే? ఎందుకంటే  ఒక్క పాలస్తీనియన్ ఉంటే వారు నియంత్రించడానికి భద్రత ఉంటుంది. పాలస్తీనా పురుషుల్ని ప్రమాదకరమైనవారిగా చూస్తారు కాబట్టి  ఆమె ఒక మహిళ అయి ఉండాలి. అందుకని నేను “ఒకే ఒక చివరి పాలస్తీనియన్ మిగిలి ఉంటే ఏమి జరుగుతుంది?” అని పదే పదే ఆలోచించాను. నేను దానిని నవలగా రాయడానికి ప్రయత్నించాను;, కానీ అది కుదరలేదు.

ఆ తర్వాత నా స్నేహితుడు విక్టర్ మెడికల్ సమ్మెకు దిగాడు. విక్టర్ ఒక అద్భుతమైన నాటక రచయిత. న్యూయార్క్ థియేటర్ వర్క్‌షాప్‌తో సంవత్సరాలుగా నాటక రచయితగా పనిచేసాడు. విక్టర్ వారితో కనీసం రెండు షోలు ప్రదర్శించాడు. కానీ విక్టర్ వారిని కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వమని అడిగినప్పుడు, వారు ఇవ్వలేదు. ఒకరోజు, పాలస్తీనాలోని ప్రజలు, హెచ్‌ఐవి ఉన్నవారితో సహా, తమ మందులు తీసుకోలేకపోతున్నారని విక్టర్ గ్రహించాడు. అందుకే హెచ్‌ఐవి పాజిటివ్ అయిన విక్టర్ తాను మందులు తీసుకోవడం ఆపేసాడు. విక్టర్ తన శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. విక్టర్ తన సొంత సమాధిని తవ్వుకుంటూ, దానిని సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేస్తూ, ఈ సాంస్కృతిక వ్యవస్థను సవాలు చేసాడు.

వారి ఈ చర్య నన్ను నిజంగా కదిలించింది. నేను థియేటర్, ప్రదర్శనపైన మరింత ఆసక్తి పెంచుకున్నాను. థియేటర్‌కు ఉన్న అసలు ప్రధాన ఉద్దేశ్యం చనిపోయిన వారిని పునరుద్ధరించడమేనని విక్టర్ నాకు బోధించాడు. స్థానిక సముదాయాలు వానని, సూర్యరశ్మిని, చనిపోయిన వారిని పునరుద్ధరించడానికి థియేటర్‌ను ఉపయోగించేవారు. ఆ శక్తి నాకు చాలా ఆకట్టుకునేదిగానూ గొప్పదిగానూ అనిపించింది. నేను మా అమరవీరులను పునరుద్ధరించాలని ఆలోచించాను. “సరే, మన అమరవీరులు వదిలిపెట్టిన ఈ అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. నేను వాటిని నాటకీకరించనా?” అని అనుకున్నాను.

కె.హెచ్: మీరు ది లాస్ట్ పాలస్తీనియన్లో ఆరుగురు పాత్రలను ఎలా ఎంచుకున్నారు?

ర.జా: నేను ప్రధానంగా ప్రాచీన పాత్రలపైన దృష్టి పెట్టాలనుకున్నాను. అందుకే నేను ఆరు పాత్రలను ఎంచుకున్నాను: అషీరా, మారణహోమం నుండి బయటపడిన యువతి. ప్రపంచంలో మిగిలిన, ప్రాణాలతో ఉన్న ఏకైక వ్యక్తి. ఆ భాగం వరకు చేరుకోవడం నిజంగా శక్తివంతమైనది. చివరి పాలస్తీనియన్; నిజానికి చివరి ప్రాణాలతో ఉన్న వ్యక్తి అవుతుందని అర్థం చేసుకోవడం అంటే పాలస్తీనియన్లందరూ చనిపోయినప్పుడు, ప్రతి ఒక్కరూ వాస్తవానికి చనిపోయినట్లే.

రెండవ పాత్ర, ఫ్రాన్సిస్కా అల్బనీస్ ఒక ఇటాలియన్ మహిళ. పాలస్తీనియన్లతో వంశపారంపర్యం, మతం లేదా సరిహద్దులు పంచుకోని ఒక వ్యక్తి వారి కోసం అంత కష్టపడి పోరాడటాన్ని చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె కూడా చాలా హాస్యభరితమైనది. నాకు ఇటాలియన్ యాసను అనుకరించడం చాలా ఇష్టం. బ్జోర్క్ – ఎందుకంటే బ్జోర్క్ అద్భుతమైనది. దేవత అనాట్ – ఎందుకంటే ఆమె గిజా పిరమిడ్‌ల కంటే పురాతనమైనది; గాజా 5000-6000 సంవత్సరాల పురాతనమైనదని చాలామందికి తెలియదు. ఫలస్తిన్ – ఒక మౌఖిక కథకురాలు, డోరిట్, ఒక జియోనిస్ట్ వ్యతిరేక యూదు, యుద్ధ నేరాల మ్యూజియంలో ఆర్కైవిస్ట్.

ఈ పాత్రల ద్వారా, ప్రపంచం అంతమయ్యే ముందు అది ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానో ప్రాథమికంగా నేను ఒక కల్పనను సృష్టించగలిగాను. గతం, వర్తమానం, భవిష్యత్తును కలిగి ఉన్న ఒక షోను సృష్టించాలనుకున్నాను. నేను ఒక క్వీర్‌ను కాబట్టి, సమయం సరళంగా ఉండదని, వృత్తాకారంగా ఉంటుందని ఆలోచించడం నాకు చాలా ఇష్టం.

ఈ షో కోసం రాయడం, సృష్టించడం, వేదికపై ఎలా ప్రదర్శించాలో నేర్చుకోవడం నా జీవితాన్ని కాపాడింది. ఎందుకంటే నేను కూడా అందరిలాగే  చాలా కుంగిపోయి ఉన్నాను.  నాకు ఒక వాహకం అవసరమైంది. నా దుఃఖాన్ని పంచుకోవడానికి నాకు ఏదో ఒకటి కావాలి. కానీ ఆ వాహకానికి కొంత శక్తి ఉండాలని, ఆ శక్తి ఇతరులను ప్రేరేపించాలని; బహుశా చర్య తీసుకోవాలని అడగాలని నేను కోరుకున్నాను; “హే, దీన్ని చూస్తున్నాం కాబట్టి మనమంతా చనిపోయామా? లేదా దీనిని ఆపడానికి ఏమైనా చేయడానికి అవసరమైన జీవం మనలో ఉన్నదా?” అని అడగాలనుకున్నాను.

కె.హెచ్: ది లాస్ట్ పాలస్తీనియన్ అనే శీర్షిక చాలా రెచ్చగొట్టేదిగా ఉంది. మారణహోమానికి ఒక భయంకరమైన ముగింపును ఊహించినట్లుగా నిరాశావాద భావనను కలిగి ఉంది. అది ఎలా కనిపిస్తుందో అని మీరు ఆందోళన చెందలేదా?

ర.జా: ప్రజలు ఈ శీర్షికకు తమ సొంత ఆలోచనలను, భావాలను ఆపాదిస్తారని నేను అనుకున్నాను. కాబట్టి ఈ శీర్షికను చూసిన వారి మనసు నిరాశావాదం వైపు వెళ్లవచ్చు; కానీ వాస్తవానికి, ఈ ప్రదర్శన దానికి పూర్తిగా వ్యతిరేకం. ఈ ప్రదర్శనలో, ప్రపంచంలో ప్రాణాలతో ఉన్న, భూమిపై ఉన్న ఏకైక వ్యక్తి పాలస్తీనీయనే అని ఊహిస్తుంది. నా రచన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేదిగా ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారో అని ఆందోళన పడాల్సిన సమయం దాటిపోయింది. ప్రజలు ఈ నాటకాన్ని చదివి లేదా ఈ షోను చూసి నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన పాలస్తీనియన్ల, ప్రతిచోటా ఉన్న స్థానిక ప్రజల హక్కును, ప్రపంచానికి ఒక హెచ్చరికగా ఇది జీవితాన్ని, మన ఉనికి హక్కును ధృవీకరిస్తుంది,: ఇది ఎప్పుడు ఆగుతుంది? మనలో ఒక్కరు మిగిలినప్పుడు మాత్రమే మీరు ఆగుతారా?అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి?

కె.హెచ్: ఈ షోను ప్రదర్శించిన మీ అనుభవం ఎలా ఉంది? మీకు ఎలాంటి స్పందనలు వచ్చాయి?

ర.జా: నేను దీన్ని రెండుసార్లు మాత్రమే ప్రదర్శించాను. ఇది చాలా కొత్త షో, కాబట్టి నేను ఒకసారి ఎడిన్‌బర్గ్‌ లో ప్రదర్శించాను, హాలు పూర్తిగా నిండిపోయింది; అక్కడ ఉన్న వారందరూ పాలస్తీనాకు మద్దతుదారులు. కాబట్టి ఇది మద్దతుదారుల చాలా సారూప్యమైన ప్రేక్షకులు. పాలస్తీనా హౌస్ ఆ మొదటి అనుభవం నుండి పూర్తిగా భిన్నంగా ఉంది; ఎందుకంటే ఇది చాలా సన్నిహితంగా, చిన్నదిగా, అస్సలు టెక్నాలజీ లేకుండా ఉంది.

ఈ షోను ప్రదర్శించడం నిజంగా సరదాగా ఉంటుంది. ఇది భావోద్వేగాలను బయటపెట్టేది కూడా. ఒక రకంగా, దేవత అనాట్ మమ్మల్ని చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మీకు తెలుసా, ఆమె విగ్రహం 2022లో గాజాలో ఒక రైతుకి కనబడింది. ఆ విగ్రహాన్ని ఒక మ్యూజియంలో ఉంచారు; ఆ మ్యూజియంపైన బాంబు దాడి జరిగింది. కాబట్టి ఆమె, ఇతర పూర్వీకులను, ఇతర పాలస్తీనా మహిళలను – ఆ సమయంలో పాలస్తీనియన్ అని పిలిచారా లేదా – ఈ క్షణంలో మాతో ఉన్నారా అని నేను ఆశ్చర్యపోతాను. ప్రదర్శన చేయడం వల్ల మనందరికీ కనెక్ట్ అవ్వడానికి, ప్రతిఘటించడానికి మార్గాలను కనుగొనడానికి ఒక పోర్టల్ లేదా వంతెనలా అనిపిస్తుంది.

నేను ఈ షోను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాను. కానీ ఇది చాలా కొత్త షో, నేను ఈ వేసవిలోనే రాసాను. థియేటర్ డైరెక్టర్లు, డిలో, విక్టర్ లాంటి వ్యక్తులతో కలిసి పనిచేసే అద్భుతమైన గౌరవం నాకు లభించింది. వీరంతా ఈ ప్రదర్శన ఎలా చేయాలో నాకు సహాయం చేసారు. ఇది నా మొదటి వేదికమీద చేసిన ప్రదర్శన. నేను నన్ను సవాలు చేసుకోవాలనే కోరికతో దీన్ని చేయాలనుకున్నాను; విమోచన పని చాలా భయంకరంగా ఉంటుంది ఒక కళాకారుడిగా, అసౌకర్యంగా ఉండటం, మనం చేయటానికి భయపడే పనులను చేయడం ముఖ్యం. కాబట్టి ఎందుకు ప్రాక్టీసు చేయకూడదు?

కె.హెచ్: మీరు రామీ యూసెఫ్ షో, “1 హ్యాపీ ఫ్యామిలీ యుఎస్‌ఎ (2025)”లో కూడా అమ్మమ్మ పాత్రకు గాత్రదానం చేశారు. అది ఎలా ఉండింది?

ర.జా:. అమ్మమ్మ పాత్ర చేయడం వల్ల  చాలా భిన్నంగా ఉండగలిగాను కాబట్టి నాకు చాలా సరదాగా ఉంది. నేను కేవలం నా గొంతుతో మాత్రమే కనిపించగలిగాను. నేను పామ్ బ్రాడీతో కలిసి పనిచేశాను. ఆమె ఒక అద్భుతమైన సృష్టికర్త, సౌత్ పార్క్ (1997-ప్రస్తుతం) సృష్టించడంలో సహాయపడింది. తాను ఏమి చేస్తుందో ఆమెకు తెలుసు. నేను మోనా చలాబీతో కలిసి పనిచేశాను. ఆమె ఒక అద్భుతమైన కళాకారిణి, ఆలోచనాపరురాలు. వాస్తవానికి నా దృష్టిలో, పాలస్తీనా కోసం నిలకడగా మాట్లాడటానికి చాలా పెద్ద వేదికలను నిరంతరం ఉపయోగించగలిగే అధికార స్థానంలో ఉన్న చాలా కొద్దిమందిలో రామీ ఒకరు.

ఈజిప్టుకు చెందిన, స్త్రీవాద, నిఖాబీ తల్లి పాత్రను పోషించడం అద్భుతంగా ఉంది. ఆమె శరీర రూపం కూడా విచిత్రంగా ఉంటుంది; హాస్యంతో నిండి ఉంటుంది. ఆమె చాలా హాస్యభరితమైనది చూసిన ఈ పాత ఐకానిక్ ఈజిప్షియన్ మహిళలను ప్రతిబింబించగలిగాను. నేను ప్రాధమికంగా ఈ పాత ఐకానిక్ ఈజిప్షియన్ మహిళలను నేను పెరిగినట్లు రూపొందించాను. ఆమె కుటుంబంలో ఉన్న ఏకైక స్వలింగ సంపర్కుడిని నిజంగా గౌరవించి, ప్రేమించే ఏకైక పాత్ర కూడా. ఆమె తన కాలానికి మించి ఆలోచిస్తుంది. నేను ఆమెను ప్రేమిస్తాను. ఆమెగా ప్రదర్శన చేయడం కూడా నాకు ఒక విభిన్న పాత్రగా ఉండే అనుభవాన్ని, అభ్యాసాన్ని ఇచ్చింది.

కె.హెచ్: పాలస్తీనియన్లకు అందించే షరతులతో కూడిన సంఘీభావం గురించి మీరేమనుకుంటారు?

ర.జా: షరతులతో కూడిన సంఘీభావం ఇచ్చే ఆ వ్యక్తులను నాశనం కానివ్వండి. ఇది వారి మద్దతు ఎంత భేషజంతో కూడినదో, నకిలీదో చూపిస్తుంది. అలాంటివారిని తక్షణమే బయటపెట్టేలా, వారు ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనే వాస్తవాన్ని చూపేలా చేయడం వల్ల నేను పాలస్తీనియన్ అయినందుకు నిజంగా కృతజ్ఞురాలిని.

మనం, ముఖ్యంగా ఈ క్షణంలో మారణహోమం ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు, సరిగ్గా మద్దతు ఇవ్వడానికి, సహాయం చేయడానికి చాలా చేయాల్సి ఉన్నది. మనం అసౌకర్యంగా మారాలి. వారు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వారు తమ ప్రాణాలను కోల్పోకముందే, వారు తమ ఇళ్లను పదేపదే కోల్పోతున్నారు. వారు తమ అవయవాలను, తమ పిల్లలను, వివిధ కుటుంబ సభ్యులను, ప్రతిదీ కోల్పోతున్నారు. కాబట్టి, మనందరినీ, మనకు నిజంగా ఏది ముఖ్యమో తిరిగి మూల్యాంకనం చేసుకోవడానికి మనల్ని మనం నెట్టుకోవాలి: మీరు కావాలనుకుంటున్నది మీకు నిజంగా అవసరమా? అని ఆలోచించాలి.

కె.హెచ్: మీకు నిజమైన సంఘీభావం ఎలా కనిపిస్తుంది, ముఖ్యంగా ప్రవాసంలో?

ర.జా: నిజమైన సంఘీభావం అనేక విషయాలుగా ఉండవచ్చు. సరళమైన మార్గం బిడిఎస్ [బహిష్కరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆంక్షలు]ను చూడటం; పాలస్తీనా పౌర సమాజం మనల్ని అడిగిన ప్రతిఘటనను, బహిష్కరణను అధికం చేయడం. అక్కడ ఉన్న కుటుంబాలకు అవసరమైన డబ్బు, వైద్య సహాయం పొందడానికి నిధులు సేకరించడం. మన ఖర్చులను మళ్లించడం; మరింత ముఖ్యంగా, చాలా కాలం వరకు మనకు అవసరమైనది యూనియన్ల ద్వారా ఒక తీవ్రమైన సాధారణ సమ్మెను నిర్వహించడం.

అసాధ్యమైన లేదా ఒక కల్పన అని ఆలోచించకుండా, ప్రపంచం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలా ఊహించుకోండి. అమెరికా ఒక కల్పనగా మొదలైంది; “ఇజ్రా-హెల్” (నరకం) కూడా అంతే. ఇది ఒక నవలగా మొదలైంది. కాబట్టి మనం ఒక భిన్నమైన ప్రపంచాన్ని ఎలా ఊహించుకోగలం? వికారమైన ఆలోచనల నుండి దూరంగా పారిపోవద్దు; బదులుగా ధైర్యాన్ని, వికారమైన వాటిని స్వీకరించండి. ఎప్పుడూ నిరాశకు లోనవకండి, ఎందుకంటే మనం ఓడిపోయేది అలాంటప్పుడే.

మనం ఒక అవకాశం ఉందని ఆలోచించాలి – నిజంగానే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు, ప్రజలు ఇజ్రాయెల్ గురించి ఆలోచించినప్పుడు, “ఓహ్, స్కిండ్లర్స్ లిస్ట్ (1993) ముగింపులో అందరూ ఇంటికి వెళ్ళినట్లు” అని ఆలోచించరు. వారు చనిపోయిన, నిస్సహాయ ప్రజలు, పిల్లలు, శిశువుల గురించి ఆలోచిస్తారు.

ఇది మనం నిరాశలో మునిగిపోవడానికి వీలులేని క్షణం. మనం చనిపోయిన వారిని గౌరవించాలి. మనం పోరాడాలి. అలా చేయడానికి చాలా విభిన్న మార్గాలు ఉన్నాయి; ప్రజలు ఎంత పోరాడాలనుకుంటున్నారో అంతకు తగిన వివిధ స్థాయిల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీ సౌకర్య స్థాయిని, మీ ప్రజలను తెలుసుకొని ప్రతిరోజూ ఏదో ఒకటి చేయండి.

కె.హెచ్: పాలస్తీనియన్లు, వారి మద్దతుదారులు రూపొందించిన ఒక సాహిత్య లేదా కళా ప్రపంచాన్ని మీరు ఊహించగలిగితే, అది ఎలా ఉంటుంది? ఏ నిర్మాణాలు, విలువలు, ఆచరణలను పునాది నుండి తిరిగి నిర్మించాలి?

ర.జా:. శిశువుల పుట్టుక, సంరక్షణా విధానాలు మొదలుకొని, మాతృత్వాన్ని  గౌరవించే, గుర్తించే విధానాల వరకు ప్రతిదీ. అందరినీ సవాలు చేసే, గౌరవించే విద్యా వ్యవస్థలు. మనం పెట్టుబడిదారీ వ్యవస్థకు వెలుపల ఉండి ఒకరికొకరు ఆధారపడగలిగే సమయం కోసం నేను కలలు కంటాను. మేము ఎల్లప్పుడూ రైతులమే. మేము ఎల్లప్పుడూ భూమికి చెందినవారమే. భూమి మనకు చెందినది కాదు. మనం దానికి చెందినవారం. కాబట్టి, ఒక పీడకలగా ఉన్న, నిలబడలేని ఈ హాస్యాస్పద వ్యక్తిగత సమాజానికి బదులుగా భూమికి, మన పాత వ్యవసాయ పద్ధతులకు, సేకరణకు, ఒకరినొకరం సంరక్షించుకోగల  సముదాయాలలో నివసించడానికి తిరిగి వెళ్ళాలి.

కళాకారులుగా మనకంటూ ప్రత్యేకంగా థియేటర్లు, వర్క్‌ షాప్‌లు, క్లౌన్ స్కూళ్లు, కామెడీ క్లబ్‌లు ఇలా అన్నీ మనవిగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన కళకు గుర్తింపు, విలువ, విశ్వసనీయత రావడానికి ప్రపంచ ఉత్తర ప్రాంతం లేదా పాశ్చాత్య దేశాల ఆమోదం, దృష్టి అవసరం లేదు. ఒకవేళ అది అవసరమని మనం భావిస్తే, దానికి కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. మనల్ని మనం అంతర్గతంగా వలసవాద ఆలోచనల నుండి విముక్తి చేసుకోవాలి అలాగే మన ప్రేక్షకులను మనం ప్రేమగా స్వీకరించాలి.

1. రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, కార్యకర్తలను ఒకచోట చేర్చి చర్చలలో పాల్గొనేలా చేసే కార్యక్రమం ‘పెన్ అవుట్ లౌడ్’. ఈ సిరీస్ సృజనాత్మక వ్యక్తీకరణను, ప్రతి ఒక్కరికీ వ్రాయడానికి స్వేచ్ఛను అన్వేషించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సంవత్సరానికొకసారి సంవావేశాన్ని నిర్వహిస్తుంది. పిఇఎన్ అంటే పోయట్స్, ప్లే రైటర్స్, ఎడిటర్స్, ఎస్సెయిస్ట్స్, నావెలిస్ట్స్ – కవులు, నాటక రచయితలు, సంపాదకులు, వ్యాసరచయితలు, నవలా రచయితలు.

2. రేక్జావిక్‌లో పుట్టి పెరిగిన బ్జోర్క్ తన సంగీత వృత్తిని 11 సంవత్సరాల వయస్సులో ప్రారంభించింది; ప్రత్యామ్నాయ రాక్ బ్యాండ్ ప్రధాన గాయనిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

3. అనాత్ – దేవత పురాతన కనానైట్ పురాణాలలో ఒక ప్రముఖ వ్యక్తి, ప్రేమ, సంతానోత్పత్తి, వేటతో కూడా సంబంధం కలిగి ఉన్న శక్తివంతమైన యోధ దేవతగా ప్రసిద్ధి చెందింది.. ఉగారిటిక్ బాల్ సైకిల్ గ్రంథాలలో ఆమె ఒక ప్రధాన పాత్ర, అక్కడ ఆమె యమరాజు (మరణ దేవుడు) మోట్‌తో పోరాడింది; ఆమె హింసాత్మక, క్రూరమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది. పురాతన ఈజిప్టులో, ముఖ్యంగా హైక్సోస్ కాలంలోనూ రామెసైడ్ యుగంలోనూ  ఆమెను రామెసెస్ II సహా ఫారోలు యుద్ధంలో పోషకురాలిగా, రక్షకురాలిగా స్వీకరించినప్పుడు, అనాట్ కూడా ఒక ముఖ్యమైన దేవతగా మారింది.

4. 1987 డిసెంబర్ 9న జబాలియా శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ ట్రక్ డ్రైవర్ ఆగి ఉన్న పౌర వాహనాలను ఢీకొట్టినప్పుడు నలుగురు పాలస్తీనియన్ కార్మికులు మరణించడంతో ఇంటిఫాడా ప్రారంభమైంది , వీరిలో ముగ్గురు శరణార్థి శిబిరానికి చెందినవారు. మొదటి ఇంటిఫాడా సమయంలో, హమాస్ తన భావజాలాన్ని వివరించే కరపత్రాలను క్రమం తప్పకుండా ప్రచురించింది; సమ్మెలు, ప్రదర్శనలు చేయడంతో పాటు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌పైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.

2025 సెప్టెంబర్ 11

కాషిఫ్ హాజీ ‘ది పోలిస్ ప్రాజెక్ట్’ లో అసిస్టెంట్ కల్చర్ ఎడిటర్

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply