భీమా-కోరేగావ్ కేసులో నిందితులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్ (బెయిలు మీద విడుదల ఆయారు), గాయని, కార్యకర్త జ్యోతి జగతప్‌లు  జైలులో సమస్యల గురించి చర్చించారు.  జైళ్ళలో ఉండే రద్దీ, సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, పేద జీవన పరిస్థితులు, విద్య అందుబాటులో లేకపోవడం, వ్యవస్థాగత అసమానతలు, భారతదేశంలోని జైలు వ్యవస్థలో అట్టడుగున ఉన్న మహిళలు, ఎల్‌జిబిటి+క్యూ వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి వివరించారు. వారిద్దరూ స్త్రీల మధ్య సహోదరీత్వం, తట్టుకోగల సమర్థతల  ప్రాముఖ్యత గురించి మాట్లాడారు; మార్పు వస్తుందనే ఆశను వ్యక్తం చేసారు.

 భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలోని జైళ్లలో నా క్షేత్ర అధ్యయనంలో భాగంగా, జైలులోకి ఎందుకు వచ్చారు, వారి ఆందోళనలు, బలహీనతలు, జైలులో వారి అనుభవాలు, విడుదల తర్వాత వారు కలలు కనే జీవితం గురించి తెలుసుకోవడానికి ముంబైలోని బైకుల్లా మహిళల జైలుకి వెళ్ళాను.

గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సర్కిల్ 1 పెద్ద జైలు సముదాయంలో ఒక చిన్న జైలులా పనిచేస్తుంది. బ్యారక్‌లు తెరిచి ఉండే ఎనిమిది గంటల సమయంలో అందరూ తమ రోజువారీ పనుల హడావిడిలో ఉన్నప్పుడు, బ్యారక్‌లో ఓ పక్కన మౌనంగా చదరంగం ఆటలో మునిగి ఉన్న ఒక మహిళ నా దృష్టిని ఆకర్షించింది.

ఇలా షోమా సేన్‌( 66సం) తో నా అనుకోని భేటీ జరిగింది. ఆమె ఇంగ్లీష్ సాహిత్యం, మహిళల అధ్యయనాలు, పోస్ట్-కలోనియలిజంలో విద్యావేత్త,  ప్రొఫెసర్. ఎల్గార్ పరిషద్ లేదా భీమా-కోరేగావ్ కేసుగా ఇప్పుడు పిలుస్తున్న కేసులో దాదాపు ఆరు సంవత్సరాలు నుంచి ఆమె జైలులో ఉన్నారు.

సేన్ కేసును నేను కొంతకాలం గమనించినప్పటికీ, జైలులో ఉండే కఠినమైన వాతావరణంలో ఆమెను గుర్తు పట్టలేకపోయాను. ఒక సాధారణ లేత గోధుమ, ఆకుపచ్చ సల్వార్, కుర్తా ధరించి, ప్రశాంతంగా, సున్నితంగా ఉన్న ఆమె నాతో చాలాసేపు మాట్లాడింది. ఆ తరువాత, ఆమె తనతో పాటు నిందితురాలైన, అదే భవనం మొదటి అంతస్తు బ్యారక్‌లో ఉన్న గాయని అయిన 37 ఏళ్ల జ్యోతి జగతప్‌ను కలవమని చెప్పింది;.

నేను మొదట సేన్‌ను, ఆ తర్వాత బూడిద రంగు చొక్కా, నల్ల ప్యాంటు వేసుకుని ఉన్న జగతప్‌ను కలిసినప్పుడు వారిద్దరూ చాలా స్పష్టతతో మాట్లాడుతున్నారు; తాము ఉన్న అలజడి వాతావరణం మధ్యన కూడా వారి ప్రశాంతత నన్ను ఆశ్చర్యపరిచింది. వారు జైలులో తమ అనుభవాలు, జైలు వ్యవస్థలో ఉన్న అన్యాయాల గురించి ఉన్నదిఉన్నట్లుగా, అన్ని విషయాలూ  మాట్లాడారు.

సేన్ నాగ్‌పూర్‌లోని రాష్ట్రసంత్ తుకడోజీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సాహిత్యం విభాగంలో మాజీ ప్రొఫెసర్. విభాగ అధిపతి కూడా. అరెస్ట్ కారణంగా, ఆమె పదవీ విరమణ చేయడానికి కొన్ని రోజుల ముందు, 2018 జూలైలో విశ్వవిద్యాలయం నుండి ఆమెను సస్పెండ్ చేశారు. విద్యార్థి దశ నుండి సామాజిక కార్యకర్త అయిన సేన్, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

జ్యోతి జగతప్ కబీర్ కళా మంచ్ సభ్యురాలు. 2002లో గుజరాత్‌లో జరిగిన మత ఘర్షణల తరువాత పుణె, మహారాష్ట్రలో ఈ సాంస్కృతిక సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ కవిత్వం, నాటకం, సంగీతం వంటి కళా రూపాలలో స్త్రీవాదం, కుల వ్యతిరేక, ప్రజాస్వామిక అనుకూల సందేశాలను వ్యాప్తి చేస్తుంది. జగతప్ మనస్తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది.

 ‘ఆర్టికల్ 14’ వెబ్‌సైట్ 2022 మార్చి లో జరిపిన ఒక దర్యాప్తు ప్రకారం, బలమైన జాతీయ ప్రయోజనాల కథనాలను అల్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భద్రతా చట్టాలు, నిఘా సాంకేతికతలను ఉపయోగించి అమలుచేసిన భద్రతా వ్యూహంలో భాగంగా వారి అరెస్టులు అయ్యాయి. వారి అరెస్టులు భారతదేశంలో చట్ట పాలనను దెబ్బతీశాయని చాలామంది వాదించారు. తరచుగా ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టపరమైన లొసుగులు, అస్పష్టమైన  పదాలను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది.

భీమా-కోరేగావ్ ‘కుట్ర కేసు’

2017 డిసెంబర్ 31నాడు జరిగిన ఎల్గార్ పరిషద్ కార్యక్రమంతో సంబంధం ఉన్న వ్యక్తులపైన పుణెలో 2018 జనవరి లో ఒక కేసు దాఖలు అయింది; అక్కడ సేన్, జగతప్ (కబీర్ కళా మంచ్ సభ్యురాలిగా) కూడా హాజరయ్యారు అనే ఆరోపణతో అరెస్టు చేసారు.

ఈ కార్యక్రమాన్ని 1818లో జరిగిన భీమా కోరేగావ్ యుద్ధ జ్ఞాపకార్థం జరిపారు. ఈ యుద్ధంలో దళిత మహర్ వర్గానికి చెందిన సైనికులు, బ్రిటిష్ సైన్యం తరపున పోరాడుతూ, మరాఠా సామ్రాజ్యంలోని బ్రాహ్మణ పీష్వా పాలకులను ఓడించారు. ఈ విజయం, అంటరానితనం, దళితులపై వివక్షాపూరిత ఆచారాలను అమలు చేసినందుకు ప్రసిద్ధి చెందిన పీష్వాల ఓటమికి చిహ్నంగా నిలిచింది.

భీమా కోరేగావ్‌లో కుల హింసను ప్రేరేపించడంలో వారి పాత్ర ఉన్నదని, మానవ హక్కుల సమర్థకులైన 16 మంది కార్యకర్తలు, న్యాయవాదులు విద్యావంతులు, కళాకారులు, 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కాలక్రమేణా అరెస్టు చేశారు.

 వీరిలో దళిత న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఖైదీల హక్కుల కార్యకర్త రోనా విల్సన్, రిపబ్లికన్ పాంథర్స్ వ్యవస్థాపకుడు సుధీర్ ధవాలే, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేష్ రౌత్, కార్మికరంగ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, క్రిమినల్ న్యాయవాది అరుణ్ ఫెరీరా, జర్నలిస్ట్ గౌతమ్ నవ్లఖా, కార్మికరంగ కార్యకర్త, విద్యావేత్త వెర్నాన్ గోన్సాల్వేస్, కవి, ఉపాధ్యాయుడు వరవర రావు, జెసూట్ ఫాదర్, ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హనీ బాబు, విద్యావేత్త, రచయిత ఆనంద్ తెల్తుంబ్డే, కబీర్ కళా మంచ్ సాంస్కృతిక బృందం సభ్యులు సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్, శోమా సేన్, జ్యోతి జగతప్‌లు ఉన్నారు.

భీమా-కోరేగావ్ హింసను ప్రేరేపించడానికి కుట్ర చేసారనే ఆరోపణతో పుణె పోలీసులు 2018 జూన్‌లో సేన్‌ను అరెస్టు చేశారు. 1860 భారతీయ శిక్షా స్మృతి ఐపిసి, ఉపాల కింద ఆమెపై దాదాపు పన్నెండు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ అభియోగాలు వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మొదలుకొని ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణల వరకు ఉన్నాయి.

జగతప్ 2020 సెప్టెంబర్‌లో అరెస్టు అఅయింది; ఐపిసి, యుఎపిఎల కింద దాదాపు 15 సెక్షన్ల కింద ఆమెపై అభియోగాలు మోపారు. ఈ అభియోగాలు ప్రజలలో అల్లర్లను ప్రేరేపించే ప్రకటనలు చేయడం నుండి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం (లేదా చేయడానికి ప్రయత్నించడం లేదా ప్రేరేపించడం) వరకు ఉన్నాయి.

దాదాపు గత ఏడు సంవత్సరాలలో, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో మొదట మోడీని హత్య చేయడానికి కుట్ర, తరువాత మావోయిస్టు కుట్ర, ఆ తరువాత కుల-ఆధారిత అల్లర్లను ప్రేరేపించడం వంటి మార్పులతో వివిధ ఆరోపణలు చేసాయి.

అనారోగ్యాలకు ఉపశమనం లేదు:

2024 అక్టోబర్ 14నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు జైలు లోపల ఆరోగ్య సంక్షోభంపై కొత్త దృష్టిని ఆకర్షించింది; చట్టాల ప్రకారం బెయిల్ కోసం విడుదల కావడానికి కష్టతరమైన వ్యక్తులను కూడా అనుమతించింది.

ఖైదీలకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి ఆ మహిళలు ఇద్దరితో చేసిన ఇంటర్వ్యూలలో బయటపడిన వివరాలు, అప్పటికే ఉన్న అనారోగ్యాన్ని జైలు వాతావరణం ఎలా మరింత తీవ్రతరం చేస్తుందో తెలియచేసాయి.  ఈ అంశాన్ని ఇటీవల 2024 అక్టోబర్ 2నాడు వికలాంగుడు, పూర్వ ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా మరణం సమర్థించింది. తర్వాత నిర్దోషిగా తేలినప్పటికీ, పదేళ్లపాటు జైలులో ఉన్న కాలం తన గుండెను, శరీరాన్ని బలహీనపరిచిందని సాయిబాబా చెప్పారు.

బికె-16లో ఉన్న మరొక సభ్యుడు, ఫాదర్ స్టాన్ స్వామికి అరెస్టు అయినప్పుడు 84 సంవత్సరాలు; పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించి, జైలులోనే మరణించారు.

షోమాసేన్ కీళ్ళనొప్పి, అధిక రక్తపోటు, గ్లకోమాతో బాధపడుతున్నారు. ఆమెకు కీళ్లనొప్పులు ఉన్నప్పటికీ, బైకుల్లా మహిళల జైలులో నేలపైనే నిద్రపోవాల్సి వచ్చింది. ఆమె గతంలో ఉన్న యెరవాడ మహిళల జైలులో, ఒక న్యాయ పోరాటం తర్వాత పగటిపూట ఉపయోగించడానికి ఒక ప్లాస్టిక్ కుర్చీని ఇచ్చారు;  కానీ బైకుల్లాలో ఆమెకు ఆ సౌకర్యాన్ని కూడా నిరాకరించారు.

“సరైన ఆసుపత్రి సౌకర్యం లేకపోవడం అంటే, అంటువ్యాధులను కూడా సరైన సంరక్షణ లేకుండా వ్యక్తులను వేరు వేరు గదులలో ఉంచి పరిష్కరించేవారు” అని సేన్ చెప్పారు.

నీరు, పరిశుభ్రంగా ఉండడానికి అవసరమైనవి పరిమితంగా ఉండడం వల్ల మరింతగా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది.

ఆరు సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత, 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బైకుల్లా జైలు నుండి సేన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె వయస్సు, వైద్య పరిస్థితి, అభియోగాలు నమోదు చేయడంలో జాప్యం, నిర్బంధ కాలం “ఆమెపై ఉన్న ఆరోపణల స్వభావానికీ ఈ దశలో ఈ కోర్టు ముందు అందుబాటులో ఉన్న మెటీరియల్స్‌” వంటి కారణాలను సుప్రీంకోర్టు పేర్కొంది.

జగతప్, ఇతర BK-16 సభ్యుల మాదిరిగానే, ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.

2024 ఆగస్టు 22నాడు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆమె మధ్యంతర బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది; బదులుగా ఆమె బెయిల్ పిటిషన్‌ను ఆమె సహ-నిందితుడి పిటిషన్‌తో కలిపింది.

ఎరవాడ నుంచి బైకుల్లా:

ప్రొఫెసర్ షోమా సేన్‌ను మొదట పుణెలోని యెరవాడ మహిళల జైలులో పెట్టారు. 2020 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడు, ఆమె విడుదల అవుతానని ఆశించారు.

కానీ వెంటనే, కేంద్ర ప్రభుత్వం ఈ కేసును పుణె పోలీసుల నుండి తీసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కు అప్పగించడంతో సేన్‌ను బైకుల్లా మహిళల జైలుకు మార్చారు.

జైలు జీవిత షాక్‌ను మొదట ఎలా తట్టుకున్నారు? బైకుల్లాకు మార్పు ఎలా ఉంది అని నేను సేన్‌ను అడిగినప్పుడు, “యెరవాడలోని ఫాన్సీ యార్డ్ (మరణశిక్ష ఖైదీల ప్రాంతం)లోకి వచ్చాక  నాకు కలిగిన మొదటి అభిప్రాయం ఏమిటంటే, సెల్‌ఫోన్ లేకుండా జీవితం ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటుందో అని. యెరవాడ జైలులో చాలా చెట్లు ఉన్నాయి; అక్కడ ఖైదు చేయటం నాకు ప్రకృతితో కలిసి ఉండే ఒక అవకాశాన్నిచ్చింది.”

బైకుల్లాకు మారడం సేన్‌కు ఒక మిశ్రమ అనుభవాన్ని కలిగించింది.

 “యెరవాడ నుండి బైకుల్లాకు మారడం కొన్ని విధాలుగా మంచిదే అనిపించింది; ఎందుకంటే నేను చివరకు ఇతర మహిళలతో కలిసి ఒక బ్యారక్‌లో ఉన్నాను. యెరవాడలోని ఫాసీ యార్డ్‌‌లో నేను అనుభవించిన ఏకాంతానికి పూర్తి విరుద్ధంగా, ఇక్కడి బ్యారక్‌లు చాలా రద్దీగా ఉన్నప్పటికీ, ఇతర మహిళలతో కలిసి ఉండటం నాకు సంతోషాన్ని ఇచ్చింది.”

బైకుల్లా మహిళల జైలులో, ప్రతి బ్యారక్‌లో దాని ఉద్దేశించిన సామర్థ్యం కంటే రెట్టింపు మందికి పైగా ఉన్నారు. మహిళలు తమ వస్తువులను గోడలకు ఆనించి పెట్టుకునేవారు; రాత్రిపూట ఒకరికొకరికి మధ్యలో ఏ మాత్రం స్థలం లేకుండా పక్కపక్కనే పడుకునేవారు.

రద్దీగానూ, ఊపిరాడకుండానూ ఉన్నప్పటికీ, మహిళలు కలిసి జీవించడానికి; ఒక సాముదాయక భావాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలను కనుగొన్నారు.

యెరవాడ జైలులో మహిళలు చీరలు, లేదా కుర్తాలు మాత్రమే ధరించడానికి అనుమతి ఉంటుంది; హత్యకు పాల్పడిన కేసులు ఉన్న ఖైదీలు, విచారణా ఖైదీలు ఆకుపచ్చ చీరలు కట్టుకోవాలి.

సేన్ ఎక్కువగా కుర్తాలు ధరించినప్పటికీ, బైకుల్లా జైలులో మహిళా ఖైదీలకు దుస్తుల ఎంపికపై నైతికంగా ఆంక్షలు విధించకపోవడాన్ని ఆమె మెచ్చుకున్నారు. బైకుల్లాలో, మహిళలకు ప్యాంటు, షార్ట్‌‌లు ధరించే అవకాశం ఉంది; విచారణా ఖైదీలు యూనిఫాం ధరించాల్సిన అవసరం లేదు.

సేన్‌కు యెరవాడలో ఆహారం కూడా బాగా నచ్చింది.

“యెరవాడలోని ఓపెన్ జైలులో మహిళలు జైలు ప్రాంగణం చుట్టూ తాజా కూరగాయలను పండిస్తారు; వాటిలో కొన్ని ఖైదులో ఉన్న మహిళల కోసం ఉపయోగిస్తారు కాబట్టి, యెరవాడలోని ఆహారం బైకుల్లాలో ఇచ్చే ఆహారం కంటే రుచిగా, ఆరోగ్యకరంగా ఉండేది” అని సేన్ చెప్పారు.

రోజు రాత్రి భోజనం సాయంత్రం 4 గంటలకు ఇచ్చేవారు; దానిని వారు ఏ సమయంలోనైనా తినవచ్చు. అంటే, వారు సాధారణంగా రాత్రి భోజనం చేసే సమయానికి, ఆహారం చల్లగా, రుచి లేకుండా, పోషకాలు లేకుండా ఉండేది.

తమ బ్యారక్‌లలోకి తరచుగా వచ్చే పురుగులు, ఎలుకల నుంచి తమ ఆహారాన్ని కాపాడుకోవడానికి చాలామంది కష్టపడేవారు.

అసహ్యకరమైన పరిశుభ్రత, తక్కువ వనరులు:

జైలులో చాలా సంవత్సరాలు గడిపిన సేన్ (దాదాపు ఆరు సంవత్సరాలు) జగతప్ (నాలుగు సంవత్సరాలు గడిచాయి.. ఇంకా జైలులోనే) బైకుల్లాలోని మహిళల బ్యారక్‌లలో ఉన్న అనేక సమస్యలను వివరించారు.

బ్యారక్‌లు వాటి సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలను కలిగి ఉండటంతో, రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. పరిశుభ్రత కోసం లభ్యమయ్యే తక్కువ వనరులు, అసహ్యకరమైన, శుభ్రత లేకపోవడాన్ని గురించి వారు నా దృష్టికి తీసుకువచ్చారు.

సానిటరీ నాప్కిన్‌లు, డైపర్‌లు (పిల్లల కోసం) వంటి ప్రాథమిక అవసరాలను స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయి.  అంటే ఖైదులో ఉన్న మహిళల అత్యంత అవసరాలకు ప్రభుత్వం ఎలాంటి మద్దతూ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు తనకు మురికివాడల్లో నివసించే వారితో పనిచేసిన అనుభవం ఉండడం వల్ల , జైలులో  “పూర్తిగా అసౌకర్యంగా లేదు” అని సేన్‌ బదులిచ్చింది.

జైలు నుండి విడుదలైన తర్వాత ఇక్కడి మహిళల్లో చాలామంది జైలు వాతావరణం లాగే లేదా దానికంటే ఎక్కువ రద్దీగా, మురికిగా, అపరిశుభ్రంగా, ఏకాంతం లేని ప్రదేశాలకు తిరిగి వెళ్తారు కదా అని నాకు అన్పించింది.

లోపాలు ఉన్నప్పటికీ,  జైలు వెలుపల పొందలేని కనీస సౌకర్యాలను అంటే  తల పైన ఒక గూడు, నాణ్యత సరిగా లేకపోయినప్పటికీ రోజూ భోజనం లాంటి వాటిని ప్రభుత్వం జైలులో ఖైదీలకు కల్పిస్తుంది.

జైలు జీవితంలోని కష్టాలు ఉన్నప్పటికీ, భయపడాల్సిన అవసరం ఉండదు అని; తాను ఒక సరైన కారణం కోసం పోరాడుతున్నాననే బలమైన నమ్మకంతో ఒక సాధికారత భావన కలిగిందని షోమా అన్నది.

విద్య లేకపోవడం:

“జైలులో ఉన్న చాలామంది మహిళలు అట్టడుగు వర్గాల నుండి వచ్చినవారు; వారిలో చాలామందికి ప్రాథమిక విద్య అందుబాటులో ఉండదు” అని జగతప్ చెప్పింది.

అందుబాటులో ఉన్న 2022 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా డేటా ప్రకారం ప్రకారం, ఖైదు చేయబడిన వారిలో దాదాపు 25% మంది నిరక్షరాస్యులు. వీరిలో దాదాపు 68% షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారు. ఈ గణాంకాలు సామాజిక-ఆర్థిక అసమానతలు, విద్యా అవకాశాలు లేకపోవడం, భారతదేశంలో ఖైదు నమూనాలకు మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతున్నాయి.

బైకుల్లా జైలులోని మహిళల్లో 80% కంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులు; విడుదలైన తర్వాత కూడా అలాగే ఉంటారని జగతప్ అన్నది. ఖైదులో ఉన్న మహిళలకు ఉపాధ్యాయుదూ అందుబాటులో ఉండాలని జైలు నియమాలు ఉన్నప్పటికీ, ఇది అరుదుగా జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు అప్పుడప్పుడు నిర్వహించే తరగతులు విద్యా అవసరాలను తీర్చలేవు.

సేన్ ఖైదీలకు ఇంగ్లీష్ బోధించేది. జైలు లైబ్రరీని పర్యవేక్షింఛేది;  అందులో “కాలం చెల్లిన” పుస్తకాలు ఉన్నాయని ఆమె చెప్పింది. ఇదే అభిప్రాయాన్ని  ఇంటర్వ్యూ చేసిన ఇతరులు కూడా వ్యక్తం చేశారు.

ఈ పఠన సామగ్రి కొరతను భర్తీ చేయడానికి, జగతప్ తన బంధువులు, న్యాయవాదుల ద్వారా నెలకు ఐదు విద్యా లేదా సాధారణ పుస్తకాలను తెప్పించడానికి అనుమతినివ్వాలని ప్రత్యేక ఎన్‌ఐఎ  కోర్టును కోరింది. 2022 సెప్టెంబర్‌లో, కొన్ని నిర్బంధ షరతులకు లోబడి ఈ అభ్యర్థనను కోర్టు అనుమతించింది.

నిచ్చెనమెట్ల వ్యవస్థలు & సహోదరీత్వం:

జైలు వ్యవస్థకు వెలుపల పేదరికం, అసమానతలలాంటి వ్యవస్థాగత సమస్యలు గోడల లోపల కూడా కొనసాగుతున్నాయని జగతప్ అన్నారు.

“మహిళలు అందరూ ఒకే అధికారిక నియమాలకు లోబడి ఉన్నప్పటికీ, వారి బాహ్య కుటుంబ మద్దతు, ఆర్థిక వనరుల ఆధారంగా అభివృద్ధి చెందే సామర్థ్యం గణనీయంగా మారుతుంది’.”

అంతర్గత శ్రేణీకృత వ్యవస్థ ఉన్నప్పటికీ, ఒకరి కష్టాల పట్ల సానుభూతి, మహిళల మధ్య సంఘీభావం, గౌరవం, పట్టుదల, సాముదాయక భావన బలంగా ఉన్నట్లు కనిపించింది.

సేన్, జగతప్ ఇద్దరూ ఖైదీల మధ్య ఉన్న ఒక సహాయక నెట్‌వర్క్‌ను వివరించారు; ఇది వారి స్వంత సవాళ్ల నుండి బయటపడటానికి వారికి సహాయపడింది.

చలికాలంలో దుప్పట్లు వంటి వనరులు తక్కువగా ఉన్నప్పుడు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఖైదీల మధ్య ఒక మౌఖిక ఒప్పందం ఉంది. నాకు మలేరియా వచ్చినప్పుడు, నా తోటి ఖైదీలు ఎటువంటి సంకోచం లేకుండా నాకు సహాయం చేశారు” అని జగతప్ చెప్పింది.

జైలులో పిల్లలతో ఉన్న మహిళా ఖైదీలు తోటి ఖైదీల నుండి తాము పొందిన మద్దతును మెచ్చుకున్నట్లు నాకు చెప్పారు. జైలులో పిల్లలను పెంచడం తల్లులకు ఒక పూర్తి-సమయ బాధ్యత; వారి తోటి బ్యారక్-మేట్స్ తమ సొంత పిల్లల్లా చూసుకుని సహాయం చేయకపోతే, వారు తమ రోజువారీ పనులను, బాధ్యతలను పూర్తి చేయలేరు.

ఒంటరితనమూ, శత్రుత్వంతో కూడిన జైలు వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సహవాసం, సంరక్షణలతో కూడిన అలాంటి సోదరీత్వభావం కూడా ముఖ్యమైనది. మహిళలు తమ సామాజిక వర్గాలైన తరగతి, కులం, జాతీయత, నేపథ్యాలకు అతీతంగా ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వడానికి మార్గాలను కనుగొన్నారు.

న్యాయవాది సుధా భరద్వాజ్ 60వ పుట్టినరోజును మేరీ బిస్కెట్లు, బ్రిటానియా రస్క్‌లు, బోర్న్‌విటాతో చేసిన తాత్కాలిక కేక్‌తో జరుపుకోవడం వంటి హృదయపూర్వక సంఘటనలను జగతప్ గుర్తు చేసుకున్నారు. భరద్వాజ్ తన పుస్తకం ‘ఫ్రమ్ ది ఫాన్సీ యార్డ్: మై ఇయర్ విత్ ది ఉమెన్ ఆఫ్ యెరవాడ’లో ఈ ఘటనను జైలులో తన అత్యంత గుర్తుండిపోయే క్షణాలలో ఒకటిగా అభివర్ణించారు.

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అపప్రద:

సేన్, జగతప్ మహిళా ఖైదీలలో మానసిక ఆరోగ్య సమస్యలు, మానసిక గాయాల ప్రాబల్యం గురించి మాట్లాడారు.

నేను మాట్లాడిన మహిళా ఖైదీలు తమ పిల్లలను జైలులో తమతో ఉంచుకోవడం పట్ల తీవ్రమైన అపరాధ భావనను వ్యక్తం చేశారు; తమ పిల్లలను బయట వదలడం గురించి ఆందోళన చెందారు; విడుదలైన తర్వాత సమాజం వారిని ఎలా అంచనా వేస్తుందో అనే భయాలను పంచుకున్నారు. తమ భాగస్వాముల అవిశ్వాసం, కుటుంబం సంబంధాలు తెంచుకోవడం, విడుదలైన తర్వాత బయట మార్పులను తట్టుకోలేకపోవడం గురించి వారు తమ ఆందోళనలను పంచుకున్నారు.

మానసిక అనారోగ్యం ఎంత సర్వవ్యాప్తమో, మానసిక అనారోగ్యాం గురించి ఉండే కళంకం కూడా అంతే సర్వవ్యాప్తమైంది. జైలులో మానసిక ఆరోగ్య క్లినిక్ ఉన్నప్పటికీ, చాలామంది మహిళలకు తమకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియదు; తెలిసిన వారు అలాంటి సేవలను పొందడం వల్ల తమ గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఆందోళన పడతారు.

మానసిక అనారోగ్యం కోసం మందులు తీసుకోవాల్సిన  వారు ప్రతిరోజూ తమ పాగల్ దవా (పిచ్చివారి కోసం యిచ్చే మందు) పొందడానికి విధేయతగా వరుసలలో నిలబడతారని సేన్, జగతప్‌లిద్దరూ చెప్పారు.

 “మహిళలు చురుకుగా ఉండటానికి, జైలు వాతావరణంలో తమ మనసు మళ్ళించుకోవడానికి క్రీడలు లేదా వినోద కార్యకలాపాలు లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం,” అని జగతప్ అభిప్రాయపడింది.

 “నేను నాటకం, కథలు చెప్పే ప్రదర్శనలను ఒక సమయాన్ని ఉపయోగించే సాధనంగా సమర్థిస్తున్నాను,” అని ఆమె అన్నది. “ఈ కార్యకలాపాలు మహిళలను నిర్బంధానికి సంబంధించిన రోజువారీ వాస్తవాల నుండి దృష్టి మరల్చడమే కాకుండా, వారి అణచుకొన్న భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గాన్ని కూడా అందిస్తాయి.”

LGBTQ+ Awareness & Experiences

ఎల్‌జిబిటిక్యూ+అవగాహన ; అనుభవాలు

జైలులో చాలామంది స్వలింగ సంపర్కులు ఉన్నారని, కానీ వారిలో చాలామంది ఇంకా బయట పడలేదని; “తోటి ఖైదీలు అర్థం చేసుకొన్నప్పటికీ, ఈ సమాచారం తమ కుటుంబాలకు చేరితే అనే ఆందోళన వారికి ఉంది. తమ గుర్తింపులోని ఈ అంశాన్ని తమ కుటుంబాలతో పంచుకోవడానికి వారు సిద్ధంగా లేరు,” అని జగతప్ చెప్పారు.

ఎల్‌జిబిటిక్యూ+ఖైదీలు ఎదుర్కొంటున్న సవాళ్లను జగతప్ ఇలా వివరించారు: “రక్షణ పొందాలంటే, వారు బహిరంగంగా బయటికి రావాలి. అలా చేయడం వల్ల వారి లైంగిక ధోరణి లేదా లైంగిక గుర్తింపుతో సంబంధం ఉన్న సామాజిక అపప్రద; హానికి గురయ్యే అవకాశం ఉంది.” ఈ పరిస్థితి జైలు వ్యవస్థలో ఎల్‌జిబిటిక్యూ+వ్యక్తులు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను నొక్కి చెబుతుంది; ఇక్కడ భద్రత, గుర్తింపు, సామాజిక ఆమోదం అపాయకరమైన మార్గాలలో కలుస్తాయి.

బైకుల్లాలో బహిరంగంగా ఉన్న ఒకే ఒక్క ట్రాన్స్‌జెండర్ మహిళా ఖైదీతో నేను మాట్లాడాను, ఆమెను మహిళల జైలులో ఒక ప్రత్యేక సెల్‌లో ఉంచారు. ఇతర మహిళా ఖైదీలు లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆమెను బయటికి అనుమతించేవారు లేదా అందరూ బయట ఉన్నప్పుడూ ఆమె లోపల ఉండేది.

 “కఠినమైన విభజన వల్ల నన్ను నేను ఒక అంటరాని వ్యక్తిలా అనుకోవడమే కాకుండా, ఇతర ఖైదీల నుండి నిరంతరం పరిశీలనకు గురవుతున్నాను,” అని ఆమె తన పేరు చెప్పకుండా మాట్లాడింది. “నేను ఒక జంతు ప్రదర్శనశాలలో ప్రదర్శనలో ఉన్నట్లు అనిపిస్తుంది, బయటపడటానికి మార్గం లేదు.”

తన గుర్తింపు కారణంగా ఇతర ఖైదీల కంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నది; ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ఒంటరిగా ఉంచరాదని, జైళ్ళలో అందించే పునరావాస కార్యక్రమాలను వారికి అందుబాటులో ఉంచాలని 2022 జనవరి 10 న హోం మంత్రిత్వ శాఖ  రాష్ట్ర జైలు అధికారులకు ఆదేశించినప్పటికీ ఆమెను విస్తృత జైలు సమాజం నుండి మినహాయించారు.

సేన్, జగతప్ ఇద్దరూ మార్పు జరుగుతుందనే ఆశను వ్యక్తం చేశారు. జైలు వ్యవస్థను పునఃపరిశీలించాలని వారు పిలుపునిచ్చారు; మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పునరావాసం కోసం అవకాశాల అవసరాన్ని నొక్కి చెప్పారు.

పాఠకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు, సేన్ ఇలా అన్నారు, “జాతీయ, అంతర్జాతీయ సమాజం నుండి మేము పొందిన మద్దతుకు మా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయండి. వారి సంఘీభావం మాకు అమూల్యమైనది.”

2024 అక్టోబర్ 31

(స్తుతి షా అమెరికాలోని కొలంబియా లా స్కూల్ లో పరిశోధనా విద్యార్థిని)

తెలుగు: పద్మ కొండిపర్తి

https://article-14.com/post/a-professor-a-singer-both-accused-in-bhima-koregaon-case-discuss-hopelessness-hope-in-an-indian-prison–67230790789fc

Leave a Reply