ప్రజలు శాంతిని కోరుకుంటున్న కాలం ఇది. సమాజం ప్రశాంతంగా ఉన్నప్పుడే  ప్రజా సమస్యలు చర్చనీయాంశం అవుతాయి. వాటికి అర్థవంతమైన పరిష్కారాలు  దొరుకుతాయి. కానీ శాంతి, సామరస్యం నానాటికీ అడుగంటిపోతున్నాయి. హింస, విద్వేషం లెక్కలేనన్ని రూపాల్లో పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులుగా మంచి సమాజం కోసం ప్రయత్నించిన మేము ఇప్పుడున్న ఈ స్థితిని గ్రహించాం. దీన్ని మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తోడు నిలబడాలని అనుకున్నాం.

యుద్ధాలు ఉన్నంత కాలం శాంతి ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు దేశాల మధ్య, దేశాల లోపలా దురాక్రమణ యుద్ధాలు  సాగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కోటానుకోట్ల మంది ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు.  శాంతి ఒక పోరాట నినాదంగా మారింది. మన దేశ రాజకీయార్థిక రంగంలో, సాంస్కృతిక రంగాల్లో పెరిగిన హింస సాయుధ హింసగా మారింది. మతతత్వ శక్తులు సాధారణ ప్రజల మీద, ప్రజాస్వామికవాదుల మీద భౌతిక దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని సైనిక బలగాలు పౌరుల మీద  ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి. ఈ రెండూ కలిసి అంతర్యుద్ధాన్ని తలపిస్తున్నాయి.  దేశ  సరిహద్దుల్లో ఉండాల్సిన సైనికులు మధ్య భారతదేశంలో మావోయిస్టులను, ఆదివాసులను హత్య చేస్తున్నారు. ఆదివాసులైనా, మావోయిస్టులైనా భారత పౌరులే. వాళ్లు ఆయుధాలు పట్టుకున్నాసరే రాజ్యాంగంలోని 21 ఆర్టికల్‌లోని జీవించే హక్కు వాళ్లకూ వర్తిస్తుంది. ప్రజల విశ్వాసాలు ఏవైనా సరే, వాళ్లు ఎలాంటి పోరాటాలను ఎంచుకున్నా సరే, వాళ్లకు  ప్రభుత్వం హానీ తలపెట్టడానికి లేదు. చట్టాలను  వ్యతిరేకించే ప్రజలతో కూడా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.  ప్రజాస్వామ్యంలో చట్టాలను అతిక్రమించే అవకాశం  ప్రభుత్వాలకు లేదు.

కానీ  రాజ్యాంగ స్పూర్తిని హత్య చేస్తూ ప్రభుత్వం ఆదివాసులను, మావోయిస్టులను నిర్మూలించడానికి ఆపరేషన్‌ కగార్‌ అనే యుద్ధతంత్రాన్ని తీసుకొచ్చింది. ఇది కార్పొరేట్ల కోసం  మతతత్వశక్తులు చేస్తున్న యుద్ధం.  ఇప్పుడు ఇది ఆదివాసీ పోరాటాలను అడ్డుకోడానికే కావచ్చు.  మావోయిస్టులను చంపేయడానికే  కావచ్చు.  సారాంశంలో ఇది  దేశ ప్రజలందరికీ పొంచి ఉన్న ప్రమాదం. మావోయిస్టులను హత్య చేశాక ప్రభుత్వం మిగతా ప్రజా ఉద్యమాలపై పడుతుంది.  ఆదివాసీ అస్తిత్వాన్ని ధ్వంసం చేశాక మిగతా పీడిత అస్తిత్వ ప్రజలందరి మీద దాడి చేస్తుంది. కార్పొరేటీకరణ అడవులకే పరిమితం కాదు. పల్లెలను, పట్టణాలను కూడా ధ్వంసం చేస్తుంది.  చివరికి ఇది పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తుంది. పాలకుల అభివృద్ధి నమూనా దీనికి కారణం. నేల మీద మనుషులు, జీవజాలం బతకలేని దుస్థితిని కార్పొరేటీకరణ తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా  ఆదివాసులు తమకోసమే కాక మనందరి కోసం పోరాడుతున్నారు.

ఈ కార్పొరేట్‌ యుద్ధంలో మావోయిస్టులందరినీ వచ్చే ఏడాది మార్చి చివరికల్లా చంపేస్తామని కేంద్ర హోం మంత్రి పదే పదే ప్రకటిస్తున్నాడు.  ఎవరినైనా చంపడం, చంపుతానని అనడం చట్టం ప్రకారం నేరం. వారిపై హత్య, హత్యాయత్నం నేరం నమోదు చేసి జైల్లో పెట్టాలి. మావోయిస్టుల విషయంలో అమిత్‌షా ప్రకటనలు, చర్యలు తీవ్రమైన నేరాలు. అసలు  మావోయిస్టు ముక్త్‌ భారత్‌ అనే నినాదమే రాజ్యాంగ వ్యతిరేకం. నేరపూరితం. ఇది ఆదివాసీ రహిత భారత్‌గా మారుతుంది. పౌర సమాజాన్ని అణచివేస్తుంది. భావజాల వైవిధ్యం, బహుళత్వం ఉన్న దేశంలో ఫాసిస్టులు తమకు నచ్చని ఆలోచనలను తుడిచేసేందుకు ఈ అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చారు. 

అడవుల్లోని సహజ సంపదలను ఆదానికి, అంబానికి ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందలాది మంది సాధారణ ఆదివాసులను హత్య చేస్తోంది. దీన్ని ఆపడానికి మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణకు తాము సిద్ధమని  ఏప్రిల్‌ 2న ప్రకటించింది. ఆ తర్వాతి కాలంలో మావోయిస్టు పార్టీ  కేంద్ర, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అనేక మంది హత్యకు గురయ్యారు. అయినా మావోయిస్టులు  కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నారు. పౌరుల జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా తయారైతే.. సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటానికి మావోయిస్టులు రాజ్యాంగబద్ధమైన శాంతి చర్చలను ప్రతిపాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయుధాలు వదిలాల్సిందే అంటున్నది. లేకుంటే అందరినీ చంపేస్తామంటున్నది.

ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయకపోవడంతో ప్రజలు పోరాడక తప్పడం లేదు. అనేక ప్రజా పోరాట రూపాల్లో సాయుధ పోరాటం ఒకటి. మావోయిస్టులు ఆయుధాలు పట్టుకోడానికి కారణం ప్రభుత్వమే. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్రం లక్షల సైనిక బలగాలను వెచ్చించింది. డ్రోన్లను, రాకెట్‌ లాంచర్లను వాడుతున్నది. హెలికాప్టర్లతో బాంబింగ్‌ చేస్తున్నది. ఇంత రాజ్యాంగ వ్యతిరేకంగా తాను వ్యవహరిస్తూ ఆయుధాలు వదిలితేనే మావోయిస్టులతో చర్చలని అంటోంది. ఈశాన్య భారతదేశంలోని జాతి పోరాట సంస్థలతో కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు శాంతి చర్చలు జరిపింది. వాజ్‌పాయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా నాగా ఉద్యమకారులతో చర్చల ప్రయత్నం జరిగింది. లొంగిపోతేనే చర్చలనే మాట ఆప్పుడు రాలేదు. 

కానీ మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనలోని ప్రజా ప్రయోజన కాంక్షను పౌర సమాజం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమం మొదలైంది. దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో వామపక్ష విప్లవ పార్టీలు, ప్రజాతంత్ర లౌకికవాద సంస్థలు భాగమయ్యాయి. వేర్వేరు భావజాలాల మేధావులు కేంద్ర ప్రభుత్వం మీద కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలనే ఆందోళన మొదలైంది. మావోయిస్టులు తమ  తొలి ప్రకటనలోనే కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆరేడు రాష్ట్ర ప్రభుత్వాల ముందు తమ కాల్పుల విరమణ ప్రతిపాదన పెట్టారు. మావోయిస్టు సమస్యను తమ ప్రభుత్వం సామాజిక సమస్యగా గుర్తిస్తున్నట్లు తెలంగాణ సీఎం అన్నారు. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో  రాష్ట్ర బలగాలు భాగం కావడం లేదని, మావోయిస్టుల వైపు నుంచి చర్యలు లేకుంటే తమ ప్రభుత్వం కూడా చర్యలకు దిగదని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర  ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలని కాంగ్రెస్‌ నాయకులు మల్లికార్జున కర్గే,  రాహుల్‌ గాంధీ ప్రకటించారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రకటన పట్ల కూడా సానుకూలంగా స్పందించారు.  కేంద్రం మావోయిస్టులతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 1వ తేదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిజామాబాద్‌ సభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగకరంగా ప్రసంగించారు. దీనికి పీసీపీ అధ్యక్షుడు సమాధానం ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. గోదావరి తీరం వెంట చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో పోలీసులు క్యాంపులు ఉన్నాయి. తరచూ పోలీసు కూంబింగ్‌ జరుగుతోంది. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి ఎన్‌కౌంటర్‌ హత్యలు జరగలేదు.  అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాంతి చర్చల ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోలీసులు ఎన్‌కౌంటర్లు చేశారు. ఇప్పుడు కూడా పోలీసులు అట్లాంటి చర్యలకు పాల్పడి ప్రభుత్వ వైఖరిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. అది చట్టబద్ధ పాలనకు కొంత హామీ ఇస్తుంది.

పైగా కాంగ్రెస్‌ పార్టీ తాను అన్ని రకాలుగా బీజేపీకంటే భిన్నమని చెప్పుకుంటోంది.  బీజేపీ బారి నుంచి రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ ప్రక్రియలను కాపాడతానని అంటోంది. రాహుల్‌గాంధీ ఎక్కడికి వెళ్లినా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ విద్వేషాన్ని పెంచుతోంటే తాను ప్రేమను పంచుతున్నానని అంటున్నారు. కాబట్టి రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడటానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. ఇది మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించడానికి దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకవస్తుంది. 

చర్చలు రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి ‘మేం మావోయిస్టులతో చర్చించం’ అనే హక్కు, అధికారం బీజేపీకి లేదని చాటి చెప్పడానికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాల్పుల విరమణకు సిద్ధం కావాలి. రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కాలరాస్తోంది. మొన్న నిజామాబాద్‌లో అమిత్‌షా ప్రకటన సారాంశం ఇదే.  రాష్ట్రాల ప్రతిపత్తిని కాపాడుకోవడంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విప్లవకారులతో కాల్పుల వివరణ ఒప్పందం చేసుకోవాలి. మతతత్వ దురహంకారంతో బీజేపీ కొనసాగిస్తున్న ఆదివాసీ నిర్మూలనను అడ్డుకోడానికి కూడా కాల్పుల విరమణ ఒప్పందం కాంగ్రెస్‌కు  సాధనం అవుతుంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక దశ దాకా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన అనుభవం కాంగ్రెస్‌కు ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి చరిత్ర మరో అవకాశం ఇచ్చింది. మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్రం సిద్ధం కావాల్సి ఉన్నప్పటికీ ఆ పని రాష్ట్రం కూడా చేయవచ్చు. దానికేమీ రాజ్యాంగ ఆటంకాలు లేవు. అసలు జాతి ఉద్యమ సంస్థలతో దశాబ్దాల  తరబడి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయుధాలు ఇచ్చేయాలనే మాటే లేదు. సాయుధ సంస్థలతో ఒప్పందాలకు రాజ్యాంగంలో అవకాశం ఉందా? లేదా? అనే సందిగ్ధతే ఎదురు కాలేదు. పైగా జీవించే హక్కును కాపాడటం కోసం శాంతి చర్చలకు సిద్ధమయ్యే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది.

ఇవాళ కాల్పుల వివరణ డిమాండ్‌ విశాల ప్రజాతంత్ర చైతన్యంగా మారింది. ప్రజాఆకాంక్షను గౌరవించడం కంటే ఏ ప్రభుత్వానికైనా గౌరవం ఏముంటుంది? తెలుగు సమాజాల్లో రాజ్యాంగ హక్కుల స్పృహ, పోరాట చైతన్యం పెరగడానికి దోహదం చేసిన విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఒకప్పుడు భాగమైన మేం  హింస లేని తెలంగాణ కోసం పాటుపడాలనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద ఈ విషయంలో పోరాడుతూనే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులతో కాల్పుల విరమణ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో మేమూ భాగం కావాలని అనుకున్నాం. ఒకప్పుడు ఈ సమాజం బాగు కోసం ప్రయత్నించిన విద్యార్థులుగా మేం ఇప్పుడు కూడా ఆ పని ఎంతో కొంత చేయాలనుకుంటున్నాం. లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం, శాస్త్రీయ దృక్పథ వికాసం కోసం, వివిధ సమూహాల ప్రజా ఆకాంక్షలకు బలపరచడం కోసం పూర్వ విప్లవ విద్యార్థుల వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో కాల్పుల విరమణ ఒప్పదం అనే అంశం చుట్టూ పౌర సమాజ అభిప్రాయాన్ని కూడగట్టాలని అనుకుంటున్నాం. దీనికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాం.

26 జూలై 2025

Leave a Reply