మధ్య రీజియన్ లోని గాలికొండ నుండి తిప్పాగఢ్ వరకు, దక్షిణ బస్తర్, పశ్చిం బస్తర్, మాడ్ కొండలను, సుర్జాగడ్, దంకోడివాహి అడవులను దాటుకొని తిప్పాగఢ్ వరకు ఆరు పదులు దాటిన ఆ విప్లవకారుడు తన బాధ్యతల నిర్వహణలో భాగంగా, అలుపెరుగక గెరిల్లాలతో కాలు కలిపేవాడు. ఆగినచోట యువ గెరిల్లాలంతా పొలోమంటూ తన చుట్టూ చేరితే వారి ముందు ప్రపంచాన్ని ఆవిష్కరించేవాడు. తన అపార అనుభవాల యవనికను పరిచేవాడు. ఒక భుజానికి ఏకే తుపాకి, మరో భుజానికి కుర్చీ, నడుంకు పోచ్, వీపున కిట్టు, కిట్లో అనేక పుస్తకాలు, జబ్బ సంచిలో కంప్యూటర్, మొబైల్ ఫోన్ తో కొద్దిగా వంగి నడిచే అరడుగుల ఆ విప్లవకారుడు కామ్రేడ్ గౌతం.
43 సంవత్సరాలు అపార విప్లవ అనుభవాల గని ఆయన. ఆయన మొదట విప్లవోద్యమ కార్యకర్త, నాయకుడు, అవసరాల రీత్యా పత్రికా సంపాదకుడు, ఉపాధ్యాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన విప్లవ నాయకుల బృందంలో సభ్యుడు. ఆయన ఒక రచయిత, విమర్శకుడు, సమీక్షకుడు, సలహాదారు, అందరిని ఆకర్షించే స్నేహశీలి, ఎదుటివారి భావాలను ముసి ముసి నవ్వులతో పోగుచేసుకునే ప్రజాస్వామికవాది, తోటి గెరిల్లాల, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకునే వైద్యుడు, తన పనులు తాను చేసుకునే ఆదర్శ జీవి అన్నీ కాగలగడం వెనుక ఆయన ఒక గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడు. ఆయన భౌతికంగా మనకు ఇక లేడు.
జూన్ 5నాడు ఆయనను కగార్ పాశవిక బలగాలు సజీవంగా పట్టుకొని హత్య చేశాయి. ఆ అమరవీరుడికి విప్లవ జోహార్లు చెపుదాం.ఆయనతో అమరులైన వారిలో ఆయన గార్డు కామ్రేడ్ శుద్రూ పూనెం వున్నాడు. కామ్రేడ్ శుద్రు పదేళ్లకు పైగా కామ్రేడ్ గౌతంతో వుంటున్నాడు. ఒక గెరిల్లా నుండి పీపీసీ స్థాయి వరకు కామ్రేడ్ శుద్రూ ఎదిగాడు. శుద్రుకు గౌతం అంటే ప్రాణం, ఎంతో అభిమానం. శుద్రుకు రాత్రి సరిగా కళ్లు అగుపడవు. ఆయనకు వైద్యం చేయించడానికి గౌతం ఎంతో శ్రద్ధ పెట్టాడు. ఆయనకు తాను ఇష్టపడిన మహిళా కామ్రేడ్ చిలకా కుంజాంతో పెళ్లి జరిపారు. కానీ, దురదృష్టవశాత్తు పెళ్లి అయిన మూడు మాసాలకే శుద్రు జీవిత సహచరి 30 ఎప్రిల్ 2024 కాకూర్ కొండలలో కగార్ దాడికి బలైంది. ఇక ఇపుడు శుద్రూ లేడు. చిలకా లేదు. గౌతం లేడు. వారంతా విప్లవం కోసం అహర్నిషలు పని చేసి ప్రాణత్యాగం చేసిన అమరులు. అజరామరులు.
ఆయన అమరత్వం విప్లవకారుల దీక్షా పట్టుదలలకు ఒక చెరగని సంకేతం. ఆయన ధైర్య సాహసాలు విప్లవకారులకు పాఠాలు నేర్పే గుణపాఠాలు. కామ్రేడ్ గౌతం వాళ్ల ఉనికి శత్రువు బలగాలకు అర్థమైన విషయం తెలిసి తమ ఆశ్రయం (షెల్టర్)పదుల మార్చుకునే క్రమంలో చిమ్మచీకటి రాత్రి, అడవిలో నడకలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ముందు నడిచే వారు, దారి అగుపడదు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి సాధారణంగా కళ్ల సమస్య వున్న సీనియర్ కామ్రేడ్స్ తమ ముందరి యువ గెరిల్లాల కిట్లకు చాలా దూరం కాకుండా తమ మేరకు మాత్రమే అగుపడే గుర్తులు పెట్టుకుని నడుస్తూంటారు. కామ్రేడ్ గౌతం అలా నడుస్తుండగా, అకస్మాత్తుగా తన కాలికి ముల్లు కుచ్చడంతో ఆగిపోయాడు. ఆ చిమ్మ చీకట్లో ముందరి కామ్రేడ్ అది గమనించకపోవడంతో, వెళ్లిపోయాడు. దానితో గౌతం ఒంటరయ్యాడు. వేలాది బలగాలు చుట్టుముట్టి వున్న ఆ అడవిపై ఆయనకు తగినంత పట్టు లేకపోవడంతో, నేరుగా, ఒంటరిగా, చీకట్లో వెళ్తూ మాటు కాచి కూచున్న పోలీసుల వలలో చిక్కాడు. దానితో పోలీసులు ఆయన్ని సజీవంగా పట్టుకుని హత్య చేశారు.పోలీసుల బందీగా గడిపిన సమయంలో ఆయన అనుభవించిన చిత్రహింసలు అనూహ్యమైనవి.
గడిచిన యేణ్ణర్ధ కాలంగా కగార్ దాడులలో వేలాది ప్రభుత్వ సాయుధ బలగాలు విశాలమైన ప్రాంతాలను చుట్టుముట్టి నిర్మూలించే దాడులలో దండకారణ్య అడవులు రక్తసిక్తమవుతున్నాయి. మాడ్ కేంద్రంగా సాగుతున్న శత్రువు పాశవిక అణచివేత చర్యలలో పదుల సంఖ్యలో విప్లవకారులు, విప్లవ ప్రజలు అసువులు బాసారు. ఆ అణచివేత చర్య ఆపరేషన్ కగార్ గా ప్రాచుర్యంలోకి రాగా సరిగ్గా కామ్రేడ్ గౌతం అమరత్వానికి 20 రోజుల ముందు ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ గా పోలీసులు ప్రకటించారు.ఔను! అది బ్లాక్ ఫారెస్టే. కర్రె గుట్టలలో నరసంహారాన్ని కొనసాగించిన తరువాత ఆ పేరును స్థిర పరచుకున్నారు. అప్పటి వరకు విడి విడి ఆపరేషన్ లకు విడి విడి పేర్లతో వ్యవహరిస్తూ వచ్చిన పోలీసులు, కర్రె గుట్టల ఆపరేషన్ కు, ఆ తరువాతి ఆపరేషన్ లకు ఆ పేరు వాడుతున్నారు. మావోయిస్టులు లేని అడవులు అంధకారమయమే. ప్రజల పోరాటాలను అణచివేసి చీకటి రాజ్యాన్ని ఏలాలనుకుంటున్న పోలీసుల లక్ష్యానికి ఆ పేరు సరిగ్గా సరిపోయింది.
ఐదు దశాబ్దాలకు పైగా ప్రజలకు విప్లవ రాజకీయాలు బోధిస్తూ, వారిని విప్లవోద్యమాలలో నడిపిస్తూ గెరిల్లాలకు యుద్ధ విద్యలు నేర్పుతూ, పీడిత ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్న విప్లవ పార్టీ నాయకుడు కామ్రేడ్ నంబళ్ల కేశవరావ్ సహ 28 మంది విప్లవకారులను మాడ్ కొండలలో హతమార్చారు. ప్రజలను చైతన్యవంతం చేసే కామ్రేడ్ గౌతం లాంటి మేధస్సులను హతమార్చినారు. ఎందరెందరో విప్లవ నాయకులను హతమారుస్తున్నారు. అబూజ్ మాడ్ ఇకపై అబూజ్ కాదనీ, అది తరతరాలుగా వీరోచిత ఆదివాసీ ప్రజల పోరాట తిరుగుబాట్ల గడ్డ అనీ, విముక్తి ప్రాంతానికి ఒక బీజమనీ వారు ప్రకటిస్తే, దానిని రూపుమాపడానికి పాలకులు, పోలీసులు చీకటి అడవిని నిలపబూనుకున్నారు. వారికి చీకటి రాజ్యం కావాలి. వారికి నిన్నటి అబూజ్ కావాలి. కానీ, చరిత్ర రథచక్రాలు వెనక్కి మళ్లవనీ అమరుల నెత్తుటి సాక్షిగా ప్రకటిద్దాం. వారి స్మృతిలోఅరుణారుణ జోహార్లు అర్పిద్దాం.
2025 జూనే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దండకారణ్యం స్పెషల్ జోన్ పశ్చిమ బస్తర్ డివిజన్ నేషనల్ పార్క్ ఏరియాలో వేలాది పోలీసు బలగాలతో జరిగిన ఆపరేషన్ లో 7గురు కామ్రేడ్స్ అమరులయ్యారు. వారిలో కామ్రేడ్ గౌతంతో పాటు తెలంగాణ మావోయిస్టు ఉద్యమ నాయకుడు కామ్రేడ్ భాస్కర్ సహ ఐదుగురు పీ.ఎల్.జీ.ఏ కామ్రేడ్స్ శుద్రూ పూనెం, లాల్సు, రజని, రైనీ, సంతోష్ అమరులయ్యారు. కామ్రేడ్ గౌతం గడచిన 43 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో వివిధ రాష్ట్రాలు, స్పెషల్ జోన్ లలో, పార్టీ రాజకీయ బోధనా విభాగంలో, పత్రికా రంగంలోసేవలు అందించారు. కామ్రేడ్ గౌతం అమరుడవుతున్న సమయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏఓబీ రాష్ట్రాల అధికార పత్రికక్రాంతి సంపాదకవర్గంలో సభ్యుడు, రాజకీయ పాఠశాల రీపోస్ కు బాధ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన అమరత్వంతో పార్టీ ఒక అనుభవ సంపన్నుడైన విప్లవోద్యమ నాయకున్ని కోల్పోయింది.
కామ్రేడ్ గౌతం అమరత్వంతో, దోపిడీ పాలకవర్గాలు సంబురపడ్డాయి. తలపై కోటి రూపాయల విలువ కలిగిన కేంద్ర కమిటీ సభ్యుడు హతమయ్యాడనీ ప్రకటించాయి. ఆయనతో పాటు మరుసటి రోజు మరో నాయకత్వ కామ్రేడ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ భాస్కర్ (అడేలు) అమరుడయ్యాడు. చివరి రోజు నలుగురు కామ్రేడ్స్ అమరులైన వార్త వినిపించారు. అమరుల శవాలను తమ కుటుంబాలు తీసుకువెళ్లాయి. వారి వారి స్వగ్రామాలలో వారి పార్థివ శరీరాలకు విప్లవ సంప్రదాయాలతో అంత్య క్రియలు జరిపారు. ముఖ్యంగా కామ్రేడ్స్ గౌతం, భాస్కర్ ల అంత్యక్రియలు అనేక మంది విప్లవ సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు, బంధు మిత్రులే కాకుండా, వేలాది మంది ప్రజల కన్నీళ్ల మద్య, ఆపరేషన్ కగార్ దాడులను వెంటనే ఆపాలనీ, మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపాలనీ బిగించిన పిడికిళ్లెత్తుతూ పిక్కటిల్లే నినాదాల మధ్య అరుణారుణ పతాకాలతో పార్థివ శరీరాలకు నిప్పంటించారు. వారి అంతిమయాత్రలో పాల్గొన్న వారందరికీ, కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు విప్లవాభి వందనాలు తెలుపుతూ, అపార అనుభవం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కామ్రేడ్ గౌతం, భాస్కర్ లు లేని లోటును ఎవరూ తీర్చలేరు ., వారి ఆశయాల సాధనకు వారిలాగా ఉద్యమించడమే వారికి నిజమైన నివాళి. వారి దుఃఖం, వేదన భారత విప్లవోద్యమంలో భాగం .
కామ్రేడ్ గౌతం 1957 జూలై 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా పెదపాడు మండలం, సత్యవోలు గ్రామం, మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులకు ఆరుగురు సంతానంలో చివరివాడు. ఆయన పేరు తెంటు లక్ష్మీ నరసింహాచలం. ప్రాథమిక, సెకండరీ విద్య తరువాత బి.ఎస్సీ చేసాడు. ఆ తరువాత పొరుగున ఉన్న కృష్ణా జిల్లా విజయవాడలో బీఏఎమ్ఎస్ (ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ కోర్సు) చదివాడు.
28 జులై 1972నాడు అతి పాశవికంగా పోలీసు లాకప్ లోకామ్రేడ్ చారు మజుందార్ అమరత్వం తరువాత పార్టీ అనేక చీలికలకు గురి అయ్యింది. ముక్కచెక్కలైన పార్టీని, దెబ్బతిన్న ఉద్యమాన్ని తిరిగి ఐక్యం చేస్తూ, నిర్మించడానికి ఎక్కడికక్కడే నిజాయితీ కలిగిన విప్లవకారులు పూనుకున్నారు. ఆ కృషిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన నాయకత్వం పార్టీ ఆచరణలో జరిగిన తప్పులను సమీక్షించుకొని, ఓ వైపు విప్లవకారుల ఐక్యతకు తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తూనే, మరోవైపు వ్యవసాయ విప్లవానికి నడుం బిగించింది. ఆ రకంగా, 1977లో ఆత్మవిమర్శనా సమీక్ష ముందు పెట్టుకొని, దాని ప్రాతిపదికన కమ్యూనిస్టు విప్లవకారులు ఉద్యమాన్ని పునర్నిర్మిస్తున్న కాలం అది.
నక్సల్బరీ, దాని వెన్నంటి శ్రీకాకుళం, ముషాహరి, బీర్ భూం, లఖింపూర్-ఖేరీలలో రైతాంగ పోరాట జ్వాలలు ఎగిసి,మార్క్సిజం-లెనినిజం-మావోయిజం రాజకీయాల శక్తిని నిరూపించాయి. మరోవైపు కాంక్షా, సోనార్ పుర్ తదితర తూర్పు భారత గ్రామీణ ప్రాంతాలలో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ నాయకత్వంలో రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ పోరాటాల ప్రభావం దేశవ్యాప్తంగా విద్యార్ధి యువజనుల మీద బలంగా, చెరిగిపోకుండా పడింది.చదువుకుంటున్న రోజులలో సాహిత్యంపై మక్కువ పెంచుకున్న కామ్రేడ్ చలం క్రమంగా విప్లవ రాజకీయల గురించి తెలుసుకోనారంభించాడు. దేశం గురించి, వర్గాల గురించి, వర్గ దోపిడీ గురించి, సామాజిక పరిణామ క్రమంలో విప్లవోద్యమాల ప్రాధాన్యత గురించి, ప్రజల విముక్తి గురించి చెప్పే ఆ విప్లవ రాజకీయాల గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. అదే సమయంలో వ్యవసాయ విప్లవోద్యమంలో భాగంగా కాలం చెల్లిన కరుడుగట్టిన భూస్వామ్యానికి వ్యతిరేకంగా,కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లా-జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన రైతాంగ, కార్మిక పోరాటాలు పాలక వర్గాన్ని వణికిస్తే, విప్లవ ఆలోచనలు కలిగిన వారిలో ముఖ్యంగా యువతలో నూతనోత్సాహాన్ని రగిలిస్తూ విప్లవ బాటలను పరిచాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాజకీయాల వాతావరణం బలంగా నెలకొని ఉన్న తరుణంలో, విప్లవ ప్రజాసంఘాల ఆవిర్భావం యువతలో విప్లవ రాజకీయాల వ్యాప్తికి దోహదపడింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడి రచయితలకు, కళాకారులకు మావో ఆలోచనా విధానం, సాయుధ పోరాట మార్గంలో కొత్త దారులను ఆవిష్కరించింది. ఆ తరువాత ఏర్పడిన రాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భవించడం, వ్యవసాయక విప్లవానికి, దున్నేవారికే భూమికి, విద్యార్థులకు గల అనుబంధాన్ని ముందు పెట్టింది.ఆ వరుసన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాడికల్ యువజన సంఘం రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పాయి. ప్రజా సమస్యలపై వారు చేపట్టిన సమరశీల పోరాటాలు, వ్యవసాయ విప్లవ రాజకీయాలతో విద్యార్థి యువజనులు రైతాంగంతో మమేకమయ్యే ‘‘గ్రామాలకు తరలండి’’ ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి-యువజనులను తీవ్రంగా ఆలోచింపచేశాయి. వారిలో కామ్రేడ్ నరసింహాచలం లాంటి ప్రగతిశీల భావాలు కల విద్యార్థులను మరింత తీవ్రంగా కదిలించాయి.
1978లో డిగ్రీ చదువు ఆఖరు సమయంలో తాను చదువుతున్న కాలేజీలో జరిగిన సమ్మెలో చురుగ్గా నాయకత్వం వహిస్తున్న రాడికల్ విద్యార్ధి సంఘం (ఆర్ఎస్ యూ)తో ఆయనకు పరిచయం అయింది. వారి సాన్నిహిత్యం ఫలితంగా కామ్రేడ్ చలం ఆలోచనలు తాను ఏ వైపు నిలువాలనే విషయంలో స్పష్టమైన రూపం తీసుకోనారంభించాయి. తాను ఇకపై పీడిత ప్రజల కోసం పని చేసే విప్లవ రాజకీయాలతోనే నిలవాలనుకున్నాడు. ఆ నిర్ణయం ఫలితంగా, ఆయన ఆర్ఎస్ యూలో పని చేస్తూ వచ్చాడు. ఆర్.ఎస్.యూ చేపట్టిన వివిధ ప్రచార, ఆందోళనా కార్యక్రమాలలో పాలు పంచుకున్నాడు. మార్క్సిజం-లెనినిజం-మావోయిజం రాజకీయాల కార్యాచరణను అర్ధం చేసుకున్నాడు. విప్లవ పార్టీ లేకుండా దేశ పీడిత ప్రజలను, జాతులను విముక్తి చేయజాలమని గ్రహించాడు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలు విప్లవ పార్టీలు, వారి విద్యార్థి సంఘాలు పని చేస్తున్నాయి. కామ్రేడ్ చలం, వాటికి, ఆర్.ఎస్.యూ చెప్పే రాజకీయాలకు మధ్య గల తేఢాను స్పష్టంగా అర్థం చేసుకొని విప్లవ సాహిత్యాన్ని, పార్టీ డాకుమెంట్లను, పత్రికలను అధ్యయనం చేయసాగాడు. తన అభిప్రాయాలు, సందేహాలు, పార్టీ బాధ్యులతో చర్చించేవాడు. ఈ క్రమంలో ఆయన ఆచరణను, అధ్యయనాన్ని, పట్టుదలను అర్థం చేసుకున్న స్థానిక పార్టీ కామ్రేడ్స్ ఆయనకు 1980లో పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వడం ప్రతిపాదించగా, ఆయన సంతోషంగా స్వీకరించి పార్టీ సభ్యుడయ్యాడు. అది ఆయన జీవితంలో ఒక రెడ్ లెటర్ డే గా మిగిలిపోయింది. సరిగ్గా అదే సంవత్సరం జూన్ లో విప్లవోద్యమం ఒక గొప్ప మలుపు తీసుకుంది. విప్లవ పార్టీ నాయకత్వంలో సాయుధ గెరిల్లా దళాల నిర్మాణం ప్రారంభమైంది.విప్లవ రాజకీయాలతో మమేకమైన విద్యార్థి యువజనుల నుండి 35 మందిని పార్టీ ఎంపిక చేసి వారిని 7 దళాలుగా విభజించి తూర్పు గోదావరి-విశాఖపట్టణం (మన్యం) నుండి ఆదిలాబాద్ వరకు వాటి కార్యక్షేత్రంగా నిర్ణయించింది. చరిత్రలో దండకారణ్య సరిహద్దులు ఏమైనప్పటికీ విప్లవపార్టీ రూపొందించిన విముక్తి ప్రాంతాల రోడ్ మేప్ ను అనుసరించి దానిని ఆనాడు దండకారణ్యంగా నిర్వచించింది. ఆ దళాలు అనేక ఎదురీతలతో, రక్త తర్పణంతో అడవిలో కాలూనుకున్నాయి. విశాల దండకారణ్యంలో తొలుత ఏర్పడిన గెరిల్లా దళాలు ఏడే కావచ్చు, కానీ, వాటి ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఆలోచింపచేసింది. మరోవైపు, విప్లవ రాజకీయాల ప్రచారానికి ఒక వైపు రచయితలు, మరోవైపు కళాకారులు అలుపెరుగని కృషి చేయడం అగ్నికి ఆజ్యంలా తోడైంది.
కామ్రేడ్ చలంలో పెంపొందుతున్న రాజకీయ చైతన్యం ఆయనను సాధారణ జీవితం గడపడానికి అనుమతివ్వలేదు. ఆయనలో పోటెత్తుతున్న ఆలోచనలు ఆయనను నాలుగు గోడలకు పరిమితం కానివ్వలేదు. ఒక ఆయుర్వేద డాక్టర్ గా జీవితం ప్రారంభించగలిగిన ఆయన అందులో కొనసాగి స్థిర పడడానికి పూర్తి అవకాశాలు వుండే. కానీ, ఆయన ఆ స్వార్థపూరిత జీవితాన్ని త్యజించాడు. ఆయన జీవితం విప్లవానికే అంకితం అనుకున్నాడు. ఒక పార్టీ సభ్యుడిగా ఎదిగిన కామ్రేడ్ చలం తన భవిష్యత్ విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫలితంగా, 1982లో వృత్తి విప్లవకారునిగా రూపొందాడు. అప్పటికే తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో విప్లవకారులను బూటకపు ఎన్ కౌంటర్లలో కాల్చి చంపడం మొదలైంది. అలాంటి సమయంలో వృత్తి విప్లవకారులుగా జీవితాన్ని ఎంచుకొని, ఉద్యమబాట పట్టడం అనేక సవాళ్లతో కూడినది. అయినప్పటికీ, నెత్తురు మండే, శక్తులు నిండే యువత సహజంగానే ‘సబ్ కా బరీ నక్సల్ బరీ’ రాజకీయాలతో ప్రేరేపితులై కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగా పోరాటాలతో మమేకమవుతూ నిస్వార్థంగా, అత్యంత అంకితభావంతో విప్లవోద్యమానికే అంకితమైంది. అలా విప్లవోద్యమానికి అంకితమైన మన కామ్రేడ్ చలం, 43 సంవత్సరాలు తాను నమ్మిన రాజకీయాల కోసం, అవిశ్రాంతంగా పని చేశాడు. ఆ మార్గంలోనే ప్రజల కోసం తన ప్రాణాలను అర్సించాడు.
ఆనాటి విప్లవోద్యమం యువజన సంఘాలను నిర్మించి, ప్రజలను పోరాటాలలోకి సమీకరించడానికి చేస్తున్న కృషిలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం పార్టీ కామ్రేడ్ చలంకు విజయవాడ సెంటర్ గా బాధ్యతలు అప్పగించింది. 1983లో విజయవాడ కేంద్ర ఆర్గనైజర్(సీ.ఓ)గా ఆనంద్ పేరుతో కామ్రేడ్ చలం తన పూర్తి కాల రాజకీయ కార్యాచరణ ప్రారంభించాడు. విజయవాడలో సీపీఐ, సీపీఐ (ఎం)ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఉమ్మడి పార్టీ సీపీఐ విజయవాడలో భూ ఆక్రమణ వంటి వివిధ పోరాటాలు చేపట్టి ఉన్నది. వివిధ కార్మిక రంగాలలో యూనియన్ లు స్థాపించి ఉన్నది. పేదల పార్టీ ఎర్ర జెండా పార్టీ అనే గుర్తింపు పీడిత ప్రజలలో అపారంగా మిగిలి వున్న ఆ రోజులలో ఆ పార్టీల అసలు రంగును బైరంగం చేయకుండా, వారి రివిజనిజానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేయకుండా ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లడం అసాధ్యం. అందువల్ల పార్టీ ఈ సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తూనే, ప్రజలను సరైన రాజకీయాల వైపు ప్రజా పోరాటాల ద్వారా నడిపించే కృషి చేసింది.
విప్లవ పార్టీ నాయకత్వంలో కామ్రేడ్ చలం తన ప్రాంతంలోని విద్యార్ధి, యువజన, గుడిసెవాసులను సంఘటితం చేసాడు. 1980లో విజయవాడలో గుడిసెలలో జివించే పేద ప్రజలకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం పోరాటం నడిపించాడు. 1983లో కృష్ణా జిల్లాలో పేద రైతాంగాన్ని సిద్ధం చేసి లంకభూముల స్వాధీన పోరాటానికి మార్గదర్శకత్వం అందించాడు. విజయవాడ పట్టణంలో విప్లవ రాజకీయాలకు పరిచయం అయిన విద్యార్ధి యువజనులను ఈ పోరాటంలో భాగం చేసి, వారు పునాది వర్గాల సామాజిక స్థితిని తెలుసుకునేందుకు, తద్వారా తమ రాజకీయ అవగాహనను పెంపొందించుకునేందుకు వారి మధ్యకు వెళ్లి సమస్యలను అధ్యయనం చేసేందుకు కృషి చేసాడు. ఈ కృషి శ్రామిక ప్రజలతో, వారి సమస్యలతో విద్యార్థి, యువజనులు మమేకం కావడానికి ఎంతో తోడ్పడింది.
ప్రజా పోరాటాల ద్వారా పార్టీకి గుర్తింపును తెస్తూ, విప్లవ ప్రజలతో మమేకమవుతూ, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్న కామ్రేడ్ చలం 1986లో జిల్లా ఆర్గనైజర్ గా బాధ్యతలు స్వీకరించాడు. అదే సంవత్సరంలో మైలవరం గ్రామంలో మామిడితోట ఆక్రమణ పోరాటానికి మార్గదర్శకత్వం అందించాడు. జిల్లాలో వివిధ రకాల ప్రజా పోరాటాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్న కామ్రేడ్ ఆనంద్, తనకు అధ్యయనం, రచనా వ్యాసంగం, కళారంగం పట్ల ఉన్న ఆసక్తితో, రాష్ట్రంలో అలాంటి అన్ని రకాల వారికి ఒక ముఖ్య కేంద్రంగా వున్న విజయవాడలో సాహిత్య, కళా రంగాలలో అభిరుచి వున్నవారితో, అనుభవం వున్న వారి మధ్య సంఘటిత కృషి చేసాడు. తెలంగాణలో బలపడుతున్న విప్లవోద్యమంపై రాజ్య హింస విరుచుకుపడడంతో, అక్కడి నుండి పార్టీ ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులను తీసి ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరింప చేయడానికి పూనుకుంది. అందులో కొన్ని శక్తులు కోస్తా ప్రాంతానికి కూడ తరలివెళ్లాయి. కోస్తా ప్రాంతంలో పెంపొందుతున్న విప్లవోద్యమాన్ని సంఘటితం చేస్తూ పార్టీ ఎదిగివచ్చిన శక్తులతో జిల్లా కమిటీని ఏర్పర్చింది. అందుతో కామ్రేడ్ ఆనంద్ ఒక సభ్యునిగా బాధ్యతలు స్వీకరించాడు. 1987లో ఆంధ్రప్రదేశ రాష్ట్ర పార్టీ మహాసభ మొదలుకుని అన్ని మహాసభల్లోనూ ప్రతినిధిగా పాలు పంచుకున్నాడు. అప్పటికే విప్లవోద్యమంలో చేరి వృత్తి విప్లవకారిణిగా పనిచేస్తున్న కామ్రేడ్ బద్రిని 1986లో వివాహం చేసుకున్నాడు.
ఉద్యమం కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కూడాబలపడింది. ఈ జిల్లాల ఉద్యమాలను సమన్వయంతో నడిపుతూ, ఈ ప్రాంత ఉద్యమ నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ రీజనల్ కమిటీని ఏర్పరచింది. విప్లవ సైద్ధాంతిక, రాజకీయ అవగాహనతో వివిధ రంగాలకు, ప్రజా సంఘాలకు, పోరాటాలకు మార్గదర్శకత్వం అందిస్తూ అనుభవం గడిస్తున్న కామ్రేడ్ ఆనంద్ 1989 నాటికి ఈ రీజనల్ కమిటీలో భాగమయ్యాడు. రీజనల్ కమిటీ నాయకత్వం వహించిన గుంటూరు జిల్లాలోని దేవుడు మాన్యం భూముల పోరాటం, గిట్టుబాటు ధరల కోసం జరిపిన రైతాంగ పోరాటాలకు కామ్రేడ్ ఆనంద్ ప్రత్యక్ష మార్గదర్శకత్వం వహించాడు. నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు కూలి రేట్ల పెంపు కోసం పోరాటం నిర్వహించాడు. కోస్తా ప్రాంతంలో పెంపొందుతున్న ఉద్యమంతో పాటు, నల్లమల అటవీ ప్రాంతంలో గెరిల్లా దళాల నిర్మాణం ప్రారంభమై ఆంధ్ర ప్రదేశ్ విప్లవోద్యమంలో ఒక సమన్వయ కేంద్రంగా ముందుకు వచ్చింది. నల్లమల ప్రాంతంలో పెంపొందుతున్న విప్లవోద్యమానికి కామ్రేడ్ ఆనంద్ 1992లో నల్లమల డివిజన్ కార్యదర్శి బాధ్యతలు చేపట్టాడు.
నల్లమల డివిజన్ ఉద్యమానికి కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న కామ్రేడ్ ఆనంద్ ప్రమాదవశాత్తు 1994లో అరెస్టయ్యాడు. అప్పటికే విప్లవోద్యమంపై రాజ్యం నిప్పులు చెరిగే నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. అలాంటి నిర్బంధ పరిస్థితుల మధ్య అరెస్టయిన కామ్రేడ్ ఆనంద్ రెండు సంవత్సరాల పాటు రాజమండ్రి, నెల్లూరు సెంట్రల్ జైళ్లలో ఉన్నాడు. 1994-95 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో విప్లవకారుల నాయకత్వంలో చారిత్రాత్మక జైలు పోరాటం జరిగింది. ఆ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు తమ పూర్తి సంఘీభావాన్ని తెలుపుతూ ఖైదీల, విచారణలో కొనసాగుతున్న ఖైదీల న్యాయమైన సమస్యలపై దృఢంగా నిలిచి వారి డిమాండ్లను సమర్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న జైళ్లతో పోరాట సమన్వయం కొనసాగించడంలో భాగంగా కామ్రేడ్ ఆనంద్ తాను వున్న జైలులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో 12 రోజుల పాటు పాల్గొన్నాడు. జైలు పోరాటానికి పెద్ద ఎత్తున బయటి ప్రజల మద్ధతు లభించింది. న్యాయమైన తమ సమస్యలపై ప్రారంభమైన సమ్మె పోరాటం జయప్రదం అయింది. ఆ అనుభవంతో పార్టీ ముందు జైలు మాన్యువల్ ను కామ్రేడ్స్ రూపొందించి పెట్టారు. జైలు పాలయ్యే విప్లవకారుల ప్రవర్తనపై నియమాలతో కూడిన ఆ మాన్యువల్ ఇప్పటికీ ప్రామాణికంగా కొనసాగుతోంది. బెయిలుపై విడుదల అయిన తరువాత కామ్రేడ్ ఆనంద్ తిరిగి రహస్య జీవితానికి వెళ్లాడు. 1996 చివరి నుంచి నల్లమలలో 6 నెలలు ఉన్నాడు.
1997లో జాయింట్ రీజనల్ కమిటీ (జేఆర్ సీ) సభ్యునిగా గుంటూరు జిల్లా బాధ్యతలు నిర్వహించాడు. అదే కాలంలో ఏర్పడిన సౌత్ కోస్టల్ బెల్ట్ కమిటీ (ఎస్.సీ.బీ.సీ) బాధ్యతలు, కొన్ని ప్రజా సంఘాల బాధ్యతలు చేపట్టాడు. 2000లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో ప్రతినిధిగా పాలు పంచుకున్నాడు. ఆ మహాసభకు ఒక ప్రాధాన్యత వుంది. అప్పటికి ఏఓబీ ఉద్యమంగా ఒక స్పష్టమైన రూపం సంతరించుకున్న ఆ ప్రాంతం ఆ మహాసభలో ఒక స్వతంత్ర గెరిల్లా జోన్ గా ఉనికిలోకి రావడమే కాకుండా, విముక్తి ప్రాంత నిర్మాణ దిశలో తన వంతు కర్తవ్యాన్ని అది నిర్వర్తించడానికి ప్రత్యేక కర్తవ్యాలను చేపట్టింది. అది ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వంలో, ఆ తరువాత దండకారణ్యంలో, మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో భాగం కావడం, ఆ తరువాత ఇక స్వతంత్ర స్పెషల్ జోన్ గా తన అస్థిత్వాన్ని నిలుపుకోవడం అనే ఉద్యమ అభివృద్ధిని ఈ మార్పులు మన కళ్లముందు నిలుపుతాయి.
2004లో కామ్రేడ్ సుధాకర్, ప్రతినిధిగా పాలు పంచుకున్నాడు. ఆ తరువాత పార్టీ ఆయనను నూతనంగా ఏర్పడిన ఆంధ్ర-ఒడిశా స్పెషల్ గెరిల్లా జోన్ కు బదిలీ చేసింది. ఏఓబీ స్పెషల్ జోన్ బదిలీ అయిన కామ్రేడ్ సుధాకర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఎంపికై నూతన బాధ్యతలు స్వీకరించాడు. ఆయన కార్యదర్శిగా వుంటూ ప్రత్యేకంగా శ్రీకాకుళ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కామ్రేడ్ సుధాకర్ రెండేళ్ల కాలం కార్యదర్శి బాధ్యతలలో కొనసాగాడు. ఆ సమయంలో ఏఓబీలో జరిగిన అఖిల భారత సాహితీ-సాంస్కృతిక కార్యశాలలో పాల్గొన్నాడు. 2001 పార్టీ కాంగ్రెస్ లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన బీకే (అమరుడు వడ్కాపుర్ చంద్రమౌళి) సహ ఇతర కేంద్ర కమిటీ సభ్యులు సంధానకర్తలుగా సాగిన ఆ కార్యశాలలో, కామ్రేడ్ డప్పు రమేశ్ సహ అనేక మంది దేశ వ్యాపిత విప్లవ రచయితలు, గాయకులు, కళాకారులు అందులో పాల్గొన్నారు. కామ్రేడ్ సుధాకర్ కూడ అందులో పాల్గొని అక్కడ రూపొందించిన సాంస్కృతిక పర్ స్పెక్టివ్ పేపర్ ను సమృద్ధి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.మరోవైపు,ఏఓబీ జోన్ లో ప్రజా సంఘాల, ప్రజా రాజ్యాధికార అంగాల నిర్మాణంలో, సైనిక చర్యల పథక రచనలోను, నిర్వహణలోనూ భాగమయ్యాడుపీ.ఎల్.జీ.ఏ ను సాయుధంగా శక్తిమంతం చేయడంలో ఏఓబీ ప్రాంతంలో జరిగిన సఫల సైనిక చర్యలు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించాయి.
ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా మొదట కామ్రేడ్ బీ.ఎకే, ఆ తరువాత కామ్రేడ్ సుధాకర్ లతో పాటు కమిటీ సభ్యులు కామ్రేడ్ చలపతి సహ ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సైనిక చర్యల కోసం రెక్కీలు మొదలు రెయిడ్ లు సఫలం అయ్యేవరకు సదా స్మరణీయమైన పాత్ర పోషించారు. అంతే కాదు, దండకారణ్య విప్లవోద్యమంపై విరుచుకుపడిన శ్వేత బీభత్స సల్వాజుడం సమయం నుండి దాదాపు రెండు దశాబ్దాల కాలం ఏఓబీ ఉద్యమం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, కేంద్ర కర్తవ్య పరిపూర్తిలో (డీకేను విముక్తి ప్రాంతం చేయడం) భాగంగా శక్తి వంచన లేకుండా దండకారణ్య ఉద్యమానికి పూర్తి అండగా నిలిచింది.ఏఓబీకి అవసరమైన గెరిల్లా శక్తులను సమకూర్చడంలో దండకారణ్యం తన వంతు భూమిక అది పోషించి పరిసర జోన్ల మధ్య సంబంధాలను పటిష్టం, సమన్వయం చేయడంలో అది కీలకపాత్ర పోషించింది.
బేస్ ఏరియా నిర్మాణ లక్ష్యంతో దండకారణ్య విప్లవోద్యమం పని చేస్తున్న సమయంలో సీసీ అక్కడి అవసరాలను పరిపూర్తి చేయడానికి అనేక రకాల కృషి చేసింది. మరోవైపు, దెబ్బతిన్న తెలుగు ప్రాంతాల విప్లవోద్యమంలో అపార అనుభవం గడించిన విప్లవశక్తులను అవకాశం వున్నంత మేరకు కాపాడుకోవడానికి నిర్ణయాలు తీసుకుంది.మరోవైపు, దండకారణ్య అవసరాలను, మధ్య రీజనల్ అవసరాలను పరిపూర్తి చేసుకోవడంలో భాగంగా సీసీ చేసిన నిర్ణయం ప్రకారం, కామ్రేడ్ సుధాకర్ జంట దండకారణ్యం చేరుకుంది. 2008 వరకు కామ్రేడ్ సుధాకర్ పేరుతో ఏఓబీలో పని చేసాడు. ఈ సమయంలో 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పార్టీ జరిపిన చర్చలలో అమరుడు కామ్రేడ్ రామకృష్ణ (సాకేత్) నాయకత్వంలో ఏర్పడిన బృందంలో ఏఓబీ ప్రతినిధిగా పాలు పంచుకున్నాడు.
ఉద్యమ అవసరాల రీత్యా పార్టీ కామ్రేడ్ సుధాకర్ ను 2008లో క్రాంతి బాధ్యతలలోకి బదిలీ చేసింది. క్రాంతి పత్రిక నిర్వహణలో తెలుగు ప్రాంతాలలో ఎదురైన పలు సమస్యలను అధిగమించడానికి సీ.ఆర్.బీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏఒబీ రాష్ట్ర కమిటీల అధికార పత్రికగా క్రాంతి సీ.ఆర్.బీ ప్రభారీ కామ్రేడ్ ఆనంద్ (అమరుడు దూలాదా) ప్రధాన సంపాదకుడిగా, కామ్రేడ్ మిడ్కో (అమరురాలు కామ్రేడ్ రేణుక), కామ్రేడ్ సుధాకర్ సంపదకవర్గ సభ్యులుగా వెలువడడం మొదలైంది. క్రాంతి బాధ్యతలలోకి చేరిన కామ్రేడ్ సుధాకర్ తన పేరు గౌతంగా మార్చుకున్నాడు. కామ్రేడ్ గౌతం 2008 నుండ దాదాపు 17 సంవత్సరాల కాలం ఆ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా కొనసాగాడు. పత్రికను క్రమం తప్పకుండా తేవడానికి తన పూర్తి శక్తియుక్తులను వెచ్చించేవాడు. పత్రికను దీర్ఘావధితో తేవడం కాకుండా, తక్కువ సమయంలో, తక్కవు పేజీలతో, పాఠకులకు చేర్చాలనీ, మారుతున్న అంతర్జాతీయ, దేశ పరిస్థితులపై పాఠకులకు వెంట వెంట పార్టీ వైఖరి తెలుపుతుండాలనీ, సంపాదవర్గంలో చర్చించేవాడు. ఆయన పట్టుదలతో క్రాంతి పత్రిక గత నాలుగు సంవత్సరాలుగా త్రైమాసిక పత్రికగా వెలువడడం తెలిసిందే.
విప్లవోద్యమ అభివృద్ధిలో భాగంగా, కేంద్ర కమిటీ రెండు ప్రాంతీయ పాఠశాలలను ఏర్పర్చాలనీ 2008లొ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా, తూర్పు రీజియన్ లో ఒక పాఠశాల ఏర్పడగా, మధ్య రీజియన్ లో మరో పాఠశాల ఏర్పడింది. విప్లవోద్యమంలోని జిల్లా/కంపెనీ/డివిజన్ స్థాయి పార్టీ నాయకత్వ కామ్రేడ్స్ కు ఈ పాఠశాల వివిధ మార్క్సిస్టు విషయాలపై తరగతుల నిర్వహణకు పూనుకుంది. మధ్య రీజియన్ లో ఏర్పడిన పాఠశాలను రీపోస్ (రీజియన్ పొలిటికల్ స్కూల్)గా వ్యవహరిస్తూ కామ్రేడ్ భాగ్య (అమరురాలు కామ్రేడ్ మహిత) ను బాధ్యురాలుగా నియమించగా కామ్రేడ్ గౌతం పార్ట్ టైం టీచర్ గా అందులో చేరాడు. కామ్రేడ్ మహిత అమరురాలైన పిదప కామ్రేడ్ గౌతం క్రాంతి పత్రిక బాధ్యతలు నిర్వహిస్తూనే, రీపోస్ లో టీచర్ బాఢ్యతలు కొనసాగించాడు. చివరి వరకు కామ్రేడ్ గౌతం ఏఓబీ, తెలంగాణ, దండకారణ్యంలలో విస్తృతంగా పర్యటిస్తూ సీ.ఆర్.బీ మార్గదర్శకత్వంలో ఈ బాధ్యతలు నిర్వహించాడు. ఆయన అమరత్వానికి ముందు ఆయన తెలంగాణలో రాజకీయ తరగతుల నిర్వహణకు వెళ్లుతూ కగార్ దాడులు పెరగడంతో అక్కడికి చేరుకోలేక దారిలో నేషనల్ పార్క్ లో వుండిపోయాడు. అక్కడే కామ్రేడ్ గౌతం పోలీసుల దాడిలో తుదిశ్వాస విడిచాడు. కేడర్ లకు రాజకీయ తరగతులు బోధిస్తూ, వారి అభిమానాన్ని చూరగొని వారికి ప్రియమైనగౌతందాగా మారాడు. పార్టీ, ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించు కోవడానికి 2009లో చేపట్టిన దిద్దుబాటు ఉద్యమంలో, 2013లో చేపట్టిన బోల్షెవీకరణ కేంపెయిన్ లోనూ కామ్రేడ్ గౌతం భాగమై, కేడర్లకు విద్య గరపడంలో చాలా శ్రద్ధ పెట్టాడు.
కామ్రేడ్ గౌతం దండకారణ్యంలో వుంటూ తన విప్లవ బాధ్యతలు నెరవేరుస్తున్న క్రమంలో, ఆయన 2011, 2015లలో డీకే ప్లీనాలలో పర్యవేక్షకుడిగా పాల్గొన్నాడు. ఉద్యమంలో ఎదురవుతున్న సమస్యలను, వాటి పట్ల నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఒక పర్యవేక్షకుడిగా తన దృష్టిలో వున్న విషయాలను ఆయన నిర్మోహమాటంగా, వేదిక మీది నుండి వినిపించేవాడు. కామ్రేడ్ గౌతం మధ్య రీజినల్ బ్యూరో 2014లో రాష్ట్ర స్థాయి నాయకత్వ కేడర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నాడు. ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతినిధుల మధ్య నాయకత్వంతో పంచుకున్నాడు.
దండకారణ్యంలో చేపట్టిన బోల్షెవీకరణ కేంపెయిన్ సందర్భంగా నాయకత్వ కామ్రేడ్స్ గ్రామాల వర్గ సంబంధాలలో, ఉత్పత్తి విధానంలో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడానికి పూనుకున్నారు. వారితో పాటు కామ్రేడ్ గౌతం నేషనల్ పార్క్ ఏరియా లోని ఎడపెల్లి గ్రామాన్ని అధ్యయనం చేశాడు. ఆ గ్రామంతో కామ్రేడ్ గౌతంకు ముందు నుండి పరిచయం వుండడంతో, ఆ అధ్యయనం ద్వారా ఆ గ్రామం ఆధారంగా ఆ ప్రాంతంలోని ప్రజల ఉత్పత్తి విధానం, జీవన విధానంలో చోటుచేసుకుంటున్న మార్పులను పరిశీలించి తన పరిశీలనా నివేదికను సీ.ఆర్.బీకి అందించాడు. కామ్రేడ్ ఓ వైపు క్రాంతి పత్రిక బాధ్యతలు, మరోవైపు రీపోస్ టీచర్ బాఢ్యతలు నిర్వహిస్తూనే ఏ కొద్ది సమయం దొరికినా, ప్రజల మధ్యకు వెళ్లి వారి జీవితాలను, పోరాటాలను, ప్రజా నిర్మాణాలను అధ్యయనం చేసేవాడు. తన పరిశీలనా రిపోర్టును పై బాధ్యులతో పంచుకునేవాడు. తన రోజువారి జీవితంలో కూడ కామ్రేడ్ గౌతం వీలు చేసుకొని తన వెంట వున్నవారికివివిధ రాజకీయ సమస్యలపై వివరించేవాడు. ఇటీవలి కాలంలో, ఆయన ఓ సందర్భంలో, తను ఇంకా నడవగలననీ, తనకు పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవనీ, తన సేవలను పార్టీ ఉపయోగించుకోవడానికి తనను యంయంసీ, ఒడిశా ప్రాంతాలలో రాజకీయ తరగతుల నిర్వహణకు పంపితే వెళ్లగలననీ బాధ్యుల ముందు ప్రతిపాదించాడు. కానీ, ఆయనకు కగార్ దాడుల మధ్య ఆ అవకాశాలు చిక్కనే లేదు.
కామ్రేడ్ గౌతం 50 సంవత్సరాల జననాట్యమండలి సాంస్కృతికోద్యమ చరిత్ర రచనలో పాలుపంచుకున్నాడు. 2019 శిశిరంలో, మధ్య రీజినల్ బ్యూరో ఏర్పర్చిన డ్రాఫ్టింగ్ కమిటీలో కామ్రేడ్ గౌతం పాల్గొని తన అనుభవాన్ని అందిస్తూ, డ్రాఫ్టింగ్ కమిటీ చర్చలలో చురుగ్గా పాల్గొన్నాడు. అమరుడు డప్పు రమేశ్ తో తనకు వున్న అనుబంధాన్ని ఆ రచన సందర్భంగా గత జ్ఞాపకాలలోకి వెళ్లి పరస్పరం చర్చించుకునే రచనను సమృద్ధి చేయడానికి ఉపయోగిం చుకున్నారు. కామ్రేడ్ డప్పు రమేశ్ అనారోగ్యంతో అసువులు బాసిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన విప్లవ సేవలను ఎత్తిపడుతూ క్రాంతిలో జోహార్లు అర్పిస్తూ రాశాడు. విప్లవోద్యమానికి సానుభూతిపరులుగా, సహాయకులుగా వున్న వారి సేవలను ఆయన ఎప్పుడూ మరిచిపోకుండా, గుర్తు చేసుకుంటూ క్రాంతిలో వారి గురించి రాసేవాడు. తన ఇద్దరు కూతుళ్లను విప్లవోద్యమానికి అంకితం చేసి వృద్ధాప్యంలో కన్ను మూసిన కామ్రేడ్ కాకరాల సూర్యకాంతం గారి గురించి, కోడి రామస్వామి గురించి ఇలా అనేక మంది గురించి ప్రత్యేకంగా రాసేవాడు.
కామ్రేడ్ గౌతం, 2021 చివరి మాసాలలో కొరోనా బారిన పడ్డాడు. తనకు ఆ లక్షణాలు అర్థమైన వెంటనే తానే అందరికి దూరంగా విడిగా ఒక చిన్న టెంట్ వేసుకొని జబ్బు నయం అయ్యేవరకు గడిపాడు. ఆయన తన ఆరోగ్య విషయాలలో ఎంత జాగ్రత్తగా వుండేవాడో, తోటి కామ్రేడ్స్ అనారోగ్య విషయాలను పట్టించుకొని వైద్యం చేయడంలో ఒక ప్రజా డాక్టర్ గా, చాలా శ్రద్ధగా వుండేవాడు. ఆయన గత నాలుగేళ్లుగా బీపీ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ, అది ఎప్పుడూ ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా తయారవలేదు. ఇక, మలేరియా మద్య మధ్యలో పలకరించడం అడవిలో అందరిలాగే ఆయనకు తప్పేది కాదు. విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో, వివిధ రంగాలలో బాధ్యతలు నిర్వహించిన కామ్రేడ్ గౌతం అమరత్వంతో పార్టీ ఒక అనుభవ సంపన్న కామ్రేడ్ ను కోల్పోయింది. ముఖ్యంగా పార్టీ తన గత తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి పూనిన సమయంలో ఇలాంటి కామ్రేడ్స్ అమరత్వం ఆ క్రమానికి పెద్ద లోటుగానే మిగిలింది.
అమరులయ్యే వరకు కామ్రేడ్ గౌతం క్రాంతి, రీపోస్ బాధ్యతలలో కొనసాగాడు. ఆపరేషన్ కగార్ లో కష్టనష్టాలకు వెరవకుండా ఈ బాధ్యతలను కొనసాగించాడు. కామ్రేడ్ గౌతం దృఢ సంకల్పం, రాజకీయ అవగాహనా ఆయన అమరత్వం అనంతరం కూడా కేడర్ లకు రాజకీయాలు బోధిస్తూనే ఉంటాయి, ఆదర్శంగా నిలుస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్బంధం తీవ్రతరం అయ్యాక 1991లో నల్లమలలోను, 1992లో వెలుగొండలోను, 1993లో భైరవకోనలలో ఎదురుకాల్పులు జరిగి నప్పుడు కామ్రేడ్ సుధాకర్ శత్రువుతో పోరాడుతూ సురక్షితంగా తప్పుకున్నాడు. మరోవైపు కరువుతో బాధపడుతున్న ప్రజల అవసరాల నేపథ్యంలో రైతాంగాన్ని, ఇతర శ్రామిక ప్రజలను సమీకరించి చేపట్టిన కరువు దాడులలో, భూస్వాములపై చేసిన దాడులలో కామ్రేడ్ ఆనంద్ పాలు పంచుకున్నాడు.
2005లో కోరుకొండలో ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నాడు. 2006లో విజయనగరం జిల్లాలో మిత్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు, సమాచారం తెలుసుకుని శత్రువు ఆయనను ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించాడు. హఠాత్తుగా చుట్టుముడుతున్న శత్రు బలగాలను గమనించి, ఒక్క ఉదుటున లేచి, తన తుపాకిని పట్టుకోబోతున్న పోలీసులతో పోరాడి, కాల్పులు జరుపుతూ తప్పించుకున్నాడు.
కామ్రేడ్ సుధాకర్, దండకారణ్యానికి చేరిన తరువాత అనేక సందర్భాలలో పోలీసుల దాడి నుండి తృటిలో తప్పుకున్నాడు. కగార్ చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులు ప్రారంభమయ్యాక ప్రభుత్వ సాయుధ బలగాల వలయాల నుండి గెరిల్లాల రక్షణలో తప్పుకున్న ఘటనలున్నాయి. కానీ, 2025 జూన్ 5-7 మధ్య తప్పుకునే ప్రయత్నంలో శత్రువ వలయంలో చిక్కుకొని సజీవంగా పోలీసుల చేత చిక్కి అమరత్వాన్ని ఆస్వాదించాడు. ఆ అమరుడి సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవాలు భవిష్యత్ విప్లవకారులకు, గెరిల్లాలకు అనేక గుణపాఠాలను అందిస్తాయి. ఆయన ఆదర్శాలు విప్లవోద్యమ చరిత్ర పుటలలో రక్తాక్షరాలతో నిలిచిపోయాయి. త్యాగం మహోన్నతమైనది. విప్లవంలో త్యాగాలు వ్యక్తుల జీవితాలను సదా వెలుగొందింపచేస్తాయి. కామ్రేడ్ తెంటు లక్ష్మీ నరసింహాచలం ఆనంద్ గా, సుధాకర్ గా, గౌతంగా వివిధ పేర్లతో విశాల ప్రజలకు పరిచయమై మృత్యుంజయుడైనాడు.