ఇట్లా వాణిజ్య రాజధాని మీదికి జనం 
ఎప్పుడొస్తారు వానవలె

వలస కూలీలుగా కాదు
కోలీలు1గా కార్మికులుగా
కోస్టల్ కారిడార్ కోసం నిర్వాసితులై కాదు
ఈ సముద్రమూ సముద్రంలోని సరుకులూ మావే
అని స్వాధీనం చేసుకోవడానికి
కార్పొరేట్ కాలుష్య మబ్బులు అని
క్లౌడ్ బర్స్ట్స్ కాదని హెచ్చరిస్తూ

మీ అక్రమ నిర్మాణాల వలన మావాళ్లే చావడానికి కాదు
చెట్లు కూలిపోవడానికీ కాదు
ఆదివాసులను చంపి
వాళ్లు కళ్లల్లో పెట్టుకున్న మనుషుల్ని చంపి
అడవితల్లి గర్భం నుంచి పుట్టుకొచ్చి ఇంకా పేగుబంధం తెగని
లక్షలాది చెట్లను నరికే గఢ్ చోరీలు
ఉక్కుచెట్లను నాటితే అడవెక్కడికి పోవాలి మరి
నదులై మహానగర రోడ్లనే ముంచెత్తుతున్నది.

పల్లెల్లోని రైతాంగమంతా ఢల్లీలో
ఒక బహదూర్షాను పెట్టుకొని
కంపెనీ మీద యుద్ధానికి తమ బిడ్డల్ని పంపింది
మోషా(సా)ల ఫాసిస్టు పాలన కోసం కాదు

ప్రకృతి లోనికి అధికృత వికృతి చేరింది
వానకు తడవకుండా న్యూక్లియర్ అంబ్రెల్లా
అణువిస్ఫోటన గొడుగు పట్టుకుంటే ఎట్లా`
వానలనే కాదు - గ్లోబల్ వార్మింగూ అంతే`
నదులనడ్డుకుంటే వరదలొస్తాయి
నగరాల్లో తమ ఉనికిని కోల్పోయిన చెరువులన్నీ
తమ వేళ్లు తెగిపోయిన తోటలన్నీ
మూసేసిన మూసీలు
ఓపెన్ కాస్ట్లయిన లోయలు
దండకారణ్యంలో ఇపుడే పేరు చెప్పూ
నదులన్నీ రక్తనదులయ్యాయి
రాముని ఆకలి
శబరి ఊది ఇచ్చే రేగుపండ్లతో
తీరేది కాదు
ఇపుడు గడ్చిరోలీ నుంచి మాడ్ దాకా
అడవి మీద కగార్ ఆక్రమణ యుద్ధానికొచ్చాడు

దీపాలు వెలిగించుకునే రోజుల్లో
ఉరుము ఉరిమి, మెరుపు మెరిసీ
గాలివాన తోసుకొని వస్తే చీకటయి
మా అమ్మ జీమూతం కమ్మిందనేది -
ఇపుడన్నీ పాతాళాలు తవ్విన ఖనిజధూళి`
ఆకాశహర్మ్యాలు కట్టిన విధ్వంస నిర్మాణధూళి -
చమురుబావులు తవ్వి
యంత్రాలు ఒళ్లెరుగకుండా తాగి
రోడ్లన్నీ జామ్ అయిపోతే
చమురులో తడిసిన సిమెంటు
తారు, రాయి, మట్టి... మిశ్రమధూళి
సముద్రం అలలు ఆవిరయి, మేఘమై
స్వాతిముత్యాలు కురిసే వాన ఎక్కడ -
తెలతెలవారున బాలసంత బుడుబుడుక్కులు ఎక్కడ
కవిచిప్పలెక్కడ, ఫకీర్చిప్పలెక్కడా
కవి చిప్పుల్లో దారితప్పాడు
సూఫీగానం డిజె రణగొణధ్వనుల్లో కలిసిపోయింది
ఆజాన్లు అల్లాకే నామ్లు
దేవులాటలు వీధుల్లోకి వచ్చి
కొట్లాటలుగా మారిన ద్వేషభక్తి గానంతో మూగవోయాయి

బొంబాయి ముంబైగా మారినాక
మరాఠీ కోసం థాకరేలు కలిసినా
బిజెపి హిందుత్వ ముందు వెల్లకిలా పడ్డారు
ప్రేమలన్నీ లవ్జిహాదీ శిక్షలకు బలి అయ్యాక
చొరబాటుదారులనరికట్టే
ఆగస్ట్ 15 ఆర్ఎస్ఎస్ పాంచజన్యం విన్నాక
ఇంక బంగాళాఖాతం నుంచి
రవీంద్రుని సోనార్ బంగ్లాయే పరాయిభాష అయినపుడు
నజ్రుల్ ప్రేమార్పణం
విరిగిపోయిన పిల్లనగ్రోవి అవుతుంది.
అరేబియా సముద్రంలో కరాచీ దగ్గర
సాదత్హసన్ మంటో వదిలిన కాగితప్పడవ
బొంబాయిలో శ్యాంకెప్పుడూ చేరదు

తిరుగుబాటు కవులు, కళాకారులు చచ్చిపోయారు
తీరాలు కారిడార్లయ్యాయి
దేశాల సరిహద్దుల్లో
తోబాటేక్సింగ్లు తప్పిపోయారు
పృధ్వీ స్టూడియోలు, మహబూబ్ స్టూడియోలు మూతపడ్డాయి
షారూఖ్ఖాన్లు జాతీయ అవార్డులు
పంచుకోవడానికి రాజీ పడుతున్నారు.
బాలీవుడ్ సినిమా ఇప్పుడు
కశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ విషం చిమ్ముతున్నది
దళిత్ పాంథర్స్ దారిచూపి తప్పుకున్నారు
నయీ పీష్వాయీ నహీచలేగా -
ఫూలే వేదికపై ప్రతిజ్ఞ చేయించిన
రిపబ్లిక్ పాంథర్స్కు
అప్రూవర్లమయి ద్రోహం చేయలేమన్నందుకు
కబీర్ కళామంచ్ కటకటాల పాలయింది
1947 వికసిత భారత్కన్నా
మరో పదేళ్లు అడవిని లాయిడ్స్కు రాసిచ్చిన ఫడ్నవీస్
ఇపుడిరక అదానీ అంబానీల రక్షణకై
అర్బన్ మావోయిస్టు చట్టాలు తెచ్చాడు.
అమెరికాకు దొరకకుండా అదానీని దాచిపెట్టాడు

సముద్రతీరాలన్నీ అదానీ పోర్టులయ్యాక
మత్స్యకారులకు వలలెక్కడ?
అయినా సముద్రాల్లో చేపలెక్కడ?
తీరాల పొడుగునా పల్లెకారులు బెగ్గంపాడయ్యారు
గాలి గాలికాదు మబ్బు మేఘం కాదు
ధూళి మట్టి కాదు నీరు ఆవిరికాదు
ఇంక వానెట్లా స్వచ్ఛమైన చినుకవుతుంది
ఇదివరకెప్పుడూ నది నడత తప్పి వరద కాలేదని కాదు -
సముద్రం వశం తప్పి ఉప్పెనో తుఫానో కాలేదని కాదు`
ఇప్పుడిది హోలో కాస్ట్
ఇది జెనోసైడ్
ఇది గాజా మీద విస్తరించిన
సామ్రాజ్యవాద ఆక్రమణయుద్ధం -

ఇక్కడ అమెరికా, ఇజ్రాయిలీ ఆయుధ సంపత్తికి
సేవలు చేస్తున్న సైబర్ కంపెనీల విజ్ఞాన పరిశోధనలు
వెంపటాపు సత్యం నుంచి నాదెళ్ల సత్యం దాకా
సత్యానికి ఎంత వ్యత్యాసమొచ్చినా
ఏ త్యాగమూ వృధాకాదన్న బసవరాజు
మరణవాంగ్మూల భరోసా ఉన్నది
అడవి చీకట్లను తేజోవలయాలు చేసిన మిడ్కో
మింటితారవలె అడవిలో అంగారవల్లరి అయింది
మాడ్ నుంచి విప్లవ మార్గాలు వేసిన ఊర్మిళ
కొత్తబంగారు లోకాన్ని నిర్మిస్తూ భూమిక
విప్లవయోధుడు సహచరుడు చలపతిని కోల్పోయినా
అప్రతిహతంగా పోరాడి అమరురాలైన అరుణ
ఇవ్వాళ విప్లవ రేలాగానాల గాథలయ్యారు -
వియ్యుక్కలయ్యారు
ఆదిలాబాదు అడవి అంచున ఆడెల్ భాస్కర్
మట్టి రగిలించిన మంటలజెండా
నల్లమల నుంచి దండకారణ్యం దాకా
నలభై ఏళ్ల స్వప్నాలు వెలిగించి
అమరుడై తిరిగొచ్చిన చిన్నన్న
తెరచుకున్న కళ్లచూపు దారి ఉన్నది

‘‘మీ నమ్మకాలను మావిగా జేసుకుంటాం
మీరు నేలకొరిగిన చోట
మేము మరిన్ని విశ్వాస విత్తనాలు నాటుతాం
మీరు నిద్రించిన నిశిలో
మేము ఒక ప్రచండ రవ్వను
వెలిగిస్తాం
మీ పేరునే కర్తవ్యానికి పిలుపుగా మారుస్తాం
మీ స్ఫూర్తిని
ఒక తేజోమయ జ్వాలగా వెలిగిస్తాం
మీ త్యాగం సుత్తీ-కొడవలి సంకేతమవుతుంది’’2

ఆహారసహాయం ఆయుధంతో కలిసి వస్తున్నదని
తెలియక కాదు
తెగిస్తున్న పాలస్తీనా పిల్లలు తల్లులు -
నెతన్యాహు ఆయుధంకన్నా బలమైంది ఆకలిపోరు
ఆగదు ఆగదు ఆగదు ఈ ఆకలిపోరు ఆగదు
ధరాలీ నుంచి, ఉత్తరకాశీ నుంచి
కశ్మీర్ నుంచి మహారాష్ట్ర దాకా క్లౌడ్ బర్స్ట్స్లే రానీ
జార్ఖండ్ నుంచి బస్తర్ దాకా
కగార్ ఆక్రమణ యుద్ధమే రానీ
నేనేమీ అద్వైతం చెప్పడం లేదు -
అబద్ధం చెప్పడం లేదు
అబద్ధం చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ కాను
ఎన్నికల బహిష్కరణ ఎదురీత రాజకీయాలు చెప్పేవాణ్ని
శంకరాచార్య మాయావాదం చెప్పడం లేదు
మార్కెట్ సరుకుల ఆకర్షణ మాయల గురించి చెప్తున్నాను

కార్పొరేటీకరణ కోసం జరుగుతున్న
సైనికీకరణ గురించి చెప్తున్నాను -
ఫాసిజాన్ని సంస్కృతీకరించిన దళారీ
సనాతనధర్మం గురించి చెప్తున్నాను -
నాలుగుకాళ్ల నడిచేధర్మం
న్యాయం కాదని చెప్తున్నాను
అది అధికారదర్పం అని చెప్తున్నాను
ఈ మేఘం వసంతమేఘం కాదు -
ఇది ఖనిజరజం నుంచి
చమురుదాహం నుంచి
అణు రజస్తమో గుణాలతో ఆక్రమణ స్వార్థం
మరణశయ్యపై శవసంస్కృతిని కాపాడే
పర్యావరణ కాలుష్య ధర్మమని చెప్తున్నాను

ఆరె అడవుల లోయలలో చెట్లు నరకగా
మిగిలిన కాలిబాటల నుంచి
సంజయ్ గాంధీ నేషనల్పార్క్లో పునరాసావితులైన ఆదివాసుల నుంచి
నేషనల్పార్క్లో మాడ్లో, రంపచోడవరంలో
అమరులైన మావోయిస్టుల ఆశయాల
సాక్ష్యంగా చెప్తున్నాను
అంతిమవిజయం ప్రజలదేనని
ప్రకృతిని వికృతం చేసే
స్వార్థం మొనోపలీ సంక్షోభాన్ని ఎదుర్కొని
ప్రజాయుద్ధం
ఆటుపోటుల త్యాగాలతో
శాశ్వతశాంతిని సాధిస్తుందని-

అపుడు చినుకు చినుకుల వాన
చిట్టారి వానలుంటాయి
వాటిలో తేలిపోయి పిల్లలొదిలే
కాగితపు పడవలుంటాయి
నదులు దాటించే తెప్పలుంటాయి

తియనన్మెన్ స్క్వేర్లో
ప్రజావిప్లవ విజయాన్ని ప్రకటిస్తూ
అమరుల స్మరణలో కన్నీళ్లు పెట్టిన
మావో శిరసుపై గొడుగుపట్టే చౌఎన్లై ఉంటాడు -
ఎందుకంటే ఎదురుగా
ప్రజావిజయ అరుణపతాకం ఉంటుంది
అమరుల స్థూపం ఉంటుంది
జనసముద్రం గెలుచుకున్న
జనతన సర్కార్ ఉంటుంది
ఇది నాస్టాల్జియా కాదు సొలాస్టాల్జియా కాదు
విప్లవ గతితర్కం సాయుధం శాంతిస్వప్నం

1. ద్వీపాల సముదాయం ముంబైలో మూలవాసులు, సముద్ర తీరవాసులు (నేటివ్స్)
2. ఒక ఉద్దరింపు

ఆగస్టు 20, 2025

Leave a Reply