పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు.

దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో వచ్చే పర్యాటకులకు “మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు” అనే తమ సందేశాన్ని అందించడానికి డజన్ల కొద్దీ జేనుకురుబ ప్రజలు నాగరహొళె టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం దగ్గర వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని నిలబడి ఉన్నారు:

నాగరహొళె పులులను చూస్తారని పర్యాటకులకు హామీ ఇచ్చే సఫారీ పర్యటనలను ఆపడం వారి లక్ష్యం;  అటవీ సంరక్షణ పేరుతో తమను తరిమికొట్టిన పూర్వీకుల స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగించారని జేనుకురుబలు అంటున్నారు.

కర్ణాటక అటవీశాఖ, కర్ణాటక రాష్ట్ర పులుల సంరక్షణ దళం (ఎస్టీపీఎఫ్) లకు చెందిన 120 మంది అధికారులు నిరసన ప్రదర్శన నిర్వహించకుండా అడ్డుకున్నారు.

1980లలో నాగరహొళె అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్‌‌గా ప్రకటించినప్పుడు భారతదేశంలోని “షెడ్యూల్డ్ తెగలలో” ఒకటైన జేనుకురుబ లేదా అటవీ తేనెను సేకరించడంలో ప్రసిద్ధి చెందిన ఆదివాసీలను అక్కడి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. ఇఆలా చేయడం వల్ల తాము తమ ఇళ్లను, పవిత్ర స్థలాలను కోల్పోయామని, తక్కువ జీతంతో పని చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయమేదీ లేకుండా పోయిందనీ అంటున్నారు.

దశాబ్దాలుగా విఫలమైన చట్టపరమైన పోరాటాల తర్వాత, డజన్ల కొద్దీ ఉన్న కుటుంబాలు ఇక పరిష్కారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి: వారు తమ స్వంత భూమిలో మకాం వెయ్యాలని, పగటిపూట వచ్చే  ప్రయాణీకులని పికెట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

“మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయించి, మా హక్కులను ఏకపక్షంగా తిరస్కరిస్తున్నప్పుడు పర్యాటకులను అడవుల్లోకి ఎలా తీసుకెళ్తారు?” అని నిరసనల్లో పాల్గొన్న జేను కురుబ కార్యకర్త జె.ఎ. శివు ప్రశ్నిస్తున్నారు.

“ఇది అటవీ సంరక్షణ కాదు – ముసుగులో డబ్బు సంపాదించడం” అని శివు అంటున్నాడు. అతను సముదాయ పరిరక్షణ నమూనాలను సవాలు చేసే స్థానిక ప్రజల కూటమి అయిన ( కమ్యూనిటీ నెట్‌వర్క్ ఎగైనెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (సిఎన్‌ఎపిఎ)లో సభ్యుడు.

45 సంవత్సరాల క్రితం కరడికల్లు అట్టూరు కొల్లి గ్రామం నుండి తన కుటుంబం నిర్వాసితులైన తర్వాత శివు కాఫీ తోటలో ఎక్కువ గంటలు పని- తక్కువ జీతంతో గడిపే వారి ఇంట్లో పుట్టాడు.

మే నెలలో, అటవీ సంరక్షణ అధికారులనుంచి  ప్రతిస్పందన లేకపోవడంతో తిరిగి వచ్చి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్న తెగకు చెందిన దాదాపు 150 మందిలో అతను కూడా ఉన్నాడు. శివు, అతని తోటి జేను కురుబ ఉద్యమకారులు ఇప్పుడు మూడు నెలలుగా అడవిలో మకాం వేశారు.

అన్ని చట్టపరమైన విధానాలను పాటించినప్పటికీ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ FRA మూడు నెలల నోటీసు వ్యవధిని ఉల్లంఘించిందని వారు ఆరోపించారు. థుండుముండగే కొల్లీ గడ్డెహడి, కాంతూరుహడి (బ్రహ్మగిరి పురా), కరాడికల్లూ హట్టూర్కోల్లిహడి, బాలేక్కోవూహడి నివాసితులు కూడా తమ వ్యక్తిగత అటవీ హక్కులు (ఐఎఫ్ ఆర్), కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ (సిఎఫ్ ఆర్) కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ (సిఎఫ్ ఆర్ ఆర్) ల గుర్తింపు కోసం ఇటీవల దరఖాస్తులను సమర్పించారు.

2021 నుంచి పెండింగ్ లో ఉన్న వ్యక్తిగత అటవీ హక్కులు (ఐఎఫ్ ఆర్), కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ (సిఎఫ్ ఆర్), కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ (సిఎఫ్ ఆర్ ఆర్) ల కోసం తమ దరఖాస్తులను దాఖలు చేశారని ఆదివాసీ  కుటుంబాలు వాదించాయి. పంచాయతీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీ విభాగాల అధికారులను కలిసి విజ్ఞప్తి పత్రాలను ఇచ్చి, జిపిఎస్ సర్వేలతో సహా ఉమ్మడి ధృవీకరణలను చేపట్టినప్పటికీ, వారి వాదనలు తిరస్కరిస్తూనే ఉన్నాయని సిఎన్ఎపిఎ తెలిపింది. నిబంధనల ప్రకారం, మూడు నెలల్లోగా వాదనలకు సమాధానం ఇవ్వాలని అటవీ శాఖ భావిస్తున్నట్లు సిఎన్ఎపిఎ పేర్కొంది. “నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అటవీ శాఖ” అని వారు అన్నారు.

అయితే, అటవీ శాఖ ప్రకారం, అడవిలోకి ప్రవేశించిన వారు అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఎ) కింద ఇప్పటికే తిరస్కరించబడిన వ్యక్తులు. మైసూరు అటవీ సంరక్షకురాలు మలతి ప్రియా “అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన వారి ఎఫ్ఆర్ఎ వాదనలను అటవీ హక్కుల చట్టం కింద తిరస్కరించారు. ఇప్పుడు వారు మనల్ని ఆ వాదనలను పునః పరిశీలించమని కోరుతున్నారు” అని అంటున్నారు.

“అటవీ హక్కుల చట్టం మాకు హక్కులు ఇవ్వదు, కానీ మా అటవీ భూమిపై మాకు ఇప్పటికే హక్కులు ఉన్నాయని ధృవీకరిస్తుంది. అందువల్ల, మేము మా హక్కులను నొక్కి చెబుతాము; మాతో మాట్లాడాలనుకునే ఏ అధికారి అయినా, ఇక్కడ కరాడికల్లాకు వచ్చి మా గ్రామ సభలో మాతో మాట్లాడాలి. మా గ్రామ సభ దృఢంగా నిలబడటాన్ని కొనసాగిస్తుంది. అటవీ శాఖ మమ్మల్ని ఆక్రమణదారులు అని పిలవడం, మమ్మల్ని మా భూముల నుంచి తరిమికొట్టడం వంటి ప్రయత్నాలను అడ్డుకుంటాం.

అడవి ఒక జీవి, మనం దాని పొడిగింపు. “అది మనలో నివసిస్తుంది, మనం దానితో జీవిస్తాము అని కరాడికల్లూ అటవీ హక్కుల కమిటీ (ఎఫ్ఎఆర్‌సి) అధ్యక్షుడు జేఏ శివు అంటున్నారు.

తన ప్రజలు ఎల్లప్పుడూ వన్యప్రాణులతో సామరస్యంగా జీవించారని, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు వంటి దేవతలపై ఆధారపడిన మతపరమైన వ్యవస్థతో జీవించారని; జననాలు, మరణాలను గుర్తించే వేడుకలతో సహా వారి సాంప్రదాయ పద్ధతులు అటవీ వాతావరణంలో వేళ్ళూనికొని ఉన్నాయని, అక్కడకి వెళ్లడానికి అధికారులు తరచుగా అడ్డుకొంటారని ఆయన చెప్పారు.

జెను కురుబా నాయకుడు జెకె పుట్టి “ఈ సమస్య సామాజిక న్యాయానికి సంబంధించింది అయితే, ప్రభుత్వం దీనిని శాంతి, భద్రతల సమస్యగా చూస్తోంది. వందలాది మంది అధికారులు, పారా మిలిటరీ దళాల నియామకం మనల్ని భయపెట్టడానికి, బెదిరించడానికి మాత్రమే ఉన్నది. కానీ ఈసారి మేం వెనక్కి తగ్గడం లేదు, మా పూర్వీకుల ప్రాంతాన్ని వదిలిపెట్టడం లేదు” అని అన్నారు.

నాగర హొళె అభయారణ్యంలో భూమిపైన జేను కురుబలకు ఉండే చట్టపరమైన హక్కు భారతదేశం అటవీ హక్కుల చట్టం- 2006 పైన ఆధారపడి ఉంటుంది, ఇది దేశంలోని స్వదేశీ ససముదాయాలకు మునుపటి అటవీ పరిరక్షణ ప్రాజెక్టుల ద్వారా నిరాకరించిన అటవీ భూమి, వనరులలో నివసించే, వాటిని నిర్వహించే హక్కు ఉందని గుర్తిస్తుంది.

కానీ ఈ హక్కులను చట్టపరంగా పొందే ప్రయత్నాలు విఫలం కావడంతో, తామే పరిష్కారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తిరిగి రావాలని నిర్ణయించుకున్నామని అన్నారు.

“అటవీ శాఖ మమ్మల్ని ఆక్రమణదారులమని అంటుంది కానీ నిజమైన ఆక్రమణదారులు ఎవరు? మా భూమిని దొంగిలించి రిసార్ట్‌లను ఏర్పాటు చేసిన వారు. వారు మా భూములలో టైగర్ సఫారీలు నిర్వహిస్తున్నారు,” అని శివు చెప్పారు.

“ఇక్కడ పులులను చూడటానికి వివిధ నగరాలు, దేశాల నుండి ప్రజలు వస్తారు; వారికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అందుకోసం మా భూమిని  దొంగిలిస్తున్నారు; మమ్మల్నే ఆక్రమణదారులని అంటున్నారు. ఇది అటవీ పరిరక్షణకు సంబంధించిన అతిపెద్ద అబద్ధం.”

శివు లాగే, చాలా మంది నిర్వాసితులైన జేను కురుబలను అడవి చుట్టూ ఉన్న కాఫీ తోటలలో కూలీ పనిచేసే స్థితికి నెట్టారు.

“రాత్రిపూట మా పూర్వీకుల భూములను తొలగించి, మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టారు,” అని కాఫీ తోటలో జన్మించిన శివు చెప్పారు. “ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు – పిల్లలు, తండ్రి, తల్లి, తాత – కాఫీ తోటలో పని చేస్తారు.

 “మేము ఆదివారాల్లో కూడా ఉదయం 10 గంటల కల్లా పనికి వెళ్ళాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పటికీ బలవంతంగా పని చేయిస్తారు.

నాగర హొళె పరిరక్షణ మండలంలో ఎవరైనా స్థిరనివాసాన్ని ఏర్పాటుచేసుకోవడాన్ని వ్యతిరేకించిన అధికారులు, జేను కురుబలు మకాం వేసిన  దాదాపు ఒక నెల తర్వాత జూన్ 18న రిజర్వ్‌లోకి వెళ్లి ఆరు గుడారాలను కూల్చివేసారు.

గ్రామస్తులు-  అధికారుల మధ్య ఇకపై నిర్మాణాలు ఏర్పాటు చేయకూడదని ఒప్పందం కుదిరిన తర్వాత వాటిని వేసుకున్నారు  కాబట్టి వాటిని తొలగించారని; “అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసుల హక్కును నేను సమర్థిస్తాను, కానీ కోర్ వన్యప్రాణుల అంతర్భాగంలో మరిన్ని నిర్మాణాలను ఏర్పాటు చేయడం మంచిది కాదు. తగిన ప్రక్రియను అనుసరించమని వారిని ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ”అని కర్ణాటక రాష్ట్ర పార్లమెంటులో స్థానిక ప్రతినిధి ఎ.ఎస్. పొన్నన్న చెప్పారు.

ఆ స్థలంలో ఉన్న కుటుంబాలు ఇప్పుడు అప్పీళ్ల ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. తుది నిర్ణయం తీసుకునే వరకు ఆ సముదాయాన్ని ఖాళీ చేయించకూడదని, మరిన్ని ఆశ్రయాలను కూడా నిర్మించకూడదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది.

అనేక దర్యాప్తులు జరిగాయని, కానీ ఆ స్థలంలో ఆదివాసీల గ్రామం ఉందనే వాదనలు నిరాకరణకు గురయ్యాయి… అటవీ హక్కుల చట్టం భూమిని మంజూరు చేసే చట్టం కాదు; భారతదేశంలో పర్యావరణపరంగా సున్నితమైన అడవులను భూమిలేని ప్రజలకు మంజూరు చేయడానికి ఉపయోగించకూడదు…ఇంతకు ముందు ఆ అడవిలో ఎన్నడూ నివసించని ప్రజలకు మీరు అటవీ హక్కులను గుర్తించలేరు” అని నాగరహొళె టైగర్ రిజర్వ్ అధికారిణి అనన్య కుమార్ అన్నారు.

అడవిలో పర్యావరణ పర్యాటక పథకాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయని, అడవిలోకి ప్రవేశించగల వాహనాల సంఖ్యపై నియంత్రణలు ఉన్నాయని, ఆదాయం అటవీ పరిరక్షణ కృషికి వెళుతుందని జోడించారు.

అయితే, జేను కురుబ తెగకు చెందిన వారి దగ్గర 1965 నాటి ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయని, వారు తమ నివాసాలు, పుణ్యక్షేత్రాలు ఉన్న అడవిలోని ఖాళీలను చూపించారని, వారు తమను తొలగించిన తర్వాత భూమి చెట్లతో నిండిపోయే ముందు ఉందని చెబుతున్నారు.

వారు 1965 నుండి ఉపగ్రహ చిత్రాలను కలిగి ఉన్నారు, ఇది వారి గృహాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్న అటవీ ప్రాంతంలో వారి తొలగింపు తర్వాత భూమి చెట్లతో మునిగిపోయే ముందు.

వారి దగ్గర 1965 నాటి ఉపగ్రహ (సెటిల్లైట్) చిత్రాలు ఉన్నాయి. అంతకు ముందు వారి పవిత్ర స్థలాలు, ఇల్లు ఉన్న ప్రాంతాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఖాళీచేసిన తరువాత అక్కడ చెట్లు  పెరిగాయి.

ఆ గ్రామాన్ని గతంలో ప్రభుత్వం గుర్తించిందని రుజువు చేసే పత్రాలను వారు అధికారులకు పంపారు; వాటిలో మరణ ధృవీకరణ పత్రాలు, పాఠశాల రికార్డులు, రేషన్ కార్డులు, అడవి నుండి తేనె సేకరించడానికి అధికారుల నుండి పొందిన అనుమతులు ఉన్నాయి.

నాగర హొళెలో నిర్వాసితులైన జేను కురుబ తెగకు చెందిన వారిని “ప్రధాన బాధితులు”గా వర్ణిస్తూ కర్ణాటక రాష్ట్రం నియమించిన 2014 నివేదిక కూడా వారి కేసుకు మద్దతు ఇస్తుంది. “అదృశ్యమైన” గ్రామాలు ఉన్నాయని, ఆ సమయంలో వాటి జనాభా తక్కువగా ఉండటం, మారుమూల ప్రాంతాలు ఉండటం వల్ల వాటి పేర్లు నమోదు చేయలేదని కూడా నివేదిక ఎత్తి చూపింది.

అటవీ హక్కుల చట్టం కింద తమ భూమికి తిరిగి వచ్చే హక్కును సాధించుకోవడానికి ప్రయత్నించిన జేను కురుబ లేదా ఇతర స్థానిక సమూహాలతో అటవీ శాఖ ఒక పద్ధతిలో జోక్యం చేసుకోలేదని సిఎన్‌ఎపిఎ  కార్యకర్త రాజన్ చెప్పారు.

“ఇది స్థానికుల భూమి అని అటవీ శాఖ గుర్తించడం లేదు; అది తమ ఆధీనంలో ఉన్న భూమిలా వ్యవహరించాలని అనుకుంటుంది. వారు దానిని టైగర్ రిజర్వ్ లేదా జాతీయ ఉద్యానవనం లేదా సఫారీ ప్రకృతి దృశ్యంగా మార్చగలరు” అని రాజన్ చెప్పారు.

“జేను కురుబలు తమ భూమికి తిరిగి రావడం అనేది ఒక చారిత్రాత్మక సంఘటన ఎందుకంటే బ్రిటిష్ పాలన నుండి ఇప్పటివరకు భారతదేశం అంతటా స్థానిక గ్రామాలను నాశనం చేసారు. మొదట బ్రిటిష్ వారు; తరువాత కాఫీ తోటల భూస్వాములు; ఇప్పుడు జాతీయ ఉద్యానవనాల కోసం.”

“ఇప్పుడు మేము కాఫీ తోటల బాధల నుండి బయటపడ్డాము; మా పూర్వీకుల భూములకు తిరిగి వచ్చాము,” అని ఆయన చెప్పారు. “మేము ఇక్కడి నుండి బయటకు వెళ్ళం; మా హక్కులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము.”

తెలుగు: పద్మ కొండిపర్తి

https://www.theguardian.com/global-development/2025/aug/22/indian-indigenous-jenu-kuruba-reclaiming-ancient-lands-nagarhole-tiger-reserve

https://www.thenewsminute.com/karnataka/karnataka-52-tribal-families-in-nagarahole-forest-allegedly-face-eviction-threat

Leave a Reply