2025 నవంబర్ 11

జల్ జంగల్ జమీన్‌ను సమూలంగా నాశనం చేయకండి

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఉన్న బర్కాగావ్ బ్లాక్‌లో ఇంతకుముందెన్నడూ జరగనంత పెద్ద  మహాపంచాయత్‌ వైపు ప్రజలు నడుస్తుంటే, “గావ్ చోడబ్ నహీ, జంగిల్ చోడబ్ నహీ, మై మాటి చోడబ్ నహీ, లడై చోడబ్ నహీ…” (మేము మా గ్రామాన్ని విడిచిపెట్టము, అడవులను విడిచిపెట్టము! మా భూమి తల్లిని వదలం, పోరాటాన్ని ఆపము…) అనే విప్లవ ఆదివాసీ గీతం స్పీకర్ల ద్వారా బిగ్గరగా వినిపిస్తోంది.

ఒడిశాలోని కాశీపూర్ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకం, పారిశ్రామికీకరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న ప్రముఖ ఆదివాసీ నాయకుడు భగవాన్ మాజీ మొదట రాసిన ఈ ఆదివాసీ గీతం, శుక్రవారం మహాపంచాయత్ జరిగిన హర్లి గ్రామంలో ప్రతిధ్వనించింది.

ఈ సందర్భంగా మక్తూబ్ వెబ్ సైట్ గ్రామస్తులతో మాట్లాడింది.

అదానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన:

బొగ్గు సమృద్ధిగా ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రంలో, గోందల్‌పురా అనే ఒక చిన్న గ్రామం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు కేంద్రంగా మారింది. గత రెండేళ్లుగా, గోందల్‌పురా ప్రజలు ప్రతిపాదిత బొగ్గు తవ్వకాల ప్రాజెక్టును ప్రతిఘటిస్తున్నారు.

అయితే, ఈ భూమిని, కాగితంపైన (రికార్డుల ప్రకారం) ఇప్పటికే అదానీకి అమ్మేసారు. ఇందులో దాదాపు 513 హెక్టార్లు ఉన్నాయి; వాటిలో 40% అటవీ భూమి, మరో 40% కౌలు భూమి ఉన్నాయి.

ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు ప్రజల సమ్మతి లేకుండానే ఆమోదం లభించింది. ఇది “ఆమోదం పొందిన” చాలా ప్రాజెక్టులలో కనిపించే ఒక విధానం.

అబద్ధపు గ్రామసభ ద్వారానే తమకు ఈ ప్రాజెక్టు గురించి తెలిసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటినుండి, గోందల్‌పురా, మరో నాలుగు గ్రామాల ప్రజలు నిరంతర పోరాటం చేస్తున్నారు.

ఈ ఆగస్టులో, ఈ ప్రాంతంలో జరిగే ఏ బొగ్గు తవ్వకం ప్రాజెక్టునైనా తిరస్కరించడానికి అనేక ఇతర గ్రామాలు కూడా చేరడంతో ఈ నిరసన మరింత విస్తృతమైంది.

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఉన్న హర్లి గ్రామంలో అదానీ, ఎన్‌టిపిసి, ఇతర బొగ్గు కంపెనీలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే మహాపంచాయత్‌లో వేలాది మంది; ఫొటో: ఆదిల్ హుస్సేన్/మక్తూబ్

ఈ నిరసనలో ముందుండి పోరాడుతున్న ‘ఆజాదీ బచావో ఆందోళన్’ కార్యకర్త, సభ్యుడు డాక్టర్ మిథ్లేష్ కుమార్ డాంగీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది  అనడాన్ని ప్రజలు తిరస్కరించే పద్ధతే ఈ మహాపంచాయత్ అని వివరించారు.

“ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఏడు బొగ్గు బ్లాక్‌లలో మూడు ప్రధానమైనవి. కంపెనీల ఒత్తిడికి లోనై ప్రభుత్వం పదేపదే నకిలీ గ్రామసభలు నిర్వహిస్తుంటే, ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. అంటే ప్రభుత్వం కంపెనీల మాటనే వింటోందని అర్థం. కాబట్టి, ఈసారి, మాదైన సమాధానం చెప్పడానికి ఒక మహాపంచాయత్‌ను నిర్వహిద్దామని మేము నిర్ణయించుకున్నాము,” అని ఆయన తెలిపారు.

పది వేల మందికి పైగా ప్రజలు హాజరైన మహాపంచాయత్ ఆ ప్రాంతంలో అపూర్వమైనది. పసుపు కుర్తా ధరించిన భూపిందర్ కుమార్ అనే యువకుడు తన అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశాడు.

 “అదానీ, ఎన్‌టిపిసిలు స్వతంత్ర భారతదేశపు ఈస్ట్ ఇండియా కంపెనీలు. మన పూర్వీకులు బ్రిటిష్ వారితో ఎలా పోరాడారో, మాకు కూడా అలాగే అనిపిస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి మాకు ఎలాంటి మద్దతు లేదు. మా వెనుక ఎవరూ లేరు. వారంతా మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము నిస్సహాయులమనిపిస్తోంది.”

హజారీబాగ్‌లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది అదానీ కంపెనీ మాత్రమే కాదు. ఈ ప్రాంతం, ముఖ్యంగా బర్కాగావ్ బ్లాక్, దాదాపు రెండు దశాబ్దాలుగా బొగ్గు తవ్వకానికి వ్యతిరేకంగా నిరంతర ప్రతిఘటనను చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) కు 2004లో కేటాయించిన పక్రి బర్వాడిహ్ బొగ్గు బ్లాక్, తీవ్ర నిరసనలకు వేదిక అయింది.

ఎన్‌టిపిసి ప్రస్తుతం దానికి నేరుగా కేటాయించిన ఆరు బొగ్గు బ్లాక్‌లను, అలాగే ఝార్ఖండ్ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రాతు విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ (పివియుఎన్‌ఎల్) అనే ఉమ్మడి సంస్థ క్రింద ఉన్న అదనపు బ్లాక్‌ను అభివృద్ధి చేస్తోంది.

ల్యాండ్ కాన్ఫ్లిక్ట్ వాచ్ ప్రకారం, పక్రి బర్వాడిహ్ మైనింగ్ ప్రాంతం అటవీ భూమి, ప్రైవేట్ వ్యవసాయ భూములు ఉన్న మిశ్రమ ప్రాంతంలో ఉంది. ఇది 23 గ్రామాలను ప్రభావితం చేస్తుంది. ప్రభావిత కుటుంబాలతో సంప్రదింపులు జరపకపోవడంపైన నిరసనలు చెలరేగాయి. ఇది గోందల్‌పురాలో కూడా కనిపించిన ఒక పునరావృత విధానం. స్థానిక పాలన నిబంధనల ప్రకారం సంప్రదించాల్సిన గ్రామ పంచాయతీని కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో విస్మరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

నకిలీ గ్రామసభలు నిర్వహించి, భూమిని చేజిక్కించుకోవడానికి వీలుగా కంపెనీలు ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నాయని కుమార్ నొక్కి చెప్పారు.

“వారు ప్రజలకు ఉద్యోగాలు, ఇళ్లు, పరిహారమూ ఇస్తామని అబద్ధపు వాగ్దానాలు చేశారు,” అని ఆయన తెలిపారు.

కంపెనీ తమ వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు ఆ కంపెనీని నమ్మడం లేదని బదామ్ గ్రామానికి చెందిన మహమ్మద్ అజహర్ అన్నారు.

“మాకు ఇస్తున్న పరిహారం తక్కువగా ఉంది. కానీ మొత్తంగా చూస్తే, ఈ కంపెనీ రాకతో మేము భారీగా నష్టపోవడమే కాకుండా మా మధ్య ఉన్న సోదరభావం కూడా దెబ్బతింటుంది,” అని ఆయన అన్నారు.

ఈ నిరసనలో ఆ ప్రాంతంలోని ఆదివాసులు, దళితులు, ఓబిసిలు, ముస్లింలతో సహా అన్ని సముదాయాల వారు పాలుపంచుకుంటున్నారు. ఆదివాసులు కొండలలో చాలా లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ, వారు ఒక ఉన్నత లక్ష్యం కోసం చేతులు కలిపి ముందుకు వచ్చారు.

“ఝార్ఖండ్‌లో కులం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, కంపెనీ మమ్మల్ని కుల ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తుంది,” అని డాంగీ వివరించారు.

మరోవైపు, గతంలో కంపెనీలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజలు కోపంగా ఉన్నారని అజహర్ చెప్పారు. అయినప్పటికీ, కంపెనీని అనుమతించే ఏ నిర్ణయమైనా గ్రామస్తులకు లాభదాయకంగా ఉంటేనే తీసుకుంటామని ఆయన చెప్పారు.

బొగ్గు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని ప్రజలు నినాదాలు చేశారు, పాటలు పాడారు, నాటికలు ప్రదర్శించారు. వివిధ గ్రామాల నుండి ర్యాలీలు కూడా చేసారు. ‘అదానీ గో బ్యాక్!’ అని రాసి ఉన్న ప్లకార్డులతో ప్రజలు యాత్ర చేసారు.

పది-అంశాల ప్రతిజ్ఞను కూడా విడుదల చేశారు; ఇతర విషయాలతో పాటు, బొగ్గు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనను కొనసాగిస్తామని ప్రమాణం చేశారు.

బొగ్గు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసిన ‘పది సూత్రాల ప్రతిజ్ఞ’ నినాదాన్ని చదువుతున్న ప్రజలు. ఫొటో: ఆదిల్ హుస్సేన్/మక్తూబ్

దాదాపు 176 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న గోందల్‌పురా బొగ్గు బ్లాక్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వాణిజ్య మైనింగ్ కోసం, 41 బొగ్గు బ్లాక్‌ల ఇ-వేలంలో భాగంగా నవంబర్ 2020లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వేలం వేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 1 లక్ష కోట్ల వరకు ఉంటుంది. 500 హెక్టార్లకు పైగా ఉన్న వ్యవసాయ భూమిని, నివాసాలను, అడవులను తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది. అంతే  కాకుండా ఇది 229 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా.

2024 అక్టోబర్ 4 నాడు అదానీ ఏర్పాటు చేసిన బారికేడ్‌లను తొలగించడానికి ప్రయత్నించిన గ్రామస్తులపైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, పోలీసుల చర్యను కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.

అంతకుముందు వచ్చిన ఎన్‌టిపిసి ప్రజలను వేధించి, నిర్వాసితులను చేసి, వారి జీవితాలను నాశనం చేసిందని ఈ నిరసనలో పాల్గొన్న హర్లి గ్రామానికి చెందిన సావంతి కుమారి అన్నారు.

“ఈ ప్రాజెక్టులతో వారు పర్యావరణాన్ని, మా భూమిని నాశనం చేయబోతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేయకూడదు అనే ఒకే ఆలోచన మా అందరిలో ఉంది,” అని ఆమె తెలిపారు.

తమ నిరసనలను ఆపడానికి తమపై నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని కూడా ప్రజలు తెలిపారు. “ఇది వేధించడం, భయపెట్టడం కాకపోతే మరేమిటి,” అని కుమార్ ప్రశ్నించారు.

ఈ గ్రామస్తులు ప్రధానంగా రైతులు; వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల వారి వ్యవసాయం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇప్పటికే మైనింగ్ జరిగిన కొన్ని ప్రాంతాలలో భూమి పూర్తిగా పాడైపోయింది.

మరోవైపు, ఈ పోరాటం ఇప్పుడు మరింత పెద్దదైంది; గ్రామస్తులు తమకు ఇది జీవన్మరణ సమస్యగా మారిందని అంటున్నారు.

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply