అక్కడ ఎవరున్నారని వెళ్తున్నారు
ఆ చోటులో ఏముందని అడుగుతున్నారు
చుట్టూ కళేబరాల నడుమ ప్రార్థనా మందిరంలో నిత్య జన సందోహం!
భక్తి పారవశ్యంలో చుట్టూ చూసే ఆరా తీసే తీరికా లేదు సమయమూ లేదు !
శ్మశానమా?! కాదు
అత్యాచారాల్లో ఆరితేరిన మానవుల అలికిడి గాంచలేని
యువతీ యువకులు
అర్ధాంతరంగా చంపబడుతున్నారు
దేహాలు పూడ్చబడ్డాయి ఎక్కడబడితే అక్కడ
రక్షక భటనిలయాల్లో ఫిర్యాదులకు సైతం నోచుకోబడని దేహాలవి
బంధుమిత్రులను నయానా భయానా ఆ చోటునుండి వెళ్ళగొట్టిన పెత్తందారీ వ్యవస్థ !
కులమూ లేదు మతమూ లేదు
అంతా పురుషాధిక్య పైత్యంలో
స్థలంలో స్థానభ్రంశం క్షణాల్లో
ఒకటో రోజో రెండో రోజో
గుట్టుచప్పుడు కాకుండా బొందో దహనమో యథేచ్ఛగా!
వెనుక ఎన్ని హస్తాలుంటేనో ఇన్ని ఘోరాలు!
ప్రాయశ్చిత్తం ముసుగు లో ఒక విజిల్ బ్లోయర్ వచ్చాడు
అయినా సంఘాన్ని విజిల్ వేసి లేపే వాడెవ్వడు?
అంతా గాఢ నిద్ర నటన! నటులున్న సంఘం లో నాటుకున్న మౌఢ్యాన్ని తుడిచేసేదెవ్వడు?!
భక్తి నాటకంలో ఎన్ని ఆకృత్యాలు జరిగాయో వెలుగులోకి వచ్చేనా?!
తగ్గని జనాల పోటు
పాట్లు పట్టని జనాలు
సిగ్గు! సిగ్గు!!
