నాకు తెలిసిన పేరు ఉయికె గణేశ్
పాక హనుమంతు అని ఇటీవలే వింటున్నాను.
నిన్ను చూసిన జ్ఞాపకమూ లేదు
మొదట నీ ఎన్కౌంటర్ అయిన
మృతదేహాన్ని చూసాకే
నీ నిజాకృతిని చూసానేమో
అప్పుడు ఒక్కసారిగా
కుటుంబం ఏర్పడినప్పటి నుంచీ
స్త్రీ పురుష సంబంధాలు
బానిస యజమాని సంబంధాలని
నువ్వు పాఠం చెప్తున్నట్లు
ఊహించుకుంటున్నాను
ఒక విప్లవకారుని మొహంలో
అంత స్త్రీకారుణ్యమేమిటా అనిపించింది

కుహనా విప్లవ వాచాలుని
నయవంచనను గర్భంలో మోస్తున్న
అపరిచిత
ఎన్నాళ్ళ నుంచి నీ పలకరింపు కోసం
దుఃఖాన్ని మోసి
ఇవ్వాళ నీ చితిలో కురిపించిందో గదా

అమరులు, పోరాటకారులు, ఆదివాసులు
దండకారణ్యంలో నిర్మించుకున్న
జనతన సర్కారు
మహిళా జర్నలిస్టు అక్షరాలలో
మైదానాల్లో ప్రవహించేంత
గుండె నెత్తురులతో వివరించిన
నీ కథనం
ఇవ్వాళ ఒక అమరస్మరణగా నిలిచిపోతుంది

నువ్వు జగదీశ్గా
మల్కన్గిరిలో ఆదివాసుల మధ్యన
విప్లవ నిర్మాణం చేస్తున్నప్పుడు
సెంట్రీ చేసిన కన్నపేగు
అడవి కాచిన వెన్నెల వృధా కాదని
పువ్వులంతటి పలచని కాగితాలపై రాసిన
రహస్తంత్రిని గుండెల్లో దాచుకున్నాము.

ఇప్పుడు నువ్వు
నీ తండ్రి మరణించినప్పుడు
కన్నతల్లికి రాసిన ఉత్తరం చదువుతుంటే
విప్లవకారులు పీడితుల ధిక్కారాన్ని
పిడకలో దాచిన నిప్పువలె
ఎట్లా పోల్చుకుంటారో అర్థమైంది.

మహానగరంలో కోర్టుకుపోయినప్పుడల్లా
ఆపేరేదో నాకు అర్థం కాదు గానీ
అంబానీ అంబరాలను చుంబించే
సౌధాన్ని చూస్తుంటాను -
అమరత్వాన్ని పొందిన నీ
మృతదేహాన్ని తెచ్చుకోవడానికి
మీ ఊరి ప్రజలు వచ్చినప్పుడు
చింకి చీకిపోయిన
నీ పూరి గుడిసె చూసాను
మెదక్ పార్టీ కార్యదర్శి మహేందర్ ఇల్లు
మనసులో మెదిలింది
పైడిపల్లి చిన్నాలు గుడిసె
సరే సరి - విప్లవకారులను పోల్చుకోవడం నేర్పింది –

నీ ఇంటి ముందు ఊడుస్తున్న నేలను
నీ రాక కోసం గర్వంతో దుఃఖిస్తున్న
ఊరునూ చూసాను.

అన్నట్లు మీ ఊరి పేరు విన్నాను
దొర గడీని నక్సలైట్లు కూల్చి
దొర హైదరాబాదుకు మారినపుడు

ఇప్పుడు నీలో
జ్ఞానం శీలం ఏకత గప్పాల హంతకులు
విప్లవానికి ఇంధనం అక్కడ ఉందని
తల పగిలి మెదడు బయటపడేలా
దాడి చేసినా
బతికిన శేషు సారును -
సాయం కళాశాలలో చదువుతూ
ఉదయమే పత్రికలు పంచే నెపంతో
లాల్ బనో గులామీ చోడో
అని ప్రచారం చేస్తూ అమరుడైన
ఆర్ఎస్యూ తుమ్మల శేషయ్యను
పోల్చుకున్నాను.

ఒక్క మనిషిలోనే ఇన్ని ప్రవాహాలైన వానిని
నీ వొక్కనివే కాదని తెలుసు
ఒకరి అనుభవం సమస్త మానవాళి
అనుభవం కావడం ఒక జ్ఞాపకం.
కోల్పోయిన మనుషులందరి
చైతన్యం కావడం
ఒకరి ఆచరణ అమరత్వం
విప్లవ విద్రోహం నుంచి
అడవిని విముక్తం చేసే నినాదంగా
పాటలుగా, ఊరేగింపుగా, దృఢ నిర్ణయంగా మన మధ్యకు
రక్తంలో తడిసిన ఎర్రజెండాగా
కదిలి రావడం –
అది అనుకుంటాను –
జీవచ్ఛవాలది కాదు
మృతవీరుల అంతిమయాత్ర –
అది జైత్రయాత్ర

29-12-2025

Leave a Reply