ఫోటోలో హోంమంత్రి అమిత్ షా మెరిసిపోతుంటే, ఆయనకు కొన్ని వరుసల వెనుక విషాద వదనంతో ప్రసన్న నిలబడి ఉన్నాడు.

జూన్ 23న షా తన X హ్యాండిల్‌లో ఈ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసాడు. “నక్సలైట్లు ఎవరి చేతుల్లో తుపాకులు పెట్టారో, ఆ పిల్లలు తమ  భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు.” అని కింద రాసి ఉన్నది.

కానీ ప్రసన్న చిన్నపిల్లవాడు కాదు. అతను యాభై ఏళ్ల వయసున్న ఆదివాసి.

బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందినవాడు – అతని భద్రత కోసం అసలు పేరును, ఊరును, గుర్తింపును చెప్పడం లేదు- జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఒక కాంపౌండ్‌లో పోలీసులు తనను బంధించి, నైపుణ్య శిక్షణ తీసుకోవాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించాడు.

అతను చూపించిన ఆవరణ లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస కేంద్రంగా పనిచేస్తున్నది. కానీ ప్రసన్న తాను లొంగిపోయినవాడిని కాదని, తన గ్రామంలో శాంతియుత నిరసనకు నాయకత్వం వహించినందుకు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని అతను చెప్పాడు.

తనలాంటి మరో 90 మంది “శిక్షణ పొందేవారు” కేంద్రంలో బలవంతపు నిర్బంధానికి గురయ్యారని అతను చెప్పాడు. జూన్‌లో, వారికి కొత్త నీలిరంగు ట్రాక్ సూట్లు ఇచ్చి, “రాయ్‌పూర్ ఘుమాకర్ లాతే హై, ఫిర్ చోడ్ దేంగే” (రాయ్‌పూర్‌ను చూపించి తీసుకువస్తాం, వదిలేస్తాం”)అని చెప్పారు.

వారిలో దాదాపు 60 మందిని బస్సులో రాష్ట్ర రాజధానికి తీసుకెళ్లి హోంమంత్రితో ఫోటో తీయించారని,  ఇంటికి తిరిగి వెళ్లడానికి అనుమతినిస్తారనే ఆశతో తామందరమూ  తిరిగి వచ్చామని, కానీ అలా జరగలేదు అనీ అన్నాడు.

అయితే, ప్రసన్నకు తన ఇంటి పనుల కోసం కొన్ని రోజులు తన గ్రామానికి వెళ్ళడానికి అనుమతి దొరికింది.

ఆ సమయంలోనే ఈ విలేఖరిని కలిసాడు.

ఆ తర్వాత, ఇతర ఖైదీలు (ఇటీవల పోలీసులకు లొంగిపోయిన వారిలో కొందరు దిగువ స్థాయి మావోయిస్టులు) ఇలాంటి వివరాలనే తెలియచేసారు. నైపుణ్య శిక్షణ ముసుగులో, వారిని చాలా కాలంగా జిల్లా ప్రధాన కార్యాలయంలో బలవంతంగా ఉంచారని చెప్పారు.

ఈ కథనాలు మాజీ మావోయిస్టులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం ద్వారా పునరావాసం కల్పిస్తున్నామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్పడంపైన ఆందోళనకరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

 “2025 మార్చిలో అమల్లోకి వచ్చిన లొంగుబాటు- పునరావాస విధానంలో భాగమే నైపుణ్య శిక్షణ” అని ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ అన్నాడు.

లొంగిపోయిన వ్యక్తులు శిక్షణలో పాల్గొనకుండా వారి గ్రామాలకు తిరిగి వెళ్లే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, యాదవ్ అలా వెళ్ళేవారి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసాడు. “వెంటనే తిరిగి వెళ్ళడం ప్రమాదకరం” అని అంటూ లొంగిపోయిన మావోయిస్టులను మావోయిస్టు క్యాడర్లు లక్ష్యంగా చేసుకుని చంపిన సందర్భాలను ఉదహరించాడు. “ఈ ఏడాది ఇంతవరకు 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోతే, గత సంవత్సరం 35 మంది మరణించారు.”

అయితే, పునరావాస పథకాన్ని అమలు చేస్తున్న పోలీసుల పద్ధతిని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. సురేష్ తీవ్రంగా విమర్శించారు. “గ్రామస్తులను షరతులతో కూడిన స్వేచ్ఛతో రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రాలలో ఉంచే పద్ధతి ఏకపక్ష నిర్బంధానికి తక్కువ కాదు” అని ఆయన అన్నారు.

‘కొత్త మార్గం’

“పూనా మార్ఘం” (గోండిలో కొత్త మార్గం) బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసాన్ని కల్పించడానికి కొత్తగా తీసుకున్న  ప్రోత్సాహకపు చర్య అని పోలీసులు అంటున్నారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) చివరి బలమైన స్థావర ప్రాంతాలలో  ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ ప్రాంతం ఒకటి.

ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నుండి, ఈ ప్రాంతంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు తీవ్రతరం అయ్యాయి. 20 నెలల్లో అనేక మంది సీనియర్ నాయకులతో సహా 445 మంది మావోయిస్టులను చంపేసామని భద్రతా బలగాలు చెబుతున్నాయి.

హత్యలతో పాటు, పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులను లొంగిపోయేలా చేయడంలో పోలీసులు విజయం సాధించారని కూడా చెప్పాయి. 1,400 మందికి పైగా మావోయిస్టులు “గత 18 నెలల్లో హింసను విడిచిపెట్టి సామాజిక ప్రధాన స్రవంతిలోకి చేరారు” అని జూలై 21న విడుదల చేసిన ఒక ప్రకటనలో బస్తర్ పోలీసులు తెలిపారు.

“లొంగిపోయిన మావోయిస్టు కార్యకర్తలకు స్వావలంబన, గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితాన్ని అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు”గా “పూనా మార్గం “ను ఆ ప్రకటనలో అభివర్ణించారు.

ఈ కేంపెయిన్‌ను “బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో దశలవారీగా అమలు చేస్తున్నామని, వాటిలో బీజాపూర్ ఒకటి” అని ఆ ప్రకటన పేర్కొన్నది.

లొంగిపోయిన మావోయిస్టుల కోసం ఇప్పటికే ఉన్న పునరావాస పథకాల ఆధారంగా ఈ చొరవ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

2017 నుండి, బస్తర్ పోలీసులు “అమ్చో బస్తర్ అమ్చో పోలీస్” అనే సాముదాయక పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్ర ధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన లో భాగంగా కోర్సులను నిర్వహించడం కోసం ప్రతి జిల్లాలో ఒక పోలీస్ క్యాంపస్ ను వృత్తి శిక్షణ ప్రదాతగా కార్మిక విభాగం నమోదు చేసింది.

“తాపీపని, ట్రాక్టర్ నిర్వహణ, వ్యవసాయ, కుట్టు నైపుణ్యాలు, ఇతరత్రా స్వల్పకాలిక కోర్సులను నేర్పిన తరువాత సర్టిఫికెట్లు జారీ చేస్తారు” అని బీజాపూర్‌లోని ఈ పథకం అసిస్టెంట్ కోఆర్డినేటర్ గౌరవ్ పాండే వివరించారు.

బీజాపూర్‌లోని ఏడు క్యాంపస్‌లలో వృత్తి శిక్షణ నిస్తున్నామని, లొంగిపోయిన మావోయిస్టులకు నివాస పునరావాస కేంద్రంగా  వృత్తి శిక్షణ అందిస్తున్న ఏడు క్యాంపస్‌లలో ఒకటి బీజాపూర్‌లో పనిచేస్తుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి 14నాడు ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 150 మందికి అక్కడ శిక్షణ ఇచ్చారని ఆయన తెలిపారు.

సాధారణంగా, వృత్తి శిక్షణా కోర్సులు రెండు నుండి మూడు నెలల వరకు నడుస్తాయి. కానీ లొంగిపోయిన మావోయిస్టులు ఇంటికి తిరిగి వెళ్లడం సురక్షితం కాకపోవడంతో, వారికి వరుసగా అనేక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పాండే చెప్పారు.

 “ఇది వారి మంచి కోసం, భవిష్యత్తు కోసం – వారికి లాభదాయకమైన ఉపాధికి అవకాశం కలిగేలా చూడడం కోసం” అని పోలీస్ సూపరింటెండెంట్ యాదవ్ అన్నారు.

శిక్షణ పూర్తి చేసిన వారిని ఉద్యోగాల్లోకి చేర్చుకుంటారా అనే దానిపైన పరిమితులన్నట్లు  ఆయన అంగీకరించారు. “అందరికీ తక్షణ ఉపాధి కల్పించడం కష్టం, కానీ క్రమంగా, ప్రజలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకునే మార్గాలను కనుగొంటారు” అని అన్నాడు.

ఒక నిరసనకు అంతరాయం :

ప్రసన్న తాపీ మేస్త్రీగా శిక్షణ పొందుతున్నానని చెప్పాడు. గత నవంబర్ వరకు, అతను బీజాపూర్ అడవి లోతట్టు ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో రైతుగా నివసించాడు. నేను ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతపు వారపు సంత సందడిగా జరుగుతోంది.

“నేను నిన్ననే ఇంటికి వచ్చాను,” అన్నాడు ప్రసన్న. అవకతవకగా చేతితో నేసిన మంచం మీద కూర్చోవడానికి ముందు నాతో హృదయపూర్వకంగా చేతులు కలిపాడు. స్వంత పనులను చేసుకోవడానికి తనకు రెండు రోజుల “సెలవు”ను ఇచ్చారని చెప్పాడు. అతను మాట్లాడుతున్నప్పుడు, సెంట్రల్ రిజర్వ్ పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది గస్తీలో ఉన్నారో లేదోనని తనిఖీ చేయడానికి మార్కెట్ వైపు చూస్తూనే ఉన్నాడు.

గత సంవత్సరం వరకు ఈ ప్రాంతానికి సిఆర్‌పిఎఫ్ చాలా అరుదుగా వచ్చేది, కానీ పారామిలిటరీ బలగాలు ఆ  గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది.

ఈ ప్రాంతం మరింత సైనికీకరణకు గురవుతుందనే భయంతో గ్రామస్తులు ఈ చర్యను వ్యతిరేకించారు. అప్పటికే, భద్రతా బలగాల మోర్టార్ దాడుల వల్ల గ్రామస్తులు తమ పొలాల్లో పని చేసుకోడానికి, పంట కోతకు వెళ్ళడానికి కష్టమైందని ప్రసన్న గుర్తు చేసుకున్నారు. గ్రామస్తుల తరపున మోర్టార్ షెల్స్ వాడకానికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడానికి ఆయన తన గ్రామ సర్పంచ్‌తో కలిసి సమీపంలోని సెక్యూరిటీ క్యాంపుకు వెళ్ళాడు. కానీ ఫలితం లేదు.

తమ భూమిలో సిఆర్‌పిఎఫ్ క్యాంపును నిర్మించకుండా నిరోధించడానికి గ్రామస్తులు అక్టోబర్‌లో ధర్నా నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారని ప్రసన్న అన్నారు. చట్టం ప్రకారం, క్యాంపును ఏర్పాటు చేయడానికి ముందు గ్రామసభ అనుమతి తీసుకోవాలి, కానీ అది జరగలేదని ఆయన ఎత్తి చూపారు.

“మూల్‌వాసీ బచావో మంచ్” లేదా స్థానిక నివాసితుల రక్షణా వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని ఇతర గ్రామాలలో కూడా ఇలాంటి నిరసనలు చెలరేగాయి. అభివృద్ధి కోసం కాకుండా గనులతవ్వకాన్ని సులభతరం చేయడానికి రాజ్యం ఈ ప్రాంతంలో రోడ్లను, సెక్యూరిటీ క్యాంపులను  నిర్మిస్తోందని నిరసనకారులు వాదించారు. మావోయిస్టులకు ఒక ఫ్రంట్‌గా వ్యవహరిస్తున్నారని రాజ్యం ఆరోపించిన తర్వాత, 2024 నవంబర్‌లో ఈ సంస్థను నిషేధించారు.

ఛత్తీస్‌గఢ్‌కు శాంతియుత ప్రతిఘటనను నేరంగా పరిగణించడంలో చాలా కాలంగా రికార్డు ఉందని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న గ్రామాల్లో నివసించే ఆదివాసీలను వారు ఎప్పుడూ తిరుగుబాటుదారుల సమూహం కోసం పని చేయకపోయినా, వారికుండే సంబంధాల ద్వారా మావోయిస్టులుగా ముద్ర వేస్తారు.

ఇరవైల ప్రారంభంలో తాను ఆ గ్రూపులో చేరానని, కానీ మూడేళ్లలోనే ఆ గ్రూపును వదిలివేసి, తన కుటుంబంలోకి, సాధారణ గ్రామీణ జీవితానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ప్రసన్న చెప్పాడు. “మహిళా కార్యకర్తలతో నా ప్రవర్తనను పార్టీ ఆమోదించలేదు” అని అతను చెప్పాడు.

గత మూడు దశాబ్దాలుగా తనకు మావోయిస్టులతో సంబంధం లేదని అతను చెప్పిన విషయాన్ని గ్రామ సర్పంచ్ కూడా ఆమోదించాడు; అయినప్పటికీ, గ్రామ నిరసనలో పాల్గొనడం వల్ల అతను పోలీసులకు లక్ష్యంగా మారాడు.

ఒక సాయంత్రం నిరసన స్థలంలో, ఇక పడుకుందాం అని అనుకుంటుండగా  “పిల్లలు పైకా పైకా (పైకా అంటే గోండిలో బయటి వ్యక్తి. తరచుగా పోలీసులకు ఉపయోగిస్తారు) అని అరుస్తూ పరుగెట్టడాన్ని” ప్రసన్న గుర్తుచేసుకున్నాడు.

నిరసన స్థలం మొత్తాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆ సైనిక చర్యకు నాయకత్వం వహిస్తున్నట్లు కనిపించిన ఒక యువ సిఆర్‌పిఎఫ్  జవాను, “నిరసనకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో” చెప్పమని డిమాండ్ చేశాడు. ప్రసన్న ముందుకు అడుగుపెట్టి ఏదో  మాట్లాడేలోపే, ఆ యువ జవాన్ అతనిని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టాడు.

70 మంది ఇతర నిరసనకారులతో పాటు, అతనిని, గ్రామంలో “దూరంగా ఉన్న ఇంటికి” తరలించారు, క్యాంపుని నిర్మించేవరకు భద్రతా సిబ్బంది వారిని రోజుల తరబడి అక్కడ నిర్బంధించారు.

క్యాంపు నిర్మాణం అవగానే, దాదాపు 10 మంది నిరసనకారులను (వారిలో ఎక్కువగా మైనర్ పిల్లలు, వృద్ధులు ఉన్నారు) విడుదలచేసారని, తనను, ఇతరులను బీజాపూర్‌లోని పోలీసు లైన్‌కు తరలించారు అని ప్రసన్న చెప్పాడు.

శిక్షణ లేదు, నిర్బంధం మాత్రమే:

ఛత్తీస్‌గఢ్ పోలీసుల ప్రత్యేక నక్సల్ వ్యతిరేక విభాగం అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌ల నివాస స్థలంగా పోలీస్ లైన్ పనిచేస్తుంది. బీజాపూర్‌లో లొంగిపోయిన మావోయిస్టుల వృత్తి శిక్షణ కోసం కేటాయించిన ఏడు కేంద్రాలలో ఈ క్యాంపస్ కూడా ఒకటి.

60-70 మంది మహిళలు సహా దాదాపు 200-250 మంది గ్రామస్తులతో క్యాంపస్ నిండిపోయింది. వారిలో ఎక్కువ మంది ఉసుర్, గంగలూర్, భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల నుండి వచ్చారు.

రాకేష్ పోటం గంగలూర్‌లోని కోర్చోలి గ్రామానికి చెందినవాడు. నేను అతన్ని జనవరిలో బీజాపూర్ పోలీస్ లైన్ల బయట కలిశాను. అతను తన 14 ఏళ్ల తమ్ముడు దస్రు పోటం కోసం వెతుకుతూ వచ్చాడు; అతన్ని డిసెంబర్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లు తీసుకెళ్ళారు. రాకేశ్‌తో పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరు గ్రామస్థులు బిచ్చెమ్ తాటి, సోమ్లు పునెంల భార్యలు కూడా ఉన్నారు.

అదుపులోకి తీసుకున్న పురుషులను కలవడానికి కుటుంబాలకు అనుమతి లేదు. తన సోదరుడిని, ఇతరులను విచారిస్తున్నామని, విచారణ ముగిసిన తర్వాత విడుదల చేస్తామని పోలీసులు తనకు చెప్పారని పోటం చెప్పాడు.

వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు ఎటువంటి ప్రస్తావన లేదు.

కొన్ని శుభ్రపరిచే, నిర్మాణ పనులు తప్ప, – వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన పనులు కాదు కదా తాము అసలు ఏ పనులూ చేయలేదని ప్రసన్న చెప్పాడు. “జనాల రాక పోకలను చూస్తూనే” నిర్బంధితులు తమ రోజులను గడిపారు అని ఆయన అన్నాడు.

“లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసు లైన్ తాత్కాలికంగా ఉండే స్థలం. లొంగిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సురక్షితమైన, సరిపడా వసతి లేకపోవడం వల్ల, కొంతమందిని తాత్కాలికంగా పోలీసు లైన్‌లో ఉంచారు, శిక్షణపొందే బ్యాచ్‌లను క్రమబద్ధీకరిస్తున్నాము” అని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ యాదవ్ వివరించాడు.

తిరుగుబాటుదారుల సమూహ సాయుధ విభాగంలో చివరి స్థాయి అయిన మావోయిస్టు మిలీషియాలో పూర్వ సభ్యురాలు అయిన  గాయత్రి (పేరు మార్చాం) నాలుగు నెలలు పోలీసు లైన్‌లో గడిపింది. నిర్బంధంలో ఉన్న ఆమె లాంటి మహిళలకు గదులను, బాత్రూమ్‌లను శుభ్రం చేసే, కలుపు మొక్కలు తొలగించే, క్యాంపస్‌లో తమ క్వార్టర్‌లు ఉన్న పురుష, మహిళా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లతో సహా అక్కడ ఉండేవారందరికి వంట చేసే పనిని కేటాయించారని ఆమె చెప్పింది.

వారు ఖాళీగా కూర్చుని కనిపిస్తే “మీరు లోపల దేనికోసం కూర్చున్నారు? బయటికి వచ్చి ఏదో ఒక  పని చేయండి” అని తిట్టేవారు.

ఎలాంటి వృత్తి శిక్షణ పొందినట్లు ఆమెకు గుర్తులేదు. కానీ, జిల్లా రిజర్వ్ గార్డ్‌ లోని పురుష సిబ్బంది మహిళా ఖైదీలను “షాదీ కరేగి క్యా?” (పెళ్లి చేసుకుంటావా?) అని అడిగేవారని ఆమె ఆరోపించింది (అలా అడగటం అంటే లైంగిక ప్రయోజనాలను ఆశించే వారు ఉపయోగించే ఒక మర్యాదపూర్వక ప్రశ్నగా భావిస్తారు), అయితే తన నిరాకరించడం వల్ల ఎటువంటి వేధింపులకు గురికావాల్సిరాలేదని జోడించింది.

గంగలూరు ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన ఒక యువకుడి మానసిక ఆరోగ్యం దెబ్బతినడాన్ని కూడా గాయత్రి గుర్తుచేసుకున్నది. అతడి స్థితిని అదుపు చేయలేక, పోలీసులు బంధువులను పిలిచి, అతను కోలుకునే వరకు తీసుకెళ్ళిపొమన్నారు.

ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న గాయత్రి, తాను పోలీసు లైన్‌ నుంచి వచ్చినప్పటినుండి నీరసంగా ఉంటోందని చెప్పింది. లొంగిపోయిన మావోయిస్టులను ఇంతకాలం నిర్బంధించడంలోగల తర్కాన్ని ఆమె తమ్ముడు ప్రశ్నించాడు. లొంగిపోయిన తర్వాత, ఒక నెల పాటు నిర్బంధంలో ఉంచితే అర్థం చేసుకోవచ్చు, కానీ నాలుగు నెలలపాటు ఉంచడంలో అర్థం ఏమిటి? అని ప్రశ్నించాడు.

తిరిగి నిర్బంధంలోకి తీసుకుంటారనే భయం గాయత్రికి ఇంకా వెంటాడుతోంది. పోలీసులు విడుదల చేసిన గ్రామంలోని మరో యువతిని తిరిగి అరెస్టు చేశారని ఆమె చెప్పింది.

‘లొంగుబాటు’ నాటకాలు:

ప్రసన్నను, అతని గ్రామం నుండి 60 మందిని పోలీసు లైన్‌కు తీసుకెళ్లిన ఒక నెల తర్వాత, పోలీసులు క్రమంగా వారిని బ్యాచ్‌లుగా విడుదల చేయడం ప్రారంభించారు. డిసెంబర్ మధ్య నాటికి, వారిలో 12 మంది మాత్రమే పోలీసు లైన్‌లోమిగిలామని, లొంగిపోయి పోలీసులలో చేరిన మాజీ మావోయిస్టుల బృందం ముందు తమను హాజరుపరిచారని ప్రసన్న చెప్పారు.

ఆ మాజీ మావోయిస్టులు తానూ తన గ్రామానికి చెందిన ఇతర నిర్బంధంలో ఉన్నవారు ఇటీవలి సంవత్సరాలలో ఎటువంటి నక్సల్ కార్యకలాపాలలో పాల్గొనలేదని హామీ ఇచ్చారు.

డిసెంబర్ చివరలో, ఆ 12 మందినీ విడుదల చేసి, వారి గ్రామానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. కానీ వారి స్వేచ్ఛ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని రోజుల తరువాత, పోలీసులు ప్రసన్న ఇంటి వద్ద వారెంట్‌తో కనిపించారు. మరో ఏడుగురితో పాటు, అతన్ని బీజాపూర్‌కు – అతను ఇప్పటికే ఒక నెల నిర్బంధంలో గడిపిన అదే పోలీసు లైన్‌కు తిరిగి తీసుకెళ్లారు.

బందీగా ఉన్నప్పుడు, ప్రసన్న సమయజ్ఞానాన్ని కోల్పోయాడు. మార్చిలో ఒక రోజు, దాదాపు 20 మందితో పాటు అతన్ని  మీడియా ముందు పెట్టారు. పోలీసు అధికారులు తమని”లొంగిపోయిన మావోయిస్టులు”గా చెప్పడం విని దిగ్భ్రాంతి చెందాడు.

తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రసన్నను సిపిఐ  (మావోయిస్ట్)కి చెందిన దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘ్ సభ్యుడిగానూ మూల్‌వాసి బచావో మంచ్ సభ్యుడిగానూ వర్ణించారు. అతనిపై అనేక పోలీసు కేసులు ఉన్నాయని ఆ ప్రకటన పేర్కొంది.

ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకున్న తర్వాత తనను ఇక విడుదల చేసి ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తారని ఆశించానని కానీ అందుకు బదులుగా, బీజాపూర్‌లో పూర్వం నవోదయ పాఠశాల క్యాంపస్, ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులకు నివాస పునరావాస కేంద్రంగా ఉపయోగిస్తున్న కొత్త ప్రదేశానికి ప్రసన్నను, ఇతరులను తీసుకెళ్లారు.

పునరావాస కేంద్రంలో జీవితం:

సంతోష్ (పేరు మార్చాం) ప్రసన్న ఉన్న సమయంలోనే పునరావాస కేంద్రంలోకి వచ్చాడు. పోలీసులు అతనిని 50 మంది “లొంగిపోయిన మావోయిస్టుల” బృందంలో భాగంగా చూపించి, సమిష్టిగా రూ. 68 లక్షల బహుమతినిచ్చారు. ఒక్కొక్కరూ రూ. 25,000 చెక్కును పట్టుకుని ఉన్నట్లు చూపించారు.

అతని గ్రామంలోని అనేక మంది చెప్పినడాని ప్రకారం, సంతోష్ చాలా కాలం క్రితం మావోయిస్టులకు మద్దతును సమీకరించడంలో సహాయం చేసాడు. ఆ తరువాత అతను నిషేధిత సమూహంతో చురుకుగా సంబంధాలలో లేడని వారు చెప్పారు. అయినప్పటికీ, సమీపంలోని సెక్యూరిటీ క్యాంపు కమాండెంట్ పిలిచిన గ్రామానికి చెందిన 12 మందిలో అతను కూడా ఉన్నాడు. 12 మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, లొంగిపోయిన మావోయిస్టులుగా ప్రకటించి, మొదట పోలీసు లైన్‌కు, తరువాత పునరావాస కేంద్రానికి పంపారు.

పునరావాస కేంద్రం నుండి సంతోష్ చాలా క్లుప్తంగా స్క్రోల్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఖైదీలు ఎవరితోనూ సంభాషించడానికి అనుమతించని పోలీసు లైన్‌లా కాకుండా, పునరావాస కేంద్రంలో, వారు తమ వ్యక్తిగత ఫోన్‌లను ఉంచుకోవడానికి అనుమతినిచ్చారని ప్రసన్న వివరించారు. వారి కుటుంబ సభ్యులు కూడా వారానికి రెండుసార్లు వారిని కలవవచ్చు.

 “అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే – ఎవరైనా అనారోగ్యంతో ఉంటే లేదా తీవ్రమైన సమస్య ఉంటే, “ట్రైనీ”లను (శిక్షణ పొండుతున్నవారు)కూడా వారి గ్రామాలకు వెళ్లడానికి అనుమతిస్తారు” అని ప్రసన్న అన్నారు.

పోలీసు లైన్‌లో లాగా కాకుండా, పునరావాస కేంద్రంలో ఉండేవారికి ఒక నిర్దిష్ట దినచర్య ఉంటుంది. “ప్రతిరోజు ఉదయం, సెషన్‌కు నాయకత్వం వహించడానికి వచ్చే టీచర్ మార్గదర్శకత్వంలో ఒక గంట వ్యాయామం చేస్తాము. ఆ తర్వాత ఆహార విరామం ఉంటుంది. వంతులవారీగా వంట చేస్తాం”అని ప్రసన్న వివరించాడు.

సంతోష్ ట్రాక్టర్ నిర్వహణ శిక్షణలో ఉంటే, ప్రసన్న తాపీపని నేర్చుకునే బృందంలో ఉన్నాడు. శిక్షణ రోజుకు ఐదు గంటలు ఉంటుంది. “సాయంత్రం వంట చేస్తాం. ఆ తర్వాత పడుకోవడం.”

కొన్నిసార్లు శిక్షణ పొందినవారు వ్యక్తిగత వస్తువులను కొనడానికి సమీపంలోని మార్కెట్‌కు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. నిర్బంధంలో ఉన్న ఎనిమిది నెలల్లో అతను రెండుసార్లు బయటకు వెళ్ళాడు – అదీ అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే.

ఎవరైనా ఎప్పుడైనా తప్పించుకోవడానికి ప్రయత్నించారా?

“ఒక్కరు కూడా చేయలేదు,” అని అతను దృఢంగా సమాధానం చెప్పాడు. “పోలీసుల దగ్గర మా వివరాలన్నీ ఉన్నాయి. ఎవరైనా పారిపోతే కనక వారిని కుటుంబం జీల్లీలో చూస్తుంది” అని చెప్పారు (చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చుట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ షీట్‌ను జీల్లీ అంటారు).

“మేము ఎక్కడికి వెళ్తాము?” ప్రసన్న కొనసాగించాడు. “మేము మా గ్రామానికి మాత్రమే తిరిగి వస్తాము. కానీ క్యాంపుకి సమాచారం అందిన వెంటనే, వారు మొత్తం గ్రామాన్ని వేధించి, మా కుటుంబం నుండి ఒకరిని తీసుకువెళతారు. అలా ఉంటుంది వారి పద్ధతి. అందుకని  తప్పించుకునే ఆలోచన (పారిపోయే ఆలోచన) ను వదిలేసి ఎంతోకాలం అయింది” అని నిట్టూర్చాడు.

పొలం పనులు  చూసుకోవడానికి తాము తరచుగా, ముఖ్యంగా పొలం పనుల కాలంలో అనుమతి అడుగుతామని, అలా  అడిగినప్పుడు “జైలులో ఉంటే వ్యవసాయం చేసేవాడివా?” అని అంటారని అన్నాడు.

“ప్రజలను బెదిరింపులకు గురిచేసి లొంగిపోవాలని బలవంతం చేయడం లేదా తప్పనిసరి చేయడం పౌర స్వేచ్ఛల మూలాన్ని దెబ్బతీస్తుంది; చట్ట నియమాలను ఉల్లంఘిస్తుంది” అని పియుసిఎల్‌కు చెందిన వి. సురేష్ అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన పాలసీ లేదా కార్యక్రమంలో చేరేలా ప్రజలను నెట్టడానికి బెదిరింపులను ఉపయోగించడం అనేది నైతికంగానూ చట్టపరంగానూ ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.

స్థగితమైన జీవితాలు

మే 15న, ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బీజాపూర్ జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట కొండలలో “21 రోజుల విజయవంతమైన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్” చేసినందుకు భద్రతా బలగాలను అభినందించడానికి బీజాపూర్‌కు వచ్చాడు. ఆ సందర్భంగా, అతను నైపుణ్య శిక్షణా కేంద్రం వద్ద ఆగాడు.

తామంతా వరుసలో నిలబడి ఉంటే, “మావోయిస్టుల కోసం పనిచేయడం మానేసి, మీ గ్రామంలో వ్యవసాయం చేస్తూ మంచి జీవితాన్ని గడపండి” అని ముఖ్యమంత్రి హితబోధ చేసిన విషయాన్ని ప్రసన్న గుర్తుచేసుకున్నాడు.

నిర్బంధంలో ఉన్న కొందరు మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకుని తమ కుటుంబాల దగ్గరకు తిరిగి వెళ్లాలనుకుంటున్నామని ముఖ్యమంత్రికి చెప్పారు. మే 30 నాటికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చాడు – కానీ అది జరగనేలేదు.

బదులుగా, జూన్‌లో, వారిని రాయ్‌పూర్‌కు తీసుకెళ్లి హోంమంత్రితో గ్రూప్ ఫోటో దిగేట్లు చేసారు.

జూలై 14న, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఒక రోజు కోసం బీజాపూర్‌కు వచ్చాడు. ఖైదీలను ఆయన ముందు హాజరుపరిచారు. గ్రామాల్లో హింసాత్మక సంఘటనలు ఇంకా జరుగుతున్నాయని, వారు తిరిగి వెళ్ళడం వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ఆయన వారితో అన్నప్పుడు  తమను వదిలేస్తారనే వారి ఆశలు అడియాసలయ్యాయి. అతను వెళ్లే ముందు వారంతా మరో రెండు నెలలు అక్కడే ఉండటానికి సిద్ధంగావాలని అన్నాడు.

జూలైలో ప్రసన్న నిర్బంధంలో ఉండి జులైకి ఎనిమిద నెలలయింది. “మమ్మల్ని ఇంకో రెండు నెలల తర్వాత విడుదల చేసినా, అప్పటికి వ్యవసాయ సీజన్ అయిపోతుంది,” నిట్టూర్చాడు ప్రసన్న. “నా కుటుంబానికి  ఎలా గడుస్తుంది?”అని ఆవేదన చెందాడు.

2025 ఆగస్టు 22

తెలుగు: పద్మ కొండిపర్తి

https://scroll.in/article/1085674/skill-training-for-surrendered-maoists-or-forced-illegal-detention-by-chhattisgarh-police?fbclid=IwY2xjawMYAEtleHRuA2FlbQIxMQABHiMt0wVy6TegNo7ozP-JZnXmwMdg5FixeE0CV5uhXN5SgKSoe3Xn0ujwZ00s_aem_94QZOiWraDr904SqlGKmyw

Leave a Reply