చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని కొందరు హితవు పలికారు. వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద, అతివాద విధానాల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మరి కొందరు అన్నారు.
భారత విప్లవోద్యమానికి ఉన్నంత చరిత్ర ఈ తరహా విమర్శలకు ఉంది. ఇప్పుడు తాజాగా శాంతి చర్చల నేపథ్యంలో పరిశీలకులు, వ్యతిరేకులు చేస్తున్న విమర్శలే విప్లవ పార్టీ అధికార ప్రతినిధి కా. అభయ్ కూడా చేశారు. విప్లవ పంథాలోని వైఫల్యం వల్ల సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని, విప్లవోద్యమ అతివాదం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. ఈ మాటలకు రెండు రకాల ప్రత్యేకత ఉంది. ఒకటి.. వీటిని విప్లవోద్యమం మీద ఇతరుల అభిప్రాయాల సరసన పెట్టలేం. రెండు..సాధారణ అర్థంలో వీటిని విమర్శలు అని కూడా అనలేం.
విమర్శ అనే మాటకు గంభీరమైన అర్ధం ఉంది. గుణ దోషాలను వాస్తవిక దృష్టితో చూడాలి. ఇది విప్లవోద్యమానికి సంబంధించింది కాబట్టి నిర్మాణాత్మకంగా ఉండాలి. అది మౌలిక పంథాకు సంబంధించింది కాబట్టి సమిష్టి నిర్ణయం కావాలి. విప్లవోద్యమం దశాబ్దాలుగా అనుసరిస్తున్న పద్ధతులకు విరుద్ధంగా ఆయన విడుదల చేసిన ప్రకటన రూపమూ, సారమూ ఉండటంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
సాయుధ పోరాటానికి విప్లవ పార్టీ నాయకత్వం వహించినంత మాత్రాన అది పూర్తిగా పార్టీ సొంత వ్యవహారం కాదు. అది ప్రజలకు, చరిత్రకు సంబంధించింది. ప్రజల పోరాట ప్రపంచానికి, చరిత్రను మార్చే విప్లవానికి సంబంధించింది. అట్లని అదేమీ సెంటిమెంట్ కాదు. వ్యక్తుల ఆకాంక్ష కానే కాదు. సాయుధ పోరాట కార్యరంగంలో నేరుగా ఉన్న వాళ్లు తప్ప ఇతరులు మాట్లాడటానికి వీల్లేని నైతిక భావన కాదు. ప్రజా జీవితం గురించి ఆరాటపడే వాళ్లందరికీ ఏదో ఒక రకంగా సంబంధించిన విషయం. సాయుధ పోరాటాన్ని అంగీకరించినా, వ్యతిరేకించినా.
వేల ఏళ్ల మానవాళి నాగరికత, రాజకీయ వికాసంలోని విజయాలను, వాటి వెనుక సాగిన ఉత్పత్తిదాయకమైన వర్గ ఆచరణను, ఆనాటి అవగాహనలతో, అవసరాలతో సాగిన జీవన్మరణ ప్రజా పోరాటాలను, ఆధునిక యుగంలోని విప్లవాలను చారిత్రకంగా, సైద్ధాంతికంగా మధించి సూత్రీకరించినదే మన దేశంలో విప్లవకారులు అనుసరిస్తున్న దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా. అతి తక్కువ మానవ నష్టంతో వర్గపోరాట అత్యున్నత రూపమైన, అనివార్యమైన, చారిత్రక సత్యమైన సాయుధ పోరాటం మార్క్సిస్టు సిద్ధాంత పునాదిని సంతరించుకున్నది. సాయుధ పోరాటాన్ని అందరూ ఇట్లాగే చూడాలని ఏమీ లేదు. దేనికంటే అది వర్గపోరాట సంబంధమైనది. వర్గ సంఘర్షణను గ్రహించని వాళ్లు ‘ఇప్పటి దాకా చేసింది చాలు ఇక ఆపేయండి, మీ పంథా తప్పు కాబట్టే ఇంత హింసా నిర్బంధాలు, వైఫల్యాలు ఎదురవుతున్నాయని’ అంటారు.
వర్గపోరాటమంటే ఏమిటో తెలియని వాళ్లూ, తెలిసినా దాన్ని అంగీకరించలేని వాళ్లూ, దానితో కలిసి నడవలేని వాళ్లూ, మామూలు మానవతావాదులూ సాయుధ పోరాటంలో హింసను మాత్రమే చూసే ప్రమాదం ఉంటుంది. ప్రజల తరపున పోరాడుతున్న విప్లవకారులు సాయుధ పంథా వల్లనే ప్రభుత్వం అణచివేయాల్సి వస్తున్నదని, అందువల్లే హింస పెరుగుతున్నదని ఇలాంటి వాళ్లు వాదిస్తూ ఉంటారు. కాబట్టి సాయుధ పోరాటాన్ని విరమించాలని సూచిస్తూ ఉంటారు.
ఈ వాతావరణం ముమ్మరంగా ఉన్న సందర్భంలో విప్లవ పార్టీ అధికార ప్రతినిధి కూడా సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మాటకు సహజంగానే సమాజమంతా అట్టుడికిపోయింది. ఒక పక్క విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి ఆపరేషన్ కగార్ పేరుతో తీవ్ర అణచివేత కొనసాగుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, విప్లవాభిమానులు కాల్పుల విరమణ అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కనీసంగా పట్టించుకోవడం లేదు. సాయుధ పోరాటం విరమిస్తున్నాం అని అభయ్ ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు కా. వికల్ప్, కా. కోసా దారుణ హత్యలకు గురయ్యారు. చత్తీస్‌ఘడ్‌లో, ఝార్ఖండ్ లో ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉన్నది. సాయుధ పోరాట విరమణ, శాంతి చర్చలు అనే అభయ్ ప్రతిపాదనను కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పరిగణనలోకి తీసుకోలేదు. అలాంటి ప్రక్రియలను, పరిభాషను పట్టించుకోదల్చుకోలేదు. ‘తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయకుండా మిగిలిన విప్లవ శక్తులను కాపాడుకోలేం’ అనే అభయ్ భావనను అమిత్‌షా అంగీకరించదల్చుకోలేదు. విప్లవకారులు తమంతతాము వచ్చి లొంగిపోయి పునరావాసం పొందడమా? లేక చచ్చిపోవడమా? తేల్చుకోవాల్సిందే అని తాజా ప్రకటనలో మరోసారి తేల్చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభయ్ ప్రకటన వల్ల కలిగిన దిగ్భ్రాంతి నుంచి, విషాదం నుంచి, అయోమయం నుంచి సమాజం ఇప్పటికీ తేరుకోలేదు.
సెప్టెంబర్ 16వ తేదీన తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు కా. అభయ్ ప్రకటన బైటికి వచ్చింది. ఆ తర్వాత కొద్ది గంటలకు ఆ ప్రకటనను ఆయన చదివి వినిపించిన ఆడియో విడుదలైంది. ఈ ప్రకటన ఆగస్టు 15న రాసినట్లుంది. ఆ మరుసటి రోజు ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’ అనే మరో ప్రకటన వచ్చింది. ఇది మావోయిస్టు పార్టీ సెంట్రల్ బ్యూరో సభ్యుడు కా. సోనూ అని ఉంది. దీని మీద ఆగస్టు 2025 అని ఉంది.
ఏ రాజకీయ పార్టీలో అయినా అధికారిక వైఖరులను ప్రకటించడమే ప్రతినిధి బాధ్యత. మౌలిక విధానానికి లోబడి సమకాలీన పరిణామాలపై వ్యాఖ్యానించాలి, వైఖరులు చెప్పాలి. ఈ పని చేయడానికే అధికార ప్రతినిధి అనే ఏర్పాటు ఉంటుంది. కానీ తాత్కాలికంగా సాయుధ పోరాటం విరమిస్తున్నామనే పంథాకు సంబంధించిన ప్రకటన అభయ్ ఇవ్వడంలోని సాంకేతిక విషయాలు పూర్తిగా ఆ పార్టీకి సంబంధించినవి కాబట్టి వాళ్లు నిర్ణయించుకోవాల్సిందే. కానీ ఆ ప్రకటనలోని పరస్పరం పొసగని మాటలు మాత్రం పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించాయి. సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనే వైఖరి పార్టీ యావత్తూ తీసుకున్నదనే స్పష్టత అందులో లేదు. ఒకచోట తనకు అందుబాటులో ఉన్న వాళ్లతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, దీన్ని అంగీకరించే వాళ్లతో శాంతి చర్చలకు వెళ్లుతున్నట్లు ఉంది. ఇదంతా తమ పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు జీవించి ఉన్న రోజుల్లో చూపిన మార్గాన్ని ముందుకు తీసుకపోడమే అని ఉంది. మరో చోట పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదనే అర్థం వచ్చేలా ఉంది. అంటే ఆయన వైఖరి పార్టీ అధికారిక నిర్ణయం కాదని అర్థం కూడా అందులో ఉన్నది. ఒక వేళ సాయుధ పోరాట విరమణ ప్రతిపాదనపై నిర్మాణాన్నంతా ఏకాభిప్రాయానికి తీసుకరావలసి ఉంటే, అప్పుడే ఎందుకు బహిరంగం చేశారనే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్బంధం వల్ల ఏర్పడిన అసౌకర్యాన్ని అధిగమించి ఏకాభిప్రాయం కూడగట్టేందుకైనా సరే, ఆ ప్రకటన ద్వారా అనుసరించదల్చుకున్న పద్ధతులు మరింత విస్మయం కలిగించాయి. ఒక విప్లవ పార్టీ, అందునా అజ్ఞాత పార్టీ ఇట్లా వ్యవహరిస్తుందా? అనే సందేహం కలిగేలా ఆ ప్రకటన సాగింది. అయినా సరే ఇవన్నీ సాంకేతికమని, తమ పార్టీ ఆంతరంగికమని ఆయన సమర్థించుకోవచ్చు.
అంతకంటే తీవ్రమైన, అభ్యంతరకర, వివాదాస్పద విషయాలు ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’లో ఉన్నాయి. అందులో విప్లవోద్యమ ప్రస్తుత స్థితిని వివరించే కొన్ని అంశాలు ఉన్నాయి. విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని, తీవ్ర నిర్బంధం వల్ల కలుగుతున్న ఎదురుదెబ్బలను గుర్తించి, పురోగమించాలని కోరుకుంటున్న అభిమానులు కూడా వాటిని అంగీకరించవచ్చు. ఈ స్థితి నుంచి బైటపడ్డానికే ఈ ప్రయత్నమని అనుకొనేలా అవి ఉండవచ్చు. ఆ మేరకు ఆ ప్రకటన కొన్ని వాస్తవాలను చెబుతున్నట్లే ఉంది. వేలాది మంది అమర వీరుల త్యాగాలను కొనసాగించే సదుద్దేశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ స్ఫూర్తికి లోటు లేనట్లు కనిపిస్తూనే, దానికి భిన్నమైన, వ్యతిరేకమైన వైఖరితో ఆ రచన సాగింది. కేవలం భాషలోనేకాక, వివరాల్లో, స్ఫూర్తిలో కూడా వైరుధ్యాలతో సాగింది. సాయుధ పోరాట విరమణలాంటి మౌలిక పంథాకు సంబంధించిన విషయాలపై ప్రకటనలో ఉండాల్సిన రాజకీయ పటుత్వం, కచ్చితత్వం లేవు.
ఆ ప్రకటనలోని మొదటి ఒకటిన్నర పేజీల్లో విప్లవోద్యమం చాలా విజయాలు సాధించిందని, ప్రజల కృషి, త్యాగం వల్లనే ఇదంతా సాధ్యమైందనే వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత అంతా అపజయాల పరంపరను వివరించారు. దానికి విప్లవోద్యమం చేసిన తప్పులే కారణమని చెప్పడం మొదలు పెట్టారు. శతృవు బలాన్ని అంచనా వేసి తగిన ఎత్తుగడలు అనుసరించడంలో విప్లవోద్యమం ఆరంభంలో విఫలమైందని రాశారు. ఈ మాట నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట కాలం దాకా నిజమే. దానికి ఆనాటి అతివాద ధోరణే కారణం. కానీ ఆ తర్వాత గడచిన యాభై ఏళ్లలో కూడా ఎక్కడా సాపేక్షంగా, నిలకడగా విప్లవోద్యమాన్ని నిర్మించడంలో విఫలమయ్యామని, శతృవుకు అభేద్యమైన రహస్య పార్టీని నిర్మించడంలో, మారుతున్న పరిస్థితులకు తగినట్లు సిద్ధాంత అన్వయంలో విఫలమయ్యామని, అతివాదం వల్లే ఈ ఘోరమైన వైఫల్యాలని ఆయన రాశారు. సైన్యాన్ని ప్రధానం చేసి, ప్రజా పోరాటాలను తక్కువ చేశామని, నాయకత్వ అవగాహనలో, సిద్ధాంత అధ్యయనంలో, మారుతున్న పరిస్థితులకు సిద్ధాంతాన్ని అన్వయించడంలో దీనికి మూలం ఉందని అన్నారు.
బహుశా ఇంతకంటే తీవ్రంగా విప్లవోద్యమం ఆంతరంగికంగా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఉంటుందని ఎవరైనా ఊహించగలరు. అలాంటి సమీక్ష లేకుండా ఇంత కాలం యాంత్రికంగా, గుడ్డిగా వ్యవహరించిందని అనుకోరు. కానీ అభయ్ ఇలాంటి స్వీయ విమర్శను ఎత్తుగడలు, సిద్ధాంత అన్వయం దగ్గరి నుంచి వ్యూహం దగ్గరికి తీసికెళ్లారు. ఏ విప్లవోద్యమంలో అయినా ఆటు`పోట్లు, వెనుకంజలు, ఓటములు ఉంటాయనే సాధారణ సూత్రాన్ని చెబుతూ, వీటి మధ్యనే భారత విప్లవోద్యమం ఏ విజయాలు సాధించిందీ కనీసంగా చెప్పలేదు. అన్నీ ఓటములే, అన్నీ తప్పులే అని రాశారు. వైఫల్యాలను గుర్తించేందుకు విజయాలను విస్మరించనవసరం లేదు. విజయాలను చూపి ఓటములను దాచేయనవసరం లేదు. ఎక్కడైనా అతివాదం, స్వీయాత్మకత ఉండవచ్చు. కానీ ప్రజా పంథా లేనే లేదా? విప్లవ ఆచరణే లేదా? మూడు తరాలుగా, దేశంలో అనేక అసమాన అభివృద్ధి దశల్లో ఉన్న ప్రాంతాల్లో కొనసాగుతున్న విప్లవోద్యమం ప్రజా పంథాను ఏ కొంచెమూ నేర్చుకోలేదా? బలహీనతలను, లోపాలను అధిగమించే ఆచరణాత్మక రాజకీయ సిద్ధాంత విశ్లేషణా పద్ధతిని విప్లవోద్యమం రూపొందించుకోలేదా? దాని ప్రకారం లోపలికి తొంగి చూసుకొని కొన్ని బలహీనతల నుంచైనా బైటపడ్డానికి ఆచరణలో ప్రయత్నించలేదా? ఇన్నేళ్ల విప్లవోద్యమ ఆచరణ, అవగాహన అంతా లోపభూయిష్టమే అని తేల్చేశాక విప్లవోద్యమం ఇంత నిర్బంధంలో ఎట్లా తట్టుకున్నదనే మౌలిక ప్రశ్న ఎవరికైనా వస్తుంది. విస్తరణ-కుదింపు-విస్తరణల మధ్య ప్రజల జయాపజయాలను కలిపి కదా చూడాల్సింది. అభయ్ తాను ఒక నిర్ధారణ చెప్పదలిచి దానికి తగినట్లు ఆ ప్రకటన రాశారని ఎవరైనా ఎందుకు సందేహించకూడదు? అంతకుమించి ఇంకో సమస్య ఉన్నది. విప్లవోద్యమంలో ఆంతరంగికంగా అత్యంత నిశితంగా, నిర్దాక్షిణ్యంగా జరిగే సమీక్షను బహిరంగపరచదల్చుకుంటే దానికి కూడా విప్లవోద్యమం మొత్తాన్ని మదింపు చేయగల సంవిధానాన్ని అనుసరించాల్సి ఉండిరది.
కానీ ఆయన విప్లవోద్యమ వైఫల్యాలను నాయకత్వ అవగాహన, సిద్ధాంత అన్వయం, ఎత్తుగడల నుంచి వ్యూహం దాకా తీసుకపోదలిచారు. ‘ఈ పరిస్థితులను తిరిగి చక్కదిద్దుకోడానికి ఎంత పట్టుదలతో పని చేసినప్పటికీ మిగిలిన విప్లవ శక్తులకు మౌలికంగానే పార్టీ వ్యూహం ఎత్తుగడలను, విధానాలను మార్చుకోకుండా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది’ ఈ పరిస్థితుల్లో విప్లవోద్యమాన్ని తిరిగి నిర్మించడానికి తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇప్పటికైనా దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితులలోని మార్పులతో, స్థల కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్థి చెప్పి భారత స్థల కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం’ అని రాశారు.
ఐదు దశాబ్దాల విప్లవాచరణనంతా పిడివాదమని ఒక్క మాటలో చెప్పడం ఎవ్వరికైనా సాధ్యమేనా? ఇందులో అనేక సిద్ధాంత సమస్యలు ఉన్నాయి. లక్షలాది ప్రజల భాగస్వామ్యంతో, కోట్లాది మంది ప్రజల ప్రత్యక్ష, పరోక్ష ఆకాంక్షలతో, వేలాది మంది ప్రజల బలిదానాలతో సాగిన వర్గ పోరాట ఆచరణను సిద్ధాంత తలంలో నిర్ధారించాలి. మౌలిక పంథాను ఆచరించే క్రమంలో వచ్చిన అనేకానేక వైఫల్యాలను, విజయాలను కలిపి చూడాలి. అత్యంత వేగంగా, సంక్లిష్టంగా మారుతున్న రాజకీయార్థిక సాంస్కృతిక ప్రపంచంలో విప్లవోద్యమం స్వీకరించిన రాజకీయ పంథా ఆచరణలో విస్తరించిందా? కుదించుకపోయిందా? వివరించాల్సి ఉంటుంది. వాటిని చర్చించగల భావనల దగ్గరికి కూడా వెళ్లకుండా, వైఫల్యాల జాబితా ప్రకటించి సూత్రీకరిస్తే విశ్వసనీయత ఉంటుందా?
కగార్ యుద్ధంలో సాధారణ ప్రజల, విప్లవ శ్రేణుల ప్రాణాలు కాపాడటానికి విప్లవోద్యమం ఆరంభించిన కాల్పుల విరమణ`శాంతి చర్చల ప్రక్రియలోంచి అభయ్ తాత్కాలిక సాయుధ పోరాట విరమణను బైటికి తీసుకొచ్చారు. అక్కడితో ఆగలేదు. చాలా సహజంగానే వ్యూహం మార్చడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ అర్థంలో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయన రాశారు కానీ అసలు ఉద్దేశం విప్లవ పంథాను తిరస్కరించడం. దీర్ఘకాలిక ప్రజా యుద్ధం మన స్థలకాలాలతో, మారుతున్న పరిస్థితులతో, భారత సమాజంతో సంబంధం లేని పిడివాదం అని చెప్పదల్చుకున్నారు. కాబట్టి దాన్ని ఒదిలేయాలి. తాత్కాలికమనే పదం ఉపయోగించారేగాని శాశ్వతంగా ఈ ‘పిడివాదాన్ని’ విసర్జించాలని ఆయన కోరుకుంటున్నారు. ‘భారత స్థల కాల పరిస్థితులకు తగిన పంథా’ ఏమిటో ఆయన కనీసంగా ప్రస్తావించలేదు. అసలు తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రక్రియ ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేదు. పోరాట విరమణ జరిగితే ఆదివాసీ ప్రాంతాల్లో, మిగిలిన పోరాట ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు రక్షణ ఏమిటనే కనీస ఆలోచన కూడా అందులో లేదు. నిజంగానే నాయకత్వం సాయుధ పోరాటాన్ని విరమించి ‘భారత పరిస్థితులకు తగిన కొత్త పంథాను’ తయారు చేసే సిద్ధాంత కృషిలో ఉంటే పోరాట ప్రాంతాల్లో ఇంత కాలం తనను ప్రతిఘటించిన ప్రజలను రాజ్యం ఊచకోత కోయదని భరోసా ఏమున్నది? చిట్ట చివరికి ‘సాయుధ పోరాట విరమణ’ అనే మాటను కూడా వినడానికి సిద్ధంగా లేకుండా లొంగిపోవాల్సిందే.. అంటూ ఈ పదిహేను రోజుల్లో ఎంత మందిని రాజ్యం చంపేసిందీ తెలుస్తూనే ఉన్నది.
ప్రభుత్వంతో శాంతి చర్చలు చేయడానికి, తద్వారా ప్రాణ నష్టం నివారించడానికి తాత్కాలిక సాయుధ పోరాట విరమణా? లేక ఇన్నేళ్లు అనుసరించిన విప్లవ పంథానే తప్పు కాబట్టి దాన్నుంచి బైటపడ్డానికా? ఇదీ అభయ్ ప్రకటనలోని అసలు వైరుధ్యం. ఏ సందర్భంలో దేన్ని తీసుకొచ్చారు? నష్ట నివారణకైనా సాయుధ పోరాట తాత్కాలిక విరమణ సరైన మార్గమా? అనే ప్రశ్న ఏదో ఒక వైపు నుంచి పొంచి ఉండేదే. దాన్ని ఆయన విస్మరించవచ్చు. అప్పుడు కూడా శాంతి చర్చలకు-నష్ట నివారణకు సాయుధ పోరాట విరమణనూ, దీర్ఘకాలిక సాయుధ పోరాటం తప్పు కాబట్టి దాన్నుంచి బైట పడాలనే ఆలోచననూ కలిపేయడం ఏమిటనే మరో ప్రశ్న తలెత్తుతుంది.
దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది విప్లవ పార్టీ వ్యూహంలో భాగమే కాదు. అది భారత విప్లవోద్యమ మౌలిక పంథా. విప్లవోద్యమ వైఫల్యాలను ఏకరువు పెట్టినంత మాత్రాన పంథా తప్పయిపోదు. ఆ వైఫల్యాలన్నీ చాలా వరకే నిజమే. ఈ అనుభవాలను లోతుగా పరిశీలించి ఆచరణను సవరించుకోవాల్సిందే. అంత మాత్రాన వైఫల్యాలన్నిటికీ పంథా కారణమని చెప్పడం హేతుబద్ధం కానవసరం లేదు. ఇది విప్లవ రాజకీయాల్లో ప్రాథమిక పాఠశాల చదువు ఉన్న వాళ్లకు కూడా తెలిసిందే. పరిస్థితులకు తగిన ఎత్తుగడలను రూపొందించడంలో, పాలకవర్గం సృష్టిస్తున్న సంక్షోభాల్లోంచి ప్రజలు పోరాటాల్లోకి కదిలే నినాదాలను అందివ్వడంలో, ప్రజలను సంఘటితం చేసే నిర్మాణ రూపాలను ఏర్పాటు చేయడంలో, ఎప్పటికప్పుడు ప్రజలు అందుకొనే పోరాట రూపాలను ఎంచుకోవడంలో లోపాలు ఎన్నయినా జరిగి ఉండవచ్చు. మారుతున్న పరిస్థితులకు తగినట్లు మౌలిక పంథాను సృజనాత్మకంగా అన్వయించి ఆచరణలో పరీక్షించుకుంటూ, సవరించుకుంటూ పురోగమించాల్సిందే. తద్వారా ప్రతి వైఫల్యాన్నీ జాగ్రత్తగా చర్చించవలసిందే. నిజానికి ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలేవీ జరగనే లేదా? అలాంటి కృషి చేయకపోయి ఉంటే ఆయనే చెప్పినట్లు కొద్ది కాలమైనా, కొన్ని ప్రాంతాల్లోనైనా సాపేక్షంగా బలంగా ఉద్యమాలు ఎట్లా నిర్మాణమయ్యాయి? ఆ విజయాలు కూడా మౌలిక పంథాలోనే సాధ్యమయ్యాయి కదా? అనే ప్రశ్న ఎదురవుతుంది. అంతా ‘మిడిమిడి జ్ఞానంతో, అతివాద ఒంటెత్తువాద పోకడలే’ అయితే ఈ జయాపజయాలకు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి?
అవేవీ పట్టించుకోకుండా అన్నిటికీ పంథాలో కారణాలు వెతకడం, దాన్ని మార్చేయాలనుకోవడం మాత్రం నికార్సయిన పిడివాదం. అననుకూల పరిస్థితుల్లో ప్రజలు సాయుధ పోరాటం చేయలేకపోవచ్చు.. కానీ ఒక పంథాగా దాన్ని తిరస్కరించడమంటే చారిత్రక పరిణామం తెలియనట్లే. సాయుధ పోరాటాల వల్లే మానవ చరిత్రలో గుణాత్మక లేదా మౌలిక మార్పులు సంభవించాయని అందరికీ తెలిసిన సత్యం. విప్లవోద్యమ అపజయాల నుంచి సాయుధ పోరాటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్దాల్సిందే. చట్టబద్ధ, సాయుధ పోరాటాల మధ్య మేలైన సమన్వయం సాధించాల్సిందే. ఇది తప్పక మారుతున్న పరిస్థితులకు తగినట్లు ఎప్పటికప్పుడు సిద్ధాంత అన్వయ బలంతో ముందుకు పోవాల్సిందే. అభయ్‌కి ఇవి తెలియవని అనుకోగలమా? కాకపోతే సాయుధ పోరాటాన్ని ఆపేయాలనుకున్నారు. అందువల్ల విప్లవోద్యమ ఎదురుదెబ్బలకు అందులో మాత్రమే కారణాలు కనిపించాయి.
మరి, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టాక ఇక ఏం మిగిలి ఉంటుంది? ఇక వేళ ఈ పంథా తప్పనుకొని, దానికి ప్రత్యామ్నాయ పంథాలో విప్లవోద్యమాన్ని తిరిగి నిర్మించాలని అనుకుంటున్నాడని నమ్మితే కూడా ఆయన ప్రకటన ఇంకోలా ఉండేది. అంత బేలగా ఉండేది కాదు. మీ న్యాయమైన పోరాటాలకు మీ నుంచే నాయకత్వాన్ని తయారు చేసుకోండని ప్రజలకు చెప్పి చేతులు దులుపుకొనే వాడు కాదు. సాయుధ పోరాట పంథా సరే, మరే పోరాట పంథాను ఆచరించదల్చుకోలేదు కాబట్టే తమ నాయకత్వం ఇక ఉండదని నిష్పూచీగా ప్రకటించారు. ‘తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నాంగాని, మరో పద్ధతిలో పోరాడుదాం.. మీకు పార్టీ నాయకత్వం ఉంటుంది.. ఈ కొత్త పద్ధతిలో తక్షణ సమస్యలు పరిష్కరించుకుందాం..విప్లవాన్ని విజయవంతం చేద్దాం..’ అని తప్పక రాసేవారు.
అలాంటి మాట ఏదీ ఆయన ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’లో లేదు. దేనికంటే సాయుధ పోరాటం వదిలేశాక మిగిలేది పార్లమెంటరీ పంథానే. మధ్యలో ఇంకేదో అద్భుతం ఉందని ఎవరైనా ఎందుకు విశ్వసించాలి? సాయుధ పోరాటం సహా అన్ని ప్రజాస్వామిక, చట్టబద్ధ పోరాటాలను నిర్వహించే మౌలిక పంథాను వదిలేశాక ప్రజల క్రియాశీలత ఎట్లా పెరుగుతుంది? ప్రజల మిలిటెన్సీ అభివృద్ధి చెందకుండా వర్గపోరాటం ఎట్లా పురోగమిస్తుంది? అనే ప్రశ్నలు ఎదురవుతాయి.
దేశంలో అనేక మార్పులు జరుగుతోంటే ఇంకా సాయుధ పోరాటం చేయడం ఏమిటి? స్థల కాల పరిస్థితులు తెలియని తెలివితక్కువతనం కాకపోతే…అని కొన్ని దశాబ్దాలుగా విప్లవోద్యమాన్ని విమర్శిస్తున్న వాళ్లంతా ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నది పార్లమెంటరీవాదాన్నే. నిజానికి పార్లమెంటరీ పంథాకు ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా వచ్చింది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా తిరిగి పార్లమెంటరీ పంథాను తీసుకరావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విప్లవోద్యమ నాయకుడే మరో వైపు నుంచి దీర్ఘకాలిక ప్రజా యుద్ధం ఒక పిడివాదమని అంటున్నారు. మరి ఆయన ప్రత్యామ్నాయం ఏమిటో చూడాలి.
ఒక రకంగా ఈ తరహా వాదన కొత్త కాదు. భారత విప్లవోద్యమం నుంచి వేర్వేరు సందర్భాల్లో దీర్ఘకాలిక పంథా తప్పనే వాదనలు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయ విప్లవ పంథాను ఇప్పటికీ కనీసంగా ఎవ్వరూ ఆచరణలోకి తీసుకరాలేదు. విప్లవోద్యమమైతే తాను ఎంచుకున్న సాయుధ పోరాట పథంలో నష్టాలను అధిగమిస్తూ, సృజనాత్మకంగా ఆలోచస్తూ, విప్లవాన్ని ఆచరిస్తూ దృఢంగా ముందుకే పోతానని, సాయుధ పోరాట పంథా ప్రజలకు సంబంధించింది కాబట్టి వారికి ద్రోహం చేయనని, రివిజనిస్టుగా మారనని ప్రకటించింది.
మొత్తం మీద ఇదొక సందిగ్ధ కాలం. విప్లవోద్యమ నిర్మూలనా యుద్ధం జరుగుతున్న వేళ ఇదీ తప్పించుకోలేనిదే కావచ్చు. ఆ రకంగా ఇది వర్గపోరాట రాజకీయాల చర్చ. మానవ సమాజ వికాసానికి చోదకమైన వర్గపోరాటం పదునెక్కే చారిత్రక సందర్భం. బైటి నుంచి వర్గ రాజకీయాలను నిర్మూలించే యుద్ధం తీవ్రమయ్యాక లోపల కూడా ఘర్షణ తలెత్తుతుంది. వర్గపోరాటానికి ఉన్న బలం ఇదే. లోపలా బైటా వర్గపోరాటం రుజువు కావాల్సిందే. నక్సల్బరీ పంథాకు విప్లవోద్యమం దృఢంగా నిలబడి అనేక గెలుపు ఓటముల మధ్యనే వర్గపోరాటాన్ని కొనసాగిస్తూ ఉండటం ఎంత వాస్తవమో అంతే తీవ్రంగా పంథా మీద చర్చలు సుదీర్ఘకాలంగా జరగడం వాస్తవం. భారత విప్లవోద్యమ సజీవతే దీనికి నిదర్శనం. ఆర్గానిక్ ఉద్యమాల్లోనే ఇది సాధ్యం. కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం చేస్తున్న ఈ అంతర్యుద్ధం నుంచి విప్లవోద్యమం ఎట్లా బైటపడుతుందో, ఈ అంతర్గత వివాదాన్ని ఎట్లా అధిగమిస్తుందో ఎదురు చూద్దాం.
పార్టీ పంధానే తప్పని ప్రకటించిన వానికి పార్టీ పేరుతో పిలుస్తూ సగౌరవంగా సంభోదిస్తూ రాయడంలోనే లోపముంది. ప్రజలు పోరాడి తెచ్చుకున్న ఆయుధాలను పోరాడుతున్న వారికీ అప్పగించి బయటకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. లేదా DRG లో చేరి అయినా హంతకుడుగా బతకాలి. సిగ్గుంటే ఉరిసుకుని చావాలి.