కొద్దికాలంపాటు నేను మౌన జీవితంలోకి వెళ్లిపోయాను. కానీ రాజ్య ప్రాయోజిత హింస పెరుగుదల, భారతదేశం అంతటా పునరావృతమయ్యే సంఘర్షణ మరింత లోతైన ప్రతిస్పందనకు బలవంతం చేసింది. మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన హత్యలు విడి ఘటనలు కావు. ప్రజాస్వామ్య ఆరోగ్యం, అట్టడుగు వర్గాలతో వ్యవహారానికి సంబంధించిన విస్తృతమైన, కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవ రావు @ బసవరాజ్ సహా మావోయిస్టులుగా గుర్తించిన పలువురు వ్యక్తుల మరణానికి దారితీసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలు మరోసారి ఆదివాసుల ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణపట్ల దృష్టిని ఆకర్షించాయి. విభేదాలు, తిరుగుబాటులను ఎదుర్కోవడంలో సైనిక చర్యలు రాజ్య విధానాలను ఎలా రూపొందిస్తున్నాయో ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

కుల, మత, జెండర్, జాతి ఆధారంగా హింసాత్మక ఘటనలు దేశంలో కొనసాగుతున్నాయి. అనేక ఆదివాసీ ప్రాంతాలలో, తమ జీవనోపాధి కోసం భూమి, అడవులు, నీటిపై ఆధారపడిన సముదాయాల నిర్వాసిత్వానికి అభివృద్ధి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున దారితీసాయి. ఈ ప్రాంతాల్లో ప్రతిఘటన తరచుగా వ్యవస్థీకృత రూపాలను తీసుకుంది; వాటిలో కొన్ని సిపిఐ (మావోయిస్ట్) వంటి వామపక్ష తీవ్రవాద గ్రూపులతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి తిరుగుబాటు ఉద్యమాల పెరుగుదల కూడా రాజ్యనిఘా, సైనికీకరణ పెరగడానికి దారితీసింది.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత, అభివృద్ధి పేరుతో ఆదివాసీ సముదాయాలు అసమానంగా నిర్వాసిత్వానికి గురయ్యాయి. పెద్ద మౌలిక సదుపాయాల, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులయ్యేవారిలో దాదాపు 40-50 శాతం మంది ఆదివాసీ సముదాయాలకు చెందినవారేనని అధికారిక అంచనాలు, ఐక్యరాజ్య సమితి నివేదికలు సూచిస్తున్నాయి. ఇటువంటి నిర్వాసిత్వ సామాజిక-ఆర్థిక ప్రభావం ఒక క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయింది;  చాలామందికి సరైన పునరావాసం లేదా న్యాయం అందుబాటులో లేదు.

పారిశ్రామిక అభివృద్ధి ప్రయోజనాలు, స్థానిక సముదాయాల హక్కుల మధ్య కొనసాగుతున్న ఈ పోరాటంలో ఖనిజ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్, ఒడిశా కీలక ప్రాంతాలుగా ఉద్భవించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఉన్న బొగ్గు, బాక్సైట్ నిల్వలలో ఎక్కువ భాగం ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, మైనింగ్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది; అయితే అనేక ప్రాంతాలలో అటవీ ప్రాంతం తగ్గింది.

ఈ నేపథ్యంలో అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక బలగాల వినియోగం మావోయిస్టుల తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యూహంలో భాగంగా మారింది. దేశీయంగా శిక్షణ పొందిన భద్రతా బలగాలు అంతర్జాతీయ సహకారంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో నిరంతర కార్యకలాపాలు నిర్వహించాయి. అయితే ఈ ఆపరేషన్‌ల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, మహిళలతో పాటు మైనర్లను లక్ష్యంగా చేసుకుని అమాయక పౌరులను హతమార్చడం వంటివి జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

గత రెండు దశాబ్దాలుగా, ఈ ఘర్షణలో వేలాది మంది భద్రతా సిబ్బంది, మావోయిస్టులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సల్వా జుడుమ్, ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి కార్యక్రమాల ద్వారా సైనిక పరిష్కారాలపైన రాజ్యం దృష్టి సారించడం; ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాలను ఉపయోగించడంవల్ల చెల్లించాల్సిన మూల్యాన్ని గురించి పౌర సమాజ సమూహాలు, మానవ హక్కుల పరిశీలకులలో ఆందోళన రేకెత్తించాయి.

హింసా బాధితులు న్యాయం పొందడం కష్టమనేది తరచూ వెలుగులోకి వచ్చే సమస్యల్లో ఒకటి. చట్టాతీత హత్యలు, నిర్బంధంలో హింస, లైంగిక హింస వంటి కేసుల్లో శిక్షలు, జవాబుదారీతనం చాలా అరుదుగా ఉన్నాయి. 2012 సర్కేగుడా హత్యలు లేదాతాడ్‌మెట్ల దహనకాండ వంటి ముఖ్యమైన సంఘటనలు న్యాయ విచారణలకు దారితీశాయి; కాని కొన్నింటిలో మాత్రమే నేరస్థులపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నారు.

అనేక సందర్భాల్లో, మరణించిన వారి కుటుంబ సభ్యులు తమ ప్రియమైనవారి మృతదేహాలను తిరిగి పొందడం కూడా చాలా కష్టమైంది. బసవరాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న న్యాయపరమైన విచారణను రద్దు చేసి, ప్రజారోగ్య సమస్యలను ఉదహరించి రాజ్యమే మృతదేహాలను దహనం చేసిన బసవరాజ్ కేసు ఇటీవలి ఉదాహరణ. ఆపరేషన్ అనంతర విధానాల పారదర్శకతను ప్రశ్నించే న్యాయ నిపుణులు, కార్యకర్తలు ఇటువంటి చర్యలను విమర్శించారు.

మావోయిస్టు గ్రూపులు అప్పుడప్పుడు బహిరంగ ప్రకటనలు చేస్తూ శాంతి చర్చలు జరపాలని చేసిన ప్రతిపాదనలు, తరచుగా మౌనాన్ని లేదా రాజ్య తిరస్కరణను ఎదుర్కొన్నాయి. చర్చలు జరపడానికి మద్దతునిచ్చిన పౌర సమాజ సభ్యుల విధేయతపై కూడా  ప్రశ్నలు తలెత్తాయి. విభిన్న కోణాలను కలిగిన వాతావరణం ఈ వివాదానికి గల కారణాల గురించి బహిరంగంగా చర్చించడాన్ని కష్టతరం చేసింది.

ఈ ప్రాంతాలలో అన్ని ప్రతిఘటనలు సాయుధంగా లేవనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం. భూ హక్కులు, అటవీ హక్కులు, పర్యావరణ సమస్యలపై దృష్టి సారించిన స్థానిక సముదాయాల అనేక నిరసనలు, ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయి. అయితే, ఇటువంటి నిరసనలు అరెస్టులు, క్రిమినల్ ఆరోపణలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పుడు, ప్రజలను మరింతగా దూరం చేస్తుంది; ప్రభుత్వ సంస్థలపై విశ్వాసాన్ని తగ్గిస్తుంది.

సైద్ధాంతిక తీవ్రవాదం, చట్టబద్ధమైన సామాజిక-ఆర్థిక ఫిర్యాదుల మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది. సాయుధ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి, జాతీయ భద్రతను నిర్ధారించడానికి రాజ్యానికి అన్ని హక్కులు, విధులు ఉన్నప్పటికీ, అది రాజ్యాంగ హక్కులను కూడా సమర్థించాలి; న్యాయమైన ప్రక్రియను నిర్ధారించాలి; ముఖ్యంగా దాడికి లోనయ్యే, అట్టడుగున ఉన్న వర్గాల నుండి వచ్చిన పౌరుల మర్యాదను గౌరవించాలి.

అసంతృప్తికి మూల కారణాలను పరిష్కరించకుండా, సైనికీకరణ ద్వారా మాత్రమే దీర్ఘకాలిక శాంతిని సాధించవచ్చా? అనే విస్తృతమైన ప్రశ్న ఇంకా మిగిలేఉంది. ఆదివాసీ ప్రాంతాలలో వలసలు, అభివృద్ధిలో లోపం, విద్య, ప్రాథమిక సేవలు లేకపోవడం వంటి సమస్యలు కేవలం చట్టాలను అమలు చేయడం ద్వారా పరిష్కారం కావు. తిరుగుబాటు సమూహాల పద్ధతులు లేదా భావజాలంతో ఏకీభవిస్తున్నామా లేదా అనేదానితో సంబంధం లేకుండా, ఆదివాసీ సముదాయాలను నిరంతరం అట్టడుగున ఉంచడం, అధిక బలప్రయోగం, నిజమైన సంభాషణ లేకపోవడం పెద్ద ప్రజాస్వామ్య లోటుకు సంకేతాలు అని స్పష్టంగా తెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాలలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న సంఘర్షణకు ఏదైనా అర్ధవంతమైన పరిష్కారం లభించాలంటే ఈ లోటును పరిష్కరించాలి.

అప్పటివరకు, ఈ ప్రాంతాలలో మరణాలు భద్రతా విజయాలు లేదా మరణాలుగా మాత్రమే కాకుండా, ప్రజాస్వామిక జవాబుదారీతనంలో లోతైన పతనానికి సంకేతాలుగా కూడా లెక్కించబడతాయి.

 జూలై 26, 2025

తెలుగు: పద్మ కొండిపర్తి

https://www.counterview.net/2025/07/deaths-in-chhattisgarh-are-not-just.html

Leave a Reply