1
మళ్లీ ఊపిరి పోసుకుంటాయి

నా బిడ్డ తిరిగి వస్తాడా
ముక్కుపచ్చలారని నా బిడ్డను
నేను తొమ్మిది నెలలు మోసినా
నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా
పుట్టిన నా బిడ్డ
మళ్లీ తిరిగి వస్తాడా.

మొన్ననే మొదటిసారి అమ్మ అని పిలుస్తుంటే
ఎంత సంతోష పడిపోయామో
మళ్ళీ ఆ పిలుపు నాకు వినిపిస్తుందా
నన్ను అమ్మ అని మళ్ళీ పిలుస్తాడా .

నల్లని రూపున నా బిడ్డకు
తెల్లని పాల బువ్వ తినిపించి
జో కొడితే హాయిగా నిద్రపోయే నా బిడ్డ
మళ్లీ తిరిగి లేస్తాడా
మిగిలిన పాల బువ్వ తిని
హాయిగా నిద్ర పోతాడా .

మాటరాని నా బిడ్డను మావోయిస్టు అంటూ
గుండెల్లో గుండును దింపిన
ఆ కార్పొరేట్ తుపాకులకు
ఆ తుపాకులకు కొమ్ము కాసే కమలాలకు
ఏం తెలుసు
స్వచ్ఛమైన అడవి వాసన.

ఇప్పుడు
మా గూడెం అంతా కలిసి
నా బిడ్డ సమాధి చుట్టూ
ఎర్రమందారాలను నాటుతున్నాం
ఈ భూమి మీద
సూర్యుడు ఎప్పుడు అస్తమించడు .

నా బిడ్డ
ఆ ఎర్రమందారాలు
మళ్లీ ఊపిరి పోసుకుంటాయి.

2
తేల్చుకో

దేశ సంపద మీద
విదేశీ పులుల కండ్లు పడ్డాయి
అవి ఈ దేశపు తోడేళ్లను
మచ్చిక చేసుకొని ప్రజల నెత్తుటిని తాగుతూ విర్రవీగుతున్నాయి

నెత్తుటికి రుచి మరిగిన పులులు
అడవులను నాశనం చేస్తూ
ప్రజలను చంపుతూ
సంపదను దోచుకుపోతున్నాయి

తోడేళ్లు మృత్యుదాహంతో
డేగలను, ముసళ్ళను పిలిపించి
చివరి తేదీ ప్రకటించి
చంపుతున్నాయి

మిత్రమా !
తర్వాత వంతు మనదే,
ప్రశ్నించకుండా చాటుగా
దాక్కొని చస్తావో,
ఎదురు తిరిగి
వీరమరణం పొందుతావో
తేల్చుకో!.

Leave a Reply