ఈ రోజు డిసెంబర్ 1 భూమయ్య కిష్టగౌడ్ లను ఉరి తీసిన రోజు. భూమయ్య, కిష్టాగౌడ్ లు మనుషులు – సామాన్యులు. అసామాన్యులు.  తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు పార్టీతో పాటు కొనసాగుతూ, నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో విప్లవపార్టీ లోకి వచ్చి వర్గశత్రు నిర్మూలన పిలుపుతో ప్రేరణ పొంది గిన్నెదరి భూస్వామి లచ్చు పటేల్ ను చంపిన కేసులో వాళ్లకు ఉరిశిక్ష పడింది.

1972లో ఉరి శిక్ష పడేదాకా వాళ్లను వరంగల్ జైల్లో ఉంచి, ఉరిశిక్ష పడినాక సికింద్రాబాద్ జైలుకు మార్చారు. తెలంగాణలో ఉరిశిక్షలు అమలు చేసే జైలు అదొక్కటే.  నైజాంకు ఉరిశిక్ష అంటే పాపభీతి గనుక ఉరిశిక్ష కోసం  నిర్మాణం చేసిన బ్రిటిష్ (కంటోన్మెంట్ పాలన బ్రిటిష్ సైన్యం చేతిలో ఉండేది) జైలయిన ఈ జైల్లో ఉంచారు.

భూమయ్య కిష్టాగౌడ్ లు ఒకరు కరీంనగర్ జిల్లాకు, మరొకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాళ్లు.  వాళ్లు గోదావరికి ఇద్దరిని ముత్తనూరు, అద్దరిని కన్నారం  ఊళ్లకు చెందినవాళ్లు. భూమయ్యది జంగమ వృత్తి. భార్యా పిల్లలు ఉన్నారు. కిష్టాగౌడ్  పేరులోనే ఆయన వృత్తి ఉంది కానీ ఆ వృత్తి ఆయనెప్పుడూ చేయలేదు. యువకులుగానే పార్టీలోకి వచ్చి గట్టుపల్లి మురళి దళ సభ్యులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. కిష్టాగౌడ్ కు ఆ పోరాటంలో తొడలో తుపాకిగుండు దిగింది. కలిసిన వారికల్లా ఆ విషయం చెప్పి తొడలో తూట ఉన్న చోటు ఎంతో గర్వంగా చూపేవాడు.  పెళ్లయింది కానీ అన్నీ పరిత్యక్తం  చేసి పార్టీ లోకి వచ్చాడు. సాయుధ పోరాట విరమణ తర్వాత అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల రాజకీయాల్లో తిరిగినట్లున్నారు గానీ  నక్సల్బరీ శ్రీకాకుళం మీదుగా గోదావరి లోయలో ప్రవేశించాక కరీంనగర్ గుండి నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న దామోదర్ రావు నాయకత్వంలో నక్సలైట్ దళం లో చేరారు. గోదావరి లో ముగ్గురు స్నానం చేస్తుండగా ముగ్గురూ అరెస్టయ్యారు. దామోదరరావును ఆ రోజుల్లో వరంగల్ జైల్లో చూశాను కూడా. ఆయన విడుదలయ్యాక ఉద్యమం నుంచి విరమించుకొని గుండిలోనే ఉండిపోయాడు గానీ లచ్చుపటేల్ హత్య లో పాల్గొన్న ఈ ఇద్దరి విషయం బయటపడి వీళ్లకు ఉరిశిక్ష పడింది. 1972 లోనే ఈ విషయం తెలిసినా 1974లో సికింద్రాబాద్ కుట్ర కేసులో రచయితలం ఆరుగురం మే 20న ఇదే జైలుకు పోయాక ఇంక ఆ జైల్లో  మా నిత్యజీవితం లోకి వచ్చారు. మొదట మమ్ములను వాళ్లను ఉంచిన ఫాసీఘాట్ (గంజ్)కు దగ్గరగానే ఉంచారు. ఒకవైపు కిచెన్ ఉంటుంది. ఆ పక్క నుంచి కిందికి మెట్లు దిగి పోతే గంజ్ ఉంటుంది, కానీ ఆ ఆవరణకు గేటు ఉంది. మా ఆవరణకు వేరే గేటు ఉంటుంది. రోజూ మాకు గార్డుగా వచ్చే పోలీసు వార్డుర్లు, లైఫర్ వార్డర్లు వాళ్ల గురించి చెప్తుండేవాళ్లు. మేము ఎంతో  ఆసక్తిగా వాళ్ల గురించి అడుగుతుండే వాళ్ళం. మాకు బి క్లాసు ఇచ్చి బ్లాకు 3కు మార్చాక మాకు జైలు సూపరింటెండెంట్  కురుడుర్కుర్ తో ఎం .టి.ఖాన్ వల్ల స్నేహం ఏర్పడింది. ఎం.టి.ఖాన్ కు విజయ టెండూల్కర్ మరాఠీ నాటకాల్లో నటించేవాడుగా బయట ఉండగానే చాలా కాలంగా పరిచయం ఉంది కనుక ఒక రోజు మేము భూమయ్య కిష్టాగౌడ్ లను చూడాలని కోరుకున్నాం.  ఒక మధ్యాహ్నం స్వయంగా తీసు వెళ్లి కాసేపు మాట్లాడనిచ్చాడు.

భూమయ్యది బట్టతల కుదుమట్టంగా ఉండేవాడు. తనకు జంగమ పూజారిగా వచ్చిన ఇనామును తాను అరెస్టయ్యాక గ్రామ భూస్వామి ఆక్రమించుకున్నాడని,  ఆ భూమి మళ్లా తన కుటుంబానికి వచ్చేలా చేయమని అడిగాడు. జైలుకు నన్ను రెగ్యులర్ గా  కలవడానికి వచ్చే కరీంనగర్ విజయకుమార్ కు ఆ తర్వాత ఆ విషయం చెప్పి ఆయన ఊరికి వెళ్లి ఆయన భార్య పిల్లలను కలిసి, ఆయన ఆఖరి కోరిక తీర్చే ప్రయత్నం చేయమన్నాను. ఆయన చాలాసార్లు తిరిగాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. ఉరిశిక్ష మొదటిసారి నిర్ణయమైన నవంబర్ 25, 1974  ముందు రోజే తెలుస్తుంది కనుక వాళ్లను  తీసుకురావడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఏదీ ఫలించలేదు. కిష్టాగౌడ్ మాత్రం బలాదూర్ మనిషి.  నల్లటి మేఘశ్యాముడు. ఉంగరాల జుట్టు, మెరిసే కళ్ళు,  చురుకైన చూపు, చూడగానే ఆకట్టుకునే రూపం. మాట, మ్యానర్స్ కూడా చాలా ఆకర్షణీయమైనవి.

కొన్నాళ్ళు ఆ గంజ్లో ఆయన పక్కన ఉన్నప్పుడే ఎస్.ఎమ్ ‘తోట రాముని తొడకు కాట తగిలిందట’ పాట రాశాడు. రాసింది ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, కానీ కిష్టాగౌడ్ తొడలో తూట చూశాక ఈ ఎత్తుగడనెంచుకున్నాడు.

ఇద్దరివి నిజంగానే శీశ్రీ అన్నట్లు ‘భూమ్యాకాశాల’ వంటి ప్రవృత్తులు. శీశ్రీ మమ్ములను చూడడానికి ఒకసారి జైలుకు వచ్చినప్పుడు సూపరింటెండెంట్ ఆయనను కూడా తీసుకు వెళ్లి మాతోపాటు వాళ్ళను కలవనిచ్చాడు. చంద్రను కూడా తీసువచ్చి వాళ్ల రూప చిత్రాలు వేయించే ప్రయత్నం చేశాం, కానీ వీలు కాలేదు. వాళ్లను చూసి రాగానే నేను ‘విప్లవ వేణువులు’ అనే కవిత రాశాను (చూ. స్వేచ్ఛ 1978). చెరబండరాజు రాసిన ‘వరికంకుల లాల్ సలాం’ వంటి ప్రకృతితో తాదాత్మ్యం చెందిన పాట ఎంతో ప్రసిద్ధం కావడమే  కాకుండా అది జోహార్లు, లాల్ సలామ్లు చెప్పడానికి ఒక ట్రెండ్ సెట్టర్ అయింది.

మేం జైల్లో ఉండగానే  వాళ్లను మొదటిసారి ఉరి తీయడానికి తేదీ వచ్చింది. రేపు ఉదయం ఉరి తీస్తారంటే ఈ వేకువన వాళ్ళ సెల్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆఖరి కోరిక అడుగుతారు. తమతోపాటు గంజ్ లో ఉండి ఉరిశిక్ష పడి, జీవితఖైదుగా మారి, చంచల్ గూడా జైలుకు మారిన జింక రాములను చూడాలన్నారు గాని, ఇంక ఇప్పుడు బయటికి కదిలించడానికి చట్టం ఒప్పుకోదు అన్నారు. ఇటువంటి వార్తలు జైల్లో గాలి వలె వ్యాపిస్తాయి. ఈ జైలు ఇప్పుడు హైదరాబాదుకు కూడా దగ్గర కావడంతో  జైలుముందరి వార్డర్ల ద్వారానో, ములాఖత్ లకు వచ్చే వారి ద్వారానో బయట కూడా వ్యాపిస్తాయి. మాకు తెలియగానే రోజంతా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని పత్తిపాటి వెంకటేశ్వర్లు గారికి చెప్పంపాం. ఆయన ఉరుకులు పరుగుల మీద వచ్చి మా అందరికీ ములాఖత్ పెట్టారు. చాలా హడావిడి చేసి జైలు నుంచి సూపరింటెండెంట్‌ను  అడిగి రాష్ట్రపతి భవన్ కు ఫోన్ చేశాడు. నిద్రపోతున్నాడంటే – ఇక్కడ మనుషులిద్దరు చస్తున్నారు లేపమన్నాడు. కానీ సహజంగానే రెస్పాన్స్ లేదు. చండ్ర రాజేశ్వరరావుకు ఫోన్ చేశాడు. ఆయన అప్పుడు పాట్నాలో కేంద్ర కమిటీ సమావేశం లో ఉన్నాడు. అయినా పత్తిపాటి ఫోన్ అనేవరకు బయటకు వచ్చి మాట్లాడాడు. వెంటనే భూపేష్ గుప్తాను ఢిల్లీ కి పంపించి రాష్ట్రపతికి ఇప్పటికి ఈ ఉరిశిక్ష ఆపమని చెప్తాను అన్నాడు. అప్పుడు భూపేశ్ గుప్తా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఇంక బయట ప్రయత్నాలు చేస్తానని వెళ్ళిపోయాడు.

ఆ సాయంత్రం మేము కొవ్వొత్తులు (బి క్లాసు కనుక మేము కరెంటు ఫెయిలయితే వెలిగించుకోడానికి తెప్పించి పెట్టుకున్నవి),  కాగితాలనే కాగడాలతో వెలిగిస్తూ బ్లాక్ 3 ఆవరణ లోపల చుట్టూ నినాదాలతో, పాటలతో లాకప్ దాకా  ఊరేగింపు తీసాం. లాకప్ రోజుకన్నా ఆలస్యం చేయించాం. ఎట్లాగూ ఖైదీలకు, వార్డర్లకు  అందరికీ వారి పట్ల అభిమానం, సానుభూతి ఉన్నది. వేరే బ్యారక్ ల‌లో చాలామంది మా నినాదాలు అందుకున్నారు. దాదాపు అందరూ ఆ రోజు అన్నం ముట్టలేదు.  ఇంక రాత్రంతా వాళ్ల గురించి మాట్లాడుకుంటూ, పాటలు పాడుతూ లాకప్ లో ఉండగా – అర్ధరాత్రి సూపరింటెండెంట్ వచ్చాడు. ఖాన్ సాబ్‌ను పిలిచాడు. సంభ్రమోద్వేగాల్లో ఉన్నాడు.  ‘మీరు బయట ఉంటే సెలబ్రేట్ చేసుకునే వాళ్లం’ అన్నాడు. ‘ఉరిశిక్ష ఆగిపోయింది’ అన్నాడు. ఖాన్ సాబ్ తో, మాలో కొందరితో లోపలి నుంచే కౌగిలింత  వంటి కరచాలనం చేశాడు. ఇంక మేం ఏ తెల్లవారిజాము దాకానో మాటలతో పాటలతో గడిపాం.

మర్నాడు ఉదయం జైలు అధికారులను కలవడానికి వెళ్ళాం. జైలర్ ను అభినందిస్తే ఆశ్చర్యంగానూ, షాకింగ్ గానూ ‘నా హోం వర్క్ అంతా వృధా అయింది’ అన్నాడు. అంటే ఉరిశిక్ష వాళ్లకు చెప్పినప్పటి నుంచి మెడ కొలతలు, తల కొలతలు తీసుకోవడం, కొత్త బట్ట (ముసుగులు వేయడానికి) తెప్పించడం, ముసుగులు కుట్టించడం,  కొత్త ఉరితాళ్లు కొని తెప్పించడం, తలారిని ముందుగానే మాట్లాడి పెట్టుకోవడం,  బయటనుంచి మేజిస్ట్రేటును, డాక్టర్ను పిలిపించడం వంటి పనుల్లో  దినమూ రాత్రి తన విధిలో ఎక్కడ విఫలమవుతానో అని శ్రద్ధ పెట్టి చేసిన పని అంతా వృధా అయిందనే తప్ప – అచ్చం  మార్కస్ చెప్పినట్లు హ్యాంగ్ మెన్‌  వ్యవస్థ ప్రతినిధిగా మాట్లాడాడు. పైకి వెళ్లి సూపరింటెండెంట్ను కలిసాము.  ఆయన అప్పటికే తెప్పించి పెట్టుకున్న మిఠాయిలు మాకు పంచాడు. ఆ రోజు మళ్లీ పత్తిపాటి వచ్చాడు. గాఢాలింగనం చేసుకుని ఎంతో అభినందించాం.  లోపలికి వెళ్లి భూమయ్య కిష్టాగౌడ్ లను కలిశాడు. వాళ్లకు అప్పటికే తెలిసిపోయింది. మాకు చెప్పిన అర్థరాత్రే, ప్రస్తుతానికి ఆగిపోయిందని ఉత్తర్వులు రాగానే సూపరింటెండెంట్ వెళ్లి చెప్పాడు.

1975 మే 10న   బెయిలు కండిషన్ వల్ల హైదరాబాదులో ఉన్న నేను సాయంత్రం బస్సులో పోతూ ఉంటే ఎవరో పిడిఎస్ యు విద్యార్థి  ‘రేపు ఉదయం భూమయ్య, కిష్టాగౌడ్లను ఉరి తీస్తారట’ అని చెప్పాడు. అప్పటికే చాలమంది రాడికల్, పిడిఎస్ యు విద్యార్థులు, ఎపిసిఎల్సి వాళ్లు, విరసం వాళ్లు జైలు ముందుకు చేరుతున్నారు.

జరిగిందేమంటే అప్పటికే ఇంజినీరింగు కాలెజి విద్యార్థి పిడిఎస్ యు నాయకుడుగా ఏదో ఒక ఉద్యమంలో జైలుకు వస్తూ పోతూ ఉండేవాడు. (ఆ తర్వాత సిపిఐ ఎంఎల్ కార్యదర్శి అయిన మధుసూధ‌న్‌రాజ్‌ 1995లో సిటీలో అశోక్ న‌గ‌ర్‌ డెన్లో ‘ఎన్ కౌంట‌ర్‌’ అయ్యాడు). ఆయన ఆ సాయంత్రం సైకిల్ పై జైలుముందు నుంచి పోతూ ఉంటే జైలు గార్డు చూసి ఆపి ‘రేపు భూమయ్య, కిష్టాగౌడ్లను ఉరితీస్తారట  అని చెప్పాడు. ఆయన అదే వేగంతో ఇసామియాబజార్ లోని పత్తిపాటి ఇంటికి వెళ్తే ఎండాకాలం కోర్టు సెలవులు గనుక లేడు. టంగుటూరు తన స్వస్థలానికి వెళ్లాడు. అటునుంచి తిరిగి వేగంగా  కన్నబిరాన్ ఇంటికి వెళ్లి చెప్పాడు. ఆయన ముగ్గురు యువ న్యాయవాదులను – కెఎన్ చారి (ఆయన ఆఫీసు), ఒపిడిఆర్ అధ్యక్షుడు సి.వెంకటకృష్ణ, ఒపిడిఆర్ కు చెందిన వెంకటరెడ్డిని పిలిపించి మొదటిసారి ఆగిపోయినపుడు వాళ్ల మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి దగ్గర ఉంది, ఆయన ఆపాడు కాని ఆ తర్వాత హోంమంత్రిత్వశాఖ సిఫారసుతో మెర్సీ పిటిషన్ నిరాకరించాడు, కాని ఆ ఉత్తర్వులు అధికారికంగా తెలియచేయలేదనే కారణంతో మళ్లీ ఉరిశిక్ష ఆపాలని పిటిషన్  రాసి ఆ ముగ్గుర్నీ వెకేషన్ బెంచ్ గా ఉన్న జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ గంగాధరరావుల ఇళ్లకు పంపించాడు.

ఇంకా కన్నబిరాన్, వసంత కన్నబిరాన్ మరికొందరు అడ్వకేట్స్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి వెకేషన్ బెంచ్ స్పందన తెల్సుకొమ్మన్నాం.  ఏమైనా జైలు ముందే నిరసన తెలుపుదామని బయటకి వచ్చి సందులో తిరుగుతున్నాం. బయట వీధి లైట్లు లేవు. జీవన్ రెడ్డి ఇంటి ముందు రాళ్లకుప్ప ఉంది. ఉరిశిక్ష మళ్ళీ ఆగిపోయిందని చెప్పడానికి వచ్చే సంభ్రమానందంలో ఆయన రాళ్ల కుప్ప దాటి పడిపోయాడు. కన్నభిరాన్ కారు వసంత డ్రైవ్ చేస్తున్నది. అప్పటిదాకా తీవ్ర ఆందోళనతో ఉన్న ఆయన ఈ ఆనందాన్ని తట్టుకోగలడా అని ఆమె జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది.  జైలు దగ్గరికి చేరుకొని అక్కడ గుమికూడిన వారందరికీ చెప్పాము. ఈలోగానే ఉత్తర్వులు తీసుకొని ఆ ముగ్గురు వచ్చారు.కన్నబిరాన్తో కలిసి ఆ ముగ్గురు న్యాయవాదులు జైలు లోపలికి వెళ్లి ఆ ఉత్తర్వులు ఇచ్చారు.వాళ్లకు కూడా  సమాచారం వచ్చినట్లున్నది.

అట్లా రెండవసారి భూమయ్య కిష్టాగౌడ్ల ఉరిశిక్ష ఆగిపోయింది. అక్కడి నుంచి అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 26న ఎమర్జెన్సీ విధించే దాకా, ఎమర్జెన్సీ విధించిన తర్వాత కూడా ఒక అర్ధరాత్రి సుల్తాన్ బజారు పోలీస్ స్టేషన్ నుంచి, జూలై 4 దాకా (1975) జైలు నుంచి పత్తిపాటి చేసిన సాహస ప్రయత్నాలు చరిత్రలో లిఖించదగిన ఎపిసిఎల్సి కృషి.

 మే 11న నే అన్ని ప్రజా సంఘాలు, హైకోర్టులో నక్సలైట్ డిఫెన్స్ కమిటీ కన్నబిరాన్, ఎపిసిఎల్సి కార్యదర్శి,  ఇంకా ఎందరో ప్రజాస్వామ్యవాదులు కలిసి భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు చేయాలి అనే  ఒకే ఒక్క డిమాండ్తో పత్తిపాటి కన్వీనర్ గా ‘ భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు కమిటీ ’ వేసాం. ఢిల్లీలో జార్జ్ ఫెర్నాండెజ్ ఈ బాధ్యతలు చేపట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులను కదిలించాలని నిర్ణయించాం. సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ దగ్గర వేలాదిమందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కేంద్ర హోం మంత్రి బ్రహ్మానంద రెడ్డికి సన్నిహితుడు, ఎమ్మెల్యే అయిన జైపాల్ రెడ్డి కూడా పాల్గొని తాను మరణ శిక్ష రద్దును ఒక విశ్వాసం (కన్విక్షన్) గానే రాజ్యాంగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తానని, తన వంతు కృషి చేస్తానని చెప్పాడు. నేను కూడా  తర్వాత ఆయనను ఎమ్మెల్యే  క్వార్ర్స్ లో కలిసి హోంమంత్రికి చెప్పమని గుర్తు చేసేవాణ్ని. ఆ తర్వాత బీహార్లో  ఐదుగురు  మావోయిస్టు  రైతులకు (దళితులు) ఉరి శిక్ష పడితే అప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి,  కన్వీనర్ పంకజ్ ద‌త్తు, రాజ్‌కిషోర్‌ను,  సాయిబాబాను, నన్ను వెంటబెట్టుకొని వెళ్లి హోం మంత్రి శివరాజ్ పాటిల్ ను కలిసి తన కన్విక్షన్ గానూ అభ్యర్థన గానూ ఉరిశిక్ష రద్దుచేయించమని చెప్పాడు. ఆ తర్వాత కాలంలో ఆ ఐదుగురి ఉరిశిక్ష జీవిత శిక్ష గా మారింది.

జార్జ్ ఫెర్నాండెజ్ కృషి వల్ల అయితేనేమి సిపిఐ ప్రయత్నాల వల్ల నైతేనేమిటి అన్నిటిని మించి దేశంలో ప్రజాస్వామ్య వాదుల కృషివల్ల ఇది అంతర్జాతీయ ఉద్యమమైంది. జీన్ పాల్ సార్్ర, నోమ్‌చామ్క్సీ మొదలైన ప్రముఖులు మూడు వందల మంది రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్యారిస్‌లో సుప్రసిద్ధ మేధావి తారీఖలీ నాయకత్వంలో భారత రాయబార కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిగింది. అమెరికాలో చాలా చోట్ల ప్రదర్శనలు జరిగాయి. నాగభూషణ్ పట్నాయక్ ఉరిశిక్షను 1972 భారత స్వాతంత్ర రజతోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి రద్దు చేసిన పోలిక తెస్తూ  సుప్రసిద్ధ ఫ్రెంచి జర్నలిస్టు లారెన్స్ లిప్షుల్జ్  రాసిన వ్యాసం సంచలనమైంది. ఫ్రాంటియర్ పునర్ముద్రించింది. హైదరాబాదులో పబ్లిక్ సెక్టార్ (ఐడిపిఎల్, బిహెచ్ఇఎల్, రిజర్వుబ్యాంకు,  ఎల్ఐసి వంటి సంస్థల్లోని ట్రేడ్ యూనియన్లు, పోస్టల్ అండ్ టెలిఫోన్ యూనియన్, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు ఒకటని ఏమిటి ప్రజాస్వామ్య శక్తులు అన్నీ  కదిలి స్వచ్ఛందంగా ‘భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు కమిటీ’కి ఆర్థిక హార్ధిక సహకారం అందించారు. ఏపిసిఎల్సి, విరసం, రాడికల్స్, పిడిఎస్ యు సంఘాలు లీడింగ్ పాత్ర నిర్వహించాయి.  విప్లవాభిమాన విద్యార్థులందరూ తలమునకలుగా పనిచేశారు.

ఆబిడ్స్ సెంటర్లో ఉన్న ‘ఈనాడు’ సిటీ బ్యూరో ఆఫీసు,  పత్తిపాటి, కన్నబిరాన్ ఇళ్లతో పాటు ఒక సమాచార కేంద్రము, సమీకరణ కేంద్రమైంది. ఎందుకంటే విరసం అశోక్ టంకశాల అక్కడ ఈనాడు సిటీ బ్యూరో చీఫ్.

జయప్రకాశ్ నారాయణ్, వాజ్పేయి కూడా భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా ప్రత్యేకించి పేర్కొనదగినవి హుజురాబాద్, మందమర్రి, బెల్లంపల్లి లలో జరిగిన సభలు. ఈ మూడు సభలకు శీశ్రీ, పత్తిపాటి హాజరయ్యారు. హుజురాబాద్ సభ ఆవుల సమ్మయ్య, లింగయ్యల పూనికతో ‘జనసాహితి’ ఏర్పాటు చేసింది. జమ్మికుంట కాలేజీ విద్యార్థులు నల్లా ఆదిరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు విజయకుమార్ సభలు ఏర్పాటు చేశారు. తాడిగిరి పోతరాజు, ఎంవీ తిరుపతయ్య లు  హుజురాబాద్, జమ్మికుంట లలో లెక్చరర్లుగా ఉండి సహకరించారు. పోతరాజు ఏపిసిఎల్సిలో ఉన్నాడు కూడా.  ఈ హుజూరాబాద్ సభలోనే శీశ్రీ వేదిక మీదనే కరపత్రం తీసుకొని చరిత్రాత్మకమైన ప్రకటన రాశాడు.

‘‘భూమయ్య కిష్టాగౌడ్ లు రోజెన్ బర్గ్ దంపతుల వంటి మేధావులు కాదు. సాక్కో వాంజెట్టి వంటి అమాయకులు కాదు. రైతాంగ కార్యకర్తలు. వాళ్లను ఉరి తీసి డాస్ట్ విస్కీ ఉరిశిక్షను రచయిత అని తెలిసి ఆఖరి నిమిషాన రద్దు చేసిన జారు చక్రవర్తి కన్నా,  తెలంగాణ సాయుధ పోరాటంలో ఉరిశిక్ష పడిన 11 మంది విప్లవకారుల ఉరిశిక్ష అమలుపై భయపడిన నిజాము కన్నా నియంతగా చరిత్రలో ఇందిరాగాంధీ నిలవ కూడదని ఆశిస్తున్నాను’’ అని ప్రకటన చదివి తన ప్రసంగం ప్రారంభించాడు. మందమర్రిలో భోరున వర్షం పడుతుంటే వేలాదిమంది ఇళ్ళ చూరుల ముందు తలదాచుకుని వింటూ ఉంటే ప్రసంగించాడు. వెంట తీసుకు పోయిన ఒక దూది పులిని ఆ వాన నీళ్లతో తడిపితే అది ఒట్టి పిడచ ముద్దయింది. జలగం వెంగళరావు ‘బానిసకొక బానిసకొక బానిస’గా ఇటువంటి దూదిపులి అని చెప్పి, భూమయ్య కిష్టాగౌడ్ల ఉరిశిక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ అన్ని సభల్లోనూ పాల్గొన్న పత్తిపాటి శ్రీ శ్రీ ప్రసంగం విన్నారు కదా అని ప్రారంభించి చాలా ఉత్తేజపూరితంగా ప్రసంగించాడు. మర్నాడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావును అదే విజ్ఞప్తిపై కలిసినపుడు మీరు,  మీ అధ్యక్షుడు నా నెత్తి మీద పొంచిఉన్న  నక్సలైట్ బాంబు వేస్తాడని మాట్లాడారు కదా, నన్ను దూది పులి అని బానిసకొక బానిసకొక బానిస అన్నారు కదా, అక్కడికే న్యాయం కోసం వెళ్ళండి,  అయినా మీరు హంతకులను అమాయకులను రైతాంగ కార్యకర్తలు చేశారు, ఇది రాజకీయ శిక్ష కాదు,  మామూలు ఉరిశిక్ష- సుప్రీం కోర్టు రాష్ట్రపతి కూడా ధ్రువీకరించారు,  నేను చేయగలిగింది ఏమీ లేదు –  అన్నాడు. పత్తిపాటి – అది శ్రీ శ్రీ కవిత్వం, శ్రీ శ్రీ ప్రసంగం.. నేను మాత్రం వాళ్ల న్యాయవాదిగా ఎపిసిఎల్సి కార్యదర్శిగా,  ‘ఉరిశిక్ష రద్దు కమిటీ’ కన్వీనర్ గా  మీరు కేంద్రానికి రాయాలని,  ప్రధాని ఇందిర ద•ష్టికి తేవాలని చెబుతున్నానని అన్నాడు. మే 11 నుంచి 20 వరకు బెయిలు షరతును జస్టిస్ చిన్నపరెడ్డి సడలించి వరంగల్కు వెళ్లే అనుమతి ఇచ్చేంత వరకు హైదరాబాదులో ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నాను.

1974 డిసెంబర్ సంచిక, తిరిగి 1975 జూన్ సంచిక స•జన  భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు డిమాండ్ చేస్తూ వెలువడింది. 1974 డిసెంబర్ నుంచి 75 మే-జూన్ నెల దాకా భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు గురించి కమిటీ కార్యకలాపాల గురించి సృజ‌న‌లో విస్తృతంగా రచనలు వచ్చాయి. ప్రకటనలు వచ్చాయి, వార్తలు వచ్చాయి.

 వాస్తవానికి జూన్ ఆఖరి వారంలో ఢిల్లీ బోట్ క్లబ్ దగ్గర జార్జ్ఫెర్నాండెజ్ కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేశాడు. అందులో జేపీ, వాజపేయి కూడా పాల్గొంటారని  పత్తిపాటికి తెలిపాడు, ఈలోగా ఎమర్జెన్సీ వచ్చింది. రైల్వే సమ్మెలో పాల్గొన్న  ఫెర్నాండెజ్ మీద బరోడా డైనమైట్ కేసు పెట్టడం వల్ల ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. జెపి హౌస్ అరెస్టు, వాజ్పేయి అరెస్టు అనేమొచ్చె, సిపిఐ  తప్ప బిజెపి, సిపిఎం (ఆంధప్రదేశ్లో), అన్ని ఎంఎల్ పార్టీల నాయకులు అజ్ఞాతంలో  లేనివాళ్లు అరెస్టయ్యారు. అప్పటికే  జైళ్లలో పార్వతీపురం కుట్రకేసులో వంటివాటిలో ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీ అంతా కొనసాగారు. విరసం సభ్యులు 30 మంది  నాయకత్వంతో సహా,  ఎపిసిఎల్సి నాయకత్వం అంతా అరెస్టయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే కన్నబిరాన్ ఒక్కడే బయట ఉన్నాడు. ఆంధప్రదేశ్ జైళ్ల లో  వేలాదిమంది ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు విద్యార్థులు నిండి పోయారు.  ఆర్ఎస్యు  నాయకత్వం అరెస్ట్ అయ్యి,  క్రియాశీల కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తం మీద లక్షా ఏభై వేల మందిని ఎమర్జెన్సీ లో నియంత  ఇందిర దాదూ ఫిర్యాదు లేని మీసా కింద అరెస్టు చేసి ప్రాథమిక హక్కులు రద్దు చేసింది. జూలై 4న మొదటిసారిగా అన్ని ఎమ్ ఎల్‌ పార్టీలను నిషేధించింది.

జూన్ 25 రాత్రి రాష్ట్రంలో మొట్టమొదట అరెస్టయిన పత్తిపాటి అప్పటికి ఎమర్జెన్సీ అంటే ఏమిటో పూర్తి అవగాహనకు రాకపోవడం వల్ల కొంత, తనకుండే సాముగరిడీల సాహసం, చొరవ వల్ల ఐతేనేమిటి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ నుంచి, చంచల్ గూడా  జైలు నుంచి జార్జ్ ఫెర్నాండెజ్కు బోట్ క్లబ్ కాగడాల ప్రదర్శన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని ఫోన్ చేస్తూనే ఉన్నాడు, టెలిగ్రాములు పంపుతూనే ఉన్నాడు, ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ఇందిరాగాంధీ పట్ల వ్యతిరేకత ఉన్న జైలు అధికారులు ఇవన్నీ తీసుకున్నారు కానీ పంపించగలిగారో లేదో తెలియదు.  ఇంతకూ ఇవి పొందవలసిన జార్జ్ ఫెర్నాండెజ్ అప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడు.

1975 నవంబర్ 30వ తేదీ ఉదయం ఇండియన్ ఎక్స్ ప్రెస్‌లో  భూమయ్య కిష్టాగౌడ్ ల ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసిన భూపేశ్ గుప్తా అని ఒకలైన్ వార్త వచ్చింది. పత్రికలు సెన్సార్షిప్ – ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎమర్జెన్సీ వ్యతిరేక చాంపియన్గా నిలిచింది. సంపాదకీయాల కాలమ్ ఎక్కువగా ప్రొటెస్ట్ గా  ఖాళీగా వదిలేవారు. స్టేట్స్ మెన్‌ పత్రిక కూడా ఎమర్జెన్సీని ఎదిరించి నిలిచింది. వామపక్ష లేదా  ప్రజాస్వామ్య పత్రిక అనదగిన ఇపిడబ్ల్యూ ఒక్కటే కొనసాగింది. ఫ్రాంటియర్ సెన్సార్ నిబంధనలతో ఫాసిస్టు హ్లిర్ కాలపు చరిత్ర కథనాలను వ్యాఖ్యా రహితంగా వేస్తూ ఉండేది.

డిసెంబర్ 1 ఉదయమే ఎప్పుడు ఫుల్ యూనిఫామ్లో రాని సూపరింటెండెంట్ జెఠానీ (ఆయనకు ఒళ్ళంతా చర్మవ్యాధి ఉంది) ఫుల్ యూనిఫామ్లో, బెల్ట్  అడ్డంగా నిలువుగా పెట్టుకొని, మెడల్స్ పెట్టుకొని, మొత్తం జైలు సిబ్బందిని తీసుకొని వచ్చాడు. అప్పుడు మా బ్లాక్ లో ఎమ్మెల్యే ఓంకార్, ఖమ్మం సిపిఎం నాయకులు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి రామ్ కిషన్ రావు,  డాక్టర్  రాధాకృష్ణ మూర్తి- ఒక గదిలో నేను, బండ్రు నర్సింహులు, సిపిఎం రాఘవరెడ్డి (నలగొండ),  బోడపూడి వెంకటేశ్వరరావు (సిపిఎం, మధిర) ఉన్నాం. ఓంకార్ గారు ఎమ్మెల్యే కనుక సూపిరింటెండెంట్  ఆయన దగ్గర నిలబడి పలకరిస్తాడు – ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ వార్త చూపి ఓంకార్ గారు ‘దీనిని బట్టి ఈ పాటికి ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కదా’ అన్నాడు. ఏ భావమూ తెలియనివ్వకుండా, గంభీరంగా, మౌనంగా ఆయన, ఆయనతో పాటు అందరూ కదిలిపోయారు. గేటు దాటుతూ ఉండగా, డిప్యూటీ జైలర్ శౌరయ్య (ఇతడు మా అందరితో చాలా మంచిగా ఉండేవాడు, సహాయం చేస్తుండేవాడు) వెనుక నిలబడి తల ‘ఔను’ అన్నట్లుగా తిప్పుతూ ఉంటే కళ్లల్లో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి,  కళ్ళు ఎర్రగా అయ్యాయి. అయిపోయిందనుకుని ఆ రోజు నిరాహార దీక్ష చేసి నిరసన ప్రదర్శించాం. నా గది లో ఉన్న ముగ్గురికి మాత్రం భూమయ్య కిష్టా గౌడ్ ల గురించి నాకు తెలిసిన విషయాలు, ఎపిసిఎల్ సి కమిటీ, మేము చేసిన కృషిని వివరించాను.

లాకప్ అయి అర్ధరాత్రి అయ్యాక గేట్లో నుంచి జైలు లోపలికి వస్తూ ‘ భూమయ్య కిష్టాగౌడ్ అమర్ హై’ అని ఆ నీరవ నిశ్శబ్ద చలి రాత్రి లో బర్ల యాదగిరి రాజు ఉద్వేగ స్వరం వినిపించింది. ధృవపడింది.

బర్ల యాదగిరి రాజు వరంగల్ జిల్లా ఎంఎల్ సిఒసి ( కె ఎస్ నాయకత్వం) నాయకుడు. చాలా కేసుల్లో మాత్రమే కాదు, అప్పటికి కంది లచ్చిరెడ్డి హత్య కేసులో ఉరిశిక్ష పడి కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ముగిసే నాటికి సి. పద్మనాభరెడ్డి వాదించి ఉరిశిక్ష రద్దు చేయించడమే కాదు, అక్విట్  చేయించాడని మాకు చంచల్గూడ జైల్లో ఉండగా   తెలిసింది. (1989లో మానుకోట భూస్వాములు ఆయనను అజ్ఞాతంలో ఉన్న వాడిని ద్రోహి సమాచారంతో బంధించి చంపేశారు.) బర్ల యాదగిరిరాజు  సికిందరాబాదు కుట్రకేసులో ముద్దాయిగా మాతో సికిందరాబాద్ జైల్లో కూడా ఉన్నాడు. అమాయకమైన నిర్మలమైన మనిషి, ఆవేశపరుడు. డిగ్రీ చదువు వదిలి మానుకోట ప్రాంతంలో కరడుగట్టిన భూస్వాములకు వ్యతిరేకంగా సాహసవంతమైన పోరాటాలు చేశాడు. కొమురమ్మ, కోటగిరి వెంకటి వంటి ఎందరినో విప్లవం లోకి తెచ్చాడు.

ఆయన తన కేసుకు హైదరాబాదుకు పోయినప్పుడు కోర్టులో తెలిసి మళ్లీ ఎస్కార్ట్ తెచ్చి వరంగల్ జైల్లో వదిలి పెట్టినప్పుడు జైలు అంతా వినిపించి దిగ్గున లేచేలా భూమయ్య కిష్టాగౌడ్ లకు జోహార్లు చెప్తూ నినాదాలు ఇచ్చాడు.

ఆ తర్వాత హైకోర్టులో మా విడుదల కోసం పిటిషన్ వేసి ఆ నెపంతో సికిందరాబాదు జైలుకు వెళ్లినప్పుడు డిసెంబర్ 1న భూమయ్య కిష్టాగౌడ్లను ఉరితీసినపుడు, తెలిసిన ముందురోజు డిటెన్యూలందరూ కాగితాలమీద సమాచారం,  జోహార్లు రాసి, కాగితాలను రాళ్ళల్లో చుట్టి బయటకి వేసి నినాదాలు ఇచ్చి పాటలు పాడారని,  జైలులో అందరికంద•రు నిరాహారదీక్షలు చేసి నిరసనలు తెలిపారని చెప్పారు. చంచల్గూడ  జైల్లో పత్తిపాటి,  చెరబండరాజు నాయకత్వంలో కూడా సభ నిర్వహించారట. సికింద్రాబాద్ జైల్లో సాపేక్ష మైన స్వేచ్ఛ. వందలాది మంది డిటెన్యూలు ఉండేవాళ్ళు గనుక దినమంతా కలిసి, విడిగానూ అన్ని డిటెన్యూల బ్యారక్లలోనూ చిన్నవి పెద్దవి సభలు నిర్వహించారట.

భూమయ్య కిష్టాగౌడ్లు ఆఖరు కోరికగా తమ కళ్ళు ఆసుపత్రికి ఇచ్చారని తెలిసి కెఎ అబ్బాస్  బ్లిట్జ్ లో ‘ఆ కళ్ళు చూస్తూనే ఉంటాయి’ అని రాశాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఎమర్జెన్సీ అత్యాచారాలు ఎన్కౌంటర్ లతోపాటు విస్తృత‌ ప్రచారం పొందింది భూమయ్య కిష్టాగౌడ్ల ఉరిశిక్ష. న్యాయ చరిత్రలో కూడా చివరి క్షణంలో ఆగిపోయిన డాస్టవిస్కీ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్  కుర్చీలో ఉరితీసే సాంప్రదాయమున్నచోట కరెంటు ఫెయిల్ అయితే ఉరిశిక్ష ఆగిపోయిన ఉదంతాలు ఉన్నాయి గాని, రెండు సార్లు మృత్యు ముఖం లోకి వెళ్లి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో మాత్రమే సాధ్యమైన ఉరిశిక్ష ప్రపంచ చరిత్రలో భూమయ్య కిష్టాగౌడ్లదే అనుకుంటాను.

అదే కాలంలో నియంత ఫ్రాంకో ఐదుగురు తిరుగుబాటువాదులయిన వారి ఉరిశిక్ష రద్దు చేయాలని ప్రపంచ నాయకులందరితో పాటు విజ్ఞప్తి చేసిన ప్రధాని ఇందిర మాత్రం తాను  వీళ్ళను ఉరి తీసి ఫ్రాంకో (స్పెయిన్ అధ్యక్షుడు) కన్నా నియంతనని రుజువు చేసుకున్నది.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత నేను కన్వీనర్గా, కన్నబిరాన్, శత్రుజ్ఞ, పత్తిపాటి లతో భూమయ్య కిష్టాగౌడ్ల స్మారక కమిటీ ఏర్పాటు చేసాం. మొదటి ప్రసంగం – మరణశిక్షపై సుమంతో బెనర్జీ ఇంగ్లీష్ లో రాసిన అద్భుతమైన విశ్లేషణ తో 1979లో హనుమకొండ బేసిక్ ట్రైనింగ్ కాలేజీలో జరిగింది. రెండవది  విశాఖపట్నంలో ఆర్ ముఖర్జీ ఇచ్చాడు. మూడవది 1981లో  గుంటూరులో జార్జ్ ఫెర్నాండెజ్ ఇచ్చాడు. నాలుగవది హైదరాబాద్ లో నిఖిల్ చక్రవర్తి (మెయిన్ స్ట్రీమ్ సంపాదకుడు) ఇచ్చాడు.  గుంటూరులో సిఎస్ఆర్,  విశాఖలో చలసాని, హైదరాబాదులో కన్నబిరాన్ శత్రుజ్ఞ ఉన్నారు. 1980లో ప్రారంభమై 1984 దాకా నిర్విఘ్నంగా సాగిన ఈ ప్రసంగాలు 1985 ఆటపాట బందుతో ఆగిపోయాయి. ఆరవ ప్రసంగం విజయవాడ రైల్వే యూనియన్ ఆడిటోరియంలో ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి చేయాల్సి ఉండే. ఆయనను ఏక్నాథ్ సాల్వే తోపాటు గద్దర్, ప్రొఫెసర్ మురళి మనోహర్ లు మొదలైన వారిని కూడా కలిపి 1985 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి స్మారక సభకు వస్తే స్తూపం దగ్గరే అరెస్టు చేశారు. అప్పుడు ఢిల్లీలో ప్రధాని కార్యాలయం లోని కార్యదర్శి శంకరన్ జోక్యం వల్లనే  వాళ్లను వదిలేయడమే కాకుండా కేసు కూడా ఎత్తేసుకున్నారు.

ఆ తర్వాత సెప్టెంబర్ 3 డాక్టర్ రామనాథం హత్య తర్వాత తెలుగు నేలలో పరిస్థితి గురించి చెప్పేదేముంది. అది టాడా,  మిస్సింగ్, కుట్రకేసులు, ఎన్కౌంటర్లు,  ప్రజాసంఘాల నాయకుల పై హత్యా ప్రయత్నాలు, హత్యలు జరిగిన కాలం. బాలగోపాల్ ఈ కాలాన్ని లాటిన్ అమెరికా నిర్బంధంతో పోల్చాడు. వరంగల్ ను లాటిన్ అమెరికా నగరం తో పోల్చాడు. విరసం – వరంగల్ మాత్రం ‘నిశ్శబ్దం చీడ కాదు’ అని ఎమర్జెన్సీ లోని మౌన నిశ్శబ్ద విప్లవం గురించి 1990 విరసం మహా సభల నాటికి ఒక కవితా సంకలనం తెచ్చారు. విరసం మహాసభలు జనవరి నుంచి 1990 మే 5, 6 వరంగల్ రైతు కూలీ సంఘం, 14 లక్షల మందితో జరిగిన సభలు చరిత్రలోనే అపూర్వమైనవి. ఆ సభల్లో స్మరించుకున్న అమరుల్లో భూమయ్య కిష్టగౌడ్లు ఉండి తీరుతారు.

ఇంకెన్నో జ్ఞాపకాలు, విషయాలు ముప్పిరిగొని వస్తున్నాయి గానీ తప్పకుండా ఒక విషయం చెప్పి ముగించాలి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత, జగిత్యాల జైత్రయాత్ర (8 సెప్టెంబర్ 1978) కూడా విజయవంతం అయ్యాక కరీంనగర్ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి మల్లోజుల కోటి నాయకత్వంలో మరొక నాయకుడు సాయిని ప్రభాకర్, సెంట్రల్ ఆర్గనైజర్ బయ్యపు దేవేందర్రెడ్డి లు కలిసి గోదావరి తీరాన ఉన్న క్కులగూడూరులో ఎన్కౌంటర్లను ఖండిస్తూ సభ నిర్వహించారు. ఆ సభలో భూమయ్య కిష్టాగౌడ్ లతో పాటు అప్పటికి కరీంనగర్ జిల్లాలో,  ముఖ్యంగా ఆ ప్రాంతంలో అమరులైన వారి స్మృతిలో  నిర్మించిన స్థూపాన్ని నన్ను ఆవిష్కరించడానికి పిలిచారు.  అంతకు ముందురోజే కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న విప్లవ భూసంస్కరణలను అధ్యయనం చేయడానికి హరగోపాల్, సీతారామారావును పిలిచారు.

అమరులు భూమయ్య కిష్టాగౌడ్ల  కోసం నిర్మించిన ఆ స్థూపం ఇపుడుందో,  ఏ స్థితిలో ఉందో, లేదో తెలియదు. వాళ్ల కోసం ప్రత్యేకించి ఎక్కడైనా స్థూపం నిర్మించినట్లు కూడా తెలియదు. నెహ్రూ కాలంలో కయ్యురు కామ్రేడ్స్ వలె (చూ. నిరంజన ‘చిరస్మరణ’ – ఈ పుస్తకం ఎమర్జెన్సీలో వెలువడి భూమయ్య కిష్టాగౌడ్ల సందర్భానికి ఎంతో ఔచిత్యంతో కూడా ఉత్తేజాన్నిచ్చింది) ఇందిర కాలంలో ఉరికంబాలెక్కిన కమ్యూనిస్టు విప్లవకారులు వీళ్లేననుకుంటాను.

అయితే ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత భూమయ్య కిష్టాగౌడు ఉరిశిక్షనే ద•ష్టిలో పెట్టుకొని మృణాల్సేన్ తీసిన ‘మృగయా’  సినిమా వచ్చింది. దానికి ఆధారం ఒరియా రచయిత కాళిందీ చరణ్ పాణిగ్రాహి రాసిన ‘షికారీ’ అనే కథ. ఈ కథ పై విప్లవ హింస అంటే ఏమిటో, అటువంటి విప్లవహింసను ఎందుకు సమర్థించాలో ప్రొఫెసర్ మనోరంజన్ మహంతీ ఇంగ్లీషులో ఒక వ్యాసం రాసాడు.

ఒక యువకుడు ఆదివాసి. మంచి వేటగాడు. బ్రిటిష్ కాలపు కథ. ఆ ప్రాంతానికి వచ్చిన జిల్లా ఇంగ్లిషు అధికారి అతని వేట నైపుణ్యానికి ముగ్ధుడై అతనితో స్నేహం చేస్తాడు. వాళ్ల స్నేహం పెరుగుతుంది. ఆ ఆఫీసర్ భార్య కూడ అతన్ని ఇంటికి ఆహ్వానించి ఆదరిస్తుంటుంది. ఆ అమాయకుడైన ఆదివాసీ కుందేలు మొదలు క్రూరమైన అడవి జంతువులను, పులిని కూడా వేటాడి ఆ ఆఫీసర్కు కానుకగా ఇస్తుంటాడు. అతడు మెచ్చుకోలుగా బహుమతులిస్తుంటాడు. ఆ కాలంలోనే ఆ యువకుడు పెళ్లి చేసుకుంటాడు నవవధువు ప్రేమలో ఎంత మగ్నమైనా,  క్రూరమ•గాల నుంచి పంటను కాపాడుకోవడానికి అడవికి వెళ్లక తప్పదు. మంచెమీంచి వడిసెలవిసురుతూ క్రూర మ•గాలను తరుమాడి అర్ధరాత్రి దాటాక ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ గుడిసెలో అతని యజమాని భూస్వామి (అతడి పంటలు కాపాడడానికే ఈ ఆదివాసి నవ వరుడు అడవికి పోక తప్పలేదు) ఆయన వధువును చెరబట్టి బలాత్కారం చేయబోతున్నాడు.  పెనుగులాడుతున్న తన సహచరిని భూస్వామి బలాత్కారం నుంచి రక్షించడానికి చేతిలో ఉన్న గొడ్డలితో ఒక్క వేటున ఆ భూస్వామి తల నరుకుతాడు. మర్నాడు ఉదయమే ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి అన్నిటికన్నా క్రూరమైన మ•గాన్ని చంపానని రక్తమోడుతున్న ఆ తల చూపుతాడు. ఆఫీసరు, ఆయన భార్య అవాక్కవుతారు. భయకంపితులై నిలువెత్తు చెమటలతో తడిసిపోతారు. ఎంతో ఉత్సుకతతో అర్హమైన బహుమతి కోసం ఆదివాసీ యువకుడు ఎదురుచూస్తుంటాడు. ఆఫీసరు తేరుకొని పోలీసులను పిలిపించి అరెస్టు చేయిస్తాడు. జైలుకు పంపుతారు. కోర్టు విచారణలో ప్రత్యక్షసాక్షి ఆఫీసరే. ఆ యువకుణ్ని ఉరితీస్తారు.

ఈ సినిమా ముగింపులో తెరపై ‘స్టాండప్’ అనే అక్షరాలు కనిపించినప్పుడు హైదరాబాదులో (జమ్రుద్) సినిమా హాల్లో మాతో పాటు ఈ సినిమాలో లీనమైన వాళ్లందరం భూమయ్య కిష్టగౌడ్ల కోసమే నిలబడినామనుకున్నాం.

మరొక బెంగాలీ దర్శకుడు ‘ఆంఖే బోలే’ – ఆ కళ్ళు చూస్తాయి అనే పేరుతో భూమయ్య కిష్టాగౌడ్ పైననే  డాక్యుమెంటరీ సినిమా తీశాడు. ఆ డాక్యుమెంటరీని వరంగల్ లో చాలా చోట్ల, ఇంజనీరింగ్ కాలెజీ మొదలైనచోట్ల చూపాము.  ప్రొద్దుటూరు లో సభకు పిలిచిన డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను ఒక సినిమాహాల్ లో ఏర్పాటు చేసిన విషయం నాకు ఇప్పటికీ గుర్తున్నది.

 అన్నిటికీ మించి మొదట‌ విరసంలో, ఆ తర్వాత ఎపి సిఎల్సి లో పనిచేసిన బి.చంద్రశేఖర్  భూమయ్య కిష్టాగౌడ్ల ఉరిశిక్షల తోనే  మరణశిక్షపై విస్తృత‌ అధ్యయనం చేసి,  ముఖ్యంగా షాక్కో వాంజెట్టి  పై విస్తృత‌ అధ్యయనం చేసి,  వాళ్ళ పై పరిశోధన విశ్లేషణ గ్రంథం రాశాడు.  పర్స్పెక్టివ్స్ ప్రచురించిన ఈ పుస్తకం చాలా ప్రామాణికమైనది. ఈ అధ్యయనం, కృషి  చంద్రశేఖర్ ను  క్యాన్సర్ తో మరణిస్తానని తెలిసినా ఆఖరు నిమిషం దాకా మరణ శిక్ష రద్దు కోసం పోరాడే యోధునిగా నిలబెట్టింది.

రోజెన్ బర్గ్ దంపతుల గురించి గానీ, షాక్కోవాంజెట్టిల గురించి గానీ  పాశ్చాత్య దేశాల్లో జరిగినటువంటి కృషి అమరులు భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్షపై జరగాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది.

మొదటిసారి చూసినప్పుడే ఆ ఇద్దరితో ప్రభావితుడై వారిని భూమ్యాకాశాలతో పోల్చిన శీశ్రీ వారు ఉరితీయబడినారని వార్త చదివి (డిసెంబర్ 2, 1975) డిసెంబర్ 3న డైరీలో నోట్ చేసుకొని, వారి గురించి ‘కన్నీటి కవిత్వం రాయొద్ద’ని ‘సమాజానికి కాలం పెట్టిన అప్పును ప్రాణాలతో వారు తీర్చుకున్నారు.

ఎల్లప్పుడూ వాళ్లలో రగిలే పగ ఎన్నటికీ తీరదు

వాళ్లలో ఆరని ఆశ తీరే రోజు చేరువలోనే ఉంది

చీకటిని పిడికిళ్లతో చెడుగును చెండాడినారు

చెరగిపోని వాళ్ళ శిలాశాసనం మీద

నక్షత్రాలు సాక్షి సంతకం చేశాయి

మరణం లేని మహదాశయమే మనకు వాళ్లిచ్చిన నిధి’ – అని రాశాడు.

జననం అనగానే నాకు మరణం గుర్తొస్తుంద’ని రాసిన శీశ్రీ  ‘జననశ్చ మరణం ధ్రువం’ అని తెలియక అది రాయలేదు. అసహజ మరణాలు లేని మహాదాశయం కొరకు స్పార్టకస్, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు, భూమయ్య  కిష్టాగౌడ్లు ఉరికంబాలెక్కారు.

మరో మహా కవి శివసాగర్ వాళ్లతో 1974లో వారి పక్కసెల్ లోనే బందీ అయి,  ప్రభావితుడై అజరామరమయిన ‘తోటా రాముని తొడకు కాటా తగిలింద’ని పాట రాయడమే కాదు, వారితో గడిపిన జైలు జీవితం గురించి చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇద్దరితో పాటు దేశంలోనే సుప్రసిద్ధ చరిత్ర రచయితగా గుర్తింపు పొందిన సుమంతా బెనర్జీ విచిత్రమైన పరిస్థితుల్లో (హైదరాబాదు ముస్లిం సమాజానికి చెందిన తన సహచరిని కలవడానికి వచ్చి) అరెస్టయి ఎమర్జెన్సీలో వీరి పక్కనే ఉన్నాడు. అందుకే భూమయ్య కిష్టాగౌడ్ల ప్రథమ స్మారకోపన్యాసానికి ఆయననెంచుకున్నాం.

నక్సల్బరీ ఏబయ్యేళ్ల సందర్భంగా తన మీద ప్రభావాల గురించి సుమంతో తనకన్నా ముందు కలకత్తా స్టేట్స్ మన్ పత్రికలో పనిచేసి నక్సల్బరీ ఉద్యమం లోకి పోయిన అమరుడు సరోజ దత్తా,  భవానీదా లతో ప్రభావితమై తాను నక్సల్బరి ఉద్యమంలోకి పోయానని, తర్వాత తనను ప్రభావితం చేసిన భూమయ్య కిష్టాగౌడ్ లతో ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నానని రాశాడు.

శ్రీకాకుళోద్యమంలోనే నాగభూషణ్ పట్నాయక్కు కూడా ఉరి శిక్ష పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేసిన ఆయన మీద హిందీలో సుప్రసిద్ధ హిందీ రచయిత కమలేశ్వర్ నవల కూడా వచ్చింది. శీశ్రీ అప్పుడు రాసిన ‘ ఊగరా ఊగరా! ఉరికొయ్యనందుకొని ఊగరా’ పాట భూమయ్య కిష్టాగౌడ్ల సందర్భంగా విస్త•త ప్రచారాన్ని పొందింది. ఎందుకంటే 1972 స్వాతంత్య్ర రజితోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి వి.వి.గిరి నాగభూషణ్ పట్నాయక్ ఉరిశిక్ష రద్దు చేశాడు.

శ్రీకాకుళోద్యమంలోనే నెల్లూరు జిల్లా తాళ్లపాలెం భూస్వామి హత్యకేసులో ఇంతా రమణారెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాసులకు నెల్లూరు •సెషన్స్ కోర్టు ఉరి శిక్ష  విధించింది. వర్గశత్రు నిర్మూలన, కోర్టుల బహిష్కరణలో విప్లవకారులు విశ్వసించిన రోజులవి. ‘జ్వాలాముఖి’ వారిపై ‘విప్లవ త్రిశదణాలు’ అని దీర్ఘకవిత రాశాడు.

అయితే అది హైకోర్టుకు జస్టిస్ చిన్నపరెడ్డి ముందుకు విచారణకు వచ్చినప్పుడు ‘వాళ్ల రాజకీయ విశ్వాసాల వల్ల వాళ్లు కోర్టులను బహిష్కరించారు కావచ్చు, కానీ మనకు రాజ్యాంగం పై విశ్వాసం ఉంది కనుక ఈ కేసును మనం విచారించాలి’ అని ఎమికస్ క్యూరీ ని (ముద్దాయి తరఫున వాదించి కోర్టుకు సహకరించడానికి న్యాయమూర్తులు నియమించే న్యాయవాది) నియమించి వాదనలు విని ‘ఇది వ్యక్తిగత ద్వేషం, కక్ష, పగ తో చేసిన హత్య కాదు, రాజకీయ విశ్వాసంతో చేసింద’ని ఉరిశిక్షను జీవిత ఖైదుగా ఖరారు చేశాడు.

భూమయ్య కిష్టాగౌడ్ల ఉరిశిక్ష ప్రపంచ ద•ష్టినంతా ఆకర్షించినా ముఖ్యంగా 1974-75లో తెలుగు సమాజ చైతన్య స్థాయిని ఉన్నతీకరించడం వల్ల రాజకీయ ఖైదీల గురించి మాత్రమే కాదు, ఆకలితో, క్షణికావేశంతో బస్సు దహనానికి పూనుకొని  ప్రయాణీకుల మరణానికి దారితీసిన చలపతి, విజయవర్ధన్రావుల  పశ్చాత్తాపాన్ని గుర్తించి,  ముఖ్యంగా బాలగోపాల్ నాయకత్వంలో ఎపిసిఎల్సి, కెజి.సత్యమూర్తి, దళిత సంఘాలు, అందరినీ మించి బి.చంద్రశేఖర్ అడ్వొకేట్ చేపట్టిన ఉద్యమంలో విరసం కూడా క్రియాశీలకంగా పాల్గొన్నది. వాళ్లకు ఉరిశిక్షను సుప్రీంకోర్టు కూడా ఖాయపరచగా రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ మహాశ్వేతాదేవి జోక్యం చేసుకొని విజ్ఞప్తి చేయడంతో రద్దు చేశాడు. (అయితే వాళ్లు ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నారు.)  ఈ ఇద్దర విడుదల కోసం పూనుకొని ఇదివరలో విరసంలో ఉన్న భరద్వాజ జర్నలిస్టు చేస్తున్న ప్రయత్నాలు, 23 నెంబర్ సినిమా అందరికీ తెలిసినవే.

తెలుగు సమాజ చైతన్య స్థాయికి పతాక జీతన్ మరాండీ ఉరిశిక్ష రద్దు చేయడమే కాదు కొట్టివేయబడడం, అది జార్ఖండ్ విషయమైనా – నలుగురు ఆదివాసీ కళాకారుల విషయంలో విరసం ప్రజాకళామండలి చొరవతో స్పందించి, ప్రజానాట్యమండలి నాయకుడు కె.ప్రతాపరెడ్డి, గీతాంజలి (విరసం), కోటి (పి కే యం) లు కన్వీనర్లుగా కదిలి, రాంచీలో ప్రజాస్వామ్య వాదులను కదిలించి సాధించిన విషయం ఇది వరకు రాసే ఉన్నాను కనుక విస్తరించి రాయను.

ముగింపుకు భూమయ్య కిష్టాగౌడ్ ల ఉరిశిక్ష 50 వ సంవత్సరం సందర్భంగా ఇక నుంచి 1 డిసెంబరును ఉరిశిక్ష రద్దు పోరాట దినంగా గుర్తించి ఆ డిమాండ్తో ఉద్యమించాలని పౌర ప్రజాస్వామిక సంఘాలు, శక్తుల ముందు, విరసం మొదలైన రచయితల కళాకారుల కవుల సంఘాల ముందు ప్రతిపాదిస్తూ…

11.11.2002

Leave a Reply