కామ్రేడ్ గుముడవెల్లి రేణుక జీవితం ఒక తెరిచిన పుస్తకం. మూడు దశాబ్దాల విప్లవ జీవితంలో ఆమె చేసిన కృషి, సేవలు ూaతీస్త్రవతీ ్‌ష్ట్రaఅ శ్రీఱటవ గానే చెప్పుకోవచ్చు. ఆమె ముప్పయ్యేళ్ల విప్లవ ప్రస్థానం పీడిత మహిళలకు విముక్తి పోరాట సందేశం. కామ్రేడ్ రేణుక నిబద్ధత గల, మడమ తిప్పని కమ్యూనిస్టు విప్లవకారిణి.
గెరిల్లా జీవితంలో సహజంగా ఎదురయ్యే కష్టాలకు, కడగండ్లకు వెరువని ధీర ఆమె. ఆమె పీడిత వర్గాల విప్లవ సాహితీ సైనికురాలు. అద్భుత విప్లవ రచయిత్రి, వ్యాసకర్త, సమీక్షకురాలు, విమర్శకురాలు. పలు విప్లవ పత్రికల సంపాదకురాలు.
కొన్ని ముఖ్యమైన ప్రగతిశీల హిందీ రచనలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన అనువాదకురాలు ఆమె. పితృస్వామ్య వ్యవస్థలోని పురుషాధిక్యతను నిర్మొహమాటంగా ఎత్తిచూపి, దానిపై నిరంతరం నిబద్ధతతో పోరాడిన ప్రజాస్వామికవాది ఆమె.
కామ్రేడ్ గుముడవెల్లి రేణుక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పుట్టినిల్లయిన నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ ప్రాంతంలో ఉగ్గుపాలతోనే విప్లవ పాఠాలు నేర్చుకుంది. విసునూరు దొరలతో వీరంగమాడిన, దొడ్డి కొమురయ్య నెత్తుర్లు చిందించిన కడవెండి నడిగడ్డ ఆమె పుట్టినిల్లు. కడవెండి అనేక మంది విప్లవకారులకు జన్మనిచ్చిన ఊరు. ఆ ఊరు పేరు చెప్పగానే ఎవరికైనా మొదట దొడ్డి కొమరయ్య, ఆ తరువాతి తరాలలో పైండ్ల వెంకటరమణ, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి… వారి వారసత్వంలో ఇపుడు రేణుక స్ఫురణకొస్తారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు అమరుడు కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ (మహేశ్) సహా పలువురు విప్లవకారులకు జన్మనిచ్చిన వీరమాతలు గల ఊరు కడవెండి. కామ్రేడ్ రేణుకది విప్లవాన్ని కాంక్షించే అనేక కుటుంబాలలో ఒకటి మాత్రమే కాదు, భారత విప్లవోద్యమం కోసం తమ బిడ్డని త్యాగం చేసిన కుటుంబం కూడా. కామ్రేడ్ రేణుక అమరత్వంతో కడవెండి మరింత ఎరుపెక్కింది. ఆ ఊరి చరిత్రలో రేణుక అంతిమ యాత్ర చెరగని ముద్రగా నిలిచింది. అమరుడు కామ్రేడ్ మహేష్ తరువాత మరో నూతన అధ్యాయాన్ని నిలిపింది. ఆ ఊరి చరిత్రలో అమరత్వం సాధించిన తొలి మహిళా విప్లవకారిణి రేణుక!
కామ్రేడ్ రేణుకను 2025, మార్చ్31న ఛత్తీస్‌గఢ్ పోలీసులు బీజాపుర్ జిల్లా బేల్నార్ (ఇంద్రావతి ఏరియా)లో బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని బంధుమిత్రులు కడవెండికి చేర్చారు. వేలాది మంది జనాలతో ఏప్రిల్ 2న సాగిన ఆమె అంతిమయాత్రలో ఆమె భౌతికకాయాన్ని భుజాలపై మోసిన విప్లవాభిమానులకు, ఆ యాత్రలో పాల్గొన్న వేలాది మంది విప్లవ సానుభూతిపరులకు, రచయితలకు, కళాకారులకు, అభిమానులకు, మేధావులకు, సామాజిక కార్యకర్తలకు, పాత్రికేయులకు, మహిళా సంఘాల కార్యకర్తలకు, రేణుకతో విప్లవోద్యమంలో కలిసి నడిచిన, నడుస్తున్న సహ ప్రయాణికులకు, కడవెండిని ఎర్రజెండాలమయం చేసిన పరిసర గ్రామాల ప్రజలకు, ఆ బిడ్డ మీద ప్రేమానురాగాలతో, విప్లవోద్యమం పట్ల గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానంతో, అమరుల త్యాగాల పట్ల అపార గౌరవంతో, విప్లవ విజయం పట్ల ఎనలేని విశ్వాసంతో సాగిన వారందరికి విప్లవాభివందనాలు.
ఎర్రజెండాలను, ప్లకార్డులను, బ్యానర్లను చేబూని ‘‘ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి’’, ‘‘బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలి’’, ‘‘అమర వీరులకు జోహార్లు’’, ‘‘అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం’’, ‘‘ఒక యోధ మరణిస్తే ప్రభవింతురు వేనవేలు’’ వంటి నినాదాలతో, డప్పు దరువులతో, విప్లవ గీతాలతో, ఎర్రజెండాల రెపరెపలతో అమర రేణుక జ్ఞాపకాలతో అంతిమయాత్రలో భాగమైన ప్రతి ఒక్కరి బాధను, దుఃఖాన్ని, ఆగ్రహాన్ని, ఆవేదనను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో పంచుకున్నది. కామ్రేడ్ రేణుక తలిదండ్రులకు, తోబుట్టువులకు, బంధుమిత్రులకు సానుభూతి తెలిపింది. ఆ కుటుంబానికి రేణుక లేని లోటు తీరనిదే. అయితే, విప్లవోద్యమంలో నిలిచిన వందలాది బిడ్డలలో తమ రేణుకను చూసుకుంటూ, వారు విప్లవ శిబిరంలో నిలుస్తారనీ, సదా సహకరిస్తారనీ, పీడిత ప్రజల పక్షం వహిస్తారనీ ఆశిస్తున్నాం. విశ్వసిస్తున్నాం. కామ్రేడ్ రేణుక తల్లి యశోదమ్మ భారత రాజ్యాంగానికి విసిరిన సవాళ్లను ప్రేరణగా తీసుకొని, ఈ దేశంలో అలాంటి మరణాలకు తావులేని సమాజం కోసం దృఢంగా నిలబడాలనీ, పోరాడాలనీ కోరుకుంటున్నాం.
కామ్రేడ్ రేణుక అనేక కలం పేర్లతో రచనలు చేసింది. అవి చాలావరకు అరుణతార, వీక్షణం, మహిళా మార్గం తదితర తెలుగు పత్రికలలో అచ్చయ్యాయి. ఆమె దండకారణ్యంలో వున్నపుడు మరో రచయిత అమన్‌తో కలిసి చేసిన రచనలు చాలా వరకు బి.డి.దమయంతి, మిడ్కో పేర్లతోనే చేసింది. కామ్రేడ్ రేణుక సుదీర్ఘ విప్లవ ప్రస్థానాన్ని తెలుసుకునే ముందు, ఆయా సందర్భాలలో అక్షరబద్ధం చేసిన ఆమె విప్లవ భావాలను ఇక్కడ చూద్దాం:
‘‘మార్చి 8ని జరుపుకోవడం అంటే ఒక పండుగనో, వేడుకనో జరుపుకోవడం కాదు. తరతరాలుగా పోరాడుతున్న మహిళల పోరాటాన్ని కొనసాగించడం. ఆ పోరాటాన్ని రేపటి తరాలకు మరింత స్ఫూర్తిదాయకంగా అందించడం… మహిళపై క్రూర హింసను ప్రయోగించడం ద్వారా తమ అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న పాలకవర్గాలకు మార్చి 8 గురించి, మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఎన్నటికీ వుండబోదు. దోపిడీ పాలక వర్గాల ముసుగును తొలగించడానికి, వాటి మహిళా వ్యతిరేక ముఖాన్ని బహిర్గతం చేయడానికి మార్చి 8 సరైన సందర్భం.’’ (8 మార్చి 2012 సందర్భంగా రాసిన ‘‘మహిళలపై అమలవుతున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీడిత మహిళలందరితో కలిసి గళమెత్తుదాం’’ నుండి.)
‘‘ఈ యుద్ధాన్ని ఇప్పుడే, ఇక్కడే….. అతి ప్రాచీన మానవ సమాజాలు నివసిస్తున్న, గొప్ప సాంస్కృతిక, పోరాట వారసత్వం గల ఈ ప్రాంతాల్లోనే అడ్డుకోకపోతే, ఇప్పుడే గట్టిగా గొంతు విప్లకపోతే, ఈ దాడిని వెంటనే ఆపాలని నినదించకపోతే మన దేశాన్ని, మన సహజ సంపదల్ని మనం రక్షించుకోలేం. ఇది ఒక మాడ్ ప్రాంతంలో అనామకంగా బతికే ఆదివాసుల అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నే కాదు, మొత్తంగా దేశ భవిష్యత్తుతో ముడిపడిన ప్రశ్న కూడా’’. (2012లో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా వీక్షణం పత్రిక కోసం చైతె మడావి పేరుతో రాసిన వ్యాసం – ‘మాడ్ ప్రాంతంపై ప్రభుత్వ సాయుధ బలగాల విధ్వంస దాడి’ నుండి.)
‘‘నేడు విద్యార్థులు గొడ్డు కూరను యూనివర్సిటీ హాస్టల్ మెనూలో చేర్చాలని చేస్తున్న డిమాండ్ నిజానికి చాలా చిన్నది. తమకు నచ్చిన ఆహారాన్ని తినే హక్కును కాపాడుకోవడం, తమ ఆహారపు అలవాటును గౌరవించాలనుకోవడం చాలా సహజమయిన విషయం. అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా. కానీ దీనికోసం పెద్ద పెనుగులాటే జరుగుతున్నది. పెద్ద సాంస్కృతిక పోరాటమే జరుపవలసి వస్తున్నది… కానీ విప్లవోద్యమం బలంగా వున్న ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లు పరిరక్షించడమే కాదు, వాటిని విప్లవోద్యమం సొంతం చేసుకుంది. అందుకోసం పోరాడుతున్న ప్రజలకు అండగా నిలబడిరది. అలా అది ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది. హిందూ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా సైద్ధాంతికంగా పోరాడుతూ ప్రధానంగా విద్య గరపడం, చైతన్య స్థాయిని పెంచడం ద్వారానే ఇది సాధ్యమవుతున్నది’’ (గొడ్డు మాంసాన్ని తమ మెనూలో చేర్చాలనీ పోరాడుతున్న విద్యార్థులకు సంఫీుభావంతో 2012లో మిడ్కో పేరుతో రాసిన ‘‘అట్టడుగు వర్గాల ఆహారపు అలవాట్లను పరిరక్షిస్తున్న విప్లవోద్యమం’’ నుండి.)
‘‘ప్రస్తుతం శిక్షణ పేరుతో ఒక బ్రిగేడ్ స్థాయిలో వచ్చిన భారత సైన్యాలు దండకారణ్యంలోని మాడ్ పరిసరాల్లో తిష్ట వేసాయి. దేశవాసుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతను దృష్టిలో వుంచుకొని ‘శిక్షణ’ను సాకుగా చెప్పినప్పటికీ ఇది మోహరింపు పథకంలో భాగమేనని, సైన్యం ఇక్కడికి వచ్చింది ప్రజలపై యుద్ధానికేనని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు… ఈనాడు మన ‘స్వతంత్ర’ భారత పాలకులు తమ కార్పొరేట్ అనుకూల నయా వుదార విధానాలను నిరాటంకంగా అమలు చేయడం కోసం దేశం నడిబొడ్డునున్న నిరుపేద ప్రజల మీదకు సైన్యాలను పంపుతున్నారు. ఆనాడు తెల్లవాళ్ల సైన్యాలు ‘భూంకాల్’ను అణచివెయ్యగలిగింది నిజమే కావచ్చు, కానీ చరిత్ర ప్రతిసారీ ఒకే విధంగా పునరావృతం కాదనేది కూడా చరిత్రలో రుజువైన సత్యం.’’ (‘భూంకాల్ బాటలో సాగుతున్న బస్తర్ వాసులు’ నుండి. – బి.డి. దమయంతి, అమన్ పేర్లతో 2012లో వీక్షణంలో అచ్చయింది.)
దండకారణ్యంలో 2005-07 మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అత్యున్నత సైనికాధికారులు, ఉద్యమాల అణచివేతలో పేరుమోసిన బడా నేతలు కలిసి ఉమ్మడిగా ‘సల్వా జుడుం’ (సామూహిక వేట) పేరుతో తెల్ల బీభత్సం సృష్టించారు. ఆ హత్యాకాండకు కరుడు గట్టిన ఆదివాసీ తెగ పెద్ద, అవకాశవాద రాజకీయ నేత, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మహేంద్ర కర్మ దోపిడీ పాలకవర్గాల తరఫున సేనాధిపతిగా వ్యవహరించాడు. ‘శాంతియుత విప్లవం’ మాటున సాగిన నాటి దారుణ నిర్బంధకాండ గురించి ‘పచ్చని బతుకులపై నిప్పయి కురుస్తున్న రాజ్యం’ పేరుతో 2008లో ఆమె ఒక పుస్తకం రాసింది. ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొన్న కష్టాలను, నష్టాలను, అన్నింటికి మించి అది సృష్టించిన ఘోర విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసి, తెలుసుకొని ‘బి.డి. దమయంతి’ కలం పేరుతో అక్షరబద్ధం చేసింది. ఈ ఫాసిస్టు సల్వాజుడుం తీరుతెన్నులపై ప్రత్యక్ష పరిశీలనతో కూడిన అలాంటి రచన ఇప్పటి వరకు మరొకటి వెలుగు చూడలేదనే అనుకోవచ్చు!
కామ్రేడ్ రేణుక కలం నుండి బి.డి. దమయంతి పేరుతో 2012లో వెలువడిన మరో రచన ‘విముక్తి బాటలో నారాయణపట్నా’. 2004-10 మధ్య ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ అడవులలో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమానికి అక్షర రూపం ఆ పోరాటగాథ. విప్లవ ముసుగులోని ఆధునిక రివిజనిస్టుల రాజకీయాలతో విసిగి వేసారిన ఆదివాసీ ప్రజలు ఆ సంకెళ్లను ఛేదించుకొని సమరశీల పోరాటాలతో ‘దున్నేవారికే భూమి నినాదం’తో ముందుకు వచ్చారు. వందల ఎకరాల పంట భూములను భూస్వాముల నుండి సాహసోపేతంగా స్వాధీనం చేసుకొన్న పీడిత ప్రజల పోరాటాలు, త్యాగాలు, అనుభవాల పరిచయమే ఆ పుస్తకం.
కథలతో మొదలై, వ్యాసాలు, ప్రజల పోరాట అనుభవాలపై పలు విశేష రచనలు, పుస్తక సమీక్షలు, సినిమా సమీక్షలు, వివిధ సందర్భాలలో వెలువరించిన కరపత్రాలు, అమరుల జీవిత చరిత్రలు, విప్లవోద్యమంలో పని చేస్తున్న వ్యక్తుల పరిచయాలు (ప్రొఫైల్స్), ఇంటర్వ్యూలు… ఇలా అనేక సాహితీ రూపాలలో కామ్రేడ్ రేణుక రచనలు సాగాయి. దండకారణ్య విప్లవోద్యమంలో 2008లో ఏర్పడిన పీ.ఎల్.జీ.ఏ తొలి బెటాలియన్-1లో గత 12 ఏళ్ల కాలంలో వివిధ సమరాలలో క్షతగాత్రులైన గెరిల్లాల అనుభవాలను అక్షరబద్ధం చేసి ప్రపంచానికి పరిచయం చేయాలనే బాధ్యత ఆమెకు పార్టీ అప్పగించింది. దీన్ని పూర్తి చేయాలని చివరి వరకూ ఆమె ఎంతగానో తపనపడిరది. కానీ, ఏటేటా తీవ్రతరమవుతున్న శత్రు దాడుల మధ్య క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడానికి ఆమెకు అవకాశం చిక్కలేదు. ఆ సైనిక నిర్మాణంలో వివిధ సమరాలలో క్షతగాత్రులు కాని గెరిల్లాలు లేరనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఆమె రచనలలోని విప్లవాంశను, వర్గపోరాట అనుభవాల కొలిమిలో ఆమె రాజేసిన అక్షరాలను, ఆమె రచనలలోని ప్రజాస్వామిక విలువలను, సోషలిస్టు ఆదర్శాలను, నిత్య జీవితంలో ప్రజలకు ఎదురయ్యే అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లను ఎరుకచేస్తూ సాహితీ మైదానంపై ఆమె కలం సాగించిన విన్యాసాలపై ఆసక్తి కలవారు అధ్యయనం జరిపి పరిశోధక గ్రంధ రచనకే పూనుకోవచ్చు.
కామ్రేడ్ గుముడవెల్లి రేణుక తల్లి యశోదమ్మ (జయమ్మ), తండ్రి గుముడవెల్లి సోమయ్య. వారి ముగ్గురు సంతానంలో ఒక అన్న తరువాత ఈమె, ఈమె తరువాత ఒక తమ్మడున్నాడు. కామ్రేడ్ సోమయ్య గారు ఉపాధ్యాయులు. తల్లి తండ్రులు ప్రగతిశీల భావాలు కలవారు కావడంతో పిల్లలపై విప్లవోద్యమ ప్రభావం బాగానే పడిరది. కామ్రేడ్ సోమయ్య గారిపై తెలంగాణ సాయుధ పోరాట ప్రభావంతో పాటు, 1970ల చివరి నుండి వరంగల్ జిల్లాలో మొదలైన విప్లవోద్యమ ప్రభావం కూడా వుంది. కడవెండి గ్రామంలో దోపిడీ భూస్వామ్య వర్గాలు మినహా, విప్లవోద్యమ ప్రభావానికి లోనుకాని కుటుంబం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో!
కామ్రేడ్ రేణుక 7వ తరగతి కడవెండిలో పూర్తి చేసింది. ఆ తరువాత మోత్కూరులో 10వ తరగతి వరకు చదువుకుంది. జనగాంలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ పూర్తవగానే కామ్రేడ్ రేణుకకు తల్లిదండ్రులు వివాహం జరిపారు. ఆమెకు ఉన్నత విద్యను అభ్యసించాలని బలంగా ఉన్నప్పటికీ, తండ్రి మాటను కాదనలేక పెళ్లికి ఒప్పుకుంది. అయితే, వైవాహిక జీవితంలో ఎదురైన అణచివేతను, అవమానాలను భరించలేక, ఆ బంధాన్ని తెంచుకొని పై చదువులకు వెళ్లింది. 1992లో ఆమె తిరుపతి చేరుకొని అక్కడి పద్మావతి యూనివర్సిటీలో లా కోర్సులో అడ్మిషన్ తీసుకుంది. 1996లో చదువు పూర్తయ్యాక కొంత కాలం అక్కడే ఒక సీనియర్ న్యాయవాది వద్ద ప్రాక్టీస్ కూడా చేసింది.
చిన్నప్పటి నుంచే కామ్రేడ్ రేణుకపై విప్లవోద్యమ ప్రభావం ఉన్నప్పటికీ, ప్రత్యక్షంగా మాత్రం 1992లోనే సీ.పీ.ఐ.(యం.ఎల్.) (పీపుల్స్ వార్) పార్టీ పరిచయాలలోకి వచ్చింది. అప్పటికి తిరుపతిలో అమరురాలు కామ్రేడ్ పద్మక్క విప్లవోద్యమ నిర్మాణ కృషి కొనసాగిస్తున్నది. పట్టణంలోని విద్యార్థులను, మహిళలను, ఉద్యోగులను సంఘటితం చేస్తున్నది. ప్రత్యేకించి విప్లవ మహిళా సంఘానికి మార్గదర్శకత్వం వహిస్తున్నది. రేణుకతో పరిచయం అయ్యాక, కామ్రేడ్ పద్మక్క ఆమెను మహిళా సంఘంలో పని చేసేలా ప్రోత్సహించింది. ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించిన కామ్రేడ్ రేణుక విద్యార్థినులను, శ్రామిక మహిళలను సమీకరించి, సంఘటితం చేసే కృషిలో నిమగ్నమైంది. అనతికాలంలోనే కామ్రేడ్ రేణుక విప్లవ పార్టీ కార్యకర్తగా ఎదిగి, పట్టణంలోని పార్టీసెల్‌కు కార్యదర్శిగా ఎంపికైంది. అలా ఆ పట్టణంలో కామ్రేడ్ రేణుక 1999 వరకు పని చేసింది. 1998 నాటికే పార్టీ ఆమెను ఏరియా స్థాయి ఆర్గనైజర్‌గా గుర్తించింది. ఆమెకు సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి, రచనా వ్యాసంగంపై ఉన్న మక్కువతో పాటు లోతైన అధ్యయనం, విశ్లేషణా సామర్థ్యం, నిశితమైన విమర్శనా పటిమను గుర్తించి, ఆమెను మహిళా సంఘం పత్రిక ఎడిటోరియల్ బోర్డులో సభ్యురాలిగా చేర్చుకున్నారు.
కామ్రేడ్ రేణుక, 2000లో పార్టీ అవసరాల రీత్యా తిరుపతి నుండి విశాఖపట్టణానికి మారింది. విశాఖలో కూడా ఆమె మహిళా సంఘం బాధ్యతలు చేపట్టి అక్కడ అప్పటికే పని చేస్తున్న వారితో కలిసి, నిర్మాణ కర్తవ్యాల అమలులో భాగమైంది. అక్కడి ఏరియా పార్టీ కమిటీలో సభ్యురాలిగా చేరిన కామ్రేడ్ రేణుక, మహిళా సంఘాన్ని గైడ్ చేస్తూనే మహిళా సంఘం అధికార పత్రిక ఎడిటోరియల్ బోర్డులో కూడా కొనసాగింది. పార్టీ అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా, చురుగ్గా, సృజనాత్మకంగా కొనసాగిస్తూ, నిబద్ధతతో పని చేస్తున్న కామ్రేడ్ రేణుకలో వర్గ పోరాట రాజకీయాల పట్ల బలపడుతున్న అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ, ఎదుటివారితో జరిపే చర్చల్లో వారిని తన భావాలతో డెమాక్రటిక్‌గా కన్విన్స్ చేసుకునే స్వభావం, మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనం పట్ల ఆమెలోని ఆసక్తిని గుర్తించిన పార్టీ రాష్ట్ర కమిటీ 2003లో ఆమెను జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తగా గుర్తించింది.
1997లో కామ్రేడ్ రేణుక, నాటి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ (మహేశ్)ను వివాహమాడిరది. బహిరంగ జీవితంలో వున్న కామ్రేడ్ రేణుకతో కామ్రేడ్ మహేశ్ వివాహం విషయాన్ని, ఆయనపై కొనసాగుతున్న తీవ్ర నిర్బంధ పరిస్థితులలో రహస్యంగా ఉంచాలని పార్టీ నిర్ణయించింది. 1999 డిసెంబర్ 2 నాడు కోవర్టు ద్రోహంతో కామ్రేడ్ శ్యాం, మురళిలతో పాటు ఆయన అమరత్వం ఆమెను చాలా ప్రభావితం చేసింది. ఆ బాధ నుండి బయటపడడానికి ఆమెకు చాలా టైం పట్టింది.
కామ్రేడ్ రేణుక విశాఖ నగరంలో పని చేస్తున్న సమయంలోనే తోటి కమిటీ మెంబర్లయిన కామ్రేడ్స్ కౌముది, జనార్దన్ ప్రమాదవశాత్తు పోలీసులకు చిక్కి బూటకపు ఎన్కౌంటర్లో అమరులైనారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తిరుపతిలో పీ.ఎల్.జీ.ఏ గెరిల్లాలు జరిపిన మాటుదాడి పాక్షికంగా సఫలమైన కాలం. దాంతో రాయలసీమ, కోస్తా జిల్లాలలో పోలీసు నిర్బంధం, గాలింపులు, విప్లవకారుల కోసం వేట ముమ్మరమైంది. పోలీసుల నిఘాలో వున్న, బహిర్గతమైన విప్లవకారులు మునుపటిలా పని చేయడానికి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. పీ.ఎల్.జీ.ఏ గెరిల్లాల చర్యతో ప్రత్యక్షంగా, భౌతికంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ పోలీసుల వేట కారణంగా, కామ్రేడ్ రేణుక అనివార్యంగా మరో ప్రాంత ప్రజల మధ్య ‘రహస్య జీవితానికి’ వెళ్లక తప్పలేదు.
తన రహస్య జీవిత ప్రస్థానంలో కామ్రేడ్ రేణుక తొలుత ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఒడిశాకు చెందిన బాసధారకు వెళ్లింది. అక్కడ అందమైన ప్రకృతి ఒడిలో జీవించే కువీ ఆదివాసీ ప్రజలతో ఆమె త్వరలోనే మమేకమైంది. బాసధార డివిజన్ కమిటీ సభ్యురాలిగా ఆమె అక్కడ 2005 చివరి వరకు పని చేసింది. ఆ అటవీ ప్రాంతం, కొండకోనలు ఆమెకు కొత్తే అయినప్పటికీ, అక్కడి కువీ ఆదివాసీ ప్రజలతో గతంలో పరిచయం లేనప్పటికీ, అక్కడి కామ్రేడ్స్ సహచర్యంలో అక్కడి ప్రాంతాన్ని, భాషను త్వరలోనే సొంతం చేసుకుంది. ‘కువీ’ భాష నేర్చుకుంటూనే, ఒడిశా రాష్ట్ర రాజకీయాలను అర్థం చేసుకోవడానికి, స్థానికులకు వాటిని వివరించడానికి అనివార్యంగా ఒడియా సైతం నేర్చుకోవలసిందేననీ, ఆ భాష నేర్చుకోవడానికి కూడా గట్టి ప్రయత్నమే చేసింది. విప్లవకారులు ఏ ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంత ప్రజల భాష, ప్రజల ఆచార వ్యవహారాలు తెలుసుకొని, వాటిని సొంతం చేసుకోవడం ద్వారానే వాళ్లతో మమేకమవుతారనే ప్రాథమిక అవగాహనతో కామ్రేడ్ రేణుక ఎక్కడికి వెళ్లినా, ముందుగా అక్కడి ప్రజల భాష నేర్చుకోవడానికి, రీతి-రివాజులు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నించేది.
కామ్రేడ్ రేణుక, బాసధార డీవీసీఎంగా వుంటూనే పార్టీ కోరిన మేరకు ఏఓబీ జోన్ మహిళా సబ్-కమిటీ (వీూజ)లో సభ్యురాలిగా కూడా బాధ్యతలు స్వీకరించింది. విప్లవోద్యమంలో ఏర్పడుతున్న మహిళా సబ్-కమిటీలు నాలుగు రంగాలలోని మహిళల సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పార్టీ ముందు అవసరమైన ప్రతిపాదనలు చేయాల్సి వుంటుంది. 1. గెరిల్లా జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న రాజకీయ, నిర్మాణ, సైనిక సమస్యలతో పాటు అన్ని రంగాలలో పురుషాధిక్యత ప్రభావం, 2. పార్టీలోని సాధారణ మహిళా కార్యకర్తలు, వివిధ కమిటీలలోని మహిళా నాయకత్వ కామ్రేడ్స్ రాజకీయ, నిర్మాణ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పురుషాధిక్యత ఒత్తిళ్లు, ప్రభావం, 3. ప్రజాసంఘాలలో మహిళలు ఎదుర్కొంటున్న నిర్మాణపర సమస్యలతో పాటు పురుషాధిక్య సామాజిక ఒత్తిళ్లు, 4. సమాజంలోని యావత్ పీడిత మహిళలు ఎదుర్కొంటున్న కుటుంబ, తెగ, కుల, రాజ్య అణచివేత చర్యలతో పాటు సర్వత్రా ఎదురయ్యే పురుషాధిక్యత, వివక్ష తదితర సమస్యలు. అయితే, వీటన్నింటికి మూలం మాత్రం పితృస్వామ్య సమాజం అనే సైద్దాంతిక అవగాహనను పెంచుకుంటూ పనిచేయాల్సి వుంటుంది. కామ్రేడ్ రేణుక, మహిళా సబ్-కమిటీ సభ్యురాలిగా పైన పేర్కొన్న అన్ని రకాల సమస్యలను అధ్యయనం చేయడానికి ఎంతగానో కృషి చేసింది.
తనకు అడవి జీవితం, గెరిల్లాల సహచర్యం, ఆదివాసీ జనజీవితాలతో అనుభవం కొత్తే అయినప్పటికీ, ఆమె ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకోవడంలో చాలా బాధ్యతగా వుంటూ, వాటి పరిష్కారానికి తగిన మార్గాలు వారితోనే చర్చించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేది. మరోవైపు, వాటిని పార్టీ కమిటీల ముందుంచి వాటి పరిష్కారానికి తగిన పోరాట రూపాలు, నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన నిర్ణయాలు చేయడంలో పాలు పంచుకునేది.
ఏఓబీ నుండి అప్పట్లో వెలువడే మహిళా పత్రిక ‘విప్లవి’ సంపాదక వర్గ సభ్యురాలిగా కామ్రేడ్ రేణుక బాధ్యతలు తీసుకుంది. విప్లవోద్యమ పురోగమనంలో మహిళల భాగస్వామ్యం పెరగడంతో పాటు, సమరశీల మహిళా ఉద్యమం రూపుదిద్దుకుంటున్న క్రమంలో వారికోసం ప్రత్యేకంగా పత్రిక తీసుకురావలసిన అవసరం ఏర్పడిరది. పితృసామ్య సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలతో పాటు, పురుషాధిక్యత మూలంగా మహిళలు వివిధ రంగాలలో ఎదుర్కొనే సమస్యలపై అవగాహనను పెంపొందించడానికి ఒక ఆర్గనైజర్‌లా పని చేసే పత్రిక అనివార్యమైంది. రచనా వ్యాసంగంలో అభిరుచి కల కామ్రేడ్ రేణుక పత్రిక ఎడిటోరియల్ బోర్డులో వుంటూ ‘విప్లవి’ని సృజనాత్మకంగా, పాఠకులకు నచ్చేలా తీసుకురావడానికి చాలా కృషి చేసింది. దాంతో పాటు ఏఓబీ ఉద్యమంలో తొలినాళ్ల నుండి అప్పటివరకు (1980-2005) ఆశయ సాధనలో అసువులు బాసిన మహిళా అమరుల జీవిత చరిత్రలను ఒక పుస్తకంగా తీసుకురావడానికి జరిగిన కృషిలో ఆమెది కీలక పాత్ర. విప్లవోద్యమమే ఊపిరిగా జీవించిన ఒక పాత తరం సీనియర్ మహిళా కామ్రేడ్తో పట్టుబట్టి ఆ పుస్తకానికి ముందుమాట రాయించడంలో కూడా కామ్రేడ్ రేణుక చొరవే ప్రధానం.
కామ్రేడ్ రేణుక, శక్తి సామర్థ్యాలు, ఆమె అభిరుచి, ఆమె ఆసక్తితో పాటు ఆమె అక్కడ చేస్తున్న పనులను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని చర్చించిన పార్టీ రాష్ట్ర కమిటీ ఆమె సేవలను మరింత విస్తృతంగా, మరింత ప్రభావశీలంగా, మరింత ఎక్కువగా, ఉన్నతంగా వినియోగించుకోవడానికి ఆమెను కేంద్రకమిటీ నిర్వహణలోని పత్రికా రంగానికి మార్చడం సముచితంగా వుంటుందని భావించింది. రాష్ట్ర కమిటీ అభిప్రాయంపై మధ్య రీజనల్ బ్యూరో (సీ.ఆర్.బీ) సానుకూలంగా స్పందించి కామ్రేడ్ రేణుకను ‘క్రాంతి’ పత్రిక సంపాదక వర్గంలోకి తీసుకుంది.
1980లలో భారత విప్లవోద్యమానికి తలమానికంగా నిలిచిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాజకీయ అధికార పత్రికగా ‘క్రాంతి’ వెలువడుతూ ఉండేది. ఆ ఉద్యమం తాత్కాలిక సెట్ బ్యాక్‌కు గురవడంతో దాని నిర్వహణ బాధ్యతను సీ.ఆర్.బీ చేపట్టి ఈనాటి వరకు అదే కొనసాగిస్తోంది. కామ్రేడ్ రేణుక 2006లో క్రాంతి ఎడిటోరియల్ బోర్డులో భాగమై 2012 వరకు అందులో కొనసాగింది. ఆ బాధ్యతలో భాగంగా 2006 ప్రారంభంలో కామ్రేడ్ రేణుక దండకారణ్యంలో అడుగు పెట్టింది.
ఆ కాలం విప్లవోద్యమానికి ఎంతో కీలకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఉద్యమ ప్రాంతాలు (ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏఓబీ) తాత్కాలిక సెట్ బ్యాక్ పరిస్థితులను ఎదుర్కుంటున్న కాలం అది. మరోవైపు, దండకారణ్యంలో తెల్ల బీభత్సానికి మారుపేరుగా నిలిచే ఫాసిస్టు ‘సల్వాజుడుం’, ఆ తర్వాత ‘గ్రీన్ హంట్’ ఆపరేషన్ కొనసాగిన కాలం. సల్వాజుడుం ఆదివాసీ కుటుంబాలను నిలువునా చీల్చి, జనజీవితాలను అతలాకుతలం చేసి, గ్రామాలను వల్లకాడులుగా మార్చింది.
2009 మధ్య నాటికి ప్రజల ప్రతిఘటనతో ఫాసిస్టు సల్వాజుడుం ఓటమి పాలు కావడంతో, భారత దోపిడీ పాలక వర్గాలు మావోయిస్టుల నిర్మూలన కోసం నూతనంగా దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో మరో సైనిక కేంపెయిన్ చేపట్టి దాడులు ముమ్మరం చేశాయి. మరోవైపు, వందలాది ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ ప్రజా సంఘాలు, ఆదివాసీ పోరాట సంస్థలు, ఆదివాసీ ప్రజల శ్రేయోభిలాషులు, హక్కుల కార్యకర్తలు, రచయితలు, కళాకారులు, మేధావులు, పాత్రికేయులు, వామపక్ష శక్తులు, సంస్థలు దానిని వ్యతిరేకించడమే కాకుండా, దానిని ‘ప్రజలపై యుద్ధం’గా బహిర్గతం చేస్తూ ముందుకు వచ్చిన సమయం అది. అలాంటి పరిస్థితులలో ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో కలంతో తన కృషిని కొనసాగించిన ప్రతిభావంతమైన సాహితీ సైనికురాలు కామ్రేడ్ రేణుక.
కామ్రేడ్ రేణుక, ఆ రోజుల్లో దండకారణ్య ప్రజలు ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ బస్తర్ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్న ఫాసిస్టు సల్వాజుడుం బీభత్సాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి అత్యంత రిస్క్ మధ్యనే అనేక గ్రామాలకు వెళ్లి వందలాది పీడిత కుటుంబాలను కలిసింది. వారి హృదయాంతరాలలో నుండి ఉబికివచ్చిన వర్ణనాతీతమైన బాధలను పంచుకుంది. పంచుకోవడమే కాదు, వాటిని తన శక్తిమంతమైన కలంతో అక్షరబద్ధం చేసి ‘మండుతున్న గాయాలు’ పేరుతో ఒక ముఖ్యమైన నివేదికను ప్రపంచానికి అందించింది. ఆ అధ్యయన కాలంలో ప్రజలు పంచుకున్న అనుభవాలతో తాను స్వయంగా అనుభవించిన వ్యథను, అక్షరాలలోకి మలచడం ద్వారానే ఓ మేరకు తీర్చుకోగలిగింది. తదనంతర కాలంలో అవసరాల రీత్యా ఆమె ఆ గ్రామాలను కలిసిన అన్ని సందర్భాలలోనూ, అలాగే, ఆ కుటుంబాల నుండి విప్లవోద్యమంలో చేరిన కామ్రేడ్స్‌ను వేర్వేరు సమయాల్లో కలిసినపుడు వారి గత అనుభవాలను మళ్లీ, మళ్లీ అడిగి తెలుసుకునేది. సల్వాజుడుం దాడులలో తొలి అమరుడు గంగలూర్ ఏరియా మన్కెలీ జనతన సర్కార్ అధ్యక్షుడు కామ్రేడ్ ఏమ్లా కోవాలు కుటుంబంతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడిరది. ఆ తర్వాత ఉద్యమంలో చేరిన ఆయన భార్య, పిల్లలతో తన అనుభవాలను సదా గుర్తు చేసుకునేది. ఆ సమయంలో ఆమె కళ్లు చెమ్మగిల్లేవి. విప్లవోద్యమంలో కీలకమైన మలుపుగా నమోదైన ఆ సంవత్సరాల్లోనే వ్యక్తిగతంగా కూడా కామ్రేడ్ రేణుక జీవితం ఒక పెద్ద కుదుపుకు లోనైంది. ఆమె జీవిత సహచరుడు కామ్రేడ్ శాఖమూరి అప్పారావు 2010 మార్చిలో పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లో అమరుడైనాడు.
కామ్రేడ్ రేణుక తన సున్నితమైన స్వభావం మూలంగా, ఎదుటివారి ఇబ్బందులు, సమస్యలు, కష్టాలతో పాటు, ఆపరేషన్ గ్రీన్ హంట్ కాలంలో పార్టీకి, ఉద్యమానికి ఎదురవుతున్న నష్టాలపై చాలా ఎమోషనల్‌గా స్పందించేది. ఆమె తన జీవిత సహచరుడ్ని కోల్పోయిన షాక్ నుండి తేరుకోవడానికి తన స్వభావరీత్యా ఎక్కువ కాలమే పట్టింది. అయినప్పటికీ, ఆ కాలంలో ఆమె తన విప్లవ కృషిని యథావిధిగా కొనసాగిస్తూనే, తోటి కామ్రేడ్స్ సహకారంతో బాధను అధిగమించడానికి ప్రయత్నించింది.
క్రాంతి పత్రిక బాధ్యతలు నిర్వహిస్తున్న చివరి సంవత్సరాలలో ఆమె ఏఓబీలోని నారాయణపట్నా ప్రజా ఉద్యమాన్ని అధ్యయనం చేయాలని భావించింది. తన అభిప్రాయాన్ని పార్టీ ముందుంచగా, పార్టీ కూడా ఆ అవసరాన్ని గుర్తించింది. ఆ పనిని కామ్రేడ్ రేణుక పట్టుదలతో, నిబద్ధతతో పూర్తి చేస్తుందని విశ్వసించిన సీ.ఆర్.బీ వెంటనే అవకాశం వుండడంతో ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది.
1970లలో నక్సల్బరీ విప్లవోద్యమం దెబ్బ తిన్న తరువాత పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ 2008-11 మధ్య ముందుకు వచ్చిన లాల్‌గఢ్ ఉద్యమం దేశవ్యాప్తంగా అనేక సెక్షన్‌ల ప్రజలను బాగా ఆకర్షించింది.
అది ఉద్యమ గమనంలో అనేక నూతన ప్రయోగాలను ఆవిష్కరించింది. అది విస్థాపన వ్యతిరేక పోరాటంగా ప్రారంభమై ప్రజా రాజ్యాధికార స్థాపన దిశలో అన్ని రకాల చట్టబద్ధ, సాయుధ పోరాటాలను, చర్యలను సమన్వయంతో కొనసాగిస్తూ శత్రువుకు అనేక సవాళ్లను విసిరింది. మరోవైపు ఒడిశాలో వేలాది మంది ప్రజలను సమరశీల పోరాటాలలోకి కదిలిస్తూ నారాయణపట్నా భూపోరాటాలు ముందుకువచ్చి 1970ల నాటి శ్రీకాకుళాన్ని గుర్తుకు తెచ్చాయి. ఆ ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి కామ్రేడ్ రేణుక అడవి దారుల గుండా, తోటి గెరిల్లాలతో కొన్ని వందల మైళ్ల దూరం నడిచి, అక్కడికి చేరుకుంది. అక్కడ ఆమె దాదాపు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనం ఫలితంగా ‘విముక్తి బాటలో నారాయణపట్నా’ అనే పుస్తకం బి.డి.దమయంతి పేరుతో 2013లో వెలుగు చూసింది.
కామ్రేడ్ రేణుక, ‘క్రాంతి’ ఎడిటోరియల్ బోర్డులో కామ్రేడ్ కటకం సుదర్శన్ (అమరుడు కామ్రేడ్ ఆనంద్ ఏ దూలాదాదా) సహచర్యంలో పని చేసి మంచి అనుభవాన్ని సంపాదించింది. ఆ తర్వాత, దండకారణ్యానికి బదిలీ అయ్యాక పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డీకే ఎస్.జెడ్.సీ కార్యదర్శి అమరుడు కామ్రేడ్ రావుల శ్రీనివాస్ (రామన్న) నాయకత్వంలో రేణుక ఎక్కువ కాలం ప్రెస్ బాధ్యతలు నిర్వహించింది.
2013లో ఎదురైన అనివార్య సమస్యలతో ‘క్రాంతి’ పత్రిక రెండేళ్లు ఆగిపోయింది. ఆ సమయంలో కామ్రేడ్ రేణుక దండకారణ్యం నుండి వెలువడుతున్న త్రైమాసిక పత్రిక ‘ప్రభాత్’ ఎడిటోరియల్ బోర్డులోకి బదిలీ అయింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార పత్రికగా వెలువడే ప్రభాత్ పత్రికను నడిపించడం కోసం కామ్రేడ్ రేణుక హిందీ భాష నేర్చుకోవడానికి పట్టుదలగా కృషి చేసింది. పత్రిక సంపాదక వర్గం అందించిన సహాయ సహాకారాలతో పాటు ప్రధానంగా ఆమె కృషి ఫలితంగా కొద్ది సంవత్సరాలలోనే ఆమె నేరుగా హిందీలోనే వ్యాసాలు, రిపోర్టులు రాయగలిగే స్థాయిలో పట్టు సంపాదించింది.
కామ్రేడ్ రేణుక 2013 నుండి 2024 చివరి వరకు దండకారణ్యంలో ప్రధానంగా పత్రికా రంగంలోనే పని చేసింది. పత్రిక నిర్వహణతో పాటు పార్టీ ఇచ్చే సర్క్యులర్లు, డాక్యుమెంట్లు, ఇతర పార్టీ పత్రాలు తెలుగు నుండి హిందీలోకి అనువదించడంలో కూడా పట్టు సంపాదించింది. అంతకు ముందే కోయ భాష నేర్చుకున్న రేణుక స్థానిక కేడర్లకు అవసరమైన పార్టీ సాహిత్యాన్ని కమిటీ కోరిన మేరకు కోయలోకి కూడా అనువదించి అందించేది. తరచుగా, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల పోరాట అనుభవాలు, ప్రజా సంఘాల పని తీరు, ప్రజలపై కొనసాగుతున్న రాజ్య హింస, మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, ప్రధానంగా రాజ్య హింసతో పాటు తెగ అణచివేత పద్ధతులను అధ్యయనం చేసేది. గెరిల్లా కామ్రేడ్స్‌తో వుంటూ, వారి అనుభవాలను తెలుసుకునేది. క్షేత్ర స్థాయి అధ్యయనానికి వెళ్లినపుడు అక్కడ కలిసే మహిళా కార్యకర్తల అనుభవాలు, ఉద్యమంలో పురుషాధిక్యత ధోరణుల గురించి తెలుసుకునేది. వాటన్నింటినీ ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసి, విశ్లేషించి అవసరమైన మేరకు వాటిని పత్రికలలో నివేదికలుగా, వ్యాసాలుగా మలిచిన కలం యోధ కామ్రేడ్ రేణుక.
తూర్పు బస్తర్ డివిజన్లో వలస కూలీల సమస్యను కామ్రేడ్ రేణుక ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. 2014లో మధ్య రీజనల్ బ్యూరో దండకారణ్యం నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు వందల సంఖ్యలో వెళ్తున్న వలస కూలీల సమస్యపై చేసిన తీర్మానం వెలుగులో ఆమె అధ్యయనం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అడవుల నుండి పట్టణాలకు వలస కూలీలుగా వెళ్తున్న వారు పట్టణ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వాస్తవికంగా అక్షరబద్ధం చేయడం రచయితల కలానికి పెద్ద పరీక్షే. పట్టణాల్లో కూలీ పనులు కుదిర్చే స్థానిక దళారీల నుండి మొదలై పట్టణాల్లో పని స్థలాల వరకు జరిగే శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ, ఇతర మోసాల గురించి పీడిత యువత నుంచి ప్రత్యక్షంగా వింటే తప్ప ఊహించుకోవడం కూడా కష్టమే. పని స్థలాలలో దబాయింపులు, ఒత్తిళ్లకే కాకుండా ముఖ్యంగా యువతులు తమ వెంట కూలీ పనులకు వచ్చే తమ సొంతూరి వాళ్ల ఒత్తిళ్లతో తలెత్తుతున్న నైతిక సమస్యలు కూడా తక్కువేమీ కాదు. అలాంటి సమస్యలన్నీ కామ్రేడ్ రేణుక తన క్షేత్ర స్థాయి అధ్యయనంలో బాధితుల నుండి ప్రత్యక్షంగా తెలుసుకొని, ఎంతో హృద్యంగా అక్షరాలలోకి అనువదించి ‘‘పట్టణాలకు ప్రవహిస్తున్న అడవిబిడ్డల చెమటా నెత్తురూ – ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంత వలసకూలీలపై ఒక అధ్యయనం’’ అనే పుస్తకాన్ని గమిత పేరుతో వెలుగులోకి తెచ్చింది.
కామ్రేడ్ రేణుక రచనా వ్యాసంగంలో ఎంత ప్రతిభావంతురాలో, బోధనా రంగంలో కూడా ఆమె అంతే పట్టు సాధించింది. తన బాధ్యతలను కొనసాగిస్తూనే పార్టీ కమిటీలు కోరినప్పుడల్లా గెరిల్లాలకు, పార్టీ కేడర్లకు రాజకీయ తరగతులు బోధించేది. పార్టీ కేంద్ర కమిటీ రూపొందించిన డాక్యుమెంట్లతో పాటు మార్క్సిస్టు మౌలిక విషయాలపై స్థానిక కేడర్లకు కోయ భాషలో అధ్యయన తరగతులు నిర్వహించేది. అదే సమయంలో పై కమిటీలు నిర్వహించే రాజకీయ తరగతులకు హాజరై తన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆమె ఎంతగానో కృషి చేసింది.
2011లో జరిగిన దండకారణ్య పార్టీ ప్లీనం ఉద్యమం ‘గడ్డు’ పరిస్థితులలో వుందని సమీక్షించింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడులతో జరుగుతున్న నష్టాలు, నాయకత్వం సహా పెద్ద సంఖ్యలో విప్లవ శక్తులు బలహీనపడి ఉద్యమం నుండి వెనక్కి వెళ్లడం, పోలీసులకు లొంగిపోవడం లాంటి తీవ్ర దుష్పరిణామాల నేపథ్యంలో పార్టీ 2013లో బోల్షివీకరణ కేంపెయిన్ చేపట్టింది. అందులో భాగంగానే 2013 నుండి 2018 వరకు దండకారణ్యంలో వివిధ రూపాలలో కొనసాగిన ‘సామాజిక అధ్యయనం-విశ్లేషణ’లో కామ్రేడ్ రేణుక పాలు పంచుకుంది. దండకారణ్యంలోని వివిధ డివిజన్లలో మారుతున్న పరిస్థితులపై నాయకత్వం కొనసాగించి తయారు చేసిన వివిధ అధ్యయన పత్రాలపై జరిగిన చర్చలలో కామ్రేడ్ రేణుక నాయకత్వ కామ్రేడ్స్‌తో పాటు పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నది. ఆమె జరిపే చర్చలు, ఎదుటివారి సందేహాలకు ఇచ్చే వివరణలు అర్థవంతంగా వుండి స్టడీ క్యాంపులలో అందరినీ ఆలోచింపచేసేవి.
కామ్రేడ్ రేణుక ప్రెస్ యూనిట్లో వుండగా పత్రిక పనులు కొనసాగిస్తూనే, అనేక మంది కొత్త కామ్రేడ్స్‌కు కంప్యూటర్ నిర్వహణలో శిక్షణనిచ్చి వారిని మంచి కంప్యూటర్ ఆపరేటర్లుగా, టైపిస్టులుగా తీర్చిదిద్దింది. భారత విప్లవోద్యమం 2010 నాటికి పట్టణాలలో, అనేక మైదాన ప్రాంతాలలో అంతకన్నా ముందే దెబ్బ తిని పోవడంతో, దండకారణ్యానికి బయటి నుండి తగిన శక్తులను పార్టీ కేంద్రకమిటీ పంపించలేకపోయింది. మరోవైపు, దండకారణ్య విప్లవోద్యమం అనేక సంవత్సరాలుగా రైతాంగేతర సెక్షన్లకు దూరమవడంతో ఆ ఉద్యమం పూర్తిగా ఒంటరై, కేవలం ఆదివాసీ ప్రజలకే పరిమితమైంది. ఆ ప్రజలలో నుండే వందల సంఖ్యలో పీ.ఎల్.జీ.ఏ.లో చేరి సాయుధులవుతున్న యువతరం నుండే సమస్త ఉద్యమ అవసరాలను తీర్చగలిగే శక్తులను తయారుచేసుకోక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలాంటి విషమ పరిస్థితులలో, కామ్రేడ్ రేణుక అనేక మంది ఆదివాసీ యువతీ యువకులను కంప్యూటర్ ఆపరేటింగ్, టైపింగ్ పనుల్లో నేర్పరులుగా చేసింది. ఉద్యమంలో చేరిన తర్వాత చదువు నేర్చుకున్న వారే అయినప్పటికీ, వారిని చాలా వరకు అక్షర దోషాలకు తావివ్వని టైపిస్టులుగా మలిచింది. వందలాది పుస్తకాలు వారితో స్కానింగ్ చేయించింది. అనేక మంది కామ్రేడ్స్ ప్రింటింగ్ పనులలో మంచి అనుభవాన్ని గడిరచారు.
వారంతా కామ్రేడ్ రేణుక (చైతే) మరణవార్త విన్న తరువాత ఆమె చెదరని స్మృతులను గుర్తు చేసుకుంటూ అమరుల ఆశయాల సాధనలో దృఢంగా నిలిచి పని చేయాలని ప్రతిన బూనుతున్నారు.
2020 అక్టోబర్లో జరిగిన దండకారణ్య పార్టీ ప్లీనంలో కామ్రేడ్ రేణుక మరి కొంత మందితో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆ ప్లీనం చేపట్టిన కర్తవ్యాలలో భాగంగా, దండకారణ్యంలో మహిళా ఉద్యమాన్ని తిరిగి బలోపేతం చేయడానికి డీ.కే.ఎస్.జెడ్.సీ దండకారణ్య మహిళా సబ్ కమిటీని నాయకత్వ కామ్రేడ్స్‌తో పునరుద్ధరించింది. ఆ కమిటీలో భాగమైన కామ్రేడ్ రేణుక చివరి వరకూ అందులో సభ్యురాలిగా కొనసాగింది. దండకారణ్యంలో ఆ కమిటీకి అందరికన్నా ఎక్కువ కాలం పాటు బాధ్యురాలిగా ఉండి, అందరి అభిమానాన్ని చూరగొన్న అమరురాలు ఉప్పులూరి నిర్మల (నర్మద) వారసత్వాన్ని రేణుక పూర్తి నిబద్ధతతో కొనసాగించింది.
అమరులు కామ్రేడ్ ఆలూరి భుజంగారావు (పెద్దన్న) గారితో పాటు కామ్రేడ్ నిర్మల కూడా ప్రభాత్ పత్రిక తొలి సంపాదక వర్గంలో సభ్యురాలు. డీకే ప్రెస్ బాధ్యురాలుగా కూడా ఆమె కొంత కాలం కొనసాగింది. ‘నిత్య’ పేరుతో ఆమె సాహితీ రచనలు కొనసాగించేది. సహజంగానే ఎదుటి వారి పట్ల నమ్రతగా వుండే కామ్రేడ్ రేణుక అమరురాలు నర్మదతో, అలాగే ఆమె సహచరుడు, డీకే ప్రెస్ బాధ్యుడు, తప్పుడు కేసుల్లో ముంబయిలోని తలోజా జైలులో అనేక సంవత్సరాలు గడిపిన సీనియర్ పార్టీ నాయకుడు కామ్రేడ్ రాణి సత్యనారాయణ (కిరణన్న)తోనూ చాలా అన్యోన్యంగా వ్యవహరించేది. ఇలా అనేక రకాలుగా కామ్రేడ్ నిర్మల విప్లవ కార్యాచరణతో సాన్నిహిత్యం వున్న రేణుకకు ఆమె పట్ల అపార గౌరవాభిమానాలు వుండేవి. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా వారి కార్యాచరణలో వివిధ రకాలుగా ప్రస్ఫుటమయ్యేది.
మహిళా సబ్-కమిటీలోని మిగతా కామ్రేడ్స్‌లో ఎక్కువ మంది స్థానిక ఆదివాసీ కామ్రేడ్స్ కావడంతో, వారందరితో ఎజండాలోని అన్ని విషయాలు సమగ్రంగా చర్చించడం, సమావేశాల సందర్భంగా మార్క్సిస్టు మహోపాధ్యాయుల రచనలలో నుండి సందర్భోచితంగా వ్యాసాలను ఎన్నుకొని అధ్యయనం చేయడం, మినిట్స్ రాయడం, తీర్మానాలు రాయడం వరకు.. అన్నింట్లో కామ్రేడ్ రేణుక ముఖ్య పాత్ర పోషించేది. దండకారణ్యంలో మహిళా ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయడానికి అవసరమైన అధ్యయనాంశాలను ఎంపిక చేసి కమిటీ సభ్యులకు అందించేది.
తాను మహిళా కమిటీ సభ్యురాలు అయిన తరువాత, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం అధికార హిందీ పత్రిక ‘సంఘర్షరత్ మహిళ’ను తీసుకురావడానికి గతం కన్నా ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. అంతేకాదు, దానిని ‘లడెమాయన మహిళ’ పేరుతో కోయలో తేవడానికి కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా కామ్రేడ్ రేణుక తన వంతు పాత్ర పోషించింది. ఇలా కామ్రేడ్ రేణుక ఏ రంగంలో బాధ్యతలు చేపట్టినా, దానికి సంపూర్ణంగా న్యాయం చేసేది. ఆమె అమరత్వంతో, దండకారణ్య మహిళా ఉద్యమం ఒక నమ్మకమైన, భరోసానిచ్చే ప్రీతిపాత్రురాలైన నాయకురాలిని కోల్పోయింది. ఆ లోటును పూడ్చుకోవడానికి ఆమె నుండి నేర్చుకున్న విప్లవ పాఠాల వెలుగులో, ఆమె ఆదర్శాలతో, ఆశయాలతో అలుపెరుగకుండా శ్రమించి కగార్నే కాదు, దాన్ని మించిన అణచివేత చర్యలలో సైతం ముందుకు పోవడం ద్వారానే సాధ్యమవుతుంది.
కామ్రేడ్ రేణుక ఆరోగ్యం గురించి కూడా కొంత చెప్పుకోవాలి. ఆమె పుట్టి పెరిగిన పరిస్థితులకు, అటవీ ఉద్యమంలో గెరిల్లా జీవితంలో ఎదురైన పరిస్థితులకు మధ్య పోలికే లేదని చెప్పవచ్చు. బాసధారలోనైనా, 2006 నుంచి దండకారణ్యంలో ఉన్న కాలంలో అయినా ఆమెను మలేరియా జ్వరం నిరంతరం పీడిరచేది. కొన్ని సందర్భాలలో ఫాల్సిఫారం రకం మలేరియా బారిన పడేది. నరాలు చిట్లి పోతాయన్నంత తలనొప్పితో బాధపడేది. స్పాండిలైటీస్‌తో సతమతమయ్యేది. అయినప్పటికీ, భుజానికి థర్టీ కార్బైన్తో, ఆలీవ్ గ్రీన్ యూనిఫాంతో అడవుల్లో గెరిల్లాలతో సాగిపోతూనే ఉండేది. కొండలు ఎక్కుతూ, దిగుతూ ఆ బక్క పలుచని మనిషి నడకను చూసిన ప్రతి సందర్భంలో ‘మనం ఎన్నుకున్న మార్గం సరైనదనే విశ్వాసం మనలో అద్భుతాలు సాధించగల విప్లవ శక్తినీ, విప్లవ ఉత్సాహాన్ని నూరు రెట్లు వృద్ధి చేస్తుంది’ అని కామ్రేడ్ లెనిన్ చెప్పిన మాటలే గుర్తొచ్చేవి. 1996 నుండి విప్లవ జీవితం కొనసాగిస్తున్న కామ్రేడ్ రేణుకకు 1999 నుండి 2014 వరకు మధ్య, మధ్య ‘వ్యక్తిగతంగా’ ఎదురైన భారీ షాక్‌లు ఆమెను మానసికంగా ఎంతగానో అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ, పట్టుదలతో, సంకల్ప బలంతో, తోటి కామ్రేడ్స్ అందించిన తోడ్పాటుతో ఆమె వాటిని అధిగమించింది. శారీరకంగా ఎంత అనారోగ్యం వున్నప్పటికీ, ఆమె విప్లవ ప్రస్థానంలో చివరి దశాబ్ద కాలం మాత్రం నిస్సందేహంగా చాలా ఉత్సాహంగా పని చేసిన కాలంగా చెప్పుకోవచ్చు.
కామ్రేడ్ రేణుక రాసిన కథలు 2023లో విరసం మిత్రులు ప్రచురించిన ‘వియ్యుక్క’ సంకలనాలలో అచ్చయ్యాయి. మహిళా రచయిత్రుల కథల సంకలనాలు వెలువరిస్తున్నట్టు విప్లవ రచయితల సంఘం చేసిన ప్రకటనపై వెంటనే స్పందించిన దండకారణ్య మహిళా రచయిత్రులలో కామ్రేడ్ రేణుక ఒకరు. వారి ప్రకటనపై స్పందిస్తూ, వారు ఇచ్చిన కథల జాబితాను నిశితంగా పరిశీలించి వాటిలో తన రచనలు, తనవి కానప్పటికీ తన పేరుతో నమోదైన కథలు, తనకు తెలిసిన తోటి కామ్రేడ్స్ కథల గురించి తనకు తెలిసిన మేరకు సమాచారం అందిస్తూ వారికి ఉత్తరం రాసింది. వియ్యుక్క సంపాదకులకు చేర్చాలంటూ రాసిన ఆ ఉత్తరమే కామ్రేడ్ రేణుక చివరి ఉత్తరం కావడం బాధాకరం.
కామ్రేడ్ రేణుక తన కమిటీలోని యువ సభ్యుడు కామ్రేడ్ రూపేశ్ అమరత్వం సందర్భంగా వ్యక్తపరిచిన స్పందన:
‘‘ఇన్నాళ్లూ వరుసగా జరుగుతున్న దాడుల్లో అనేక మంది కామ్రేడ్సును కోల్పోయాం కానీ సీసీ, ఎస్.జెడ్.సి నాయకత్వాన్ని వాడు దెబ్బకొట్టలేక పోయాడు. ఇప్పుడు వాడు ఆ విజయాన్ని కూడా సాధించాడు. గడ్చిరోలి ఉద్యమం నేడు ఎదుర్కొంటున్న పరిస్థితిలో కామ్రేడ్ రూపేష్ అమరత్వం ఆ ఉద్యమానికే కాదు జోన్ ఉద్యమానికీ భరించలేనంత నష్టాన్ని కలుగజేసింది. మిలిటరీ సహా పలు శక్తి సమర్థతలు వున్న, విశ్వసనీయుడైన, ఎన్నో ఆదర్శ గుణాలు కలిగి వున్న యువ నాయకత్వాన్ని కోల్పోవడం చాలా బాధాకరం. ఆ స్థాయి కామ్రేడ్, అందులోనూ స్థానిక కామ్రేడ్ అమరత్వం అక్కడి కేడరుపై, ప్రజలపై తీవ్రమైన ప్రభావం వేస్తుంది. ఎక్కడంటే అక్కడికి వెళ్లి పని చేయగలిగిన సామర్థ్యం వున్న కామ్రేడ్ కూడా కనుక ఎత్తుగడలపరంగా మనం తీసుకొనే నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగలదు. తనతో అమరులైన మిగతా కామ్రేడ్స్ గురించి నాకు తెలియదు కనుక వాళ్ల అమరత్వం ఎంత లోతుగా ప్రభావితం చేయగలదో చెప్పలేను’’.
కగార్ దాడుల మధ్య కామ్రేడ్ రేణుక చివరి వరకూ తన బాధ్యతలను కొనసాగించింది. 16 ఏప్రిల్, 2024 నాడు ఉత్తర బస్తర్లోని ఆపటోల అడవులలో 29 మంది కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగినప్పుడు, ఆమె తన విధుల నిర్వహణలో భాగంగా ఆ పరిసరాలలోనే వుండిరది. ఆ నరమేధం ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఆ అమరులలో అనేక మంది తనకు తెలిసినవారు. అప్పటివరకు తనతో కలిసి వున్న వాళ్లే. వారిలో చాలా మందిని సజీవంగా పట్టుకొని, అమరుల శవాలను వారితోనే పోలీసు వాహనాల వరకు మోయించి అక్కడ ఆ యువ కామ్రేడ్స్‌ను కాల్చివేసిన పోలీసుల పాశవిక స్వభావాన్ని ఆమె తీవ్రంగా ఖండిరచింది. అమరుల వివరాలను బయటి ప్రపంచానికి తెలపడానికి ఆమె చాలా కృషి చేసింది.
ఆ తరువాత జూన్ 14 నాడు కొడ్తమర్క (మాడ్ ఏరియా) దగ్గర దాడి జరిగినప్పుడు కూడా కామ్రేడ్ రేణుకు ఆ పరిసరాలలోనే ఉంది. అంతే కాదు, ఆ దాడిలోంచి ఆమె తృటిలో తప్పుకుంది. జనవరి 2024లో ప్రారంభమైన కగార్ సైనిక దాడులలో ఆ సంవత్సర కాలంలో అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు అమరులైన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించడంలో, బయటికి తెలియజేయడంలో, ఆగస్టు వరకు వారి వివరాలతో కూడిన పుస్తకాన్ని ప్రచురించడంలో కామ్రేడ్ రేణుక, ఒక నాయకత్వ కామ్రేడ్‌గా, పత్రికా సంపాదకురాలిగా దండకారణ్య విప్లవోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కృషి చేసింది.
కగార్ సైనిక దాడుల మధ్య వాళ్ల యూనిట్ ఎదుర్కొన్న సమస్యలను ఒక ఉత్తరంలో ఇలా పేర్కొంది:
‘‘కొందరు సభ్యులకు వరుసగా జ్వరాలు వస్తున్నాయి. అయితే మా దగ్గర క్లోరోక్విన్ గోలీలు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీకు వీలయితే మాకు జనరల్ మెడిసిన్ పంపగలరు. ఇక నేను రెగ్యులర్‌గా వాడాల్సిన మందులైతే మేం ఉత్తర్ బస్తర్లో వుండగానే అయిపోయినయి. అక్కడి కామ్రేడ్సుకు రాసి వచ్చిన. ఇక్కడికి వచ్చాక మరో కామ్రేడ్‌కు కూడా రాసిన. కానీ ఇప్పటి వరకూ ఎటునుండీ మందులు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక మళ్లీ మళ్లీ అడగడం వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోకపోవడమే అవుతుంది కదా?’’
కగార్ సైనిక దాడులు విప్లవకారులనే కాదు, ప్రజల జీవితాలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. మన దేశ పాలకులకు అడవులు కావాలి. వారికి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ప్రపంచంలో మూడో స్థానానికి చేరడం కావాలి. 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడం కావాలి. విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని నిరూపించడం కావాలి.
అందుకు మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాలలోని అడవులలోని అపార ప్రకృతి సంపదలు కావాలి. వారు అనుకుంటున్నవన్నీ సాధించాలంటే, మన దేశంలో మావోయిజం వుండకూడదు. అడవులలో మావోయిస్టులు ఉండకూడదు. అంతకన్నా ప్రమాదకరం అర్బన్ మావోయిస్టులు కాబట్టి వాళ్లూ ఉండకూడదు. వారి దోపిడీ విధానాలను ప్రశ్నించే వారెవరైనా రాజ్యం దృష్టిలో మావోయిస్టులే. కాబట్టి ఎవరినీ ఉండనీయకూడదు. ఇలాంటి రాజ్యం కామ్రేడ్ రేణుకను 2025 మార్చ్ 31 నాడు అత్యంత పాశవికంగా హత్య చేసింది. కానీ, ఆమె ఆశయాలు కొనసాగిస్తామంటూ ఎర్రజెండాల రెపరెపల మధ్య కడవెండిలో ప్రతిధ్వనించిన నినాదాలను అంతమొందించగల్గే శక్తి ఏ కగార్‌కూ లేదు. ఆ నినాదాలు బలమైన భౌతికశక్తిగా మారి తీరుతాయి.
కామ్రేడ్ రేణుక అమరత్వంతో ఈ హత్యాకాండ ఆగిపోలేదు. భారత విప్లవ మహోద్యమంలో కామ్రేడ్ రేణుక అమరత్వం మొదటిదేమీ కాదు. ఆఖరుది కావాలని మనం పరితపించినా అయ్యేదీ కాదు. భారత ప్రజల ప్రజాస్వామిక విప్లవ విజయ సాధనలో రేణుక ఆరిపోని పోరాట జ్వాల. పాలకుల నరమేథాన్ని తాత్కాలికంగానైనా ఆపాలని, కామ్రేడ్ రేణుక అనారోగ్యంతో బాధపడుతూనే, తన కమిటీ తోటి కామ్రేడ్‌తో కలిసి ‘శాంతి’ చర్చల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆమెను హత్య చేశారు. కాంగ్రెస్ హయాంలో స్వామి అగ్నివేశ్ మధ్యవర్తిత్వంలో పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ చెరుకూరి రాజ్ కుమార్‌ను హత్య చేసిన విధంగానే, ఇపుడు కామ్రేడ్ రేణుకను కాషాయ ఉగ్రవాదులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు. పాలకుల శాంతి, అహింసల అసలు నైజాన్ని కామ్రేడ్ రేణుక రక్తతర్పణం మరోసారి వెల్లడి చేసింది. కామ్రేడ్ రేణుకను షెల్టర్ నుండి బయటకు తీసుకెళ్లి, ఇంద్రావతి నది ఒడ్డున కాల్చి చంపారు. ఆమె హత్య దేశ ఫాసిస్టు హిందుత్వ పాలకుల క్రూర స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసింది. కామ్రేడ్ రేణుక తన రచనలలో వ్యక్తం చేసిన అనేక విషయాలు ఎంతటి వాస్తవాలో, దేశానికి హిందుత్వ శక్తుల నుంచి పొంచి ఉన్న ప్రమాదం ఎంత తీవ్రమైందో ఆమె తన అమరత్వం ద్వారా మరోమారు ఎరుక చేస్తున్నది. కామ్రేడ్ రేణుక ఆశయాల సాధనకై, ఆమె ఆదర్శాలతో తుదివరకు పోరాడడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి కాగలదు. విప్లవ ఆశయాలను అంతమొందించే కగార్లు, క్షిపణులు తయారు చేయడం ఎవరి వల్లా కాదు.
కామ్రేడ్ రేణుక అమరత్వం విప్లవోద్యమానికి వెంటనే పూడ్చుకోలేని లోటు మాత్రమే కాదు, విప్లవ పార్టీ తన సుదీర్ఘ ఆచరణలో జరిగిన తీవ్ర తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే కృషిని ప్రారంభించిన కీలక సమయంలో ఈ లోటు పెద్ద వెలితిగానే వుంటుంది. పార్టీ పొలిట్ బ్యూరో రూపొందించిన సర్క్యులర్ల పై తన నిశితమైన అభిప్రాయాన్ని ఆమె ఇలా వెల్లడి చేసింది: ‘‘మొత్తం పరిస్థితి చేయిదాటి పోయిందని అర్థమైన తరువాత మనం చాలా ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఇలాంటి నిర్ణయాలు ముందే తీసుకొని వుంటే ఉపయోగపడేది’’ అంటూనే ఇంకా ఇతర అనేక విషయాలపై తన అభిప్రాయాలను పార్టీ నాయకత్వం ముందుంచింది. నిస్సందేహంగా అవన్నీ స్వీకరించి సరిదిద్దుకోవలసిన విషయాలేనని పార్టీ భావించింది. అయితే, అకుంఠిత దీక్ష, దక్షతలు కలిగిన కామ్రేడ్ రేణుక లేకుండానే వాటిని సరిదిద్దుకోవడం అనే కర్తవ్యం నేడు విప్లవోద్యమం ముందుంది. ఆ కర్తవ్య సాధనలో ముందుకు పోదాం.
కామ్రేడ్ రేణుక రచనలన్నీ ఆచరణ కొలిమిలో రగిలిన నిప్పు కణికలు. ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో కలాన్ని సైతం ఆయుధంగా మలచుకొని వర్గపోరాట మంటలను రాజేస్తూ ప్రజలకు అందించిన విప్లవ సందేశాలు. ఆమె అమరత్వం ఉద్యమ చరిత్రలో సదా నిలిచిపోయే ఉజ్వల అధ్యాయం. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె ఒనగూర్చుకున్న ప్రజ్ఞాపాటవాలు విప్లవోద్యమానికి అనేక విధాలుగా దోహదం చేశాయి. ఆమె విప్లవ స్వాప్నికురాలు మాత్రమే కాదు, ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అంకితమైన సమరయోధ. నూతన సంధ్యారాగం!