జనవరి 2,2006 న నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజెడి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ పోలీసుల కాల్పుల్లో సామూహికంగా హత్య చేయబడ్డ 14 మంది కళింగనగర్ (ఓడిశా) ఆదివాసీ మృత వీరులకు జోహార్లు.
కార్పోరేట్ కంపెనీల కోసం సాగిన బలవంతపు భూసేకరణ,గ్రామాల ధ్వంసం, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా 2005 నుండి కళింగనగర్ ఆదివాసులు వీరోచితంగా పోరాడుతున్న క్రమంలో జనవరి 2, 2006 న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పుల సామూహిక మారణకాండలో 14 మంది ఆదివాసీలు మృతి చెంది నేటికి 20 సంవత్సరాలు.ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసే క్రమంలో వివిధ సందర్భాల్లో మొత్తం 27 మంది అమరులయ్యారు. వారందరికీ కన్నీటి జోహార్లు.
కళింగనగర్ ఆదివాసుల పోరాటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.
మొదటి కారణం. ప్రభుత్వం ఆదివాసులను మోసం చేసి నామమాత్రపు ధరకే భూములు తీసుకుని కార్పోరేట్ కంపెనీలకు భూములమ్ముకునే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా,దళారీగా మారడం. కళింగనగర్ ఆదివాసుల పోరాటంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతమంతా జాజ్ పూర్ జిల్లాలోని సుఖింధ తహశీల్ పరిధిలోనిది.ఈ పోరాటం చేసిన ఆదివాసులు ప్రత్యేక చరిత్ర, సమిష్టి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు గల ముండారీ (హొ)లు.రాష్ట అభివృద్ధి పేరుతో సామ్రాజ్యవాద కార్పోరేట్ కంపెనీల కోసమే “కళింగనగర్ ఇండస్ట్రీయల్ కాంప్లెక్సు” ను 1990 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ఆధ్వర్యంలో నెలకొల్పారు.ఇందులో సుఖింధ తహశీల్ లోని దానగది,గోబర్ గట్టి అనే రెండు పంచాయతీలోని 16 గ్రామాల పరిధిలోని 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 30,000 ఎకరాలలో ఈ లూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కాంప్లెక్స్ వల్ల ప్రత్యక్షంగా పది వేల మంది, పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు,అడవి,పక్కనే ప్రవహిస్తున్న బ్రాహ్మణీ నది, పర్యావరణం ప్రభావితం కానుంది.సామ్రజ్యవాద ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పధకాలతో పాటే ఈ మినరల్ హబ్ ఉనికిలోకి వచ్చింది.ఇక్కడి అపారమైన సంపదలు దోచుకెళ్ళమని దేశ విదేశాల నుండి ప్రైవేటు కంపెనీల స్థాపనకు ఈ దళారీ ప్రభుత్వం ఆహ్వానించింది.ఈ ఇండస్ట్రీయల్ ప్రాంత భూమిలో కేవలం 13000 ఎకరాల భూమి మాత్రమే పట్టా భూమి.మిగతా భూములన్నీ ప్రభుత్వ భూములని ప్రకటించి అడ్డికి పావుశేరు లెక్క ధరలు ప్రకటించి బలవంతంగా సేకరించడానికి పూనుకున్నారు.ఈ తతంగం నడపడానికి ఇడ్కో అనే సంస్థను ఏర్పాటు చేశారు.దీని ద్వారా భూములు సేకరించి ప్రైవేటు కంపెనీలకు అమ్ముకునే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది ప్రభుత్వం.ప్రైవేట్ కంపెనీలకు భూములివ్వడం కోసం ప్రభుత్వం ఆదివాసీల దగ్గర నుండి తాను ఏర్పాటు చేసిన ఇడ్కో ద్వారా నామ మాత్రపు రేటుపై 1994 లో బలవంతంగా సంతకాలు చేయించుకున్నది.బిజూ పట్నాయక్ కాలంలో కళింగనగర్ ఇండస్ట్రీయల్ ప్రణాళికను ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతామని ప్రకటించిన ప్రభుత్వం ఆయన కొడుకు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రైవేటు రంగంగా మార్చి వేశారు.ఇందులో భాగంగా సంవత్సరానికి 4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటును నిర్మించడానికి 2400 ఎకరాల భూమిని సేకరించి టాటా కంపెనీకి ఇవ్వడానికి పూనుకున్నది ప్రభుత్వం.దీంతో పాటు జిందాల్,మెస్కో,సీమ్ లెస్ కంపెనీలకై ప్రభుత్వం సేకరించ పూనుకున్న బలవంతపు భూమి స్వాధీనానికి వ్యతిరేకంగా సాగిన 16 గ్రామాల పోరాటమే కళింగనగర్ ఆదివాసుల వీరోచిత పోరాటం.ఆదివాసుల అనుమతి లేకుండా చంపకోయిల గ్రామం వద్ద టాటా కంపెనీ 15,400 కోట్ల అంచనాతో రెండు దశల్లో కంపెనీ నిర్మాణం చేయడానికి పూనుకుంటే అడ్డుకున్నందుకే అత్యంత క్రూరంగా ప్రత్యేక పోలీసు బలగాలతో కాల్పులు జరిపించి 14 మంది ఆదివాసీలను బలిగొన్నది ప్రభుత్వం.ప్రభుత్వం నామ మాత్రపు నష్ట పరిహారం చెల్లింపులు కేవలం పట్టా కాగితాలున్న ధనిక,మధ్య తరగతి రైతాంగం వారికే చెల్లించి తక్కువ భూమి కలవారు, అసలు భూమేలేని నిరుపేదలు నిరాశ్రయులుగా మారుతుండటం ఈ ఆదివాసీ పోరాటానికి తక్షణ ప్రధాన కారణం.
రెండవ కారణం.రూర్కేలా ప్లాంటు కోసం 25 లక్షల ఎకరాలు, మంజీరా డ్యాం కోసం 12 లక్షలు,మాచ్ కుండ్,హీరాకుండ్,రెంగాలీ డ్యాంల కోసం వేలాది ఎకరాల ఆదివాసీల భూమి గుంజుకున్నది ప్రభుత్వం.మొత్తంగా రాష్ట్రంలోని 13 పెద్ద డ్యామ్ లలో 7 డ్యాంల క్రింద మరియు 10 పెద్ద ప్యాక్టరీలలో 7 ప్యాక్టరీల క్రింద నిర్వాసితులైన వారి లెక్కలు మాయమైనాయి.1970 లో మల్కాన్ గిరి జిల్లాలోని చిత్రకొండ ఏరియా పరిధిలో 250 గ్రామాలను నీటముంచి బలిమెల డ్యాం నిర్మాణం చేశారు.ఈ గ్రామాల ప్రజలు నేటికీ బయటి ప్రాంతాలతో సంబంధం లేకుండా నీళ్ళ మధ్యలోని పర్వతాలపై నివసిస్తున్నారు.వీరిలో ఎవరికీ నష్టపరిహారం దక్కకపోగా నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నరు.ఇప్పటికి పైపైన లభించిన గణాంకాల ప్రకారం 1951 నుండి 1995 వరకు రాష్ట్రంలో 20 లక్షల మంది నిర్వాసితులు అవ్వగా అందులో 40 శాతం ఆదివాసీలు,20 శాతం దళితులు,20 శాతం బిసీలని లెక్కలు తెలుపుతున్నాయి.
మూడవ కారణం. దేశ వ్యాప్తంగా 50 సంవత్సరాల కాలంలో నిర్వాసితులు ఐన కోటి మంది ప్రజానీకంలో 60 శాతం ఆదివాసీలే, ఇందులో సగభాగం ఓడిశా ప్రజలే.కళింగనగర్ ప్రాంతంలో గతంలో నిర్మాణమైన పరిశ్రమల్లో లభించిన ఉద్యోగాలు నామ మాత్రం.నిలాంచల్ ఇస్ఫాత్ లోని 634 ఉద్యోగాలలో దొరికిన 182 కాంట్రాక్టు ఉద్యోగాలే.ఈ విధంగా వీసా స్టీల్ లో 23, జిందాల్ స్టీల్ లో 59,మెస్కోలో 53, రోహిత్ లో 12, కామన్ కారిడార్ లో 28 ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు దక్కాయి.ఈ వివరాలను బట్టి ప్రభుత్వం,కంపెనీలు కల్పిస్తామన్న ఉద్యోగాలు పచ్చి అబద్ధం అని తేలిపోయింది.తమ వారు లక్షలాదిగా భూములు పోగొట్టుకుని నిరుపేదలుగా మారి బతుకుదెరువు కోసం వలసపోతుండడం చూసి ఆదివాసీలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు.నిర్వాసితుల డిమాండ్లు పట్టించుకోకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుండడం వాళ్ళు మేల్కొనేలా చేసింది.1992 నుండి బలవంతంగా అమలవుతున్న విధానాల అనుభవంతో 2000 సంవత్సరం అనంతరం ఏ పేరుతోనైనా భూములివ్వడానికి ప్రజలు నిరాకరించారు. 2004 సంవత్సరంలో కంపెనీ సర్కార్ బంశీపూర్ గ్రామ ప్రజలపై గుండాలను పంపి తరిమి వేశారు.పోరాడే చేవ,ధైర్యం ఉన్నా సంఘటితం చేసి నడిపించే రాజకీయ నాయకత్వం లేకపోవడం వల్ల క్రూరమైన దాడికి బలైపోయారు.కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో గెరిల్లా జోన్ నిర్మిస్తున్న విప్లవకారుల నాయకత్వం అందుబాటులోకి రావడంతో తమ పోరాట మార్గాన్ని మరింత పదునెక్కించుకున్నారు. బిస్తాపన్ విరోధి జనమంచ్ అనే పోరాట సంస్థను ఏర్పాటు చేసుకుని పోరాడారు.
ఈ క్రమంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఊదరగొట్టిన ప్రజావ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక విధ్వంసకర ఆర్థిక- పారిశ్రామిక విధానాన్ని సవాల్ చేసిన ఆదివాసీల పొరాటాన్ని అంతం చేయడానికి 300 మంది ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. జనవరి 2 న చంపకొయిలా గ్రామం వద్ద టాటా కంపెనీ నిర్మాణం కోసం జరుపాలనుకున్న ప్రహారీ గోడ ఇతర ఆఫీసుల ప్రారంభ నిర్మాణ కార్యక్రమాలు అన్నీ గతంలో ప్రజాప్రతిఘటనతో విఫలమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ పూజా కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించతలపెట్టారు. జనవరి 2 ఉదయమే ఈ విషయం ప్రజలకు తెలియడంతో అప్పటికప్పుడే శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి 2000 మంది ప్రజలు వెళ్ళారు. భూమి పూజ నిర్వహించ తలపెట్టిన స్థలానికి ముందస్తు పధకంలో భాగంగా ఎస్ పి, కలెక్టర్, డిఎస్పీ, ఎడిఎమ్, ఇతర ప్రభుత్వ అధికారులు హంతక కంపెనీ ముఠాతో పచ్చని పంట పొలాలను దిగ్బంధించారు. మందుపాతరలు అమర్చి, ఆధునిక ఆయుధాలతో విదేశీ సైన్యం పై దాడి చేయడానికి సిద్ధంగానున్న సైన్యం వలె మొహరించి ఆదివాసీలను హత్య చేయడానికి సన్నాహాలు చేశారు. ప్రభుత్వ కుట్రలేవీ తెలియక గుంపులు గుంపులుగా వచ్చి నినాదాలిస్తూ నిరసన తెలియజేస్తున్న ఆదివాసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.రబ్బర్ బుల్లెట్లు కాల్చారు.గ్రేనేడ్ లు విసిరారు. మందుపాతరలు పేల్చారు.ఏకె 47,ఇన్సాస్,303 మొదలగు ఆధునిక ఆయుధాలతో ఆదివాసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రూరమైన దాడిలో ఆరుగురు ఆదివాసీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు హాస్పిటల్ కు తీసుకువెళ్ళే మార్గమధ్యంలో చనిపోయారు. ఒకరు ఒక సంవత్సరం తరువాత, మరొకరు రెండు సంవత్సరాల తరువాత చికిత్స పొందుతూ మరణించారు. 37 మంది ఆదివాసీలకు బుల్లెట్ గాయాలయ్యాయి. మరో అరవై మంది మందుపాతరలు, గ్రేనేడ్ పేళుళ్ళ వల్ల తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురు ఆదివాసీలను చనిపోయే వరకూ తీవ్రంగా హింసించి మణికట్టు వరకు చేతులు నరుక్కుపోయారు. రహస్యాంగాలను కోసి హింసించారు. మణికట్టు వరకు చేతులు ఎందుకు నరికారని అడిగిన ఆదివాసీ, పౌర, ప్రజాస్వామిక సంఘాలకు పోలీసు అధికారులు, కలెక్టర్ విచిత్రమైన జవాబు ఇచ్చారు. వారు గుర్తు తెలియని వారు కావున వారి ఫింగర్ ప్రింట్లను భధ్రపర్చే ప్రభుత్వ విధానంలో భాగమే ఆ విధంగా నరికివేశామని చెప్పారు. ఓడిశా కంపెనీ సర్కార్ తమ కిరాయి పోలీసు మూకల ద్వారా తన ప్రజలనే చంపించి శత్రు దేశాలతో యుద్ధం సందర్భంగా వ్యవహరించాల్సిన (జెనీవా ఒప్పందం ప్రకారం) కనీస నియమాలను, విలువలను పాటించలేదు. ఈ హత్యాకాండలో ప్రజలను చంపడానికి ప్రభుత్వం అనుసరించిన కిరాతక పద్ధతులు, పాలకవర్గపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు బూటకత్పాన్ని దాని వర్గ నియంతృత్వ స్వభావాన్ని బట్టబయలు చేసింది. ప్రజలు తమ స్వయం రక్షణ కోసం, మనుగడ కోసం దోపిడీ పాలకవర్గాలు అమలు జరుపుతున్న నియంతృత్వాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరాన్ని ఈ హత్యాకాండ మరోసారి రుజువు చేసింది. నవీన్ సర్కార్ ఈ హత్యాకాండ పై స్పందిస్తూ నిర్లజ్జగా స్వయం రక్షణలో భాగంగానే ప్రజలను చంపాల్సి వచ్చిందని తన ప్రభుత్వపు కిరాతక స్వభావాన్ని సమర్ధించుకున్నాడు.అసలు వాస్తవమేమిటంటే ఆదివాసీలు తమ స్వయం రక్షణ కోసమే తమ అనుమతి లేకుండా తమ భూములు ఊళ్ళపై విరుచుకుపడి హత్యాకాండకు పాల్పడుతున్న కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాలను నెరవేరుస్తున్న ప్రభుత్వ బలగాలను ప్రతిఘటించారు. ఈ హత్యాకాండలో వాడిన మందుపాతరలు, గ్రేనేడ్లు, వైర్లు, వందలాది బుల్లెట్ల ఖాళీ బుర్రలు, లాలా రబ్బర్ బుల్లెట్ లను సేకరించి ప్రజల ముందు, మీడియా ముందు పెట్టి ప్రభుత్వ పాశవికత్వాన్ని నిలదీసి బట్టబయలు చేశారు.
పోలీసు కాల్పుల అనంతరం వీరోచిత ఆదివాసీలు మృతి చెందిన ఆరుగురి మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ డోలోపత్తర్ గ్రామ చౌక్ వద్ద మృత దేహాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకోను ప్రారంభించారు. ప్రతిరోజూ 2000 ట్రక్కుల ఐరన్, క్రోమైట్ ను దోచుకుపోతున్న పరదీఫ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డును దిగ్బంధించారు. చనిపోయిన శవాల సాక్షిగా ” మా భూములు వదలం – మా ఊర్లను విడువమంటూ” దిక్కార స్వరంతో నినదిస్తూ ప్రభుత్వం ముందు ఏడు డిమాండ్లను పెట్టారు. ఈ రోడ్డు దిగ్భంధనం కాలక్రమంలో ఆర్ధిక దిగ్భంధనంగా మారి దేశంలో ఎన్నడూ లేని విధంగా 14 నెలలు కొనసాగింది. ఈ దిగ్బంధనం కొనసాగినంత కాలం దేశంలోని ప్రతి పార్టీ, ప్రజా సంఘం, ప్రజాస్వామికవాదితో పాటు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి ఆదివాసీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.ఆ ప్రాంతాన్ని జనజాతరలా మార్చి వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది.లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆందోళన చేశారు.మేం శాంతియుత పారిశ్రామికీకరణకు కట్టుబడి ఉన్నామన్న నవీన్ సర్కార్ నయవంచనను,హింసాకాండను ఖండిస్తూ ” నో మోర్ మైన్స్,నో మోర్ బ్లడ్ ” అనే సందేశాన్ని దేశమంతా వినిపించేలా చేశారు.వారిలో ఆనాటి యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తదితర కాంగ్రెస్ నాయక గణమంతా ఉన్నారు. ఆ సందర్భంగా అశేష ప్రజానీకం ముందు వారిచ్చిన వాగ్ధానమే ఆ తరువాత 2013 నూతన భూసేకరణ చట్టంగా రూపుదిద్దుకుంది.ఈ పోరాటం తరపున ప్రకృతి, మానవ విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పోల్యూషన్ బోర్డు ముందు పెట్టిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సామాజిక పరిశోధనా సంస్థలు, రాజకీయ పార్టీలన్నీ ఆమోదించాయి.
కళింగనగర్ ఆదివాసుల విజృంభణ స్వభావం రీత్యా రాజకీయ ప్రతిఘటనే గాక మిలిటెంట్ ప్రజాప్రతిఘటన కావడంతో ఆనాటి విస్థాపన వ్యతిరేక పోరాటాలన్నింటికీ ఒక కాంతి రేఖగా, దిక్సూచిగా మారింది. ఒడిశాలోని చిలికా సరస్సు ప్రాంత ప్రజల ఆందోళన, పోస్కో వ్యతిరేక పోరాటం, డెంకనాల్, జాజ్ పూర్, కెమ్ జోర్, రాయగడ, కాశీపూర్, నియమగిరి ప్రాంతంలో వేదాంత్ వ్యతిరేక పోరాటం, సింగూర్, నందిగ్రామ్ పోరాటాలన్నీ కళింగనగర్ పోరాటం వైపు చూశాయి.ఆ పోరాటాలకు ప్రేరణ నిచ్చింది.అవి ఈ పోరాటంతో ఉత్తేజాన్ని పొందటమే గాక అండగా నిలబడ్డాయి. అభయారణ్యం, సెజ్ ల వ్యతిరేక పోరాటాలన్నింటికీ, ఖనిజ సంపదను వెలికి తీసి ఎగుమతి చేసుకుంటూ అడవుల నుండి ఆదివాసులను తరిమికొడుతున్న ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలన్నింటికీ కళింగనగర్ పోరాటం కేంద్ర బిందువైంది. ఈ పోరాటం ఫలితంగా పునరావాసం మరియు పునర్నిర్మాణ (ఆర్ ఆర్ ఫాలసీ) అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చలు, ఉద్యమాలు తీవ్రమయ్యాయి. 1894 బ్రిటిష్ వలసవాదుల కాలం నాటి ప్రజావ్యతిరేక, ఆదివాసీ వ్యతిరేక భూసేకరణ చట్టాన్ని సమీక్షించాలనే ఎజెండా భారత సమాజం ముందు బలంగా వచ్చింది. ఆదివాసీ గ్రామ సభల అనుమతి లేకుండా వేదాంత కంపేనీ చేపట్టిన బాక్సైట్ గనుల తవ్వకం అక్రమమని సుఫ్రీం కోర్టు తేల్చి చెప్పింది.విస్థాపన సమస్యలను బలంగా ముందుకు తెచ్చిన కళింగనగర్ పోరాటానికి దేశ విదేశాల్లో మద్ధతు లభించింది.సౌత్ ఆసియా అనే పత్రిక ఎడిటోరియల్ భారత పాలకులు టాటాలతో కుమ్మక్కయి బ్రిటిష్ డయ్యర్ కంటే కూడా సిగ్గుమాలిన విధంగా వ్యవహరించారు అని వ్యాఖ్యానించింది.ఆదివాసుల ఈ ప్రతిఘటన శతాబ్దాల తరబడి వారికి జరిగిన అన్యాయానికి ప్రతిరూపమని మరెంతో మంది బుద్ధిజీవులు పేర్కొన్నారు.ఈ పోరాటం తరువాతనే ఆర్ అండ్ ఆర్ పధకం ద్వారా నిర్వాసితుల కుటుంబాలకు గతం కంటే కూడా మెరుగైన పునరావాసాన్ని కల్పించవల ఉంటుందని చాటడం వెనుక కళింగనగర్ పోరాటం అంతర్లీనంగా నిబిడీకృతమై ఉందని అనేక మంది సామాజిక కార్యకర్తలు స్పష్టం చేశారు.గొప్ప త్యాగాలు చేసి ప్రభుత్వం మెడలు వంచిన ఈ ఆదివాసుల ప్రజాస్వామిక పోరాటం భారత నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా బ్రద్ధలైందనేది గమనార్హం.
-ఆనంద్
తేదీ. 2-1-2026.




