ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలలో ఉన్న, తరచుగా తిజిమాలిగా పిలిచే సిజిమాలి అనే ప్రశాంతమైన గ్రామంలో, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రతిఘటనా ఉద్యమం జరుగుతోంది. సిజిమాలి అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక కొండ శ్రేణి. బాక్సైట్ నిల్వలు, స్థానిక సముదాయాల పవిత్రస్థల ప్రాముఖ్యత, జీవవైవిధ్యాల కోసం ప్రసిద్ధి చెందింది. 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వ ఉన్నదని అంచనా వేసిన 1,549.022 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌కు 2023లో మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (అభిప్రాయ పత్రం) ను తీసుకున్నది.
అయితే, సెప్టెంబర్ నెల ప్రారంభంలో, సిజిమాలి బాక్సైట్ గనుల కార్యకలాపాల కోసం 708.2 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు వేదాంత లిమిటెడ్ చేసిన ప్రతిపాదనపైన పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఆ తరువాత, ప్రాజెక్ట్ స్థాయిలో పునరావాసాన్ని, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాయగడ కలెక్టర్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ఈ ప్యానెల్ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించి, అమలైన తరువాత సామాజిక ఆడిట్‌లను నిర్వహిస్తుంది.
ప్రస్తుతం, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులు, దళితుల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిఘటనా ఉద్యమానికి సిజిమాలి కేంద్రంగా ఉంది. ఈ ప్రతిఘటన ఎందుకు జరుగుతోంది, ప్రజలను బెదిరించడానికి, వేధించడానికి కంపెనీ, ప్రభుత్వమూ కుమ్మక్కై ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి మక్తూబ్ వెబ్ సైట్ సిబ్బంది సిజిమాలికి పయనమైంది.
సిజిమాలి, దాని చుట్టుపక్కల గ్రామాలు వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలోనే వేధింపులకు కారణం ఉన్నది. కంపెనీ అధికారులు రహస్యంగా కొండలలోకి ప్రవేశించి ప్రాజెక్ట్ సన్నాహాలను ప్రారంభించకుండా నిరోధించడానికి గ్రామస్తులు కొండ పైభాగంలో 2023 నుంచే ఒక టెంట్‌ను వేసారు.
ఈ మైనింగ్ ప్రాజెక్టుకు నిరసన తెలిపినందుకు గాను, సిజిమాలిలోనే ఒక ఒంటరి మహిళను ఒడిశా పోలీసులు అరెస్టు చేసి, జైలులో పెట్టారు.
ఈ నిరసనల సమయంలోనే అనేక సంఘటనలు జరిగాయి, ఇవి మానవ హక్కుల కార్యకర్తలు, గ్రామస్తులలో ఆందోళనలను పెంచాయి. ఈ తప్పుడు నిర్బంధాన్ని స్థానికులు, అనేక మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు ప్రశ్నించినా, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
భూమిని కాపాడుకోవడానికి ప్రతిఘటన:
50 ఏళ్ల, బలహీనంగా ఉండే నారింగ్ దేయ్ సిజిమాలి నిరసనలలో చురుకైన నాయకురాలు. ఆగస్టు ప్రారంభంలో ఆమెను అరెస్ట్ చేసారు. ఆమె కువి భాష మాట్లాడే ఆదివాసీ; దళితులతో కూడిన మైనింగ్ వ్యతిరేక సాముదాయిక సంస్థ అయిన మాటి మాలి సురక్షా మంచ్ సభ్యురాలు కూడా. దేయ్ సహా సిజిమాలి గ్రామస్తులు ధర్నాను కొనసాగించారు. సాగబారి గ్రామానికి చెందిన దేయ్‌ను “చట్టవిరుద్ధంగా, దౌర్జన్యంగా” అరెస్టు చేశారని కార్యకర్తలు వివరిస్తున్నారు.
ఆగస్టు 1వ తేదీ రాత్రి, కోడలు ప్రసూతి కోసం దేయ్ రాయగడలోని ప్రభుత్వ ఆసుపత్రికి హడావిడిగా వెళ్లాల్సి వచ్చింది. దేయ్‌తో పాటు ఆమె బంధువులు కూడా ఉన్నారు. ఆసుపత్రి గ్రామం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దేయ్ అరెస్టు అయినప్పుడు ఆమెతో పాటు ఉన్న రుక్డై మాఝీ (55), ‘మక్తూబ్‌తో మాట్లాడుతూ, నీలం రంగులేసిన చిన్నదైన దేయ్ ఇంట్లో (దేయ్ దూరంగా జైలులో ఉండటం వల్ల మౌనం వహించిన ఒక నిరాడంబరమైన గుడిసె) కూర్చున్నారు.
ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున దేయ్ కోడలు కుష్మిత మాఝీ ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. “ఆమె బిడ్డను చూడటానికి గదిలోకి వెళ్లింది, కొద్ది నిమిషాలు మాత్రమే అక్కడ ఉంది. ఇంతలో కొంతమంది డాక్టర్లు మందుల కోసం ఆమెను బయటకు పిలిచారు.
దేయ్ బయటకు వెళ్లగానే, తెల్లటి కోట్లు ధరించిన కొంతమంది వ్యక్తులు ఆమెను ఒక మూలకు పిలిచారు. “దేయ్ వారిని కలవడానికి వెళ్ళినప్పుడు, వారు ఆమెను పట్టుకుని, ఎటువంటి వివరణ ఇవ్వకుండా బయటకు లాక్కెళ్ళడం మొదలుపెట్టారు. అయితే, వారు ఆమెను బయటకు రప్పించడానికి డాక్టర్లుగా మారువేషంలో వచ్చిన పోలీసులు అని ఆమె అర్థం చేసుకుందని నేను అనుకుంటున్నాను,” అని మాఝీ తెలిపారు.
దేయ్ తిరిగి రాకపోవడంతో, బయటకు వెళ్లిన మాఝీ పోలీసులు ఆమెను చుట్టుముట్టడాన్ని చూసి భయంతో ఆమె వైపు పరిగెత్తింది. “ఆమె ప్రశాంతంగా నాకు డబ్బు, మందుల చీటీలను ఇచ్చింది. పోలీసులు ఆమెను తీసుకువెళ్లడం నేను చూశాను, నేను దిగ్భ్రాంతురాలినై, నిస్సహాయంగా అక్కడే నిలబడిపోయాను” అని మాఝీ వివరించింది.
దేయ్ ఒక అంతర్భాగంగా ఉన్న సిజిమాలి గ్రామస్తులు తమ ధర్నాను కొనసాగించారు. సాగబారి గ్రామానికి చెందిన దేయ్‌ను “చట్టవిరుద్ధంగా, బలవంతంగా” అరెస్టు చేశారని కార్యకర్తలు వివరిస్తున్నారు.
కుట్ర- అరెస్ట్:
ఆసుపత్రిలోని ఒక ఆశా కార్యకర్త దేయ్ అరెస్టును ప్లాన్ చేసి అమలు చేయడానికి పోలీసులతో సహకరించారని స్థానికుల ద్వారా మాఝీకి తెలిసింది. గ్రామస్తులను మరింత భయభ్రాంతులకు గురిచేయడానికి ఉద్దేశించిన వేధింపులు, అవమానపరిచే వ్యూహంగా కార్యకర్తలు దీనిని అభివర్ణిస్తున్నారు.
ప్రాంతీయ స్త్రీవాద నెట్‌వర్క్ అయిన ఆసియా పసిఫిక్ ఫోరం ఆన్ ఉమెన్, లా అండ్ డెవలప్‌మెంట్ (ఎపిడబ్ల్యూఎల్‌డి) లో భాగమైన రైట్స్ ఫోరమ్‌కు చెందిన శరణ్య నాయక్ “గ్రామస్తులు ఆత్మనిర్భరత కలిగిన ప్రజలు. అయినప్పటికీ, పోలీసులు ఒక పెద్ద క్రిమినల్‌ను అరెస్టు చేస్తున్నట్లుగా ఇంత విస్తృతమైన ప్లాన్‌ను రూపొందించారు. ప్రజలను అవమానపరచడానికి, ముఖ్యంగా ఒక మహిళను అరెస్టు చేసేటప్పుడు ఎంత శ్రద్ధ వహించాల్సి ఉంటుందో తెలిసి కూడా ఇలా అవమానించడం వారి పద్ధతి” అని అన్నారు.
పోలీసులు డాక్టర్లుగా మారువేషంలో ఎందుకు రావాల్సి వచ్చిందనే దాని గురించి కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఆమె అరెస్టు ఆమె గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రకంపనలను సృష్టించింది. ఆ గ్రామంలో మహిళను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. “వారు తమ హక్కుల కోసం పోరాడుతున్న నిరాడంబరమైన వ్యక్తులు. వారు జైలును ఎప్పుడూ చూడలేదు, ఊహించుకోనూ లేదు. అందువల్లనే నారింగ్ దేయ్ జైలులో అనారోగ్యపాలవు తున్నారు. కార్యకర్తలు, ఒక ఆశయం కోసం ప్రతిఘటించే ప్రజలను జైలులో పెడతారని ఆమెకు తెలిసినా, జైలులో ఉండడం అనే భావన అవమానకరంగానూ, భరించలేనిదిగానూ ఉన్నది” అని నాయక్ అన్నారు.
దేయ్‌తో పాటు మరో ఇద్దరు పురుష సభ్యులను అల్లర్లు, చట్టవిరుద్ధంగా సమావేశమవడం, హత్యాయత్నం లాంటి అనేక ఇతర నేరాల కింద అభియోగాలు మోపి అరెస్టు చేసారు.
అయితే, దేయ్ నిర్భయంగా మాట్లాడే వ్యక్తి, గత సంవత్సరం భారత్ జోడో యాత్ర సమయంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలవడం వల్లే ఆమెను ముఖ్యంగా లక్ష్యంగా చేసుకున్నారని గ్రామస్తులు చెప్పారు.
కుట్ర- అరెస్ట్ కొనసాగింపు:
“గత సంవత్సరం యాత్ర సందర్భంగా ఆమె రాహుల్ గాంధీని కలిసి, మా భూమిలో మైనింగ్ ప్రారంభించే ప్రణాళికపైన ఒక ఉద్వేగభరితమైన ప్రకటన కూడా చేశారు. ఆమె ప్రసంగమూ, రాహుల్‌తో ఆమె సమావేశమవడమూ దాదాపు అన్ని స్థానిక మీడియా ఛానెళ్లలో ప్రసారమయ్యాయి, ఇది ఆమెను నిఘానేత్రంలోకి నెట్టింది” అని దేయ్ బంధువైన సుంభరి మాఝీ చెప్పారు.
పవిత్రమైన కొండలు- కార్పొరేట్ దండయాత్ర:
2023 నుండి సిజిమాలిలో మైనింగ్ వ్యతిరేక ఉద్యమం పెరుగుతున్నది. ఈ కొండలు కువి ఆదివాసీలు, స్థానికంగా డోమ్‌లుగా పిలువబడే దళితులకు నిలయం. ఈ ప్రాంతం రాజ్యాంగం, ఆదివాసీ ప్రాంతాలలో స్వీయ-పాలనను పరిరక్షించి, ప్రోత్సహించే పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ పెసా) చట్టం కింద ఉన్న రక్షితప్రాంతం.
ఫిబ్రవరి 2023 ఫిబ్రవరిలో, రాయగడ, కలహండిలోని సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌కు వేదాంత కంపెనీని ప్రాధాన్యంగల బిడ్డర్‌గా ప్రకటించారు. బాక్సైట్ మైనింగ్ చేయాలని యోచిస్తున్న ఈ సిజిమాలి కొండలను చుట్టుపక్కల నివసించే స్థానిక సముదాయాలు పవిత్రమైనవిగా భావిస్తాయి. ప్రతిపాదిత మైనింగ్ భూమిలో వారు తమ జీవనోపాధి కోసం ఆధారపడే అటవీ ప్రాంతంలోని ముఖ్యమైన భాగం ఉంది.
తమ భూమి తమకు ఎంత ముఖ్యమైనదీ, ఈ ప్రాజెక్టులు తమ భూమికే కాకుండా పర్యావరణానికి కూడా ఎలా ముప్పు కలిగిస్తున్నాయో గ్రామస్తులు వివరించారు. మామిడి నుండి జీడిపప్పు వరకు, గ్రామాల్లో వారికి అవసరమైన ప్రతిదాన్ని పండిస్తారు; అందులో కొంత అమ్మకానికి, ఎక్కువ భాగం వారి జీవనం కోసం ఉపయోగపడుతుంది.
వైచిత్రమేమిటంటే, ఈ ప్రాంతం సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ, రాయగడ, కలహండి భారతదేశంలోనే అత్యంత పేద జిల్లాలలో ఒకటిగా మిగిలిపోయాయి.
వరుస అరెస్టులు :
భూమి కోసం జరుగుతున్న పోరాటం మధ్యలో దేయ్ అరెస్ట్ జరిగింది. అరెస్టు అయిన మహిళ ఆమె ఒక్కరే అయినప్పటికీ, చుట్టుపక్కల గ్రామాల నుండి పలువురు పురుషులు జైలు పాలయ్యారు లేదా తప్పుడు క్రిమినల్ కేసులలో ఇరుక్కున్నారు; దీంతో ప్రజలుఎక్కడికన్నా వెళ్లాలన్నా కూడా భయపడుతున్నారు.
వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం వల్ల, దేయ్ భర్త సాము మాఝీ, ఆమె అరెస్ట్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా కలువలేకపోయారు.
“మేము మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం, కానీ ఈ కేసులు మమ్మల్ని బెదిరించడానికి ఉద్దేశించినవి. అయినా, మేము పోరాడటం ఆపలేము. నాపైనా, నా కొడుకుపైనా కేసులు పెట్టారు, కాబట్టి మేము ఆమెను కలవలేము. కానీ ఈ పోరాటం మా భూమి, మా చెట్లు, మా కొండలు, మా జీవితాల కోసం అని మాకు తెలుసు” దృఢనిర్ణయంతో అన్నాడు.
అనేకమంది గ్రామస్తులను అరెస్టు చేసారు; జైలు నుండి బయటకు, లోపలకు తిరుగుతూనే ఉన్నారు. రాయగడ పోలీస్ స్టేషన్‌లో దేయ్‌ను కలిసినప్పుడు, ప్రతిఘటనలో పాల్గోన్న సహ కార్యకర్తలను చూసిన ఆమె మానసిక ఒత్తిడితో, కన్నీళ్లతో కనిపించింది. తాను ఎప్పుడు బయటకు రాగలుగుతానని గుసగుసగా అడిగింది.
తాము చేయగలిగినదంతా చేస్తున్నామని కార్యకర్తలు ఆమెకు హామీ ఇచ్చారు, కానీ ఇటీవల బెయిల్ తిరస్కరణ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
బెయిల్ ఆర్డర్‌లో, ” గౌరవనీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరో నాలుగు క్రిమినల్ పూర్వాపరాలు ఉన్నాయనే కారణంతో బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు,” అని, దేయ్‌పై ఉన్న కేసులు తీవ్రమైనవని, అందుకే ఆమె బెయిల్ తిరస్కరిస్తున్నామని ఆ ఆర్డర్‌లో రాసారు.
“గ్రామస్తులపై నకిలీ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఆదివాసులు వేట కోసమూ, సాంప్రదాయకంగానూ గొడ్డళ్లను, విల్లులు తీసుకువెళ్లడం అందరికీ తెలిసిన విషయమే. గ్రామస్తులు తమపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ కంపెనీ సభ్యులు, పోలీసులు దీనిని వారికి వ్యతిరేకంగా వాడుతున్నారు. ఇందులో ఏదీ నిజం కాదు, కానీ వాటిని సాకుగా చూపించి ఈ విధంగా క్రిమినల్ కేసులను పెడతారు,” అని దేయ్ లాయర్ మంగళ్ మూర్తి బేరియా అన్నారు.
గ్రామస్తులు, ముఖ్యంగా గట్టిగా మాట్లాడేవారు, జైలులోనే ఉండిపోయేలా చూడడానికి కంపెనీ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. “ప్రతి వ్యక్తిపై 15 నుండి 17 కేసులు ఉన్నాయి, దీని వల్ల బెయిల్ పొందడం కష్టమైపోతోంది” అని అన్నారు.
నకిలీ గ్రామ సభలు- నిరసన ప్రారంభం:
గిరిజన వర్గానికి చెందిన మరియు ఈ ఉద్యమంలో భాగమైన స్వతంత్ర పాత్రికేయుడు బేల రామ్, 2023లో వేదాంత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను గ్రామస్తులను వేధించడం, దాడి చేయడం వంటి “నీచమైన పని” కోసం ఉప-కంట్రాక్ట్ ఇచ్చిందని ఆరోపించారు.
“2023లో, వారు బెదిరింపుల ద్వారా గ్రామస్తుల సంతకాలను బలవంతంగా తీసుకోవడం ప్రారంభించారు. తరువాత, ఒక గ్రామ సభ జరిగిందని, ప్రాజెక్టుకు అందరూ సమ్మతి ఇచ్చారని పేర్కొంటూ ఒక నివేదిక దొరికింది. అప్పుడే అది నకిలీసభ అనే విషయాన్ని మేము తెలుసుకున్నాము” అని ఆయన చెప్పారు.
అరెస్టులు ప్రతిఘటన:
రాయగడ జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో గ్రామస్తులపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసారు. ఈ నివేదికలు గుర్తు తెలియని వందలాది మందిపై అల్లర్లు, హత్యాయత్నం, ఇతర కల్పిత ఆరోపణలను మోపాయి. ఆ నెల చివరి నాటికి, పోలీసులు ఆరు వేర్వేరు గ్రామాల నుండి 24 మంది ఆదివాసులను అరెస్టు చేశారు.
“మమ్మల్ని మేము కాపాడుకోవడానికి చాలా మంది అడవిలోకి లోతట్టు ప్రాంతానికి వెళ్లి దాక్కున్నాము. రోజుల తరబడి అక్కడే ఉన్నాము, మా కుటుంబాలు మాకు ఆహారాన్ని, ఇతర అవసరమైన వస్తువులను తెచ్చి ఇచ్చారు. అడవి మా ఇల్లు కాబట్టి, మేము సురక్షితంగా ఉన్నామని భావించాము,” అని ఒక గ్రామస్తుడు చెప్పాడు.
ఈ నకిలీ గ్రామ సభ, నిరంతర వేధింపులు, పదేపదే జరిగిన చట్టపరమైన పోరాటాల తర్వాతే మా మాటి మాలి సురక్షా మంచ్ ఏర్పడింది.
“నిజమైన గ్రామ సభను తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రక్రియ ఉంది, దానిని గ్రామస్తులు కల్పితం అని ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం గ్రామస్తుల నుండి అనుమతి ఉందని చెప్పుకోవడం ప్రారంభించింది. అప్పుడే ప్రజలు ఈ మోసాన్ని గ్రహించారు,” అని బేరియా వివరించారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకున్న వాయిదా నిర్ణయం పెద్దగా ఉపశమనం ఇవ్వలేదు. “ఇది ఒక సుదీర్ఘ పోరాటంలో చిన్న విజయం. ‘వాయిదా’ అంటే ప్రాజెక్టు రద్దు అయినట్లు కాదు,” అని నాయక్ అన్నారు.
ప్రతిఘటన కొనసాగింపు :
సిజిమాలిలోని పచ్చని అడవులను చూస్తూ, గ్రామస్తులు ప్రతి ఉదయం నిరసన ప్రదేశంలో మేల్కొంటారు. మేఘాలు టెంట్‌లకు దగ్గరగా కదులుతూ ఉంటాయి, మరియు చేతిలో ఒక కప్పు టీతో, వారు తాము వదిలిపెట్టడానికి నిరాకరిస్తున్న భూమి గురించి మాట్లాడుకుంటారు.
“వారు దీన్ని నాశనం చేస్తారు. మేము ఈ భూమికి సంరక్షకులం. మా పూర్వీకులు స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఇక్కడ నివసించారు. ఇది వారి భూమి అని వారు ఎలా చెప్పగలరు?” అని ఒక గ్రామస్తుడు ప్రశ్నించాడు.
చిన్నగా వర్షం మొదలవగా, ప్రజలు టెంట్ కిందకు పరుగెత్తుతుంటే, ప్రగాఢమైన అనుబంధ భావన ఆ వాతావరణాన్ని నింపుతుంది. “మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మాకు జైలు అనేది ఎంత?” అని రక్డై మాఝీ అన్నారు.
సిజిమాలి మరియు చుట్టుపక్కల గ్రామాలలో ప్రతిఘటన కొనసాగుతున్నందున, కంపెనీ మరియు పోలీసులు ఇద్దరి చేత ప్రజలు అరెస్టు చేయబడుతూ, వేధించబడుతూనే ఉన్నారు.