మీ అమరత్వాన్ని కొలవ
ఎన్ని పదాలు చూసినా
ఎంత సాహిత్యం వెతికినా
ఏవి సరిపోవటం లేదు.
యాభై ఏళ్లుగా
త్యాగాలను ముద్దాడుతూ
తడియారని ఆశయాలతో
ఊత కర్రలతో నడుస్తూ
దేశ విప్లవానికి ఊతమై
పండుటాకులై కూడా
పాలకుల వెన్నులో
చలి జ్వరం పుట్టిస్తూ
విప్లవాన్ని నిలబెడుతూ
మిమ్ము కాల్చినా
బూడిద చేసినా
రాజ్యానికి
చెమటలు పట్టిస్తున్న
మీ త్యాగాలను కొలవ
ఏ భాషలో చూడాలి
ఏ గ్రంథంలో వెతకాలి
మీ భుజాలపై ఎగిసిన
ఎర్ర జెండా
సగర్వంతో మురిసిపోతూ
మరింత ఎర్రగా
కాంతులీనుతుంది.
ఆ జెండా రెపరెపలే
మీ త్యాగాలకు
కొలమానం.
