ఈ సంవత్సరం మార్చ్ నెల నుండి – అంటే మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటి నుండి దేశంలో ప్రజాస్వామిక వాదులు, విప్లవ సానుభూతిపరులు, మేధావులు ఈ విషయంలో చర్చలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై తమ వైఖరిని ప్రకటించి ఉన్నాయి. ఎన్నో ప్రజాసంఘాలు, విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా శాంతి చర్చలను జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహించాయి. ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్, తమిళ్ నాడు లలో ఇవి పెద్ద ఎత్తున జరిగాయి.
ఈ సందర్భంగా ఒక్కొక్క ఘటనలో పది, ఇరవై, ముప్ఫై మంది దాకా కూడా విప్లవకారులు, సాధారణ ఆదివాసీలు మరణించడంతో మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రకమిటీ, రాష్ట్ర కమిటీల నాయకులతో సహా నాయకత్వ కామ్రేడ్స్ కూడా పెద్ద ఎత్తున అమరులు అవుతుండటంతో విప్లవ శిబిరంలో బాధ, కసిలతో పాటు విప్లవోద్యమ మనుగడపైనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు కొంత మంది మావోయిస్టు పార్టీ పంథా, వ్యూహం, ఎత్తుగడలపైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఇక సాయుధ విరమణ చేస్తే తప్ప మరో మార్గం లేదని సోషల్ మీడియాలో విపరీతంగా రాస్తున్నారు. కొంత మంది మన దేశంలో ఉత్పత్తి విధానంలో వచ్చిన మార్పును గుర్తించక పనికి రాని దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాను ఇంకా పట్టుకొని వేలాడటం తప్పని అందు వల్ల సాయుధ పోరాటాన్ని విరమించాలని మాట్లాడారు, రాసారు. దీనికి రాజ్యం కూడా వెనక నుండి ఆజ్యం పోస్తూనే ఉంది.
ఇవన్నీఒక ఎత్తయితే ఈ నెల 16వ తేదీ నాడు ఎంతో కాలంగా సిపిఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న అభయ్@సోనూ తాము సాయుధ పోరాటాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు చేసిన ప్రకటన చాలా గందరగోళానికి దారి తీసింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రకటనపై ఫోటో కూడా ఉండటం, సాయుధ పోరాట విరమణ చేస్తామని ప్రకటనలో ఉండటంతో కూడా ఇది పోలీసులు చేస్తున్న మానసిక యుద్ధంలో భాగమేమో అని కూడా అనేకమంది అభిప్రాయపడ్డారు. పైగా అంతకు కొద్ది రోజుల క్రితమే పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఇచ్చిన పిలుపులో ఇట్లా లేకపోవడం వల్ల కూడా ఈ అనుమానానికి దారి తీసింది. కానీ అది కా. సోనూ ఇచ్చిన ప్రకటనే అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ ప్రకటనతో పాటు ప్రజలకు విజ్ఞప్తి అనే పేరుతో మరో ఆరు పేజీల లేఖను కూడా విడుదల చేశాడు. ఈ రెండింటినీ విశ్లేషించవలసి ఉంది. దానితో పాటు ఈ సందర్భంగా దేశంలోని ఉత్పత్తి విధానం గురించి, అనుసరించాల్సిన వ్యూహం ఎత్తుగడల గురించి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కూడా చర్చించవలసి ఉంది. అయితే ఈ వ్యాసంలో మాత్రం కా. సోనూ రాసిన లేఖలోని విషయాలకు మాత్రమే పరిమితమై చర్చ చేస్తాను. మిగిలిన విషయాల గురించి మరో వ్యాసంలో రాస్తాను.
ఈ ప్రకటన, విజ్ఞప్తిల గురించి రెండు కోణాల్లో చర్చ చేయాల్సి ఉంది. ఒకటి పద్ధతి గురించి. రెండు – అంతకంటే ముఖ్యంగా వాటిలో ప్రస్తావించిన విషయాల గురించి.
మొదట పద్ధతి గురించి చర్చిద్దాం. కా. సోను కా. ఆజాద్ మరణం తరువాత సుదీర్ఘ కాలం పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. కొంత కాలం కా. ఆనంద్, మరి కొంత కాలం కా. కోస కూడా ప్రతినిధిగా వ్యవహరించారు. అందరూ అభయ్ పేరుతోనే అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు కా.సోను అధికార ప్రతినిధిగా ఉన్నాడని అర్థమవుతున్నది. పార్టీ అధికార ప్రతినిధికి ఉన్న బాధ్యత ఏమిటి? వివిధ దేశీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలపై, ప్రజా పోరాటాలపై, పాలకుల విధానాలపై పార్టీ పంథా, విధానాలకు కట్టుబడి ప్రకటనలు, ఇంటర్వ్యూలు వగైరా ఇవ్వటం. పార్టీ పొలిట్ బ్యూరో ఇచ్చే ఇతర కర్తవ్యాలను నెరవేర్చటం. ఇందులో ‘పార్టీ రాజకీయ పంథాకు, విధానాలకు లోబడి’ ఏదైనా వైఖరిని చేపట్టడం అనేది కీలకమైనది. కా. సోను ఇచ్చిన ప్రకటనలో ఈ కీలకమైన విషయాన్ని ఉల్లంఘించాడు. పార్టీ మౌలిక పంథాకు వ్యతిరేకంగా అటువంటి ప్రకటన ఇచ్చే అధికారం పార్టీ కార్యదర్శి, అధికార ప్రతినిధులతో సహా ఎవ్వరికీ ఉండదు. కా. సోను పార్టీ చేసిన ఎన్నో తప్పిదాల వల్ల కూడా ప్రస్తుత పరిస్థితికి చేరుకుందని రాస్తూ ఈ బహిరంగ ప్రకటన చేశాడు. నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో అపార అనుభవం గడించడమే కాకుండా, రెండున్నర దశాబ్దాల పాటు కేంద్ర కమిటీలో ఉన్న వ్యక్తిగా ప్రస్తుత ఆలోచనలకు పూర్తి భిన్నమైన ఆలోచననలను చేయడమే తప్పు కాదు కానీ ఆ ఆలోచనలకు కేంద్ర కమిటీలో కానీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కానీ ఆమోదం లేకుండా ప్రజలకు విజ్ఞప్తి పేరు మీద విడుదల చేయడం కమ్యూనిస్టు పార్టీ పద్ధతికి ఏ మాత్రం పొసగనిది. ఈ మాత్రం కా. సోనుకు తెలియని విషయం కాదు. అయినా అందుకు పూనుకున్నాడు.
కా. సోను తనకు మద్దతుగా పార్టీ ప్రధాన కార్యదర్శికి కూడా ఇటువంటి అభిప్రాయమే ఉందని కూడా రాశాడు. అభయ్ పేరుతో ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మూడు ప్రకటనలలో మొదటి దాంట్లో కాల్పుల విరమణ జరిగి పార్టీ కమిటీలు కలిసి చర్చించడానికి సానుకూల పరిస్థితి కల్పిస్తే అన్ని విషయాలు ఎజెండాలో చేర్చి మాట్లాడవచ్చు అని ఉంది. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడమే కాక దాడులను కొనసాగిస్తూ పెద్ద ఎత్తున విప్లవకారులను చంపుతుండడంతో రెండవ ప్రకటనలో గెరిల్లా యుద్ధంతో ప్రభుత్వ బలగాలను ప్రతిఘటించమని పిలుపు ఉంది. మూడవ ప్రకటన మాత్రం రాజకీయంగా కొంత బలహీనంగా ఉంది. ఏదేమైనా మే 27 నాడు కామ్రేడ్ బసవరాజు అమరుడు కావడంతో అప్పటికి ఆ అధ్యాయం ముగిసింది. కాకపోతే ప్రభుత్వం ఏక పక్షంగా ఇట్లా ప్రధాన కార్యదర్శితో సహా అందరినీ చంపుతూ పోతుంటే ఇంకా చర్చల గురించి మాట్లాడటమెందుకు అనే చర్చ ఒక వైపు, ఇప్పటికైనా పోరాటం విరమించి మిగిలినవారి ప్రాణాలైన కాపాడుకుంటే మంచిదనే అభిప్రాయాలూ మరొకవైపు వచ్చాయి. ఈ నేపథ్యంలో కా. సోను ప్రకటనను విశ్లేషిద్దాం.
పైనే పేర్కొన్నట్టు పార్టీ పంథాకు మౌలికంగా భిన్నమైన ప్రకటన బహిరంగంగా ఇవ్వడానికి పార్టీ అధికార ప్రతినిధికైనా మరెవ్వరికైనా అధికారం ఉండదు. అందు వల్ల ఆ ప్రకటన కా. సోను వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఇచ్చిన ప్రకటన సరియైనదే. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఇచ్చిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి ఎట్లా ఖండిస్తాడని జినుగు నరసింహా రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్న లేవనెత్తడం కుతర్కమే తప్ప వేరే ఏమీ కాదు. అసలు అటువంటి ప్రకటన ఇవ్వడానికి సోను (అభయ్)కు అధికారం లేదనే విషయాన్ని పట్టించుకోని కుతర్కం ఇది.
తమ ప్రతిపాదన పట్ల జైళ్ళలో ఉన్న కామ్రేడ్లు జైలు అధికారుల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేయాలనేది ఎంత హాస్యాస్పద విషయం. సాయుధ పోరాటం విరమించాలనే వాళ్ళు సులభంగా తమ అభిప్రాయం తెలియజేయ గలుగుతారు. మరి కొనసాగించాలనుకునే వాళ్ళు అలా చేయగలరా? అలా చేస్తే రాజ్యం వారిపట్ల ఎటువంటి వైఖరిని అవలంబిస్తుందో తెలియదా? కొందరు విరమించాలని అంటే మిగిలిన వాళ్ళు ఏమీ అనకపోయినా రాజ్య బందీలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? బయటకు రావడం కోసం మాత్రమే వాళ్ళు పోరాటం విరమించాలని అంటే అది వారి నిజమైన అభిప్రాయం కాగలదా? కనీసమైనా ఆలోచించకుండా ఇటువంటి ప్రతిపాదన చేయడం ఎంత ప్రమాదకరం!
తన ప్రకటనను ఎవ్వరూ నమ్మరేమో అనే అనుమానం సోనుకు ఉన్నందుకే మునుపెన్నడూ లేని విధంగా ఫోటోను జత పరిచి, తన వాయిస్ తో కూడా ప్రకటన ఇచ్చాడు. సోను ప్రకటన విషయంలో ఈ అంచనా (ఈ ప్రకటనను నమ్మరేమో అనే అంచనా) మాత్రమే సరియైనది.
ఇక సోను ప్రకటనలోని విషయానికి వస్తే – సోను ప్రజలకు విజ్ఞప్తి అని రాసినది చాలా పేలవంగా, యాభై ఏళ్ల ఉద్యమ చరిత్రను (ఏ ఉజ్వల చరిత్ర నిర్మాణంలో తాను కూడా నాలుగు దశాబ్దాలకు పైగా భాగమయ్యాడో ఆ చరిత్రను) దాదాపు ఏక పక్షంగా విమర్శిస్తూ సాగింది.
ఆయన ఇందులో ప్రధానంగా లేవనెత్తిన విమర్శలను (ఆత్మ విమర్శను) చూద్దాం. ‘పార్టీ సాధించిన అచీవ్ మెంట్స్’ ఎంత గొప్పవో, పార్టీ చేస్తున్న తప్పులూ అంతకన్నా తీవ్రమైనవి; ఏ ప్రాంతంలోనూ సాపేక్షికంగా బలమైన, నిలకడైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయింది; మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో వెనుకబడుతూ వస్తోంది; శత్రువు బలాన్నీ, విప్లవ శక్తుల బలాన్ని సరిగా అంచనా వేసుకొని తగిన ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మించడంలో తప్పులు చేస్తూ వస్తోంది. మార్క్సిస్టు ఉపాధ్యాయుల బోధనలను మన దేశ నిర్దిష్ట స్థల, కాల పరిస్థితులకు తగిన విధంగా అన్వయించడంలో అతివాద తప్పులు చేస్తూ వస్తున్నది.
కా. సోను చేసిన పై విమర్శలన్నింటిలో పాక్షిక సత్యముంది. అవన్నీ తప్పనిసరిగా సరిదిద్దుకోవలసిన విషయాలే. సోనూ నే రాసినట్టు – సాధించిన గొప్ప విజయాలకు, పార్టీ పంథా, విధానాలే కారణం. చాలా తప్పులు చేసినందువల్లనే ఉద్యమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడనేది కూడా అంతే వాస్తవం. కానీ కా. సోను దీనికి ఏం పరిష్కారం చూపుతున్నాడనే విషయాన్ని కూడా చూడాలి.
తన వాదనకు బలం చేకూర్చుకోవడంలో భాగంగా ఆరు దశాబ్దాల క్రితం ప్రజా సంఘాల నిర్మాణం చేయకూడదు అని ఆ విషయంలో చేపట్టిన తప్పు వైఖరిని పేర్కొనడం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం శూన్యం. ఆ తప్పును కొద్ది కాలంలోనే సరిదిద్దుకోవడం వల్లనే విప్లవోద్యమం ముందంజ వేసింది. కాబట్టి అది అప్రస్తుతమైన విమర్శ. ఇప్పటికీ ప్రజా సంఘాల విషయంలో జరిగే తప్పులను విమర్శనాత్మకంగా చూడాలి, ఆ విషయంలో పార్టీ చేసే తప్పులను కూడా సరిదిద్దు కోవాలి, ఆ విధంగా మొత్తం పార్టీని మలుచుకోవాలి. అది ప్రజా సంఘాలు, వాటి నాయకత్వం, పార్టీ, దాని నాయకత్వం తేల్చుకోవలసిన విషయాలు. కానీ ప్రజలకు చేసే విజ్ఞప్తిలో అటువంటిది ఉండటం వల్ల కూడా ప్రజలలో గందరగోళం ఏర్పరచడం తప్ప అంతకు మించిన ప్రయోజనం లేదు.
బీహార్-ఝార్ఖండ్-దండకారణ్యంలో కూడా విప్లవం బతికి బట్టకట్టే పరిస్థితులు లేకుండా పోయాయి అని రాస్తూ అందుకు ఏకైక కారణం – శత్రువుకు అభేద్యమైన రహస్య విప్లవ పార్టీని నిర్మించలేక పోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవ సిద్ధాంతాన్ని ఆచరణకు అన్వయించడంలో ఘోరంగా విఫలం కావడం తప్ప మరేం కాదు అని రాసాడు. ఇది కూడా పాక్షికంగా (ముఖ్యంగా రెండవ అంశం) సత్యమే అయినా దానికి మార్గం, పరిష్కారం మాత్రం ప్రజలకు చేసే విజ్ఞప్తి వల్ల సమకూరుతాయా? విప్లవ కేడర్ (పార్టీ, ప్రజా సంఘాల కేడర్) అభిప్రాయాలను కూడా సేకరించి పార్టీ నాయకత్వం తప్పులను సరిదిద్దడం వల్ల సాధ్యమవుతుందా? ప్రజలకు చేసిన విజ్ఞప్తికి ఒకే ఒక కారణం – సాయుధ పోరాట విరమణ చేస్తే తప్ప మార్గం లేదని తాను, తనతో పాటు మరికొంత మంది వచ్చిన నిర్ధారణకు మద్దతు సమకూర్చుకోవడం కోసమే ఇది పనికొస్తుంది తప్ప, తాను లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కాదు.
కా, సోను లేవనెత్తిన సమస్యలలోని చాలా సమస్యలను విప్లవోద్యమం, విప్లవ పార్టీ సృజనాత్మకంగా పరిష్కరించుకోకుండా విప్లవోద్యమం ముందుకు సాగదనేది సుస్పష్టమైన విషయమే. కానీ వీటన్నింటికి పరిష్కారంగా కా. సోను సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి బహిరంగంగా ప్రజల మధ్య పని చేసి పార్టీని, విప్లవోద్యమాన్ని పునర్నిర్మించాలని ప్రతిపాదిస్తున్నాడు. “దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ పరిస్థితులలోని మార్పులతో, స్థల కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా’ అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పి భారత స్థల కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం’ అని చెబుతున్నాడు. ఆ పంథా ఏమిటనేది కా. సోను ఏమీ ప్రతిపాదించలేదు. ఇప్పటికైతే సాయుధ పోరాటాన్ని విరమించి ఆ తరువాత ఆలోచిద్దాం అనే ధోరణిలో కా. సోనూ ఆలోచనలు ఉన్నాయి.
భారత దేశ స్థల కాలాదులకు సరి పడే పంథా వెతుకులాటలోనే మన దేశంలో ఎన్నో ఎంఎల్ పార్టీలు ఏర్పడినాయి. అన్ని రకాల పంథాలు, ఎత్తుగడలు రంగం మీదికి వచ్చాయి. అయినా ఏవీ విజయవంతం కాలేదు. సాయుధ పంథాకు కట్టుబడి ఉన్న మావోయిస్టు పార్టీనే ఏదో మేరకు మెరుగైన పోరాటాలను నిర్మించింది. అదే సరిపోదని అర్థమవుతూనే ఉంది. కానీ ‘తాత్కాలిక సాయుధ పోరాట విరమణ’ అందుకు పరిష్కారమా? ఇప్పుడు సాయుధ పోరాట విరమణలో ‘తాత్కాలికం’ అంటూ ఏమీ ఉండదు. అది సాయుధ పోరాట శాశ్వత విరమణే. 1977 లో కా. కేఎస్ తాత్కాలిక విరమణ అని పిలుపిచ్చినప్పుడు, ప్రాక్టికల్ గా ఏమీ ‘విరమించడం’ అనేది లేదు. ఆయుధాలు అప్పగించడం అనేది లేదు. కొంత కాలం పాటు కొన్ని ‘చర్యలను’ ఆపుకోవడం మాత్రమే ఉండింది. ఇప్పుడు అలా కాదు కదా! ఆయుధాలు అప్పగించి గెరిల్లా బలగాలనన్నింటినీ రద్దు చేసుకోవడం. దాదాపు యాభై ఏళ్ల కృషిని నీటి పాలు చేయడం.
ప్రస్తుతమున్న ఫాసిస్టు పాలనా కాలంలో ఇది ఎవరికి బలం చేకూరుస్తుంది? ఖచ్చితంగా మోదీ-షా లకు, హిందూత్వ బలగాలకు. బహిరంగంగా మాత్రమే ఏ ప్రజా ఉద్యమమైనా నిర్మించే పరిస్థితులు దేశంలో ఉన్నాయా? లద్దాక్ ఆరవ షెడ్యూల్ లో చేర్చమన్నందుకే సోనమ్ వాంగ్ చుక్ కు పాకిస్తాన్ తో సంబంధాలు అంటగడుతున్న రాజ్యం ఇది. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా 5వ షెడ్యూల్ లోని హక్కులను, పెసా చట్టాన్ని అమలు చేయమని అడిగినందుకే ‘మూలవాసీ బచావ్ మంచ్’ సంస్థను – ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారనే హాస్యాస్పద ఆరోపణ చేసి, నిషేధించి ఆ సంస్థ నాయకులందరినీ జైల్లో పెట్టారు. అన్ని ఆదివాసీ ప్రాంతాలలో దాదాపు ఇదే పరిస్థితి. మైదాన ప్రాంతాలలో రైతాంగం చేస్తున్న అనేక పోరాటాల పరిస్థితి కూడా దాదాపు అట్లాగే ఉంది. మరి సాయుధ పోరాటం విరమించిన నాయకత్వాన్ని ఆదివాసీ ప్రాంతాలలో, మైదాన ప్రాంతాలలో కూడా ప్రజా ఉద్యమ నిర్మాణానికి అనుమతించే పరిస్థితులున్నాయా? ఆ విషయం కా. సోనుకు కూడా తెలుసు. అందుకే ‘మీ మధ్య ఇక మా పార్టీ గతంలా లేకపోవడంతో, వర్గ సమాజంలో విప్లవ ప్రతిఘాత శక్తులు మిమ్మల్ని ఎంతగా వేధిస్తాయో, ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతాయో మాకు తెలుసు’ అని కూడా రాసాడు. మరి ఆ ఆదివాసీలను ఈ క్రూర ఫాసిస్టు రాజ్యహింసకు వారి మానాన వారిని వదిలెయ్యాలా? అది భవిష్యత్తులో నైనా విప్లవోద్యమానికి గానీ, విప్లవ పార్టీకి గానీ ఉపకరించే విషయమా? ఏ మాత్రమూ కాదు.
ఏదేమైనా అమిత్ షా ఈ ‘విరమణ’ ప్రకటనను కూడా పట్టించుకోవడం లేదు. వ్యక్తులుగా సరెండర్ కావడం తప్ప ‘విరమణ’ అన్న వాళ్ళతో కూడా చర్చించేదేమీలేదని ప్రకటించేశాడు. ఫాసిస్టు రాజ్యం ఎటువంటిదో మరో సారి అమిత్ షా ప్రకటనతో బహిర్గతమైంది.
ఏదేమైనా సాయుధ పోరాటం చేయాలా వద్దా అనేది అంతిమంగా, ముఖ్యంగా తేల్చాల్సింది ఆ సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు, అందులో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు, ఈ మొత్తం క్రమంలో ముఖ్యంగా సల్వా జుడుం కాలం నుండి అనేక కష్ట నష్టాలను, భయంకరమైన హింసను సహిస్తూ, సాహసికంగా ఎదుర్కొంటూ, మాన, ప్రాణాలు పోగొట్టుకుంటూనే విప్లవోద్యమానికి దన్నుగా ఉంటూ అందులో భాగమవుతున్న ఆదివాసీ ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, దండకారణ్యం, బీహార్, ఝార్ఖండ్ లలోని స్థానిక నాయకత్వం అభిప్రాయం ఏమిటనేది కూడా కీలకమైనది. వాళ్ళకు అది దీర్ఘకాలిక విప్లవమే కాదు, తక్షణ జీవన్మరణ సమస్య. వారందరూ మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించి సరెండర్ కావాలని అనుకుంటున్నారా? పోరాటం ఇంత క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక సెక్షన్ ప్రజలు ఊగిసలాడినా, కార్మిక అగ్రగామి పార్టీ వాళ్ళలో చరిత్ర గమనం పట్ల ఆశావాహ దృక్పథం నింపి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవలసి ఉంటుంది. అయితే పార్టీ చేసిన, చేస్తున్న ‘ఘోరమైన రాజకీయ, వ్యూహాత్మక, ఎత్తుగడల పరమైన’ తప్పిదాలు ఏంటి అనేది లోతుగా విశ్లేషించుకొని సరిదిద్దుకొని ముందుకు సాగాలి. ఏక పక్షంగా సాయుధ పోరాట విరమణ మాత్రం అందుకు పరిష్కారం కాదు.
ఈ సంవత్సర కాలంగా జరిగిన CC సభ్యులు ముఖ్య కామ్రేడ్స్ హత్యల వెనక వున్నది మల్లొజుల వేణు అనే అనిపిస్తుంది. లేకపోతే వీడు మాత్రమే దొరక్కుండా ప్రకట్నలిస్తున్నాడా? ప్రకటన రాసిన కాగితం తడి అరకముందే కామ్రేడ్స్ కోసా రాజు దాదాలు చనిపోతారా? ఆలోచించండి మేధావులు. వీణ్ణి ప్రజలే బహిరంగంగా కొట్టి చంపాలి. తడిపొడి మాటల వ్యాసాలు చాలు.