గత వారం కేరళలో జరిగిన ITFOK ఉత్సవంలో మా నాటకం “ది లాస్ట్ ప్లే ఇన్ గాజా” (గాజాలో చివరి నాటకం) ప్రదర్శించాల్సి ఉండింది. రెండు షోలు జరగాలి. ఈ నాటకం గాజాను తుడిచిపెట్టడానికి సంబంధించిన నాటకం. నాశనమైన దానిని థియేటర్ ద్వారా తిరిగి సృష్టించడానికి చేసే ప్రయత్నాన్ని ఈ నాటకం చూపిస్తుంది. దీని కోసం మేము చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఏడాది కాలంగా గాజాలో జరుగుతున్న హత్యలు ఇంకా ఆగిపోనందున, ఈ నాటకం అసంపూర్తిగానే ఉన్నా ఎట్టకేలకు దీన్ని అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. “నిశ్శబ్దంలోని గళాలు” అనే అంశంపై జరుగుతున్న ఈ ఉత్సవంలో, ముఖ్యంగా భారతదేశంలో ప్రదర్శించడం మాకు చాలా ముఖ్యం అనిపించింది. ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నా, వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర భారత్‌కు ఉంది.

సాధారణంగా వీసా అనేది ఒక మామూలు ప్రక్రియ. కానీ ఈసారి అధికారులు నాటకం కథా సారాంశం (synopsis) అడిగారు. వీసా ఇచ్చే అధికారులు థియేటర్ విమర్శకులుగా మారారా? అయినా మేము సంక్షిప్త సారాంశం పంపి ఎదురు చూసాము. వీసా నిరాకరించారు.

మేము దీనిపై అప్పీల్ చేశాం. ఆ ప్రాసెస్ మమ్మల్ని అవమానించేలా సాగింది. మా నాటకం ప్రమాదకరం కాదని, మారణహోమాన్ని ఆపమని చెప్పడం సరైనదేనని మేము వివరించుకోవాల్సి వచ్చింది. సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు అనిపించినా, చేతికి మాత్రం వీసా రాలేదు. ఇది ‘కాఫ్కాస్క్’ (Kafkaesque) తరహా ఒక గందరగోళ పరిస్థితి.

ఇది కేవలం కళాకారుల సెన్సార్‌షిప్ మాత్రమే కాదు. మన కళ్లముందు రూపుదిద్దుకుంటున్న నూతన ప్రపంచ వ్యవస్థ పోకడల గురించి ఇది ఒక లోతైన నిజాన్ని చెబుతోంది. భారత్ – ఇజ్రాయెల్ మధ్య (జయోనిజం-హిందూత్వాల మధ్య) పెరుగుతున్న భార్గస్వామ్యాన్ని ఇది బయటపెడుతోంది. ఇది కేవలం సైనిక, ఆర్థిక, సాంకేతిక సహకారం మాత్రమే కాదు; రాజకీయ గొంతులను, కళాకారుల గొంతులను నొక్కేసే ఒక “ఉమ్మడి సంస్కృతి” పై ఆధారపడి ఉంది (అటువంటి రేసిస్టు జాతీయవాదాన్ని సంస్కృతి అనగలిగితే). భారత్ కేవలం ఇజ్రాయెల్ నుండి ఆయుధాలు కొనడం లేదు. ఇరు దేశాల భాగస్వామ్యం మరింత లోతైనది. నిజమైన కళా సంస్కృతి స్థానంలో ప్రభుత్వం నిర్దేశించిన జాతీయవాద ‘రాజ్య సంస్కృతిని’ పై నుండి రుద్దాలని చూస్తోంది.

ఒకప్పుడు అలీన ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రపంచవ్యాప్తంగా జాతీయ విముక్తి యుద్ధాలకు మద్ధతు ఇచ్చి, 1988లోనే పాలస్తీనాను గుర్తించిన భారతదేశం, ఇప్పుడు మోదీ హయాంలో ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. భారత్‌కు ఆయుధాలు అమ్మే దేశాల్లో ఇజ్రాయెల్ మూడవ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ నిఘా టెక్నాలజీని భారత ప్రభుత్వం కాశ్మీర్‌లో, ముస్లిం జనాభాపై అణచివేతకు వాడుతోంది. వ్యతిరేకించే వారి గొంతు ఎలా నొక్కాలి, మైనారిటీలను అంతర్గత శత్రువులుగా ఎలా చూపాలి అనే విషయాల్లో ఇజ్రాయెల్ తన అనుభవాన్ని భారత్‌తో పంచుకుంటున్నట్లు మా కేసు ద్వారా బయటపడుతోంది.

ఈ భాగస్వామ్యానికి ఒక మూల్యం చెల్లించాల్సి వస్తోంది, అదే “మౌనం వహించడం”. గాజాలో జరుగుతున్న మారణహోమంపై మౌనంగా ఉండటం అంటే దానికి మద్దతు ఇవ్వడమే. ఇది మరో మారణహోమానికి దారి తీస్తుంది. సెన్సార్‌షిప్ అనేది కేవలం ఒక అధికారిక నిర్ణయం కాదు, అది ‘తుడిచిపెట్టడానికి’ ఉపయోగించే ఒక సాధనం. ఇంకా ఎక్కువగా ‘తుడిచిపెట్టడానికి’ ఒక అధికారిక ఆమోద ముద్ర.

ఇది పొరలుపొరలుగా జరుగుతున్న ‘తుడిచివేత’ పద్ధతి. మొదట గాజాను భౌతికంగా తుడిచిపెట్టారు – భవనాలను, రక్తమాంసాలను. తర్వాత అక్కడి వార్తలు, జర్నలిస్టులు, ఫోటోలు, ఆధారాలను లేకుండా తుడిచి వేశారు. ఆపై దీని గురించి చెప్పే గొంతులను ‘తుడిచివేస్తున్నారు’ (నొక్కివేస్తున్నారు). దీన్ని గురించి మాట్లాడే కళాకారులు, రచయితలు, కవుల గొంతులను నొక్కేస్తున్నారు. చివరగా, ఆ ‘తుడిచివేతను’ గుర్తుచేసే, పోయినదాన్ని పునర్నిర్మించే నాటకాన్ని వేదికపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. దీన్నే నేను “తుడిచివేతపై తుడిచివేత” (Erasure of Erasure) అంటున్నాను.

ఇది కేవలం మేమెన్నటికీ ప్రదర్శించలేని ఇజ్రాయెల్-పాలస్తీనాలోనే కాదు, ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతోంది. ఈ వలయం పెరుగుతోంది.

కానీ ప్రజలు మాకు అండగా నిలిచారు. ఎంతో ఒత్తిడి ఉన్నా, ITFOK ఉత్సవ నిర్వాహకులు ప్రదర్శించబడని మా నాటకం కోసం ఒక సాయంత్రాన్ని కేటాయించారు. కేరళ ప్రేక్షకులు అక్కడికి రావడం, ఆ సాయంత్రం అక్కడే ఉండటం, ఆ నాటకం లేకపోవడాన్ని అర్థం చేసుకోవడమే ఒక పెద్ద రాజకీయ సందేశం. భారతీయ కళాకారులు కూడా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, మౌనంగా ఉండటాన్ని నిరాకరిస్తూ ఈ మారణహోమంలో భాగం కావడానికి నిరాకరిస్తున్నారు.

నేను చివరి సారి టెల్ అవీవ్‌లోని భారత ఎంబసీకి వెళ్ళినప్పుడు నన్ను లోపలికి రానివ్వలేదు. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మా నాటకం కేవలం గాజా గురించి మాత్రమే కాదు, గొంతు నొక్కేసే/ ప్రజలను ‘తుడిచివేసే’ వ్యవస్థల గురించి, అందులో కూడబలుక్కున్న వారి మీద కూడా. మాకు వీసా నిరాకరించడం ద్వారా, మేము నాటకంలో చెప్పాలనుకున్న నిజాన్ని వారే నిజం చేసి చూపించారు.

నాటకం ఇండియాకు చేరకపోవచ్చు, కానీ అది ఎందుకు చేరలేదనే వార్త ప్రపంచమంతా తెలిసింది. స్టేజి మీద జరిగే దానికంటే ఈ సంఘటన ద్వారా ఎక్కువ విషయాలు బయటపడ్డాయి.

 11 ఫిబ్రవరి 2026

(ఐనాట్ వైజ్మాన్ ఒక యాంటీ-జయోనిస్ట్ (యూదు జాత్యహంకార వ్యతిరేక) ఇజ్రాయిలీ నాటక రచయిత్రి, దర్శకురాలు. ఆమె రాజకీయ, డాక్యుమెంటరీ థియేటర్ లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఆమె రచనలు ప్రధానంగా జ్ఞాపకశక్తి, వలసవాద వ్యతిరేక పోరాటం, సాంస్కృతిక విధ్వంసం (cultural erasure) వంటి విషయాల చుట్టూ సాగుతాయి. ఆమె నాటకాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించబడ్డాయి. సాక్ష్యాధారాల ఆధారంగా ప్రదర్శనలను (testimony-based performances) రూపొందించడానికి ఆమె పాలస్తీనాలోని, విదేశాల్లోని కళాకారులు, సామాజిక వర్గాలతో కలిసి పనిచేస్తుంటారు.)

Leave a Reply