ఏ చట్టపరమైన విధానాన్ని అనుసరించకుండా, పౌర దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అరెస్టు చేసిన విద్యార్థులు, కార్యకర్తలు ‘ది వైర్‌’కు చెప్పారు. తమ సహచరులు ఆరుగురిని, నజారియా పత్రికలో పనిచేస్తున్న ఒకరిని అవసరమైన ప్రక్రియను అమలుచేయకుండా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్బంధించి దౌర్జన్యం చేసిందని ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ ఛాత్రా ఏక్తా మంచ్ (బిఎస్‌సిఇఎమ్)  విద్యార్థి సంఘం, ఫోరమ్ అగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్ఎసిఎఎం-కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక) సభ్యులు ఆరోపించారు.

ఒక ఐఎఎస్ ఆఫీసర్ కూతురు ఎక్కడ ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి “ఇంటరాగేషన్” చేసే పేరుతో జులై 9 నుండి 21వ తేదీ వరకు 19 నుండి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న తమను విపరీతమైన శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేసారని చెప్పారు.

నిర్బంధ కాలక్రమం:

బిఎస్సిఇఎంతో సంబంధం ఉన్న గుర్‌కిరట్ (20), గౌరవ్ (23), గౌరాంగ్ (24) లను జూలై 9 న మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని బెర్ సరాయ్ నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ విధమైన న్యాయప్రక్రియనూ పాటించకుండా, సివిల్ దుస్తుల్లో ఉన్న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అధికారులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని వారు చెప్పారు.

 ఈ విద్యార్థులను, కార్యకర్తలను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాల నుండి అదుపులోకి తీసుకుంది.

రెండు రోజుల తరువాత, జూలై 11 న, ఎఫ్ఎసిఎఎమ్ కు చెందిన ఎత్‌మామ్(26), లక్షితా (బాదల్) (21)లను మధ్యాహ్నం 1:00 గంటలకు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.

ప్రొఫెసర్, సామాజిక కార్యకర్త అయిన సామ్రాట్‌ను మరుసటి రోజు, జూలై 12న హర్యానాలోని అతని ఇంటి నుండి అదుపులోకి తీసుకున్నారు.

జూలై 19న నజారియా మ్యాగజైన్ కోసం పనిచేస్తున్న రుద్రను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.

“జూలై 9న గౌరవ్, గౌరంగ్, నేను కొన్ని పుస్తకాలు తీసుకోడానికని ఢిల్లీలోని బేర్ సరాయ్‌లో ఉన్న రుద్ర ఇంటికి వెళ్ళాం. సుమారు 3:30 గంటలకు, సివిల్ దుస్తులలో ఉన్న  ముగ్గురు లేదా నలుగురు మగ పోలీసు అధికారులు వచ్చి ‘మీరు విద్యార్థులు కాదు ఉగ్రవాదులు. మాతో పాటు ఆఫీసుకు రావాలి” అన్నారు. మేం అందుకు ఒప్పుకోక వారెంట్‌ను, వారి ఐడి  కార్డులను చూపించమన్నాం. అప్పుడు  ఆ అధికారులలో ఒకరు తన గుర్తింపు కార్డును చూపించి, ‘ఇప్పుడు మీరు తప్పక రావాలి’ అని అన్నాడు” అని ఈ నిర్బంధం గురించి బిఎస్‌సిఇఎమ్ సభ్యురాలు గుర్‌కిరట్ వివరించారు.

“మేం అడ్డుకున్నప్పుడు ఒక అధికారి గౌరవ్, గౌరంగ్ ఇద్దరినీ ఐదారు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. ఒక పోలీసు నన్ను పక్కకు నెట్టివేసి బెదిరించాడు. అతను, ‘నువ్వు అమ్మాయివైనా నేను లెక్కచేయను’ అని అన్నాడు. ఆ తరువాత, వారు ఒక మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించి నన్ను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు” అని గురుకిరట్ వివరించింది.

అదేవిధంగా, “నేను జూలై 11 ఉదయం 11 గంటలకు అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం 1 గంటలకు కొంతమంది పోలీసులు నా ఇంటికి వచ్చి నన్ను, నా స్నేహితుడు ఎత్‌మామ్ను బలవంతంగా వాహనంలో ఎక్కించారు. వారు మా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లను తీసేసుకున్నారు, మేము కారులోకి ఎక్కగానే, వారు అన్నింటినీ పరికరాలను ఎయిర్ ప్లేన్ మోడ్‌లో పెట్టారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతున్నారనే దాని గురించి వారు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు “అని తన నిర్బంధం గురించి వివరిస్తూ, ఎఫ్ఎసిఎఎం సభ్యురాలు లక్షితా వివరించారు.

“మాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు కానీ మాకు కాపీని ఇవ్వలేదు. విచారణ కోసం నాకు నోటీసు వచ్చినప్పుడు (పోలీసులు ఆమెకు ఆన్‌లైన్ నోటీసు ఇచ్చారు), అందులో ఒక ఎఫ్ఐఆర్ నంబర్ ఉన్నది, కానీ ఆ ఎఫ్ఐఆర్‌లో నా పైన ఉన్న  నిర్దిష్ట ఆరోపణల గురించి నాకు తెలియదు.”

‘పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లలేదు’

నిర్బంధిత కార్యకర్తలు “తమను ఢిల్లీ పోలీసులు ఏ అధికారిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లలేదనీ తమను ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఒక తెలియని ప్రదేశంలో ఉంచారనీ” చెప్పారు.

వేర్వేరు రోజులలో వేర్వేరు ప్రదేశాల నుండి తీసుకువెళ్లిన ఆ ఏడుగురిని ఇక్కడనే ఉంచారు.

ఈ ప్రదేశం “సాధారణ పోలీస్ స్టేషన్ కాదు” ఒక పెద్ద “భవనం” అని గుర్‌కిరట్, లక్షితాలు చెప్పారు; “ఇది ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కార్యాలయం” అని వారికి చెప్పారు.

విచారణ, శారీరక హింస, బెదిరింపులు, వేధింపులు తమను నిర్బంధించిన తర్వాత పోలీసులు జరిపిన విచారణా పక్రియ అంతా తమపై జరిపిన శారీరక, మానసిక వేధింపుల ప్రక్రియ అని విద్యార్థులు, కార్యకర్తలు ఆరోపించారు.

గురుకిరట్‌ను బెదిరించడానికి, గౌరవ్, గౌరాంగ్‌లను ఆమె ముందు నగ్నంగా ఉంచి, తోలు కొరడాతో వారి పాదాల అరికాళ్ళపై దారుణంగా కొట్టారని కార్యకర్తలు ఆరోపించారు.

“వారు మమ్మల్ని ఒక గదిలోకి తీసుకువెళ్లారు, అక్కడ ఉన్న ఒక గాజు తలుపు ద్వారా పక్క గదిలో ఏమి జరుగుతుందో చూడవచ్చు. అక్కడ, పోలీసు అధికారి నా స్నేహితులు గౌరవ్, గౌరాంగ్ లను పిలిచి, వారి బట్టలు విప్పి, చల్లని స్టీలు బల్లపైన పడుకోబెట్టాడు. అప్పుడు, చెక్క హ్యాండిల్ ఉన్న తోలు కొరడాతో పదేపదే వారి పాదాల అరికాళ్ళపైన కొట్టిన తరువాత నిలబడమనే వారు; అలా  చేయలేకపోతే, మళ్లీ కొట్టేవారు” అని గుర్‌కిరట్ వివరించింది.

“ఇది ఏ విచారణ ప్రక్రియ కోసమో కాదు; నాకు ఏమి జరగవచ్చు అనేది  “చూపించడానికి” అలా చేశారు. ఆ తరువాత, వారు నన్ను అదే గదికి తీసుకెళ్లి అదే విధంగా కొట్టారు “అని ఆమె చెప్పింది.

గుర్‌కిరట్ దుస్తులను పూర్తిగా తీయకపోయినప్పటికీ, సాధారణ దుస్తులు ధరించిన మహిళా పోలీసులు ఆమెను హింసించి, తోలు బెల్టుతో కాలిపై కొట్టారు. అంతకు ముందు పోలీసులు తనను చెంపదెబ్బ కొట్టారని, జుట్టు పట్టుకుని లాగారని కూడా ఆమె ఆరోపించింది.

చివరగా, కనీసం చదవడానికి కూడా అనుమతించకుండా “అనేక తెల్ల కాయితాలు, తప్పుడు ఒప్పుకోలు” పత్రాల పైన సంతకం చేయమని బలవంతం చేసారని చెప్పారు.

ఢిల్లీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విద్యార్థి అయిన గౌరవ్, ఇప్పుడు బీహార్‌లోని తన స్వస్థలమైన నవాదాకు తిరిగి వచ్చాడు. తన ఎనిమిది రోజుల సుదీర్ఘ అగ్నిపరీక్ష గురించి ఇలా వివరించాడు. “గుర్‌కిరట్‌ను, గౌరంగ్‌ను, నన్ను జూలై 9న బేర్ సరాయ్ నుండి తీసుకువెళ్లారు. మొదటి మూడు రోజుల్లో పోలీసులు మమ్మల్ని చాలా హింసించారు. వారు ఉదయం 1:30 లేదా 2:00 గంటలకు లేపి విచారణ గదికి తీసుకువెళ్ళేవారు. అక్కడ, వారు మమ్మల్ని పూర్తిగా నగ్నంగా చేసి, నేలపై పడుకోబెట్టి, బెల్టులు, కర్రలతో కొట్టారు.”

“విడుదలైన జులై 17నాడు వారు మమ్మల్ని అనేక పత్రాలపైన సంతకం చేయమన్నారు. వాటిలో కొన్ని తెల్ల కాగితాలు. మేము సంతకం చేయకపోతే మమ్మల్ని విడుదల చేయమని బెదిరించారు.”అని ఆయన చెప్పారు.

పోలీసులు తమని ప్రధానంగా, నిరంతరం అడిగిన ప్రశ్న ఐఏఎస్ అధికారి అర్చన వర్మ కుమార్తె వల్లికా గురించి అని లక్షితా, గౌరవ్, గుర్‌కిరట్, ఎత్‌మామ్‌లు చెప్పారు.

‘వల్లికా ఎక్కడ ఉంది?’, ‘ఆమె ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయింది?’, “మీరు ఎవరైనా ఆమెకు “తప్పించుకోవడానికి” సహాయం చేశారా వంటి ప్రశ్నలను పోలీసులు పదే పదే అడుగుతూనే ఉన్నారు.

నిర్బంధంలో ఉన్న ఏడుగురిలో ఎతెమామ్ అత్యంత తీవ్రమైన, అమానవీయ హింసను ఎదుర్కొన్నాడని లక్షితా, గుర్‌కిరట్‌లు చెప్పారు.

మొత్తం నిర్బంధ కాలం అంతటా, జామియా మిలియా ఇస్లామియాలో చదువుకున్న ఎఫ్ఎసిఎఎంలో న్యాయవాది-కార్యకర్త అయిన ఎత్‌మామ్‌ను అతని “ముస్లిం గుర్తింపు” కారణంగా ఉద్దేశపూర్వకంగా, మరింత క్రూరంగా లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపించారు.

“ముల్లా”, “కట్వా” వంటి ఇస్లామోఫోబిక్ పదజాలంతో తిడుతూ అతన్ని పదే పదే కొట్టారు. ముస్లిం పురుషులు హిందూ (ముస్లిమేతర) మహిళలను ప్రేమ, పెళ్లి వాగ్దానాలతో మోసగించారని తప్పుగా ఆరోపించే మితవాద సమూహాలు ఉపయోగించే కుట్ర సిద్ధాంతమైన “లవ్ జిహాద్” కోణంలో తనకు, ఎత్‌మామ్‌కు ఉన్న సంబంధాన్ని తప్పుగా చూపించడానికి కూడా పోలీసులు ప్రయత్నించారని లక్షితా చెప్పింది. 

ఐఏఎస్ అధికారి, ఆమె కుమార్తెకు ఈ నిర్బంధాలతో ఉన్న సంబంధం ఏమిటి?

సీనియర్ బ్యూరోక్రాట్ ఐఏఎస్ అధికారి అర్చనా వర్మ, ఆమె కుమార్తె వల్లికా వర్మ మధ్య ఉన్న “వ్యక్తిగత వివాదం” తమను నిరంతర హింసకు గురి చేయడానికి ప్రధాన కారణమని లక్షితా, గుర్‌కిరట్‌లు అన్నారు.

నిర్బంధించిన కొంతమంది ప్రకారం, హర్యానాలోని జిందాల్ విశ్వవిద్యాలయం లా గ్రాడ్యుయేట్, నజారియా మ్యాగజైన్ సంపాదకీయ సభ్యురాలు అయిన 24 ఏళ్ల వల్లికా తన తల్లితో సైద్ధాంతిక విభేదాల కారణంగా తన ఇంటిని విడిచిపెట్టి ఢిల్లీలోని బేర్ సరాయ్‌లో స్వతంత్రంగా నివసిస్తోంది.

“వల్లికా ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఆమె తన తల్లితో సైద్ధాంతిక విభేదాలు వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ పోలీసులు మమ్మల్ని వెంబడించి, క్రూరంగా హింసించారు. మమ్మల్ని ప్రశ్నించినప్పుడు, వారు పదేపదే వల్లికా ఎక్కడ అని అడిగారు” అని గుర్‌కిరట్ చెప్పింది.

తనకు అందిన నోటీసులో పేర్కొన్న ఎఫ్ఐఆర్ కాపీ తమకు ఇంకా అందలేదని లక్షితా చెప్పారు. తమపై పెట్టిన నిర్దిష్ట ఆరోపణల గురించి కూడా ఆమెకు ఏమీ తెలియదు.

‘ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ఎఫ్ఐఆర్ కింద దర్యాప్తు కోసం నన్ను పిలిచిన ఆన్ లైన్ నోటీసు నా దగ్గర ఉన్నది.. కానీ పోలీసులు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు: ఏ కాయితాలూ ఇవ్వడం లేదు. ‘మీరు ఢిల్లీకి వస్తే, మిమ్మల్ని అరెస్టు చేస్తాం’ అని పోలీసులు మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు.

పోలీసుల నుండి తనకు వచ్చిన నోటీసు జూలై 20 న తన తల్లిదండ్రుల మొబైల్ కు ఆన్ లైన్ లో పంపారని ఆమె తెలిపింది.

తల్లిదండ్రులకు పిలుపు:

నిర్బంధ సమయమంతా ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వేధింపులను ఎదుర్కొన్నారు. తమ తల్లిదండ్రులను ఢిల్లీకి పిలిపించి, తమ పిల్లలు విడుదల అవాలంటే పత్రాలపై సంతకం చేయాలని బలవంతం చేశారని లక్షితా, గుర్‌కిరట్ ఇద్దరూ చెప్పారు.

“మమ్మల్ని తిరిగి ఢిల్లీకి పంపితే పోలీసులు మమ్మల్ని అరెస్టు చేస్తామని వ్రాసి మా తల్లిదండ్రులతో సంతకం చేయించారు. ఈ భయం కారణంగా, నా తల్లిదండ్రులు నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదు, ఇంట్లోనే ఉండమని ఒత్తిడి చేస్తున్నారు “అని లక్షితా చెప్పారు.

ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంటికితీసుకు వెళ్లిపోయి, ఏ విధమైన చట్టపరమైన లేదా ప్రజా ప్రతిస్పందనకు దూరంగా ఉంచారు.

దారుణమైన నిర్బంధం తర్వాత ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లక్నోలో ఉంటున్న ఎతెమామ్  “పోలీసులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించారు. విచారణ సమయంలో వారు వల్లికా ఎక్కడ ఉందో చెప్పమని నన్ను అడుగుతూనే ఉన్నారు; ఆ విషయం నాకు తెలియదు. వారు నన్ను ‘ముల్లా’ అని పిలిచి, నా స్నేహితురాలు లక్షితతో ‘లవ్ జిహాద్’ కోణాన్ని సృష్టిస్తామని చెప్పారు. ఢిల్లీలో నేను ఉండే ఇంట్లో ఆయుధాలు పెడతామని పోలీసులు బెదిరించారు” అని చెప్పాడు.

తనను విడుదల చేసినప్పుడు పోలీసులు తన వస్తువులను తిరిగి ఇవ్వలేదన్నాడు.

“పోలీసులు నా ఫోన్, పర్సు, బార్ అసోసియేషన్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డులను తీసుకున్నారు, మరీ ముఖ్యంగా, మొదట్లో తీసుకున్న ఇంటి తాళం చెవులని తిరిగి ఇవ్వలేదు” అని చెప్పాడు.

నిర్బంధంలో ఉన్న ఏడుగురిలో, రుద్ర అందరిలోకి చిన్నవాడు. కేవలం 19 సంవత్సరాల వయస్సు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జాకీర్ హుస్సేన్ కళాశాలలో విద్యార్థి; నజారియా మ్యాగజైన్ కోసం వల్లికాతో కలిసి పనిచేస్తున్నాడు.

జూలై 19న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న చివరి వ్యక్తి రుద్ర, మొదట నిర్బంధంలో ఉన్న కొంతమంది వ్యక్తులను విడుదల చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

జూలై 9 న విద్యార్థి కార్యకర్తలను నిర్బంధించినప్పటి నుండి జూలై 18 వరకు, నజారియా మ్యాగజైన్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఫేస్ బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో అలాగే దాని వెబ్ సైట్ లో విడుదల చేయాలని పిలుపులు ఉన్నాయి. అయితే, వారి ఫేస్‌బుక్ పేజీలో చివరి పోస్ట్ జూలై 18న ఉంది.

జూలై 19న రుద్రను నిర్బంధించిన తరువాత, ఏ సోషల్ మీడియాలోనూ పోస్టులు లేవు.

నిర్బంధించిన విద్యార్థులను జూలై 16 – జూలై 21 మధ్య దశలవారీగా విడుదల చేశారు. ఎనిమిది రోజుల నిర్బంధం తరువాత, జూలై 16 రాత్రి విడుదలైన మొదటి వ్యక్తి గురుకిరట్. ఆమె విడుదలైన తర్వాతే బయటి ప్రపంచానికి ఈ కేసు గురించి, ఇతర విద్యార్థుల నిర్బంధం గురించి ఖచ్చితమైన సమాచారం అందింది.

మరుసటి రోజు, జూలై 17న, లక్షితా, గౌరవ్, గౌరంగ్‌లు విడుదలయ్యారు. అత్యంత తీవ్రమైన శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్న ఎత్‌మామ్ జూలై 18న విడుదలయ్యాడు. హర్యానాలో అరెస్టయిన సామ్రాట్‌ను జూలై 17న విడుదల చేశారు. చివరగా, రుద్రను జులై 21న విడుదల చేశారు.

బిఎస్‌సిఇఎమ్ విద్యార్థులను నిర్బంధించడం ఇదే మొదటిసారి కాదు.

గత ఏడాది మేలో లోక్ సభ ఎన్నికల సమయంలో బిఎస్‌సిఇఎమ్ ఢిల్లీలో గోడ రాతల ద్వారా ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. సంస్థకు చెందిన ఇద్దరు మహిళా విద్యార్థులు, లక్షితా, ఉత్తరలను పరీక్ష రాసి కాలేజీ నుండి వెళ్తున్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని నెలల క్రితం, బస్తర్ లో జరుగుతున్న దురాగతాలను వర్ణిస్తూ జెఎన్‌యులో గోడల మీద నినాదాలను రాసిన తర్వాత, నలుగురు సభ్యులు-గౌరవ్, గౌరంగ్, కిరణ్, రాహుల్-లను ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో 15 గంటల పాటు చట్టవిరుద్ధంగా నిర్బంధించారని, కొట్టారని కూడా బిఎస్‌సిఇఎమ్‌తో సభ్యులు ఆరోపించారు.

ది వైర్ ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసింది కానీ ఎలాంటి స్పందనా లేదు.

2025 ఆగస్టు 01

https://thewire.in/rights/beaten-with-leather-whip-members-of-student-groups-allege-harrowing-torture-in-detention-by-delhi-police-special-cell

Leave a Reply