నిన్న (14 సెప్టెంబర్) యాప్రాల్ వెళ్లి పాండన్న మృతదేహాన్ని చూసినప్పుడు దుఃఖం ఆగలేదు. చెదరని చిరునవ్వు మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. అసలు ఏ ఆనవాలు కనిపించలేదు. ప్రభుత్వాల అమానవీయతకు, దిగజారుడుతనానికి ఇంతకంటే చేయడానికి ఇంకేమీ మిగిలివుంది గనుక.

1985 ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిన తమ్ముడి చిన్నప్పటి మొఖం మాత్రమే తోబుట్టువులకు గుర్తు. 40 ఏండ్ల తర్వాత నిర్జీవమై వచ్చిన తమ్ముడిని చూసుకుందామంటే… అక్కడ కుళ్లిపోయిన మాంసపుముద్ద తప్ప మరేమీ లేదు. వారి దుఃఖం చెప్పనలవి కాదు. పాండన్న అక్క, చెల్లెలు ప్రతి ఒక్కరు మాట్లాడేదాన్ని శ్రద్ధగా వింటున్నారు. దుఃఖపడుతూనే తమ్ముడి గురించిన జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు.
పాండన్న 1967లో పుట్టాడు. పాండన్నకు ఒక అక్క, ఒక చెల్లెలు వున్నారు. చెల్లెలు పుట్టగానే తల్లి లచ్చువమ్మ చనిపోయింది. తండ్రి నర్సింహ అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. పాండన్న నాయనమ్మ రామక్క దగ్గరే పెరిగాడు. చాకలి వృత్తినే జీవనాధారం. నాయనమ్మతో పాటు తను కాయకష్టం చేసినప్పటికీ తిండికి గడవడం కూడా కష్టంగా వుండేది.
7వ తరగతి వరకు యాప్రాల్‌లో చదివాడు. ఆ తర్వాత తిరుమలగిరిలోని లాల్‌బజార్ బాయ్స్ స్కూల్లో చదివాడు. 1982-83లో టెన్త్ పరీక్షలు రాసాడు. టెన్త్ తర్వాత జేఎన్ఎం కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ప్రారంభించాడు. 1984లో జరిగిన పొలిటికల్ క్లాసుల్లో పాల్గొన్నాడు. గ్రామాలకు తరలండి క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్నాడు. తన పని తీరును, నేర్చుకోవాలనే జిజ్ఞసను పరిశీలించి జేఎన్ఎం సిటీ కమిటీలోకి తీసుకున్నారు. పాణిగ్రాహి రాసిన ‘కమ్యూనిస్టులం మేం కష్టజీవులం’ పాటను, గద్దర్ రాసిన ‘ఏం బతుకులు మనయిరో అన్నల్లారా తమ్ముల్లారా చెల్లెల్లారా/ యముని రాజ్యమ్మురో అన్నల్లారా తమ్ముల్లారా చెల్లెల్లారా’ పాటను ఇష్టంగా పాడేవాడు. చెరబండరాజు పాట ‘కొండలు పగలేసినం’లో నటించాడు. ‘రగల్‌జెండా’ బ్యాలేలో గోండు వ్యక్తి పాత్రలో జీవించేవాడు. 1985లో పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి చివరి క్షణం వరకు తను ఎన్నడూ ఇంటి ముఖం చూడలేదు.
నేను మొదటిసారి పాండన్నను ఎప్పుడు చూసాను? గుర్తులేదు. చూడగానే ఆకట్టుకోలేడు. తనకు తానుగా వచ్చి పలకరించకపోయేవాడు. కానీ ఏదైనా అవసరం వస్తే పక్కన వుండేది తనే. అందరిలో ఒకడిలా పనిచేసుకుంటూ వుండేవాడు. తన వ్యక్తిత్వము, పనితీరు, తోటి కామ్రేడ్స్‌తో, ప్రజలతో అతను వుండే పద్ధతి చూశాక ఇక ఎన్నటికీ మరుపునకు రాలేదు పాండన్న. నేను బయటకు వచ్చినా కొందరు కామ్రేడ్స్ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తుండేవారు. వాళ్ల వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకున్నది. అందువల్లే ఊర్మిళ గురించి (పెళ్లి), పాండన్నతో దగ్గరగా వున్న ఆ నాలుగు రోజుల ప్రయాణాన్ని (గొడ్డును కాను) గురించి కథలుగా రాసాను. (‘గొడ్డును కాను’ కథ ఆదివాసీ అమ్మాయి ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం కూడా. కానీ అందులో మా ప్రయాణం వుంది. అందులోని పాత్రలన్నీ సజీవమైనవి, పేర్లతో సహా.)
సరే, 1996 డిసెంబర్ 6న దండకారణ్యంలో అడుగుపెట్టాము నేను, మంజీర (మఠం రవికుమార్). కొద్ది రోజులకే పాండన్న కలిసాడు. అబూజ్మాడ్ అంటే అక్కడ పాండన్న తప్పక వుంటాడు. అప్పటికే పాండన్న జిల్లా కమిటీ మెంబర్. కానీ పాండన్నను చూసినప్పుడు ఆ స్థాయి కామ్రేడ్ అనుకోలేదు. స్థాయినే కాదు, అసలు గైర్ఆదివాసీ అని కూడా అనుకోలేదు.
దళాల్లో ఆదివాసీ కామ్రేడ్స్ బయటివాళ్లలాగే తెలుగు మాట్లాడేవారు. అంత తొందరగా, అంత స్పష్టంగా వారికి తెలుగు ఎట్లా పట్టుబడేదో (సాధారణంగా ఆదివాసీ కామ్రేడ్స్‌కు గోండీ, ఛత్తీస్‌గడీ, అల్బీ, హిందీతో పాటు దళంలోకి వచ్చిన వారికి తెలుగు వచ్చేది)! అందువల్లనే పాండన్న కూడా తెలుగు మాట్లాడినా ఆదివాసీ కామ్రేడే అనుకున్నా. కొన్ని రోజుల్లోనే అర్థమైంది – తను జిల్లాకమిటీ మెంబర్ అని, తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన వాడని.
తెలుగువాళ్లు గోండీ మాట్లాడినప్పటికీ గొంతులో పలికే ఒకలాంటి మెలికను (స్లాంగ్‌ను) బట్టి బయటివాళ్లని ఆదివాసీలు గుర్తుపడతారు. కానీ పాండన్న గోండీ మాట్లాడితే మాత్రం అట్లా గుర్తుపట్టడం కష్టం.
అబూజ్మాడ్ అడవి చాలా చిక్కటి అడవి. కొంచెం పక్కకు వెళితే మళ్లీ దారి కనుక్కోవడం కష్టం. కానీ పాండన్నకు ఆ అడవి దారులన్నీ కొట్టిన పిండి. అడవిలో ఎక్కడ వదిలినా దారి తెలుసుకోగలడు. అడవి మీద అంత పట్టు.
పాండన్న వచ్చిండంటే పిల్లలు చుట్టూ మూగేవారు. ఆడవాళ్లు తమ సమస్యలను చెప్పుకునేవారు. మిగతా ప్రజల గురించి చెప్పాల్సిన పనిలేదు. జనరల్‌గా ఆదివాసీ మహిళలు జాకెట్లు ధరించరు. మోకాళ్ల వరకు ఒక కండువాను చుట్టుకుంటారు, మరో కండువాను పైటలాగ వేసుకుంటారు. ఈ పైటకండువా గురించి అంత పట్టింపు కూడా వుండేది కాదు వారికి. బయటివారు అది ఆడవాళ్లయినా, మగవాళ్లయినా కనిపించగానే పైకండువాను సరిచేసుకునేవారు. సాధారణంగా ఆదివాసీ మహిళలు ఎక్కువగా మాట్లాడేవారు కూడా కాదు. కానీ పాండన్నతో మాట్లాడేటప్పుడు తమ అన్నతోనో తమ్ముడితోనో తండ్రితోనో మాట్లాడుతున్నట్టుగా సహజసిద్ధంగా వుండేవారు. పాండన్న దగ్గర కొట్లాడేవాళ్లు. పాండన్న మావాడు, మా హక్కు అన్నట్టుగా వుండేది వారి ప్రవర్తన. పాండన్న కూడా ప్రతి ఊరు తను పుట్టిన వూరే అన్నట్టుగా వుండేవాడు. పాండన్నకు, ప్రజలకు వున్న ఈ కామ్రేడ్లీ అనుబంధం నాకు అద్భుతంగా, ముచ్చటగా అనిపించేది.
ఎట్లా గుర్తు పెట్టుకునేవాడో తెలియదు కానీ ఏ గ్రామానికి వెళ్లినా వృద్ధుల దగ్గరి నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరిని వారి వారి పేర్లతోనే పలకరించేవాడు. పాండన్న వస్తే ఆ ఊరికి ఆ రోజు పండగే. పార్టీ అంటే పాండన్ననే అన్నట్టుగా వుండేది.
అబూజ్‌మాడ్‌లో జనరల్‌గా కొహల (కొర్రలు లేదా ఉడిపిళ్ల లాంటి) అన్నం దొరుకుతుంది. ఎవరైనా వరన్నం తీసుకొస్తే వేరే కామ్రేడ్స్‌కి ఇచ్చేవాడు. ఏ సౌకర్యం అయినా అందరికి అందిన తర్వాతే తను పొందేవాడు. ఏ కామ్రేడ్ అయినా ఏదైనా అవసరంలో వున్నప్పుడు సహాయం చెయ్యడానికి ఎప్పుడూ ముందుండేవాడు.
తను జిల్లా కమిటీ మెంబర్ అయినా ఎక్కడా తన హోదాని గుర్తుపట్టలేము. అంతలా తోటి కామ్రేడ్స్‌తో కలిసిపోయేవాడు. పనులు చెప్పడం తక్కువ, చేయడమే ఎక్కువ. ఎవరైనా జబ్బుపడ్డా తను నిరంతరం వారిని కనిపెట్టుకుని వుండేవాడు. అల్లోపతి వైద్యం బాగా తెలిసినవాడు. ఎంత పని చేసినా అలసట అనేది వుండేది కాదు. ఎప్పుడూ చిరునవ్వుతోనే వుండేది తన మొఖం – తన సొంత పేరు చంద్రహాస్ లాగా. అందరూ పడిపోతే తను లేచి చేసేవాడు. తను పైస్థాయి నాయకుడిని అనేది ఇసుమంత కూడా వుండేది కాదు. అన్నన్ని గంటలు నడిచీ, ఇన్ని పనులు చేసీ… ఊరి జనం వస్తే అదే చిరునవ్వుతో మాట్లాడేవాడు. ఒకసారి ఓ ఊరికి పోతే, ఆ ఊర్లో జబ్బుపడిన మనిషికి మందులిచ్చి, నెక్ట్స్ టైమ్ పోయినప్పుడు గుర్తుపెట్టుకుని మరీ వారిని పలకరించేవాడు. సదరు వ్యక్తి రాకపోతే అతనికి/ఆమెకి ఇప్పుడెలా వుంది అని అడిగి తెలుసుకునేవాడు. ఇంత ఓపిక ఈ మనిషికి ఎక్కడి నుంచి వస్తది అనుకునేదాన్ని.
అందువల్లనే కావచ్చు పాండన్నను ఆదివాసీ ప్రజలు తమలో కలిపేసుకున్నారు. తమలో ఒకడిగా భావించారు.
అబూజ్మాడ్కి పార్టీ విస్తరించాలనుకున్నప్పుడు దక్షిణ బస్తర్ నుంచి చిన్నన్న కమాండర్‌గా, పాండన్న డిప్యూటీ కమాండర్‌గా ఒక దళాన్ని, అలాగే గఢ్చిరోలి ప్రాంతం నుంచి మరో దళాన్ని బహుశా 1988 లేదా 1989 ప్రాంతంలో పార్టీ పంపింది. అక్కడి తిండికి అలవాటుపడలేకపోవడం, మరితర కారణాల వల్ల దక్షిణబస్తర్ నుంచి వచ్చిన దళ కమాండర్ చిన్నన్న, గఢ్చిరోలి నుంచి వచ్చిన దళ కమాండర్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. అలాగే కొంత మంది దళసభ్యులు కూడా వెళ్లిపోవడంతో ఈ రెండు దళాలను కలిపి ఒకే దళంగా ఏర్పాటు చేసి, పాండన్నను కమాండర్‌గా నియమించింది పార్టీ.
ప్రజలు పెట్టింది తింటూ, తాగుతూ అక్కడి చలిని, వానను తట్టుకుంటూ ఆదివాసీల్లో ఆదివాసీగా కలిసిపోయాడు. అప్పుడప్పుడే దళం నిలదొక్కుకుంటోంది. ఆ కాలంలోనే (1989) దళంపై మొదటిసారి ఫైరింగ్ జరిగింది. ఇద్దరు కామ్రేడ్స్ అమరులయ్యారు. ఆ సందర్భంలో పాండన్న… దళం కామ్రేడ్స్‌లో ధైర్యం నింపి, వారిని నిలబెట్టాడు.
బయటి నుంచి మాడ్కి వచ్చిన, కొత్తగా పార్టీలోకి రిక్రూట్ అయిన కామ్రేడ్స్‌ని నిలబెట్టుకోవడంలో చాలా కృషిచేసేవాడు. వారిని ఎప్పుడూ కనిపెట్టుకుని వుంటూ, వారి అవసరాలను పట్టించుకునేవాడు. బయటి నుంచి వెళ్లినవారికి అడవిని, ఆదివాసీలను చెప్పీ చెప్పకనే పరిచయం చేసేవాడు.
1991-93 ప్రాంతంలో ఆదివాసీ కామ్రేడ్ కౌసల్య, తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నట్టుగా వుండేవారు. ఇద్దరూ తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. వాళ్లిద్దరు మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ.
2002లో మాడ్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఎన్నికయ్యాడు పాండన్నా. 2003లో జరిగిన డి.కె. ప్లీనంలో ఎస్‌జడ్‌సీ మెంబర్‌గా, 2006లో ఎస్‌జడ్‌సీ సెక్రటేరియట్ మెంబర్‌గా ఎన్నికయ్యాడు.
2009లో ఒరిస్సా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసింది పార్టీ. అప్పటి నుంచి గరియాబాద్ ప్రాంతంలో అమరుడయ్యే (11 సెప్టెంబర్ 2025) నాటి వరకు ఒరిస్సా రాష్ట్రంలోనే పనిచేశాడు.
1985లో పూర్తికాలం కార్యకర్తగా హైదరాబాద్‌ను విడిస్తే… తన వారిని చూసుకోవడానికి ఎన్నడూ రాలేదు పాండన్న. ఎందుకనో నోరు తెరిచి ఇది కావాలని అడిగేవాడు కాదు.
చిన్నతనం నుంచి తను అమరుడయ్యే చివరి క్షణం వరకు పనీ పని… అలుపెరుగని యోధుడు.
చెదరని నవ్వుకు, సడలని దీక్షకు చిరునామా పాండన్న!
నీ ఆశయాన్ని ప్రజలెన్నడూ మరువరు పాండన్న!!