నల్లింకు పెన్నుతో పరిచయమైన రచయిత హథీరామ్ సభావట్, తనలోని ఎన్నో ఆవేదనలను అక్షరీకరించి, మళ్ళీ తన బలమైన గొంతును వినిపించేందుకు ధిక్కార పతాకమై ఎగిరే “నీలం రంగు నది”ని మన ముందుకు తెచ్చారు. ఇందులోని ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. ఆదివాసీ గూడాల గుండెలలో రగులుతున్న ఆవేదనను… పాలస్తీనా, సూడాన్ వంటి ప్రపంచ దేశాలలో జరుగుతున్న మానవ హననాన్ని… ప్రకృతిని దోచుకుంటున్న రాజ్యపు అహంకారాన్ని…. మనుగడ కాన్వాస్ పై రక్తపు మరకలతో యుద్ధం చిత్రించిన దృశ్యాలను… ఎన్నింటినో రచయిత తన కవిత్వంతో మన కళ్ళ ముందుంచారు.

నది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి. ఆ ప్రకృతితో మమేకమై జీవనం సాగించే కోట్లకొద్దీ జీవరాశులు… ఎన్నో రకాల జీవజాతులతో పాటు, మానవ మనుగడకు కారణమైన ఈ నదీ తీరాల్లోనే నాగరికత పురుడోసుకుంది. ప్రకృతి వనరులను వినియోగించుకుంటూ, మనిషి జీవనం సాగించడం నేర్చుకున్నాడు. కానీ కొన్నేళ్లకు కొన్ని ఆధిపత్య, అహంకార విత్తనాలు మొలకెత్తాయి. ఆ విత్తనాలిప్పుడు వృక్షాలై, తన మనుగడకు కారణమైన ప్రకృతినే పాడుచేస్తున్నాయని రచయిత తన ఆవేదనను, అక్షరాలను ఈ పుస్తకంలో కవిత్వీకరించారు. ఆ విష వృక్షాలు భూమి పొరలలోకి తమ వేర్లను చొప్పించడమే కాకుండా స్వచ్ఛమైన నదులనీ, వాటి రంగులనూ మార్చాయని ఆవేదన చెందుతూనే, మనల ఆలోచన చేయమంటారు. అలా నీలం రంగులోకి మారిన నదిని, దానిలో దాగిన ఎర్రటి రక్తపు ధారలను, యుద్ధపు ఆకాశంలో ఆపిల్ పండ్లలా వేలాడుతున్న మాంసపు ముద్దల దృశ్యాలను రచయిత మన కళ్ళముందుంచుతారు. ప్రకృతి తన పొత్తిళ్ళలో పదిలంగా దాచుకున్న ఆదివాసీ బిడ్డల రక్షణ కోసం, కవిత్వంతో తన స్వరాన్ని ఓ ధిక్కార పతాకంలా ఎగురవేస్తారు రచయిత.

ముగింపు లేని యుద్ధం అనే కవితలో,

“వాళ్ళు వస్తున్నారు

విచ్ఛిన్నమైన తల్లి గర్భంలో

శిథిలమైన జీవిత అవశేషాల కోసం

తిరిగి వస్తున్నారు”

అంటూ యుద్ధం వారి జీవితాలను ఎంత చిన్నా భిన్నం చేసిందో చెప్తారు. యుద్ధం ముగిసిపోలేదని తెలిసినా,

“యుద్ధంలేని ప్రపంచాన్ని ఊహించుకోవడానికి

వాళ్ళు తిరిగి వస్తున్నారు”

అంటూ కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఆవిరై, ప్రపంచమంతా శాంతి కపోతాలు ఎగరాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు.

దేశానికో వాగ్దానం, ఫాస్పరస్ మేకప్, మళ్ళీ నాతో నడుస్తావు కదూ! కవితల్లో… పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ప్రభావితమైన ప్రజలు, పసిపిల్లల దుఃఖాలను తన హృదయంలో మోస్తారు.

“నా ప్రేమను మళ్ళీ మళ్ళీ ప్రకటించుకోవడానికి

కోట్ల గులాబీలను తీసుకొచ్చాను

నిలబడి నీకివ్వడానికి

కాసింత నేలే కరువైందిక్కడ”

అంటూ యుద్ధం వల్ల నిలువ నీడ లేకుండా అయిన జోర్డాన్ నది ఒడ్డున బతుకుతున్న ప్రజల దుఃఖం, నిస్సహాయత పట్ల తన బాధను వ్యక్తపరుస్తారు. వారి మాటలు వినాలన్న ఆశతో, తన సొంత దేశంలోనే శరణార్థినయ్యానని చెబుతారు.

“మమ్మల్ని మనుషులుగా గుర్తించే

తెల్లని వాకిళ్ళ కోసం బయలుదేరాము”

అని పసి హృదయాల వేదనను మన కళ్ళకు కడతారు.

“ఈ నగరపు శిథిలాల మధ్య

స్వేచ్ఛా కపోతాలను ఎగరేస్తూ

శాంతి స్వప్నాలమవ్వడానికి”

మళ్ళీ నాతో నడుస్తావు కదూ!”

అంటూ రచయిత తన యెనిసీని అడుగుతారు.

ప్రేమ పరిమళం కవితలో

“దేశాన్ని దశల వారీగా తెగ్గోస్తున్న

వాళ్ళ కత్తుల కొనల మీద

మనుషుల బొమ్మలేసుకుంటూ పోదాం

పసిపిల్లల నవ్వుల ముద్రలేసుకుంటూ వెళ్దాం…”

అంటూ దేశంలో పెరుగుతున్న మత విద్వేషాల పట్ల నిరసనను వ్యక్తం చేస్తారు. వాళ్ళు ద్వేషాన్నే పెంచినా, మనం ప్రేమ పూలను విరబూయిద్దాం అంటారు. కత్తుల కొనల మీద మనుషుల బొమ్మలేద్దామని ఒక శక్తివంతమైన పిలుపునిస్తారు.

తూజ్ మార్ తాండేర్ రాణి… (నువ్వే నా తండా రాణి) కవితలో

“హృదయాలు ముక్కలయ్యేలోపు

మనుషులు స్మృతులై మిగలక ముందే

ఓసారి అలా తీసుకెళ్లొచ్చు కదా!”

అని తన ప్రేయసి అడిగితే, ఏవో కథలల్లి తండా గురించి గొప్పగా చెప్పినా, తమ జీవితాల్లోని వ్యథలను, రాజకీయాల వల్ల దెబ్బతిన్న వాతావరణం గురించి లోలోనే కుమిలిపోతారు రచయిత.

కాశ్మీర్ ఫైల్స్ కవితలో

“వాళ్ళు

మా కన్నీళ్లేవీ కనిపించొద్దని

నైట్రస్ ఆక్సైడ్ పిచికారీ చేసే వెళ్ళారు”

అంటూ కాశ్మీరీల కన్నీళ్లను కనిపించకుండా చేసి, దేశాన్ని ఒక్కటి చేసినట్టు రాజ్యం జబ్బలు చరచుకుంటుందని రచయిత విమర్శిస్తారు.

సబ్ కో ఉటా దేంగే కవితలో

“సబ్ కో ఉటా దేంగే

అన్నంత తెలీక కాదు

చిద్రమైపోతున్న

బాల్యాన్ని, పువ్వుల్ని చూసి తట్టుకోవడం”

అంటూ మనుషుల పట్ల తనకున్న ప్రేమను చాటుతూనే,  యుద్ధమనేది మానవ మనుగడకే ప్రమాదమని రచయిత హెచ్చరిస్తారు.

తుడుం దెబ్బల మోత  కవితలో

అమ్మ

“నా ఎద పలక మీద

తుపాకీ మోతలకీ తుడుం దెబ్బలకీ

తేడాను రాస్తుంది

శబ్దానికీ శబ్దానికీ మధ్య

ఓ చిన్న విభజన రేఖను గీస్తుంది”

అంటూ అడవిలో ఆదివాసీల జీవితాలు మొత్తం తుపాకీ మోతల శబ్దాలతో ప్రతిధ్వనిస్తున్నాయని ఆవేదన చెందుతారు. పరాన్న బుక్కులు కవితలో

“పచ్చగా ఏది కనిపించినా

వారి కండ్లు ఎరుపెక్కుతాయి

బుల్డోజర్ల ప్రవాహం మొదలౌతుంది”

అని అధికారంలో ఉన్న వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాలతో అడవిని, అలాగే ప్రకృతిని ఎలా పాడు చేస్తున్నారో చెబుతారు.

“మనిషికై నిలబడిన చెట్టు కోసం

నేల తరుపున నిలబడేందుకు

పిడికిళ్లను ఎత్తుకోమ్మా!”

అని రాజ్యపు అహంకార చర్యలకు ఎదురొడ్డి నిలవమని రచయిత పిలుపునిస్తారు.

ఏ కాకి ఎగరావద్దు కవితలో

“ఆదివాసులం మేము

మూలవాసులం మేము

మేమంతా చస్తుంటే ఎంతసేపూ…

రాజ్యాంగం కాలరాయబడుతుందని మొత్తుకుంటున్నారే!”

అంటూ తమ ఉనికిని కోల్పోతున్నా, ఎవరూ కనికరం చూపట్లేదే అని ఆవేదన చెందుతారు. తాము ఈ మట్టికే చెందిన వారిమని మరోసారి గుర్తుచేశారు. నక్సలైట్లనీ, తీవ్రవాదులనీ మమ్ముల చంపేస్తున్నారు, కానీ మేము ఆదివాసులమనీ, ఈ దేశ మూలవాసులమనీ బలంగా  గొంతెత్తి చాటుతారు రచయిత.

రచయితకు ఎంత ప్రేమో మనుషులంటే. అందుకే Anti – Blast Coating కవితలో, దేశమంతా మానవత్వపు లేపనాన్ని పూసేద్దాం అంటారు. వ్యక్తిగతంగా తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను I am prohibited కవితలో పొందుపరిచారు. సీక్వాడి కవితలో తన మాతృభాషే తన అస్థిత్వమని ప్రకటిస్తారు. నలుగురి గుర్తింపు అక్కర లేదు, మా స్వరమొక్కటి చాలు అని రచయిత తన భాష పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు.

ఇలాంటి ఇంకెన్నో అద్భుతమైన కవితలను నీలం రంగు నది తనలో దాచుకుంది. ఎన్నో యుద్ధ విధ్వంసాలను, ఆదివాసీల ఆవేదనలను, అధికారపు ముసుగులో రాజ్యం చేస్తున్న అకృత్యాలను… తన భాషపై, అస్తిత్వంపై, మనుషులపై రచయిత ప్రేమనూ, ఆవేదననూ, ఆలోచనలనూ తనలో నింపుకుంది… రాతలపై కంచెలు విధిస్తున్నా, ప్రశ్నించడమే మానవ మనుగడకు పునాది అని అంటూ, మాటలను  సంధించండి, మాటలను ప్రయోగించండి అని చెప్తున్న క‌వి  హతీరాం సభావట్ కు శుభాభినందనలు…

Leave a Reply