ప్రజలు చనిపోతుంటే 
ఇక విజేతలెవరు

ఏ అబద్ధమూ
బుల్లెట్ గాయాల్ని దాచలేదు
బుల్లెట్లతో జల్లెడైన శరీరాలే
సత్యానికి నిష్ఠుర సాక్షాలు

మా జీవితాలు కుప్పకూలిపోతుంటే
ఎవరూ విజేతలు కాలేరు

ప్రజలకు ఊపిరాడనిచోట
మమ్మా
నీకు సింహాసనం
వారసత్వం గావొచ్చుగాని
మాకది గుండెలో ముల్లు.

నీ బిడ్డలు
శవాలకుప్పలవుతుంటే
నిన్ను ఇంకా
మమ్మా అని పిలువ మంటావా

నువ్వు గెలవలేదు
నీకు నువ్వే ఎన్నికైనావు
నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు

దారి పొడుగునా నీ ఫ్లెక్సీ లకు
నిన్నెవరు బాధ్యుల్ని చేస్తారో తెలియదు

నువ్వు గెలవలేదు
ప్రజల్ని కోల్పోయావు
ఆఫ్రికాని కోల్పోయావు
మొత్తం ప్రపంచాన్నే కోల్పోయావు

నువ్వు ఏమిటో మాకు స్పష్టం
స్వార్థం, అహం
ప్రజల్ని పాదాక్రాంతులు చేసుకొనే
నీ నియంతృత్వం మాకు స్పష్టం .

డైమండ్
నీ గురించి
వందలాది బంగారు పాటలే పాడొచ్చు
కానీ ప్రజల హృదయాల్లో నువ్వు లేవు

నాయకత్వం
అంటే పనే కాదు
ప్రజలు కూడా

ప్రజాభీష్టాలు లెక్కలు చేయని
నిన్ను నాయకురాలని ఎలా అనేది

గతించిన నియంతల
నయా నమూనావి నువ్వు
వాళ్ళలాగే
నువ్వూ అంత మొందాల్సిందే ..
**

మూలం ...ముఫాసా, కవి

మమ్మా... టాన్జానియా నియంత

డైమండ్... టాంజానియా లో ఖనిజ సంపద

Leave a Reply