ఈ నేల నేలంతా దుఃఖ 
నదులే ప్రవహించి ఉండవచ్చు
అద్భుతమైన మనుషులు కొందరు
మాయమై ఇక కనిపించకనూ పోవచ్చు
కానీ
మరుక్షణం నుంచే కదా
వాళ్ళు మన హృదయాల్లో
పురుడు పోసు కుంటున్నది

వాని రక్తపు కూటి ఏలుబడికి
స్మశాన వైరాగ్యమే
వినబడుతూ ఉండవచ్చు
అవకాశవాదాలై కొన్నైనా
భిన్న స్వరాలు పురివిప్పనూ వచ్చు
చరిత్రకు ఇది కొత్తేమీ కాదుకద!

తరతరాల దుఃఖపు కన్నీటి బిందువులే
ప్రవహించీ ప్రవహించీ
అనంతమైన సముద్రమయ్యాక
అనితరమైన అమరత్వమే కదా
ఆవిరై మేఘమై
పునరావృత మయ్యేది

ప్రతీఘాతానికి
ఓటమి లేనిదెన్నడు?
దొంగ దెబ్బలు దగ్గరి దారులు
గమ్యానికి చేర్చిందెప్పుడు

ఈ చీకటికి చెల్లుచీటీ
నమోదు చేయడమే
కదా చరిత్రంటే,

ఇంత నిరంతరాయంగా జరిగే
సజీవ ఆచరణను ఆపగలిగేదెవ్వడు?

Leave a Reply