మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత  దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్‌ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాద రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్‌లోను, ఇటు ఇజ్రాయెల్‌లోనూ వందలాదిమంది మరణించారు. వీరిలో స్వప్నాలు చిధ్రమై, బతుకులు అస్తవ్యస్తమై, శిధిలమై రోడ్డున పడ్డ బాధితులెందరో! ఇంత జరిగినా తర్వాత కూడా మానవాళికి ముప్పు తొలగిందా అంటే లేదనే చెప్పాలి. దీనికి కారణం సామ్రాజ్యవాద బరితెగింపే.

                మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి అమెరికా ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా అగ్ర రాజ్యంగా ఎదిగింది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలైంది. కొన్నిచోట్ల ఘర్షణలకు కూడ దిగింది. అమెరికా సామ్రాజ్యవాదం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, ఆ దేశాల్లో తమను వ్యతిరేకించే పాలకులను తొలగించటంతో పాటు, ఆ దేశాల్లో కల్లోలాలు సృష్టించింది. 1893లో హవారులో రాచరికాన్ని కూలదోయడం మొదలు 2003లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను చంపటం, ఆఫ్ఘాన్‌ పరిణామాలు, నేటి సిరియా, పాలస్తీనా ఉత్రిక్తతలు మొత్తంగా అమెరికా ఇతర దేశాలలో సైనిక జోక్యం చేసుకున్నా సందర్భాలు 150కి పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కన్ను పశ్చిమాసియాపై పడిరది. అక్కడ ఉన్న చమురు, ఇతర వనరులు దోచుకోవటం లక్ష్యంగా పెట్టుకొని, పశ్చిమాసియాలో తన కీలుబొమ్మ దేశంగా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించి 1948లో ఇజ్రాయెల్‌ను అక్రమంగా ఏర్పాటు చేసింది. అప్పటినుండి పశ్చిమాసియాలో రక్తపాతం సృష్టిస్తున్నది. పాలస్తీనాలో జాతి హననానికి కూడా కారణమైంది. పశ్చిమాసియాలో ముడి చమురు, ఖనిజ వనరులు, మంచి రవాణా మార్గాలు, అటవీ సంపదల కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్‌ ఎగుమతి దిగుమతులకు, ప్రపంచ వాణిజ్యానికి ఆయుపట్టు. ఈ దేశాల మార్కెట్లను కొల్లగొట్టి తన రాజకీయ, ఆర్థిక అవసరాలు తీర్చుకోవటం కోసమే ఈ మారణకాండ.

                విదేశాల్లో తనకు ఏమాత్రం అధికారం లేనిచోట తన అవసరాల కోసం అమెరికా ప్రభుత్వం తనకు అనుకూల దేశాలను సృష్టించుకొని, అమెరికా ప్రభుత్వాలు పరాయి దేశాల మీద, ప్రభుత్వ నేతల మీద, ఆ దేశ ప్రజల మీద, ప్రజా సంస్కృతుల మీద దాడులు, యుద్ధాలు చేస్తున్నది. అలాగే ఆయా దేశాల సామాజిక, ఆర్థిక రాజకీయ వ్యవస్థలను చిన్నాభిన్నం గావిస్తున్నది. అసలు అమెరికా పాలకుల విదేశాంగ నీతే అది. ఇతర దేశాలు ప్రాంతాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాలు తీర్చాలని అనుకునే విదేశాంగ నీతి. ఇదంతా బహుళజాతి సంస్థల సామ్రాజ్యవాదం రాజకీయ ప్రయోజనాలు కాపాడే వ్యూహం. ప్రపంచంలో మరే దేశము ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు. ప్రపంచంలోని సకల వనరులు, సంపద మొత్తం అమెరికన్‌ బడా బాబులకు దక్కాలి. భూగోళం ఏ మూలైన మనిషి నెత్తురు, చెమట డబ్బుగా మారి అది డాలర్‌గా వారి చెంతకు చేరాలనేదే అమెరికా కుటిల రాజనీతి.                                 రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం మూడు శతాబ్ధాల్లో కూలిపోయిందేమో గాని, ఎప్పటికి కూలిపోని రవి అస్తమించని అమెరికన్‌ కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, కాపాడాలి. ఇదే అమెరికా లక్ష్యం. అందుకోసం ప్రపంచం మీద ఎంత ఆకలిని, రోగాన్ని, దుఃఖాన్ని, అసమానతలను, దోపిడీని, పీడనను, హింసను రుదినా అదంతా విదేశాంగ నీతి అవుతుంది. ఇదే అమెరికా విదేశాంగ విధానం. ఈ దుర్మార్గం కోసం అమెరికా పాలకులు ఎంతో ఖర్చు చేస్తారు. నిజానికి అమెరికా ఎంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అయినా సరే యుద్ధాల కోసం భారీగానే ఖర్చు చేస్తున్నది. ప్రపంచాన్ని గాయపరుస్తున్నది. ఆయుధాలు అమ్ముకుంటారు. పేద ప్రజల రక్తంతో హోలీ ఆడుకుంటారు. ఇంత నీచమైన ఈ అమెరికన్‌ ప్రవృత్తి సామ్రాజ్యవాదం విష సంస్కృతిలో భాగమని మనం గ్రహించాలి. నేడు పాలస్తీనాలో ప్రతి అంగుళం ప్రజల రక్తం, కన్నీరుతో తడిసింది. పాలస్తీనా ప్రజలు తమ జన్మభూమిలో నిర్వాసితులుగా మారి, వారి మాతృభూమి కోసం పోరాడుతున్నారు. ఈ పాపం అమెరికాదే.

                రెండో ప్రపంచ యుద్ధం చివరలో శాంతి చర్చలకు జపాన్‌ సిద్ధపడినప్పటికీ దానిపై అణ్వాయుధాలను ఉపయోగించిన ఏకైక దేశం అమెరికాయే. ఇప్పుడు ఆ దేశమే అణ్వాయుధ ముప్పు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఏ విధంగా చూసినప్పటికీ ఇరాన్‌పై అమెరికా దాడి ఘర్షణలను తీవ్రతరం చేస్తుంది. అంతర్జాతీయ శాంతి పైన, సాధారణ ప్రజల జీవనోపాధి మీద వినాశకరమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల కోసం, వలస కార్మికులకు అవకాశాల కోసం పశ్చిమాసియపై ఎక్కువగా ఆధారపడుతున్న భారత్‌ వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా, ఇజ్రాయెల్‌ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని విడనాడి యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలలో భాగస్వామిగా చేరాలి. సామ్రాజ్యవాద దురాక్రమణ చర్యకు వ్యతిరేకంగా వెంటనే నిరసనలు చేపట్టాలి.

                పశ్చిమాసియా.. అమెరికాకు ప్రధాన సైనిక అడ్డా. ఎక్కడో ఉన్న ఇరాక్‌, లిబియా, ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగుతుంది.. అసలు ఈ ప్రపంచంలో ఏ ఘర్షణ జరిగినా తాను ఉన్నానంటూ వస్తుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక మరీ చోద్యంగా.. శాంతిదూతగా ప్రపంచానికి కనిపించాలని తాపత్రయ పడుతున్నారు. అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న అని ఎందుకు అంటారో తెలుసా…? 35 ఏళ్లుగా ఏకైక సూపర్‌ పవర్‌గా ఎందుకు నిలుస్తున్నదో తెలుసా? భూమ్మీద ఏమూల ఏం జరిగినా అమెరికా వేలు ఎందుకు పెడుతుందో తెలుసా? అసలు ప్రపంచంలో ఏ దేశానికీ లేనంతగా ఆ దేశానికి విదేశాల్లో ఎన్ని సైనిక స్థావరాలు ఉన్నాయో తెలుసా? 80 ఏళ్ల కిందట తాను అణు బాంబు వేసి సర్వనాశనం చేసిన దేశంలోనే ఇప్పుడు అత్యధికంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయగలగడం అమెరికాకు మాత్రమే సాధ్యమైందని తెలుసా? ఇప్పుడు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా కాలు పెట్టడంతో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాది మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి కారణం… అమెరికా సైనిక స్థావరాన్ని ఆ దేశానికి చెందిన ప్రాంతంలో ఏర్పాటు చేయనీయకపోవడమే అని కథనాలు వచ్చాయి.

 రాజ్యం అనే నిర్మాణంలోనే ఆక్రమణ, యుద్ధం, అణచివేత, దోపిడీ ఇమిడి ఉన్నాయి. రాజ్యం  లక్ష్యం సంపదపై ఆధిపత్యమే కనుక, విధ్వంసం, అమానవీయత అనివార్య ఫలాలుగా మిగిలాయి. రాచరికాలు నశించి, ప్రజాస్వామ్య ఆధునిక భావనలు అభివృద్ధి చెందాక సహజీవనం, సౌభ్రాతృత్వం, సహకారం, సమత వైపు ప్రజలు అడుగులేస్తున్న తరుణంలో ఒక సంవత్సరకాలంగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు చేస్తూ మానవ హననానికి పాల్పడటం దారుణమైన విషయం. ప్రతిరోజు, ప్రతిక్షణం, ఎప్పుడు ప్రాణాలు పోతాయో, ఏ బాంబు పేలుతుందో తెలియని ఆందోళన, నరకయాతనలో యుక్రెయిన్‌ గాజాలోని ప్రజలు అనుభవిస్తున్నారు. సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రజలంతా విలవిల్లాడుతున్నారు. జరుగుతున్న యుద్ధ కారణాలకు వారేమీ సంబంధీకులు కాదు. అందరిలానే బతికే హక్కున్న ప్రజలు. అసలు ఇది యుద్ధమే కాదు. యుద్ధమంటే రెండు పక్షాలూ తలపడాలి. ఇక్కడ ఏకపక్షంగా జరుగుతున్న పాశవిక దాడి మాత్రమే. సామ్రాజ్యవాద నెత్తుటి దాహాన్ని అర్థం చేసుకోవటానికి ఈ వివరాలు చాలు.

పశ్చిమాసియా మరోసారి యుద్ధోన్మాదంలో చిక్కుకున్నది. ఓవైపు గాజా రాచపుండు మాననే లేదు. ఇంతలోనే ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య సంకుల సమరం రాజుకుంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌  గాజా-ఇజ్రాయెల్‌, రష్యా-యుక్రెయిన్‌ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత, వాణిజ్యంపై గణనీయమైన దుష్పరిణామాలను కలిగి ఉంది. ఈ యుద్ధాలు  కేవలం తాజా ఘర్షణల పర్యవసానం కాదు, ఇది అనేక దశాబ్ధాలుగా పాతుకుపోయిన రాజకీయ, మతపరమైన, వ్యూహాత్మక విబేధాల ఫలితం. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య వైరం పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాలకు కీలకమైనది.  ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల మధ్య శత్రుత్వం దశాబ్ధాల కాలం నుంచి కొనసాగుతోంది.1979లో రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్‌ విప్లవంతో ఈ రెండు దేశాల మధ్య  సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దేశాలు బద్ధ శత్రువులుగా మారిపోయాయి. 

ఇస్లామిక్‌ విప్లవానంతరం ఇరాన్‌లో అధికారంలోకి వచ్చిన నేతలు ఇజ్రాయెల్‌ అస్తిత్వాన్నే ప్రశ్నించడం ప్రారంభించారు. ఇజ్రాయెల్‌ ఉనికి పశ్చిమాసియాలో ప్రమాదకరమని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరిట 2025 జూన్‌ 13న దాడులు చేసింది. ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారుచేస్తున్నందుకే దాడులు చేశామంటూ అమెరికా, ఇజ్రాయెల్‌ తమ చర్యను సమర్థించుకుంటున్నాయి.కానీ ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఎఇఎ) డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ గ్రాస్సీ జూన్‌ 19న ఒక ప్రకటన చేస్తూ ఇరాన్‌ ఓ పద్ధతి ప్రకారం అణ్వాయుధాన్ని తయారు చేస్తోందని చెప్పడానికి తమ వద్ద ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేస్తోందని నిర్ధారణకు రావడానికి తమ వద్ద నిర్దిష్ట ఆధారమేదీ లేదని అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు కూడా అంగీకరించాయి. అదీకాక అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై (ఎన్‌పిటి) ఇరాన్‌ సైతం సంతకం చేసింది.

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా 2025 జూన్‌ 22న ప్రవేశించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరుతో ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తిమంతమైన బాంబర్లు, క్షిపణులతో అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. దాదాపు 25 నిమిషాల సేపు మూడు ప్రాంతాలపై అత్యంత శక్తివంతమైన ఏడు బాంబర్లను గురిపెట్టి విధ్వంసానికి పాల్పడిరది. దీనితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ట్రంప్‌ దుందుడుకు చర్యల్ని తీవ్రంగా తప్పు పట్టాయి.  ఇరాన్‌పై అమెరికా  దాడులు ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని, ఐరాస ఛార్జర్‌ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇరాన్‌ అణుస్థావరాలపై దాడిచేసిన అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. దోహా శివార్లలోని అల్‌ ఉదీద్‌ వైమానిక స్థావరం పైకి టెహ్రాన్‌ క్షిపణులు ప్రయోగించింది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు చేసింది.  

ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు పరోక్షంగా సహకారం అందించిన అమెరికా, ఇప్పుడు ఆ ముసుగును తొలగించేసుకుంది. అమెరికా ప్రొద్భలంతో ఇజ్రాయెల్‌ నిన్న మొన్నటి వరకు పాలస్తీనాపై బాంబుల వర్షం కురిపించి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. మధ్యప్రాచ్య దేశాల్లోని చమురు నిక్షేపాలను కైవసం చేసుకోవాలనే అమెరికా దుర్బుద్ధే ఈ యుద్ధాలకు కారణంగా కనిపిస్తుంది. దానికోసమే నిన్న మొన్నటివరకు ఇజ్రాయెల్‌ను ఇరాన్‌పైకి ఉసిగొల్పి, తమతో ఒప్పందం చేసుకొమ్మని ఒత్తిడి తెచ్చారు. దీనికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖొమేనీ అంగీకరించకపోవడంతో నేరుగా ట్రంప్‌ సైన్యం యుద్ధరంగంలోకి దిగింది. ‘ఇరాన్‌ శాంతియుత అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా ఐరాస ఛార్టర్‌, అంతర్జాతీయ చట్టం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్‌పిటి) ఉల్లంఘించింది. ఈ పరిణామాలు అత్యంత దారుణమైనవి.

అత్యంత ప్రమాదకరమైన, అధర్మమైన, నేరపూరిత అమెరికా ప్రవర్తనపై ఐరాసలోని ప్రతి సభ్య దేశం ఆందోళన వ్యక్తం చేయాల్సి ఉంది. చట్టబద్ధంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు ఐరాస ఛార్టర్‌, అందులోని నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇరాన్‌ తన సార్వభౌమాధికారాన్ని, ప్రయోజనాలను, ప్రజలను కాపాడుకునేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది’ అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇరాన్‌ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత అమెరికాయే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్‌ ఇరాన్‌నే కాకుండా అమెరికాను కూడా మోసం చేశారని అబ్బాస్‌ అరగ్చీ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో ఇరాన్‌పై దాడి చేయడం మధ్య ఆసియాపై పెత్తనం చెలాయించేందుకేనని, ప్రపంచాన్ని భయపెట్టేందుకేనని విమర్శించారు. 

ప్రపంచంలో ఇప్పటికే అమెరికాకు 80 దేశాల్లో 750 సైనిక స్థావరాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో భీకరంగా తలపడిన జపాన్‌లోనే 120, జర్మనీలో 119 అమెరికా స్థావరాలు ఉండడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి ఎప్పుడూ ముప్పు ఎదుర్కొనే దక్షిణ కొరియాలో 73 అమెరికా స్థావరాలు ఉన్నాయని కథనం. ఎప్పుడూ యుద్ధ వాతావరణంలో ఉండే పశ్చిమాసియాలో అమెరికాకు 40 వేల మంది సైనికులు ఉండడం గమనార్హం. వీరంతా యుద్ధ నౌకల్లో ఎక్కువగా ఉన్నారు. 19 స్థావరాల్లో మిగిలినవారు ఉన్నారు. ఇజ్రాయెల్‌తో పాటు బహ్రెయిన్‌, ఈజిప్టు, జోర్డాన్‌, కువైట్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, సిరియా, యుఎఇల్లో అమెరికాకు 8 శాశ్వత స్థావరాలు ఉన్నాయి. 1958లో లెబనాన్‌లో కాలుమోపిన అమెరికా తొలిసారిగా పశ్చిమాసియాలో పాగా వేసింది. ఖతర్‌ రాజధాని దోహా శివారు ఏడారిలో 36 ఎకరాల్లో అల్‌ ఉదీద్‌ సైనిక స్థావరం పశ్చిమాసియాలోనే పెద్దది. ఇందులో 10వేల మంది సైనికులు ఉన్నారు.

ప్రపంచ దేశాల మధ్య నెలకొనే యుద్ధాలను నివారించేందుకు ఏర్పడిన ఐక్యరాజ్యసమితి క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయి ప్రకటనలకే పరిమితమై ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. మరోవైపు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పట్ల అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి అణువివక్షకు దారితీస్తున్నది. ఈ చిక్కు సమస్యలు ప్రపంచాన్ని పదేపదే ప్రమాదం అంచులకు తీసుకువెళ్తున్నాయి. హమాస్‌పై యుద్ధం పేరిట గాజాలో జనహననం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు ముకుతాడు వేస్తేనే పశ్చిమాసియా కొంతవరకైనా కుదుట పడుతుంది. సంపూర్ణ అణు నిరాయుధీకరణ సాధించి, సమితిని బలోపేతం చేయడం ఒక్కటే దీనంతటికీ సరైన పరిష్కారం. కానీ, ఆ దిశగా అడుగులు పడకపోవడమే అసలు సమస్య. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, అస్థిరత కొనసాగుతున్న సైనిక ఘర్షణలు మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? కాలమే జవాబు చెప్పాలి. ఒకవేళ ప్రపంచయుద్ధం వస్తే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయా దేశాల శ్రామిక ప్రజల్ని జాతీయ విప్లవానికి సంసిద్ధం చేయడమే నేటి విప్లవ వర్గాల కర్తవ్యంగా ఉంటుంది.

Leave a Reply