నియంత అంతం ఒక కాల్పనిక వాస్తవం. వాస్తవిక కల్పన. ఈ నవలలో ఉన్న ప్రతీ పాత్ర కల్పితమే అయినా నవల చదువుతున్నంత కాలం వాస్తవిక పాత్రలను, పరిస్థితులనే స్పురణకు తెస్తూ ఉంటాయి. చదువుతున్న కల్పిత రచన కంటే స్పురణకు వస్తున్న వాస్తవిక ఘటనలే ఎక్కువగా ఆలోచింపచేస్తాయి. ఈ నవల చదివాక ఎప్పుడో చదివిన కథ ఒకటి గుర్తుకువచ్చింది. రాచరిక వ్యవస్థ బలంగా ఉన్న కాలంలో ఒక నిరంకుశ రాజు. రాజుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం కూడా నాలుగు గోడల మధ్య దాక్కునే అంత భయంకరమైన పాలన. లక్ష మంది జనాభా ఉన్న రాజ్యం, వంద మంది సైనికులకు బయపడి ఆలోచించడం మానేసిన పరిస్థితి. తన అసంతృప్తిని బహిరంగంగా చెప్పలేని ఒక కవి పరిస్థితులన్నిటిని ఒక కథగా రాసి ప్రచారంలో పెట్టాడు. జింకలన్ని ఏకమై సింహాన్ని ఓడించిన కథ ఆది. ఎక్కడ విన్నానో తెలియదు. నవల చదవడం పూర్తయిన తర్వాత ఈ రెండు కథలు ఒకేలా అనిపించాయి. కానీ ఇది జింక, సింహాల కథ కాదు. రాజు కథే. రాజు పోయిన తర్వాత రాజా దర్బారులో జరిగిన కథ. రాజు తర్వాత రాజు కోసం వెతుకుతున్న చర్చల్లో రాజ్య పాలనా విధానం మొత్తాన్ని ముసుగులు తీసేసి చూపించిన కథ.
నియంత అంతం అనే నవల ఆకార పటేల్ రాసిన ఆఫ్టర్ మెసయ్య నవలకు ఎన్. వేణుగోపాల్ చేసిన తెలుగు అనువాదం. మూల నవలను చదవలేదు కాబట్టి అనువాద నైపుణ్యాల చర్చకు పోదలచుకోలేదు. శిల్పం పరంగా, రూపం పరంగా, కథనం పరంగా చాలా సాధారణమైన నవల. తీసుకున్న వస్తువు కూడా సాధారణ విమర్శనాత్మకమైన వస్తువే. కానీ దానికి కలిపిన సృజనాత్మక కల్పన ఈ నవలకు ప్రత్యేకతను తెచ్చింది. ఆ కల్పనను నవలగా చదువుతున్నప్పుడు పాఠకుడికి కలిగే పరోక్ష అనుభవం ఈ నవలలకు కొత్తదనాన్ని జతచేసింది. ఇదొక రాజకీయ విమర్శ. వర్తమాన రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని గీసిన భవిష్యత్ కు సంబంధించిన ఊహా చిత్రం. ఈ ఊహ చిత్రంలో దాదాపుగా పాత్రలన్నీ వర్తమాన కాలంలో జీవించి ఉన్నవే. ఈ ఊహ నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఆ పాత్రలు అట్లానే ప్రవర్తిస్తాయని ఆశించలేకపోవచ్చు. ఆ పరిస్థితులు అట్లానే మారతాయని అనుకోలేకపోవచ్చు. కానీ వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని నవల మనకు చెప్తున్న విషయం మాత్రం అలానే జరుగుతుంది అని బలంగా నమ్మవచ్చు.
ఈ నవల ఒక దేశ నాయకుడి మరణంతో మొదలవుతుంది. పార్టీలో, దేశంలో అసమ్మతి అనేదే లేకుండా ‘ఏకం’ చేసిన ప్రజాకర్షక నాయకుడు. ఆదర్శాలతో నడిచే వృద్ధ నాయకత్వాన్ని పక్కకు నెట్టి అధికార వాంఛ ఉన్న కొత్త నాయకత్వంతో పార్టీని పటిష్టం చేసినవాడు. ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి గుండెపోటుతో మరణిస్తాడు. ఆ నాయకుడికి వారసులు లేని కారణంగా తర్వాత నాయకుడిని నిర్ణయించడంలో కార్యాలయం సందిగ్ధతలో ఉంటుంది. ఆయన స్థానం కోసం పోటీలో ఇద్దరు బలమైన నాయకులు ఉంటారు. మతాన్ని, బెదిరింపు రాజకీయాలను కలిపిన పాలన పెద్దాయనది. ఈ ఇద్దరు నాయకులు ఆ రెండు విషయాలకు విడి విడి ప్రతినిధిలుగా కనిపిస్తారు. మొదటివాడు జయేష్ భాయ్ తమ ప్రభుత్వంతో, విధానాలతో, ముఖ్యంగా తనతో ఏకీభావం లేని ప్రతీ ఒక్కరిని బెదిరింపులకు గురి చేసి తాను అనుకున్న పనిని సాధిస్తాడు. ఇంకొకరు స్వామీజీ. ఈయన ఆ దేశంలోని ఒక రాష్ట్రంలో పని చేసే మంత్రి. మాతాచారాలు బలంగా విశ్వసించే వ్యక్తి. వీరిద్దరూ పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటారు. ఇద్దరు పార్టీలో బలమైన నాయకులు కావడం, బలమైన అనుచర వ్యవస్థ కలిగి ఉండడం వలన ఎంపికలో సమయం అవసరం పడుతుంది. ఈ సంక్షోభ కాలంలో ప్రభుత్వాన్ని నడపడం కోసం తాత్కాలికంగా ఒకరిని నియమించే ఆలోచన చేస్తుంది ప్రమాంక. ఇద్దరికి అంగీకారం ఉన్న మీరా అనే సామాజిక కార్యకర్తను పదవిలో నియమిస్తారు. ఈమె పార్టీలో సీనియర్ నాయకుడి కూతురు. కానీ పార్టీతో గాని, పార్టీ రాజకీయాలతో, విధానాలతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి. అధికారం పట్ల, పదవుల పట్ల ఎట్లాంటి వ్యామోహం లేని వ్యక్తి. కానీ ఆమెను కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఆ పదవిలోకి వెళ్ళేలా ప్రేరేపిస్తాయి. అధికారం ఆమెలో తీసుకువచ్చే మార్పులు, పదవి కోసం జయేష్ భాయి, స్వామీజీలు చేసే ప్రయత్నాలతో నవల సాగుతుంది.
రచయిత నవల జరుగుతున్న స్థల, కాలాలను నవలలో నిర్ధిష్టంగా చెప్పలేదు. కానీ ఈ నవలలో ఉన్న రాజకీయ సందర్భాలను చూస్తే నవల జరుగుతున్న స్థలం ఏంటో, కాలం ఏంటో తెలిసిపోతుంది. ప్రజాస్వామ్య విలువలను వల్లె వేసే నిరంకుశ పాలకులున్న రాజ్యం. సర్వ వ్యవస్థలను సర్వ నాశనం చేసిన బలమైన ఏక నాయకత్వం ఉన్న ప్రభుత్వం. అసమ్మతిని దేశద్రోహంగా భావించే దేశం. ముఖ్యంగా ఇవే ఆ దేశానికి ఉన్న లక్షణాలు. ఆ కాలానికి ఉన్న విలువలు. రాజ్యాంగమే ఆధారంగా నడుస్తున్న వ్యవస్థలో రాజ్యాంగ విలువలను, ఆదర్శాలను నమ్మిన ఒక వ్యక్తి అధికారంలోకి వస్తే ఆ విలువలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయి, ఆ ఆదర్శాలు ఎంత కాలం నిలబడతాయి అన్న చర్చ ఈ నవలలో జరుగుతుంది. మీరా ఆదివాసీ సమూహంలో పని చేసిన వ్యక్తి. ఆదివాసీ సమాజంపై ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలపై పోరాడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆదివాసుల భూమిని ప్రభుత్వాలు తీసుకోకుండా ఒక చట్టం తేవాలి అనుకుంటుంది. ఆ వ్యవస్థలో ఆ చట్టానికి ఆమోదం తీసుకురావడానికి అప్పటి వరకు తాను తప్పు అనుకున్న ప్రతీ పనిలో భాగం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వ్యవస్థలో భాగం అవుతుంది. చివరకు ఆ వ్యవస్థలో తాను ఇమడలేక రాజీనామా చేస్తుంది. కానీ తాను పదవిలో ఉన్న కాలమంతా ఆ వ్యవస్థలో ఉన్న ప్రతీ అంశంతో పాఠకుడికి అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం పాఠకుడికి ప్రభుత్వ పాలన గురించి ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఇందులో ఉన్నవి పరిమిత పాత్రలే అయినా వాటి మధ్య జరిగే సంభాషణలు చాలా లోతుగా జరుగుతాయి. రాజ్య స్వభావం, ప్రజల పట్ల ప్రభుత్వాల వైఖరుల కేంద్రంగా ఈ సంభాషణలు సాగుతాయి. ఈ నవలలో రచయిత సృష్టించిన ప్రతీ పాత్ర, ఆ పాత్ర స్వభావం తాను చెప్పాలి అనుకున్న రాజకీయ అవగాహనను చాలా సులువైన రీతిలో పాఠకుడికి చేరుస్తాయి.
కళ, సాహిత్యాలు రాజకీయ ప్రచార సాధనాలు. మనం చెప్పాలనుకున్న విషయం, దాని విస్తృతి, దానిలో ఉండే సృజనాత్మక అంశాలు సాహిత్య ప్రక్రియను నిర్ణయిస్తాయి. రచయిత చెప్పాలనుకున్న విషయం చాలా విస్తృతమైనది, సృజనాత్మకమైంది. అందుకే నవలా రూపాన్ని ఎంచుకున్నాడు. చెప్పే ప్రతీ విషయాన్ని చాలా సూక్ష్మంగా, జాగ్రత్తగా, వ్యంగ్యంగా చెప్పారు. పెద్దాయన కార్యాలయంలో లైబ్రరీ ఉండదు. ఆయన స్థానానికి ఎదురుగా కుర్చీలు ఉండవు. ఆస్పత్రి ప్రారంభోత్సవ సమయంలో కెమెరామెన్ల పైన చీదరింపు ప్రకటిస్తాడు. ఇవన్నీ చాలా చిన్న విషయాలే. కానీ ఆ పాత్రల స్వభావాన్ని పాఠకుడు అర్థం చేసుకోవడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇట్లాంటి అనేక విషయాలు ఈ నవలలో మనకు కనిపిస్తాయి. పాలక పాత్రల వ్యక్తిత్వం కూడా వాస్తవ పాలకులకు చాలా దగ్గరగా చిత్రించారు. జయేష్ బాయి తన ప్రత్యర్థుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తారు. ఇది ప్రస్తుత రాజకీయ సందర్భంలో చాలా చర్చలో ఉన్న అంశం. స్వామీజీ ఆ రూపాన్ని భక్తి కంటే ఎక్కువగా వ్యాపారం కోసం వినియోగిస్తాడు. ఇది భక్తి అనుబంధ విషయాల పేరుతో విస్తరిస్తున్న ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తుంది. ఆదివాసి సమాజం విషయంలో ప్రభుత్వంతో పెద్దగా పేచీ లేని ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఆదివాసి సమాజంపై జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడని, ఆ విధ్వంసంలో తన భాగస్వామ్యాన్ని వెతుక్కునే ప్రధాన ప్రతిపక్ష పార్టీని స్పురణకు తెస్తుంది.
ఈ నవలలో రచయిత రాజ్యానికి, రాజ్యానికి అత్యంత దూరంగా ఉండే ప్రజా సమూహాలకు మధ్య ఉండే సంబంధాలను చిత్రించారు. ఆదివాసి సమాజం ప్రభుత్వాలకు, ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ ఫలాలలకు అందనంత దూరంగా ఉండే సమాజం. తమ నేల కోసం, తమ ఉనికి కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న సమూహం. గొప్ప గణతంత్ర దేశంగా చెప్పుకునే ఆ దేశంలో వారి కోసం సామాజిక కార్యకర్తగా పని చేసిన వ్యక్తి చేతిలోకి అధికారం వచ్చినా ఏమి చేయాలని ఒక నిస్సహాయ స్థితి ఈ నవలలో కనిపిస్తుంది. తాను చేయగలిగే అన్ని ప్రయత్నాలు చేసి పరాజితురాలుగా వెనుదిరిగిన మీరా పాత్ర ఆ దేశ పాలనా విలువలో ఉన్న డొల్లతనాన్ని పాఠకుడికి చూపిస్తుంది. ఆ పాఠకుడు ఆలోచన కలిగిన భారతీయుడు అయితే అతని ఊహల్లో ఒక రకమైన భయాన్ని కూడా కలిగిస్తుంది. ప్రత్యక్ష పరిస్థితులకు, నవలలో పరిస్థితులకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించినపుడు ఆ భయం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ప్రభుత్వాలకు, ఆదివాసులకు మధ్య ఉన్న సంబంధాలను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా అసమ్మతే ధ్వనిస్తుంది. ఇంకాస్త గట్టిగా మాట్లాడితే దేశద్రోహం కూడా అవ్వచ్చు. అట్లా మాట్లాడిన వాళ్ళకు అభివృద్ధి నిరోధకులు అనే బిరుదులు ఇవ్వవచ్చు. బహుమతిగా బెయిలు రాని కేసులు, బయటికి రాలేని జైలు శిక్షలు కూడా ఉండవచ్చు. ఆ పరిస్థితిని మీరా కూతురు జాయ్ పాత్ర ద్వారా రచయిత ప్రత్యక్షంగానే తెలియజేస్తారు. చివరగా ఒక సమస్యకు పరిష్కారం చూపించాలి అంటే ఇంకొన్ని సమస్యలకు ఆమోదం ఇచ్చే ఆ వ్యవస్థ పట్ల ఆదివాసి సమాజం ప్రకటించే అయిష్టంతో నవల ముగిస్తుంది. మీరా ఆదివాసి సమాజానికి ఉపయోగపడే చట్టం కోసం అనేక రాజకీయ ఒప్పందాలను అంగీకరించింది. తమ పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఒప్పించడం కోసం వాళ్లు డిమాండ్ చేసిన అనేక అన్యాయ తాయిలాలను అందించింది. దీనిని ఆదివాసి సమాజం తప్పుబట్టింది. ఒకరికి మేలు చేయడం కోసం మరొకరిని ఇబ్బంది పెట్టే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకించింది. మేము పోరాడుతున్నది మా పై జరుగుతున్న పీడన గురించి మాత్రమే కాదు అసలు పీడన అనేదే ఉండకూడదు అని, అదే అసలైన విలువ అని, ఆ విలువను సాధించడానికి ఇక్కడ జరుగుతున్న పద్ధతుల కంటే ప్రతిఘటన ఒక్కటే మార్గమని ఆదివాసి సమాజం ధృఢ నిశ్చయంతో ప్రకటించింది. నవలకు ముగింపుగా పాఠకుడికి మనసులో కూడా అసంకల్పితంగా అదే ఆలోచన వస్తుంది. ప్రతిఘటన ఒక్కటే మార్గం……..
NOTHING NEW —SAME POLITICS /SAME SYSTEM STILL THERE-
NO CHANGE ///IN OUR COUNTRY
==========BUCHIREDDY GANGULA