మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా  ‘ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద’ని అంటారు. అందులో ఏ అర్థ‌మూ లేద‌ని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే ‘మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార’నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, ‘సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార’ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు.

ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని ఎవరు గెలుచుకున్నారు? ప్రజల జీవన సంస్కృతిలో విప్లవకారులు ఎట్లా పెనవేసుకపోయారు? అనేవి అంత సులభంగా తేల్చగలిగే ప్రశ్నలు కావు. వాదనలతో గెలిచేవీ కావు. మానవ విషాదాలు, ఉద్వేగాలు ప్రజా చైతన్య ప్రతిఫలనాలయ్యే సందర్భాల్లో సమాధానాలు వెతుక్కోగలగాలి. ఈ పని చేయాలంటే కా. హన్మంతు అంతిమ యాత్ర‌ రాజకీయ, భావజాల సంఘర్షణల కూడలిగా మారింద‌ని   గుర్తించాలి.

నలభై ఐదేళ్ల ఆయన ప్రజా జీవితమే అలాంటి సందర్భంగా మారింది. జీవితాన్ని, మరణాన్ని వేరు చేయలేని తాత్విక సమగ్రతను సంతరించుకున్న అపురూప విప్లవ మానవుడు కావడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇంత కఠినమైన, క్రూరమైన కాలంలోనూ మానవ జీవితంలో ఉండగల ప్రజా ఆచరణను హన్మంతు నిరూపించాడు.

ఆయన మరణం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన జీవితాన్నంతా తలపోసుకుంటున్నట్లే. ఆయన ఆచరణను స్మరించుకుంటున్నామంటే దాన్ని నడిపించిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటున్నట్లే. వ్యక్తిగా హనుమంతు గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయనను తయారు చేసిన విప్లవోద్యమాన్ని విశ్లేషిస్తున్నట్లే. ఆయన నాయకత్వంలో నిర్మాణమైన కొత్త ప్రపంచాన్ని చర్చిస్తున్నట్లే. యాంత్రికవాదులకు, పెడవాదులకు, నిష్క్రియాపరులకు, మెట్ట వేదాంతులకు ఇవేవీ పట్టవు. మరణం గురించి మాట్లాడుతున్నామని నిర్ధారిస్తారు. సిద్దాంతం లేని ఆచరణ గురించి భావోద్వేగాలతో మాట్లాడుతున్నామని తీర్పులు ప్రకటిస్తారు.

హన్మంతు జీవితమూ, సిద్ధాంతమూ, ఆ రెండు సమున్నతంగా సంలీనమైన విప్లవోద్యమమూ విడదీయలేనివి. ఇది అర్థం చేసుకున్న వాళ్లకే పై ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరుకుతాయి. వాస్తవికత మన ఇష్టా ఇష్టాలనుబట్టి ఉండదు. అనేక రూపాల్లో, తలాల్లో చలనంలో ఉంటుంది. ఇది ప్రాథమిక షరతు.

హన్మంతు ఎన్కౌంటర్ అయ్యాడని తెలియగానే పోలీసులు పెద్ద ఎత్తున పుల్లెంల గ్రామానికి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల్లోకి చొరబడ్డారు. అంత్యక్రియలకు హాజరు కావద్దని ప్రజలను భయపెట్టారు. సరిగ్గా ఆయన అంత్యక్రియల రోజే విప్లవోద్యమ సమర్థకులు తెలంగాణలోనే వేల మంది ఉన్నారనీ, వాళ్ల పని పట్టడానికి రాజ్యం సిద్ధమవుతోందనీ ప్రధాన వార్త పత్రికల్లో అచ్చయింది. ఇదేమీ కొత్త విషయం కాదు. అప్పటికే కా. కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడమనే ‘నేరం’ మీద తెలంగాణవాది, భారత్ బచావో నాయకుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. ఇంకా చాలా మందిని అరెస్టు చేయబోతున్నట్లు వార్తలు వ్యాపించి ఉన్నాయి.

అయినా హన్మంతు భౌతిక కాయం ఇంకా రాకముందే ఆయన ఇంటి దగ్గర చీమల పుట్టలా జనం చేరారు. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు. అదొక విషాద, విప్లవోద్యమ ఉత్తేజ సందర్భంగా మాపోయింది. కన్నీటికీ, దుఃఖానికీ ప్రజ్వలన శక్తి ఉంటుందని రుజువైంది. ఆయన ఇంటి దగ్గర ఉన్న చిన్న జాగాలో మూడు గంటల పాటు భౌతిక కాయాన్ని ఉంచినా, అందరూ వెళ్లి చూడలేనంత రద్దీ ఏర్పడింది. విద్యార్థిగా ఉండిన రోజుల్లో అజ్ఞాతానికి వెళ్లిపోయిన హన్మంతు తిరిగి మళ్లీ ఆ ఊరికి రాలేదని పత్రికలే రాశాయి. ఆ ప్రాంతంలో విప్లవోద్యమం చాలా కాలంగా లేదని స్థానికులు చెప్పారు. స్థానికులకు ఆయన పేరు మాత్రమే వినికిడి. బైటి ప్రాంతాల విప్లవోద్యమ అభిమానులకు అది కూడా లేదు. ‘లహర్’ పేరుతో ఎంతో సాహిత్య కృషి చేసినా, ఆయన రచయితగా కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. దశాబ్దాలపాటు భారత విప్లవోద్యమ విస్తరణలో, ఉన్నతీకరణలో ఆయన నేలను అంటిపెట్టుకొని జీవించాడు. ప్రజల్లో కలిసి పోవడమంటే అచ్చంగా కలిసిపోవడమే. ప్రజా పోరాటాల్లో పాల్గొని, నాయకత్వం వహించి కేంద్ర నాయకుడయ్యాడు. ఆయన పేరు ఒక వ్యక్తి గుర్తింపు నుంచి విప్లవోద్యమ పర్యాయపదంగా మారింది. అందువల్లే తీవ్ర సంక్షోభంలో చిక్కుకపోయిన విప్లవోద్యమాన్ని ప్రజలు ఆయనలో

చూసుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని చూడటమంటే తీవ్రంగా గాయపడిన విప్లవోద్యమాన్ని తరచి చూడటమే. ఆయన భౌతిక కాయం మీది నుంచి వీచే గాలిలోంచి విప్లవోద్యమాన్ని శ్వాసించడమే. లేకపోతే ఇంత నిర్బంధంలో, భయోద్విగ్నంలో అంత మంది ఆయన అంతిమ యాత్రలో ఎందుకు కలిసి ప్రయాణించారో ఎట్లా అర్థం చేసుకోగలం? ప్రజల వివేకాన్ని, అంతశ్చేతనను గ్రహించడం సామాజిక పరిశీలనకు గీటురాయి.

పాక హన్మంతు తన జీవితాన్నంతా ఈ దేశ విప్లవానికి ధారపోసి, మరణంలో కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. దాన్ని అందుకోడానికి ఇంత మంది అక్కడికి వచ్చారు. కేవలం సంతాప సూచకంగానే కాదు, ఆయన మరణ సందర్భాన్ని అర్థం చేసుకోడానికి, అందులోని విప్లవాత్మక మార్గదర్శకత్వాన్ని స్వీకరించడానికి వచ్చారు.

దేశం ఇక మావోయిస్టు రహితంగా మారిపోతుందా? విప్లవకారులు ఎంచుకున్న పోరాట పంథా తుడిచిపెట్టుకపోతుందా? అంతా అయిపోయినట్లేనా? ఎన్నెన్ని విశ్లేషణలో.. అంతు లేదు. మాటకారితనం ఉన్న వాళ్లు ఈ స్థితి మీద ఏదో ఒకటి తమ మాట చెప్పుకోకపోతే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని అనుకుంటున్నారు. తప్పక మాట్లాడవలసిందే. అనేక విజయాల వలెనే ఈ సంక్షోభమూ తప్పక మేధో రంగంలో బాధ్యతాయుత చర్చనీయాంశమైంది.

కానీ ప్రజలు ఇన్ని మాటలు చెప్పలేకపోవచ్చు. హన్మంతు అంతిమయాత్రలో పాల్గొన్న వాళ్లంతా తమ భాగస్వామ్యంతో విప్లవోద్యమ ఉ నికిని ప్రకటించదల్చుకున్నారు. అప్పటికీ ‘ఉనికి రుజువు కావడానికి ఒక నిండు ప్రాణం బలి కావాలా? అట్లయినా ఉనికే కదా..?’ అనే వాళ్లూ ఉంటారు. ఇవేమీ సమాధానాలు లేని ప్రశ్నలు కాదు. తీవ్రమైన చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుపోయిన విప్లవోద్యమం పక్షాన నిలబడాలనే ఆర్తి, ప్రేమ, చైతన్యం ప్రకటించడానికి అంత మంది జనం వచ్చారని ఎందుకు అనుకోకూడదు? ఫేస్ బుక్ ఒక ప్రకటన చేసి ఊరుకోవచ్చు కదా? అట్లా అనుకోలేదు. ఇప్పుడు ఫాసిస్టు రాజ్యానిది పై చేయే కావచ్చు, తిరిగి విప్లవోద్యమం ప్రజ్వరిల్లాలనే చారిత్రక ఆకాంక్షగా దాన్ని ఎందుకు గుర్తించకూడదు?

కా. హన్మంతు జీవితం, మరణం ఇచ్చిన సందేశాన్ని మేధావులు ఏమోగాని ప్రజలు చాలా స్పష్టంగా గ్రహించారు. ఆయన దశాబ్దాల తన ఆచరణలో రుజువు చేసిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని కాపాడటానికి చివరి రోజుల్లో దృఢ వైఖరి తీసుకున్నాడు. కగార్ అంతర్యుద్దాన్ని తట్టుకుంటూనే అంతర్గత విద్రోహాన్నీ ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. విప్లవోద్యమ అధికార ప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి రాజ్యంతో చేతులు కలిపి లేవదీసిన లొంగుబాటువాదానికి వ్యతిరేకంగా పోరాడి విప్లవ పంథాను కాపాడ వలసి వచ్చింది. గత యాభై ఏళ్లుగా విప్లవోద్యమ పంథాను నిజం చేయడానికి లక్షలాది మంది శ్రమించారు. వేలాది మంది అపారమైన త్యాగాలు చేశారు. ఇప్పుడు రాజ్యం బారి నుంచి, విద్రోహుల బారి నుంచి విప్లవ పంథానే కాపాడుకోవలసి వచ్చింది. దాని కోసం కా. హన్మంతు నెత్తురు ధార పోశాడు. సత్యం ఎంత కఠినమైనదో చూడండి. సత్యం ఎంత సంక్షోభంలో పడిపోతుందో చూడండి. సత్యాన్ని సత్యమని చెప్పడమే కాదు, దాన్ని కాపాడవలసిన కాని కాలం వస్తుంది. ఆ కాలాన్ని ఎదుర్కోడానికి ఎంత చిన్న శక్తి అయినా సరే, ఎదురొడ్డవలసిందే.

విప్లవకారులందరినీ హత్య చేయాలని రాజ్యం అనుకున్న తరుణంలో, విప్లవ పంథానే తుడిచి పెట్టడానికి రాజ్య ప్రేరణతో లొంగుబాటువాదం తలెత్తిన సందర్భంలో పాక హన్మంతు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను కాపాడటానికి దృఢంగా నిలబడ్డాడు. ఆయన తన నలభై ఏళ్ల విప్లవోద్యమ జీవితంలో ఎన్ని సాహసాలు చేశాడో. ఎన్నెన్ని పోరాటాలు చేశాడో. విప్లవోద్యమ చరిత్ర ఖజానాలోకి విలువైన విజయాలు ఎన్ని చేర్చాడో.  సరిగ్గా అట్లాగే ఈ యుద్ధ- విద్రోహ సందర్భంలోనూ సాయుధ పోరాట పంథాను కాపాడటానికి ప్రతీఘాతుక శక్తులతో తలపడ్డాడు. ఇదే ఆయన సందేశం.

 రాజ్య అణచివేతకూ, రాజ్య ప్రేరిత విద్రోహానికీ వ్యతిరేకంగా హన్మంతు అంతిమయాత్రలో పాల్గొన్న జనసందోహం నినదించిందీ, గుండెలకు హత్తుకున్నదీ ఈ జీవన సందేశాన్నే. విప్లవం కొనసాగాలనీ, ప్రజాయుద్ధం ఆటుపోట్ల నుంచి లేచి నిలబడాలనీ ప్రకటించడానికే అంత మంది అక్కడికి వచ్చారు. ఏ సత్య ప్రకటన కోసం కా. హన్మంతు విప్లవంలో జీవించి, మరణించాడో సరిగ్గా ఆ సత్యం పక్షాన ఉండటానికి అంత మంది జనం వచ్చారు. ఉద్యమాలనూ, అది నిర్మించే చరిత్రనూ అనేక వైపుల నుంచి క్రూరంగా పరిహసిస్తున్న కాలంలో ప్ర‌జ‌లు సత్య ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ ప్రజా ఆకాంక్షను ఎవరు తప్పుపట్టగలరు? దానికి ఎవరు ఎదురొడ్డగలరు? ఇప్పుడు నినాదమో, దు:ఖమో కావచ్చు. కానీ అదొక చారిత్రక సత్యమని రుజువైనప్పుడు ఎవ్వరు తుడిచిపెట్టగలరు?

Leave a Reply