కొంచెం అటూ ఇటూగా బీహార్‌ ఎన్నికల ఫలితాలను ఇలాగే ఉంటాయని అనుకున్నారు. కేవల ఊహ కాదు.  ఓట్‌ చోరీ ఆధారం. అనుకున్నదే సత్యమని తేలినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ ఫలితాలు రాబోయే ప్రమాదాన్ని గాఢంగా సంకేతిస్తున్నాయి. ఓట్‌ చోరీ ఏ స్థాయిలో జరిగిందో, అదే స్థాయిలో అది బట్టబయలైంది. బీజేపీ అకృత్యాలను బైటపెట్టడంలో రాహుల్‌ గాంధీ  పరిణతి సాధించాడని చాలా మంది అనుకున్నారు. ఎన్నికల జాబితా అన్యాయాలపై  సాక్ష్యాధారాలతో, గంభీరమైన సూత్రీకరణలతో మాట్లాడి ఓట్ల నేతల్లో భిన్నమైన మనిషి అనిపించుకున్నాడు. ఆయన వాదనలేవీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని కూడా తేలిపోయింది.

మనుషులు ఎంత అతార్కిక మన:స్థితిలో ఉన్నా నిత్య జీవితంలో హేతుబద్ధంగానే వ్యవహరిస్తారు. కానీ ఎన్నికల రాజకీయాల్లో హేతుబద్ధతకు అవకాశమే లేదని బీహార్‌ ఫలితాలు నిరూపించాయనుకోవాలా? రాజ్యాంగబద్ధ సంస్థలను కైవసం చేసుకున్న విద్వేష రాజకీయాలే గెలిచాయని అనుకోవాలా? మన దేశంలో ఎన్నికల రాజకీయాల మీద, ఓట్ల ఫలితాల మీద జరిగినంత చర్చ మరే ప్రజాస్వామిక ప్రక్రియ మీదా జరగదు. ఎన్నెన్ని వైపుల నుంచో విశ్లేషణలు సాగుతుంటాయి. అంత ‘విశాల’మైనది ఎన్నికల ప్రక్రియ. ఎన్నికలే ప్రజాస్వామ్యాన్ని నిర్ధారించే, నిర్దేశించే సాధనమయ్యాక అన్ని శక్తులూ ఎన్నికల చుట్టూ మోహరిస్తాయి. 

ప్రజాస్వామ్యమంటే ఎన్నికలే అనే భావన పాలక పార్టీలకే కాదు, మీడియాకూ, పరిశీలకులకూ ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఉన్న ఎన్నికల కమిషన్‌ తాను గెలిపించాలనుకున్న వాళ్లను గెలిపించే దశకు చేరుకుంది. చివరికి బీహార్‌లో తానే గెలిచింది. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి అనేదేమీ లేదనీ, బీజేపీని గెలిపించడమే దాని లక్ష్యమనీ స్పష్టమైపోయింది. దేశ భవిష్యత్తుకు ప్రజాస్వామ్యం గీటురాయి అయి ఉంటే బాగుండేది. కానీ ఎన్నికలయ్యాయి. శాశ్వతంగా అధికారంలో ఉండాలని గెలిచిన వాళ్లూ, గెలవాలనుకొనే వాళ్లూ అనుకోవడంలో వింతేమీ లేదు. దాని కోసం అందరూ చేయరాని పనులు చేసినవాళ్లే. చేతనైనంత చేసినవాళ్లే. కొంత సిగ్గుపడి ఉండవచ్చు. దడి కట్టి చేసి ఉండవచ్చు. ఫాసిస్టులకు ఇవేవీ అక్కర్లేదు. ఏకంగా ఎన్నికల కమిషన్‌ను జేబులో వేసుకున్నారు. ఓట్లకు డబ్బులు పంచినప్పుడు, గెలవడానికి కులాన్నీ, మతాన్నీ వాడుకున్నప్పుడు, హత్యలకూ, దొమ్మీలకూ దిగినప్పుడూ ఏమీ చేయలేని ఎన్నికల కమిషన్‌ ఇప్పుడు బీజేపీ పెరటి జీవిగా మారడానికి ఎందుకు అభ్యంతరపడుతుంది. ఆ విపత్తులకంటే ఇది నిస్సందేహంగా తీవ్రమైనదే. అత్యంత ప్రమాదకరమైనదే. ఫాసిజం అధికారంలోకి రావడానికి సాధనాలుగా మారిన మన ‘ప్రజాస్వామ్య’ ప్రక్రియలకు తాజాగా ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ తోడైంది. సమాజంలో మతతత్వానికి, ఫాసిజానికి, విద్వేషానికి వ్యతిరేకంగా ఎన్ని చైతన్య స్రవంతులు వెల్లివిరిసినా ఫాసిస్టుల రాచబాటను ఎన్నికల కమిషన్‌ మరింత విశాలం చేసింది. తక్షణ జీవన్మరణ సమస్య అంచులో ఉన్న దేశాన్ని ఎన్నికల కమిషన్‌ అగాథంలోకి తోసేస్తుందా? అనే భయం కలగడం సహజమే.

ఎన్నికలు ఇక్కడికి చేరుకోడానికి రాహుల్‌గాంధీ పూర్వీకుల వాటా తక్కువేమీ కాదు కదా. అయినా దీన్నుంచి ఆయన తప్పిస్తాడేమో అని అశపెట్టుకోవాల్సిన స్థితికి మన ప్రజాస్వామ్యం వచ్చేనాటికి అది ఆయనకు కూడా ఉపయోగపడకుండాపోయింది. ప్రజలు వరుసల్లో నిలబడి ఇబ్బడిముబ్బడిగా ఓట్లు వేస్తున్న దృశ్యం కనిపిస్తున్నా, గెలిపించేది ప్రజలు కాదనే వాస్తవ తీరానికి తలా ఒక చేయి వేసి ఎన్నికల ప్రక్రియను లాక్కొచ్చారు. మొన్నటి దాకా మధ్యలో ఎన్నికల కమిషన్‌ ఉండేది. ఇప్పుడే నటనలూ అక్కర్లేదు. కాంగ్రెస్‌కు కూడా ఈ సత్యం బోధపడింది. ఇదీ ఇప్పటి విషాదం.

ఇదంతా ఫాసిస్టుల వల్ల  ఎన్నికల ప్రజాస్వామ్యానికి దాపురించిన విపత్తని సరిపెట్టుకోవాలా? ఎన్నికలు సజావుగా జరిగితే అంతా చక్కగా ఉందనుకొనే ఊరట కూడా మిగల్లేదని విచారపడాలా? లేక మన ప్రజాస్వామ్యమే ఫాసిస్టు సందర్భంలో ఈ చివరికి చేరి ఇట్లా నిగ్గుదేలిందనుకోవాలా?

కాంగ్రెస్‌ ఓడి, ఫాసిస్టులు గెలవడం రాహుల్‌ గాంధీ వైఫల్యంగా కనిపించవచ్చు. ఈ సమస్య ఆయన ఒక్కడిదేనా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఇంతకూ ప్రజాస్వామ్యం ఏమైంది? మనకు ఎన్నికల లోటుపాట్లు తెలిసినంత కూడా ప్రజాస్వామ్యం గురించి తెలియదు. ఎన్నికల మీద ఉన్నపాటి విమర్శ ప్రజాస్వామ్యంపట్ల లేదు. ప్రభుత్వం ఏది ప్రజాస్వామ్యమని  చెబితే అదే నిజం కామోసని నమ్ముతూ వచ్చాం. అందుకే తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్న ఫాసిస్టులే ఇప్పుడు  ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్లను రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఓడించగలడో లేదోగాని సంఘ్ ప్రమాదం తెలిసిన వ్యక్తి అనే అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నాడు. కానీ రాజకీయాల్లోకి మతం రావడంలో కాంగ్రెస్‌ ఇతోధిక పాత్ర ఉంది. దేశంలో కార్పొరేట్ల రాజ్యం స్థిరపడటానికి  పట్టాలు వేసిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే. ఈ ప్రజాస్వామ్యం ఇట్లా ఉండటానికీ, లేకపోవడానికీ పునాది నిర్మించింది కాంగ్రెస్‌ పార్టీయే. ఇప్పుడు బీజేపీ దాన్నీ తొవ్విపోస్తోంది. ఇదీ ఇవాళ మనమున్న చారిత్రక సందర్భం. దీన్ని సరిగా అర్థం చేసుకోవడమంటే రాహుల్‌ కూడా పాలక వర్గమనే సంగతి మర్చిపోనక్కరలేదు. ప్రతిపక్ష నేతగా బీజేపీని దించగలడా? అనే ఆశనూ వదులుకోనవసరం లేదు.

ఇంతకూ బీహార్‌ ఎన్నికల్లో కూడా ఆయన తన విధానాలను ప్రజల్లోకి తీసికెళ్లగలిగాడా? అనే సందేహం కలుగుతోంది. అభ్యర్థులను గెలిపించేంది ఈవీఎంలే అయినా రాజకీయ నాయకుడిగా రాహుల్‌ గాంధీ ప్రజా సమస్యల దగ్గరికి వెళ్లాడా? బీజేపీ చెబుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటి? దారుణమైన నిరుద్యోగం, ఘోరంగా పడిపోతున్న జీవన భద్రత, సుడిగుండంలా మారిన అధిక ధరలు, నానాటికీ పెరిగిపోతున్న పేదరికం గురించి ఆయన మాట్లాడి మోదీ విధానాలను ఎండగట్టగలడా? సకల సంపదలు పిడికెడు సంపన్నులకు కట్టబెడుతున్న మోదీ కార్పొరేటీకరణ మీద రాహుల్‌ విమర్శ పెట్టగలడా? ప్రజల రోజువారీ జీవన వాస్తవికతను ముట్టుకొనేలా రాజకీయాలను మార్చగలడా?

ఆ మేరకైనా ఎన్నికల ప్రజాస్వామ్యం దేశానికి భరోసా ఇవ్వగలదా? 

Leave a Reply