దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద భావజాలం కలిగిన ఒక లాయర్ బూటుతో దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ తన మతానికి చెందిన దేవునిపై న్యాయమూర్తి వ్యాఖ్యలను నిరసిస్తూ దాడిచేశానని తనకు పశ్చాతాపం లేదని చెప్పారు. ఆ వ్యక్తిపై  కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  అదే నెల 7 వ తేదిన హర్యానాలో కుల వివక్షత భరించలేక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొన్నారు. అతను యస్సీ కులానికి చెందినవారు కావడంతో అగ్రవర్ణ అధికారులు ఆయనపట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తూ, ఆయనకు రావల్సిన ఉద్యోగ ప్రమోషన్లలో అన్యాయం చేయడమే కాకుండా ఆయన వ్యక్తిగత డాటాను, వాట్సాప్ ఖాతాను ట్రాక్ చేయడం, అతని వ్యక్తిత్వాన్ని తప్పుడుగా  ప్రచారం చేయడంతో దిక్కు తోచని స్థితిలో అతను తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

గ్రామీణ ప్రాంతాలనుండి మొదలుకొని దేశ అత్యున్నత స్థాయి సేవారంగాలకు సంబంధించిన బ్యూరోక్రసీలో కూడా కుల వివక్షత‌ పెరిగి మనువాదం ఫాసిస్టు రూపం సంతరించుకొన్న ఈ సందర్భంలో 207 ఏళ్ల కిందట  జరిగిన భీమాకోరెగావ్ యుద్ధాన్ని ఈ దేశ పీడిత ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.1818 జనవరి 1 వ తేదిన మహారాష్ట్రలో భీమా నది ఒడ్డున బాజీరావు బ్రహ్మణ పీస్వా సైన్యంతో మహార్ రెజిమెంట్ సైనికులు భీకర యుద్ధం జరిపారు.బ్రిటీషు పాలకులు -మరాఠా ప్రభువుల మద్య జరిగిన ఈ యుద్ధం యొక్క ఉద్దేశ్యం రాజ్యాధికార కాంక్ష అయినప్పటికీ ఈ యుద్ధంలో దళితులు తమ ఆత్మగౌరవం కోసం పాల్గొన్నారు. 18 వ దశకంలో మహారాష్ట్రలో పీష్వాల పాలనలో రాజ్యమేలుతున్న అంటరానితనం నుంచి తమను విముక్తం చేయాలని, తమని కనీసం మనుషులుగా గుర్తించాలని అప్పటి పాలకుడైన  రెండవ బాజిరావు పీస్వాను ఆ రాజ్యంలోని మహార్ దళితులు వేడుకున్నారు. సమాదానంగా “‌మీరు‌ యుద్దం చేసి గెలిచినా మా కాళ్ళ కింద ఉండాల్సిందేనని, మీరు ఎన్నటికీ అంటరానివారే అని” పిస్వాల సేనాధిపతి అంటాడు. మహార్ దళితుల పట్ల పీష్వాల‌ చులకన సమాధానం వారిని యుద్ధంలో పాల్గొనాల్సిన అనివార్యతను తెచ్చిపెట్టింది. చదువుకోవడానికి, ఆస్తి పొందడానికి,భూమి కలిగి వుండటాని హక్కులు నిరాకరించిన కాలం అది. తీవ్ర శ్రమదోపిడి, అణచివేతకు వ్యతిరేకంగా మానవహక్కుల సాధనకై కేవలం 500 మంది మహార్ సైనికులు మూడు రోజులు ఆహారం లేకుండా కాలినడకన ప్రయాణించి భీమా నది ఒడ్డున 28 వేల పీష్వా సైన్యంతో పోరాడి  గెలిచారు. కేవలం ఆత్మగౌరవ నినాదమే వారిని ఈ యుద్దంలో గెలిపించింది.వారు ఆనాడు పీష్వాల పాలనలో పేరుకుపోయిన బ్రహ్మణీయ అణచివేత ధోరణిని ఓడించారు. తమని తాము అంటరానితనం నుంచి విముక్తం చేసుకున్న ఈ సంఘటన‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

దళితులు ఎగరేసిన ఈ ఆత్మగౌరవ పతాకాన్ని అనంతర కాలంలో వెలుగులోకి తెచ్చింది డా.బిఆర్ అంబేద్కర్ గారు. భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామంలో మహార్ యుద్దవీరుల స్మారకార్థం బ్రిటిష్ పాలకులు నిర్మించిన స్థూపంను 1927, జనవరి 1  నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన అనుచరులతో కలిసి సందర్శించి ఆ స్థూపంను దళిత ఆత్మగౌరవ సూచికగా ప్రకటించారు. ఆ తర్వాత అక్కడ‌ ప్రతి ఏడాది జాతర జరపడం, దళితులు ఆ‌ స్థూప ప్రదేశాన్ని సందర్శించి తమ పూర్వీకులకు నివాళులు అర్పించడం ఆనవాయితీగా మారింది.

ఆ ఆనవాయితీ కొనసాగింపు ఉత్సవాలలో భాగంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో 2017 డిసెంబర్ 31 నాడు ఎల్గార్ పరిషద్ పేరుతో సభ జరిపితే మోడీ సర్కారుకు ఆ చర్య దేశ ద్రోహంగా కనిపించింది. కోరెగావ్ లో ఆ మర్నాడు భీమాకోరెగావ్ అమరుల స్మారకార్థం జరిగిన దళిత ఆత్మగౌరవ ర్యాలీ పై  ఆర్ ఎస్ ఎస్ నేతలు దాడి చేసి అల్లర్లు సృష్టించారు. ర్యాలిని అడ్డుకొని దాడి చేసిన వారిని వదిలేసి దళితులపై కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాని మోడీ హత్యకు కుట్ర చేశారని ఉపా కేసు మోపి ఎల్గార్ పరిషద్ సభలో పాల్గొన్నవారిని,పాల్గొనని వారిని లక్ష్యంగా చేసుకుని  దేశవ్యాప్తంగా 17 మంది దళిత బహుజన మేధావులు, హక్కుల నేతలను, ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉపా కేసులు నమోదు చేసి సుధీర్ఘంగా నిర్బంధించారు. ఈ చర్యకు కారణాలను గమనిస్తే మోడీ పాలనలో దళితులపై దాడులు, అణచివేత పెరగడంతో ఎల్గార్ పరిషద్ సభలో  “నయా పీష్వాయి నహీ చలేగా ” అనే నినాదం‌ బయటకు వచ్చింది. నాడు బ్రహ్మణీయ మనువాద భావజాలంతో దళితులకు కనీస మానవ హక్కులను నిరాకరించిన పీష్వాల‌ వారసులే నేడు భీమా కోరేగావ్ వద్ద  దళితుల చైతన్యాన్ని చూసి తట్టుకోలేక ఆ ప్రదేశాన్ని నిషిద్ధ ప్రదేశంగా చేయడం కోసం కుట్రపన్నారు.

భీమాకోరెగావ్ వద్ద అల్లర్లు సృష్టించి, ఉపా కేసులు నమోదు చేసి దేశంలో పీడత ప్రజలు తమ గొంతు వినిపించకుండా అణచివేయాలని చూశారు.  కానీ దేశంలోని దళిత బహుజన పీడిత ప్రజలు నానాటికి భీమా కోరేగావ్ స్థూపాన్ని  లక్షలాదిగా సందర్శిస్తూ మన దేశంలో మనువాద అణిచివేతకు స్థానం లేదని చాటుతున్నారు. ఈ ఏడాది కూడా జనవరి 1‌ నాడు దేశ వ్యాప్తంగా భీమాకోరెగావ్ విజయ్ దివాస్ (శౌర్య దివాస్ )ను ఘనంగా జరుపుతున్నారు. నేడు దేశంలో మానవ హక్కులు , రాజ్యాంగ హక్కులు అమలుకు నోచుకోలేని ఈ‌ సందర్భంలో పీడిత ప్రజలకు భీమాకోరెగావ్‌ యుద్ధం దారి చూపుతుంది.

ప్రొగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (పి.ఎస్.యూ),

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,
ఫోన్: 87123 52122.

Leave a Reply