ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పుర్ జిల్లా ఓర్చా మండలం (వికాస్ ఖండ్) తుల్తులీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్టోబర్ 3-4 తేదీలలో వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆపరేషన్ కగార్ సైనిక దాడులను అనుసరించి చుట్టుముట్టి మట్టుబెట్టే చర్యకు పాల్పడ్డారు. ఈ ప్రాంతం దంతెవాడ, బీజాపుర్, కాంకేర్, కొండగాం జిల్లాలకు సరిహద్దు మాత్రమే కాకుండా పొరుగున వున్న ఒడిశాకు కూడ సరిహద్దుగా వుండడంతో కగార్ పోలీసు దాడులకు ఒక కేంద్రంగా మారింది. వేలాది మంది ఖాకీల వేటలో 35 మంది మావోయిస్టులు (వివిధ స్థాయిల పార్టీ కార్యకర్తలు, గెరిల్లాలు) అమరులయ్యారు. ఈ నరమేథం ముగిసిన వెన్వెంటనే దిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో మావోయిస్టు ఉద్యమ రాష్ట్రాల ముఖ్యమంత్రుల, పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఘటన ఒక గొప్ప విజయంగా ప్రశంసించుకుంటూ తర్వాతి వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ఆ సమావేశ వివరాలు పబ్లిక్ డొమైన్‌లో వున్నందున, వాటిని ఇక్కడ ఉల్లేఖించడం లేదు.
తుల్తులీ ఎదురుకాల్పులపై మిత్రుల, మానవ హక్కుల సంఘాల, విప్లవ శ్రేయోభిలాషుల ప్రతిస్పందన:
‘‘దేశ ప్రధానమంత్రి, హోం మంత్రి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగబద్ద ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులందరూ నక్సలైట్లను ఏరివేస్తామని, నక్సలైట్లను నిర్మూలిస్తామనీ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అంటే, చంపేస్తామనే అర్థం. అందుకోసం లక్షలాది భారత సైన్యాలను, పోలీసులను నక్సలైట్ ప్రాంతాల్లో పరిపాలకులు కలిగివుండటం, అదే తమ విధానం అని బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, అనైతికం. ఇది నాగరిక సమాజం ఆమోదించదగ్గ విషయం కాదు’’. – మానవ హక్కుల వేదిక (సదస్సు ప్రకటన నుండి).
తుల్తులి ఎదురుకాల్పులలో అసువులు బాసిన అమరురాలు కామ్రేడ్ నీతి స్మరణలో:
‘‘విప్లవోద్యమాన్ని విస్తరించడానికి పార్టీ పంపిస్తే ఎటువంటి ఊగిసలాట లేకుండా వచ్చింది ఊర్మిళ. చూడటానికి కూడ చిన్నగా కన్పించేది. ఆనాటికి నా కంటికి చిన్న పిల్ల. బయటివారితో మాట్లాడేపుడు ఆదివాసీలకు వుండే కొంత బెరకు, మొహమాటం కూడ కనిపించేది. కానీ, రామన్న వద్ద మాత్రం వీళ్లెవరైనా సరే ప్రేమతో కూడిన డిమాండ్‌గా మాట్లాడేవాళ్లు. అడవిలో ఉద్యమాన్ని గురించి, దళ జీవితాన్ని గురించి, విప్లవ జీవితాన్ని గురించి తొలి పాఠాలు నేర్చుకున్నది వీరి వద్దే. వీరితో గడిపిన రోజులు ఎప్పటికీ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే అనుభవం’’. – నర్ల రవి‘‘చనిపోయిన వాళ్లలో 25 లక్షల అవార్డు నెత్తి మీద మోస్తున్న ఆదివాసీ దళ కమాండర్ ఊర్మిళ కూడ ఉంది. ఎన్నో హింసల నుండి విముక్తి కోసం దళంలో చేరితే మాటి మాటికి పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారు? నేనింకా ఆదివాసీల కోసం చాలా చేయవలసి వుంది అని మావోయిస్టు పార్టీతో చాలా కాలం క్రితం వాదించిందనీ, ఆమె నడిచిన దారి స్పూర్తి దాయకమనీ కరుణక్క ఓ పుస్తకంలో రాసింది. ఇవాళ (ఫేస్ బుక్ లో) పోస్టు చేసింది’’ – చెరకు సుధాకర్.
కామ్రేడ్ నీతి పొట్టావీ గురించి ఎన్ని జ్ఞాపకాలు? ఇవాళటి నీతి నిన్నటి ఊర్మిళ. నిన్నటి ఊర్మిళ ఒకనాటి ఇర్మగుండ మట్టిబిడ్డ. దక్షిణ బస్తర్ – పశ్చిం బస్తర్ కు సరిహద్దుగా నిలిచిన కిరందూల్ ఇనుప కొండల మొదట్లో నెలకొన్న ఆదివాసీ గ్రామం ఇర్మగుండ. ఆ కొండలను, అడవులను, ఆదివాసీల ఆరాధ్య దేవతలను పరాయి శక్తుల నుండి కాపాడుకోవ డానికి ముందు తరం ఎంతో నెత్తురు ధారపోసింది. కానీ, ఆ కొండలను భారత ప్రభుత్వం దాని భద్రతా బలగాల ద్వారా ఆదివాసీ ప్రజలపై గుండ్ల వర్షం కురిపించి కైవశం చేసుకుంది. అక్కడి నుండి రోజూ టన్నుల కొద్ది ఇనుప ఖనిజాన్ని తవ్వి తీస్తూ, నూతనంగా రూపొందించిన పలాసా-కిరందూల్ రైలు మార్గం ద్వారా జపాన్ కు తరలించి బస్తర్‌లో దాని రక్త పంకిల చరిత్రను మరోమారు ఆవిష్కరించింది.
వలస కాలం నుండి బస్తర్ నెత్తురోడుతూనే వుంది. అనేక పితూరీలకు అది నెలవైంది. అక్కడ 1825 నుండే ఆదివాసీ ప్రజా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. 1964 వరకు దాదాపు 10 తిరుగుబాట్లు జరిగిన చరిత్ర అక్షరబద్దమై వుంది. వేలాది మంది ఆదివాసీల రక్తతర్పణంతో ఆ అడవులు ఎరుపెక్కినయి. ఆ అడవులపై అధికారం కోసం వేలాది మంది ఆదివాసీలు తమ అమూల్యమైన ప్రాణాలను ఆహుతిచ్చారు. రక్తసిక్తమైన ఆ అడవులలో తదనంతర చరిత్ర, ఒక నూతన చరిత్ర, కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్ర 1980లో ప్రారంభమైంది. ఆ చరిత్రలో రూపొందిన ఒక అపురూపమైన తరానికి చెందిన మట్టి బిడ్డ ఊర్మిళ.
గత ఐదు దశాబ్దాలుగా దండకారణ్యం నడిగడ్డన ఎంత మంది మట్టి బిడ్డలు భూమి కోసం, భుక్తి కోసం, మనువాద సంకెళ్ల నుండి మహిళా విముక్తి కోసం, పురుషాధిక్య సమాజ మార్పు కోసం, స్త్రీ-పురుషుల సమాన హక్కుల కోసం, దోపిడీ రహిత సమాజం కోసం తమ నెత్తుర్లను చిందిస్తున్నారు? గడచిన అర్ధ శతాబ్ద దండకారణ్య విప్లవోద్యమంలో వందలలోనే వారి సంఖ్య వుంటుంది. ఎవరినని గుర్తు చేసుకుందాం? అసలు మరిచిపోతే కదా, వారిని గుర్తు చేసుకోవడానికి! ఒక రణిత, ఒక రజిత, ఒక సృజన, ఒక సోనీ, దేవే, రామే, మంగ్లీ వంటి వీరవనితలు పదుల, వందల సంఖ్యలోనే తమ నులివెచ్చని రక్తంతో ఆ అడవులను పునీతం చేశారు. వారు అత్యంత ఉన్నతాశయం కోసం పోరాడారు. ఆ మార్గం త్యాగాల మార్గం. ఆ మార్గం, రక్తసిక్తమైన మార్గం. ఆ మార్గం నిర్ధాక్షిణ్యమైన విప్లవ మార్గం. వీళ్లంతా నిన్నటి అమరులు. విప్లవోద్యమంలో మహిళా నాయకులు. సాయుధమైన ఆదివాసీ ముద్దుబిడ్డలు. వీళ్లను 2001లోనే మా కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ సుమిత్‌జీ ‘ఆధే ఆస్మాన్ కే ఛమక్తే సితారే’ అన్నాడు. ఔను. అది అక్షరాల నిజం. వాళ్లంతా పోరాకాశంలో సదా ఉజ్వలంగా మెరిసే త్యాగజీవులు-సితారలు.
గడచిన యేడాది కాలంగా ఫాసిస్టు కగార్ సైనిక దాడులు ముమ్మరమవుతున్నాయి. ఈ దాడులలో ఒక శాంతక్క, ఒక లచ్చక్క, ఒక రీతా ఆ వరుసన ముక్కు పచ్చలారని ఆదివాసీ ముద్దుబిడ్డలు పదుల సంఖ్యలోనే తమ రక్తాన్ని చిందించారు. చిందిస్తున్నారు. వారి సరసన, వారి నాయకురాలిగా అవనిలో, ఆకాశంలో సగంగా నిలిచిన మన ఊర్మిళ త్యాగాల వరుసలోనూ అనుపమాన ధైర్య సాహసాలతో, దండకారణ్య సమరశీల ప్రజా పోరాటాల ప్రకంపనలలో అంతకు మిన్నగా తానై నిలిచింది.
ఆపరేషన్ కగార్ సైనిక దాడుల మధ్య ‘అజ్ఞాతవాసం’ గడుపుతున్న విప్లవకారుల ఆనుపానాలు శత్రువుకు చేరి, వారు నెత్తుర్లు చిందిస్తూ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఆ రక్తసిక్తమవుతున్న చరిత్ర ఎన్నెన్నో గుణపాఠాలను అందిస్తున్నది. వాళ్ల త్యాగాలు వృధా కావనీ, అవని ఘోషిస్తోంది.
బైలాదిల్లా కొండల అంచున గల ఆదివాసీ కుగ్రామం ఇరుమగుండాలో పుట్టిన మట్టి బిడ్డ కామ్రేడ్ ఊర్మిళ దాదాపు 100 మంది తన సహచరులతో శత్రువును సమరంలో వారి నాయకురాలిగా సవాల్ చేస్తూ తూర్పు బస్తర్ ప్రజా పోరాటాల చరిత్రకు వన్నె తెచ్చింది. ఆ భీకర సమరంలో ఆమె తనతో సహ 35 మంది సహచరుల త్యాగాలతో
ఉద్యమ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ఆ కాల్పుల సందర్భంగా ఆమెతోనే వున్న ఒక మహిళా కామ్రేడ్ ఆమె గురించి రాసుకున్న జ్ఞాపకాలను ఇక్కడ ఉల్లేఖించడం సముచితంగా వుంటుంది.
‘‘వందలాది శత్రు మూకలు కురిపిస్తున్న వేలాది తూటాలతో కంపిస్తున్న రణభూమిలో క్షతగాత్రురాలై కదలలేని స్థితిలో వున్న కామ్రేడ్ నీతిని కిరాయి బలగాలు ఇష్టమొచ్చినట్టు చిత్ర హింసలు పెట్టాయి. జుట్టును కత్తిరించాయి. కర్రలతో కొట్టి, కొట్టి విసిగి వేసారిపోయాయి.నీతికివన్నీ తెలిసినవే. శత్రువు స్వభావం తెలియనిది కాదు. అందుకే ఆమె తొణకలేదు, బెణకలేదు. సహచరుల మధ్యలో ధీరవనితగా నిలిచింది. వాడిని అపహాస్యం చేసింది, వాడికి సవాల్ విసిరింది. ‘చంపుకుంటే చంపుకోండి’ అని మృత్యువుకు వెరవని ధీరత్వాన్ని ప్రదర్శించింది. ఓటమిని అంగీకరించని వాడు చివరకు పిచ్చిగా ‘నీతి ముర్దాబాద్’ అంటూ గావుకేకలు పెట్టాడు. ఆ గావుకేకల మధ్య ఆమె తుది శ్వాస విడిచింది. నీతి గెలిచింది. ఆమె తన అమరత్వంతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించింది’’. ఆ హంతకులలో ఆమెతో ఉద్యమంలో పాలు పంచుకొని, హీనంగా దిగజారిపోయి, డీ.ఆర్.జీ (డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్) గా అవతారమెత్తిన వారు కూడ వున్నారు.
‘‘నీతిది చాలా గొప్ప హృదయం. చాలా ఓర్పు, నేర్పు కలిగిన ఉన్నత కమ్యూనిస్టు విలువలున్న ఆదర్శ కామ్రేడ్. పగలైనా, రాత్రైనా ఎప్పుడూ ఏదో ఒక మీటింగ్‌లో బిజీగా వుండేది. ఒక్కోసారి అన్నం తినేంత సమయం కూడ దొరికేది కాదు. ఎప్పటికో వచ్చి రెండు ముద్దలు నోట్లో వేసుకునేది. తిండి విషయంలో సమయం దాటినప్పుడల్లా సూచించిన సహచర కామ్రేడ్స్ వైపు ఒక చిరునవ్వు విసిరేది. మళ్లీ వెంటనే మీటింగ్‌కు ఉపక్రమించేది’’.
‘‘కామ్రేడ్ నీతి గత రెండు సంవత్సరాలకు పైగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. కనీసం ఒక గంట సేపైనా నడువలేని స్థితి. అటువంటిది 3వ తేదీ రాత్రంతా నడిచేప్పటికీ బాగా అలసిపోయింది. దారిలో కళ్లు తిరుగుతున్నాయని ఒక ఐదు నిముషాలు అలా రెప్ప వాల్చింది.
తెల్లారి పోతుందని వెంటనే లేచింది. ఐదుసార్లు శత్రు దాడిలో దృఢంగా నిలబడిరది. గాయపడిన కామ్రేడ్స్ కుంగిపోకుండా తనున్న కవర్ ని వారికిచ్చి ఓదార్పుతో ధైర్యమిచ్చింది. ఆరవసారి జరిగిన సమరంలో కామ్రేడ్ నీతి ఎడమ చేతికి గాయమైంది. భూజానికున్న ఫ్లాస్క్ పగిలింది.
అయినా కుంగిపోలేదు. చివరి వరకూ కేడర్ కు ధైర్యం చెప్పటం ఆపలేదు….. నీతి మృత్యువును జయించింది’’
కామ్రేడ్ నీతి దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1994లో, విప్లవోద్యమంలో భాగమైంది. అప్పుడప్పుడే ఆమె యుక్త వయసులోకి అడుగిడుతోంది. బస్తర్‌లో ఊపందుకుంటున్న ప్రజా పోరాటాలతో ఆమె ప్రభావితురాలైంది. గ్రామాలలో ప్రజల పట్ల కర్కశంగా వుంటూ, తమ ఆధిపత్యాన్ని చలాయించే దోపిడీ తెగ పెద్దల ఆటలకు విప్లవోద్యమం చెక్ పెడుతుండడం ఆనాటి యువతరాన్ని కదిలించింది. రోజువారి ఆదివాసీ జీవితాలలో ప్రభుత్వ అటవీ శాఖ అధికారుల ఆగడాలకు విసిగి వేసారిన ప్రజలలో విప్లవోద్యమం పట్ల అనురక్తి పెరిగింది. తామెన్నడూ చూడని విధంగా, తామెరుగని విధంగా విప్లవకారుల నడవడికను గమనించిన ప్రజలు, ముఖ్యంగా యువత వారికి అతి సన్నిహితమైంది.
ప్రభుత్వ అటవీ శాఖ ఉద్యోగులు గ్రామాలలోకి వచ్చారంటేనే, సాధారణ ప్రజలలో ఆరోజు ఏదో ఉపద్రవం జరిగి తీరుతుందనే ఆందోళన నెలకొనేది. వారితో పాటుగా రెవెన్యూ శాఖ వారు కూడ వున్నారంటే, ఇక వారి పైశాచికత్వానికి హద్దులుండేవి కావు. వీరే కాకుండా, ఎక్సెజ్ శాఖ వారు తమ బలగంతో గ్రామాలపై పడ్డారంటే, ఏ ఇంట్లో ఏం మూడుతుందో చెప్పలేని పరిస్థితులే ఎదురయ్యేవి. కుటుంబ పోషణకు సరిపడా భూములు లేక, ఉన్న భూములలో సేద్యం సరిగా చేయలేక, నామమాత్రమైన పంట దిగుబడితో జీవిక సాగక ఆదివాసీ ప్రజలు అష్టకష్టాలు పడేది.
ఇవన్నీ ఊర్మిళ తరానికి తెలుసు. ఆ తరం ఆ ఆగడాలను అనుభవించిన తరం. ముందుతరాలు ఎంత రక్తం చిందించినా ఆ ఆగడాల నుండి విముక్తి లభించలేదు. కానీ, ఊర్మిళ తరం వాటి నుండి శాశ్వతంగా విముక్తిని కోరుకుంది. ఆ విముక్తి విప్లవోద్యమం ద్వారానే సాధ్యమని నమ్మింది. 1980ల ప్రారంభంలో బస్తర్ భూమికి విప్లవోద్యమంతో పరిచయమయ్యాక, ఇక ఒక్కొక్క విభాగపు పైశాచిక ఆగడాలకు అడ్డుకట్టలు పడడం ప్రత్యక్షంగా చూసిన తరం ఊర్మిళ తరం. ఆ తరాన్ని విప్లవోద్యమం కదిలించింది. ఆ ప్రజలలో విప్లవకారులకు రాగద్వేషాలకు అతీతమైన స్థానం లభించింది. విప్లవకారులను వారు దైవానికన్నా మిన్నగా భావించారు. ఏ దైవం వారి జీవితాలలో ఏ మార్పు తీసుకురాలేదు, కానీ, తామెన్నడూ ఎరుగని అద్భుతాలు విప్లవోద్యమం సృష్టించడం వారిని అబ్బురపరిచింది.
ఒక వైపు ప్రభుత్వ దోపిడీ యంత్రాంగంతో ఇబ్బందులు, మరోవైపు తెగ సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అంటూ అనుక్షణం గుర్తుచేసే దోపిడీ తెగ పెద్దల అణచివేతలతో ఆదివాసీ పేద ప్రజలు నిత్యం సతమతమయ్యేవారు. గ్రామాలలో యువతుల జీవితాలతో అందరూ చెలగాట మాడుకునే వారే. ప్రభుత్వ అధికారులు తమ సత్తా బలంతో కాగా, గ్రామీణ యువకులు రివాజుల బలంతో వారిని లొంగదీసుకునే వారు. ఎదురిస్తే తమకే కాకుండా తమ కుటుంబానికి ఏమవుతుందో తరతరాలుగా చూస్తున్న యువతులు అధిక శాతం మౌనంగా వాటిని భరించడమే అప్పటి వరకు వారికి జీవితం నేర్పింది. వాటికి బలి కాకూడదనీ దృఢంగా భావించిన, తెగింపుతో కూడిన బస్తర్ ఆదివాసీ మహిళలు మాత్రం ఆత్మరక్షణ కోసం తన సిగలో చురకత్తి లేకుండా అడుగు బయట పెట్టే వారు కాదు. కామ్రేడ్ ఊర్మిళకు ఇవన్నీ తెలుసు. ఆమె వాటి అన్నిటి నుండి తన ప్రజల విముక్తిని కోరుకుంది. అది విప్లవోద్యమం ద్వారానే సాధ్యమని నమ్మింది. అందుకే ఆమె సాయుధమైంది. యుక్త వయస్సులోనే సాయుధమై సమర రంగాన నిలిచింది. ఆమెను భర్తీ చేసుకున్న మల్లు భీమన్న (నెమలి పిట్టల వేటగాడు కావడంతో మల్లు భీమన్న పేరుతోనే మా అందరికి ప్రియమైనవాడు) అమరుడు కాగా, భద్రన్న లొంగిపోయి విప్లవాభిమానిగా కొనసాగుతున్నాడు. కామ్రేడ్ రాజ్ మన్ ఆమెకు నాయకుడిగా ఎస్.జడ్.సీలో వున్నాడు.
ఆదివాసీ గ్రామాలలోకి ఫారెస్టు విభాగపు వారు ‘ఈ అడవి మాది’ అంటూ రావడం విప్లవోద్యమం ప్రవేశంతో నిలిచిపోయింది. విప్లవోద్యమం అనేక మంది ప్రజావ్యతిరేక, దుష్ట అధికారులను శిక్షించడంలో ప్రజలు గెరిల్లాలకు ఎంతగానో సహకరించేవారు. దానితో, ఆ దుర్మార్గులు విప్లవోద్యమం కాలూనిన గ్రామంలోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోతూ, పొరపాటున వెళితే అక్కడ ఎదురయ్యే అనుభవాలతో, తమ పేంట్లు తడుపుకుంటూ పరుగు పెడుతుంటే, జనం సంతోషానికి అవధులుండేవి కావు. గ్రామాలలో బలిసిన తెగ పెత్తందార్ల అరాచకాలకు సైతం గెరిల్లాలు అడ్డుకట్టలు వేస్తుండడం యువతను విప్లవోద్యమం వైపు ఎలాంటి ఊగిసలాట లేకుండా నిలబడడానికి ఆలోచించేలా చేసింది. ఆ రాజకీయాలతో, గెరిల్లాల ఆచరణతో, ఆత్మీయతతో, వారి త్యాగాలతో, నిస్వార్థంతో బస్తర్ భూమి బిడ్డలెందరో సాయుధమయ్యారు. ఆ యువతరంలో కామ్రేడ్ ఊర్మిళ ఒక భాగం.
భారత దేశంలో రెండవ అతి పెద్ద జిల్లా అయిన ఒకనాటి బస్తర్ జిల్లా, మన దేశంలోని కేరళ రాష్ట్రాన్ని మించిన వైశాల్యాన్ని కలిగిన ప్రాంతం కావడంతో, విప్లవోద్యమ విస్తరణకు అపారమైన అవకాశాలు వుండే. విశాలమైన అడవులు, ఆదివాసులు, అపారమైన ప్రకృతిక సంపదలకు నిలయం అయిన బస్తర్ విప్లవోద్యమానికి నారుమడిలా ఎదిగివచ్చింది. ప్రారంభంలో దక్షిణ బస్తర్ కు పరిమితమైన విప్లవోద్యమం దశాబ్దకాలం తిరుగక ముందే ఉత్తర్ బస్తర్ కు విస్తరించే లక్ష్యాన్ని చేపట్టి దానిని పూర్తి చేయడానికి స్థానికంగా విప్లవోద్యమంలో చేరుతున్న యువతపై ఆధారపడిరది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాపునాదిని బలోపేతం చేసుకుంటూ విస్తరణ కర్తవ్యాన్ని చేపట్టిన విప్లవోద్యమం క్రమక్రమంగా ఉత్తర్ బస్తర్ లో కాలూనుకోసాగింది. అందుకు ఊర్మిళ లాంటి యువతే పునాదులు వేశారు. వీరికి తోడుగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజా ఉద్యమం నుండి దండకారణ్యానికి తరలివస్తున్న యువతరం విస్తరణలో దృఢంగా నిలబడిరది. ఉత్తర్ బస్తర్ లో విప్లవోద్యమం కాలూనుకోవడంలో తీవ్రంగా కృషిచేసిన వారిలో వరంగల్ జిల్లా యువతరం విశిష్ట భూమికను పోషించింది. కామ్రేడ్ రామన్న (శ్రీనివాస్), ఆయనకన్నా ముందే టేకులగూడ నుండి విప్లవోద్యమంలో చేరిన కామ్రేడ్ సుఖ్ దేవ్ (విజయ భాస్కర్), ఆ జిల్లా నుండే విప్లవోద్యమంలో చేరిన నల్లా వసంత్ (వీరిద్దరు అమరులయ్యారు) లను ఈనాటికి ప్రజలు స్మరించుకుంటారు. ఆ ప్రజావీరుల సరసన నిలిచి అనేక పాఠాలు నేర్చుకున్న కామ్రేడ్ ఊర్మిళ వారి నిజమైన ఉద్యమ వారసురాలిగా మూడు దశాబ్దాల కాలం మడమ తిప్పని వీరవనితగా నిలిచి విప్లవోద్యమానికి వన్నె తెచ్చింది.
2000 నవంబర్ లో మధ్యప్రదేశ్ నుండి విడిపోయి ఛత్తీస్‌గఢ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును విప్లవోద్యమం ఆహ్వానిస్తూనే, విశాల బస్తర్ ను అందులో కలపకుండా, దానినే విడిగా ఒక రాష్ట్రంగా ఏర్పర్చాలనీ డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ పట్ల ఆదివాసీ ప్రజలలో గొప్ప ఉత్సాహం వెల్లివిరిసింది. కానీ, బస్తర్ లేని ఛత్తీస్‌గఢ్ ను దోపిడీ వర్గాలు ఊహించలేకపోయాయి. ఛత్తీస్‌గఢ్ పాలకవర్గాలకు ఉత్తరాన విశాల ఆదివాసీ జనసముదాయాలను కలిగిన సర్గూజా ప్రాంతం, దక్షిణాన బస్తర్ ప్రాంతం కావడిలా వుండి అపార సంపదలను అందిస్తున్నాయి. అలాంటి ప్రాంతాలను దోపిడీ వర్గాలు వదలుకోలేవనీ, ప్రత్యేక బస్తర్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం ద్వార మరోమారు స్పష్టమైంది. ఫలితంగా, ప్రత్యేక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రావతరణతో ఒకనాటి బస్తర్ క్రమంగా 7 జిల్లాలుగా విభజితమైంది. వాటిలో, ఉత్తర బస్తర్ ప్రధానంగా నారాయణ్ పుర్, కాంకేర్, కొండగాం, బస్తర్ జిల్లాలతో కూడుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో మాడ్ దళాలు సహ కేశ్ కల్, రావ్ ఘాట్, ప్రతాప్ పుర్ దళాలు వుండేవి. కామ్రేడ్ ఊర్మిళ కేశ్ కల్ దళ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లలో ఏసీ (ఏరియా కమిటీ) సభ్యురాలైంది. 2006లో డీవీసీ (డివిజనల్ కమిటీ) సభ్యురాలై, 2016-17లలో డీవీసీ కార్యదర్శి, 2020లో ఎస్.జడ్.సీ (స్పెషల్ జోనల్ కమిటీ) ప్రత్యామ్నాయ సభ్యురాలుగా, 2024లో పూర్తికాలం ఎస్.జడ్.సీ.ఎం వరకు ఎదిగింది.
విప్లవోద్యమ అవసరాల రీత్యా దళాల ప్రాంతాలలో భౌగోళికంగా అనేక మార్పులు జరిగాయి. ఆ మార్పుల పర్యవసానంగా, ఉనికిలోకి వచ్చిన డివిజన్ తూర్పు బస్తర్ డివిజన్. ఆ డివిజన్ ఉద్యమానికి కామ్రేడ్ ఊర్మిళ నాయకురాలిగా ఎదిగింది. అక్కడి నుండే 2020 అక్టోబర్‌లో ఎస్.జడ్.సీ లోకి ప్రత్యామ్నాయ సభ్యురాలుగా ఎన్నికైంది. ఆమె అమరత్వానికి కొద్ది రోజుల ముందే, ఆమెను పూర్తికాలం సభ్యురాలుగా ఎస్. జడ్.సీలోకి తీసుకున్నారు. కానీ, ఆ సంతోషకరమైన, ఉత్సాహభరిత వార్త ఆమెకు తెలియక ముందే ఆమె అమరురాలు కావడం విచారకరం. నాయకత్వం అక్కడి కామ్రేడ్స్ తో ఆ విషయం పంచుకోవడకే జరుపతలపెట్టిన సమావేశంపై అనూహ్యమైన శత్రు సైనిక దాడి జరిగి 35 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. ఆ దాడిలో గాయపడిన కామ్రేడ్ రాంశిల కొద్ది రోజుల తరువాత అమరురాలు కావడంతో ఆ సంఖ్య 36కు చేరింది.
పశ్చిమ బస్తర్ నుండి ఆనాటి ఉత్తర్ బస్తర్ కు బదిలీ అయిన కామ్రేడ్ ఊర్మిళ కొత్త ప్రాంతంలో అనేక విషయాలు నేర్చుకుంది. రెండు ప్రాంతాలలో సారూప్యతలు ఎన్ని ఉన్నప్పటికీ, అనేక తేడాలూ వున్నాయి. ముఖ్యంగా కేశ్ కల్ ప్రాంతంలోకి అప్పుడపుడే విస్తరిస్తున్న హిందుత్వ శక్తుల ప్రమాదం తీవ్ర స్థాయిలో వుండిరది. ఈ ప్రాంతంలోకి అనేక హిందుత్వ సంస్థలు ప్రవేశించడం, ఈ ప్రాంతంలోని సంపన్న ఆదివాసీ కుటుంబాలు హిందూ మతాన్ని స్వీకరించడం, మాలబిత్తల్ (జంధ్యం వేసుకోవడం) గా అవతరించడం, ఆదివాసీలను కత్వా (అస్ప్రుశ్యులు) గా ఈసడిరచుకోవడం, ఆదివాసీ ఆవాసాలపై దాడులు చేయడం, వారు తమ ఇళ్లలో కాచుకునే ఇప్పసార కుండలను పగులకొట్టడం, వారి గోటుళ్లను (గ్రామ రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలు) తగులపెట్టడం, ఆదివాసీలపై దాడులు చేయడం విపరీతంగా సాగుతున్న కాలమది. హిందూమత తీర్థం పుచ్చుకున్న బలిరాం కశ్యప్ ఈ ప్రాంతం నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించడంతో ఇక్కడ హిందుత్వ శక్తుల రాజకీయ ప్రాబల్యం కొనసాగేది. ఇప్పటికీ వీరి కుటుంబం నుండే లోక్ సభ, విధానసభలకు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి పదవులను అలంకరించడం గమనార్హం. నైతాం, ఊసండి లాంటి ఇతర ఆదివాసీ భూస్వామ్య కుటుంబాలు హిందూ మతం స్వీకరించినప్పటికీ, కశ్యప్ కుటుంబంలా ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకొన్నవి కావు. వీరి ప్రజా వ్యతిరేకత మూలంగా వీరి కుటుంబ సభ్యులను విప్లవోద్యమం పలుమార్లు శిక్షించింది. ఆనాడు ఇక్కడ ఆదివాసీ ప్రజలపై కొనసాగుతున్న తిరోగామి శక్తుల దాడులను అత్యంత అంకితభావంతో ప్రతిఘటించడంలో కామ్రేడ్స్ సుఖ్ దేవ్ తో పాటు నిలిచిన అనేక మంది గెరిల్లా కామ్రేడ్స్ లలో కామ్రేడ్ ఊర్మిళ ఒకరు. తమపై, తమ సంస్కృతిపై కొనసాగుతున్న అమానుషమైన హిందుత్వ శక్తుల ప్రాణాంతక దాడులను ఎదుర్కొని తమకు రక్షణగా నిలిచిన గెరిల్లాలు ఆ పీడిత ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆ జ్ఞాపకాలు, ఆ అనుభవాలు ఆమెను హిందుత్వ శక్తుల కర్కశత్వాన్ని, కపటత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడినవి. మన దేశంలో 2014లో కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న హిందుత్వ శక్తులకు దృఢంగా, నమ్మకంగా నిలిచే కరుడుగట్టిన స్థానిక హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించడంలో ఆమెకు ఆ అనుభవాలు ఎంతగానో తోడ్పడినవి.
కామ్రేడ్ ఊర్మిళ ఉత్తరానికి చేరేనాటికి ఇక్కడి ప్రజా సంస్కృతిలో కూడ కాలం చెల్లిన సంప్రదాయాలు కొనసాగుతుండడంతో ఆనాటి విప్లవకారులకు చరిత్రలో ప్రజా జీవనంలోని మూలాలను తెలుసుకోవడానికి ఎంతగానో తోడ్పడిరది. ఇక్కడి యువతలో తరతరాల ఆదివాసీ ప్రజా సంప్రదాయాల ప్రభావం బలంగా వుండేది. ఈ ప్రాంతంలోని యువకులు జుట్టు కత్తిరించుకునేవారు కారు. ఆనాటి తరాలు బ్లేడ్ లతో మీసాలు, గడ్డాలు తీసేసుకోవడం ఎరుగరు.
అరకొరగానే ముఖంపై మొలిచే నాలుగు వెంట్రుకలను పెంకాసు బిళ్లలతోనే పీకేసేవారు. దానితో ముఖం అంతా ఎర్రబారిపోయేది. జుట్టు కత్తిరించుకున్న యువకున్ని పడుచు మహిళలు ఎగతాళి చేసేవారు. యువకులు సైతం చెవులకు రింగులు, మెడలో హారాలు, రంగురంగుల అలంకరణ సామగ్రితో చూడముచ్చటగా అలంకరించుకొని రాత్రులలో గోటుళ్ల వద్ద నాట్యం చేయడానికి ముస్తాబై వెళ్లేవారు. ఆడ-మగ కలిసి ఒకరి భుజాలపై మరొకరు, ఒకరి నడుం పట్టుకొని మరొకరు ఆహ్లాదంగా చేసే ఆ నృత్యం ఏ అర్ధరాత్రో ముగిసేది. ఆ సందర్భంగా, వావీ వరుసలు మాత్రం కచ్చితంగా చూసేవారు.
ఆదివాసీ కుటుంబాలలో బుద్దెరిగిన పిల్లలు, వృద్ధులు ఎవరూ ఇంట్లో పడుకోరు. పూరి గుడిసెల్లో తల్లి-తండ్రులే కాపురం చేస్తారు. రాత్రులందు పిల్లలు గోటుల్ లోనే పడుకుంటారు. దక్షిణ బస్తర్ లో ఉనికిలో లేని గోటుల్ సంప్రదాయం, గోటుల్ సెక్స్ ఉత్తర బస్తర్ లో ఎలాంటి మార్మికత లేకుండానే సాగేది. యువతరానికి ప్రపంచం గురించి జ్ఞానోదయం కలిగించేది గోటులే.
గోటుల్ లో గడిపే రాత్రులలో అక్కడ ముసలివారు చెప్పే వారి జీవితానుభవాలు యువతకు వారి చిన్నారి ప్రపంచాన్ని వారి కళ్లముందుంచేవి. గోటుల్ ఒక పెద్ద చర్చా కేంద్రంగా వుండేది. రోజూ ఉదయాన్నే ఊరి పురుషులంతా గోటుల్ కు చేరుకొని ఆరోజు తాము చేయతలపెట్టిన దినచర్యల గురించి పరస్పరం చెప్పుకునే వారు. తిరిగి సాయంకాలం మళ్లీ గోటుల్ కు చేరుకొని ఆ దినచర్యలలో జరిగినవి, జరుగనివి, ఎదురైన ఇబ్బందులు అన్నీ పరస్పరం మాట్లాడుకునే వారు.
దీనితో, ఊరివాళ్లందరికి ఒకరి గురించి మరొకరికి ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాల గురించి ఎరుక వుండేది. సంత రోజులలో సంతకు వెళ్లడం వారి జీవితాలలో ఒక గొప్ప వినోదాత్మకంగా వుండేది. వినోదంతో పాటు విజ్ఞానదాయకంగానూ వుండేది. వారికి బయటి ప్రపంచం గురించి తెలిసేది సంతలలోనే. కాబట్టి సంతకు వెళ్లడానికి ప్రతివారు ఎంతో ఇష్టపడేవారు. ఇవన్నీ కామ్రేడ్ ఊర్మిళకు వింతగానే వుండేది.
మారుతున్న ప్రపంచంలో ఆదివాసీ గ్రామాలకు రకరకాల పేర్లతో గైరాదివాసులు రావడం పెరిగింది. ప్రభుత్వ కార్యకలాపాలు పెరిగాయి. ఆదివాసీ యువతలో కూడ లంపెన్ లక్షణాలు చోటుచేసుకోవడంతో గోటుల్ సెక్స్ ను దుర్వినియోగం చేయడం పెరిగింది. మహిళల జీవితాలలో గోటుల్ సెక్స్ ఒక పీడకలలా మారింది. ఆదివాసీ సంస్కృతిని ఎంత కలుషితం చేయసాగారంటే, యువతులు భరించలేని విధంగా తయారైంది. దీనితో, గ్రామాలలోని అనేక మంది యువతులు గోటుల్ సెక్స్ ను నిలిపివేయాల్సిందిగా విప్లవకారుల ముందు ప్రతిపాదించ సాగారు. వారి జీవితాలలో ఎదురవుతున్న ఘాతుకాలను మొరపెట్టుకోసాగారు. మరోవైపు, దండకారణ్యంలో క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం (కే.ఏ.ఎం.ఎస్) ప్రారంభమై వేగంగా విస్తరించసాగింది. గ్రామీణ యువతులు అందులో పెద్ద ఎత్తున చేరడం వారికి ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేసింది. సంఘంలో చేరిన మహిళలకు సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం పెరుగడంతో పాటు వారి జోలికి ఏ పురుషుడు వెళ్లేవాడు కాదు. గ్రామ గ్రామాన మహిళలను కే.ఏ.ఎం.ఎస్ లో చేర్పించడానికి కామ్రేడ్ ఊర్మిళ ఎంతగానో పాటుపడిరది. వారి జీవితాలలో పెను మార్పులకు సంఘం పునాదులు వేసిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
దండకారణ్య వర్గ పోరాటంలో విప్లవోద్యమం బలపడడానికి, ప్రజాపునాది పెరుగడానికి ఇవన్నీ ఎంతగానో తోడ్పడినవి. ఇవన్నీ పోలీసులు తరచుగా కొనసాగించే దాడుల మధ్యనే, త్యాగాల మధ్యనే, ఎరుపెక్కే అడవులలో ప్రజలను ఎర్రజెండా నీడలో సంఘటితం చేశాయి. ఉత్తర్ బస్తర్ లోని జమీందారుల అన్యాక్రాంత భూములను విప్లవోద్యమం రైతులకు పంచడం, కుటుంబ పోషణకు సరిపడా వ్యవసాయ భూములు లేని ఆదివాసీ, గైరాదివాసీ రైతులు విప్లవోద్యమ అండతో నూతనంగా అడవి నరికి అటవీ భూములను సాగులోకి తెచ్చుకోవడం,
ఫారెస్టు అధికారుల భయం లేకుండా అటవీ ఉత్పత్తులను సేకరించుకొని వాటిని సంతలలో గతం కన్నా అధిక ధరలకు అమ్ముకోవడం, సంతలలో రైతులు గతంలా సాహుకార్ల మోసాలకు బలికాకుండా వుండడం మొదలైన సందర్భాలలో విప్లవోద్యమం చేపట్టిన వివిధ రకాల ప్రజా పోరాటాల ద్వారా కామ్రేడ్ ఊర్మిళ ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంది. క్రమంగా ఆమె ఎదుగుతూ పార్టీలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో గత అనుభవాల ద్వారా స్వంతంగా ఆమె అనేక ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించి ప్రజల అపార విశ్వాసాన్ని చూరగొంది.
కామ్రేడ్ ఊర్మిళ సైనిక రంగంలో కూడ మంచి అనుభవాన్ని సంపాదించింది. ఆమె పీ.ఎల్.జీ.ఏ చేపట్టే ప్రతి టీసీవోసీ (టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ కేంపెయిన్)లో భాగమైంది.
తూర్పు బస్తర్ లో పీ.ఎల్.జీ.ఏ జయప్రదం చేసిన అనేక సైనిక చర్యలలో కామ్రేడ్ ఊర్మిళ పాత్ర వుంది. ఆమె అనేక చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొంది. మరెన్నో చర్యలు జయప్రదం కావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. వాటిలో మచ్చుకు కొన్ని మనం చెప్పుకోవాలంటే, దక్షిణ, పశ్చిమ బస్తర్ లలో ఆదివాసీ జనాన్ని ఊచకోత కోసి, గ్రామాలకు గ్రామాలనే తగులపెట్టి, పంటలను, అడవి పంటలను బూడిదపాలు చేసి హత్యలు, అత్యాచారాలతో కకావికలం చేసిన ఫాసిస్టు సల్వాజుడుం కాలంలో తూర్పు బస్తర్ కు అది విస్తరించకుండా నిలువరించడంలో పార్టీ చేపట్టిన విధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలో కామ్రేడ్ నీతి చొరవతో ముందు నిలిచింది. తన ప్రాంత ప్రజలను అందుకు తగిన విధంగా సిద్ధం చేసింది. ఆ సమయంలో దాని విస్తరణను అడ్డుకోవడంలో భాగంగానే, శత్రు బలగాలపై జరిపిన ‘కోరార్ దొడ్డ’ అంబుష్ (2007)లో శత్రు బలగాలను మట్టి కరిపించి, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వెనుక కామ్రేడ్ ఊర్మిళ పాత్ర ప్రశంసనీయమైనది.
ఆ దాడి సమయంలో గెరిల్లాల చేతికి చిక్కిన ముగ్గురు పోలీసులను యుద్ధ బందీలుగా గుర్తించి, వారితో మర్యాదగా వ్యవహరించి, వారికి వైద్యం చేసి, వారికి ఆ కాసేపట్లోనే, భయంకరమైన కాల్పుల మధ్య విప్లవ రాజకీయాలు చెప్పి సాగనంపడం వెనుక కామ్రేడ్ ఊర్మిళ పాత్ర వుంది. అలాంటి గొప్ప ప్రతిఘటన, దేశ వ్యాప్త ప్రజల, ప్రజాస్వామిక శక్తుల అండదండలతో, స్థానిక పీడిత ప్రజలు విప్లవోద్యమ నాయకత్వంలో శ్వేత బీభత్సాన్ని సృష్టించిన సల్వాజుడుంను 2009 నాటికే ఓడిరచారు. 2006 చివరి నాటికి యావత్ బస్తర్‌ను కైవశం చేసుకొని గోదావరి నదిని దాటి తెలంగాణ గడ్డన జుడుం జెండాను ఎగురవేస్తానని ప్రగల్భాలు పలికిన ఆదివాసీ తెగ పెద్ద, దుష్ట భూస్వామి, దోపిడీ పాలకవర్గాల నమ్మిన బంటు మహేంద్ర కర్మ దూకుడుకు పీ.ఎల్.జీ.ఏ., పశ్చిమ దక్షిణ్ బస్తర్ ప్రజలు కళ్లెం వేశారు.
నిజానికి 2006 చివరినాటికే దాని దూకుడు అది ఊహించనంతగా తగ్గి దాని విస్తరణ కలలు కల్లలై చతికిలబడిపోయింది.
2011లో దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టిన సల్వాజుడుం ఓటమితో బెంబేలు పడిన దోపిడీ వర్గాలు కామ్రేడ్ లెనిన్ హెచ్చరించినట్టు పది రెట్ల అదనపు బలంతో, నూతన వ్యూహాన్ని రచించుకొని ‘హరిత వేట’ (గ్రీన్ హంట్) పేరుతో అడవులపై, ఆదివాసీలపై బడి దాదాపు దశాబ్దకాలం వారికి ఊపిరి సలుపుకోనివ్వ లేదు. సల్వాజుడుం అనుభవాలతో రాజకీయంగా, సైద్ధాంతికంగా, నిర్మాణపరంగా, సైనికంగా ఉద్యమాన్ని పటిష్టవంతం చేసుకున్న పార్టీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. దేశంలోని వామపక్షాల సోదరులకు, బుద్ధిజీవులకు, హక్కుల సంఘాల కార్యకర్తలకు, ప్రపంచ వ్యాప్తంగా మేధావులకు, పీడిత ప్రజల మేలుకోరే వారికి పార్టీ భారత పాలకవర్గాలు తలపెట్టిన ఫాసిస్టు యుద్ధాన్ని నిలువరింపచేయాలని విజ్ఞప్తి చేసింది. దీనితో, పీడిత జన పక్షపాతి, ప్రొఫెసర్ కామ్రేడ్ సాయిబాబా సహ ఆనాటి సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ తో పాటు అనేకమంది ఉదారవాద ప్రజాస్వామికవాదులు, మేధావులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు, పాత్రికేయులు, వామపక్షాల సోదరులు అనేకానేక మంది దిల్లీలో సమావేశమై ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ‘‘ప్రజలపై యుద్ధం’’గా అభివర్ణించాయి. దానిని వ్యతిరేకిస్తూ ఆదివాసీ ప్రజల పక్షం నిలవడానికి, ఈ దేశ వనరులను కాపాడుకోవడానికి అన్ని విధాలా ముందుకు వచ్చాయి.
స్థానిక ఆదివాసీ తెగ పెద్దలను ముందుపెట్టి సల్వాజుడుంను నడిపించిన భారత పాలకులు దాని ఓటమితో గుణపాఠం తీసుకొన్నాయి. ఇక, లాభం లేదనుకొని భారత ప్రభుత్వమే నేరుగా రంగప్రవేశం చేసింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పాటు, ఆధునిక శిక్షణ, ఆయుధాలు మాత్రమే కాకుండా, గగనతలం నుండి మానవ రహిత వాహనాల (యూ.ఏ.వీ) నిఘా ప్రారంభమైంది. కేంద్రం నుండి పోలీసులకు ఆత్మరక్షణ పేరుతో వైమానిక దాడులకు అనుమతి లభించింది. రాష్ట్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం (యూపీఏ) వున్నప్పటికీ వారంతా సమైక్యంగానే దేశ ప్రధాని మన్ మోహన్ నిర్ధారించిన ‘దేశ అంతరంగిక భద్రతకు ఏకైక ప్రమాదకర శక్తి వామపక్ష ఉగ్రవాదాన్ని’ సమూలంగా నిర్మూలించడానికి పూనుకున్నాయి. ఆయన దీనిని ‘వైరస్’ గానూ అభివర్ణించాడు. ఆ సమయానికి తూర్పుబస్తర్ మాడ్ నుండి విడిపోయి, ప్రత్యేక డివిజన్ గా ఉనికిలోకి వచ్చింది. కామ్రేడ్ ఊర్మిళ ఆ నూతన డివిజన్ నాయకత్వంలో భాగమైంది.
2003 మార్చ్ లోనే బస్తర్ లోకి అడుగిడిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు తోడు సల్వాజుడుం కాలంలో పెద్ద ఎత్తున మరిన్ని కేంద్ర సాయుధ బలగాలను భారత పాలకవర్గాలు అడవిలో దింపాయి. సల్వాజుడుం కాలంలోనే దండకారణ్యానికి మొట్టమొదట మందుపాతర నిరోధక వాహనాలు పరిచయమయ్యాయి. సల్వాజుడుంతో తలపడిన ఆదివాసీ ప్రజలు ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ఎదుర్కోవడానికి నడుం బిగించాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ నాటికి దండకారణ్యంలో, భారత విప్లవోద్యమంలో తొట్టతొలి పీ.ఎల్.జీ.ఏ బెటాలియన్ ఏర్పడిరది. అది అనతికాలంలోనే దక్షిణ బస్తర్ లో 2010 ఏప్రిల్ లో ముకురం మాటుదాడి (తాడిమెట్ల)ని సఫలం చేసి దాదాపు 76 మంది సీ.ఏ.పీ.ఎఫ్ బలగాలను మట్టి కరిపించింది. ఆ దాడి సఫలమైన మూడు మాసాల లోపే తూర్పు బస్తర్ లో కొంగెర అంబుష్ (2010)ను సఫలం చేసి ప్రజా ప్రతిఘటనను ఉన్నత, నూతన ఎత్తులకు చేర్చాయి. అనధికారికంగానే ఆపరేషన్ గ్రీన్ హంట్ 2017 మధ్య వరకు సాగింది. ఈ కాలంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు ప్రారంభంలో కన్నా పది రెట్లు పెరిగాయి. సీ.ఏ.పీ.ఎఫ్ బలగాలు అనేక రెట్లు పెరిగాయి. అయినప్పటికీ, భారత పాలక వర్గాలు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, 2017-22 వరకు హిందుత్వ శక్తుల నాయకత్వంలో ‘ఆపరేషన్ సమాధాన్’ సైనిక వ్యూహం పంజా విప్పింది. అప్పటికే దాదాపు పుష్కరకాలంగా, విరామమెరుగకుండా సైనిక దాడులతో తలపడుతున్న ఆదివాసీ ప్రజలు అనివార్యంగా ‘సమాధాన్’ను ఎదుర్కోవడానికి ముందుకు రాక తప్పలేదు.
అప్పటికి, కామ్రేడ్ ఊర్మిళ ఒక వైపు ప్రజారంగపని (మాస్ వర్క్), మరోవైపు సైనిక రంగం (మిలిటరీ ఫ్రంట్) లో మంచి అనుభవాన్ని సంపాదించింది. అన్ని డివిజన్ లలో తొలి ప్లాటూన్ లతో పాటు పీ.ఎల్.జీ.ఏ కంపెనీలు ఏర్పడినాయి. పెద్ద ఎత్తున ప్రజా మిలీషియా ఏర్పడి పని చేస్తున్నది. 2008 నాటికే డివిజన్ స్థాయిలో జనతన సర్కార్ లు ఉనికిలోకి వచ్చి ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారం బీజప్రాయంలో అమలవుతోంది. కామ్రేడ్ ఊర్మిళ ఏరియా జనతన సర్కార్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించడంలో మంచి నేర్పరి అయింది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన ఆపరేషన్ సమాధాన్ ను ఎదుర్కోవడానికి పార్టీ ప్రత్యేక యూనిఫైడ్ కమాండ్ ను ఏర్పర్చింది. దాని, నాయకత్వంలో తూర్పుబస్తర్ లోని ఇర్పనార్ (2018)లో జరిగిన సఫల మాటుదాడిలో ఆమె భాగమైంది. ఆమె భాగస్వామ్యం లేకుండా తూర్పు బస్తర్ లో మాస్ వర్క్ లేదా మిలిటరీ వర్క్ ను ఊహించలేనంతటి ప్రాముఖ్యతను ఆమె తన ప్రత్యేక కృషి, పట్టుదల, ఎదుగుదల ద్వారా సంపాదించుకుంది.
ఆమెకు అనేక రకాల ఆయుధాలను వినియోగించడంలో మంచి అనుభవం వుంది. ఊర్మిళ పార్టీ తయారుచేసే 12 బోర్ వెపన్ మొదలుకొని.303, .315 రైఫిల్, ఎస్.ఎల్.ఆర్., ఏ.కే వరకు ఆయుధమేదైనా అవలీలగా ఉపయోగించేది. ఆమె చివరి రోజులలో ఏకే ధరించింది.
బాల్యంలో అక్షరాలు దిద్దని ఊర్మిళ పట్టుబట్టి విప్లవోద్యమంలో చేరిన ఒకనాటి ఆ చిన్నారి బుడత విప్లవోద్యమంలో విద్య నేర్చుకొని ప్రజలకు విప్లవ రాజకీయాలు వారి మాతృభాషలో బోధించడంలో మంచి నేర్పరిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, అమరుడు కామ్రేడ్ మల్లోరaల కోటేశ్యర్లు చొరవతో దండకారణ్యంలో 2000లో పురుడు పోసుకున్న డివిజన్ ప్రజా పత్రికలలో భాగంగా 2010 నాటికి తూర్పు బస్తర్ లో ‘భూంకాల్ సందేశ్’ పేరుతో డివిజన్ ప్రజా పత్రిక వెలువడసాగింది. అందులో కామ్రేడ్ నీతిగా మారిన ఊర్మిళ పాత్ర ప్రశంసనీయమైనది.
2010 నాటికి కామ్రేడ్ నీతి ఎంతో ఎదిగింది. 2008లో ఏర్పడిన దండకారణ్య జనతన సర్కార్ సన్నాహక కమిటీలో కామ్రేడ్ నీతి భాగమైంది. తూర్పు బస్తర్ లో జనతన సర్కార్‌లను నిర్వహించడంలో, ప్రజా మిలీషియాను పటిష్టపర్చడంలో విశేష అనుభవాన్ని సంపాదిస్తున్న కామ్రేడ్ నీతి 2008లో పార్టీ నిర్వహించిన జనతన సర్కార్ ల కార్యశాలలోవాటిని అందరితో పంచుకోవడంతో ఆ ప్రత్యేక అనుభవాలు జనరలైజ్ అయ్యాయి. ఆమె అనుభవాలు ఆ కార్యశాలకు హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి సహ అనేక మంది కేంద్ర కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులను అబ్బురపరిచింది. తూర్పుబస్తర్ లో ప్రజల ఆదరాభిమానాలను చూరగొని ఉత్సాహంగా, పట్టుదలగా కొనసాగుతున్న జనతన సర్కార్లను పరిశీలించడానికి 2010లో విదేశాల నుండి యాన్ మిర్డాల్ (స్వీడన్) లాంటి విశ్వ విఖ్యాత రచయితలు, మేధావి గౌతం నావల్క (దిల్లీ) లాంటి హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు అక్కడ పర్యటించారు. వారందరికి అన్ని రకాల వసతులు కల్పించడంలో కామ్రేడ్ నీతి ప్రత్యేక పాత్ర పోషించింది. తూర్పు బస్తర్ జనతన సర్కార్ల అనుభవాలను ఆ మిత్రులంతా తమ రచనలలో పొందుపరిచి ప్రపంచం ముందు ఆవిష్కరించారు. వారి సేవలు దండకారణ్య విప్లవోద్యమ చరిత్రలో అక్షరబద్ధమయ్యాయి. 2010లోనే ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ దండకారణ్యంలోని తూర్పు బస్తర్ చేరుకుంది. టేడుం, ఖిల్లెం, ఆదివేడ, తొండవేడ, వెడ్మా, కొంగెర, మర్సుకోలా, ఇన్నర్ లాంటి పదుల గ్రామాలు పర్యటించింది. ఆ సమయంలో కామ్రేడ్ నీతి వయనార్ దళ బాధ్యురాలుగా వుంది. ఆ గ్రామ ప్రజలలో నీతి పేరు తెలియనివారు వుండరనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. కామ్రేరడ్ రాయ్ తన క్షేత్ర పర్యటనలో ఆదివాసీ ప్రజలతో ముచ్చటించింది. గెరిల్లాల అనేక అనుభవాలను ప్రోది చేసుకుంది. ఆ సమయంలో కామ్రేడ్ నీతి నాయకత్వంలో నడిచిన ఫిబ్రవరి-10 భూంకల్ దిన శతాబ్ది వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంది. విప్లవోద్యమం ఈ దినాన్ని జనతన సర్కార్ల స్థాపనా దినంగా పాటించడం, ఆ వారసత్వ కొనసాగింపులో భాగమే.
తూర్పు బస్తర్ జనతన సర్కార్ వేడుకలలో పాల్గొని బయటకు వెళ్లిన రచయిత్రి రాయ్ తన దండకారణ్య అనుభవాలను వాకింగ్ విత్ కామ్రేడ్స్ (కామ్రేడ్స్ సాహచర్యంలో) పుస్తకాన్ని వెలువరించి ప్రపంచంతో వాటిని పంచుకుంది. ఆ అనుభవాలలో కామ్రేడ్ నీతి పేరున్నా, లేకపోయినా, పూసల్లో దారంలా ప్రతి అనుభవం వెనుక నీతి కదలాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడులతో సతమతమవుతున్న ప్రజల మధ్యకు చేరుకొని వారి అనుభవాలను తెలుసుకొని దానిని ప్రజలపై యుద్ధంగా పేర్కొనడం తప్పు కాదనే తార్కిక ముగింపుతో రాయ్ రచన సాగడం అభినందనీయం.
దండకారణ్యంలో 2004 నుండి ఈ నూతన సంప్రదాయం ప్రారంభమైంది. 2010లో వందేళ్ల భూంకాల్ వేడుకలను జరుపుకోవడంతో, దిక్కుతోచని హిందుత్వ రమన్ సింగ్ ప్రభుత్వం ఆ ఆదివాసీ ప్రజా పరంపరను హైజాక్ చేసేసి గుండాధుర్ కాంస్య విగ్రహాన్ని నిలిపి కరి మింగిన వెలగపండులా ఆ వేడుకను ప్రభుత్వ వేడుకగా మలిచి పాటించడం ఉనికిలోకి వచ్చింది.
2011లో తూర్పు బస్తర్ లోని కువ్వనార్ ఏరియా, మాహరాబేడలో జనవరి 5 న బస్సులో ప్రయాణిస్తున్న 5గురు పోలీసులను విప్లవోద్యమం బందించింది. ఆపరేషన్ గ్రీన్‌హంట్ గురించి బట్టబయలు చేసే ఉద్దేశ్యంతోనే ఆ ఘటనకు పూనుకోవడం జరిగింది. ఆ ఘటనకు కామ్రేడ్ నీతి నాయకత్వం వహించింది. గెరిల్లాల చేతులలో 18 రోజులు బందీలైన పోలీసులతో వర్గానుబంధంతో, సోదర భావంతో, మర్యాదగా వ్యవహరించడమే కాకుండా, వారి విడుదలకై వారి కుటుంబాలు చేసిన విజ్ఞప్తి, గెరిల్లాల కోరికపై స్పందిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చేరుకున్న మిత్రులు, కామ్రేడ్స్ దివంగత అగ్నివేష్, గౌతం నావల?, వితా శ్రీవాస్తవ్ లాంటి హక్కుల కార్యకర్తలకు, సామాజిక రాజకీయ కార్యకర్తలకు వారిని 11 ఫిబ్రవరినాడు అప్పగించింది. ఆ ఘటనను పార్టీ సమీక్షించి, సాధారణ పోలీసులను అపహరించాల్సింది కాదనీ, దానిని అన్ని రోజులు కొనసాగించాల్సింది కాదనీ అభిప్రాయపడిరది. పార్టీ చేసిన సమీక్షను బోల్షివిక్ స్పూర్తితో స్వీకరించిన కామ్రేడ్ నీతి దానిని ఒక రాజకీయ గుణపాఠంగానే గుర్తించింది. అప్పటినుండి కామ్రేడ్ నీతి డివిజన్ అధికార ప్రతినిధిగా తెరపైకి వచ్చింది. ఆమె అమరురాలు అయ్యేవరకు ఆ బాధ్యతలలో కొనసాగింది. చొరవా, పట్టుదల, నేర్చుకోవాలనే జిజ్ఞాస వుంటే ఎలాంటివారినైనా విప్లవోద్యమం అద్భుతంగా మలుస్తుందనీ కామ్రేడ్ నీతి ఆచరణ నుండి తెలుసుకోవచ్చు.
ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడుల మధ్యనే పార్టీ 2011లో భూమి సమతలీకరణ, మళ్ల నిర్మాణం, సాగునీటి వ్యవస్థ ఏర్పాటు కేంపెయిన్ ను మొదలుపెట్టింది. ఇది ప్రజలలో ‘భూం చదను లేద మరమ్మత్తు’ కార్యక్రమంగా స్థానిక ప్రజలలో స్థిరపడిపోయింది. ముఖ్యంగా మిన్ను కురిస్తే మన్ను పండాలనే విధంగా సాగే ఆదివాసీ సాగులో మార్పులు తీసుకురాకుండా, వారి పంట దిగుబడిలో మార్పు రాకుండా వారి జీవితాలలో పెద్ద మార్పులను ఆశించలేమని విప్లవోద్యమం గుర్తించింది. దానితో జనతన సర్కార్ల నాయకత్వంలో భూమి మరమ్మత్తు కేంపెయిన్ 15 రోజులకు తగ్గకుండా కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో తూర్పు బస్తర్ లో జనతన సర్కార్ ఏరియా కమిటీ అధ్యక్షురాలుగా వున్న కామ్రేడ్ నీతి దానిని అత్యంత ఉత్సాహంగా, చొరవతో తన ప్రాంతంలో పట్టుదలగా అమలు చేయడానికి పూనుకుంది. ఆ కార్యక్రమం ప్రారంభించిన మొదటి సంవత్సరం తూర్పు బస్తర్ లో దాదాపు 27వేల మంది ప్రజలు 20 రోజుల నుండి నెల రోజుల వరకు (దాదాపు 15లక్షలకు పైగా పని దినాలు) భూమి మరమ్మత్తు కేంపెయిన్ లో విప్లవోత్సాహంతో పాల్గొని నూతన చరిత్రను సృష్టించారు. తూర్పు బస్తర్ సహ దండకారణ్య వ్యాప్తంగా ఆ కేంపెయిన్ ఒక విప్లవ సంప్రదాయంగా ఈనాటికీ కొనసాగుతోంది. ఎన్ని అణచివేత చర్యలు విరుచుకుపడుతున్నా, ఎన్ని బూటకపు ఎన్ కౌంటర్లు జరిపి విప్లవ కార్యకర్తలను కాల్చి చంపుతున్నా, తప్పుడు ఆరోపణలపై ఎందరిని అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేస్తున్నా ఈ కేంపెయిన్ మాత్రం ఆగడం లేదు. అయితే, అందులో పాల్గొనే ప్రజల సంఖ్యలో గణనీయమైన మార్పే చోటుచేసుకుంది. దండకారణ్యంలో జనతన సర్కార్ ల పని విధానం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలవారు విరసం నాయకులు కామ్రేడ్ పాణి రాసిన జనతన సర్కార్ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. అందులో చాలావరకు ఉన్నత స్థాయి, నూతన అనుభవాలను అందిస్తున్న దక్షిణ బస్తర్ అనుభవాలనే పేర్కొన్నప్పటికీ, అది తూర్పు బస్తర్ సహ మొత్తం దండకారణ్యానికి వర్తిస్తుంది.
దండకారణ్యంలో 2001 నుండి టీసీవోసీలకు తోడు తోడుగా పీ.ఎల్.జీ.ఏ. లోకి యువతను భర్తీ చేసుకునే కేంపెయిన్ లు కూడ కొనసాగుతున్నాయి. నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రజా నిర్మాణాలలో సంఘటితమైన శక్తులలో నుండి ఎంపిక చేసిన వ్యక్తులను పీ.ఎల్.జీ.ఏలోకి భర్తీ చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. 2001-02 నుండి 2013 వరకు దాదాపు ఒక దశాబ్ద కాలం తూర్పు బస్తర్ లో పెద్ద ఎత్తున యువత విప్లవోద్యమంలో చేరింది. వారంతా దండకారణ్యంలో, పరిసర జోన్లలో వివిధ నిర్మాణాలలో కొనసాగుతూ వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ, ఆ తరువాతి కాలంలో, వివిధ కారణాలతో సంఖ్యలో తగ్గుదల ప్రారంభమైంది. 2016-17 నాటికి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కానీ, తిరిగి 2022-23 నాటికి క్రమంగా విప్లవోద్యమంలో చేరే యువత సంఖ్యలో గణనీయమైన మార్పే చోటుచేసుకొని నూతన శక్తులు సాయుధం కాసాగారు. దీనికి కారణం, 2020 చివర తూర్పు బస్తర్ లో ఉవ్వెత్తున ముందు కొచ్చిన బహిరంగా ప్రజా ఉద్యమమే ముఖ్య కారణం.
2014-15 నుండి దండకారణ్యంలో ప్రధానంగా గడ్‌చిరోలీలో గ్రామసభల నిర్మాణం కోసం పెసా అమలును డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమం బద్దలైంది. అది అత్యంత సమరశీల పోరాటంగా ప్రాచుర్యం పొందింది. కేంద్ర ప్రభుత్వం 72వ రాజ్యాంగ సవరణ చేసి పెసా (ఆదివాసీ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ) చట్టాన్ని 1996 డిసెంబర్ 26నాడు రూపొందించినప్పటికీ, చిత్తశుద్ది లేని పాలకులు, ప్రభుత్వాధికారులు దానిని దశాబ్దాలు గడిచినా, ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఎక్కడా బాధ్యతగా తమకు తాముగా దానిని ఉనికి లోకి తెచ్చిన పాపాన పోలేదు. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు తమ చట్టాలను మార్చుకొని పెసాను అమలు చేయాలనే నియమాన్ని తుంగలో తొక్కుతూ ఏ రాష్ట్రం పెసాను అమలు చేయలేదు. దానితో, ప్రజలే ఆ చట్టాన్ని అమలులోకి తెచ్చుకోవాలనే పట్టుదలతో పోరాటాలకు పూనుకున్నారు. వారి పోరాటాలను బి.డి.శర్మ సహ అనేక మంది బుద్దిజీవులు సమర్థించారు. గడ్‌చిరోలీలో ప్రారంభమైన సమరశీల ప్రజాపోరాటం 2018 నాటికి దేశ వ్యాప్తంగా ఆదివాసీలను పోరాటబాట పట్టించింది. అందులో భాగంగానే కార్పొరేట్ వర్గాల గనుల తవ్వకాల కోసం పశ్చిమ బస్తర్‌లో పిట్టోడుమెట్టను, తూర్పు బస్తర్ లోని ఆందాయి, తూలాడు కొండలను, రావ్ ఘాట్ గుట్టలను ఏ కార్పొరేట్ సంస్థకు ఇచ్చేది లేదనీ ప్రజలు పోరాట బాట పట్టారు. వారు పెసా ప్రకారం జల్, జంగల్, జమీన్ పై తమ అధికారాన్ని డిమాండ్ చేశారు. గనుల తవ్వకాల కోసం తూర్పు బస్తర్ డివిజన్ లోని కడియనార్‌లో నూతనంగా పోలీసు క్యాంపును ఏర్పర్చారు. ఆ క్యాంపును ఎత్తివేయాలనీ వేలాది మంది ఆదివాసీ ప్రజలు దాదాపు నెలకు పైగా ధర్నాలో బైఠాయించారు. అపూర్వ స్థాయిలో పోలీసులతో, అధికారులతో తమ డిమాండ్ల గురించి ప్రజలు చర్చించారు. వారి పోరాటాలను సమర్థిస్తూ, వారి న్యాయసమ్మతమైన డిమాండ్ల పక్షం వహిస్తూ ప్రముఖహక్కుల కార్యకర్త బేలా బాటియా, ఆర్థికవేత్త జాన్ ద్రెజ్ సహ అనేక మంది సామాజిక రాజకీయ కార్యకర్తలు, మాజీ కేంద్ర మంత్రి, వయోవృద్ధ ఆదివాసీ నాయకుడు అరవింద్ నైతాం సహ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజా పోరాటానికి తమ సంఫీుభావాన్ని ప్రకటించారు. కానీ, ప్రజల గుండెలను తొలుస్తూ గనుల తవ్వకాలు ఆగలేదు. అడువులను చీలుస్తూ రవాణా మార్గాలు వేస్తున్నారు.
వీటి కోసం 2021 డిసెంబర్ నాటికి ఆందాయి కొండలపై ఆరు పోలీసు క్యాంపులను ఏర్పర్చారు. దండకారణ్యంలో జరుగుతున్న సమరశీల ప్రజా ఉద్యమం వెనుక మావోయిస్టు పార్టీ వుందని తెలిసినప్పటికీ, దేశ వ్యాప్తంగా ఆ పోరాటాలకు సంఫీుభావం వ్యక్తం కావడం మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలోనే అపూర్వమైనది. దీని వెనుక ప్రజల న్యాయమైన డిమాండ్ల పాత్రతో పాటు దేశంలో కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమాల పాత్ర కూడ వుంది. అంతేకాదు, పాలకవర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సంక్షోభాల ప్రభావమూ వుంది. 2022 మధ్యలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ కూడ తూర్పు బస్తర్ చేరుకొని ఆదివాసీ ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరాడు.
తూర్పు బస్తర్‌లో మండనార్ సహ అనేక చోట్ల ప్రజలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరానికై నెలల తరబడిగా సామూహిక ధర్నాలు చేస్తున్నారు. తూర్పు బస్తర్ ప్రజల సమరశీల ప్రజా ఉద్యమం, ప్రజల ధర్నాల వెనుక కామ్రేడ్ నీతి అహర్నిశలూ చేసిన కృషి కీలకమైనది. వారంతా, ఆదివాసీల కోసం కేంద్రం రూపొందించిన పెసాను అమలు చేయాలనీ, దానిని నీరుగారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పెసాను రద్దు చేయాలనీ కోరారు.
కామ్రేడ్ నీతి తుదివరకు పెసా అమలుకు ప్రజలను కదిలిస్తూ వచ్చింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2022లో రూపొందించిన నూతన అటవీ చట్టాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ కార్పొరేట్ వర్గాల పల్లకీ మోసే మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిరచింది. ఆమె చివరివరకూ పీడిత ప్రజల, ఆదివాసీల విప్లవాకాంక్షల సాఫల్యానికి అంకితమై పని చేసింది. ఆమె తుదివరకూ ఆందాయి, తూలాడు, మాందోడ్, బోధ్ ఘాట్ బాంద్, టేముర్ గాం, ఖిల్లెం, కన్చ్ గుడ్రా, పరాల్ మెట్ట, ఊసెప్‌ా మెట్ట మున్నగు అనేక చోట్ల తవ్వ తలపెట్టిన గనులను మాత్రమే కాకుండా, రావ్ ఘాట్, సుర్జాగఢ్ వరకు దండకారణ్యంలో ప్రజల మనుగడకు, ప్రకృతి, పర్యావరణానికి ప్రమాదకరంగా తయారవుతున్న తవ్వకాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది.
కామ్రేడ్ నీతి కొనసాగించిన విప్లవ కృషి పీడిత ప్రజలలో సదా స్మరణీయంగా నిలిచిపోతుంది. ఉద్యమ పొత్తిళ్లలో పుట్టి, రాటుతేలిన మూడు పదుల సంవత్సరాల విప్లవోద్యమ అనుభవంలో కాకలుతీరిన యోధను కాపాడుకోలేకపోయాం. దీర్ఘకాలంగా సమయానుకూల ఎత్తుగడలను రూపొందించడంలో, మారుతున్న పరిస్థితులకు అనుగుణ్యంగా పని పద్ధతులు, విధానాలు చేపట్టడంలో, ముఖ్యంగా శత్రువుకు అభేద్యమైన పార్టీని నిర్మించడంలో జరుగుతున్న తీవ్ర తప్పులను గుర్తించి, వాటి నుండి బయటపడడానికి పార్టీ ప్రారంభించిన కృషి మధ్యలోనే వీరవనిత కామ్రేడ్ నీతి అమరురాలు కావడం తక్షణమే పూడ్చుకోలేని లోటు. అయితే, ఆమె వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్న, ఆమె ద్వారా విప్లవ సందేశాలు అర్థం చేసుకున్న వందలాది కేడర్లు, వేలాది విప్లవ ప్రజలు, ఆమె లేని లోటును తప్పక పూడుస్తారు.
కామ్రేడ్ నీతి మూడు దశాబ్దాల విప్లవాచరణలో కాకలుతీరింది. ఆమెతో పాటు విప్లవోద్యమంలో చేరి తుదివరకూ కొనసాగలేకపోయి అనేక మంది మడమ తిప్పినప్పటికీ త్రికరణశుద్ధిగా విప్లవోద్యమంతో మమేకమైన కామ్రేడ్ ఊర్మిళ విప్లవ నిబద్ధతతో తుదివరకూ ఉద్యమంలో కొనసాగింది. ఆమె నాయకత్వంలో ఉద్యమంలో చేరిన వారిలో నుండి కూడ ఎంతో మంది తుదివరకూ కొనసాగలేకపోయి, మధ్యలోనే ఇంటి దారి పట్టినా, ఆమె వారి బలహీనతలను అర్థం చేసుకొని వారిని నెగిటివ్ టీచర్లుగా చూపుతూ ఇతరులను గట్టి పరచడానికి కృషి చేసింది.
ఆమె పార్టీ చేపట్టిన పలు ‘అధ్యాపనం’ (రాజకీయ తరగతులు) -దిద్దుబాటు’ ఉద్యమాలలో పాల్గొని దృఢమైన విప్లవకారిణిగా రాటుతేలింది. ఆమె టీసీవోసీలలో, సైనిక చర్యలలో పాల్గొని సాహసిక గెరిల్లాగా అగ్రభాగాన నిలిచింది. ఆమె ఆచూకి తెలిసిన పోలీసులు ఆమెపై జరిపిన అనేక దాడులలో నుండి ఆమె సహచర గెరిల్లా కామ్రేడ్స్, విప్లవ ప్రజల అండదండలతో సురక్షితంగా బయటపడిరది. ఆమె ఉద్యమంలోనే చదువు నేర్చుకుంది. విప్లవ సిద్ధాంత అధ్యయనంపై పట్టు సంపాదించింది. ఆమె, పార్టీ నిర్వహించిన ఏరియా, డివిజన్, ప్రత్యేక జోన్ స్థాయి పార్టీ ప్లీనాలలో, మహాసభలలో పాల్గొని పార్టీ రూపొందించిన డాక్యుమెంట్లపై చర్చించడంలో, తన అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవడంలో మంచి అనుభవాన్ని సంపాదించి మంచి మార్క్సిస్టుగా ఎదిగివచ్చింది. ఆమె పార్టీ నిర్వహించిన అనేక రాజకీయ తరగతులకు హజరై మార్క్సిస్టు పునాది విషయాలపై గట్టి పట్టు సంపాదించింది. ఆమె సైనిక శిబిరాలలో పాల్గొని, సైనిక శిక్షణలో నేర్పరిగా పేరు తెచ్చుకుంది. వందలాది ప్రజా సంఘాల కార్యకర్తలకు వారి ప్రణాళికలు, నిబంధనా వళులు చెప్పి వారికి విప్లవ రాజకీయాలు బోధించి మంచి టీచర్ గా పేరు తెచ్చుకుంది. దండకారణ్య ఉద్యమ ప్రాంతాల ప్రవేశానికి గల అనేక దారులలో తూర్పు బస్తర్ ఒక ప్రవేశ ద్వారాన్ని కలిగి వుంది. ఆ ద్వారం గుండా ఆమె అనేక మంది పాత్రికేయులను, విప్లవ శ్రేయోభిలాషులను, పర్యవేక్షకులను ఆహ్వానించి, వారికి ఆతిథ్యం ఇచ్చి, వారికి విప్లవోద్యమం గురించి పరిచయం చేయడంలో నిపుణత సాధించి వారు మరిచిపోలేని నేస్తంగా వారి మధ్య నిలిచిపోయింది. ఆమె తుదివరకు అవివాహితగానే ఉండిపోయింది. అందుకు ఒకటి ఆమె అనారోగ్యం కారణం కాగా, మరోటి, ఆ వివాహబంధం తన ఉద్యమ బాధ్యతల నిర్వహణలో ఎక్కడా, ఏ మేరకు ఆటంకం కాకూడదనే విప్లవ చైతన్యమే తప్ప ఇంకే కారణం లేదనీ ఆమె నిజాయితీగానే చెప్పేది. ఆ విషయాన్నే కామ్రేడ్ కరుణ (మేం ఎరిగిన మా దండకారణ్య దీపక్క) ‘‘పెళ్లి’’ అనే కథలో రాసింది.
కామ్రేడ్ నీతి అవివాహితే, కానీ, ఆమె పదుల సంఖ్యలో కేడర్లకు వివాహాలు జరిపింది. అత్యంత కామ్రేడ్లీ భావనతో వారి వైవాహిక అవసరాలూ తీర్చింది. ఆమె చిన్ననాటి నుండే బక్క పలుచని మనిషి. రివటలా వుండేది. కాకపోతే, యవ్వన ప్రాయంలో ఏ అనారోగ్యం పెద్దగా ఆమె దరిచేరలేదు. కానీ, గెరిల్లా జీవితంలో వుండే కష్టాలు, అడవి జీవితంలో తరచుగా దెబ్బతీసే మలేరియా విష జ్వరాలతో 30 వసంతాలు ఆమె సతమతమయింది. క్రమంగా, ఆమె తీవ్రమైన రక్తహీనతకు గురైంది. 2021 నుండి ఆమె దానితో పోరాడుతూనే, తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. కానీ, 2022 మధ్య నుండి అది మరింత తీవ్రమై ఆమె శరీరంలో హెమోగ్లోబిన్ 6 శాతానికి పడిపోయింది. అలాంటి పరిస్థితిలో, ఆమెను కాపాడు కోవడానికి చేపట్టాల్సిన కృషిలో పార్టీ వెనుకబడిపోయింది. ఆమె కొంతకాలం విశ్రాంతిలో వుండి, ఆరోగ్యం కొంత కుదుటపడడంతో, తిరిగి తన బాధ్యతలను యధావిధిగా నిర్వహించడానికి పూనుకుంది. ఆ క్రమంలోనే శత్రువు దాడి జరిగి ఆమె భౌతికంగా విప్లవోద్యమానికి, విప్లవ ప్రజలకు, పార్టీకి దూరమైంది. కానీ, చెరిగిపోని ఆమె ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు, నడవడిక, ఆచరణ అన్నీ ప్రజల మధ్య, కేడర్ల మధ్య బలంగా నిలిచిపోయాయి. అవి అనునిత్యం వాటి సాధన కోసం వారిని ప్రేరేపిస్తాయి. ఎన్ని అణచివేత కేంపెయిన్‌లు సాగినా, ఫీనిక్స్ లా మళ్లీ మళ్లీ ఊర్మిళ ప్రజల మధ్య పుడుతుంది. దోపిడీ వ్యవస్థ, అసమానతల సమాజం, అస్పృశ్యతలు, అవిద్య, అణచివేతలు కొనసాగినంత కాలం ఒక గుండాధుర్‌లా, ఒక గేంద్ సింగ్‌లా, ఒక వీరబాబూరావ్‌లా కామ్రేడ్ నీతి చరిత్రలో నిలిచిపోయి, వాటి అంతానికై ప్రభోదిస్తునే వుంటుంది. కామ్రేడ్ ఊర్మిళ వీరవనిత. ఇరుమగుండ మట్టి బిడ్డ.
కామ్రేడ్ పొట్టావీ నీతికి మరణం లేదు. ఆమె స్మరణలో వినమ్రంగా తలవంచి ఆమెకు విప్లవ జోహార్లర్పిద్దాం. కగార్ సైనిక దాడులు ప్రారంభమైన తరువాత మొదట 2024 జనవరి 16 నాడు తూర్పు బస్తర్ లోని మంగనార్ లో కామ్రేడ్ నర్సింగ్ (రతన్ కశ్యప్) అమరుడైనాడు. ఆ తరువాత ఇప్పటివరకు తుల్తులీ అమరులు సహ ఆ డివిజన్ లోనే వెడ్మా గ్రామంలో పుట్టి పెరిగిన భూమి పుత్రుడు కామ్రేడ్ ఓల్దేర్, రామేల వరకు పదుల సంఖ్యలో విప్లవకారులు తమ ఆశయాల కోసం అసువులు బాసారు. వారి రక్తం, వారి అనుపమాన త్యాగాలు వృధా పోవు.
లక్షలాది నక్షత్రాలు రాలనిదే ఉజ్వలమైన భవిష్యత్తు ప్రకాశించదనే చారిత్రక సత్యం మన ముందు వుంది. నూతన భవిష్యత్తు కోసం నేల రాలుతున్న ప్రతి ఒక్కరి త్యాగం మానవాళికి సుందర భవిష్యత్తును ఆవిష్కరించి తీరుతుంది.
‘‘(రష్యాలోని) ప్రస్తుత పోరాటం యే విధంగా అంతమైనా, మృతవీరులను (విషాదకరంగా మృతవీరులను) అది అపారమైన సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది- రక్తమూ, బాధలూ వృధా కాబోవు. అవి నాగరిక ప్రపంచ మంతటా సామాజిక విప్లవపు మొక్కలను పోషించి, అవి యింకా యేపుగా, వేగంగా పెరిగేటట్లు చేస్తాయి’’. – లెనిన్ (వామపక్ష కమ్యూనిజం, ఒక బాలారిష్టం నుండి)