ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది. మరి కొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు.. వారి పేరు ఎక్కడా కనిపించకపోవచ్చు. వినిపించకపోవచ్చు. కానీ ఉద్యమానికి మూల స్తంభాలుగా వాళ్లను జనం ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారు. చరిత్ర పుటల్లో వాళ్ల పేర్లను పదిలంగా నిలుపుకుంటారు. ఈరోజు బయటి ప్రపంచంలో మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్‌గా పేరు గాంచిన అబూజ్మాడ్ ప్రాంతానికి ఆ గుర్తింపు తేవడంలో ఆద్యుడు, ముఖ్యుడు పాండన్న. కేడర్లకు ఆయన పాండన్న. ఆ ప్రాంతంలో నివసించే మాడియా ఆదివాసులకు వారి వయసును బట్టి కొందరికి ‘పాండు’, మరి కొందరికి ‘పాండు దాద’. దక్షిణాన ఇంద్రావతి నది నుంచి, ఉత్తరాన మేండ్కి నది వరకూ.. పశ్చిమాన గడ్చిరోలిలోని భామ్రాగడ్ ప్రాంతం నుంచీ తూర్పున కొండగాం ప్రాంతం దాకా.. ఓ నాలుగైదు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పాండన్న పేరు తెలియని, వినని వాళ్లు ఒక్కరు లేకపోవచ్చంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ శివార్లలోని యాప్రాల్‌లో ఓ పేద చాకలి కుటుంబంలో చంద్రహాస్గా పుట్టిన పాండన్న మొదట జననాట్యమండలి సభ్యుడిగా పని చేశాడు. ఆ తర్వాత, పూర్తికాలం విప్లవకారుడిగా ఎదిగి 1980ల మధ్యలో బస్తర్ ప్రాంతానికి గెరిల్లా దళ సభ్యుడిగా వెళ్లాడు. బస్తర్, గడ్చిరోలి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లోకి 1980ల చివరికల్లా ఉద్యమం విస్తరించినప్పటికీ, మాడ్ ప్రాంతంలో నిలదొక్కుకోవడానికి మాత్రం చాలా కాలం పట్టింది. దానికి కారణం – ఒకటి, అక్కడి టెర్రెయిన్. పెద్ద, పెద్ద కొండలు, దూరదూరంగా విసిరేసినట్టు ఉండే గ్రామాలు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లాలంటే కొన్ని గంటల పాటు సాగే కష్టమైన నడక. ఇక రెండో కారణం – అక్కడ ఆనాటికి చాలా ఆదిమ పద్ధతుల్లో జీవిస్తున్న మాడియా ప్రజల్లో బయటి వాళ్ల పట్ల ఉండే సహజసిద్ధమైన బెరుకు లేదా సంకోచం.
పైగా వాళ్ల ప్రధాన ఆహారం వరి కాదు, కోహల (సన్నగా ఒడిపిలిలా ఉండే చిరు ధాన్యం) అన్నమే వారికి ఆధారం. రోజూ పగలూ, రాత్రి కోహల అన్నాన్నే తినాలంటే కొత్త వాళ్లెవరికైనా ఓ ఛాలెంజ్. మాడియా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, వాళ్ల భాషలోని విశిష్టమైన యాసను పట్టుకోవడం, వాళ్ల మనసుల్ని గెల్చుకోవడం అంతకన్నా పెద్ద ఛాలెంజ్. ఎందరో సభ్యులు, కొందరు నాయకులు కూడా అక్కడ నిలబడలేక వెనక్కి వెళ్లిపోయారు. అందుకే గడ్చిరోలి, బస్తర్ ప్రాంతాల నుంచి ఒకటి, రెండు విఫల ప్రయత్నాలు జరిగిన తర్వాత మాత్రమే పాండన్న నాయకత్వంలోని దళం మాడ్ ప్రాంతంలో నిలదొక్కుకుంది.
నిలదొక్కుకోవడమే కాదు.. ఒక్కో గ్రామాన్ని మెల్లిమెల్లిగా సమీకరించి, సంఘటితం చేసి, వాళ్లను ఆటపాటలతో అలరించి, వాళ్ల సంస్కృతిని, అలవాట్లను గౌరవిస్తూ, వాళ్ల నుంచి నేర్చుకుంటూ, వాళ్లకు నేర్పిస్తూ.. వాళ్లు ఏది పెడితే దాన్నే తింటూ, చాలా సార్లు అర్ధాకలితోనే పడుకుంటూ.. క్రమంగా అబూజ్ (ఎవరికీ తెలియని) మాడ్‌ను, ఈనాడు అందరికీ తెలిసిన మాడ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పాండన్న.
1990 మొదట్లో తాడోపార అనే గ్రామంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటే, ఆయన, ఆయనకు మార్గదర్శకత్వం వహించిన తొలితరం విప్లవకారుల ఆచరణ ఎంత గొప్పదో, ఎంత వినమ్రమైందో అర్థం చేసుకోవచ్చు.
మాడ్ ప్రాంతంలో ఒక్కో గ్రామం సంఘటితమవుతున్నప్పటికీ, మరీ మారుమూల కొండల్లో ఉండే కొన్ని గ్రామాలు ఉద్యమం వైపు రావడానికి, విప్లవకారులను వాళ్లు నమ్మడానికి చాలా కాలమే పట్టింది. పది, పదిహేను గుడిసెలు కూడా లేని తాడోపార అలాంటి గ్రామాల్లో ఒకటి. అయితే, ఒక కీలకమైన మీటింగ్ కోసం కార్యకర్తలు ఆ ఊరు సమీప అడవినే ఎంచుకున్నారు. దాని ఏర్పాట్లలో భాగంగా చాలా దూరం నడిచి చీకటి పడే వేళకు ఆ ఊరికి చేరుకున్న దళంలో.. దళనాయకుడు పాండన్నతో పాటు ఇద్దరు ముఖ్యమైన నేతలు కూడా ఉన్నారు. ఒకరు, ఆనాటి దండకారణ్య కమిటీ సెక్రటరీ, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు (బసవరాజు), మరొకరు ఆయనకన్నా సీనియర్ నేత ఐ.వీ. సాంబశివరావు (మాస్టారు). ఒకరు ఆర్ఈసీలో ఎంటెక్ చదువును వదిలేసి ఉద్యమంలో చేరి ఆనాటికే దండకారణ్య నేతగా ఎదిగిన వ్యక్తి .. మరొకరు లయోలా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి నక్సల్బరీ అనంతర విప్లవోద్యమానికి పునాదులు వేసిన నేత. అప్పటికి కేశవరావు వయసు 36-37 ఏళ్ల వరకు ఉంటే, ఐవీ మాస్టారు ఆనాటికే సీనియర్ సిటిజెన్. పాండన్న బహుశా ఓ పాతికేళ్లు దాటిన నవ యువకుడు.
కానీ తాడోపార వాళ్లకు ఇవేం తెలుసు? వీళ్లు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లో? ఏ ఆశయంతో ఓ చలికాలపు సాయంత్రం పూట ఎంత కష్టమైన ప్రయాణం చేసి తమ మారుమూల పల్లెకు చేరుకున్నారో వాళ్లకేం తెలుసు? అపరిచిత, ప్రాంతేతర వ్యక్తులను నమ్మడం, ఆదరించడం అనేది వారికి ఆనాటికి చాలా కష్టమైన పని. అది శతాబ్దాల పాటు వారు ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాల్లోంచి వచ్చిన గుణపాఠం అది. అయితే, అప్పటికి వాళ్లకు పాండన్న తెలుసు. కొన్ని సార్లు తన దళంతో ఆ ఊరికి వచ్చాడు. కానీ తాడోపార వాళ్లకు ఇంకా వారిపై నమ్మకం కుదరలేదు. దళంతో ఇంకా వాళ్లవి పొడిపొడి సంబంధాలే. అలాంటిది ఎత్తూ, పొడవు, వయసు, ఆకారంలో మరింత భిన్నత్వంతో కనిపిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పాండన్న వెంటేసుకురావడం వారికి నచ్చలేదు. నచ్చలేదు అనడం కన్నా నమ్మకం అసలే కుదరలేదు అనడం కరెక్టు. ఏ మోసం చేయడానికి వీళ్లిలా ఊళ్లోకి వచ్చారో అని వారు బలంగా అనుమానించారు.
ఊరి మధ్యలోని గోటుల్లో దళం ఆగి గంటలు గడిచిపోతోంది. చీకట్లు దట్టంగా ముసురుకుంటున్నాయి. ఈ పూట మాకు అన్నం పెట్టాలని గ్రామస్థులను ఎన్ని సార్లు కోరినా, ప్రాధేయపడినా అసలు పట్టించుకోలేదు. ఎవరూ దళం డేరా దగ్గరికి రాను కూడా రాలేదు. దళంలోని పెద్దలు, చిన్నలూ అందరూ ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజుల్లో గెరిల్లాల కిట్లలో బిస్కిట్ ప్యాకెట్లు లేదా అటుకులు కూడా ఉండేవి కాదు. అసలు దుకాణాలే ఉండేవి కాదు. జనం పెడితేనే కడుపు నిండేది. లేదంటే కడుపు మాడ్చుకోవడమే. పాండన్న వారికి అర్థమయ్యే భాషలో ఎన్ని విధాలుగా, రాజకీయంగా ఎంత వివరంగా చెప్పినా తాడోపార ప్రజలు పట్టించుకోలేదు. వినీ విననట్టే ఉదాసీనంగా ఉండిపోయారు. బహుశా ఈ పూట దళానికి అన్నం పెట్టొద్దనే ఎకగ్రీవ తీర్మానం చేసుకున్నట్టే కనిపించింది… ఆనాడు తాడోపార.
దాంతో చివరకు కేశవరావు, ఐవీ మాస్టారు, పాండన్న ముగ్గురూ చర్చించుకొని ‘చలో.. మనమే ఓ జోలె పట్టుకొని ఇల్లిల్లూ తిరుగుదాం… అడుక్కుందాం… స్పందిస్తారేమో చూద్దాం… ఓ ముద్దయినా పెట్టకపోతారా..’ అనుకున్నారు. పాండన్న, కేశవరావు, ఐవీ మాస్టారు ముందు నడుస్తుండగా… మిగతా దళ సభ్యులు వారిని అనుసరించారు. ఒక్కో గుడిసె ముందు ఆగుతూ… అన్నం పెట్టండని బతిమిలాడారు. దాంతో క్రమంగా జనాల్లో, ముఖ్యంగా మహిళల్లో కదలిక మొదలైంది. మెల్లిగా తాము వండుకున్న దాంట్లోనే ఓ ముద్ద తీసి వాళ్ల జోలెల్లో వేయడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు ముందుకు వచ్చారు. అలా మొత్తానికి ఎంతో కొంత తిండితో ఆ పూట కడుపు నింపుకున్నారు. అలా.. మరుసటి రోజు నడకకు కావాల్సిన శక్తిని.. కళ్లల్లో ఆశనూ, విప్లవాశయాన్నీ నిలుపుకునేందుకు అవసరమైనంత స్ఫూర్తిని నింపుకున్నారు.
సీన్ కట్ చేస్తే.. 2002 ప్రాంతంలో తాడోపార ఊరి పక్కనే, డివిజనల్ కమిటీ సమావేశం కోసం రెండు, మూడు దళాల వాళ్లు డేరా వేశారు. ఊళ్లోని నవ యువతీయువకులు గుంపులుగుంపులుగా డేరాకు ఉదయం, సాయంత్రం రావడం, వంట పనుల్లో, సామాన్ల చేరవేతలో సాయపడటం, పెరళ్లలో, పోడు నేలల్లో పండిన దోసకాయలు, సొరకాయలు, గోంగూర… ఇలా రకరకాల కూరగాయలు, దుంపలు దళం కోసం డేరాకు తీసుకురావడం.. సమావేశం జరిగినన్ని రోజులు వంటకు సరిపోయేన్ని కూరగాయలు, దుంపలు ఊరి జనమే ఇస్తున్న సందర్భంలో పాండన్న ముఖంలో ఓ సంతృప్తి కనిపించింది. అందరూ కిచెన్ దగ్గర గుమిగూడినప్పుడు దాదాపు పదిహేనేళ్ల కింద జరిగిన పై ఉదంతాన్నంతా ఆయన తోటి సభ్యులతో పంచుకున్నాడు. ఊరి యువతీయువకులు కూడా అక్కడే ఉన్నారు. ఆనాటి శ్రోతల్లో… పాండన్నతో పాటు కేశవరావు, ఐవీ మాస్టర్ లాంటి పెద్ద నేతలు ఈ ఊళ్లో జోలె పట్టి ఇల్లిల్లూ తిరిగి అడుక్కున్నారని తెలిసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టిన వాళ్లు కొందరు. మా ఊరి వాళ్లు ఒకప్పుడు ఇంత మొండిగా వ్యవహరించారా అని మొదటిసారి తెలియడంతో సిగ్గుతో ముసిముసిగా నవ్వులు చిందించిన వారు మరి కొందరు. ఆ స్పందనలన్నింటితో పాండన్న ముఖం మరోసారి చిరునవ్వుతో వెలిగిపోయింది.
ఒక కొత్త ప్రాంతాన్ని, సవాళ్లతో కూడుకున్న ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఉద్యమాన్ని నిర్మించడం, దాన్ని బలమైన ఉద్యమ ప్రాంతంగా తయారు చేయడం పాండన్న వ్యక్తిగతంగా కూడా సాధించిన ఓ గొప్ప విజయం. అయితే, ఇది ఒక్క మాడ్ ప్రాంతానికే పరిమితం కాదు. 2009లో ఆయన ఒడిషా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఒక కొత్త ఉద్యమ ప్రాంతాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో ఎన్కౌంటర్లను ఎదుర్కొని, కష్టాలకు, నష్టాలకు భయపడకుండా చివరి ఊపిరి వరకూ దృఢంగా నిలబడ్డ ఆదర్శ నాయకుడు పాండన్న.
ఈరోజు.. సెప్టెంబర్ 13 ఉదయం యాప్రాల్‌లోని తన ఇంటి ప్రాంగణంలోకి నిర్జీవిగా చేరుకున్న ఆయనకు స్థానికులు, విప్లవాభిమానులు నివాళులు అర్పిస్తుంటే… బహుశా మరోవైపు మాడ్ కొండల్లోని మారుమూల పల్లెల్లో జనం… తమకిష్టమైన పాండు లేదా పాండు దాద చిరునవ్వును, దృఢమైన కరచాలనాన్ని, ఆత్మీయమైన పిలుపును ఇక మరెన్నటికీ చూడలేమని, వినలేమని తెలిసి గుండెలు పిండేంత బాధతో రోదిస్తున్నారేమో. బహుశా ఆ పల్లెల్లోని మహిళలు ఈ పూట పొయ్యి ముందు కూర్చొని అంబలి కాస్తూ… ఏకధాటిగా కన్నీరు కారుస్తున్నారేమో!