ఇప్పుడింక వాళ్ల నిర్దోషిత్వం ప్రశ్నార్థకమైంది
విడుదలైన వాళ్లు ఇప్పుడింక
తమ ఛిద్రమైన జీవితాలను
కూడ దీసుకోవడం కాదు
భార్యా పిల్లలతో వియోగ విషాదం
పూడ్చుకోవడం కాదు
ఒక తరం కన్నీళ్లు ఇంకిపోయినవి
కోవిడ్ ఒక మరణంలోకి
యవ్వనాలు వృద్ధాప్యాల్లోకి
పసిపాపలు పెండ్లికెదిగిన కూతుర్లయి
యువతీ యువకులై తామైనా చదువో, కొలువో
వెతుక్కునే వెసులుబాటు దొరికే
విరామం లేదు.
ఉన్నదల్లా బయటి వ్యవస్థ మొహాన
వేనోళ్ళ వేలాడుతున్న ప్రశ్నలు
ఇంక జైల్లో దాక్కోవడానికీ లేదు
వీధుల్లో తిరగడానికి లేదు
నూట ఎనభై తొమ్మిది మృతదేహాల
కంకాళాలు ప్రశ్నిస్తున్నాయి ప్రాణమొచ్చి
మానినాయనుకున్న బాంబు బ్లాస్ట్ గాయాలను
కెలికినట్టయి బుసకొడుతున్నాయి
ఇప్పుడు మళ్ళీ మిమ్ములను
మీడియా విచారణకు పెట్టినట్లయింది
చచ్చినవాళ్లు అబద్దం కాదు కదా
చంపిన వారు మరి ఎవరు!
పోనీ, మీది
విక్రమాదిత్యుడు భేతాళ శవాన్ని మోసిన
సంప్రదాయమూ కాదాయే
ఇపుడింక బహిరంగ జైల్లో
మెళ్లో బండరాయి కట్టి వదిలేసినట్లైంది
చచ్చిన వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కావచ్చు
చచ్చిన వాళ్ళ విశ్వాసాలు మట్టిలో కలిసిపోయినవో, కాలిపోయినవో కావచ్చు కానీ
నిర్దోషులింకా విచారణ ఎదుర్కొనే
ముస్లిం ముద్దాయిలుగా
ఈ సమాజంలో మసలుకోవాలి
24-7-2025
