బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా, పిర్‌పైంటిలో 1,050 ఎకరాల భూమిని అదానీ పవర్‌కు సంవత్సరానికి ఎకరాకు కేవలం రూ 1 చొప్పున, 33 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వాలనే నిర్ణయం బీహార్‌లో ప్రధాన రాజకీయ వివాదానికి దారితీసింది. కార్పొరేట్ లాభాల కోసం రైతుల హక్కులను, ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ శ్రేయస్సును బలిచేసే ఈ అన్యాయమైన, అపారదర్శకమైన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బహిరంగ మిత్ర పెట్టుబడిదారీ విధానానికి (క్రోనీ క్యాపిటలిజం)పరాకాష్ట; ఇది పాలనపట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని మరింతగా పెంచుతోంది. పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని, సేకరించిన భూమిని ప్రభావిత రైతులకు తిరిగి కేటాయించాలని, పునరావాసాన్ని కల్పించాలని, ఇప్పటికే జరిగిన నష్టానికి పూర్తి పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాము.
జాతీయ, అంతర్జాతీయ వివాదాలలో చిక్కుకున్న అదానీ గ్రూప్‌కు, అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్న ఒక ప్రక్రియ ద్వారా, రూ. 29,000 కోట్లు (అమెరికన్ డాలర్లు 3 బిలియన్లు) విలువైన ఈ భారీ ప్రాజెక్టును అప్పగించడం నిజంగా సిగ్గుచేటు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ ప్రాజెక్ట్ ప్రజల పైన, బీహార్ పర్యావరణంపైన కలిగించే దీర్ఘకాలిక పరిణామాలను దాచిపెట్టి, ఒక ప్రధాన ‘ఉద్యోగ కల్పన’ మౌలిక సదుపాయాల వెంచర్‌గా ప్రచారం చేస్తున్నారు.
భూ ఆక్రమణ-రైతులకు ద్రోహం:
ప్రాజెక్ట్ భూమిలో దాదాపు 1,050 ఎకరాలు 915 మంది రైతులకు చెందినది. ఈ భూమిలో ఎక్కువ భాగం సారవంతమైనది, ఇక్కడ మామిడి, లిచ్చీ తదితర పంటలను పండిస్తున్నారు. ఈ భూమిని అక్రమంగా సేకరించడానికి వీలుగా “బంజరు భూమి”గా తప్పుగా ప్రకటించారు. చాలా మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు; లేదా దశాబ్దం క్రితం నిర్ణయించిన పాత ధరలను చెల్లించారు. ఒకేసారి ఇచ్చే పరిహారం జీవితాంతం కోల్పోయే జీవనోపాధికి, భూమితో ఉన్న సాంస్కృతిక అనుబంధానికి పరిహారం కాదు. లాభాల ఆధారిత పెట్టుబడిదారుల ‘అభివృద్ధి’ కోసం రైతులను మూల్యం చెల్లించదగినవారిగా చూసే లోతైన ధోరణిని ప్రతిబింబిస్తుంది.
భూమి లేనివారికి పంచడానికి తమ వద్ద భూమి లేదని ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే, భారతదేశపు అతిపెద్ద సంస్థలలో ఒకదానికి వేల ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండటం ఒక వైచిత్రం. ఈ ద్రోహం ఇంతకంటే స్పష్టంగా, ధైర్యంగా ఉండదు.
పర్యావరణ విపత్తు అంచున:
2,400 మెగావాట్ల బొగ్గు ఆధారిత కేంద్రంగా ప్రతిపాదించబడిన పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్లాంట్, ప్రజారోగ్యానికి, పర్యావరణానికి కూడా ఒక విపత్తు. ఈ ప్రాంతంలో ఇప్పటికే కహల్‌గావ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. దీనికి మరొక బొగ్గు ప్లాంట్‌ను జోడించడం వలన ఇప్పటికే ఉన్న కాలుష్యం మరింత తీవ్రమవుతుంది.
భాగల్‌పూర్ పదేపదే భారతదేశంలోనూ, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలలో ఒకటిగా స్థానం పొందింది. 2024 జనవరిలో, ఇది భారతదేశంలో రెండవ అత్యంత కాలుష్య నగరంగా, ప్రపంచవ్యాప్తంగా 31వ స్థానంలో నమోదు అయింది. ఇప్పటికే కాలుష్యంతో నిండిన ఈ జోన్‌లో బొగ్గు కాల్చడాన్ని ఎక్కువ చేయడం వల్ల గాలి, నీటి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది; శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి; అత్యంత బలహీన వర్గాలతో సహా లక్షలాది మంది శ్రేయస్సు దెబ్బతింటుంది.
ఈ విపత్తుకు తోడు, 10 లక్షల చెట్లను నరికివేయాలని యోచిస్తున్నారు. దీని వలన గంగా పరీవాహక ప్రాంత పర్యావరణ వ్యవస్థపైన కోలుకోలేని ప్రభావాలు పడతాయి. భాగల్‌పూర్ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న గంగా నది ఒడ్డున ఉంది. ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు చెప్పుకునే ‘నదీ సంరక్షణ చర్యల’ స్ఫూర్తిని ఈ ప్రాజెక్టులు నేరుగా ఉల్లంఘిస్తూ, ఆ నది పెళుసైన జీవావరణ వ్యవస్థకు ముప్పు కలిగిస్తున్నాయి.
హరిత ఇంధన లక్ష్యాలతో వైరుధ్యాలు:
భారతదేశం- పారిస్ ఒప్పందం కింద ఉన్న వాతావరణ కట్టుబాట్లు, దాని జాతీయంగా నిర్ణయించబడిన సహకారాలు (నేషనల్లీ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్స్), 2070 నాటికి నికర శూన్యతకు (నెట్ జీరో) చేరుకోవాలనే దాని నిర్దేశిత లక్ష్యానికి వ్యతిరేకంగా ఉంది పిర్‌పైంటి ప్రాజెక్ట్. భారత ప్రభుత్వం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ పునరుత్పాదక ఇంధన మార్పులకు మద్దతు ఇస్తామని మాట్లాడాయి; అయినప్పటికీ వారి చర్యలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని పెంచే ఒక విరుద్ధమైన, ప్రమాదకరమైన మార్గాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా, సందేశం స్పష్టంగా ఉంది: విపత్తు కలిగించే ఉష్ణోగ్రత పెరుగుదలను నివారించడానికి అవసరమైన వాతావరణ లక్ష్యాలతో కొత్త బొగ్గు శక్తి అనేది రాజీపడలేనిది. భారతదేశం దేశీయంగా తన బొగ్గు మౌలిక సదుపాయాలను విస్తరిస్తూ ప్రపంచ వాతావరణ నాయకత్వాన్ని క్లెయిమ్ చేయలేదు.
ఈ వినాశకరమైన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పిలుపు నిస్తున్నాం. భాగల్పూర్, బీహార్‌లోని ప్రభావిత వ్యవసాయ సముదాయాలకు సంఘీభావంగా నిలుస్తాం.
మా డిమాండ్లు :
• వాతావరణం, పర్యావరణం, సామాజిక న్యాయ నిబంధనలను ఉల్లంఘించే పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలి.
• సేకరించిన భూమిని ప్రభావిత రైతులకు తిరిగి ఇవ్వాలి; పునరావాసాన్ని కల్పించాలి; ఇప్పటికే జరిగిన నష్టానికి పూర్తి పరిహారాన్ని నిర్ధారించాలి.
• అభివృద్ధి పేరుతో కొత్త బొగ్గు ప్లాంట్‌ల వంటి తప్పుడు పరిష్కారాలను ప్రోత్సహించడం ఆపాలి. బొగ్గు అనేది భారతదేశ NDCలు (నిర్ధారిత జాతీయ సహకారాలు), నెట్ జీరో లక్ష్యాలు, పారిస్ ఒప్పందానికి అనుకూలమైనవి కాదు.
• గంగా పరీవాహక ప్రాంత పర్యావరణ వ్యవస్థకు ముప్పు కలిగించే అన్ని ప్రాజెక్టులను నిలిపివేయాలి. భాగల్‌పూర్ కేవలం ఒక నగరం కాదు, తీవ్ర ప్రమాదంలో ఉన్న నది ఒడ్డున ఉన్న ఒక జీవనాధార ప్రాంతం.
• పర్యావరణ విధ్వంసాన్ని రాజకీయ సాధనంగా ఉపయోగించడాన్ని ఆపాలి. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్ట్‌ను హడావిడిగా, రహస్యంగా చేపట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని బహిర్గతం చేసి, వ్యతిరేకించాలి.
• బీహార్‌కు, ఇతర ప్రాంతాలకు గౌరవప్రదమైన ఉపాధిని సృష్టించే, ఆరోగ్యాన్ని కాపాడే, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించే వికేంద్రీకృత, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపైన దృష్టి పెట్టాలి.
మేము పౌర సమాజం రైతు సంఘాలు, వాతావరణ సంబంధిత అంశాలపై పనిచేసే సమూహాలు, న్యాయాన్ని కోరుకునే పౌరులందరినీ ఈ విధ్వంసక ‘అభివృద్ధి’ నమూనాకు వ్యతిరేకంగా మాట్లాడాలని, గౌరవం, పర్యావరణం, సమానత్వంపై ఆధారపడిన ప్రత్యామ్నాయాల కోసం నిలబడాలని కోరుతున్నాం.
2025 అక్టోబర్ 3:
తెలుగు : పద్మ కొండిపర్తి