(ఐదు భాగాల మిడ్కో సమగ్ర సాహిత్యంలో *విముక్తి బాటలో ..* మూడో సంపుటానికి సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే అమరుల బంధు మిత్రుల సంఘం సభలో ఆవిష్కరణ )
విప్లవోద్యమంలో పాల్గొంటూ ఆ నడుస్తున్న చరిత్రని అనేక పద్ధతుల్లో నమోదు చేసిన ఒక రచయిత, ఒక విలేఖరి కా.గుముడవెల్లి రేణుక. భారత విప్లవోద్యమ చరిత్రలో ఆమె ఒక విశిష్టమైన స్థానాన్ని పదిలపరచుకుంది. తన 55వ యేట క్రూరమైన రాజ్యహింసకు గురై భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించినా అదే (2025) మార్చి 31 వ తేదీన ఆమె మరణానంతర జీవితం కూడా మొదలయ్యింది. విప్లవోద్యమం గురించిన లోపలి విషయాలను ఆమె కళ్ళతో పాఠకులు చూడగలుగుతున్నారు. విప్లవోద్యమ ప్రాంతాల్లో కామ్రేడ్ రేణుక వివిధ కాలాల్లో పర్యటించి ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా తయారు చేసిన క్షేత్ర అధ్యయనాలు, నిజ నిర్ధారణ నివేదికలు విప్లవోద్యమ సాహిత్యంలో మైలు రాళ్ళ వంటివి.
రేణుక సాహిత్యాన్ని సంపుటాలుగా తెస్తున్న విషయం పాఠకులకి తెలిసిందే. ఆ పరంపరలో ఇది మూడవ సంపుటి. ఇందులో క్షేత్ర అధ్యయనాలు, నిజ నిర్ధారణ నివేదికలూ గతంలో ఐదు పుస్తకాలుగా వెలువడ్డాయి. వీటిలో నాలుగింటిని బి.డి.దమయంతి పేరుతో రాసింది. ఆ పేరుతో అనేక సామాజిక రాజకీయ వ్యాసాలు రాసింది. వాటిని రాబోయే సంపుటాల్లో పొందుపరచగలం. ఇందులో ఒక రచన మాత్రం గమిత పేరుతో చేసింది.
2004 లో కామ్రేడ్ రేణుక విప్లవోద్యమ ప్రస్థానంలో అజ్ఞాత జీవితం మొదలయ్యింది. ఆర్గనైజేషన్ తో పాటుగా తాను ప్రెస్ విభాగంలో పనిచేసింది. 2025 వరకూ తాను అనేక పత్రికల నిర్వహణ బాధ్యతలను చూడడమే కాకుండా అనేక రచనలు చేసింది. వాటన్నిటినీ కలిపి చూసినపుడు రెండు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రను లోతుగా అధ్యయనం చేయగలుగుతాం. అనేక సమకాలీన సామాజిక విషయాల గురించి మావోయిస్టు పార్టీ అవగాహన గురించి వివరంగా తెలుసుకోగలుగుతాం. ఈ రచనల సందర్భంగా తాను పెట్టుకున్న కలం పేర్లు తన రాజకీయ జీవితానికి ఒక ప్రతీక వంటివి. ఆంధ్ర ఒడిష ప్రాంతంలోని బాసధార లో తాను మొట్టమొదట అజ్ఞాతంగా పనిచేసింది. ఆ ప్రాంతంలో తాను అడుగుపెట్టడానికి కొద్ది కాలం ముందు (30-3-2003) అక్కడ అమరురాలయిన కా.దమయంతి పేరుని బాసధార కూడా కలిసి వచ్చేటట్టు బి.డి. దమయంతి అని పెట్టుకొని ముఖ్యమైన విప్లోవోద్యమ రిపోర్టులను రాసింది. అలాగే మల్కన్ గిరీలో ప్రెస్ విభాగంలో పనిచేసిన శ్వేత అమరురాలయినపుడు మల్కనగిరి కూడా కలిసి వచ్చేటట్టు ఎం.జి. శ్వేత పేరుతో కొన్ని రచనలు చేసింది. కొన్ని కథలు మిడ్కో పేరుతో రాసింది. మిడ్కో అనే గోండి పదానికి అర్థం మిణుగురు. అప్పటికి విప్లవోద్యమంలో పనిచేస్తు తనపై ఎంతో ప్రభావం వేసిన అన్న సహచరి కా.మిడ్కో (సబిత పేరుతో పనిచేశారు)పేరుని ఆమె స్ఫూర్తిగా పెట్టుకుంది. 31-3-2025లో కా.రేణుక అమరురాలయ్యేనాటికి పెట్టుకున్న పేరు చైతే. 2011 లో దమయంతి పేరుతో తాను రాసిన ఒక వ్యాసంలో కుమిలి, చైతే అనే ఇద్దరు క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ నాయకుల గురించి రాసింది. ఆ ఇద్దరినీ రాజ్య ప్రాయోజిత గూండాలు తీవ్రంగా చిత్రహింసలకి గురి చేసి అత్యాచారం చేసి చాలా క్రూరంగా చంపేశారు. కామ్రేడ్ రేణుక మదావి చైతే పేరుతో కూడా కొన్ని వ్యాసాలు నివేదికలూ రాసింది.
కామ్రేడ్ రేణుక, మిడ్కో పేరుతో చేసిన రచనలు ప్రధానంగా సృజనాత్మక సాహిత్యం. కాబట్టి వాటిని మిడ్కో సమగ్ర సాహిత్యం గా పేర్కొని, రాజకీయ వ్యాసాలు, విశ్లేషణలు వంటి సామాజిక వ్యాసాలను బి.డి. దమయంతి సమగ్ర సాహిత్యంగా పేర్కొంటున్నాం. కథల విషయంలో మిడ్కో గా ఆమెను పాఠకులు ఎంతగా ఆదరించారో రాజకీయ విశ్లేషణల విషయంలో బి.డి. దమయంతిగా అంతగా ఆదరించారు. ఈ ఇద్దరూ ఒక్కరేననీ ఆ ఒక్కరూ గుముడవెల్లి రేణుక అనీ పాఠకులకు 2025 మార్చి 31 వ తేదీన కామ్రేడ్ రేణుకను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసినపుడు మాత్రమే తెలిసింది. ఇందులోని ఐదు రచనలు గతంలో ముద్రితమైన రూపంలోనే ఆయా పుస్తకాలకు రాసిన ముందుమాటలతో సహా ప్రచురిస్తున్నాం. రచనా కాలాన్ని బట్టి ఆ వరుసలో పొందుపరిచాం.
దండకారణ్యంలో తరతరాలుగా పాలక వర్గాల దోపిడీకి, తెగ ఆధిపత్యానికీ గురౌతూ ఆ దోపిడీకి ఆధిపత్యానికీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసులకు నక్సలైట్ ఉద్యమమొక శాస్త్రీయ పోరు మార్గాన్ని చూపింది. రెండున్నర దశాబ్దాల పోరాట అనంతరం ఆదివాసులు బీజరూపంలోనైనా తమదైన రాజ్యాధికారాన్ని స్థాపించుకున్నారు. దండకారణ్యంలోని సంపదను సామ్రాజ్యవాదులకూ దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకూ దోచిపెట్టడానికి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అనేక వేల కోట్ల రూపాయల ఒప్పందాలను కుదుర్చుకుంది. కానీ అక్కడ ఉద్యమాన్ని దెబ్బకొట్టకుండా వారి ఆకాంక్షలు నెరవేరవు కనక ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పాలకపార్టీలన్నీ ఏకమయ్యి, 1990 లోనూ 1997లోనూ జనజాగరణ అభియాన్ పేరిట తీవ్ర నిర్బంధ క్యాంపెయిన్ లను అమలుచేసి విఫలమయ్యాయి. మళ్ళీ 2005లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ నాయకత్వంలో (ఆదివాసీ భూస్వామి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో సల్వా జుడుం (శాంతి ప్రచారం) పేరుతో మళ్ళీ తీవ్రమైన దాడులను మొదలుపెట్టింది. 2006 జనవరిలో కామ్రేడ్ రేణుక దండకారణ్యంలో నెలరోజులపాటు పర్యటించి రాసిన నివేదికే ‘‘పచ్చని బతుకులపై నిప్పయి కురుస్తున్న రాజ్యం (సల్వాజుడుం తీరు తెన్నులపై ఒక పరిశీలన).
సల్వాజుడుం మొదలైన మూడు సంవత్సరాలకి మళ్ళీ 2008 అక్టోబర్ లో రేణుక దండకారణ్యంలోని పశ్చిమ బస్తర్ లో పర్యటించింది. మహిళలపై తీవ్రమైన హింస జరుగుతుండడంతో ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లోని మహిళలను కలిసి తయారు చేసిన ఆ నివేదిక ‘‘మండుతున్న గాయాలు’’ (సల్వాజుడుం బాధిత మహిళల హృదయ స్పందనలు).
‘‘వామపక్ష తీవ్ర వాదమే దేశం ముందున్న అతి పెద్ద సవాల్ గా’’ ప్రచారం చేస్తూ మావోయిస్టు పార్టీ అణచివేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దండకారణ్యంలో తలపెట్టిన అణచివేత చర్యకు ‘‘ఆపరేషన్ గ్రీన్ హంట్’’ అని నామకరణం చేశారు. ఈ గ్రీన్ హంట్ లో భాగంగా 2009 సెప్టెంబర్ 17 న సింగనమడుగు తదితర గ్రామాలపై దాడిచేసి జరిపిన భీభత్స మారణకాండ అనంతరం కామ్రేడ్ రేణుక ఆ గ్రామాల్లో పర్యటించి ‘‘గ్రీన్ హంట్ పేరుతో అమాయక ఆదివాసీలపై సాగుతున్న వేట- కోబ్రాల కాటుకు బలైపోయిన ఆదివాసీలు’’ (సింగనమడుగు ఘటనపై నిజనిర్ధారణ నివేదిక) తయారుచేసింది.
‘‘దేశ వ్యాప్తంగా ఆదివాసీలు జీవన్మరణ పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలన్నీ పోరాట కేంద్రాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. విలువైన సంపదలెన్నో ఉన్నప్పటికీ అత్యంత దారుణ దోపిడీ, పీడనల ఫలితంగా పేదరికానికీ, ఆకలి చావులకీ నెలవుగా మారిన ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలోని నారాయణపట్నా బ్లాకు లోని ఆదివాసీలు, కోల్పోయిన తమ భూములను తిరిగి పొందడం కోసం రాజీలేని పోరును కొనసాగిస్తున్నారు. ఆ పోరు కేంద్రంగా ఇక్కడొక చైతన్యవంతమైన సమాజంనిర్మితమవుతోంది.’’ దానిని అధ్యయనం చేయడం కోసం కామ్రేడ్ రేణుక 2011లో రెండు నెలల పాటు పర్యటించి రాసిన పుస్తకమే ‘‘విముక్తి బాటలో నారాయణపట్నా’’.
అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీల్లో ఇటీవల పెరుగుతున్న వలసలను అధ్యయనం చేసి తయారుచేసిన నివేదిక చివరిది. ‘‘ఛత్తీస్ గఢ్ లో బస్తర్ ప్రాంతం పాలకులకు అనేక రకాలుగా సవాల్ గా మారిన ప్రాంతం. పాలకుల అభివృద్ధి నమూనాను అడ్డుకుంటూ విప్లవోద్యమ నాయకత్వంలో అక్కడి ప్రజలు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్న ప్రాంతం. మరి ఇక్కడ వలసలు పెరగడానికి కారణం ఏంటి? అక్కడ వలస కూలీలు పడుతున్న బాధలేమీటీ వలసలకు అక్కడి విప్లవోద్యమం చూపుతున్న ప్రత్యామ్నాయం ఏమిటి?’’ అనే విషయాలను అధ్యయనం చేసి కామ్రేడ్ రేణుక తయారు చేసిన చివరి పుస్తకం ‘‘పట్టణాలకు ప్రవహిస్తున్న అడవి బిడ్డల చెమటా నెత్తురూ’’ ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంత వలస కూలీలపై ఒక అధ్యయనం). ఈ రచన గమిత పేరుతో చేసింది.
చైనా, రష్యా విప్లవాల సందర్భంలో ఇలా ఉద్యమ ప్రాంతాలను సందర్శించి అక్కడి నాయకత్వం కానీ, బయట నుండి మేధావులు కానీ అనేక రచనలు చేయడం చూస్తాం. భారత విప్లవోద్యమం గురించి లోపలి వ్యక్తిగా అయినా నిజాయితీగా, ప్రజల పక్షాన నిలబడి రాసిన తీరు ఆమెను ‘‘ఒక రెడ్ జర్నలిస్టు’’గా చరిత్రలో నిలబెడుతుంది.