(ఐదు భాగాల మిడ్కో సమగ్ర సాహిత్యంలో *మెట్ల మీద *, ప్రవాహం * కథా సంపుటాలకు సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే అమరుల బంధు మిత్రుల సంఘం సభలో ఆవిష్కరణ )
తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా విప్లవోద్యమ సాహిత్యానికీ ఒక గొప్ప చేర్పు కామ్రేడ్ గుముడవెల్లి రేణుక (మిడ్కో) సాహిత్యం. రేణుక కథల వల్లే మిడ్కో అంటే మిణుగురు అని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ కథలు తెలుగు సాహిత్యానికే పరిమితం కావు. పలు భారతీయ భాషల ద్వారా దేశమంతటా ప్రయాణం మొదలుపెట్టాయి. దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్త పాఠకులను సంపాదించుకుంటున్నాయి. ఆ కథలకి కర్త అయిన రేణుక మాత్రం అజ్ఞాతంగా, నిశ్శబ్దంగా మూడు దశాబ్దాల పాటు రచయితగా తానేమిటో ఎవరికి తెలియకుండా పలు కలం పేర్ల చాటున ఎంతో నమ్రతగా ఉండిపోయింది. 2025 మార్చి 31న అతి క్రూరంగా రాజ్యహింసకు గురై భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించింది.
రేణుక సమగ్ర సాహిత్యం తీసుకురావాలనుకొని, రచనల సేకరణలోకి దిగాక రచయితగా ఆమె విస్తృతి అర్థమైంది. అజ్ఞాత విప్లవోద్యమంలోంచి ఇన్ని వేల పేజీలు రాసిన రచయిత్రి బహుశా ఇప్పటికి రేణుకే కావచ్చు. అట్లాగే ఇన్ని ప్రక్రియల్లో, ఇంత సాంద్రంగా, ఇంత లోతుగా రాసిన అమర రచయితల్లో కూడా రేణుక ముందు వరుసలో ఉంటుంది. కథల్లో ఎంత భావోద్వేగం ఉంటుందో, వ్యాసాల్లో అంత విశ్లేషణ ఉంటుంది. ప్రక్రియా ప్రత్యేకతలు తెలిసి, వాటితో వ్యవహరించడంలో కూడా రేణుక చాలా మెలకువ పాటించింది.
ఆమె రచనలన్నీ చదువుతోంటే ఎప్పటి నుంచో తెలిసిన రేణుక సరికొత్తగా తెలిసింది. ఆమె సమగ్ర సాహిత్యాన్ని తెలుసుకోవడమంటే ఆమె జీవితాచరణను కూడా సమగ్రంగా తెలుసుకోవడమే. అందుకే ఈ రచన సేకరణ, పరిశీలన, క్రోడీకరణ దానికదే ఒక గొప్ప అనుభవం. అది కేవలం ఒక మనిషిని తెలుసుకున్నట్లు కాదు. ఆమె నడయాడిన ఈ కాలాన్ని, ఆమె భాగమైన ప్రజాయుద్ధాన్ని మరోసారి తిరిగి చూసినట్లయింది.
మొదట తనను తాను వ్యక్తీకరించుకోడానికి కథా రచన చేపట్టిన రేణుక విప్లవం కోసం తనలోని సృజనాత్మకతను, మేథా శక్తినంతా వెచ్చింది. అందువల్ల ఆమె కథలకే పరిమితం కావాలనుకోలేదు. కథలు, కవితలు, స్పందనలూ, పుస్తక పరిచయాలు, సాహిత్య వ్యాసాలు, విశ్లేషణలు, సామాజిక వ్యాసాలు, క్షేత్ర స్థాయి పరిశోధనా నివేదికలు, ఇంటర్వ్యూలు, జీవిత చరిత్రలు ఇలా అనేక పద్ధతుల్లో రచనలు చేసింది. వీటిలో కొన్నిటికి ఇంకా సేకరించాల్సే ఉన్నది. అన్నిటినీ కలిపి రెండు కథా సంపుటాలు, వ్యాసాలు తదితర ఇతర ప్రక్రియా రచనలను మూడు సంపుటాలుగా తీసుకొస్తున్నాం.
ఒకానొక సందర్భంలో తన ఆత్మీయులతో రేణుక తన కథల నేపథ్యం పంచుకుంది. దాన్ని ఒక వ్యాసంగా కథల సంపుటాల వెనుక చేర్చాము. పదహారేళ్ళ ప్రాయంలో తాను రాసిన మొదటి కథ నోటు పుస్తకానికే పరిమితం అయ్యింది. రెండు పదుల వయసు కూడా రాక ముందే రాసిన రెండో కథ అచ్చు కాలేదు. అది ఎక్కడో పోయింది. ఆ రెండు కథలు మహిళా సమస్యల కోణంలోనే రాసినట్లు ఆమె చెప్పిన కథా నేపథ్యంలో ఉంది. అంత చిన్న వయసులోనే రేణుక ఎంత చైతన్యవంతంగా కథా వస్తువును ఎంచుకుంది. అమ్మాయిగా తన పరిసరాల్లోంచి, పరిశీలనలోంచి, జీవితానుభవంలోంచి ఆ వస్తువులు ఎన్నుకున్నది. ఆరంభం నుంచి రేణుకను జీవిత వాస్తవికతే కదిలిస్తూ వచ్చిందని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లోనే కవిత కూడా రాసింది. సాధారణంగా ఆ వయసులో కవిత్వం రాస్తే తప్పకుండా అది ప్రేమ కవిత్వం అయ్యే అవకాశం ఉంది. కానీ తను రాసిన మొదటి కవిత బాల కార్మికుల గురించి!
ఇదంతా ఎలా సాధ్యం అయ్యింది? ఒక మామూలు ఆడపిల్లకు ఏ రకంగా ఈ చైతన్యం అబ్బింది? మనుషులకు.. వాళ్లు ఆడైనా మగైనా ఈ లోకాన్ని చూసే కళ్ళజోడుని మొట్టమొదట కుటుంబం, ఆ తర్వాత పరిసరాలు తయారుచేస్తాయి. ఆ రకంగా చూస్తే రేణుక పోరాటాల గడ్డగా పేరొందిన ప్రస్తుత తెలంగాణా రాష్ట్రం, జనగాం జిల్లా దేవరుప్పల మండలంలోని కడవెండిలో (1970 అక్టోబర్ 14 న) జన్మించింది. కడవెండి చారిత్రక ప్రాధాన్యం ఉన్న గ్రామం. తెలంగాణా సాయుధ పోరాటంలోని తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పుట్టిన వూరు కడవెండి. సంస్థానంగా ఉన్న హైదరాబాద్‌ను పాలిస్తున్న నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అండతో తీవ్ర అరాచకాలను సాగిస్తున్న స్థానిక భూస్వాములు, దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరీ, దోపిడీలను ఎదిరిస్తూ తెలంగాణా ప్రజలు 1946-51 మధ్య సాయుధంగా పోరాటం చేశారు. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని. ఆమె కడవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది. కడవెండిలోనూ ఆంధ్ర మహాసభ సంఘం ఏర్పడిరది. సంఘం నాయకత్వంలో ప్రజలు విసునూర్ దేశ్‌ముఖ్ ఆటలు కట్టించారు. వెట్టి చాకిరిని నిర్మూలించారు. 1946 జూలై 4న విసునూరు రామచంద్రారెడ్డి పంపిన గుండాలను ప్రజలంతా ఏకమై కర్రలు, బడిసెలు, గునపాలు అందుకొని తరిమికొట్టారు. గూండాల తుపాకి తూటాలకు దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. వేలాదిమంది జనంతో అంతిమయాత్ర జరిగింది. దొడ్డి కొమరయ్య స్థూపాన్ని కడవెండి గ్రామంలో నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఇంకా ఎందరో యువతీ యువకులు విప్లవోద్యమంలో భాగం అవుతూనే ఉన్నారు. స్థూపాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఈనాటికీ ఆ స్థూపాలు సైతం పాలకులను వణికిస్తూనే ఉన్నాయి. మూడు దశాబ్దాల తర్వాత దొడ్డి కొమురయ్య స్థూపం దగ్గర రేణుక బాల్యం గడచింది. అక్కడ ఆడుకుంటూ ఈ సమాజపు తీరును తెలుసుకున్నది. బహుశా జానకమ్మ దొరసాని ఆగడాలను గురించీ, ప్రజల వీరోచిత తిరుగుబాట్లను గురించీ అమ్మ దగ్గరో మామ్మ దగ్గరో కథలుగా వినే ఉంటుంది. రేణుక తల్లిదండ్రులు గుముడవెల్లి సోమయ్య, జయమ్మ ప్రగతిశీల భావాలు కలవారు. సోమయ్య గారు ఉపాధ్యాయులు. వారిది విప్లవ రాజకీయాల వల్ల ప్రభావితమైన కుటుంబం. వారి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య అల్లారుముద్దుగా పెరిగిన ‘‘చిట్టెమ్మ’’ రేణుక.
ఆమెను ఒక ఆడపిల్లగా కాక తమ ప్రియమైన బిడ్డగా పెంచిన తల్లిదండ్రుల ప్రజాస్వామిక వైఖరి కూడా ఆమెను తీర్చిదిద్దింది. ఇలాంటి నేపథ్యం ఉన్నందు వల్లనే రేణక తొలి కథలు మహిళా దృష్టి కోణంతో రాయగలిగింది.
యుక్త వయసు రాగానే పెద్దలు త్వరపడి చేసిన పెళ్ళిలో ఆమె ఇమడలేకపోయింది. భర్త వేధింపులు తట్టుకోలేక రెండేళ్లలోనే వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. ఎందరో ఆడపిల్లల్లాగా రేణుక ఆ పంజరంలోనే ఉండిపోయి ఉంటే, ఎందరో తల్లిదండ్రుల్లాగా కూతురు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు సమర్థించలేకపోయి ఉంటే రేణుక రేణుకగానే మిగిలిపోయి ఉండేది. కానీ ఆమె అక్కడ ఆగిపోలేదు. జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కుటుంబం అండగా నిలిచింది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం మిడ్కోగా, చైతేగా చైతన్యవంతంగా సాగి అమరమైంది.
‘‘ఆడపిల్లలు తమ కాళ్ళపై తమ నిలబడడానికి చదువు అవసరం కదా’’ అని బి.ఏ (ఎక్స్టర్నల్) పూర్తి చేసింది. ఎం.ఏ తెలుగు లోనూ ఎల్.ఎల్.బి లోనూ ప్రవేశం దొరికితే తిరుపతి దూరం అయినా ఎల్.ఎల్.బినే ఎంచుకొని ప్రయాణమైంది. అప్పటికే విప్లవ రాజకీయాలలోకి ప్రవేశించిన అన్న స్నేహితుల ద్వారా తిరుపతిలో పట్టణ విప్లవోద్యమంలో ఆర్గనైజర్‌గా పని చేస్తున్న కామ్రేడ్ పద్మ, రేణుకను వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడే మహిళా సంఘంలో పని చేసే కార్యకర్తగా మారింది. కథల గురించి చర్చించడానికి అక్కడ మిత్రులు దొరికారు.
“`
1985-90 వరకూ తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన నిప్పులు చెరిగే నిర్బంధంలో అనేక బూటకపు ఎన్‌కౌంటర్లు, హక్కుల కార్యకర్తలపై ప్రభుత్వ ప్రాయోజిత గూండాల దాడులు, హత్యలతో ‘‘ఆట, మాట, పాట బందు’’ అయిపోయాయి. చివరికి ఎన్నికలలో ఓటమిపాలయ్యాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్బంధాన్ని సడలించక తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు అనేక ప్రజా సమస్యలపై వెల్లువలా కదిలాయి.
అవి 1990ల దశకం తొలినాళ్ళు. సారా వ్యతిరేక పోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలువైపులా ఉవ్వెత్తున చెలరేగిన కాలం. అప్పటికి దశాబ్ద కాలంగా ఫెమినిస్టు రాజకీయాలు పితృస్వామ్యాన్ని ప్రశ్నించే ఒక బలమైన ధోరణిగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన కాలం. రాష్ట్రం నలువైపులా ఎన్నో ప్రాంతాలలో మహిళా సంఘాలు ఏర్పడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న కాలం. ఎన్నో ప్రగతిశీల పత్రికలు, మహిళా పత్రికలు వెలువడుతుండినాయి. దినపత్రికలు కూడా ప్రత్యేక మహిళా పేజీలను మొదలుపెట్టక తప్పని పరిస్థితి. మరోవైపు దళిత అస్తిత్వం చైతన్యంగా రెక్కలు విప్పుకుంటున్న కాలం. ఆ కాలంలోనే 1989 నుండి 1993 వరకు సామాజిక రాజకీయ రంగాల్లో ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించి ప్రజల పక్షాన నిలబడే వేదికగా నలుపు పత్రిక నడిచింది. రేణుక తన మొదటి కథను పంపింది నలుపు పత్రికకే. కానీ అప్పటికే ఆ పత్రిక ఆగిపోయే పరిస్థితిలో ఉంది. చివరి సంచికలో రేణుక కవితను ప్రచురించారు. కానీ తను పంపిన కథలో చివరి పేజీ పత్రిక ఆఫీసులో పోవడంతో అది మాత్రం అచ్చు కాలేదు.
కానీ ఆ కథ గురించి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల ఆమెకు నలుపు పత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న చక్రవేణు పరిచయమయ్యాడు. రేణుక పంపిన కథను ఆయన ఎంతో ప్రశంసిస్తూ రాసిన ఉత్తరం ఆమెను మరొక కథ రాయడానికి ప్రేరేపించింది. ఆ కథను చూడకముందే ఆయన అకాలంగా మరణించాడు. కానీ ఆయన వల్ల కలిగిన ప్రేరణ మాత్రం కొనసాగింది. చక్రవేణుకు చూపించలేకపోయిన దుఃఖంతో ఆ కథను రేణు తిరిగి మళ్లీ చూసుకోలేదు. మరెవరికీ చదవడానికి ఇవ్వలేదు. అట్లాగే ఆహ్వానం పత్రికకు పంపించింది. 1994లో అచ్చయిన ‘భావుకత’ అనే కథ ఎన్నో ప్రశంసలను అందుకుంది. అచ్చయిన రేణుక మొదటి కథ అదే.
1989 మార్చిలో ఆలూరి సత్యవతి సంపాదకత్వంలో మార్క్సిస్టు భావజాలంతో మహిళా మార్గం పత్రిక మొదలైంది. 1992లో విష్ణుప్రియ ఎడిటర్‌గా తిరుపతికి మారింది. ఈ పత్రిక ప్రధానంగా కార్యకర్తల సహకారంతోనే నడిచేది. విష్ణుప్రియ మహిళా శక్తి అనే మహిళా సంఘానికి నాయకత్వం వహిస్తూ ఉండడంతో సహజంగానే ఆమె ఇల్లు అనేక మంది కార్యకర్తలకు కేంద్రంగా ఉండేది. రేణుక కూడా ఆ ఇంట్లోనే అనేకమంది స్నేహితులను సంపాదించుకుంది. స్త్రీల సమస్యలకీ, ఇతర సామాజిక సమస్యలకీ ఉన్న సంబంధాన్ని మార్క్సిస్టు పద్ధతిలో తెలుసుకోడానికి కార్యకర్తల మధ్య అనేక చర్చలు జరుగుతుండేవి. రేణుక ఆ చర్చల్లో చాలా క్రియాశీలంగా ఉండేది. సారా వ్యతిరేక పోరాటం సహా మహిళా సమస్యలపై అనేక పోరాటాల్లో మహిళా శక్తి పాల్గొనేది. వాటన్నిటిలో రేణుక భాగమైంది.
అక్కడే ఆమెకు రచయితలుగా తొలి అడుగులు వేస్తున్న వారితోపాటు కథకులుగా రాణిస్తున్న వారు కూడా ఎందరో పరిచయమయ్యారు. జర్నలిస్టు, రచయిత ఉమామహేశ్వరరావు కూడా అక్కడే పరిచయమయ్యారు. విప్లవ రచయితల సంఘం(విరసం) మిత్రులు పరిచయం అయ్యారు. విరసం నిర్వహించిన కథావర్క్ షాప్‌లో పాల్గొనడంతో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తం, బమ్మిడి జగదీశ్వరరావు(బజరా), శ్రీనివాసమూర్తి వంటి ఎందరో రచయితలు, కథా విమర్శకులు పరిచయమయ్యారు.
అప్పటికి రేణుక ఎవరో వారికి తెలియదు. ఆమె కథలు చదివి ఆమెను అభిమానించిన వారే. వీరంతా రేణుక కథలను మెచ్చుకొని ప్రోత్సహించారు. చాలా సహజంగా కథలను రాసేయగలడం రేణుకకున్న ఒక నైపుణ్యం. ఈ రచయితలంతా ఆమెకు ‘నువ్వు రాస్తున్న పద్ధతిలో ముందుకు సాగిపో’ అనే ధైర్యాన్ని ఇచ్చారు. మొదటి నుండి ఆమెకు ఒక ప్రత్యేక శైలి పట్టుబడిరది. తరవాతి కాలంలో 2002 నుండి 2004 వరకు రెండు యేళ్లు మహిళామార్గం సంపాదక వర్గంలో సభ్యురాలిగా పనిచేసింది. మహిళామార్గం పత్రికకి అనేక రచనలు చేసింది. వాటిల్లో కథలు, స్పందనలు, నివేదికలు, కవితలు, వ్యాసాలు, పుస్తక పరిచయాలు, సంపాదకీయాలు ఉన్నాయి.
“`
రేణుక ఎన్నో కలం పేర్లతో కథలు రాసింది. తన అజ్ఞాత విప్లవ జీవితం వల్ల, అనేక కలం పేర్లతో రాయడం వల్ల ఆమె కథలు సేకరించడంలో కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. అజ్ఞాత విప్లవ రచయిత్రుల కథలను వియ్యుక్క పేరుతో సంకలనం చేసినప్పుడు ‘భావన’ పేరుతో ఉన్న ‘వెనుకబాటు’, ‘కానుక’ అనే రెండు కథలు రేణుక రచనలుగా పొరబడ్డాం. అలాగే ‘విజ్జే’ పేరుతో రాసిన ‘విప్లవతరం’, ‘అజిత’ పేరుతో రాసిన ‘గురువులు’, ‘ఆసిఫా’ పేరుతో రాసిన ‘ధిక్కారం’, ‘విప్లవంలో ఒక తల్లి తండ్రి’ అనే నాలుగు కథలు రేణుక రాసినవే అని గుర్తించలేకపోయాం. తరువాత రేణుక స్వయంగా వియ్యుక్క ఎడిటర్‌కు రాసిన చివరి ఉత్తరం వల్ల ఆ విషయాలు స్పష్టం అయ్యాయి. ఇప్పుడు సాధికారికంగా తను రాసిన కథలలో అచ్చయిన 36 కథలను రెండు సంపుటాలుగా అచ్చేస్తున్నాం.
మొదటి సంపుటంలో 18 కథలు ఉన్నాయి. ఇవన్నీ మహిళా సమస్యల భిన్నమైన కోణాలనూ, నేరుగా కంటికి కనిపించని రూపంలో ఉండే వివక్ష రూపాలనూ ఎత్తి చూపించేవి. స్త్రీ జీవితం గురించి మగ ప్రపంచానికి ఉండే భావజాలాన్నీ, స్త్రీ అర్థం చేసుకోవడంలో స్థిరపడిపోయిన మూస ప్రమాణాలనూ ఈ కథలు చర్చనీయాంశం చేశాయి. స్త్రీ అనుభవాన్ని స్త్రీలు కూడా కొత్తగా చూడటానికి ఈ కథలు కొత్త కిటికీలు తెరుస్తాయి. మొత్తం మీద స్త్రీలను కండిషన్ చేసిన సాంస్కృతిక విలువలను, సామాజిక బంధనాలను విప్పి చూపించే కథలు ఇవి. 2007లో అప్పటికి వచ్చిన రేణుక కథలను ‘‘మెట్లమీద’’ పేరుతో విప్లవ రచయితల సంఘం ప్రచురించింది. అందులో కొన్ని కథలను ఆమె వేరు, వేరు పేర్లతో రాసినప్పటికీ ఎక్కువ కథలు మిడ్కో పేరుతోనే ఉన్నందు వల్ల అన్నిటినీ కలిపి మిడ్కో కథలుగా ప్రచురించారు.
ఈ తొలి దశ కథలను పరిశీలిస్తే మొదటి కథ ‘భావుకత’ నుంచి రచయిత్రిగా రేణుక సాధించిన పరిణతి మనకు అర్థమవుతుంది. ఇదంతా ఆమె పరిశీలనా శక్తికి సంబంధించింది. జీవితాన్ని వాస్తవికంగానేగాక విమర్శనాత్మకంగా చూడటం రేణుకకు మొదటి నుంచీ అలవాటు. దేన్నీ యథాతథంగా చూడదు. కంటికి కనిపించేది సత్యమని సరిపెట్టుకోదు. జీవితం ఇట్లా ఎందుకు ఉన్నదో తెలుసుకోడానికి తిరగేసి చూస్తుంది. ముఖ్యంగా స్త్రీ జీవితాన్ని కుదిస్తున్న విలువలను, విశ్వాసాలను, కట్టుబాట్లను పరిశీలించడానికి ఆమె సమాజంలోకి వెళుతుంది. విశాలమైన, విస్తారమైన సాంస్కృతిక భావజాల మూలాలను సమాజమంతా వెతికి గ్రహిస్తుంది. వాస్తవికతను విమర్శనాత్మకంగా రచనల్లో చూపడానికి ప్రయత్నిస్తుంది.
అందుకే తన కథలు కానీ, కథనాలు గాని చదివినపుడు మనకి వాస్తవికత కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది. దాన్ని ఆమె అద్భుÛతమైన దృశ్యంగా మలిచి మనకు అందిస్తుంది. అనేక పొరలుగా, వైరుధ్యాల మయంగా ఉండే వాస్తవికతను అతి దగ్గరిగా పరిశీలించే నైపుణ్యం ఉన్నందు వల్ల ఆమె కథల్లో అనేక పొరలుంటాయి.
ముఖ్యంగా అనేక కథల్లో తెలంగాణా జీవితాన్ని ఆమె అద్భుతంగా చిత్రించింది. తన కథల్లోని పాత్రలు, వ్యక్తిత్వాలు, వారి భాష, సంస్కృతి ఇవన్నిటిని గురించి ఆమె చాలా సహజంగా రాసేస్తుంది. నిజానికి ‘మిడ్కో కథల్లో తెలంగాణ జీవితం’ ఒక పరిశోధనాంశం కాగలిగినది. ఉదాహరణకు ‘‘బొందజూడనైతి’’ (2002) అనే కథ. ఎవరైనా చనిపోయినపుడు తెలంగాణ గ్రామాల్లో జరిగే తంతును ఆమె మానవ సంబంధాల వైపు నుంచి చిత్రించింది. తీవ్రమైన భావోద్వేగాలతో మనుషుల మధ్య సంబంధాలను చెప్పడం ద్వారా మరణం తర్వాత జరిగే తంతులోని సాంస్కృతిక విషయాలను అద్భుతంగా చెప్పింది.
తాను విప్లవోద్యమ జీవితాన్ని గురించి రాయడం ఇంకా మొదలుపెట్టని తొంభైల తొలి కాలంలో సాధారణ జీవితాల్లో చాలా మామూలుగా తీసుకునే విషయాల్లోని పితృస్వామిక కోణాలు వెలికితీస్తూ అనేక కథలు రాసింది. ‘‘అమ్మకోసం’’ బహుమతి కొనేటప్పుడు వంటింట్లోని తన పనిని తక్కువ జేసె వస్తువులు కొనడం తప్ప అమ్మ ఇష్టాయిష్టాల గురించి ఆలోచించాలని కూడా తట్టకపోవడం ఎందరినో ఆత్మ పరిశీలన చేసుకొనేలా చేసింది. ఒక బాధ్యత కలిగిన తల్లి కొద్దిగా భిన్నంగా ఆలోచించవలిసినట్టుగా ఆలోచిస్తే ‘‘విడ్డూరపు మనిషి’’ గా సమాజం ఎలా ముద్ర వేస్తుందో తెలియజేసిన కథ తన తొలి కథల్లో ఒకటి. ఇక స్త్రీ పురుష సంబంధాలలోని కనిపించని పితృస్వామ్యాన్ని వెలికితీసినవి ఎన్నో కథలు. పిల్లలు కలగకపోతే దానికి స్త్రీని మాత్రమే బాధ్యురాలిని చేసి నిందించే ధోరణిని చెప్పిన కథలు ‘అనిత’, ‘మొగప్రపంచం’. ఈ సమస్య ఏ వర్గానికి చెందిన మహిళలకైనా తప్పదు. అది ఏకంగా స్త్రీ అస్తిత్వాన్నే ప్రశ్నించే సమస్యగా మారుతుందని ఈ కథలు చెబుతాయి.
తన కథలలో కుటుంబ సంబంధాలు కూడా తన సొంత జీవిత అనుభవాలలోనుండి, తన చుట్టుపక్కల వారి అనుభవాల నుండి రాసినవే. అందులో అమ్మమ్మలు, పెద్దమ్మలు, అమ్మలు, పెద బాపు, చిన బాపు, అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ తారసపడతారు. ఆ పాత్రలను మలిచేటపుడు వాళ్ళు బయటికి కనిపించే లాగే కాకుండా వాళ్ళ మనసుల్లోకి తరచి చూసి వారి లోపలి వ్యక్తిత్వాలని బయటికి తీస్తుంది. బలమైన స్త్రీ పాత్రలను చిత్రిస్తుంది.
“`
మిడ్కో కథలన్నిటినీ రెండు సంపుటాలుగా చేసినపుడు స్త్రీ ఇతివృత్తంగా ఉన్న కథలను మొదటి సంపుటిలో చేర్చాము. అయితే ‘‘మెట్ల మీద’’ కథకి నేపథ్యం విప్లవోద్యమమే. అయితే ఈ కథ విప్లవోద్యమంలో నుండి బయటికి వచ్చిన ఒక వ్యక్తి జీవితం ఇతివృత్తంగా అతను బయిటికి వచ్చిన తరవాత నుండి మొదలవుతుంది. అతని ప్రేరణతో ఎంతో చైతన్యాన్ని సంతరించుకున్న అతని చెల్లెలు అన్న బయటికి వచ్చినప్పటికీ తాను పూర్తికాలం పనిచేయాలని నిర్ణయించుకోవడంతో ముగుస్తుంది.
ఈ కథ రెండవ సంకలనంలోని కథలకు మొదటి సంకలనంలోని తక్కిన కథలకు వారధి వంటిది. అందువల్ల ఈ కథను మొదటి సంపుటిలో చివరి కథగా ఉంచాము. ఈ కథ ఎన్నో ప్రశంసలనూ, విమర్శలనూ కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా విప్లవ శిబిరంలో చాలా చర్చ జరిగింది. అన్న ఉద్యమం వదిలి వచ్చి లొంగిపోయినా చెల్లెలు అతని పట్ల అంతే ప్రేమగా ఉండడం, అతనిని దగ్గరగా చూసే అవకాశం కలిగింది కాబట్టి అతనంటే ఇంకా గౌరవం పెరిగింది అనడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇందులో మానవ సంబంధాల్లోని సంఘర్షణను చిత్రించిన తీరు మాత్రం అందరినీ మెప్పించింది.
తొంభైల చివరలో తను విప్లవోద్యమం గురించి రాయడం మొదలుపెట్టాక 18 కథలు ఉద్యమం గురించి రాసింది. మొదటి దశలో ఈ సమాజంలో స్త్రీల స్థానం, వాళ్ల చుట్టూ ఉన్న భావజాలం గురించి రాస్తే రెండో దశలో ఈ సమాజాన్ని మార్చే విప్లవోద్యమంలో స్త్రీలు నిర్వహిస్తున్న క్రియాశీల పాత్ర గురించి రాసింది. ఈ సమాజం విధించిన పరిమితులను దాటి స్త్రీలు విప్లవంలోకి వెళ్లడమే ఒక పెద్ద సామాజిక సాంస్కృతిక పరిణామం. అది అసాధారణమైంది. అక్కడికి వెళ్లాక కూడా స్త్రీలు తమను నిరంతరం మార్చుకుంటూ విప్లవోద్యమాన్ని పితృస్వామ్యానికి, రాజ్యానికి, అంతిమంగా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే శక్తిగా తీర్చిదిద్దడంలో గొప్ప సృజనాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఈ విప్లవాత్మక పరిణామాన్ని స్త్రీ పురుష సంబంధాల వైపు నుంచి రేణుక చిత్రించింది.
స్త్రీలు విప్లవోద్యమంలోకి రావడం, అందులో వారి భాగస్వామ్యం వహించడం, దానికి తగినట్లు రాజకీయంగా ఎదగడం అనేవి వాళ్ల దృఢమైన వ్యక్తిత్వాల ద్వారానే సాధ్యమవుతుంది. స్త్రీలు ఇంత దృఢమైన, నిశ్చయాత్మకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవోద్యమం వల్లనే సాధ్యమైంది. ఈ పరిణామ క్రమాన్ని రేణుక చాలా కథల్లో బాగా చిత్రీకరిస్తుంది. అదే సమయంలో ఈ క్రమానికి ఇప్పటికీ విప్లవోద్యమంలో ఉన్న ఆటంకాలను, పరిమితులను, వాటిని అధిగమించేందుకు స్త్రీలు చేస్తున్న ప్రయత్నాన్ని చాలా నిజాయితీగా రాస్తుంది.
విప్లవోద్యమం స్త్రీలకు ఏం చేసిందనేది ఒంటరి ప్రశ్న కాదు. తరతరాలుగా అణచివేతకు, పీడనకు గురైన మహిళలు, అదీ ఆదివాసీ, శ్రామిక కులాల, వర్గాల స్త్రీలు పోరాటాల్లోకి వచ్చాక వాళ్లు విప్లవోద్యమానికి ఏం చేశారు? అనే ఇంకో ప్రశ్న కూడా ఉంటుంది. ఈ రెంటినీ కలిపి చూసినప్పుడే విప్లవోద్యమం`స్త్రీలు అనే చర్చ పరిపూర్ణమవుతుంది. ఈ అవగాహన రేణుక స్వీయానుభవంలో కూడా ఉన్నదే కావచ్చు. అందువల్ల ఆమె స్త్రీలు కేంద్రంగా రాసిన విప్లవోద్యమ కథలు చదివితే ఉద్యమం నుంచి వాళ్లు నేర్చుకుంటూనే విప్లవానికీ వాళ్లు ఎన్నో సున్నితత్వాలను, లోతైన చూపును అందించారని తెలుస్తుంది.
వ్యక్తుల్లో అయినా, ఉద్యమంలో అయినా ఉండే ఏ చిన్న తిరోగమన భావాన్నయినా వెలికితీసి దాన్ని జీవితంలోంచి, విప్లవాచరణలోంచి ఎత్తి చూపించి, పరిష్కారాల గురించి ఆలోచించేలా రేణుక కథలు రాస్తుంది. రచయితకి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో అదొకటి. ఇలాంటి విషయాలను, ఘటనలను నాతో సహా ఎందరో చూసి ఉంటారు. కానీ దానిలో ఒక కథను చూడగలడం రేణుక ప్రత్యేకత. ఆ సమస్యను కథ చేయడం ద్వారా మనందరి అనుభవంలోని విషయాన్నే గాఢంగా చూపిస్తుంది. కథను అల్లేటప్పుడు చాలా ఓపిక ఉండాలి అని సీనియర్ రచయితలు అంటుంటారు. ఆ ఓపిక ఆమెకు పుష్కలంగా ఉంది. అది కథ అల్లే పద్ధతిలో కనపడుతుంది. ప్రతి పాత్ర పట్ల ఆమెకు చాలా శ్రద్ధ ఉంటుంది. ఆ పాత్ర జీవిస్తున్న పరిసరాలు, నేపథ్యం, సంస్కృతి ఇవన్నిటి పట్ల ఒక ఎరుకతో ఆమె ఒక చిత్రకారిణిలా ఏకాగ్రంగా ఆ పాత్రలను చెక్కుతుంది. ఆ పాత్ర అందులోని ప్రగతిశీల పాత్ర కావచ్చు, లేక రాజ్యహింసను అమలు చేసే ఒక దుష్ట పాత్ర కావచ్చు. బాధ్యతగా ఆ పాత్రలను చిత్రీకరిస్తుంది. ఆ పాత్రల దృక్పథం వల్ల, నిలబడ్డ చోటు వల్ల అట్లాంటి వైఖరి తీసుకున్నారని మనం కన్విన్స్ అయ్యేలా కథ నడపటం రేణుక ప్రత్యేకత. తీవ్రమైన సంఘర్షణ నడుస్తున్న ప్రాంతంలోని ఇతివృత్తాలు తీసుకుంటున్నప్పుడు రచయితగా ఆమె ఎవ్వరినీ ముందస్తుగా చెడ్డవాళ్లనీ, మంచివాళ్లనీ చూపించదు. ఆ ఘర్షణలో ప్రయోజనాలు, న్యాయాన్యాయాలు, వాటి పట్ల ఉండే వైఖరుల వల్ల పాత్రల స్వభావం ఏర్పడుతుంది. ఈ విషయంలో రేణుక చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఆ పాత్ర తెలంగాణలోని మనిషి కావచ్చు, దండకారణ్యంలోని ఆదివాసీ కావచ్చు, ఒడిషాలోని పాత్ర కావచ్చు లేదా ఉత్తరాంధ్రలోని పాత్ర కావచ్చు. అనేక స్థలాల్లోంచి పాత్రలను ఎంచుకోవడం రేణుక కథల్లోని మరో ప్రత్యేకత. అయితే ఏ పాత్రనూ తన ఇష్టం వచ్చినట్లు కాకుండా, ఆ పాత్రలు ఉన్న సంబంధాల్లోంచి, చైతన్యంలోంచి తీర్చిదిద్దుతుంది. ఇంత సీరియస్ విషయాన్ని చాలా అలవోకగా రాయడంలో ఆమె నైపుణ్యం దాగి ఉంది. బహుశా ఆలోచనల్లో ఉండే స్పష్టత, కథా రచన ఎందుకనే దృక్పథం వల్ల మాత్రమే అది సాధ్యమైంది.
“`
తిరుపతిలో ఒక దశాబ్దం పాటు పనిచేసాకా తన కార్యక్షేత్రం విశాఖకు మారింది. అక్కడ మహిళా సంఘంలో కొంతకాలం పనిచేసింది. 1997లో రేణుక అజ్ఞాతంలో విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ మహేష్‌ను వివాహం చేసుకుంది. రెండేళ్లకే కామ్రేడ్ మహేశ్ 1999 డిసెంబర్లో అమరుడయ్యాడు. అది ఆమెకు కోలుకోలేని దెబ్బ. 2004 లో నిర్బంధం తీవ్రంగా మారడంతో అనివార్యంగా తాను అజ్ఞాత జీవితం ఎంచుకోవలిసి వచ్చింది. 2005 లో కామ్రేడ్ అప్పారావుని వివాహం చేసుకుంది. ఆయన 2010లో ఒక బూటకపు ఎన్‌కౌంటర్లో అమరుడయ్యాడు. వ్యక్తిగత జీవితంలోని ఈ విషాదాలు ఆమె పంటి బిగువున భరిస్తూనే ప్రజల సహకారంతో కోలుకొని పట్టుదలగా కొనసాగింది.
ఆంధ్ర ఒడిష ప్రాంతంలోని బాసధారలో తాను మొట్టమొదట అజ్ఞాతంగా పనిచేసింది. అక్కడ ఆర్గనైజేషన్‌తో పాటుగా ప్రెస్ విభాగంలో పనిచేసింది. 2012 లో దండకారణ్యంలో అడుగుపెట్టి 2026 వరకూ వివిధ హోదాల్లో పనిచేసింది. మొత్తం అజ్ఞాత జీవితంలో తాను అనేక కలం పేర్లతో రచనలు చేసింది. విప్లవోద్యమంలో పనిచేస్తూ తనపై ఎంతో ప్రభావం వేసిన తన అన్న సహచరి కా.మిడ్కో (సబిత పేరుతో పనిచేశారు)పేరుని ఆమె స్ఫూర్తిగా పెట్టుకుని మిడ్కో పేరుతో కొన్ని కథలు రాసింది. విజ్జే, అజిత, ఆసిఫా, నిర్మల వంటి పేర్లతో కూడా కథలు రాసింది.
బాసధార ప్రాంతంలో తాను అడుగుపెట్టడానికి కొద్ది కాలం ముందు (30-3-2003) అక్కడ అమరురాలయిన కా.దమయంతి పేరుని బాసధార కూడా కలిసి వచ్చేటట్టు బి.డి. దమయంతి అని పెట్టుకొని ముఖ్యమైన విప్లవోద్యమ రిపోర్టులను రాసింది. అలాగే మల్కన్‌గిరిలో ప్రెస్ విభాగంలో పనిచేసిన శ్వేత అమరురాలయినపుడు మల్కనగిరి కూడా కలిసి వచ్చేటట్టు ఎం.జి.శ్వేత పేరుతో కొన్ని రచనలు చేసింది. 2025 మార్చిలో కా.రేణుక అమరురాలయ్యేనాటికి పెట్టుకున్న పేరు చైతే అని పత్రికల ద్వారా తెలిసింది. 2011 లో దమయంతి పేరుతో తాను రాసిన ఒక వ్యాసంలో కుమిలి, చైతే అనే ఇద్దరు క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ నాయకుల గురించి రాసింది. ఆ ఇద్దరినీ రాజ్య ప్రాయోజిత గూండాలు తీవ్రంగా చిత్రహింసలకి గురి చేసి అత్యాచారం చేసి చాలా క్రూరంగా చంపేశారు. చైతే బస్తర్లోని కాంకేర్ జిల్లాలో కేఏఎంఎస్ నాయకురాలు. ఆమె ఉద్యమంలోనే చదవడం రాయడం, నేర్చుకుంది. అంతే కాదు కంప్యూటర్ కూడా నేర్చుకుని 9 యేళ్లపాటు ప్రెస్ విభాగంలో (2002-2011) పనిచేసింది. అలాంటివారి ఆచరణను కొనసాగించడం కన్నా అద్భుతమైన ఆదర్శం ఇంకేమీ ఉంటుంది. ముఖ్యంగా ప్రెస్ విభాగంలో పనిచేసిన వారికి! విప్లవోద్యమంలోకి వచ్చాకే చదువు నేర్చుకున్న ఎందరో ఆదివాసీ యువతులకి రేణుక స్వయంగా కంప్యూటర్‌లో శిక్షణ ఇచ్చింది. మూడు దశాబ్దాల పాటు అంకితభావంతో ప్రజల కోసం పనిచేసింది. విప్లవోద్యమానికీ ప్రజలకూ ఇంకా ఎంతో దోహదం చేయగలిగిన ఈ కామ్రేడ్ అనారోగ్యంతో నిస్సహాయంగా, నిరాయుధంగా ఉన్నపుడు పట్టుకొని కాల్చి చంపడం ఎంతో దుర్మార్గమైన చర్య. చివరివరకూ ప్రజల పక్షాన నిలబడిన కా.రేణుకకి విప్లవ జోహార్లు!