వసంతం వచ్చినప్పుడు
పువ్వులు ఒక్కసారిగా వికసించవు
అవి అప్పుడే నేలపై వెలిసినట్లు
మన కళ్ళకు మాత్రమే అలా కనిపిస్తాయి

పూసే ముందు
భూమి గర్భంలోనే ఉంటాయి
చీకటిలో మాటలులేని తపనతో
తమ రంగును శ్వాసలా దాచుకుంటాయి

ఎవరికీ చేరని లోతుల్లో
వాన చప్పుడు వింటాయి
వేళ్ల నరాల ద్వారా
కాలం చేసిన గాయాలను తట్టుకుంటూ నిలబడుతాయి

వసంతం అంటే
పువ్వుల ఉత్సవం కాదు
చీకటిని ఓర్చుకున్న
భూమి గుండె తిరుగుబాటు చేసిన క్షణం

అందుకే
ప్రతి పువ్వు ఒక గాయమే
ఆ గాయమే
ఈ ప్రపంచాన్ని పరిమళభరితం చేస్తుంది.

Leave a Reply