(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జూలై 6న హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో *తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత* అనే అంశంపై జరిగిన సెషన్ కోసం రాసిన పేపర్)
మావోయిస్టు పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర
ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ సూచన చేసింది. ప్రజా ప్రయోజనం కోసం తాను కాల్పుల విరమణకు సిద్ధమనితెలంగాణ ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా వివిధ స్థాయిల నాయకులు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల, విప్లవకారుల హత్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సాయుధ పోరాట సంస్థలతో ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి రాజ్యాంగం ప్రకారం ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకోవాల్సి ఉన్నది. కాల్పుల విరమణ ఒక రాజకీయ డిమాండ్ అయినప్పటికీ రాజ్యాంగంలో ఇందులో చోటు ఉన్నది. ఆర్టికల్ 21 మన రాజ్యాంగ విశిష్టతకు గుర్తు. దేశ పౌరులకే గాక పౌరసత్వం లేకున్నా భారత భూభాగంలోని ఇతరులకు కూడా జీవించే హక్కుకు రాజ్యాంగం హామీ పడింది. దీని ప్రకారం చట్టం విధించిన పరిమితుల్లో తప్ప మరే రకంగానూ మనుషుల ప్రాణాలు తీయడానికి లేదు.
ఆధునిక సామాజిక చింతనలో వ్యక్తి స్వేచ్ఛ, విముక్తి అతి ముఖ్యమైనవి. వాటికి కూడా వెన్నెముకలాంటిది జీవించే హక్కు, రాజ్యాంగంలోని మిగతా అన్ని హక్కులకూ కేంద్ర స్థానంలో జీవించే హక్కు ఉంది. పౌరులు ప్రభుత్వాలను ఏర్పరుచుకొని తన రక్షణ అధికారాన్ని అప్పగించడానికీ, తద్వారా ప్రభుత్వం- పౌరులు అనే సంబంధంలో భాగంగా కొనసాగడానికీ జీవించే హక్కు ప్రాణప్రదం.
దీనికి మొదటి నుంచీ మన దేశంలో చాలా ఆటంకాలు ఉన్నాయి. తద్వారా జీవించే హక్కు ఉల్లంఘించబడుతూ ఉంది. ఈ మొత్తానికి పరాకాష్ట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చేస్తున్న యుద్దం. మావోయిస్టు రహిత భారత్ను స్థాపించడం తమ కర్తవ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నది. ఇది ఆ ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ, దాని వెనుక ఉన్న సంఘపరివార్ రాజకీయ, భావజాల లక్ష్యం. దాన్ని సాధించడానికి మావోయిస్టులను చంపేస్తున్నది. ఆ పేరుతో సాధారణ ఆదివాసులను కూడా హత్య చేస్తున్నది. మావోయిస్టులు ఆయుధాలతో ఉన్నారనే సాకుతో, వారిని చంపేయడానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలను అడవిలోకి
పంపించింది. ఎవరు సాయుధులో, ఎవరు నిరాయుధులో కనీస విచక్షణ లేకుండా మూకుమ్మడిగా చుట్టుముట్టి హత్య చేస్తున్నట్లు తెలుస్తున్నది. పౌరులు సాయుధులైనా సరే, తమంతట తామే కాల్పులు జరిపినా సరే, ప్రభుత్వ సాయుధ బలగాలు ఆత్మరక్షణ కోసం తప్ప కాల్పులు జరపగూడదని అధికరణం 21 స్ఫూర్తి. ఆత్మరక్షణ కోసం అన్నప్పుడు కూడా అవతలి వ్యక్తి ప్రాణాలు తీయకుండా గాయపరిచి, ఇమ్మోబైల్ చేసి, న్యాయ విచారణకు అప్పగించాలని అర్థం. నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో, చట్టం నిర్దేశించిన పద్ధతిలో విచారణ జరిపి, మరణశిక్ష విధిస్తే తప్ప ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి వీలు లేదు. అలాంటిది ఏకంగా సమూహాల మీద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించడం ఆధునిక న్యాయ సూత్రాలకు విరుద్ధం.
మావోయిస్టులు ఆయుధాలను పట్టుకున్నప్పటికీ వాళ్లు భారత పౌరులు. వాళ్ల మీద నిజమైనవో, కల్పించినవో నేరారోపణలు ఉ న్నప్పటికీ వాళ్లు భారత పౌరులే. నేరాలు చేసి ఉంటే, అవి నిరూపణ అయ్యే వరకు వాళ్లు నేరం ఆరోపించబడినవాళ్లే అవుతారు. వాళ్లు రాజకీయంగా తనకు నచ్చలేదని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం హత్య చేయడానికి వీల్లేదు. మధ్య భారత దేశంలో ఇలాంటి మూకుమ్మడి హత్యలు ఎన్నో జరుగుతున్నాయి. వాటి తీవ్రతను తెలుసుకోడానికి పౌర ప్రజాస్వామిక సంస్థలను అక్కడికి అనుమతించడం లేదు. పోలీసులు చెబుతున్నవే సత్యాలుగా ప్రచారం అవుతున్నాయి. ఇది కూడా మన దేశంలో చట్టబద్ధ పాలన వైఫల్యాన్ని సూచిస్తోంది.
ప్రభుత్వం ఇలాంటి తన చర్యల ద్వారా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నదని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ప్రజలు తమ కోసం తాము సమర్పించుకున్న రాజ్యాంగం ఇచ్చిన శాసన అధికారం వల్లనే ప్రభుత్వం దగ్గర తుపాకులు ఉన్నాయి. తమ రక్షణ బాధ్యతను ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజల మీదనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ ఆయుధాలను ప్రయోగించడానికి వీల్లేదు. తమ దగ్గర ఆయుధాలు ఉండటాన్ని సాకు చేసుకొని ప్రభుత్వం డిఫెన్స్ పరిధిని దాటి ఏకంగా సైనిక చర్యలకు పాల్పడుతున్నందు వల్ల తాము కాల్పుల విరమణకు సిద్ధమని ప్రతిపాదించారు.
ఈ ప్రకటన ద్వారా మావోయిస్టులు రాజ్యాంగ స్ఫూర్తిని, జీవించే హక్కును కాపాడాలనే వైఖరిని తీసుకున్నారు. నిత్యం అనేక రకాల ఉల్లంఘనలకు గురవుతున్న రాజ్యాంగంలోని ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అమలు కావాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖాతరు చేయడం లేదు. తనకు అధికారాన్ని, ఆయుధాలను ఇచ్చిన రాజ్యాంగానికంటే మావోయిస్టుల చేతిలో ఆయుధాలు కేంద్రంగా తన వైఖరిని ప్రదర్శిస్తున్నది. వాళ్ల చేతిలో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి చంపేస్తా అని కగార్ను కొనసాగిస్తున్నది.
మావోయిస్టులు చట్ట విరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసును మాత్రమే ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. అంతగాని వాళ్లందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయనే ముందస్తు ఉద్దేశంతో మూకుమ్మడిగా అక్కడికి వేల సైనిక బలగాలు వెళ్లి హత్య చేయడం, మృతదేహాల దగ్గర ఆయుధాలను ఉంచి సమర్థించుకోవడం చట్ట విరుద్ధం. ఇట్లా మావోయిస్టులందరినీ ఫలానా రోజులోగా నిర్మూలిస్తానని చంపుకుంటూ పోవడం ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో కుదరదు.
కాల్పుల విరమణ అంటే ఆయుధాలు ఉన్నా వినియోగంలో ఉండవని అర్థం. అప్పుడు ఎంత శక్తివంతమైన తుపాకీ అయినా వాడకం ఉండదు కాబట్టి కేవలం ఒక వస్తువు మాత్రమే. ఇలాంటి కాల్పుల విరమణ నిర్ణయానికి మావోయిస్టులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. మావోయిస్టుల ఆయుధాలు వాడకపోయినా.. తమ భావజాలాన్ని వదులుకోరని ప్రభుత్వానికి భయం. భౌతిక చర్యలకు, నేరాలకు పాల్పడనంత వరకు ఈ దేశ పౌరులు ఎలాంటి భావజాలాన్నయినా విశ్వసించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లోని భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రకారం పౌరులు తమకు ఇష్టమైన ఏ అభిప్రాయాన్నయినా కలిగి ఉండవచ్చు. మనుషులు అంటేనే భావాలు ఉండే జీవులు. మనుషులకు మిగతా జంతుజాలానికి ఉన్న మౌలిక తేడా ఇది. నాగరికతా క్రమంలో మనుషులు అనేక భావాలకు ప్రతినిధులయ్యారు. వ్యక్తి నుంచి భావాలను వేరు చేయడం సాధ్యం కాదు. ఈ సత్యాన్ని గ్రహించినందు వల్లనే భారత రాజ్యాంగ రచయితలు భావ ప్రకటనా స్వేచ్ఛకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి భావాలతోనైనా చర్చించాల్సిందేగాని ఫలానా భావాలు ఉన్నాయని వ్యక్తులను చంపేస్తా అనడం ఆర్టికల్ 19కు వ్యతిరేకం.
రాజ్యాంగంలోని ఈ విలువైన అంశాలను ప్రజా ప్రాతినిధ్యం ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉల్లంఘించడానికి వీల్లేదని మావోయిస్టులు అంటున్నారు. ఆ రకంగా కూడా వాళ్ల కాల్పుల విరమణ ప్రతిపాదన పూర్తి రాజ్యాంగబద్ధం. ప్రభుత్వం రాజ్యాంగ ఉ ల్లంఘనలకు పాల్పడకూడదని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పడమే కాల్పుల విరమణ ప్రతిపాదన సారాంశం. రాజ్యాంగాన్ని దాటి బైటికి వెళ్లి సొంత రాజకీయ కారణాలతో హత్యాకాండకు పాల్పడటమా? రాజ్యాంగ పరిధిలోకి వచ్చి ఆర్టికల్ 21ని కాపాడటానికి ఒక అర్థవంతమైన రాజకీయ ప్రక్రియగా కాల్పుల విరమణకు సిద్ధం కావడమా? అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే
కాల్పుల విరమణకు సిద్ధం కాకపోవడం అంటే ఆర్టికల్ 21కి వ్యతిరేకంగా నడుచుకోవడమే. భారత పౌరుల సమూహమైన సీపీఐ మావోయిస్టు విడుదల చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద తన వైఖరి ఏమిటో చెప్పవలసిన పరిస్థితిలోకి నెట్టివేయబడింది. కేంద్ర హెూం మంత్రి పదే పదే మావోయిస్టులతో చర్చలు లేవని చెప్పడానికి ఉత్సాహపడుతున్నాడు. ఆ మాట అంటున్న ప్రతిసారీ తాను రాజ్యాంగ సంక్షోభానికి కారణమవుతున్నానని ఆయనకు తెలుసునా? అని సందేహం.
ప్రభుత్వాలు ఇంతగా రాజ్యాంగ వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడు ప్రజలు ఉద్యమించాల్సి వస్తుంది. నిజానికి చరిత్రలో జరిగిన అనేక ప్రజాస్వామిక పోరాటాల వల్ల నెలకొన్న విలువల పునాదిగా రాజ్యాంగంలోకి అనేక సానుకూల అంశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని లెక్క చేయనప్పుడు ప్రజలు ఉద్యమించకతప్పదు. ఈ అవకాశం ఉండటం భారత రాజ్యాగంలోని మరో విశిష్టత. జీవించే హక్కుతోపాటు సంఘం పెట్టుకొనే హక్కు మొదలైన వాటి వల్ల ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా సంక్రమించింది. తమ న్యాయమైన ఆకాంక్షల కోసం ప్రజలు పోరాడటం మానవ సహజాతం వంటిది. ఇదొక చారిత్రక వాస్తవంగా గుర్తించినందు వల్లనే నిరసన తెలపడానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది.
అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటనలోని 12-17 అధికరణాలు ప్రజలకు ఉద్యమించే హక్కు కూడా ఉందని చెప్పాయి. ఈ పత్రం మీద భారత ప్రభుత్వం కూడా సంతకం చేసింది. ప్రభుత్వ సాయుధ హింస తీవ్రమైతే, చట్టబద్ధ రూపాల్లో ఉద్యమించే ప్రజలు కూడా సాయుధులయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికైనా మానవ ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వాలే సాయుధ పోరాట సంస్థలతో కాల్పుల విరమణకు రావడం అంతర్జాతీయ మానవ హక్కుల స్ఫూర్తికి కూడా అనుకూలం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం జీవించే హక్కును కాపాడేందుకైనా ప్రభుత్వం కాల్పుల విరమణకు సిద్ధం కావాలి.
కేంద్ర ప్రభుత్వానికైనా, రాష్ట్ర ప్రభుత్వానికైనా రాజ్యాంగమే పరమ ప్రమాణం. కేంద్రంలోని బీజేపీ మావోయిస్టుల విషయంలో పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నదని కొన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. ఎఐసిసి నాయకులు ఈ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగాకాక, సామాజిక సమస్యగా గుర్తిస్తానని ప్రకటించింది. తద్వారా చట్టబద్ధపాలన అనే రాజ్యాంగ ఆదేశాన్ని పాటిస్తానని, సామాజిక సమస్యగా గుర్తిస్తున్నందు వల్ల
రాజ్యాంగ ఆదర్శాలలోని సమానత్వ భావనకు కట్టుబడి ఉంటానని కూడా చెప్పినట్లయింది. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని, రాజ్యాంగ వ్యవస్థలను, ప్రక్రియలను ధ్వంసం చేస్తున్నదనే తీవ్రమైన విమర్శ కాంగ్రెస్ పెడుతున్నది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన కగార్ కనీసం ఆరేడు రాష్ట్రాల సమస్య. అట్లాగే బీజేపీ మతతత్వ, రాజ్యాంగ వ్యతిరేక ధోరణులు దేశవ్యాప్త సమస్య. ఈ రెంటిపట్ల ఒక ప్రజాస్వామిక వైఖరి తీసుకోవడమంటే తెలంగాణలో కాల్పుల విరమణను ఒక రాజ్యాంగ ప్రక్రియగానే రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టడమే.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని జాతీయ సమస్యగా గుర్తించి కగార్ను నడుపుతున్నందు వల్ల, విప్లవకారులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని అంటున్నందు వల్ల ఈ రాజకీయ వాతావరణంలో మార్పు తీసుకరావడానికి తెలంగాణలో కాల్పుల విరమణను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పాలిత రాష్ట్రాలోని ప్రభుత్వాల మీద కాల్పుల విరమణ ఒప్పందం తీసుకరావడానికి దోహదం చేసినట్లవుతుంది.
బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ, రాజ్యాంగ వ్యతిరేక ధోరణులతో జాతీయ స్థాయిలో పోరాడటానికి కూడా తెలంగాణలో కాల్పుల విరమణకు రాజకీయ ప్రాధాన్యత ఉన్నది. ఆ పక్క మావోయిస్టు నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకంటే నక్సలైట్ ఉద్యమం సామాజిక ఆర్థిక సమస్య అంటున్న తన ప్రత్యేకతను కాంగ్రెస్ రుజువు చేసుకోడానికి ఇది మంచి సందర్భం. అట్లాగే రాష్ట్రాల అధికారం విషయంలో కేంద్రం ఫెడరల్ నిర్మాణానికి భిన్నంగా వ్యవహరిస్తున్నదనే విమర్శ దేశంలో చాలా తీవ్రంగా ఉన్నది. జూలై 1న నిజామాబాదు సభలో అమిత్ ప్రసంగం దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. ఈ కోణంలో కూడా కగార్ పేరుతో జరుగుతున్న అంతర్యుద్ధ వాతావరణాన్ని మార్చడానికి కాంగ్రెస్ కాల్పుల విరమణకు సిద్ధం కావాలి. ఈ నిర్ణయం మావోయిస్టు అనుకూల వైఖరి కానే కాదు. సామాజిక సమస్యలతో, ప్రజా ఉద్యమాలతో రాజ్యాంగబద్ధంగా ఎలా వ్యవహరించాలో ఒక ఉదాహరణ అవుతుంది. తద్వారా రాజ్యాంగబద్ధ పాలనలో ఏ ప్రభుత్వమైనా రాజకీయ ప్రక్రియలను నిర్వహించాల్సిందేగాని, పౌరుల మీద సైనిక చర్యలకు పాల్పడటానికి లేదనే సందేశం ప్రపంచానికి ఇచ్చినట్లు కూడా అవుతుంది. వర్తమాన భారత సమాజపు స్థితిగతుల వైపు నుంచి చూసినప్పుడు ఈ అద్భుతమైన రాజకీయ అవకాశం కాంగ్రెస్ ముందు ఉన్నది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మావోయిస్టు పార్టీ చట్టబద్ధ పోరాటాలతో క్రియాశీలంగా పాల్గొన్నది. సమాజమంతటా, ముఖ్యంగా తెలంగాణలో ప్రజల్లో రాజ్యాంగ చైతన్యం కలగడానికి మావోయిస్టు అనేక రకాలుగా దోహదం చేసింది. ఇప్పుడు కాల్పుల విరమణ ప్రతిపాదన కూడా ప్రజల ప్రాణ రక్షణతోపాటు సమాజంలో ప్రజాస్వామిక చైతన్యం వెల్లివిరియడానికి కారణం అవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విప్లవకారులతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన అనుభవం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. శాంతి చర్చలు జరిగిన చరిత్ర జరిగిన హైదరాబాదుకు ఉన్నది. మావోయిస్టు ఉద్యమాన్ని జాతీయ సమస్యగా బీజేపీ ప్రచారం చేస్తున్న తరుణంలో ఒక రాష్ట్రంలో కాల్పుల విరమణకు అవకాశం ఉంటుందా? అనే సందేహం కూడా అక్కర లేదు. 2002లో, 2004లో ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చల ప్రక్రియ నడిచింది. అసలు సాయుధ పోరాట సంస్థలతో కాల్పుల విరమణకు రాజ్యాంగబద్ధత ఏమిటనే చర్చ అప్పుడు జరగనే లేదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఉద్యమాలతో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరించాలనేదే గీటురాయి అయింది.
ఇంతకంటే విస్తృత స్థాయి ఉదాహరణలు ఈశాన్య భారతదేశంలోని జాతి ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఉన్నాయి. ఒక్క నాగా జాతి ఉద్యమ సాయుధ సంస్థతో కేంద్ర ప్రభుత్వం 600 వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నది. మిజోరాం ఉద్యమ సంస్థ ఇండియాను తమ దేశంగా భావించకపోవడంతో ఈ రెండు ప్రాంతాల్లో కాక థాయ్‌లాండ్‌లో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ అన్ని సందర్భాల్లో కాల్పుల విరమణ ఒప్పందాలకు నేరుగా రాజ్యాంగంలో ఏ అధికరణం అనుమతి ఇస్తుందని ప్రభుత్వం చూడలేదు. ప్రజా ఆకాంక్షలతో, ప్రజా ఉద్యమాలతో ఎలా వ్యవహరించాలో స్థూలంగా రాజ్యాంగ విలువలు దారి చూపించాయి. అట్లాంటి సంప్రదాయం దేశంలో డెబ్బై ఏళ్లుగా కొనసాగుతున్నది. ఈ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమై తన రాజకీయ పరిణతిని, ప్రజాస్వామ్యబద్ధతను చాటుకోవాల్సి ఉన్నది.
5 జూలై 2025