ఎగసిపడి పరుగెత్తుతూ నువు చెయ్యి ఊపినప్పుడు
నీ చేలాంచలం అంచు చూసి
నా హృదయం కదిలిపోయింది
నిన్ను నేను నా శ్వాసలో చూసాను
నా కౌగిలిలో
రాజభవనాల దుర్గంధ వాసన
నీ స్వచ్ఛమైన ఆత్మను స్పృశించలేదు
లాహోర్ జైల్లో ఉరితీయబడిన అమరులను
తమ విషాద హృదయాలలో దాచుకున్న
తీరాలలో నువ్వు పెరిగావు
ఇక్కడ ప్రతి ఉదయమూ, మధ్యాహ్నము రాత్రి
దు:ఖంలో తడిసిపోయాయి
నీ జలాల నుంచి నడచిపోతున్న
పసులకాపర్ల పాటలు
ఇక్కడినుంచి ఎలుగెత్తుతున్నాయి
నీ ఎగురుతున్న పైట అంచులు
(తెరచాపలై)
నన్ను భావోద్వేగాల ద్వీపానికి చేరుస్తాయి
గోధుమ పొలాలలోని చెట్ల ఆవేదనలో
నల్లతుమ్మ పూల
సువాసనలో
నిన్ను చూసాను
నువ్వు సదా చాలా సుదూరాల్లోకి
చూస్తున్నావు
కావేరి నది దాకా
భూ అక్రమణలో కాంతి కోల్పోయిన
గోధుమ క్షేత్రాల్లోకి
వరి పొలాల కాలిపోయిన నవ్వుల్లోకి
తెల్లవాళ్ళు వదిలేసిపోయిన ఖాళీలు
ఇంకా మిగిలియున్న రాజభవనాల్లోకి
నువ్వు చాలా దూరం దృష్టి సారిస్తున్నావు
నీ దు:ఖం నా ప్రేమ అయింది
నిన్ను నా ప్రియురాలుగా చూస్తున్నాను
మంత్ర ముగ్ధమయిన శబ్దమయ లోయను వెనుకనే వదిలేసి
బండిలో పోతూ చంద్రుణ్ణి చూస్తూ
నన్ను కొట్టడానికి శ్రమలో గట్టిపడిన
నీ చేతులు నా చెంత చేరాయి
భారమైన ఆలోచనల చిక్కుముడిలో
ఉదయమే సూర్యుడు మేల్కొన్నపుడు
నీ స్వచ్ఛమయిన చిరునవ్వును ఎరుపులో అద్ది మెరిపించి
‘నన్ను ఒక జ్వాలగా భావించు’ అని అన్నావు
ఇంక అది దట్టమైన అంధకారమైనా
నేను గుండె జారను
నీ దరహాసం, నీ మాటలు
నా ఆత్మను ప్రకాశింపచేస్తాయి
నీ జలాలు నా భుజాలను
లాలించిన రోజును గుర్తు చేసుకో
అక్కడ నువ్వు ఆయుధాన్ని పెట్టినట్లు
నేను అనుభూతి చెందాను
వృక్షాలు యుద్ధ యోధులై
పత్రాల గుత్తుల తలపాగా చుట్టుకుని
తమ గుర్రాల మీద దౌడు తీస్తున్న దృశ్యాల్ని
నా నయనాలు గ్రోలుతున్నాయి
లేదు. నేను విచారంగా లేను
బర్మా, ఫ్రాన్సు* వణుకుతున్నాయి
భారత భూభాగంపై నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి
శత్రు గృహాల గోడలనుంచి
దూసుకపోతున్నాయి
అరణ్యాలు ఒక్కమాట మాత్రమే
చెప్తున్నాయి
ప్రేమను మరచిపో
జ్వాలల్లో శత్రువు దగ్ధమవడం చూడు.
(కాంచన్ దా తన చివరి రోజుల్లో తొలితరం పంజాబు నక్సలైట్ కవి లాల్ సింగ్ దిల్ జ్ఞాపకాలను, కవిత్వాన్ని పెంగ్విన్ పబ్లిషర్స్ ప్రచురించిన ఇంగ్లిషు లో నిరుపమాదత్ అనువదించిన Poet of the Revolution – The memoirs and Poems of Lalsingh Dil – ఆధారంగా బెంగాలీ ప్రజల కోసం రచించాడు)
*బర్మా (ఇప్పటి మయన్మార్), ఫ్రాన్స్ లలో 1968 విద్యార్థి పోరాటాల సందర్భం.
Related