వాడెవడో అంటున్నాడు
‘ఆడపిల్లల్ని అదుపులో పెంచండ’ని
వాడి జ్ఞానేంద్రియాలకు
మగతనపు మదము జోడించి
వాడిలా కూడా కూసేడు

మహిళ సహకరిస్తేనే గదా..!
అని కూడా అన్నాడు
మహిళలే మర్మగర్భంగా ఉండాలట
మీ అంగాంగాలు
వాళ్లను కామోన్మాదులను చేయొచ్చునట

రాక్షస సూత్రీకరణల ఉద్బోధకులు
ఇలా సెలవిస్తున్నారు మరి...

మృత దేహాలనూ వదలని
మగాళ్ళ మూక–
ఎదలు కోసినా
మర్మంగాలను ఛిద్రంచేసినా
ఘోరం ఘోరమని
గగ్గోలుపెట్టొద్దట
అది–వాని పూర్వజన్మ సుకృతం...
వాడల చేస్తాడట
మీదీకర్మఫలం
మీరలాచావండని

ఆమే అంటున్నది
‘అమ్మా...
నాకొద్దీఆడతనం
లంగా,వోణి
పూలుగాజులూ
అసలే లింగమూ వద్ద’ని

ముద్దుకు మురిపానికి
మాటకూచూపుకూ
రసికతను రంగరించి చూసి
పసిపాపలను సైతం–
కసిగా చంపే విషనాగుల గుంపులు
విరుచుకు పడుతుంటే
ఏమంటుంది మరి..?

సీతాకోకచిలుకల్లారా
ఆకు చాటున దాచుకోండి
పూవ్వుల్లారా మీపరిమళాలను వెదజల్లకండి
రంగురంగులపక్షుల్లారా
మీ అందచందాలు ఆరబోయకండి
నెలవంకానీవే మబ్బుల చాటుకోపారిపో

పండు ముసలి
నిండు చూలాలు
బిచ్చగత్తె
పిచ్చి తల్లీ
మీ వొళ్ళుజాగ్రత్తా...

గుంపులు గుంపులుగా
తిరుగుతున్న పిశాచాలగణం
ఈ నేలపై యేదోకామక్రీడ కమ్ముకున్నట్టు
నిర్మానుష్య స్మశానంలా
నిత్యం ఇలా కాలుతున్నది
ఉన్మాదపు రసిపండైవిస్తరిస్తున్నది

ఇదీ –
ఏ నాగరికతకు ఫలశృతి
ఏ జన్మభూమికి గర్వస్మృతి..?

ఈ పుణ్యభూమిలో
మహిళ కేవలం మాంసపు ముద్దల దేహమేనా!
పైసాచికబీతిప్రకటితయేనా..!
వాడు క్రూరడైనా
మగాడైతేపరవాలేదన్నట్టు
కామోన్మాదులకు
వీర తిలకం దిద్ది
తులసీ ప్రదక్షణ చేసి
సుమంగళ హారతులిస్తున్నారే...
ఇది ఏ లోక కళ్యాణపు క్రతువేతల్లీ

దేశమా సిగ్గుపడు
ఇది వికసితమా
ముకుళితమా...

ఇదీవెలుగేనా..?


Leave a Reply