అప్రియ వచనాలు మాట్లాడనవసరం లేకుంటే బాగుండు. వ్యక్తులనుద్దేశించవలసిన కానికాలాన్ని ఎవరం కోరుకుంటాం? సత్యమే గీటురాయి అనుకుంటాంగాని, అందరికీ సత్యమే పరమం కానవసరం లేదు. ప్రకృతిలో తిరుగులేని సత్య భావన సమాజంలో తరచూ భంగపడుతూ ఉంటుంది. ప్రయోజనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సత్యాన్ని బతకనీయవు. కనీసం అందరికీ ఆమోదమయ్యే సత్యంగా నిలబడనివ్వవు. అందువల్ల సమూహాలతోపాటు మనుషులనూ ఉద్దేశించే సంభాషణ సాగవలసి వస్తుంది.
విప్లవంలోని అనన్య సామాన త్యాగాల గురించి మాట్లాడటానికి ముఖం మొత్తిన కొందరు మేధావులు సహితం ద్రోహాన్ని ద్రోహమని చెప్పేసరికి లేచి కూచున్నారు. ఎవరి ప్రియాలు వారివని సరిపెట్టుకోవచ్చు. కానీ సత్యాన్ని దాచేద్దామనుకున్నాక మాట్లాడక తప్పదు కదా. ద్రోహం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని సరి చేసేవాళ్లూ ఉంటారు. అనేక మినహాయింపులతో చర్చనీయాంశమవుతున్న విద్రోహం గురించి తగినంత మాట్లాడి సరి చేస్తున్నట్లు ఎందుకు అనుకోకూడదు? ‘నచ్చని’ విషయాలనో, ‘భిన్నాభిప్రాయాల’నో విద్రోహమంటున్నారనే ఆరోపణ కూడా ఉంది. మతి లేని వాళ్లే ఆ పని చేస్తారు. లేదా అలాంటి వాళ్లే ఆ ఆరోపణ చేస్తారు. సమస్య మనకు నచ్చడాలు, నచ్చకపోవడాలు కానే కాదు. భిన్నాభిప్రాయాలు అసలే కాదు. మౌలికంగానే విప్లవ రాజకీయాలకూ, విప్లవ నైతికతకూ వ్యతిరేకమైన పనులు చేయడాన్ని విద్రోహం అంటారు. శతృవర్గానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, తక్షణంగానో, సుదూరంగానో మేలు జరిగే పనులు చేయడాన్ని విద్రోహం అంటారు. ‘శతృవుతో చేతులు కలపడం’ అనే నుడికారం ఉంది కదా.. దానికి అనంత అర్ధాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువగా దృశ్యాదృశ్యమైన భౌతిక, భావజాల రూపాలు ఉంటాయి.
గళ్లు గీచి, లెక్కలు వేసి, తూకాలు తూచి నిర్ధారించేలా విద్రోహాలు ఉంటే ఎంత బాగుండు! కానీ మానవ జీవితం అంత సులువైనది కాదు. విప్లవ రాజకీయాలు, వర్గ ప్రయోజనాలు అంత సరళమైనవి కావు. చివరికి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే జరిగే విద్రోహాలు కూడా ఎంత దారుణమైన మలుపులు తీసుకుంటాయో మనం చరిత్రలో చూస్తాం. ఆ తర్వాత అవి పూర్తిగా వర్గ ప్రయోజనాలను తారుమారు చేస్తాయి. వర్గాల, సమూహాల, ప్రజలు-పాలకుల, పోరాట జయాపజయాల మధ్య చెరగని గీతగా చరిత్రలోంచి విద్రోహాలు తొంగి చూస్తుంటాయి. ఇక అప్పుడు ఉద్వేగాలకన్నా, వివరాలకన్నా, మామూలు మాటలకన్నా త్యాగం ఒక పక్క సమున్నతంగా కనిపిస్తుంది. ద్రోహం మరో పక్క మురుగు కాల్వలో తేలియాడుతూ స్పష్టంగా కనిపిస్తుంది.
కా. పాక హన్మంతులాంటి విప్లవకారుల మరణం దుఃఖకరం. ఈ సంక్షోభకాలంలో ఆయన జీవించి ఉండటం గతంకంటే మరింత అత్యవసరం. ఆయన ఎంచుకున్న మార్గం అలాంటిది. కానీ అద్భుత విజయాలు సాధించిన ఆ మార్గం తప్పనే వాళ్లు కూడా కనిపిస్తున్నారు. హన్మంతు అంత్యక్రియల రోజు ‘గణేష్ ఉద్యమ సహచరులు’ అనే పేరుతో ఆయన త్యాగాన్ని కించపరిచే రచన సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది. హన్మంతు పోరాట వ్యక్తిత్వానికి అవమానకరమైన విష పూరిత నివాళి అది. తమ పూర్వ సహచరుడి మరణం వాళ్లకు వ్యథ కలిగించి ఉంటుంది. సుదీర్ఘ అనుబంధంలోంచి నివాళి ప్రకటించడం సహజమే. దానితోపాటు, లొంగిపోయి.. విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.. అనే పొసగని పనుల అసంబద్ధ పిలుపు కూడా ఇచ్చారు.
ద్రోహచింతనతో శతృవుతో చేతులు కలిపాక ‘ప్రభుత్వం ప్రకటించిన అంతిమ యుద్ధంలో నిలిచి కొట్టుమిట్టాడుతున్న విప్లవోద్యమాన్నీ కాపాడుకోవడానికి మిగిలిన విప్లవకారులను మారిన పరిస్థితులలో అజ్ఞాత జీవితం నుండి జ్ఞాత జీవితంలోకి రావాలని వినమ్రంగా ఏకాభిప్రాయంగా విజ్ఞప్తి చేద్దాం. వాళ్ళ కాళ్ళకు బంధాలు వేసే, వాళ్ళ మెదళ్ళను మొద్దుబార్చే ఏ ఒక్క మాటైనా రాతైనా మిగిలిన వారిని చేష్టలు ఉడిగిన వారిగా మారుస్తుందని ఒక్క గణేష్ అమరత్వమే కాదు, నిన్నటి అమరులు బసవరాజు, విజయ్, లోకేష్, మనోజ్, హిడ్మా, గౌతం, ఉదయ్… లాంటి అనేక మంది అమరత్వాలు చాటుతున్నాయి. వారి చొరవను నిర్ణయాత్మక శక్తిని దెబ్బ తీస్తూ వారి అసమాన ధైర్య సాహసాలకు పరీక్షను పెడుతున్నాయి..’ అని ఈ ఉద్యమ సహచరులు రాశారు.
తాము లొంగిపోయి విప్లవోద్యమానికి ద్రోహం చేయడమేగాక పోరాటంలో ఉన్న కా. హన్మంతులాంటి వాళ్లందరూ విప్లవోద్యమాన్ని వదిలి రావాలనే పిలుపు ఇచ్చే కూటవాదం వినిపించడానికి ఆయన అమరత్వ సందర్భాన్ని కూడా వాడుకున్నారు. విప్లవకారులను హత్య చేస్తున్న రాజ్యం మీద ఒక్క విమర్శ వాక్యం రాయడానికి కూడా ఈ ‘ఉద్యమ సహచరుల’కు చేతులు రాలేదు. విప్లవం కొనసాగిస్తామని అంటున్న వాళ్ల చైతన్యాన్నీ, సంసిద్ధతనూ గేలి చేస్తూ ఎవరో చెబితే, రాస్తే ‘వాళ్ళ కాళ్ళకు బంధాలుపడ్డాయనీ, వాళ్ళ మెదళ్లు మొద్దుబారిపోయాయనీ’ అనగల దుర్మార్గానికి పాల్పడ్డారు. విప్లవోద్యమ నాయకుల లొంగుబాటు చొరవను, నిర్ణయాత్మక శక్తిని దెబ్బ తీస్తూ వారి అసమాన ధైర్య సాహసాలకు నిర్మాణంతో సంబంధం లేని వాళ్ల రాతలు, మాటలు పరీక్షను పెడుతున్నాయని అంటే ఎవరైనా నమ్ముతారా? కమ్యూనిస్టు, విప్లవోద్యమ నిర్మాణ పని పద్దతులు గురించి ఎంతో కొంత తెలిసిన ఉన్న తెలుగు సమాజాలలో ఇలాంటి వాదనను ఎవరైనా అంగీకరిస్తారా? ఈ కనీస అనుమానం కూడా ఈ ఉద్యమ సహచరులకు రాకపోవడం ఆశ్చర్యకరం.
విప్లవోద్యమ నిర్మాణం ఇట్లా పని చేస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఇంతకాలం నాయకత్వంలో భాగమైన వాళ్లకు విప్లవోద్యమ రాజకీయ వైఖరుల గురించి ఇంత అల్పమైన అభిప్రాయాలు ఉన్నందుకు చింతించాలా? లేక ఇవాళ వాళ్లు ఉన్న స్థానమే వాళ్లతో ఈ మాటలు మాట్లాడిస్తున్నదనే స్పష్టతకు రావాలా? ఎవరో చెబితే హన్మంతు తమలాగా లొంగిపోకుండా ఆయన కాళ్లకు బంధాలు పడ్డాయనీ, మెదడు మొద్దుబారిపోయిందనీ అనడం ఆయన వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేయడం కదా. ఆయన విప్లవాత్మక మేధను కించపరచడం కదా. ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నామో, వాటి అర్థాలు ఏమిటో బొత్తిగా తెలియని స్థితిలో ఈ ‘ఉద్యమ సహచరులు’ ఉ న్నారనుకోవాలా? లేక తమ ‘కర్తవ్యాన్ని’ అన్ని సమయ సందర్భాల్లో ముందుకు తీసుకపోతున్నారనుకోవాలా?
ఈ లొంగుబాటుదారులు శతృవుతో చేతులు కలిపి విప్లవోద్యమ పంథాను ధ్వంసం చేస్తున్నారనే ఇంత కాలం సమాజం ఆరోపించింది. సహేతుక విమర్శ పెట్టింది. కానీ ఇప్పుడు విప్లవంలో ఉన్న వాళ్ల, అమరులైన వాళ్ల రాజకీయ వ్యక్తిత్వాలను సహితం ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారు. అమరుల విప్లవోద్యమ నిబద్ధతనూ, నిర్ణయాత్మక రాజకీయ వైఖరినీ చులకన చేయడానికి బరితెగించారు. వాళ్లకు ఎలాంటి ఉద్యమ, నిర్మాణ నిశ్చయాత్మక శక్తి లేదరీ, సొంత ఆలోచనలు లేవనీ అంటే వ్యక్తులుగా వాళ్లను తక్కువ చేయడమేకాదు, ఇంత కాలం తమ భాగస్వామ్యం కూడా ఉన్న నాయకత్వ నిర్మాణాన్ని అగౌరవపరచడం కదా? అనే సందేహమే లొంగుబాటుదారులకు రాలేదు. కనీసం తమ పూర్వ జీవితాచరణను కూడా కించపరుచుకోవడమనే గ్రహింపు లేకపోయింది. ఇది నిజంగానే అమరుడు హన్మంతును స్మరించుకోవడమా? లేక రాజ్యం చేసిన భౌతిక హత్య చాలక మరోసారి ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని కూడా హత్య చేయడమా?
ఇంత కచ్చితమైన భాషలో మాట్లాడవలసిన సందర్భం ఇది. పోరాటాన్ని కొనసాగిస్తామని విప్లవోద్యమం అధికారిక చాలా స్పష్టంగా ప్రకటించింది. విద్రోహుల చర్యలను, వాదనలను ఎండగడతామనే వైఖరి అందులో తేటతెల్లంగా ఉంది. ప్రపంచ విప్లవోద్యమాలన్నిటిలో తీవ్రమైన అణచివేతా, విద్రోహమూ చుట్టుముట్టినప్పుడు కూడా నాయకత్వం ఇలాంటి వైఖరే తీసుకున్నది. సరిగ్గా భారత విప్లవోద్యమం దాన్నే అనుసరించింది. ఈ వాస్తవాన్ని దాచేసి, లొంగుబాటుదారుల మార్గాన్ని ఎత్తిపట్టడానికి ‘సాయుధ పోరాట విరమణ జరిగిందనే అబద్ధ ప్రచారం కొందరు చేస్తున్నారు. విద్రోహం, లొంగుబాటు అధికారిక వైఖరి అయినట్లు, విప్లవోద్యమంలో ఉన్న వాళ్లందరూ బైటికి వచ్చేయమని ఏకాభిప్రాయంగా విజ్ఞప్తి చేద్దామని ఈ లొంగుబాటుదారులు బరితెగించి అంటున్నారు. తేలవలసింది ద్రోహం సరైనదా? పోరాటం కొనసాగిస్తామనడం సరైనదా? అని.
‘నిన్నటి వరకు అనేక పార్థివ శరీరాల ముందు అత్యంత సీరియస్ గా ప్రతిజ్ఞలు చేసి.. చేతులు దులుపుకోవడం, కలాలకు పని కల్పించడం, మీడియా మిత్రులతో అనుభవాలు పంచుకోవడానికి మాత్రమే పరిమిత’మయ్యారని తమకు అప్రియమైన వాళ్ల మీద ఎంతయినా ఎదురుదాడి చేయవచ్చు. వాళ్లను ఏమైనా అనవచ్చు. దాని వల్ల నష్టం ఏమీ లేదు. అసలు సమస్య వాళ్లు కానే కాదు. విప్లవాన్ని కొనసాగించడమా? లేక ముగించడమా? అనేది. ముందు శతృవుకు లొంగిపోయి, ఆ తర్వాత తీరికగా విప్లవం చేస్తామనే లొంగుబాటువాదాన్ని ఎవరైనా ఎందుకు విశ్వసించాలి? ఈ మాట అనడానికి విప్లవోద్యమ నిర్మాణంతో సంబంధం ఉండనవసరం లేదు. విప్లవకారుల్లా జీవితాన్నంతా త్యాగం చేయడానికి సిద్ధం కాలేకపోవచ్చు. అంత మాత్రాన విప్లవోద్యమ అధికారిక విధానానికి పూర్తి వ్యతిరేకమైన ఈ లొంగిపోయి కూడా విప్లవం తెస్తామని అంటే ఎందుకు విశ్వాసం కలుగుతుంది?
లొంగుబాటుదారులు ఒక పక్క అనవసర నష్టాలకు బలి కావద్దని మంచి మాట చెబుతున్నట్లే ఉంది. విప్లవోద్యమం మాత్రం అనవసర త్యాగాలు చేయాలని ఎందుకు అనుకుంటుంది? లొంగుబాటుదారుల వాదన ప్రకారం చూస్తే విప్లవోద్యమం ఇప్పుడే అనవసర త్యాగాలు చేస్తున్నదా? గతంలో చేసినవి కూడా అలాంటివేనా? తాము లొంగిపోయినందు వల్లనే వీళ్లకు ఈ కొత్త ఎరుక కలిగిందా? ఈ తీగ లాగితే డొంకంతా కదులుతుందనీ, చాలా పెద్ద చర్చకు తెర తీయవలసి వస్తుందనీ వీళ్లకు తెలిసినట్లు లేదు. విప్లవోద్యమం ఎన్నో నిర్బంధ కాండలను, సంక్షోభ దశలను దాటుకొని ఇక్కడి దాకా వచ్చింది. నిస్సందేహంగా ఈ కగార్ అణచివేత గతానికంటే గుణాత్మకంగా పూర్తి భిన్నమైనదే. ఈ వర్తమానాన్ని దాటుకొని భవిష్యత్ లోకి వెళ్లడం గురించి ఆలోచించాల్సిందే. కానీ అనవసర త్యాగాలనే మాట వాడితే ఇంత సుదీర్ఘ చరిత్రలో వేలాది అమరత్వాలకు ఏ విలువ అపాదించినట్లవుతుంది?
మరో పక్క విప్లవోద్యమ నష్టాలపై ఎంతైనా సిద్ధాంత చర్చలు చేసుకుందామంటూనే లొంగుబాటునూ, విద్రోహాన్నీ ఈ కాలపు ‘సిద్ధాంతం’గా మలిచే ప్రయత్నమిది అని ఎవ్వరైనా ఎందుకు అనకూడదు? నిజంగానే కా. గణేష్ ను హత్య చేసిన రాజ్యం మీద పిసరంత ఆగ్రహం కలగకపోగా, తమలాగే లొంగిపోయి ఉంటే ప్రాణం కాపాడుకొనే వాడని అనగల దుర్మార్గానికి హద్దులు ఏమైనా ఉన్నాయా? హన్మంతు జీవించి ఉంటే ఈ అణచివేతకూ, విద్రోహానికీ వ్యతిరేకంగా తప్పక మరో పదేళ్లపాటైనా క్రియాశీల నాయకత్వం వహించి ఉండేవాడు. కానీ రాజ్యం ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ హింస గురించి కదా మాట్లాడవలసింది. రాజ్యం గురించి పల్లెత్తు మాట అనకుండా ఇంత నిర్బంధంలోనే అమరుల అంత్యక్రియల్లో పాల్గొన్న వేలాది ప్రజలందరినీ చులకన చేయడం, వాళ్లందరి స్ఫూర్తి వాక్యాలను తక్కువ చేయడం ఈ విషాదాన్ని ఇంకెంత పెంచుతుంది? కా. గణేష్ త్యాగాన్ని స్మరించుకోడానికీ, ఆయన మరణంతో కలిగిన దు:ఖం నుంచి తెప్పరిల్లడానికీ, ఆయను హత్య చేసిన రాజ్యంపై ఆగ్రహ ప్రకటన చేయడానికీ, లొంగుబాటువాదానికి వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని కొనసాగించాలనే హన్మంతు దృఢమైన వైఖరికి మద్దతు ప్రకటించడానికీ వేలాది మంది ఆయన అంత్యక్రియలకు వచ్చారు. చాలా స్పష్టంగా ఈ స్ఫూర్తి ప్రపపంచానికంతా అర్థమైంది. ఈ పరిస్థితుల్లో కూడా లొంగుబాటుదారులు తమ విద్రోహ రాజకీయాలను ముందుకు తీసుకపోవడాన్నిఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదీ అసలు ప్రశ్న.




