10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ – ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు ఇప్పుడు చేతకానివాళ్ళుగా మారిపోయారు. ఇక్కడ రైతును దోచుకోవడానికి ప్రభుత్వయంత్రాంగమంతా కలిసికట్టుగా పనిచేస్తోంది. హస్‌దేవ్‌ను కాపాడటానికి ఇది ఒక ప్రారంభం మాత్రమే అని నేను చెబుతాను.

ఈ పోరాటం హస్‌దేవ్‌ను, ఛత్తీస్‌గఢ్ మొత్తాన్ని కాపాడే పోరాటం. మనం పోరాడి ఈ హస్‌దేవ్ అడవిని కాపాడి తీరుతాం.

మీరు సెంట్రల్ గోండ్వానా ఖబర్ చూస్తున్నారు, నేను రాఘవేంద్ర.

ప్రస్తుతం మనం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నగరంలో ఉన్నాం. మరోసారి, హస్‌దేవ్ ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన గ్రామీణులు, ఇతరులు ఇక్కడకు వచ్చారు. ఎందుకంటే హస్‌దేవ్ అడవులను నరికివేయడం వల్ల కలిగే ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. దీని ప్రభావం చుట్టుపక్కల నగరాలు, ఈ మొత్తం సర్‌గుజా ప్రాంతంపైనా అంతకు మించి కూడా ఉంటుంది. హస్‌దేవ్ అడవులను మధ్య భారతదేశ ఊపిరితిత్తులు అని పిలిచేవారు.

ఈరోజు అంబికాపూర్‌లో జరుగుతున్న ఈ ఆందోళనలో పాల్గొన్న చాలామంది నా పక్కనే ఉన్నారు.

మైనింగ్ ప్రభావం: గ్రామస్తుల జీవితాలపైనా; పర్యావరణంపైనా

ముందుగా, హస్‌దేవ్‌లో మైనింగ్ వల్ల నేరుగా ప్రభావితమైన వారితో మనం మాట్లాడుదాం. ప్రస్తుతం నా పక్కన ఉన్న రామ్‌లాల్ గారు సాల్హి గ్రామానికి చెందినవారు. అక్కడ పర్సా ఈస్ట్ కేతే బాసేన్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. బొగ్గు తవ్వకం దాదాపు పూర్తయ్యింది.

రాఘవేంద్ర: రామ్‌లాల్ గారు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది నిజమే. కానీ అక్కడ నివసించే ఆదివాసులు, గ్రామస్తుల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం పడింది?

రామ్‌లాల్: పర్సా ఈస్ట్ కేతే బాసేన్ మైనింగ్ వల్ల ప్రజలు చాలా ప్రభావితమయ్యారు. మా సంస్కృతి, సంప్రదాయాలు, మేము పూజించే బుధాదేవ్ వృక్షాన్ని (ఒక సలై చెట్టు కింద పూజిస్తారు) అడవి మొత్తాన్ని నరికేసారు. అక్కడ సంవత్సరం పొడుగూతా ప్రవహించే నది ఎండిపోయింది. అంతేకాక, అదే నదిలోకి గని నుండి వచ్చే మురికి బొగ్గు నీటిని విడుదల చేస్తున్నారు, దీనివల్ల ప్రజల జీవనోపాధిపై చాలా పెద్ద ప్రభావం పడింది. మరొక ముఖ్యమైన విషయం, అక్కడ నివసించే జంతువులు, ముఖ్యంగా ఏనుగులు, వాటి సహజ నివాసాలు పూర్తిగా నాశనమయ్యాయి.

రాఘవేంద్ర: హస్‌దేవ్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. గ్రామసభల అనుమతులు నకిలీవి అని ఆరోపిస్తున్నారు. ఈ సాంకేతిక అంశాలపై వివరణ ఇవ్వడానికి, హస్‌దేవ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం .

ఈ ప్రాజెక్ట్ 2013లో ప్రారంభమైంది. అప్పటి నుండి అనేక ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వాలు మారాయి. అయితే, మీరు పోరాడుతున్న సాంకేతిక అంశాల గురించి నాకు చెప్పండి. ఏ అంశాలలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించారని మీకు అనిపిస్తుంది?

అలోక్ శుక్లా: మా పోరాటానికి ఆధారం ఈ దేశ చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామిక పద్ధతులు. ఈ ప్రాంతం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉంది. పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం ప్రకారం, గ్రామసభ అనుమతి లేకుండా భూమిని స్వాధీనం చేసుకోవడం లేదా అటవీ అనుమతి ప్రక్రియను ప్రారంభించడం కుదరదు.

హస్‌దేవ్‌లోని మూడు గనులు – పర్సా ఈస్ట్ కేతే బాసేన్, పర్సా, లేదా కొత్త కేతే ఎక్స్‌టెన్షన్ – వీటన్నిటికీ గ్రామసభల సమ్మతి లేకుండానే అనుమతులు ఇచ్చారు.

గ్రామసభల నుండి చట్టబద్ధమైన సమ్మతి ఏదీ రాలేదు. పర్సా బొగ్గు బ్లాక్‌లో గ్రామసభల నకిలీ తీర్మానాలు తయారుచేశారు, దీనిపై షెడ్యూల్డ్ తెగల కమిషన్ స్వయంగా విచారణ జరిపి అవి నకిలీవి అని నిర్ధారించింది. ఆ తీర్మానాలను రద్దు చేయాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ, ఆ అటవీ అనుమతిని రద్దు చేయలేదు, బదులుగా పోలీసు బలగాలను మోహరించి మరీ చెట్లను నరికారు.

రెండవ సమస్య ఏమిటంటే, హస్‌దేవ్ జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేసిన భారతీయ వన్యప్రాణి సంస్థ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) చాలా స్పష్టంగా ఒక విషయం రాసింది: తవ్వకాలు జరిగితే, రిహన్ నుండి హస్‌దేవ్ నది వరకు ఎండిపోతాయి; మానవ-ఏనుగుల పోరాటం చాలా తీవ్రంగా మారుతుంది; భవిష్యత్తులో దాన్ని నియంత్రించడం అసాధ్యం. ఆ నివేదికను కూడా నిర్లక్ష్యం చేశారు. మూడవ ప్రధాన విషయం ఛత్తీస్‌గఢ్ శాసనసభ తీర్మానం. అందులో 90 మంది ఎమ్మెల్యేలు హస్‌దేవ్‌లోని అన్ని బొగ్గు బ్లాక్‌లను రద్దు చేయాలని ప్రతిపాదించారు.

కానీ ఆ తీర్మానాన్ని కూడా మీరు చూస్తే, రాజ్యాంగపరమైన నిబంధనలు, ఆదివాసీ గ్రామసభలకు ఉన్న హక్కులు, వీటన్నిటినీ నిర్లక్ష్యం చేశారు. శాసనసభ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థ తీర్మానాన్ని కూడా వారు పట్టించుకోలేదు. ఈ దేశంలోని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి హస్‌దేవ్‌ను తిరిగి ‘నో-గో’ ప్రాంతంగా ప్రకటించాలని చెప్పిన సైంటిఫిక్ రిపోర్టును కూడా నిర్లక్ష్యం చేశారు.

ఎందుకు జరుగుతోంది? కేవలం ఒక కార్పొరేట్ సంస్థ లాభాల కోసం. హస్‌దేవ్ ప్రజలు పోరాడుతున్నది ఇందుకు వ్యతిరేకంగానే. ఇది కేవలం తమ గ్రామాలు లేదా కొన్ని చెట్లను కాపాడే పోరాటం కాదు. ఈ పోరాటం మొత్తం హస్‌దేవ్‌ను, ఛత్తీస్‌గఢ్ మొత్తాన్ని రక్షించే పోరాటం. ఎందుకంటే ఈ అడవులు మధ్య భారతదేశంలో అత్యంత సంపన్నమైన అడవులు.

ఇవి మధ్య భారతదేశానికి ఊపిరితిత్తులు. అందుకే నేటి ఆందోళన ఈ దిశలో ముందుకు సాగుతోంది. హస్‌దేవ్ ప్రజలు ఇక్కడ ఉన్నారు, కానీ సర్‌గుజా ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం సర్‌గుజా నుండి ప్రజలు వచ్చారు, “ఇక చాలు, హస్‌దేవ్ విధ్వంసం చాలా జరిగింది, ఇకమీదట జరగకూడదు” అని అంటున్నారు. ఇదంతా దీన్ని ఆపాలి, అదే ఈ ఉద్యమానికి నాంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత విస్తృతమవుతుంది. బలోపేతమవుతుంది.

రాఘవేంద్ర: నేను మీ ఉపన్యాసం విన్నాను. మీ ప్రసంగంలో మీరు ఒక పాయింట్ చెప్పారు: మైనింగ్‌కు మొదటి అనుమతి పర్సా ఈస్ట్ కేతేబాసన్‌కు ఇచ్చారు. పర్సా ఎక్స్‌టెన్షన్ లేదా కేతే ఎక్స్‌టెన్షన్ అనేది దాని తర్వాతి భాగమని భావిస్తున్నారు. అంటే, ఒక భాగం తవ్వేశారు; ఇప్పుడు తర్వాతి భాగం అని మీరు అన్నారు, కానీ వాస్తవానికి అది పూర్తిగా కొత్త ప్రాజెక్టు అని చెప్పారు. ఒక విధంగా మీరు ఒక గ్రామసభ నకిలీదని మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగే రెండవ, మూడవ ప్రాజెక్టుల అనుమతులు కూడా నకిలీవే అని చెప్పాలనుకుంటున్నారా?

అలోక్ శుక్లా: హస్‌దేవ్‌లోని గనుల గురించి గందరగోళం సృష్టిస్తున్నారు. పర్సా ఈస్ట్ కేతేబాసేన్, పర్సా, కేతే ఎక్స్‌టెన్షన్ – ఇవి ఒకే గనిగా ముందుకు తీసుకువెళ్తున్నారు; పాత అనుమతులే అని నిరంతరం ప్రచారం చేస్తున్నారు. కానీ మేము పదేపదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాం: హస్‌దేవ్‌లో రాజస్థాన్‌కు చెందిన మూడు గనులు ఉన్నాయి, చట్టం ప్రకారం చూస్తే నాలుగు గనులు ఉన్నాయి. పర్సా ఈస్ట్ కేతేబాసేన్ లోనే రెండు గనులు ఉన్నాయి.

అవును, పర్సా ఈస్ట్ కేతే బాసేన్ ఒకే ప్రాజెక్ట్, కానీ రెండు దశల్లో జరిగింది. మొదటి దశ పూర్తయింది, ఇప్పుడు రెండవ దశ ముందుకు సాగుతోంది. పర్సా బొగ్గు బ్లాక్ అనేది హరియల్‌పూర్, ఫతేపూర్ గ్రామాలు ప్రభావితమయ్యే ఒక వేరే బొగ్గు బ్లాక్, అలాగే కేతే ఎక్స్‌టెన్షన్ అనేది 1700 హెక్టార్ల మరో బ్లాక్. ఈ మూడు వేర్వేరు బొగ్గు బ్లాక్‌లు, వాటి ప్రక్రియలన్నీ – పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతుల ప్రక్రియలన్నీ కూడా తప్పుడు పద్ధతుల్లో, తప్పుడు సమాచారం ఆధారంగానే జరిగాయి.

కేవలం గ్రామసభల వ్యవహారం మాత్రమే కాదు, పర్సా బొగ్గు బ్లాక్‌కు అనుమతి ఎలా తీసుకున్నారో చూడండి. అక్కడ ఏనుగులు లేవని చెబుతూ అనుమతి తీసుకున్నారు, కానీ వాస్తవానికి ఆ గని లెమ్రు ఏనుగుల రిజర్వ్‌‌కు ఆనుకుని ఉంది. కేతే ఎక్స్‌టెన్షన్ గని ఉదాహరణ చూస్తే, రామ్‌గఢ్ కొండను 10 కిలోమీటర్ల పరిధికి వెలుపల ఉన్నట్లు చూపిస్తూ అనుమతి తీసుకున్నారు. అబద్ధాలు చెప్పి, గ్రామసభల నకిలీ పత్రాలు తయారుచేసి ఈ గనులకు అనుమతులను తీసుకున్నారు. ఇవి పాత గనులే, పని కొనసాగుతోంది అని ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఈ మూడు వేర్వేరు గనులు, వాటి ప్రక్రియలు వేర్వేరు. భూసేకరణ, అటవీ అనుమతి, పర్యావరణ అనుమతి అన్నీ వేర్వేరు.

రాఘవేంద్ర: సామాజిక కార్యకర్తలు, పర్యావరణ రంగంలో పనిచేసేవారు ఈ ఉద్యమంలో ఎప్పటినుంచో ఉన్నారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా, ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలు కూడా తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. నా పక్కన అంబికాపూర్‌కు చెందిన ఒక సీనియర్ పౌరుడు ఉన్నారు. వారితో మాటాడదాం .

సార్, ఈ రకమైన ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు అనుకుంటున్నారు?

పౌరుడు: ఈ హస్‌దేవ్ ఉద్యమం, హస్‌దేవ్ విధ్వంసం గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఈ అడవి ఏర్పడటానికి వేల సంవత్సరాలు పట్టింది. ఈ అడవి కేవలం ఆదివాసుల కోసం మాత్రమే కాదు, ఇది సర్‌గుజా డివిజన్‌కు ఊపిరితిత్తులు అని పిలుస్తారు. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో సర్‌గుజాను ఒక చల్లని ప్రాంతంగా పరిగణిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఈ హస్‌దేవ్ ప్రాంతమే. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదని అంబికాపూర్ పౌరులు గుర్తిస్తున్నారు.

పర్యావరణం – ప్రజారోగ్యంపై ఆందోళన

ఈ పోరాటం సర్‌గుజా డివిజన్ ప్రజలందరిది. మనం ఈ రోజు గొంతు విప్పకపోతే, రాబోయే రోజుల్లో ఇక్కడి వాతావరణం, ఇక్కడి గాలి, ఇక్కడి అభివృద్ధి అంతా దుమ్ము, ధూళితో నిండిపోతుంది. అంబికాపూర్ నాలుగుపక్కలా కూడా మైనింగ్ ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే, ప్రస్తుతం పచ్చదనంతో నిండిన ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఎడారిగా మారిపోతుంది. అందుకే అంబికాపూర్ పౌరులు చాలా ఆందోళన చెందుతున్నారు. వారు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా మద్దతు ఇస్తారు.

రాఘవేంద్ర: పర్యావరణ ఆందోళనలతో పాటు, రామ్‌గఢ్ కొండకు చాలా ధార్మిక ప్రాముఖ్యత ఉంది. మైనింగ్ పేలుళ్ల వల్ల రామ్‌గఢ్ కొండకు నష్టం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మీరు మా పాత నివేదిక చూసి ఉంటే, మేము చాలా కష్టపడి ఆ కొండ ఎక్కాం. అయితే, ఇటీవల బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం రామ్‌గఢ్ కొండను సందర్శించి, అక్కడ ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే, రామ్‌గఢ్ కొండకు చాలా ధార్మిక ప్రాధాన్యత ఉండడం వల్ల బీజేపీ బృందం పర్యటన గురించి కొందరితో మాట్లాడాలనుకుంటున్నాం.

సార్, మీకు తెలుసా, బీజేపీకి చెందిన రతన్ శర్మ, మంత్రి రాజేష్ అగర్వాల్ వంటి వారు వచ్చారు…

కాంగ్రెస్ లేదా బీజేపీ అని చెప్పడం నిరర్థకం. నేను చెప్పేది ఏమిటంటే, మిశ్రా, అదానీ వంటి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్న కార్పొరేట్లు చాలా బలంగా మారారు. మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకున్నవారు ఇప్పుడు చేతకానివారిగా మారారు. వారు ఏమీ చేయలేరు, ఏమీ మాట్లాడలేరు. వారు అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి కూడా విలువ లేదు. ఈ గని పాతది, ఇది కేతే ఎక్స్‌టెన్షన్ కాదు, లేదా రామ్‌గఢ్ దీని పరిధిలోకి రాదు అని వారు చెబుతున్నది  నిజం కాదు.

రామ్‌గఢ్ ధార్మికంగానే కాకుండా, పురావస్తుపరంగా కూడా చాలా ప్రాముఖ్యత గల ప్రాంతం. ఆసియాలోనే అత్యంత పురాతన నాట్యశాల అయిన సీతా బెంగరా అక్కడ ఉంది. ఆ నాయకులకు దాని గురించి ఆందోళన లేదు.

వారికి మా చరిత్ర గురించి తెలియదు. వారికి కేవలం ఓట్ల గురించి, కొన్ని ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వీళ్ళు కేవలం హస్‌దేవ్ అడవిని మాత్రమే కాదు, జార్ఖండ్‌తో కూడా సరిహద్దును పంచుకునే మొత్తం సర్‌గుజా ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లోని చాలా పెద్ద అటవీ ప్రాంతాన్ని కూడా ఈ పెట్టుబడిదారులు, ఈ కార్పొరేట్ సంస్థలు తవ్వేస్తున్నారు. సర్‌గుజాను చూడండి, సర్‌గుజా ప్రాంతంలో ఇప్పటికే 20-22 మైనింగ్ కాలనీలు ఉన్నాయి.

మైనింగ్ వల్ల నష్టం: ప్రజల జీవితాలు – పర్యావరణం

“అక్కడి స్థానిక ప్రజలకు ఏమి ఒరిగింది? కేవలం గుంతలు, తప్ప. వీరు బాక్సైట్ తవ్వారు. మన్‌పార్క్ ప్రజలకు బాక్సైట్ పేరుతో ఏమి దొరికింది? కేవలం గుంతలు మాత్రమే, ఇంకేమీ దొరకలేదు. ఇది అచ్చం జార్ఖండ్ నుండి ప్రభుత్వం యురేనియం తవ్వినట్లే. యురేనియం ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకుంటుంది. దానితో ఏమేమి చేస్తుందో తెలియదు, చాలా చేస్తూ ఉండొచ్చు. కానీ యురేనియం నుండి వెలువడే రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధుల కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రజల గురించి ప్రభుత్వానికి లేదా నాయకులకు పట్టదు. కార్పొరేట్‌లకు కూడా ప్రజలతో పనిలేదు. ప్రజల గురించి ఎవరు పట్టించుకుంటారు? ప్రజల కష్టాలు అర్థం చేసుకునే వారు, అడవుల్లో, చెట్ల కింద నివసించే వారు, నీరు, అడవి, భూమిలతో సంబంధం ఉన్న ప్రజలు మాత్రమే పట్టించుకుంటారు. మన సర్‌గుజా ప్రాంతంలో శతాబ్దాలుగా అడవిగా ఉంది. పర్యావరణాన్ని కాపాడుతుంది.

మీరు ఇప్పుడే హస్‌దేవ్ పర్యావరణానికి గుండె అని చెప్పారు. ఈ కార్పొరేట్లు ఇక్కడ ఉంటే, ఎందుకంటే వారికి లాభం, దురాశ మాత్రమే ముఖ్యం. ఇలాంటి నాయకులు ఉంటే, వారి ఉనికికి అర్థం లేదు. ఈ ప్రజలు ఉన్నంత కాలం మనం హస్‌దేవ్‌ను కాపాడలేము. కానీ మనం కాపాడుతాం. ఎందుకంటే మనం మేల్కొన్నాం, మేల్కొన్న వారిని మీరు నిద్రపుచ్చలేరు, మోసం చేయలేరు, ఆశపెట్టలేరు. సర్‌గుజా మేల్కొన్న రోజు, దాన్ని ఆపడం అసాధ్యం. మనం గెలుస్తాం, అదానీ వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి వెళ్లక తప్పదు.

పిల్లల చిత్రాల్లో హస్‌దేవ్ పోరాటం:

రాఘవేంద్ర: నేను మరో సీనియర్ సిటిజన్ ప్రీత్‌పాల్‌జీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వయసులో మీరు ప్లకార్డు పట్టుకొని నిలబడ్డారు. మీ ఆందోళన ఏమిటి? మీరు చాలా కాలంగా మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. హస్‌దేవ్ గురించి మీ ఆందోళన ఏమిటి?

ప్రీత్‌పాల్: ఈ సమస్య కేవలం ఆదివాసులది కాదు. ఇది నిజానికి సాధారణ ప్రజల ఆరోగ్యమూ, పర్యావరణానికి సంబంధించిన సమస్య. పర్యావరణం, జంతువులు, పక్షులు, ఏనుగులు లేకపోతే ఏం జరుగుతుంది? నేను ఇటాకు చెందినవాడిని, అక్కడ 35వ వార్షికోత్సవ చిత్రకళా పోటీ జరిగింది. పాఠశాల స్థాయిలో జరిగిన ఆ పోటీలో 2000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఒక పిల్లవాడు ఒక చిత్రాన్ని గీశాడు, అందులో పెద్దపెద్ద భవనాల వెనుక 20 ఏనుగులు నిలబడి ఉన్నాయి; ఇక్కడ ప్రజలు పరిగెత్తుతున్నారు. నేను “ఎందుకు ఇలా గీశావు? ఎక్కడ జరిగింది ఇది?” అని అడిగాను. దానికి ఆ పిల్లవాడు “హస్‌దేవ్‌లో” అని చెప్పాడు.

మరో పిల్లవాడు సైనిక దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి చిత్రాన్ని గీశాడు, అతను తుపాకీ పట్టుకుని ఉన్నాడు, కింద “లాల్ సలాం” అని రాశాడు. నేను “ఇది తప్పు కదా, మన ఉద్దేశం ఎప్పుడూ ఇలా ఉండదు” అని అన్నాను. నేను అతని ఇంటికి వెళ్లి అతనికి నచ్చజెప్పాను, “బేటా, ఇలా హింసతో కాదు. మీరు చేయాలనుకుంటే, ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా మీ గొంతును వారికి వినిపించండి” అని చెప్పాను.

కొంతమంది పిల్లలు భూమిని ఒక వైపు అడవులు నరికివేసి పూర్తిగా ఎండినట్లు, మరో వైపు పచ్చదనంతో నిండినట్లు చూపించారు. అంటే పిల్లలకు కూడా హస్‌దేవ్‌లో ఏం జరుగుతుందో తెలుసు, పర్యావరణం గురించి వారికి ఆందోళన ఉంది. వారు పెద్దయ్యాక ఏం చేస్తారో చూడండి. నేను చెప్పేది ఏమిటంటే, మనం తాగే నీరు సీసాల్లో, పీల్చే గాలి ఆక్సిజన్ సిలిండర్ల నుండి తీసుకునే పరిస్థితి వస్తే అది సరైన పద్ధతి కాదు.

పర్యావరణంపై ఆందోళన:

మన అందమైన ఛత్తీస్‌గఢ్‌ను నరికివేసి నాశనం చేస్తున్నారు. ఈ విషయం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. మీరు చూస్తున్నట్లుగా, ఆదివాసులు, ఆదివాసేతరులు, వృద్ధులు, యువకులు, పిల్లలు – సమాజంలోని అన్ని వర్గాలవారు హస్‌దేవ్ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. హస్‌దేవ్ అని అనడం కంటే, ఈ మొత్తం సర్‌గుజా ప్రాంతం భవిష్యత్తు గురించి అందరికీ ఒక సందేహం నెలకొంది.

కొంతమంది యువకులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం.

రిపోర్టర్: మిత్రమా, మీరు ఎక్కడ నుండి వచ్చారు?

యువకుడు: నేను భడ్‌గావ్ నుండి వచ్చాను.

రిపోర్టర్: ఈ రోజు ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు?

యువకుడు: హస్‌దేవ్ అడవిని అదానీ నాశనం చేస్తున్నాడు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా మేము ఈ నిరసన, ఆందోళన చేస్తున్నాం. హస్‌దేవ్ అడవిని ఛత్తీస్‌గఢ్ ఊపిరితిత్తులు అని పిలుస్తారు. అందుకే మేము ఈ నిరసన చేస్తున్నాం.

రిపోర్టర్: మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం, అదానీ తమ పని చేస్తున్నారు. 10 ఏళ్లుగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మీరు రాయ్‌పూర్ వరకు పాదయాత్ర కూడా చేశారు. అయినా వారి పని ఆగడం లేదు.

యువకుడు: ఇప్పుడు ప్రజలందరినీ చూస్తుంటే, ఈ నిరసన మరింత తీవ్రమైన స్థాయిలో జరుగుతోంది. భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ వారు మా మాట వినకపోతే. ప్రస్తుతం మేము కేవలం సమాచారం ఇస్తున్నాం. దీని తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం.

రిపోర్టర్: మీరు ఎక్కడ నుండి వచ్చారు?

రెండో యువకుడు: నేను సూరజ్‌పూర్‌లోని లాచి గ్రామం నుండి వచ్చాను. నేను ఈ ధర్నాలో పాల్గొనడానికి వచ్చాను. హస్‌దేవ్‌ను కాపాడటానికి, అడవిని కాపాడటానికి నేను వచ్చాను. మా కొండలను కాపాడాలని నేను నా స్నేహితులతో కలిసి పూర్తిగా నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరూ ప్రయత్నించి తమ అడవి, భూమిని కాపాడటానికి ప్రయత్నించాలి.

రిపోర్టర్: మీరే ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, శివ్ రతన్ శర్మ వంటివారు అక్కడికి వెళ్లారు. రామ్‌గఢ్ కొండపై మైనింగ్ ప్రభావం నిజంగా ఉందా అని చూడటానికి వారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రామ్‌గఢ్ కొండపై ఎలాంటి ప్రభావం లేదని వారు స్పష్టంగా చెప్పారు కదా.

ప్రభుత్వ దృష్టిలో లేని ప్రజల ఆవేదన

యువకుడు: వాళ్ళు పాలకుల కదా, వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు. వాళ్ళ కళ్ళకు కనిపించదు. మన దేవతలు, మన పుణ్యక్షేత్రాలు, మన ధర్మం గురించి మనకే తెలుస్తుంది, ఏది నాశనమైందో, ఏది కాలేదో. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి లాభం అవుతుంది కాబట్టి, వాళ్ళ దృష్టిలో అదే కనిపిస్తుంది. మనల్ని మనం కాపాడుకోవాలి. నేను చెప్పేది ఒకటే, మన నీరు, భూమి, అడవిని కాపాడటానికి ప్రయత్నిద్దాం. మేము ఎప్పుడూ పోరాడుతాం, పోరాడుతూనే ఉంటాం.

పర్యావరణ కార్యకర్తతో సంభాషణ

రిపోర్టర్: మనతో గిరీష్ దూబే గారు ఉన్నారు. గిరీష్ గారు చాలా కాలంగా పర్యావరణం, అడవుల సమస్యలపైన ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నారు. గిరీష్ గారు, మనం కొన్నాళ్ళ క్రితం మాట్లాడినప్పుడు మీరు నది గురించి మీ ఆందోళనలను వెలిబుచ్చారు. కానీ మీరు చేస్తున్న సమ్మెలు, ధర్నాలు, ప్రదర్శనలు, పాదయాత్రలు – ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఒక గని 2028 నాటికి పూర్తి కావాల్సి ఉండగా, అది 2022 లోనే అయిపోయింది. ఇప్పుడు వారు రెండో, మూడో గనులకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మీకు భవిష్యత్తు ఎలా కనిపిస్తోంది? హస్‌దేవ్ భవిష్యత్తు ఏమిటి?

గిరీష్ దూబే: ఇది కేవలం హస్‌దేవ్ భవిష్యత్తు గురించి మాత్రమే కాదు. ఇక్కడ నివసించే ప్రజలందరి భవిష్యత్తు ప్రమాదంలో ఉంది, దానిపై చాలా తప్పుడు ప్రభావం పడుతోంది. మనం దీనిని ఆపకపోతే, ఒక గొప్ప మానవ నాగరికత నాశనం కాబోతోంది. మానవ నాగరికతతో పాటు, ఇతర జీవరాశులు కూడా నాశనం కాబోతున్నాయి. మేము మొదటిసారిగా మా ఆందోళనను అంబికాపూర్ లోకి తీసుకొచ్చాము. మేము మొత్తం సర్‌గుజా డివిజన్‌లో ఈ ఉద్యమాన్ని విస్తరించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. మా పూర్తి శక్తితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తాం.

రాజకీయ నాయకుల భాగస్వామ్యం

రిపోర్టర్: మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నట్లుగా, ఈ ఉద్యమంలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు, వివిధ వయసుల వారు, వేర్వేరు నేపథ్యాల వారు, రాజకీయ, రాజకీయేతర వ్యక్తులు, వృద్ధులు, యువకులు, పిల్లలు, మహిళలు అందరూ పాల్గొంటున్నారు. ఈ అడవిని నరికివేసిన తర్వాతి సర్‌గుజా భవిష్యత్తు గురించి వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో ప్రేమ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే తులేశ్వర్ సింగ్ గారి కూతురు ఉన్నారు, ఆమె కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. ముందుగా మీ పేరు చెప్పండి.

మహిళ: నేను శశి సింగ్.

రిపోర్టర్: మీరు కాంగ్రెస్ నుండి సర్‌గుజా లోక్‌సభ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు కదా.

శశి సింగ్: అవును, కానీ నేను ఏ రాజకీయ కార్యక్రమానికి ఇక్కడకు రాలేదు. ఇది సామాజిక పోరాటం, హస్‌దేవ్ పోరాటంలో పాల్గొనడానికి వచ్చాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఐక్యంగా నిర్వహిస్తున్నాం. హస్‌దేవ్ ఉద్యమానికి ఈ రోజు మనం ఒక ప్రారంభం ఇస్తున్నాం. హస్‌దేవ్ అడవుల నుండి మొదలైన ఈ ఉద్యమాన్ని మనం అంబికాపూర్‌కు తీసుకొచ్చాం, అవసరమైతే ఢిల్లీ వరకు కూడా తీసుకువెళ్తాం. ఇది హస్‌దేవ్‌ను కాపాడటానికి ఒక ప్రారంభం అని నేను చెబుతాను.

పోరాటం కొనసాగుతున్నా మైనింగ్ కార్యకలాపాలు ఆగడం లేదు

రిపోర్టర్: హస్‌దేవ్‌కు నష్టం చేయాలనుకుంటున్నవారికి వ్యతిరేకంగా కేవలం ఆదివాసులు మాత్రమే కాదు, మొత్తం సర్‌గుజా ప్రజలు త్వరలోనే ఏకమవుతారని నేను భావిస్తున్నాను. ఈ చర్చ మొదలుపెట్టినప్పుడు మనం చాలాసార్లు చెప్పినట్లుగా, హస్‌దేవ్ ఉద్యమం మొదటిసారి 2013లో అనుమతులు వచ్చినప్పటి నుంచే ప్రారంభమైంది.

నేను ఎవరిని కలిసినా ఒక ప్రశ్న అడుగుతాను: 10-12 ఏళ్లు అవుతోంది, నిరసనలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఒక వైపు నిరసనలు జరుగుతున్నాయి, కానీ మరోవైపు మైనింగ్ కార్యకలాపాలు, పేలుళ్లు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇటీవల, ఒక వారం క్రితం, అధికార పార్టీ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది, అందులో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, మరికొందరు ఉన్నారు. మైనింగ్ వల్ల రామ్‌గఢ్ కొండపై ప్రభావం పడుతుందా అని పరిశీలించడానికి వారిని పంపారు. స్థానిక ప్రజలు, ఈ ఉద్యమంలో పాల్గొన్నవారు, చివరికి నేను కూడా ఆ కొండపైకి ఎక్కాను. మేము చూస్తుండగానే ఒక చెట్టు పడిపోయింది. మేము వెళ్ళినప్పుడు వర్షం పడటం వల్ల అక్కడ కొండచరియలు చాలా వేగంగా విరిగిపడుతున్నాయి. మేం వెళ్లినప్పుడు అక్కడ వాన పడుతోంది.

మీరు ఒకవైపు పాదయాత్రలు చేస్తున్నారు, ప్రజలు రాయ్‌పూర్ వరకు వెళ్తున్నారు, కానీ దాని ఫలితం మాత్రం శూన్యం. ఎందుకంటే అదానీ తమ పని చేసుకుపోతున్నారు. మైనింగ్ నిరంతరం జరుగుతోంది. 2028లో పూర్తి కావాల్సిన ఒక గని 2022లోనే పూర్తయింది. ఇప్పుడు పర్సా- కేతే ఎక్స్‌టెన్షన్ అనేవి నిజానికి పాతవాటి పొడిగింపులు కాదని, అవి కొత్త గనులు అని నేను విన్నాను. ఒకవైపు ఉద్యమం జరుగుతుంటే, మరోవైపు వారి పని అదే వేగంతో, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ వేగంతో సాగుతుండటంపై మీరు ఏమనుకుంటున్నారు?

ప్రభుత్వమూ రాజకీయ నాయకులపైన ఆరోపణలు

కార్యకర్త: ఈ ప్రభుత్వం ఆదివాసులను చాలా బలహీనంగా భావిస్తోంది. వారికి ఎక్కువ అవగాహన లేదని, వారిని మోసం చేసి హస్‌దేవ్ అడవిని నాశనం చేయవచ్చని అనుకుంటుంది. రామ్‌గఢ్ కొండపైకి వచ్చిన ఆ కమిటీ ఏం చూపించాలనుకుంది? “మేము రామ్ మందిరానికి ఏమీ జరగనివ్వం” అని చూపించాలనుకున్నారు. వారు దానికి ఏమీ జరగనివ్వరు, కానీ మొత్తం అడవిని నాశనం చేస్తారు. అప్పుడు రామ్ మందిరానికి ఉనికి ఉండదు. ఇది హస్‌దేవ్‌ను నాశనం చేయడానికి వారు ఆలోచించి అమలు చేస్తున్న పథకం.

ఇక్కడ మంత్రి పదవి కూడా ఇచ్చారు. నేను ఢిల్లీకి వెళ్తుంటాను కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. హస్‌దేవ్ అడవిని నాశనం చేయడంలో వారి సహకారం కోసమే వారికి ఆ పదవిని ఇచ్చారని నేను విన్నాను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాజేష్ గారితో పాటు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.

రాజకీయ నాయకులపై ఆరోపణలు

“వారిని కాకుండా వీరిని మంత్రిని చేశారు. దీనికి ఇంతకంటే పెద్ద కారణం ఇంకేమీ ఉండదు. వారు కేవలం ‘మనం గుడిని కాపాడతాం’ అని చెప్పడానికి అక్కడికి వెళ్తున్నారు. గుడిని ఎవరూ కూల్చలేరు, ఎందుకంటే ఎవరైనా దాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే వాళ్ళే ఉండరు. అది ప్రజల ఆరాధన స్థలం. కానీ మొత్తం అడవిని నాశనం చేయాలనేది వారి పూర్తి ఉద్దేశం. అయినప్పటికీ, మనం అందరం ఐక్యమవుతామని, పోరాడుతామని, హస్‌దేవ్ అడవిని కాపాడుకుంటామని నాకు పూర్తి నమ్మకం ఉంది.

రిపోర్టర్: నిరసన స్వరం వివిధ ప్రాంతాల నుండి వస్తోంది. ఇన్ని రోజులుగా ఈ సమస్యను పట్టించుకోని ప్రభుత్వం, కళ్లు, చెవులు మూసుకున్న ప్రభుత్వం వరకు  ఈ స్వరం చేరుతుందా లేదా చూడాలి.

రైతు నాయకుడి ఆందోళన

కపిల్ దేవ్ పక్ర: నేను ఛత్తీస్‌గఢ్ కిసాన్ సభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితిలో కూడా సభ్యుడిని. హస్‌దేవ్‌లో జరుగుతున్న అటవీ నరికివేతను వ్యతిరేకించడానికి మేము ఇక్కడకు వచ్చాం. మేము అందరం ఇక్కడ ఐక్యంగా ఉన్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఈసారి రైతులను నాశనం చేస్తోంది. ఇక్కడ రైతులు కన్నీళ్లు పెట్టుకుని యూరియా కొనుగోలు చేశారు. రూ. 250 విలువైన యూరియాను రైతులు రూ. 1000 నుండి రూ. 1300 వరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతోంది. కానీ ఇక్కడ రైతులను దోచుకోవడానికి మొత్తం ప్రభుత్వం పనిచేస్తోంది. ధాన్యం మార్కెట్‌లో, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని రైతులు నింపినప్పటికీ, డబ్బు మాత్రం రైతులకు అందడం లేదు. నేను చాలా గ్రామాలలో పర్యటించాను. ప్రతి గ్రామంలో రైతులు “నా ఖాతా నుండి రూ. 60,000 ఎలా పోయాయో నాకు తెలియదు” అని చెబుతున్నారు.

ఈ సర్‌గుజా డివిజన్‌లో ఇలాంటి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నేను ప్రతి గ్రామంలో, ప్రతి కిసాన్ సభలో రైతులను సర్వే చేయిస్తున్నాను. కిసాన్ సభలో ఉన్న నా సహచరులు, ఇతర ప్రజా సంఘాల ప్రజలు కూడా ప్రతి గ్రామంలో రైతులను సంఘటితం చేయడానికి పనిచేస్తున్నారు.

హస్‌దేవ్ అడవి కోసం కూడా మేము ఇక్కడ పూర్తిగా ఉద్యమం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, నకిలీ గ్రామసభలతో ముందుకు వెళ్తే, రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే పరిస్థితికి మమ్మల్ని నెట్టద్దు. అలా చేస్తే కనక భవిష్యత్తులో ఇక్కడ పరిస్థితిని ప్రభుత్వం అదుపు చేయలేకపోవచ్చు. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చడానికి రైతులకు, ఆదివాసులకు ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికీ ఆదివాసులు, రైతులు ఓపికతో ఉన్నారు. ఆ ఓపిక నశించిన రోజు, అలాంటి ప్రభుత్వాన్ని పీకి పారేస్తారు.

భూసేకరణ – రైతుల పోరాటం

చైన్ షాయ్: నేను అప్పుడు, ఇప్పుడు కూడా కిసాన్ సభకు జిల్లా ఉపాధ్యక్షుడిని.

వారు 300 మంది రైతులకు చెందిన భూమిని తీసుకున్నారు. ఆ భూమికి బదులుగా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, పరిహారం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని  డీసీ సవరియా భడ్‌గావ్‌లోని తన ఆఫీసుకి పిలిచాడు. అక్కడికి వెళ్లి, “సార్, మీరు మమ్మల్ని పిలిచారు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి” అని అడిగితే, “నేను మిమ్మల్ని ఏమీ పిలవలేదు, ఏమీ ఇవ్వను. భూమికి పరిహారం ఇవ్వను, మీకు ఉద్యోగం ఇవ్వను. ఈ భూమి ప్రభుత్వం సొంతం” అని అన్నాడు. అప్పుడు నేను, “సరే, అది ప్రభుత్వానిదైతే, మీరు ప్రభుత్వంతో సంతకాలు తీసుకోండి. మా భూమి పత్రాలపై మీరు ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారు?” అని అడిగాను. దానికి ఆయన, “ఇది మీ భూమి కాదు, మీరు అక్కడ కౌలుకు మాత్రమే పనిచేసుకుని బతుకుతున్నారు” అని అన్నాడు. చివరికి, నేను అతనికి రెండు మూడు చెంపదెబ్బలు కొట్టి బయటకు వచ్చాను.

నాపైన 56, 107, 1076 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 9 సంవత్సరాల పాటు కఠరియా మేజిస్ట్రేట్ కోర్టులో, సూరజ్‌పూర్ జైల్ అదాలత్‌లో నా కేసు నడిచింది. ఆ తర్వాత, మహమ్మద్ ఇస్మాయిల్, గృహ మంత్రి వచ్చారు…

రిపోర్టర్: మీరు కలెక్టర్‌ను కొట్టారా?

ప్రేమనాథ్: లేదు, కలెక్టర్‌ను కాదు, డీసీ చందా సవరియాను కొట్టాను. భడ్‌గావ్‌లో.

రిపోర్టర్: అతను జిల్లా అధికారా?

ప్రేమనాథ్: కాదు, అతను కంపెనీకి చెందినవాడు. ఎస్సీసీఎల్ కంపెనీకి చెందినవాడు.

రిపోర్టర్: డీసీ చందా సవరియా కదా? తర్వాత ఏం జరిగింది? మీకు జైలు శిక్ష పడిందా?

ప్రేమనాథ్: అవును, నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మేజిస్ట్రేట్ సాహిబ్ నాకు ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. నేను ఆ తీర్పు కాపీని తీసుకుని అంబికాపూర్‌ జిల్లా సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశాను. దాంతో ఏడు రోజుల తరువాత బయటకు వచ్చాను. నాకు ఏమీ జరగలేదు. చివరికి పశ్చిమ బెంగాల్ గృహ మంత్రి మహమ్మద్ ఇస్మాయిల్, శాంతి రంజన్ ఘటక్, సునీల్ బసు రాయ్ వచ్చారు. వీరంతా కలెక్టర్‌ను కలిశారు, జైలుకు కూడా వెళ్లారు. ఎవరికీ ఏమీ జరగలేదు. చివరికి 21 మంది రైతులు జైలుకు వెళ్లారు, వారిని కూడా విడిపించారు. 700 మంది నాయకులు 7 నెలలు జైలులో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత 25 రోజులు బొగ్గు గనిని మూసివేశారు. 25 రోజుల్లో మోహిత్ రామ్ భార్య చిన్న పిల్లలను తీసుకుని రైలు పట్టాలపై కూర్చుంది. అప్పుడు 300 మందికి ఉద్యోగం లభించింది.

రిపోర్టర్: భూమికి పరిహారం కూడా ఇచ్చారా?

ప్రేమనాథ్: అవును, భూమికి పరిహారం, ఉద్యోగం కూడా ఇచ్చారు.

రిపోర్టర్: ప్రభుత్వ ఉద్యోగమా?

ప్రేమనాథ్: ప్రభుత్వ ఉద్యోగం కాదు, కంపెనీ ఉద్యోగం. ఎస్సీసీఎల్ ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం లాంటిదే. మేము 25 రోజులు బొగ్గు గనిని మూసివేశాం కాబట్టి ఆ కంపెనీలో 300 మందికి ఉద్యోగం ఇచ్చారు.

అందుకే, పోరాటం, పోరాటం లేకుండా ఏ సమస్యా పరిష్కారం కాదు. మెడలు వంచితే తప్ప మన మాట వినరు. హస్‌దేవ్‌లో కూడా మెడని వంచుతాం. హస్‌దేవ్‌లో ఆదివాసులందరూ మేల్కొంటే, మేము నిమిషాల్లో వాళ్ళ మెదని వచ్చేస్తాం. నిమిషాల్లో కలెక్టర్ సార్ అక్కడికి పరుగున వస్తాడు. ఎస్పీ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అధికారులు అందరూ అక్కడికి చేరుకుంటారు. హస్‌దేవ్ అడవుల నరికివేత ఆగిపోతుంది. మేము అదానీని, అంబానీని మట్టిలో కలిపేస్తాం. ఇక్కడ అదానీ, అంబానీ ఇద్దరూ ఉండలేరు. మన ప్రభుత్వం మన వాచ్‌మెన్‌, కానీ ఆ పనిని సరిగా చేయడంలేదు. అలాంటి వాచ్‌మెన్‌లను మనం మార్చాలి.”

రిపోర్టర్: వృద్ధులలో ఎంత కోపం, అసంతృప్తి ఉందో మీరు చూస్తున్నారు. వారు అదానీ, అంబానీలకి వ్యతిరేకంగానే కాదు, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితి చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి జార్ఖండ్ నుండి సామాజిక కార్యకర్త, సాంస్కృతిక కార్యకర్త శైలేంద్ర కుమార్ గారు కూడా వచ్చారు.

శైలేంద్ర గారూ, ఇంత నిరసన, ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున అడవుల నరికివేత, మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, మీ ఆందోళనలు ఏమిటి? అన్ని నిరసనలను పక్కన పెట్టి, వేలాది యంత్రాలను ఒకేసారి ఉపయోగించి చెట్లను నరికివేసి, ఆదివాసులను వారి హక్కుల నుండి దూరం చేస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఈ సమాజం, ఈ సమస్య గురించి మీ ఆందోళన ఏమిటి?

 శైలేంద్ర కుమార్: గతంలో అన్నీ సవ్యంగా ఉన్నాయని, ఒక ఆదర్శవంతమైన పరిస్థితి ఉండేదని నేను చెప్పను. కానీ మనం కనీస నైతికతను పాటించేవాళ్ళం. వాటిని నియంత్రించడానికి కొన్ని చట్టాలు ఉండేవి. ఆ చట్టాలను ఉల్లంఘించినప్పుడు ప్రజలు రోడ్ల మీదకు వస్తే, పాలకులు కొంత ప్రజలను పట్టించుకునేవారు. సంకోచాన్ని చూపించేవారు, వెనక్కి తగ్గేవాళ్ళు. కానీ గత 10-12 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, క్రోనీ క్యాపిటలిజం (అంటే ప్రభుత్వం- పాలనా యంత్రాంగాల సహకారంతో ఏర్పడిన అపవిత్ర కూటమి) అనేది దేశ పారిశ్రామికీకరణకు సంబంధించిన వ్యాపార నమూనా కాదు. గతంలో జమీందారులు తమ అనుచరులతో ప్రజల భూములను ఎలా ఆక్రమించేవారో, ఇది సరిగ్గా అలాంటిదే.

ప్రభుత్వ-కార్పొరేట్ కూటమి: అపవిత్ర పోరాటం

“సరిగ్గా అదే విధంగా, ఇప్పుడు అదానీ, అంబానీలకి అనుచరులుగా మారి, ప్రభుత్వం తన ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ప్రభుత్వం సాధారణ యుద్ధ నియమాలను కూడా పాటించడం లేదు. యుద్ధం అనేది మంచిది కానప్పటికీ, గతంలో యుద్ధంలో పౌర స్థావరాలపైన దాడి చేయకూడదు, రాత్రిపూట దొంగల మాదిరిగా ఎవరూ ప్రవేశించకూడదులాంటి నైతిక నియమాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ నియమాలన్నిటినీ ఉల్లంఘించి, దేశ వనరులను నేరుగా దోచుకుంటున్నారు.

వాస్తవానికి, చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న అత్యంత ముఖ్యమైన పోరాటం ఇదే. ప్రపంచవ్యాప్తంగా, ప్రజలను వారి నీరు, అడవి, భూమి నుండి కుట్రపూరితంగా బహిష్కరించారు. నాగరికులుగా చెప్పుకునేవారు కూడా కరుణ చూపలేదు. ఎందుకంటే వారికి సాంస్కృతిక స్పృహ లేదు, నైతిక బలం లేదు.

ఇప్పుడు ఇది చరిత్రలో ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇది కేవలం అభివృద్ధికి సంబంధించిన ప్రశ్న కాదు, కానీ ఒక జాతిగా భూమిపై మన మనుగడ ఉంటుందా లేదా అనే ప్రశ్న కూడా. మన అత్యాశ, మన కోరికలు, మన అనంతమైన భోగాల కోరిక ఈ భూమిని నాశనం చేస్తుందా? చాలా మందికి ఇది అర్థం కావడం లేదు. అందుకే ఈ మోసాలను వారు గుర్తించలేకపోతున్నారు. ఇది ఒక దోపిడీ సామ్రాజ్యం. అందుకే నేను హస్‌దేవ్‌కు ముందు నియంగిరిలో పోరాటం జరిగింది, దాని ముందు గోడాలో అదానీ దోపిడీ జరిగింది, ఇప్పుడు వారు హస్‌దేవ్‌కు వచ్చారు అని చెప్పాను.

ప్రకృతి – తిరుగుబాటు

“ఎంత అడవి కావాలి మీకు? లక్ష చెట్లు చాలునా? పది లక్షలు చాలునా? ఇరవై లక్షలు చాలునా? లేదు, వారి కడుపు నిండదు. ఇప్పుడు హస్‌దేవ్‌లో ఇది జరుగుతోంది, బీహార్‌లో పది లక్షల చెట్లను నరికేందుకు సిద్ధమవుతున్నారు. మన పూర్వీకుల ఆస్తిని బంజరుగా, నిర్జనంగా మార్చి దోచుకుంటున్న ఈ పరిస్థితిలో, తిరుగుబాటు మాత్రమే ఏకైక మార్గం. తిరుగుబాటు గాంధీ మార్గంలో ఉంటే మంచిది. కానీ పోరాటాల మార్గం ఎలా ఉంటుందో ప్రజలు నిర్ణయించరు. ప్రజలు ఊరేగింపులు, ప్రదర్శనలు చేసినప్పుడు మీరు అంగీకరిస్తే, ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతారు.

కానీ మీ నుండి సమాధానం రానప్పుడు, మీరు వారిపై కేసు విచారణ జరపకుండానే దేశద్రోహులుగా ప్రకటించి జైల్లో వేసినప్పుడు, అప్పుడు తిరుగుబాటు జరుగుతుంది. ఆ తిరుగుబాటు మంచిది కాదు. ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి. కానీ భూమి లోపల లావా ఉడుకుతున్నప్పుడు, ఆ లావా భూకంపం తీసుకురాదని ఎవరు చెప్పగలరు? పెద్ద ఎత్తున నష్టం కలిగించే అలాంటి భూకంపం రాకూడదని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది మా కోరికకు సంబంధించిన విషయం కాదు.”

క్రోనీ క్యాపిటలిజం – ప్రజాస్వామ్యం

శైలేంద్ర కుమార్: “ప్రభుత్వం తమ క్రోనీ క్యాపిటలిస్టుల సహాయంతో గెలుస్తున్న తీరు ఆందోళన కలిగించే విషయం. ఈ ఆందోళనతోనే మేమందరం ఇక్కడ ఉన్నాం. అభివృద్ధికి సంబంధించిన కొత్త నమూనా వచ్చింది. ఈ నమూనాలో అంతులేని భోగలాలస ఉంది. అవసరాలను తీర్చవచ్చు, తీర్చాలి కూడా. కానీ మీ కోరికలకు, మీ అత్యాశకు ఎలాంటి జవాబు లేదు.

ఈ అభివృద్ధి నమూనా మొత్తం దోపిడీపైన ఆధారపడి ఉంది. ఆ దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బుతో వారు ప్రభుత్వాన్ని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వాన్ని కొనుగోలు చేయడం అంటే నా ఉద్దేశం ఏమిటి? మీరు చెప్పినట్లు, ‘బేబీ, ఇదే సరైన ఎంపిక.’ మనమంతా బేబీస్‌లా ఉన్నాం. పెప్సీ తాగితే జెంటిల్‌మెన్‌ అవుతాం అని చెప్పినట్లు, భారతదేశపు బేబీస్‌కు ఎన్నికలలో ఇదే సరైన ఎంపిక అని చెప్పారు. ఈ సరైన ఎంపికను ఎంచుకుంటే, మీకు పాకిస్తానీ తల భారతదేశపు రోడ్లపై దొర్లుతూ కనిపిస్తుంది. ఈ సరైన ఎంపికను ఎంచుకుంటే, మీకు 2 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయి. కానీ బేబీస్ ఈ సరైన ఎంపికను ఎంచుకున్నారు, బదులుగా వారికి ఏమీ దొరకలేదు.

ప్రభుత్వాలు స్వతంత్రమైనవి, స్వయంప్రతిపత్తి కలిగినవి అని ప్రజలు అన్నప్పుడు, ఈ రోజుల్లో అలా చెప్పలేరు. ఈ ప్రభుత్వం స్వతంత్రమైనది కాదు, స్వయంప్రతిపత్తి కలిగినది కాదు. వారు పెప్సీని తయారుచేసినట్లుగా, చిప్స్ ప్యాకెట్ తయారుచేసినట్లుగా, ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థలు మొదటిసారిగా ఒక రాజకీయ ఉత్పత్తిని విడుదల చేసి, భారత మార్కెట్లో అమ్ముకున్నాయి. ఆ రాజకీయ ఉత్పత్తిని అమ్మడం వల్ల వారికి విమానాలు, నదులు, అడవులు లభించాయి. అన్నింటినీ దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఇప్పుడు అధికారం, శక్తిల పగ్గాలు 56 అంగుళాల ఛాతీలో లేవు. అధికారం, శక్తి మూలం అదానీ, అంబానీల దగ్గర దాక్కుని ఉంది.

ఆ అధికారం, శక్తికి సవాలు విసరడం తప్ప మరో దారి లేదు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారు కలలుగన్న సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ఆస్తుల సమాన పంపిణీ వంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టేసారు. ఇప్పుడు మొత్తం భారతదేశం అదానీ, అంబానీల ఆస్తిగా మారుతోంది. ప్రజల పోరాటం, ప్రజల ప్రతిఘటన మాత్రమే స్వాతంత్ర్య కలలను, భారతదేశ భావనను కాపాడగల ఏకైక అవకాశం. అందుకే ఇది చాలా ముఖ్యమైన పోరాటం.”

పోరాటం: చట్టం – ప్రజల హక్కులు

రిపోర్టర్: శైలేంద్ర గారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. హస్‌దేవ్‌లో చట్టబద్ధమైన ప్రక్రియలు ఏవీ పాటించలేదని ఈ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలు, పెసా చట్టం, ఐదవ షెడ్యూల్ అన్నింటినీ పక్కకు పెట్టేసారు. ప్రజలలో చాలా ఆగ్రహం ఉంది. ఈ సమస్యకు అనేక సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మా పక్కన మాజీ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్ తెగల కమిషన్ మాజీ అధ్యక్షులు, హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితి కన్వీనర్ భాను ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు.

భాను గారు, మనం చాలా విషయాలు ఉపన్యాసాలలో విన్నాం, ఇంటర్వ్యూలలో తెలుసుకున్నాం. ఆదివాసులపై వ్యక్తిగతంగా పడిన ప్రభావం గురించి చెప్పండి. నేను ఒక సాంకేతిక అంశం గురించి విన్నాను, అది పట్టణాల్లో ఉండే సామాన్య పౌరుడికి అర్థం చేసుకోవడం కష్టం. ఒకవేళ ఒక గ్రామం నాశనమైతే, ఆ ఆదివాసీ  తన కుల ధృవీకరణ పత్రాన్ని పొందడంలో చాలా ఇబ్బందులు పడతారట. ఒక సామాన్య వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పండి, ఒక అడవిని నరికేస్తే, ఆ అడవికి, అతని కులానికి సంబంధం ఏమిటి?

అడవులతో ప్రజల అనుబంధం

భాను ప్రతాప్ సింగ్: అడవి నరికివేతకు, కులానికి సంబంధం ఉంది. ఎందుకంటే మేం ఆదివాసులం అడవుల్లో నివసిస్తాం. మాకు నీరు, అడవి, భూమితో అనుబంధం ఉంది.

భాను ప్రతాప్ సింగ్: “మేము నివసించే అడవి మాకు ఒక బ్యాంక్ లాంటిది. పెళ్ళికి, చావుకి, జీవనానికి, వ్యవసాయ పరికరాలకు అవసరమైనవన్నీ మాకు అక్కడి నుండే దొరుకుతాయి. మేము అడవి నుండి అవసరమైనడాని కంటే ఎక్కువ తీసుకోలేదు; ఒకవేళ తీసుకున్నా దానిని రక్షించాం. నేను షెడ్యూల్డ్ తెగకు చెందినవాడినా, సాధారణ వ్యక్తినా అని కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వారి ముందర ఏమీ రాసిలేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము చెప్పేది ఏమిటంటే, ప్రభుత్వం ఎవరి భూములను లాక్కుందో, వారికి పునరావాస విధానం కింద తిరిగి ఇవ్వాలి. అడవుల నరికివేతను ఆపేయాలి. పునరావాస విధానం అంటే, నా తాతల భూమి పత్రాలలో ఏదైతే వ్రాసి ఉందో, దాన్ని బట్టి మీరు మాకు భూమిని ఇచ్చి మా కుల ధృవీకరణను సురక్షితం చేయాలి. డబ్బులు ఇవ్వద్దు.

ధర్నా- భవిష్యత్ వ్యూహం

రిపోర్టర్: ఈరోజు జరిగిన మీ ధర్నా ప్రభుత్వంలో ఏదైనా మార్పు తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదా మీ భవిష్యత్ వ్యూహం ఏమిటి?

భాను ప్రతాప్ సింగ్: భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఇంతకు ముందు మా సహచరులు చెప్పినట్లుగా, గతంలో ప్రభుత్వాలకు కొంత ప్రజా సంకోచం ఉండేది. మేము ఉద్యమం చేస్తే, మా ఉద్యమం గురించి, మా డిమాండ్ల గురించి, మా మాటలను పరిగణనలోకి తీసుకునేవాళ్ళు, ఆలోచించేవారు. ప్రభుత్వం వెనక్కు తగ్గి మా హక్కులను మాకు ఇప్పించడానికి మాట్లాడేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికైనదైనప్పటికీ, దాన్ని వేరే వాళ్ళు నడిపిస్తున్నారు.

ఈ హస్‌దేవ్‌లో అదానీకి 74%, రాజస్థాన్ ప్రభుత్వానికి 26% వాటా ఉంది. యజమానికి 26%, పనిచేసే వారికి 74% వాటా ఎలా ఉంటుంది? ఇది ఎలా సాధ్యం? అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారని ఆందోళనగా ఉంది.

మా డిమాండ్లు అన్నీ సరైనవే. మేము ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి కారణం కూడా అదే. 15 ఏళ్లలో మొదటిసారిగా హస్‌దేవ్ ప్రజలు డివిజన్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ ప్రధాన కార్యాలయానికి ఛత్తీస్‌గఢ్ ప్రజలు మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చారు.

మేము వారికి 15 రోజులు గడువు ఇచ్చాం. ఈ 15 రోజుల్లో మా డిమాండ్లను అంగీకరించాలి. జరిగిన అక్రమాలను, కపటతంత్రం చేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, తవ్వకం పనులను ఆపాలి. అలా చేయకపోతే, మేము తీవ్రమైన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

ముగింపు

రిపోర్టర్: ఈ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు, పర్యావరణ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, వృద్ధులు అందరితో మేము మాట్లాడాం. వారి ఆరోపణలు నిజమైతే, నకిలీ గ్రామసభలు ఏర్పాటు చేసి, పోలీసుల సమక్షంలో చెట్లను నరికివేసినట్లయితే, అప్పుడు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే ప్రభుత్వ- కార్పొరేట్ల కలయిక ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మీరు చూడవచ్చు.

కెమెరామెన్ భీష్మ్ తో కలిసి రాఘవేంద్ర సింగ్, సెంట్రల్ గోండ్వానా ఖబర్.

25 సెప్టెంబర్ 2025

వీడియో తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply