1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ వేదిక అనుభవం ఏమిటి?
కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ కోసం మేం కలసిన వారిలో చాలా మంది తెలంగాణలో కాల్పులు జరగడం లేదు కదా …మీరు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు పైగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులపట్ల సానుభూతిగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కనిపించడం మాత్రమే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్ సమస్య శాంతి భద్రతల సమస్యగా చూడడం తప్పు అన్నారు. సామాజిక అసమానతలు ఉన్నంత వరకూ సక్సలైట్లు పుడుతూనే ఉంటారు అని కూడా వ్యాఖ్యానించారు.
మీరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అనడం సరైనదేనా? అనే ప్రశ్న చాలా మంది నుంచీ వచ్చింది.
దానికి మేం చెప్పిన సమాధానం ఏమిటంటే …
నిజమే తెలంగాణ ప్రభుత్వం కాల్పులు జరపడం లేదు . అలాగే ముఖ్యమంత్రిగారు నక్సల్ సమస్య సామాజిక సమస్యగానే చూడాలి అని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సల్వాజుడుం తీర్పుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు కూడా. అలాగే తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షం బిఆర్ఎస్ కూడా ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మాట్లాడింది.
వరంగల్ లో జరిగిన బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశాల్లో కెసిఆర్ చాలా స్పష్టంగా కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో జరుపుతున్న నరమేధం ఆపాలి అన్నారు. అలాగే చర్చలు జరపాలి అని డిమాండ్ చేశారు.
అందుకే … అంటే మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటాల పట్ల కొంత అవగాహనతో మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు నాయకులు స్పష్టంగా కనిపిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కనుక మావోయిస్టు పార్టీపై తుపాకి ఎక్కుపెట్టడం మా ప్రభుత్వ వైఖరి కాదు అని ప్రకటించగలిగితే … ఆ ప్రకటన చూసి మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కూడా చొరవ చూపి ముందుకు వచ్చే అవకాశం ఉంది కనుకే … ఓ స్పష్టమైన ప్రజా ప్రయోజనం ఆశించే తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మేధావుల రచయితల సామాజిక చింతనాపరుల సంతకాలు సేకరిస్తున్నాం అని చెప్పి కన్విన్స్ చేశాం. చాలా వరకూ కన్విన్స్ అయ్యే సంతకాలు చేశారు.
ఇంకొంత మంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాలి కదా అని బాధ్యతాయుతంగానే ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మేం చెప్పిన సమాధానం ..కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ప్రకటించింది. అలాగే 2026 మార్చ్ 31 నాటికి ఆఖరి మావోయిస్టును చంపేస్తాం అని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి ప్రకటించడం చూసిన తర్వాత కేంద్రంతో ఆలోచింపచేయడానికి పౌరసమాజం నుంచీ ఒత్తిడి తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అందులో భాగంగానే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రకటనలు చేస్తే కనీసంగా ఆలోచనలో పడి విధానాన్ని మార్చుకోడానికి సమాయత్తమౌతుందనే ఆశతోనే ఈ కార్యక్రమం చేపట్టాం అని చెప్పాం.
కొంత మేరకు కన్విన్స్ అయ్యారు కూడా.
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించే అవకాశం ఉందా? అనే ప్రశ్న కూడా వచ్చింది కొందరి నుంచీ. అదీ నిజమే … దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ జీఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆర్ధిక స్వావలంబన నాశనం చేయడంతో పాటు … రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీల చేతుల్లో ఉన్నా నయానో భయానో లొంగదీసుకోవడం కాన్షస్ గా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా కొనేయడం జరుగుతోంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వ్యతిరేకంగా స్పందిస్తాయా లేదా అనేది తెలుసుకోడానికి కూడా మా సంతకాల సేకరణ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాం అని చెప్పాం.
2. కాల్పుల విరమణ మీరు ఎందుకు కోరుకున్నారు?
కాల్పుల విరమణ మీరు ఎందుకు కోరుతున్నారు అని అడుగుతున్నారుగానీ … కాల్పుల విరమణ కోరడం అనేది రాజ్యాంగపరిరక్షణలో భాగంగా చూస్తున్నాం మేం. మావోయిస్టులపైనే కాదు ఎవరి మీదైనా కాల్పులు జరపాలి అని రాజ్యాంగం చెప్పలేదు కదా. మరి నేరుగా ఫలానా తేదీలోగా నక్సల్ ముక్త్ భారత్ సాధిస్తాం. చంపేసి తీరుతాం. సల్వాజుడుం లాంటి ప్రైవేటు సైన్యాల సాయం ఉండి ఉంటే ఇరవై ఏళ్ల క్రితమే చంపేసి కథ ముగించేవాళ్లం అని నేరుగా హోం మంత్రి అమిత్ షా అనేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? రాజ్యాంగ ఉల్లంఘనగానే చూడాల్సి వస్తుంది. అలాగే ఇది ప్రజల మీద కార్పోరేట్ల తరపున ప్రభుత్వం చేస్తున్న యుద్దంగానే చూడాల్సి వస్తుంది. కాల్పుల విరమణ కోరడం అనేది పౌరసమాజం బాధ్యత. రాజ్యాంగాన్ని నమ్మని వాళ్లతో రాజ్యాంగపరమైన చర్యలేమిటి? ముల్లును ముల్లుతోనే తీయాలి అనే వాదన ముందుకు తెచ్చేవారు అనేకులు గతంలోనూ అంటే యాభై ఏళ్ల క్రితమూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. ఈ వాదన లో డొల్లతనం ఉంది. అంటే నువ్వు ప్రత్యేకంగా చూపిస్తున్న ఆదర్శం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి సమాధానం చెప్పే స్థితిలో ఈ ముల్లును ముల్లుతో తీయాలి అనే వాళ్లు ఉండరు. వీళ్లే సమాజాన్ని కలుషితం చేస్తున్న వారు అన్ని కోణాల్లోనూ .. కనుక ప్రభుత్వాలు ఏ రాజ్యాంగాన్నైతే ప్రమాణంగా తీసుకుని పాలన సాగిస్తున్నామని చెప్తున్నాయో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయో లేదో తెల్సుకోవడం కోసమే కాల్పుల విరమణ కోరుతున్నాం. ఇది విప్లవ పూర్వ విద్యార్ధులుగా మేం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాలి.
శాంతి చర్చల మీద మా వేదిక అవగాహన ఏమిటీ అంటే … సాయుధ పోరాట మార్గం ఎంచుకున్న వారు శాంతి చర్చల ప్రస్తావన చేయడం ఏమిటి? అని చాలా మంది అనేస్తున్నారుగానీ చర్చలు కూడా పోరాటరూపమే. మావోయిస్టు పార్టీ చేస్తున్న సాయుధ పోరాటం ప్రభుత్వ హింసను అడ్డుకోడానికే అని అర్ధం చేసుకోవాలి. అలాగే సమాజంలో సుస్థిరమైన నిజమైన శాంతిని కోరుకునేది మావోయిస్ట్ పార్టీ. అయితే జరుగుబాటు కోసం తిరగబడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తిరుగుబాటుదారులను చంపేస్తాం అంటే జరుగుబాటు లేని స్థితిని కాపాడుకుంటాం అని చెప్పడమే. ఇలా ప్రభుత్వాలు చెప్పినంత కాలం పోరాటాలు సాగుతూనే ఉంటాయి. పోరాటం చేస్తూనే ప్రభుత్వాలతో చర్చల ప్రతిపాదన కూడా చేయవచ్చు. తప్పేంలేదు. …. చర్చల కోసం ఆయుధాలు వదిలేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రజా సమస్యలను చర్చకు తీసుకురావడానికి పరిష్కార మార్గం కనుగొనడానికీ మావోయిస్టు పార్టీ ఎప్పుడూ సిద్దంగానే ఉండవచ్చు. సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేకపోవడం వల్లే ప్రభుత్వాలు శాంతిచర్చలకు ముందుకు రాలేని స్తితిలో ఆగిపోతూ ఉండవచ్చు. చంపేయడమే ఏకైక మార్గంగా మాట్లాడుతూ ఉండవచ్చు. అలాగే విషయాన్ని తలక్రిందులుగా మార్చి మావోయిస్టులు హింసావాదులు అనే నేరేటివ్ ను ప్రపంచం ముందుంచడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మావోయిస్టు పార్టీ శాంతి చర్చల ప్రస్తావన చేయడమే తప్పు అనుకోనవసరం లేదు. అదేదో పిరికిచర్య అని కూడా అనుకోనక్కరలేదు. మాట్లాడడానికి ఊడా ధైర్యం కావాలి. పోరాడడానికీ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్దపడిన వాళ్లు కనుకే మాట్లాడుకుందాం రాగలరా అని పిల్చారు. ప్రజల పట్ల చిత్తశుద్ది లేదు కనుకే ప్రభుత్వం ముఖం చాటేసి మాటల్లేవ్ అనేసింది.
3. శాంతి చర్చల మీద మీ వేదిక అవగాహన ఏమిటి?
కాల్పుల విరమణ అనేది పౌరసమాజం నుంచీ ఓ డిమాండ్ గా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మావోయిస్ట్ పార్టీ పైనా ఆదివాసీలపైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్దం వెనుక ఆర్ధిక సంస్కరణలు ఉన్నాయి. అభివృద్ది అంటే పెట్టుబళ్లకు స్వాగతం పలకడం పరిశ్రమలకు భూములు అప్పగించడం అనే అర్ధంలో స్థిరమైపోయిన సందర్భంగా ప్రభుత్వాలు కార్పోరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజన్సీలుగా మారిపోయాయి. పాలన అంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ వాటిని కార్పోరేట్లకు ధారాదత్తం చేయడంగా మారిపోయింది. ఈ క్రమంలో తాము ఉంటున్న భూమి నుంచీ తాము బతుకుతున్న చోటు నుంచీ బయటకు పోవడానికి ఎవరైనా అభ్యంతరం చెపితే వారు అభివృద్ది నిరోధకులు అనే ముద్రకు గురై సమాజ అభివృద్ది కోసం చంపేయదగ్గ వారిగా మారిపోవచ్చు. ఆర్ధిక సరళీకరణల కారణంగా మనిషి సరుకుగా మారిపోయి కన్జూమరిజం అనే సాలెగూడులో మనిషి చిక్కుకుపోయి పిచ్చివాడైపోతున్నాడు సైకియాట్రిక్ డిజార్డర్స్ పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు పెరిగిపోవడానికి కూడా ఇదే కారణం. హత్యా ప్రవృత్తి పెరిగిపోతోంది. హత్యలూ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ హింసలే … కేవలం మావోయిస్ట్ పార్టీ మీద కాల్పులు మాత్రమే హింస కాదు. ఇవన్నీ లిబరలైజ్డ్ ఎకానమీ వల్ల జీవితాల్లోకి వచ్చేసిన హింసలే. మావోయిస్టు పార్టీ మీద జరుపుతున్న హింస నేరుగా రాజ్యం తనను నడిపిస్తున్న మార్కెట్ శక్తుల కోసం చేస్తున్న హింసగా చూస్తే కాల్పుల విరమణ అనే నినాదం ఆర్ధిక సరళీకరణ జీవధాతువుగా తయారైన ప్రభుత్వాలు చేస్తున్న ఇతర హింసలు కూడా ఖండించాల్సి ఉంటుంది. అలాగే సమాజంలో పెరుగుతున్న హింసాప్రవృత్తి ని వద్దు అనుకున్న వారెవరైనా సరే కాల్పుల విరమణ నినాదాన్ని కూడా అందుకోకతప్పదు.
4. కాల్పుల విరమణపట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల్లో తేడా కనిపిస్తోంది కదా ? వాటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు?
కాల్పుల విరమణ చర్చలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిలో తేడా కనిపిస్తున్న మాట వాస్తవమే. కేంద్రం అసలు చర్చలకే తావులేదు. ఆఖరి మావోయిస్టును చంపడమే మా లక్ష్యం ధ్యేయం అని ప్రకటించేసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వాధినేత దీనికి భిన్నంగా స్పందించారు. తను కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా అలా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కమ్యునిస్ట్ పార్టీలు తప్ప ఏ ఇతర పార్టీ అంటే జనసేన, టిడిపి, వైఎస్ఆర్సీసీ ఈ మూడు పార్టీలూ ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్దంగా లేవు కదా … అలా మాట్లాడాల్సి వస్తే అనే ఊహే భయం గొలిపేదిగా ఉన్నదని కూడా అవి భావిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విప్లవ పూర్వ విద్యార్ధి వేదిక విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణ ప్రకటన చేస్తే తన ప్రత్యేకతను చాటుకున్నట్టు అవుతుంది. దానికి సిద్దపడుతుందా? ఎదురు చూద్దాం .