జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి.

“మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా.

పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు.

చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు.

ఆ రూపాయి వాడికి అపురూపం.

కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి.

వాని తంటాలు చూసిన జేజి “పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా గానీ” అని ఆకువక్కతిత్తి లోనుంచి రూోపాయబందా సూపిచ్చింది గూడా. అయినా కంబగిరికి మనసొప్పలేదు.
అందుకే “పీనాసి బంకోడు!” అని ఇంటి పక్కన అత్తలందరూ వాణ్ణి బుగ్గలుపిండి ముద్దులు పెట్టుకుంటారు. వాళ్ళ చేతలకున్న వంటాముదం మొత్తం మొగానికి పులుముతారు. వాళ్ళమ్మ “ఊరుకొండే వోన్ని ఎడిపించగాకండి! అని మురిపెంగా కసురుకుంటే “వాయబ్బ మా ముద్దులకే అరిగిపోయేట్టుంటే వగలాతని… కాపురం జేస్తే! ఇంగ కరిగేపోతాడమ్మా! నీ కొడుకు! అని బుగ్గలు మరింత నొక్కుతారు. కంబగిరికి ఏమి అర్ధమౌతుందో ఏమోగానీ ముడుచుకుపోయి సిగ్గుపడతాడు. యీ అత్తలను తప్పించుకోడానికి స్కూలు నుంచి వచ్చేప్పుడు బజారులో నుంచి రాడు. అడ్డదావలే ఎతుక్కుంటాడు.

జేబులో రూపాయి బందా గుర్తొచ్చి మళ్లీ ఒకసారి తడుముకున్నాడు. గట్టిగా తగిలింది. పానం కుదటపడింది. బట్ట బ్యాగు మెడకు అడ్డంగా తగిలించుకుని ఒకకాలుగాలిలో పైకెత్తి, ఒకకాలు వాలుగా కిందికి దించి గెంతుతూ పోతున్నాడు . ఆరోజు స్కూలులో సారు నేర్పించిన పాట పాడుతున్నాడు.

“దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ
దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ్”

ఆ పాట యీ రోజు వాళ్ళ జేజికి ఇనిపించాలని వాని ఆత్రం.

“మా హరి సారు మంచి మంచి కతలు నేర్పిస్తాడు జేజీ! అని ఆమెకు కతలు చెప్తాడు. జేజి కాడ పాటలు నేర్చుకోని పోయి సారుకు ఇనిపిస్తాడు. సారు ఇన్నాక బాగుంటే ఆరోజు ప్రార్ధనలో కంబగిరితో ఆ పాట పాడిపిస్తాడు. సారు అంత మందిలో మెచ్చుకుంటాడు. ఇంగ ఆ దినమంతా స్కూలులో కంబగిరిదే హవా. ఏ మాటకా మాట చెప్పుకోవాలి గానీ వాడి గొంతు బాగుంటుంది. పాట సక్కాగ వొదుగుతుంది.

“దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ
దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ”

స్కూలునుంచి వాళ్ళ ఇల్లు రెండు మైళ్ళదూరం. తోటల మద్దెన, అడ్డదావనబడి పోతే ఒకమైలు. పురుగు పుట్రా వుంటాయని అమ్మ ఆ దావన రావొద్దంటుంది. కానీ కంబగిరికి అదేయిష్టం. ఎతుకుతూ పోతే కలికాయలో, బలిసపండులో, ఆకుల మధ్య దాంకున్న సీతారాం పండో, ఏమీ దొరక్కపోతే దేవదారి పండ్లో దొరుకుతాయి. రంగు రంగుల కొత్త కొత్త పిట్టలు ఎదురొస్తాయి. తొండ బిక్కులు, నలికిరి బండలు , ముంగిసలు, కుందేళ్లు కండ్లముందు ఆడతాయి. “అట్లాంటివి కనిపిచ్చినప్పుడు భయపడొద్దు. నీ దిక్కుకు వస్తాంటే చప్పుడు చెయ్. చప్పట్లు కొట్టి యె హే… హే…అని బొబ్బరిచ్చి అరుచు అవే బెదురుకోని పరవార్తాయ్.”” జేజినాయన నేర్పిచ్చిన ధైర్యం వాడికి కొండంత అండ.

“దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ
దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ్”

పాట దొర్లుతూవుంది. ఎగుర్లు ఎగురుతూ ఆనందంగా… అటునడకా… ఇటుపరుగూ కానట్టుగా …మధ్యలో … పాట దొర్లుతూనే వుంది.

దొర్లు… దొర్లు…

ఠాప్…. రాయి గట్టిగా కొట్టుకుంది…. ఎడమకాలి బొటనవేలు బొజ్జ పగిలింది. చారెడు రక్తం బొళబొళామని కారింది. దోసెడు కన్నీళ్లు జల జలా దుంకినాయి. అంత యేడుపులోనూ ముందు జేబు తడుముకున్నాడు. చేతికి గట్టిగా తగల్లేదు. టప్ మని ఏడుపాగిపోయింది. జోబిని కశా బిసా నలిపినాడు. లేదు…..

గుండెకాయ జారి కడుపులో కొచ్చింది.
కడుపులోగూడుకట్టిన దుఃఖం గొంతులోకొచ్చింది.
అప్పుడు నిజంగా యేడుపు.

ఓ…ఓ… రాగం తీస్తూ కూలబడి పోయాడు.

రెండే రెండు నిముషాలు…అంతే. అంత దుఖంలోనూ తలకాయ చురుగ్గా పారింది.
కింద ప‌డ్డ‌ప్పుడు ఏం జ‌రిగింది
…. …….. …… ……

కొంచేపు గాల్లోఉన్నాడు. అప్పుడే జోబిలో బిళ్ళ కూడా ఎగిరింది. కాలు కింద ఆనేటప్పటికి నొప్పి తెలిసొచ్చింది. గాలిలో నిలిచిన రూపాయి మీద ధ్యాస తప్పింది……

ఆ….ఆ…. దృశ్యం ముందుకూ… వెనక్కూ…కదిలింది…
“దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ్”
ఠాప్….. టంగ్…. రూపాయ బందా…

బండమీద పడింది… ఎడమపక్కకు …దొర్లింది …

దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ్”

లేచి వెతికాడు. ఎండిన ఆకుల కింద పెద్ద కట్టె పుల్ల తో గెలికి చూసినాడు. దొరకలేదు. ఆకులను కుప్పగా ఒక పక్కకు జౌరి ఎతికినాడు. అయినా కనపడలేదు. వాడు వేసుకున్న బట్టలనిండా మట్టికొట్టుకుంది….

మళ్లీ మళ్లీ. గుర్తుచేసుకున్నాడు.

“దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్ల కుంటే దోసకాయ్”

యీ సారి నిజంగానే కళ్ళముందు ఏదో దొర్లింది. నల్లటిది…రాయిలాంటిది …గుండ్రంగా.
అర్ధగంటపాటు మొత్తం యెతికినాడు.

లాభం లేకపోయింది. దొరకని రూపాయితో పాటు ఇప్పుడు నెత్తురు కారుతున్న చోటా నొప్పి తగులుతున్నది.
ఉన్నచోటనే కూలబడ్డాడు. ఎండాకాలం తోటల్లో కూడా పనుల్లేవు. గంట గడిచినా ఎవరూ ఆ పక్క రాలేదు. “రూపాయి బందా చెట్టు పక్కనున్న బొక్కలోకి పడిపోయి వుంటే” ఆలోచన తట్టింది. ఆ బొక్కలోకి చేయి పెడదామంటే పాముపుట్టనేమోనని బయ్యమ్. కట్టె బొక్కలోకి జొనిపి చూశాడు. జానెడు కూడా దూరలేదు. నిరాశగా కూర్చున్నాడు. అప్పుడు చూసుకున్నాడు మోకాలు చిప్ప దోక్క పోయింది. మట్టి, ఇసక చర్మంలో గుచ్చుకొని మంట పెడుతున్నది. అక్కడక్కడా బొట్లు బొట్లు నెత్తురు వూరింది.

“దెబ్బ తలిగిందా!” మాట వినిపించింది. మనిషి కనపడలేదు. చుట్టూ చూసాడు. ఎవరూ లేరు. చేతిపైన ఎంగిలి వూసి

మోకాలు చిప్ప పైన మెత్తగా అద్దినాడు.
“అయ్య! మేము గుడ్క మీ లెక్కనే!
దెబ్బతగిలితే నాక్కుంటాం.
ఎంగిలి తగిలి పుండు మాడిపోతుంది” మళ్లీ చుట్టుపక్కల చూసినాడు.

చెట్టు తొర్రలోనుంచి… మూతి బయటపెట్టి తొంగి చూస్తున్నది.

ముంగిసలెక్కుంది… ముంగిసకాదు. కొంచెం ముందుకు జరిగింది. మూతి పండికొక్కు లెక్కనే వుంది. కానీ తోక వేరేగా వుంది. ఇంతకుముందు రాయిలెక్క దొర్లింది అదే. కళ్ళు యింత చేసుకొని చూసాడు. అది గబుక్కున నేల మీదకి దుంకింది. వొళ్ళంతా గట్టి పొలుసులు. మనిషి చేతికి,కాలికి వున్న గోళ్లంతటి గట్టి పెద్ద పొలుసులు. రెండు మూరలంత పొడుగాటి వొళ్ళు. ముద్దుగావున్న కొశ్ళటి మూతి. గునగున నడుస్తున్నది.

మొట్టి నేలకి ఆనించింది.
ధ్యాస పెట్టి మూచూసింది.

దాని కళ్ళలో ప్రమాదమేదో గోచరించింది. నేలను వాసన చూస్తూదగ్గరికొచ్చింది. రెండు జంపుల దూరంలో ఆగి కంబగిరి మోకాలు పక్కజూసింది.

“అయ్యయ్యో నెత్తురూ…. వుండు” అని చెంగున చెట్టు వెనక్కు వురికింది. గుప్పెడు ఆకులు నోట కరిచి తెచ్చింది.

బండపై పోసింది.

“యిది నేలజసిరి దీన్ని రాయితో దంచి దెబ్బ తలిగిన తావున పెట్టు. ” అంది
కంబగిరి రాయితో దంచుతుంటే అక్కడే కూర్చుంది దిగులుగా…
వీడికి అయిన దెబ్బకు దానికెందుకు నొప్పి తగిలిందో!

“రెండు చుక్కలు రసం కూడా పిండు గుండోడా!

యేగిరం పుండు మానుకొస్తుంది”

ఆ పిలుపు కొత్తగా తోచింది కంబగిరికి.

ఆకు పసురు పిండుతూ కంబగిరి ఆడిగినాడు

“నువ్వు ఎవరు”

” అలుగు”

“నీ పేరు” యీ ప్రశ్నతో దానికీ నవ్వొచ్చింది.

“ఆవును నా పేరే అలుగు. మేము ఎవ్వరి మీదా అలగం” అంటూ ఎగిరి తోక మూతికి దగ్గరగా తెచ్చి బుంగమూతి పెట్టింది. కంబగిరి గిన గిన నవ్వాడు.

“నువ్వు ఒక్కదానివే ఉన్నావ్! మీ వాళ్ళు” అన్నాడు.

“మేము ఒంటరిగాళ్లం. కొంత కాలం మాత్రమే జతగా వుంటాం. ఆ తరువాత ఎవరి దారి వాళ్లదే.” సంబరంగా చెప్పింది.
“ఎక్కడుంటారు మీరు”

“ఇక్కడే యీ బొరియల్లో!” అని చెట్టు కింద చూపించింది.

నొప్పి తగ్గింది కదా!” అవునన్న జవాబు ఆశిస్తూ అడిగింది.

అది యిచ్చిన నమ్మకమో, నిజంగా మందు పనిచేసిందో తెలియదు గానీ నొప్పి కొంచెం తగ్గింది. అయినా రూపాయి కనపడలేదు కాబట్టి నొప్పి తగ్గినట్టు …ఒప్పుకోబుద్ధి కాలేదు.

“ఎందుకట్లా కుండబోకి మొహం పెట్టుకున్నావ్?

ఇంకా తగ్గలేదా నొప్పి!

నిజజ్జంగా… నామీదొట్టు…”

ఒట్టు పెట్టే సరికి కంబగిరికి నోట అబద్ధం రాలేదు.

ఏడుపు మొకంతో చెప్పేసాడు

“కిందపడినప్పుడు నా రూపాయి దొర్లిపోయింది”

“రూపాయంటే” ఉత్సుకత తో అడిగింది.

“రూపాయే!” దానికి అర్ధం కాక తోకతో తల గోక్కుంది.

“సిద్దోటం కర్ఫుజా పండా!”

కాదన్నట్టు తలూపాడు

“అలంపూర్ బేనీషానా” “కాదు”

“ప్యాపలి సీతాఫలం” “కాదు”

హిందూపురం సీనాకాయ”

“కాదూ…కాదూ! “గట్టిగా అరిచాడు.

“తియ్యగా …తినేది కానప్పుడు ఏంటికి అంత ఏడ్బ్చేది!” అమాయకంగా అడిగింది
“నీకు తెలియదు. అంతకంటే గొప్పది” చేయి పైకెత్తి అది ఎంతగొప్పదో చెప్ప యత్నించాడు.

“” యె .హే.హే… నీ బడాయిగూల!
తిండికంటే అవసరమైనది. నిద్రకంటే ముఖ్యమైనది, ఆశకంటే చెడ్డనైనది, భయం కంటే మృత్యువైనది
ప్రపంచకంలో ఇంకొకటి లేదు.” ఇది మా తాత చెప్పిన సత్యం.

నీ రూపాయి అందులో లేదు అంటే అది ఎంత గొప్పదైనా పనికిమాలిందే” అని తీర్పు చెప్పి ముందున్న రెండు కాళ్ళు ఎత్తి బండనెక్కి నిలబడింది. దాని మొహంలో తత్వవేత్త చిరునవ్వు కనిపించింది.

కంబగిరికి అది చెప్పింది ఏమీ పట్టలేదు.

“నా రూపాయి బందా!” మళ్లీ ఏడుపెత్తుకున్నాడు

“అది ఎట్లుంటుందో చెప్పి ఏడువ్! ఇద్దరం ఎతుకుదాం!” ప్రేమగా కసిరింది
“తళ తళ వెలుగుతుంది”

“సూర్యుడా” “కాదు”

“తెల్లగా మెరుస్తుంది”

“నక్షత్రమా” “కాదు”

“గుండ్రంగా వుంటుంది”

“చందమామా”… “కాదు”

“సూర్యుడి కంటే పరోపకారి, నక్షత్రాల కంటే శక్తిమంతుడు, చంద్రుని మించిన అందగాడు ఈ విశ్వంలో లేరు. కాబట్టి నీ రూపాయి పనికిరానిది” మళ్లీ తీర్పు చెప్పింది. ఈ సారి కాలుమీద కాలు వేసుకొని జ్ఞానిలా నవ్వింది. దాని తలవెనుక కాంతివలయం కనిపిస్తున్నది.

యిప్పుడు అది మాట్లాడిన మూడు మాటల్లో ఒక్క ముక్కా అర్ధంకాని కంబగిరికి విసుగొచ్చింది.
దూరంగా పగిలిన కుండపెంకు తెచ్చి దాని మూతిదగ్గర పెట్టి

“ఇంతవుంటుంది. మెరుస్తుంది.” అన్నాడు.

అలుగు పడీ పడీ నవ్వింది.

“కుండపెంకుల కోసం ఏడుపా!” మళ్లీ పొర్లి పొర్లి నవ్వింది.

కంబగిరి మూతి ముడుచుకున్నాడు.

“సరే పద ఇద్దరం వెతుకుదాం! “అని లేచింది.

“ఇక్కడంతా నేను యెతికినాను దొరకలేదు.
అది దొర్లిపోయింది. “

“ఎక్కడికి”

“ఆ బొక్కల్లోకి”

ఓస్ ! ఆ మాటముందే చెప్పొచ్చు కదా! మేము ఉండేది అక్కడనే కదా! వస్తానుండు” అని బుర్రుమని చెట్టుపక్కన
ఒక బొరియలోకి దూరింది.

రెండు నిమిషాల తరువాత తల బైటికి పెట్టి “ఇందులో లేదు. నీ కుండపెంకు. కళ్ళు ఎగరేసి నవ్వింది. ఆ పక్కన చూస్తానుండు” అంటూ మళ్లీ తుర్రుమన్నది. మూడు నిముషాల తరువాత “యిహేనా” మాట వినిపించింది.

ఏం చెప్పిందో అర్ధం కాలేదు.

దాని నోట్లో తళ…తళా మెరుస్తున్న బిళ్ళ. కంబగిరి మొహం కూడా ఆ రూపాయి బిళ్ళలాగానే తళ తళ లాడింది. రూపాయి బిళ్ళతో సహా దాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు.

“జాగ్రత్త గుచ్చుకుంటాయ్ “గట్టిగా కీచుమని అరిచింది.

కంబగిరి చేతులోని రూపాయి బిళ్ళను దగ్గరగా చూసి మూతి మీద తోకేసుకుంది. ఆలోచనగా…
“ఓ… గుర్తొచ్చింది. వీటికోసమేనా మనుషులు మమ్ములను పట్టుకొని అమ్ముతుంటారు.”

“అమ్ముకుంటారా!” కంబగిరి ఆశ్చర్యపోయాడు.

“అవును. మా తల నుంచి తోక వరకు వున్న యీ పొలుసులు ఎంత గట్టిగా ఉంటాయంటే, మేము ముడుచుకుపోయి ఉన్నప్పుడు తుపాకీతో కాల్చినా గుండు లోపలికి దిగదు.

అంత దృఢమైనవి. వాటి కోసం మమ్ములను చంపుతారు.”

కంబగిరి దాని పొలుసుల్ని నెమ్మదిగా నిమురుతూ చూసినాడు. ఒకేచోట పొలుసులు ఊడి పొయినాయి. లోపలిచర్మం ఎర్రగా కనిపిస్తున్నది. “ఏమైంది”

” యీ వూరి వాళ్ళు రోజూ వలలు వేస్తున్నారు. మొన్న ఒకరోజు నా ఎనక కాలు వలలో చిక్కుకుంది.

తప్పించుకోడానికి చూస్తుంటే ఇద్దురు ముగ్గురు కొస్సేటి బండరాళ్లతో కొట్టినారు.”

“మేము చీమలను, చెద పురుగుల్ని తిని బతుకుతాం. ఎవ్వరికీ ఏ హానీ చేయం.ఆయినా మనుషులు మమ్ములను హింసిస్తారు ఎందుకు?” అది ఫిర్యాదు కాదు, అట్లాగని తనతో తానూ మాట్లాడుకోలేదు…

కంబగిరికి పూర్తిగా అర్ధం కాలేదుగానీ తన వూరివాళ్ల వల్ల వాటికేదో ప్రమాదం వున్నట్టు తెలుసుకున్నాడు.

“నెల రోజులనుంచీ రోజుకొకర్ని పట్టుకపోయి మీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. కడాకు ఇక్కడ మేము నలుగురమే మిగిలినాం.” విషాదంగా మొహం కిందికి వేలాడేసింది.

“నేను ఇక్కడ వున్నట్టు మీ వాళ్లకు చెప్పొద్దూ!” దీనంగా బతిమాలుకుంది

పాపం కంబగిరికీ ఎంతో దుఃఖమొచ్చింది. తనకు దెబ్బతగిలినప్పటికంటే గట్టిగా ఏడ్చినాడు.వాడి లేతమనసు దుఃఖపడింది.

అలుగుకు జాలి వేసింది. రెండుకాళ్ల మీద నిలబడి చెక్కిలిమీద జారిన నీటిని ముందు కాళ్లతో మెత్తగా తుడిచింది. మట్టిమరకలు వాడి బుగ్గలపై మీసాల వలె కనిపించాయి. హిహి… హి…నీకు మీసాలు అని నవ్వించింది. అయినా కంబగిరి నవ్వలేదు.

“నాకు తెలుసు నువ్వు చెప్పవులే…నువ్వు నా న్యాస్తుడు కదా!” ఉరడించింది. చిన్నగాచీకటిపడుతున్నది. కంబగిరికి ఇంటికి పోవాలన్న విషయం గుర్తుకొచ్చింది.

” ఇంగ నేను ఇంటికి పోతాన్నా!” దిగులుగా అన్నాడు.

నువ్వు ఎప్పుడైనా కలసాలనుకుంటే పొద్దన్నే ఈ పొలుసు ఒకటి బండమీద పెట్టిపో నేను మాపట్యాలకి యీ సగాలనే తిరగతావుంటాగానిష‌ అని దోసెడు పొలుసులు బండ మీద తెచ్చిపోసింది. అవన్నీ బ్యాగు లో పోసుకొని కంబగిరి ఇంటికి పోయినాడు. అమ్మకు, తాతకు దెబ్బలు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

రాత్రికి జేజితోనే బువ్వ తినిపిచ్చుకున్నాడు.

పండుకున్నప్పుడు బేజికి రహస్యం చెప్పినాడు. వాడు యేమి చెప్పినా నిజమే అయివుంటుందని నమ్ముతుంది ఆమె. “అవులే(అవునులే) మొన్నటి దంక మన చేనికాడ గుట్టల్లో కనిపిస్తాండె అవి. ఇప్పుడు యాడబోయినయో ఏమో?” బేజికి ఇంతింత కళ్ళు పెట్టుకోని అబ్బురంగా పుచ్చకాయ పాట ఇనిపిచ్చినాడు.

“పుచ్చకాయ అంటే కలింగరి పండు. అట్లనే దోసకాయ అంటే మన దోసకాయ కాదు పెద్ద బుడం కాయ. మానూరికి దూరంగా ఆ పక్క వూళ్ళల్లో పుచ్చకాయ, దోసకాయ అంటారంట తెలిసిందా!”

“నాక్యాడ తెలుస్తాయ్! నేనేమన్న ఇస్కూలు పోయింటినా! మావూరి కొట్టం బళ్ళో అచ్చరాల కాడికి దిద్దుకున్నా అంతే…పెండ్లి జేసినారు.” మనమడి తెలివికి మురిసిపోయి ముద్దుపెట్టి కణతలకు మెటికలిరిచి దిష్టి తిసింది.

“ఏందీ మీఅద్దరాత్రి యవ్వారాలు పండుకోకుండా”

…. అమ్మ కసురుకుంది

“కఅ కమ్మ కకు కచె కప్పో కద్దు!” కంబగిరి బేజితో అన్నాడు

“ఏమ్ మాట్లాడుకుంటన్నారో మాకు గూడ అర్థమైతాయిలేబ్బా!” నవ్వింది అమ్మ.
చీకట్లో ఇద్దరూ గుసగుసలు పోతున్నారు

“రేపు మీ సారుకు జెప్పి ఏం చెయ్యాల్నో అడుగు. మీ హరి సారు మంచోడే గదా! మంచోళ్ళకు దేవుడుసాయం చేస్తాడులే! అని వాడి దెబ్బలకు పసుపు వొత్తి పండుకోబెట్టింది.

దుప్పట్లో దూరుకున్న బేజీ మనవడికి ఒకటే తుల్లుబాటు. స్కూలు లో సారుకు అలుగు సంగతి చెప్పేంతవరకు ఇంగ వాడికి నిద్రపట్టదు. సారు ఏమన్నాడో తెలుసుకునేంత వరకు మూసిల్దానికి కూడా.

0 0 0

స్కూలులో సారు మొదట నమ్మలేదు. బ్యాగులోవున్న పొలుసుల కుప్పచూసినాక నమ్మకతప్పలేదు. “మనుషులకు కాక కష్టాలు మాన్లకొస్తాయా? అని మా అమ్మ అనేది. యిపుడు చూస్తుంటే మాన్లకే కాదు జంతువులకూ కష్టాలొస్తున్నాయ్? అదీ మనుషుల వల్లనే! ఏదోఒకటి చేయాలి” అని మొహం రుద్దుకున్నాడు. ఆయన నోటినుంచి వచ్చే మాట కోసం కంబగిరి హనుమంతుడి లాగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు . ఆయన హఠాత్తుగా అడిగాడు

“అలుగు మనం పిలిస్తే బెటికొస్తుందా!
కంబగిరి నమ్మకంగా “వస్తుంది సార్” అన్నాడు.

“ఒక పని చేద్దామా! అటవీ దినోత్సవం నాడు వూర్లో స్కూలు పిల్లలతో ఊరేగింపు చేద్దాం. మన ఫారెస్ట్ ఆఫీసర్ సార్ను పిలుద్దాం.” నిర్ణయం అయిపోయింది.
హెడ్మాస్టరు సారు అంగీకారం కూడా వచ్చింది.
తీరా ఆ రోజు రానే వచ్చింది. అట్ట ముక్కలతో పిల్లలు అడవి జంతువుల బొమ్మలు గీశారు. ‘అడవి జంతువులను కాపాడండి’ ‘అలుగులను అమ్మవద్దు’.అని అట్ట ముక్కలపైన రాసిచ్చినాడు డ్రాయింగ్ సారు. వాటిని పట్టుకొని పంచాయితీ ఆఫీసు దగ్గరికి ఊరేగింపుగా వచ్చినారు పిల్లలు. వూరంతా వూరేగింపు వెంట గుంపు అయ్యింది. టేబుల్ వేసి పంచాయితీ ఆఫీసు మైకు బైటపెట్టినారు.

హరి సారు లేచి మాట్లాడటం మొదులు పెట్టినాడు.

“ప్రజలారా! ఇది అలుగు. ఇంగ్లీషులో ‘పంగోలిన్’ అంటారు.ప్రపంచంలోనే ఎక్కువగా స్మగ్లింగ్ అవుతున్న జంతువుల్లో యీ చిన్న ప్రాణి మొదటి స్థానంలో వుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 జాతుల అలుగులు ఉన్నాయి. వీటి పొలుసుల్లో ఔషధ గుణాలున్నాయన్న నమ్మకంతో వాటిని చంపుతున్నారు. మన తాతలు తండ్రులు ఆడివిని ఇలా చెడు పనులకు ఏనాడూ వాడలేదు. మనం ఎందుకు ఇలా తయారవుతున్నామో ఆలోచించండి” యిప్పుడు ఫారెస్టు ఆఫీసర్గా రు మాట్లాడతారు.

” స్కూలు పిల్లలు చేసిన ఈ ప్రదర్శన నాకు చాలా సంతోషం కలిగించింది. వన్య ప్రాణుల పట్ల ఇంత స్నేహపూర్వకంగా ఉంటున్నపిల్లలకు నా అభినందనలు. యీ పిల్లలను, వాళ్ళ అపారమైన జంతు ప్రేమను చూశాక ఇప్పుడేనా మనసుకు ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది పిల్లలను “వన జీవి నేస్తం”గా చేద్దామనుకుంటున్నాను. వాళ్లకు చదువుకోడానికి స్కాలర్షిప్ తో పాటు వన్యప్రాణి సంరక్షణలో ప్రత్యేక శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది? నా ఆలోచన అమలు చేస్తాను.నా ఉపన్యాసం ముగించే ముందు మీకున్న ఒక అనుమానం తొలగించాలను కుంటున్నాను. సంప్రదాయంగా తయారు చేసే నాటు మందుల కోసం అలుగుల్ని పట్టి అమ్ముతున్నారని తెలిసింది. వాటి పొలుసులు క్యాన్సర్ను నయం చేస్తుందని వాళ్ళ నమ్మకం. ఇది కేవలం నమ్మకం మాత్రమే. వైద్య పరిశోధనలో బుజువు కాలేదు.. వన్య ప్రాణులను స్మగ్లింగ్,చంపడం చట్టరీత్యా నేరం. మనకు యే హానీ తలపెట్టని అడవి జంతువులను చంపటం క్రూరమైన పని. యిది మానుకోండి.”

అలా వూరివాళ్లకుకొన్ని కొత్త విషయాలు తెలిశాయి.

0 0 0

ఆరోజు ఆదివారం. వూరు వూరంతా అల్లుగుండు బస్సు స్టేజీ వైపుగా పరిగెత్తుతున్నారు. “మనూళ్ళో సామి
పుట్నాడంటలే రాండ్రిలే! పక్కీరమ్మవ్వ పొద్దట్నుంచీ ఆడనే పూజలు సేస్తావున్హంటా!”

“నేను పొద్దన ప్యాడకసువు ఎత్తేదానికి పోయినప్పుడు ఆయాలకే అవ్వ ఇంత పెద్ద కుంకం దిద్దుకోని దావెంబడి పోతావుండె. యాడికవ్వా! అని అడిగినా” ఆశ్చర్యపోయి వివరం చెప్తావుంది రంగమ్మ

“పిల్లా! రేత్రి కంబగిరిసామి నాకు కల్లోకొచ్చినాడూ!
పక్కీరమ్మా! నాకు ఆరుగురు తమ్ముళ్లు తిరుపతి ఎంకన్న, అగోబిలం నరసన్న, పెద్దఒబిలేసు, చిన్నఒబిలేసు, మద్దిలేటయ్య, కట్ట కడాన చిన్నోడు అలుగుగుండయ్య. యిప్పుడు మీ వూళ్ళో ఎలిసినాడు. కాపాడుకో… తల్లీ గుడికట్టొద్దు. గుండుకే పూజలు అన్నాడు” అంటూ చెంపలేసుకుంది.

“అలుగు పొద్దుగూకులూ ఆయవ్వ మనమడు కంబగిరి కాడనే వుంటాదంట ఎప్పుడూ” మాట్లాడుతూ పోతున్నారు జనం. వూరు వూరంతా గుండుకాడ జమైంది

రాతిగుండుకు బరక బరకగా అలుగు బొమ్మ చెక్కినట్టు వుంది. పక్కీరమ్మవ్వదానికి కుంకం పెట్టి పూజచేసి గుండుకాడనే కూర్చోనుంది.

ఆ బొమ్మ ఎప్పుడొచ్చింది అక్కడికి అందరిలో ప్రశ్న!
ఇట్లా దానంతకదే బొమ్మపుట్టడాన్ని స్వయంభువు అంటారని సాతాని అయ్య వారు అన్నాడు.

గుండుపక్కన కంబగిరి భుజం మీది అలుగు వుంది. గోధుమ వర్ణం లో శరీరం పైన గట్టి పొలుసులతో ఒక చిన్న ప్రాణి. అన్ని వైపులా తేరిపార జూసింది.కొంచెం భయం భయంగా కంబగిరి మొహం లోకి చూసింది. కంబగిరి తలమీద నిమిరి భయం లేదన్నట్టు నవ్వాడు. అది వాడికి దగ్గరగా జరిగి చొక్కాను అతుక్కుని వాడి స్పర్శలోని వెచ్చదనాన్ని పొందింది.అది ఒక భద్రత, ఒక విశ్వాసం. వాడి ధైర్యానికి జనాలు అందరూ నోళ్లు ఎల్ల బెట్టినారు. బేజికి గర్వంగా వుంది. అత్తలు అబ్బురపడినారు. వాళ్ళు ఒక్కరిలో ఒకరు కంబగిరి తమకు ఎంత దగ్గరో చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు.

కంబగిరి సైగతో అది గుండు పైకి యెక్కింది. కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసింది. “నా మీద దాడి చెయ్యకుండా ఇంతమంది మనుషులు నా ముందు నిలబడివుండగా చూడడం నా జన్మలో తొలిసారి.” అలుగు మాట్లాడటం తోజనం బిత్తరపోయారు.

“పెద్దలారా! మీరు మానవులు. మీది గొప్ప జన్మ. మేమంతా అల్ప జీవులం. మీరు తెలివిగలవారు. నా మాటలు దయయుంచి ఆలకించండి. మా కుదురుకు మూలం ఎర్రమల కంబగిరి సామి. అంటే వుడుము దేవుడు. ఆయన పెద్ద దేవేరి సద్దలక్కమ్మ మీ వూరి ఆడపడుచని మా తాత చెప్పగా గుర్తు. ఆ దేవుణ్ణి మీరు నరసింహస్వామి గా పూజిస్తారు. ఆ దేవుడి అంశ నా నేస్తుడు యీ కంబగిరి. నాకు సాయంచేయను మిమ్ముల ఇక్కడ కూడేసినాడు.” అంటూ కంబగిరి వైపు ప్రేమగా చూసింది.

“మేము అడవి జంతువులం. మా ప్రాణానికి ఆపద రానంతవరకు ఎవరికీ హానిచేయం. మీరు మమ్ములను చంపి తిన్నా ఆకలికి కడుపు నింపుకున్నారులే అనుకుంటాం. ఏనాడూ బాధపడం. కానీ మీది… అత్యాశ….దురాశ. తినను…కాదు దాచుకోడానికే మీకుసంపద కావాలి. రూపాయి పైన మీకు ఎంత వ్యామోహమో యీ చిన్నవాడు నాకు కళ్ళ ఎదురుగా చూపించాడు. పాముకు రెండు నాల్కలు అంటారు మీరు. నిజానికి మీదే రెండునాల్కల ధోరణి. ఒకవైపు పామును పూజిస్తారు. మరోవైపు వాటిని చంపి చర్మాలను అమ్ముకుంటారు. ఉడుముకు ‘కంబగిరిసామి’ తిరునాళ్ళు చేస్తారు. ఉడుములను, అలుగులను పట్టి అమ్ముకుంటారు. మంచి చెడు పదిమందికి చెప్పగల జ్ఞానులు. మీరే
తప్పటడుగులేస్తారు. ఒక్కసారి స్థిమితంగా మీలోపలికి మీరు తడిమి చూసుకోండి. మీరు బతకండి. మమ్ములనూ బతకనివ్వండి. దేవుళ్ళు ఎక్కడోవుండరు, యీ ప్రకృతిలోనే మీతోనే వుంటారు…

యీ మొక్కా, ఆ చెట్టు, ఆపాము, ఈ ఈగ, యీ కప్పా, మీరూ, నేనూ అన్నీ ఉంటేనే భూమి. దాని మనుగడ.
మేమూ, యీ మొక్కలూ అంతరించిపోయిన మరుక్షణం మీరూ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అది నీతి. ప్రకృతి రీతి.” అని వినయంగా చేతులు జోడించింది. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. ముసలోళ్లు అంతే భక్తిగా దండం పెట్టుకున్నారు.

అప్పటినుంచి ఆవూరిలో అలుగులు యథేచ్చగా తిరుగుతున్నాయి. ఆ వూరు క్రమంగా అలుగుల పెంపక కేంద్రమైంది. వూరి మొదట్లో పెద్ద గుండుపైన మీకు కనిపిస్తున్నదే అలుగుబొమ్మ. దాంతో ఆ ఊరిపేరు “అలుగు గుండు” అయ్యింది.అది క్రమంగా ‘అల్లుగుండు’ గా మారింది.

0 0 0

గమనిక: అలుగుల స్మగ్లింగ్ ఆఫ్రికా, ఆసియాఖండంలో ఎక్కువ. ఈ మధ్య సింగపూర్లో స్మగ్లింగ్ అవుతున్న 14 టన్నుల అలుగు పొలుసుల్ని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.270 కోట్లు. ఒక్కో అలుగును సుమారు రూ.20 వేలకు అమ్ముతారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 200 పులుల్ని, 1,000 రైనోలను స్మగ్లింగ్ చేస్తారని లెక్కలు తేలిస్తే, ఏడాదికి దేశాలు దాటే అలుగుల సంఖ్య 10,000. ప్రపంచవ్యాప్తంగా ఏటా 57 వేల అలుగులను చంపుతున్నారు.

యీ కథ కల్పితం. కర్నూలు జిల్లాలో ఒకటి, అనంతపురం జిల్లాలో ఒకటి అల్లు గుండ్లు వున్నాయి. వాటికీ యీ కథకు యే సంబంధమూ లేదు.

అలుగుల రక్షణకై

1.నేషనల్ జియోగ్రఫీ చానల్ వీడియో


2. జాకీచాన్ పిలుపు…

ఈ చిన్న వీడియో చూడండి.

Leave a Reply