(విప్లవ రచయిత, విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ మంజీర స్మృతి వ్యాసాలతో, కొన్ని తన రచనలతో విడుదలైన ‘వివా కామ్రేడ్ రవి’ పుస్తకం ముందుమాటలోని ఒక భాగం ఇది . ఈ పుస్తకం శనివారం ఆగస్టు 2 న హైదరాబాదులో విరసం ఆవిష్కరిస్తోంది )
రవి అమరుడయ్యి 19 నిండి 20వ యేడు నడుస్తున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలని మొదలుపెట్టిన. నిజానికి దీనికి మూలం 2025 ఫిబ్రవరిలో జరిగిన విరసం జనరల్ బాడీ మీటింగ్‌లో… నవలలు చాలా తక్కువగా వస్తున్నాయని, రాయాలని, వీలైనంత మంది నవలలు రాయాల్సి ఉన్నదనే చర్చ జరిగింది. అందులో భాగంగా నేనూ రాస్తానని చెప్పాను. అప్పటికి మంజీర గురించి రఫ్‌గా దాదాపు 160 పేజీలు రాసి వున్నాను. కానీ కేవలం నాకు తెలిసిన కోణంలోనే రవిని ఆవిష్కరించాను. దానిని అట్లాగే ప్రచురించడం కష్టం. ఒక నవలా రూపం తీసుకురావాలని అనుకున్నాను.
ఇంటికి వచ్చాక అదే పనిగా ఆలోచిస్తుంటే రవి గురించి నాకేమీ తెలియదని అర్థమైంది. తాండూరులో, సిటీలో తనేమి చేశాడు? క్యాడర్‌తో ఎట్లా వుండేవాడు? ఎట్లా ఆర్గనైజ్ చేశాడు? ఏపీసీలోనూ మా ఇద్దరి గురించి తప్ప బయట తన పని గురించి తెలియదు. గుంటూరులోనూ తను నడిపిన ఉద్యమం పైపైనే తెలుసు. తనను పూర్తిగా ఆవిష్కరించాలి అంటే రవిని గురించి తెలిసిన వాళ్లందరి దగ్గరికి పోవాలని అనుకున్నా. అలా కొందరితో మాట్లాడుతున్న క్రమంలో.. వాళ్ల చేతనే రవి గురించి రాయిస్తే అనే ఆలోచన వచ్చింది. వెంటనే అమలులో పెట్టిన. అలా మూడు నెలలకు ఈ పుస్తకం మన చేతుల్లోకి వస్తుంది.
కొందరు అడగ్గానే రాశారు. మరికొందరికి కాల్స్ చేసీచేసీ విసిగించి రాయించాను. కొందరు ఫోన్‌లో చెప్తే రికార్డు చేసుకుని రాశాను. ఏదేమైనా రాశారు. రవి గురించి చెప్తూ అంత మంచి అన్నను కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఇళ్లలో శుభాకార్యాలు జరిగినప్పుడు తప్పకుండా అన్నను తల్చుకుంటామని – ముఖ్యంగా తాండూరు ప్రాంత వాసులు – చెప్పారు. ఒక్కడు… ఇంత విస్తృతంగా పని చేయడం, ఇంత మందిని కదిలించడం ఎలా సాధ్యమైంది! తనుండగా తన గురించి నాకు తెలియదు. తెలిసి వుంటే ఇంకెంత అపురూపంగా చూసుకునే దాన్నో కదా!
రవి అమరుడైనాక షహీదా నుంచి నాకు ఒక్క ఉత్తరం కూడా రాలేదు. ఎందుకు రాయలేదు? అనే బాధ వుండింది. ఈ మధ్యనే మంజీర మీద తను రాసిన ఆర్టికల్ దొరికింది. మంజీర, తను ఏమీ మాట్లాడుకోకుండానే ఒకరికొకరు ఎంతలా అర్థమయ్యేవారో! అందుకు ఈ రెండు వాక్యాలు చాలు… ఏపీకి మేము వచ్చిన తర్వాత రవి నాతో ఓసారి ` ‘‘షహీదాలో చాలా మార్పు వచ్చింది’’ అన్నాడు. దానికి జవాబా అన్నట్టు షహీదా తన ఈ వ్యాసంలో ‘ప్రపంచానికి 9/11లాగ నాకూ 2/12/99 (సంతోష్, నల్లా ఆదిరెడ్డిల మరణం) తర్వాత ఇక ఏదీ ముందులాగా లేకుండా పోయింది – నా స్వభావమూ, దాని ఫలితమైన నీతో స్నేహం సహా, అంతకంటే ఇంకేమీ కాదు అని ఇప్పుడిక వివరించుకోడానికైనా ఏడీ తను?’ అని రాసింది. అంతగా కమ్యునికేషన్ వుండేది వారి మధ్య. ఇంకొక్క మాట… రవి గురించి కర్ణాకర్ణిక విన్నవాటి గురించి షహీదా ఈ వ్యాసంలో రాసింది. తను ప్రత్యక్షంగా ఆయా సందర్భాలలో వుండి వుంటే బహుశా ఇలా వ్యాఖ్యానించేది కాదేమో అనిపించింది. ఎంత అభిమానంతో వున్నా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడమూ మాకు చాలా సాధారణ విషయం. పార్టీలోనూ తనపై ఎవరెవరు ఏమేమి రాసారో? తెలియదు. నాకు దొరికే అవకాశం లేదు.
తన కవితా సంపుటి ‘మంజీర మూడ్స్’ మీద వచ్చిన రివ్యూస్‌ను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను.
అలాగే రవి రాసుకున్న డైరీలోని పేజీలు కొన్ని దొరికాయి. తను చదువుకుంటున్న కాలంలో ఎలా ఆలోచించేవాడో కొంత తెలిసింది. వాటిని ఇంకెప్పుడూ ముద్రించలేను. ఇందులోనే చేర్చితే నిలిచిపోతయికదా అనిపించి, వాటినీ చేర్చాను. అలాగే, మాస్టారు చనిపోయినప్పుడు అరుణతారలో తను రాసిన ‘మాస్టారుతో కరుణ, నేను’ ఆర్టికల్‌ను, అరుణతారలో తను రాసిన హోమియో వ్యాసం చేర్చాను.
గత నెల జూన్ 22న గుంటూరులో జరిగిన ఆర్‌ఎస్‌యు పూర్వ విద్యార్థుల మీటింగ్‌కి వెళ్లాను – రవి గురించి తెలిసిన వారు ఎవరైనా కలుస్తారేమోనని. విమల్‌గారు కలిసారు. హోమియో వ్యాసాన్ని ఇంగ్లీష్‌లోకి చేయాలనే మంజీర కోరికను తెలిపినప్పుడు విమల్‌గారు వెంటనే ఒప్పుకుని పనులన్ని పక్కనపెట్టి వారం రోజుల్లోగానే ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చారు. అది ముద్రణ రూపంలో వుంటే బాగుంటుందని, దానిని కూడా ఇందులో చేర్చాను.
మంజీర మీద వచ్చిన ఆర్టికల్స్ చదవమని నరేష్‌కుమార్ సూఫీకి పంపినప్పుడు ‘పెద్దకొడుకు’ కథ గురించి షహీదా రాసింది కదా. కథలో ఏముంది? షహీదా పెట్టిన విమర్శ ఏమిటి? అని అడిగి, అవి కూడా చేర్చితే పాఠకులకు ఉపయోగం కదా అన్నాడు. అలాగే, పెద్దకొడుకు కథలో తన పర్సనల్ జీవితం కూడా కొంత వుండడం వల్ల ఆ కథను కూడా చేర్చాను.
ఇందులో మంజీర (మఠం రవికుమార్) గురించి 34 మంది రాసిన ఆర్టికల్స్, ఒక పాట వున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మంజీరను ఆవిష్కరించారు. తన ఉద్యమ జీవితానికి సంబంధించినవన్నీ ఒక్క దగ్గర వుండటంతో తను విప్లవోద్యమంలో ఏం చేసాడు, వుద్యమాన్ని ఎలా నడిపాడు, క్యాడర్‌ను, ప్రజలను ఎట్లా ఎదిగించుకున్నాడు, వారి పట్ల ఎంత బాధ్యతగా వుండేవాడు, శత్రువు పట్ల ఎంత అంచనాతో వుండేవాడు…. ఇలా ఎన్నో విషయాలు తెలిసాయి.
నిజానికి ఇందులో ముద్రణకు ఇబ్బంది అనుకున్న వాటిని తొలగించాల్సి వచ్చింది. అవన్నీ కూడా వుంటే యుద్ధంలో స్పాంటేనియస్‌గా అప్పటికప్పుడు మంజీర తీసుకునే నిర్ణయాలు, గెరిల్లా ఎత్తుగడల అన్వయం, విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన విధానం తెలిసేది.
రాయాల్సిన వాళ్లు ఇంకా వున్నారు. ఎందుకనో వాళ్లు ఇవ్వలేదు. ఓ పదేళ్ల ముందు ఈ ప్రయత్నం చేసి వుంటే మరింత సమగ్రంగా వచ్చి వుండేది ఈ పుస్తకం. ముఖ్యంగా పిళ్లా వెంకటేశ్వరరావు (బక్కసార్) వుండి వుంటే రవికి సంబంధించిన చాలా విషయాలు తెలిసేవి (ఆయన కరోనా కాలంలో చనిపోయారు). అలాగే రవి కాలేజ్‌మేట్, ప్రాణస్నేహితుడు కోసం చాలా ప్రయత్నం చేశాను. దొరకలేదు. పేరుతప్ప తన గురించి ఇంకేమీ తెలియదు నాకు. ఆయన దొరికి వుంటే రవి పర్సనల్ విషయాలు తెలిసేవి.
ఈ పుస్తకం టైటిల్‌లోని ‘వివా’కి అర్థం ‘లాంగ్ లివ్’ అని. ఇది స్పానిష్ పదం. రెవల్యూషనరీకి సంబంధించి వచ్చినప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారట. ‘వియ్యుక్క’ పదాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసినట్టే ‘వివా’ను కూడా పరిచయం చేయవచ్చని ఓటు కూడా పడింది. దాంతో అదే పేరును ఖాయం చేశాం.
ఇకపోతే, తను హోమియో మీద రాసిన ఆర్టికల్స్, కేస్ స్టడీస్‌తోనే ప్రత్యేకంగా ఒక పుస్తకం తేవచ్చు. వివిధ అంశాలపై రాసిన ఆర్టికల్స్, దొరికితే తన మరికొన్ని రచనలతో మరో పుస్తకం తేవచ్చు. జాతుల పోరాటాల మీద రాసిన వ్యాసాలతోనే ప్రత్యేకంగా ఇంకో పుస్తకం తేవచ్చు. చూడాలి, ఎప్పటికైనా తేగలనో…