రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్‌ పైబర్‌ డ్రోన్‌ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది.  రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్‌ రష్యా మధ్య శాంతి చర్చలకు ఒకవంక ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవంక పరస్పరం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ఇస్తాంబుల్‌లో మే 28, జూన్‌ 2న రెండు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగినా గంటలోనే ఎటూ తేలకుండా ముగిసిపోయాయి. కాల్పుల విరమణ ప్రసక్తి లేకుండా యుద్ధఖైదీల మార్పిడిపై మాత్రం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడవసారి జూలై 23న ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చలు ఖైదీల మార్పిడి గురించి చర్చించాయి. అయితే కాల్పుల విరమణ నిబంధనలు చర్చించడానికి ఇరు పక్షాలు దూరంగా ఉన్నాయి.            

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెంవడసారి అధికారం చేపట్టిన నాటి నుంచి రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో పుతిన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ, గతంలో గూఢచర్య సంస్థలో పనిచేసిన నేపథ్యం ఉన్న రష్యా అధినేత వద్ద ట్రంప్‌ ఎత్తులు పారడం లేదు. అమెరికా అధ్యక్షుడికి గౌరవం ఇస్తూనే యుక్రెయిన్‌ విషయంలో పట్టువిడవడం లేదు. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్‌ సూచించినా పుతిన్‌ తిరస్కరిస్తున్నారు. ఈ యుద్ధానికి కారణమైన మూల సమస్యల పరిష్కారాన్ని సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎంత నచ్చచెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దురాక్రమణలను, దాడులను ఆపడంలేదని వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌కు భారీ సంఖ్యలో డ్రోన్‌లను సరఫరా చేయడానికి బ్రిటన్‌ సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్‌ నాటికి యుక్రెయిన్‌కు లక్ష డ్రోన్లు అందజేస్తామని బ్రిటన్‌ హామీ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే 4.5 బిలియన్‌ పౌండ్ల మిలిటరీ మద్దతులో ఈ 350 మిలియన్‌ పౌండ్ల డ్రోన్‌ ప్యాకేజీ భాగమని పేర్కొంది.

యుక్రెయిన్‌ సంయమనం పాటించకుండా ఉక్రోషంతో రష్యాపై వైమానిక దాడులకు తెగబడిరది. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి, ఆ దేశంలోని ఎయిర్‌ బేస్‌లపై దాడులు చేసి 40కి పైగా రష్యా యుద్ధ విమానాలను ధ్వంసం చేసి, సైనిక శిక్షణా శిబిరంపై విరుచుకుపడిరది. రష్యా ఎయిర్‌బేస్‌ వ్యవస్థలో సుమారు 30 శాతం ధ్వంసం చేశామని యుక్రెయిన్‌ ప్రకటించింది. ఏడాదిన్నర పాటు జరిపినా పక్కా ప్లానింగ్‌తో యుక్రెయిన్‌ దిగింది. ఈ ఆపరేషన్‌కు ‘స్పైడర్‌ వెబ్‌’ అనే పేరు పెట్టినట్టు పేర్కొంది.  ఫ్రంట్‌ లైన్‌కు వేల కిలోమీటర్ల దూరంలోని ఐదు కీలకమైన రష్యా మిలటరీ ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్‌ ఈ డ్రోన్‌ దాడులు జరిపింది. రష్యా సిటీలపై విరుచుకుపడేందుకు 41 ఎయిర్‌క్రాఫ్ట్‌లను యుక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌(ఎస్‌బియు) రంగంలోకి దింపింది. వీటిలో టీయూ-95, టీయూ-22 స్ట్రాటజిక్‌ బాంబర్స్‌, ఏ-50 రాడార్‌ డిటెక్షన్‌ అండ్‌ కమాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూడా ఉన్నాయి.

యుక్రెయిన్‌ ఎస్‌బియూ వర్గాల సమాచారం ప్రకారం, యుక్రెయిన్‌ తమ డ్రోన్లను ముందుగానే రష్యాలోకి స్మగ్లింగ్‌ చేసింది. అక్కడి ట్రక్కులపై ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్ల పైకప్పు కింద వాటిని దాచిపెట్టారు. దాడుల సమయంలో వాటిని దూరంగా తీసుకెళ్లి పైకప్పులు తెరవడంతో డ్రోన్లు తమ స్వల్పదూర లక్ష్యాల వైపు దూసుకెళ్లాయి. ఫస్ట్‌ పెర్సన్‌ వ్యూ (ఎఫ్‌పివి) డ్రోన్లతో రష్యాలోని ముర్మన్క్స్‌, ఇర్కుత్క్స్‌, ఇనానోవో, ర్యాజన్‌, అముర్‌ రీజియన్లలో ఐదు ఎయిర్‌ఫీల్డ్స్‌ను లక్ష్యం చేసుకుని యుక్రెయిన్‌ దాడులు జరిగినట్టు మాస్కో ధ్రువీకరించింది. ఈ దాడిలో తమ విమానాలు మంటల్లో చిక్కుకున్నట్టు మాస్కో అంగీకరించింది. అయితే  రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల యుక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.

యుక్రెయిన్‌ డ్రోన్ల దాడి జరుగుతుందని, అపార నష్టం సంభవిస్తుందని రష్యా ఊహించలేదు. ఈ దాడుల్లో రష్యా టియు 95, టియు 120 విమానాలు విధ్వంసం అయ్యాయి. వీటిని రష్యా తిరిగి సమకూర్చుకోవాలంటే వేలాది కోట్ల రూబుళ్లు ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు అంచనాగా చెబుతున్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ గల రష్యా యుక్రెయిన్‌ ఆకస్మిక దాడిని పసిగట్టకపోవడం, పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోవడం ఆశ్చర్యకరం. అహం దెబ్బతిన్న రష్యా యుక్రెయిన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడిరది. యుక్రెయిన్‌ చర్యకు రష్యా ప్రతీకారం తీవ్రంగా తీసుకుంది. రష్యా దాడులవల్ల గత మూడేళ్లలో యుక్రెయిన్‌ వేలాది మంది సైన్యాన్ని కోల్పోయినప్పటికీ పాశ్చాత్య దేశాల మద్దతుతో యుక్రెయిన్‌ నిలబడగలుగుతోంది. నల్లసముద్రంలో రష్యా రణతంత్ర వ్యూహాలను ఛేదించడానికి డ్రోన్‌ల వినియోగంపైనే యుక్రెయిన్‌ ఆధారపడుతోంది.  

తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే యుక్రెయిన్‌ యుద్ధాన్ని ముగింపజేస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ తమ ఎన్నికల ప్రచారంలోనే వాగ్దానం చేశారు. ఇప్పుడు యుక్రెయిన్‌కు అదనంగా ఆయుధాలు పంపుతానని ప్రకటించారు. ఈ సంక్షోభం 50 రోజుల్లో పరిష్కారం కాకపోతే రష్యాపై, దాని వాణిజ్య భాగస్వాములపై ‘‘తీవ్రమైన సుంకాలు’’ విధిస్తానని హెచ్చరించారు. ఇది ఆయన నిస్సహాయ స్థితికి నిదర్శనం. యుద్ధ విరమణకు తొలుత యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అతని వెనుక యూరోపియన్‌ యూనియన్‌ ఉంది. జెలెన్‌స్కీపై కస్సుబుస్సులాడిన ట్రంప్‌, అరుదైన భూగర్భ ఖనిజాల విక్రయంపై యుక్రెయిన్‌ లొంగి వచ్చి అమెరికాతో ఒప్పందం చేసుకున్న తదుపరి ట్రంప్‌ యుద్ధ విరమణకు రష్యాపై ఒత్తిడి పెంచాడు. తాము ఏ ప్రాథమిక లక్ష్యాల కోసమైతే (యుక్రెయన్‌ను నాటోలో చేర్చుకోకపోవడం, రష్యా భద్రతకై ఆక్రమించిన యుక్రెయిన్‌ భూ, సముద్ర ప్రాంతాలను అట్టిపెట్టుకోవడం, రష్యా రక్షణకై సమగ్ర యూరప్‌ ఒప్పందం వగైరా) యుద్ధం ప్రారంభించామో వాటి నుంచి వెనక్కు వెళ్లబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధ్యక్షుడు ట్రంప్‌కు స్పష్టం చేశాడు.

అధికారానికి వచ్చిన వెంటనే ట్రంప్‌ ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. ‘రష్యాకు రాయితీలివ్వాల్సిందే, రష్యాకు యుక్రెయిన్‌ కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే. మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్ధంలో గెలిచేది లేదు చచ్చేది లేదని’ జెలెన్‌స్కీతో అన్నాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు. ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు. ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదలి పుతినితో చేతులు కలిపి యుక్రెయిన్‌ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యా మీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్యాయి. ఈ లోగా యుక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దృష్టిలో జెలెన్‌స్కీ పిపీలికం. ఎలాగైనా జెలెన్‌స్కీని పాదాక్రాంతం చేసుకోవాలన్న కాంక్ష పుతిన్‌లో బలంగా ఉంది. అందుకే కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ అంగీకరించినా పుతిన్‌ ఒప్పుకోవడం లేదు. కాల్పులు విరమణ కావాలంటే అనేక షరతులను పుతిన్‌ ముందుకు తీసుకువస్తున్నారు. యుక్రెయిన్‌లో తాము ఆక్రమించుకున్న భూభాగాలను విడిచిపెట్టాలని, నాటో కూటమిలో యుక్రెయిన్‌ సభ్యత్వం పొందరాదని, భవిష్యత్తులో యుద్ధానికి సిద్ధపడబోమని లిఖితపూర్వక హామి ఇవ్వాలని పుతిన్‌ ఆంక్షలు విధిస్తున్నారు. అసలు ప్రత్యక్షంగా తమతో చర్చలకు జెలెన్‌స్కీ సరిపోడని పుతిన్‌ అభిప్రాయం. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై 40 నెలలు గడుస్తోంది. గత మూడు సంవత్సరాలకు పైగా సాగుతున్న యుద్ధం వలన ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. పుతిన్‌, జెలెన్‌స్కీల అహంభావం ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నెడుతున్నది. భారీ విధ్వంసకరమైన ఆయుధాలతో వినాశనాన్ని చవిచూస్తున్న ఇరుదేశాల ప్రజల పరిస్థితి ఎవరికీ పట్టడం లేదు. యుక్రెయిన్‌లో ఎన్నికలు జరపకుండా యుద్ధం పేరుతో జెలెన్‌స్కీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూడడం బాధాకరం. నాటో కూటమిలో చేరాలని జెలెన్‌స్కీ ఆరాటపడడం రష్యా మనుగడకు ఇబ్బందికరమంటుంది. 

రెండు దేశాల ప్రజల మధ్య విసుగు, అలసట ఛాయలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్‌ యుద్ధ భూమిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రష్యాతో పోలిస్తే యుక్రెయిన్‌కు ఆయుధాల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడులను తట్టుకోలేకపోతోంది. యుక్రెయిన్‌ తన ఖేర్సస్‌ సిటీని కోల్పోయిన తరువాత తాను కోల్పోయిన భూభాగాల్లో 2022 నుంచి ఎలాంటి విజయాలను సాధించలేదు. గత ఏడాదిగా 5000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని యుక్రెయిన్‌ రష్యా వల్ల కోల్పోయింది. యుక్రెయిన్‌ ముట్టడిరచిన కుర్స్క్‌ను రష్యా తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. రష్యా స్ప్రింగ్‌ (వసంత) దాడి ఇప్పుడు ఊపందుకుంది. సుమీ రీజియన్‌లో భూభాగాలను ఆక్రమించుకుంటోంది. రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగాల్లో అనిశ్చితి  యుక్రెయిన్‌కు తీరని ప్రతిబంధకాలుగా వెంటాడుతున్నాయి. మరోవంక రష్యాకు కూడా తమ ఇంధన వనరులపై యుక్రెయిన్‌ చేస్తున్నా  డ్రోన్‌ దాడులను నివారించడం కష్టంగా కనిపిస్తోంది. అలాగే నల్లసముద్రంలోని రష్యా దళాలపై యుక్రెయిన్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వైమానిక స్థావరాలపై యుక్రెయిన్‌ దాడులు చేయడం రష్యాకు కలవరం కలిగిస్తోంది. రష్యా యుద్ధ రంగంలో దూకుడు పెంచినా నాటో సహకారంతో యుక్రెయిన్‌ నుంచి ఎదురుదాడి తప్పదు.

నాటో దేశాలు యుక్రెయిన్‌ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నాయి. ఆయుధాలు ఇచ్చినా వాటిని వినియోగించే నైపుణ్యం యుక్రెయిన్‌ మిలిటరీకి లేదని తేలింది. అంతేకాదు అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు అనుకూలతలను పెంచింది. మిలిటరీ జవాన్ల సంఖ్యలో రష్యాదే ఆధిపత్యం. అందువల్లనే దాని ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటోంది. యుక్రెయిన్‌కు తగినన్ని బలగాలు లేని కారణంగా రష్యాలో ఆక్రమించుకున్న కుర్క్స్‌ ప్రాంతాన్ని అది నిలుపుకోలేకపోయింది. అనేక అనుభవాలను చూసిన తరువాత పుతిన్‌ సేనలు వ్యూహాన్ని మార్చాయి. పశ్చిమ దేశాలు ఆశించినట్లు ఆంక్షలతో రష్యా కుదేలు కాలేదు. పోరు విషయంలో తటస్థంగా ఉన్నప్పటికీ భారత్‌, చైనా దాని నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి ఒక విధంగా ఆర్థికంగా ఎంతగానో రష్యాను ఆదుకున్నాయి. అవి కూడా లబ్ది పొందాయి. ఇదొక కొత్త అనుభవం.2025 నాటికి, రష్యన్‌ దళాలు యుక్రెయిన్‌లో దాదాపు 20 శాతం భూభాగాన్ని ఆక్రమించాయి. 41 మిలియన్ల జనాభాలో, దాదాపు 8 మిలియన్ల మంది యుక్రెనియన్లు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. 8.2 మిలియన్లకు పైగా దేశం విడిచి పారిపోయారు, ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అతిపెద్ద శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించింది.

ట్రంప్‌ ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు. కొద్ది రోజుల క్రితం 500 శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. యాభై రోజుల్లో యుక్రెయిన్‌పై దాడులను రష్యా ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గడువు ప్రకటించాడు. దీనితో పాటు యుక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు అందిస్తానని కూడా జూలై 14న వెల్లడిరచాడు. ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని యుక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీని ట్రంప్‌ ఆదేశించాడు. బెదిరించిన ఒక్క రోజులోనే అంటే, జూలై 15న ట్రంప్‌ మాట మార్చాడు. యుక్రెయిన్‌లో కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది.

పోరు ఇంకా కొనసాగుతుండగానే యుక్రెయన్‌ పునరుద్ధరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్‌ క్షిపణులను వెంటనే యుక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. దీంతో ఆధునిక ఆయుధాలను ఇస్తానన్న  ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి. కొద్ది వారాల క్రితం మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు యుక్రెనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెన్‌స్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను అమెరికాకు రాసిచ్చిన జెలెన్‌స్కీ రాబోయే రోజుల్లో దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం!

నాటో నేరుగా యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గొన్నట్టే. అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథ నడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే యుక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ‘అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెన్‌స్కీకి ఇవ్వండని’ అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. ‘మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని’ యుక్రెయిన్‌ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు యుక్రెయిన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.   ఇదే విధంగా యుద్ధం కొనసాగితే రెండు వైపులా అపార నష్టం తప్పదు. ఇరు దేశాలకు  భవిష్యత్తు భద్రతా సమస్యలున్నాయి. ఇవన్నీ పరిష్కరించవలసి ఉంది. అయితే భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా ఉండేందుకు విశ్వసనీయమైన భద్రతా గ్యారంటీలను రష్యా నుంచి యుక్రెయిన్‌ ఆకాంక్షిస్తోంది.

 ఆగష్టు 10లోగా కాల్పుల విరమణకు తగిన నిర్ణయం ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్‌ పుతిన్‌ను హెచ్చరించాడు. అయితే ట్రంప్‌ బెదిరింపులకు పుతిన్‌ దిగివచ్చే సూచనలు కన్పించడం లేదు. రష్యా విదేశాంగ శాఖ ట్రంప్‌ బెదిరింపులు, హెచ్చరికలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఈ విభేదాలను పరిష్కరించడంలోనూ, కాల్పుల విరమణ ఒప్పందం ఉభయ దేశాల మధ్య కుదర్చడంలోనూ కీలక సూత్రధారి అమెరికా ప్రభుత్వమే. ఇస్తాంబుల్‌లో  రెండు దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ చేసిన ప్రతిపాదన సమంజసమే అనిపిస్తోంది. రష్యా-యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరుదేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ మరింత ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడతాయి. ఇరుదేశాల అహంకారపూరిత వైఖరి అణుయుద్ధానికి, మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేం.

Leave a Reply