ఈ ప్రచురణ ఒక ప్రయోగం లాంటిది. ఇందులో రెండు ఇంటర్వ్యూలు, ఒక సంస్మరణోపన్యాసం రెండు ప్రసంగ వ్యాసాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రక్రియలు. ఇంటర్వ్యూలు చాలా వరకు అది చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సంస్మరణ ఉపన్యాసం పూర్తిగా లిఖిత రూపంలో ఉంటుంది. ప్రసంగ వ్యాసాలు సందర్భాన్ని బట్టి ఏ సంస్థ నిర్వహిస్తున్నదో దాన్ని బట్టి ఉంటాయి. అయితే ఈ అన్నింటిలో అంశం దాదాపు ఒకటే కాబట్టి ఒక రన్నింగ్ థీమ్ ఉంది. వీటిలో శాంతి ప్రధానమైన అంశమైనా, శాంతి రాజ్య స్వభావం మీద, సామాజిక చైతన్యం మీద, రాజ్యాంగ సంస్థల పటిష్టత మీద ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం చాలా బలంగా పనిచేసినపుడు రాజ్య బలప్రయోగం కొన్ని హద్దుల్లో పనిచేస్తుంది. రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ద పాలన, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, ప్రత్యామ్నాయాలను సీరియస్ గా పట్టించుకోవడం, ఉద్యమాలు (సాయుధ పోరాటంతో సహా) ఎందుకు పుట్టుకొస్తాయి, వాటికి మూలకారణాలు ఏమిటి అనే లోతైన చర్చ ఉంటుంది. అలాంటి చర్చను అధికారంలో  ఉండే పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. ప్రజాస్వామ్యం బలహీనపడ్డ కొద్దీ హింస పాత్ర పెరుగుతూ ఉంటుంది.

డా. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తూ “ప్రజాస్వామ్యం అంటే సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఏ రక్తపాతం లేకుండా విప్లవాత్మక మార్పులను తీసుకురావడం” అన్నారు. మన రాజ్యాంగం ఒక సంక్షేమంతో కూడిన న్యాయపూరిత సమాజాన్ని వాగ్దానం చేసింది. రాజ్యం ఈ మార్పుకు చోదకశక్తి కావాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. రాజ్యం స్వభావ పరంగా బలప్రయోగం కేంద్రంగా ఉంటుంది. అది సమాజ యధాతధ స్థితి కొరకు నిరంతరం పనిచేస్తుంది. అలాంటి రాజ్య వ్యవస్థ సామాజిక మార్పు కొరకు పనిచేయగలదా ఆ పాత్రను నిర్వహించగలదా అన్న ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. డా. అంబేద్కర్ అది సాధ్యమేనని భావించారు. అది సాధ్యపడకపోతే మనం నిర్మించిన ఈ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ప్రజలే బద్దలు కొడతారు అని హెచ్చరించారు. స్వాతంత్య్రానంతరం రెండు దశాబ్దాల పాటు ఈ మార్పు కొంత వస్తుందని ప్రజలు ఆశించారు. కాని 1960 చివరలో దేశవ్యాప్తంగా భిన్నమైన ఉద్యమాలు ముందుకు వచ్చాయి. ఆ ఉద్యమాలలో నక్సల్బరీ పోరాటం ఒకటి. ఇది మౌలికమైన ప్రశ్నలు అడుగుతూ సాయుధ పోరాటం ద్వారానే మార్పు సాధ్యమని ప్రారంభం కావడంతో పోరాటం ప్రారంభమైనప్పటి నుండి రాజ్యానికి ఇది సవాలుగా మారింది. ఈ సవాలుకు డా. బి. ఆర్. అంబేద్కర్ దృక్పథంలో ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తరించి ప్రజల జీవితంలో మౌలిక మార్పులని తీసుకురావడం ద్వారా పరిష్కరించాలి- అన్న భావన ఆయన ప్రతిపాదనకు కేంద్రం. ప్రజా పోరాటాలు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పరిష్కరించడం ఒక మార్గం. లేదా వాటిని అణచివేయడం మరో మార్గం.

రాజ్యం ఈ రెండవ ప్రత్యామ్నాయం మీద ఆధారపడ్డప్పుడు మొదట దెబ్బతిన్నది ప్రజాస్వామ్యం. ఇలాంటి సందర్భంలో శాంతి చర్చలు అనే ఒక ప్రక్రియ ముందుకు వచ్చింది. శాంతి చర్చలు అంటే రాజ్యం బలప్రయోగాన్ని తగ్గిస్తూ పోరాటాలు చేస్తున్న విప్లవకారులతో లేదా ఉద్యమకారులతో సంభాషించడం. ఈ సంభాషణ ప్రధాన ఉద్దేశం బలప్రయోగాన్ని తగ్గిస్తూ ప్రజాస్వామ్యపు చోటు (స్పేస్) ను పెంచాలి.

శాంతికోరే వారు ఉద్యమాల ఆకాంక్షలను గుర్తిస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ రాజ్యం మీద, విప్లవోద్యమాల మీద వత్తిడిని పెంచాలి. ఇది అంత సులభమైన పనికాదు. శాంతి కోరే వ్యక్తులు, సమూహాలు ఇరువైపుల నుండి సవాళ్ళను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఈ కృషి చేస్తున్న వారి పట్ల ఇద్దరికీ కొంత గౌరవం ఉండాలి. వాళ్ళ చిత్తశుద్దిని గుర్తించాలి. ఇది గుర్తించడానికి ఇలాంటి వ్యక్తులకు సమూహాలకు చాలా నైతిక బలం కావాలి. సమాజంలో కూడా విస్తృతమైన గౌరవం ఉండాలి. మనదేశంలో పలు ప్రాంతాలలో ఇలాంటి వ్యక్తులున్నారు. ప్రజా సంఘాలు ఉన్నాయి. శాంతిని కోరే ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే సమాజంలో ఇలాంటి ప్రయత్నాలను చులకనగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

శాంతి వలన తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించేవారు తమ పాత్ర తాము నిర్వహిస్తూ ఉంటారు. ఇంత ఘర్షణ మధ్య శాంతి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి అరుదైన ప్రయోగం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కేంద్రంగా జరిగింది. ఈ పుస్తకంలో ఆ ప్రయోగ వివరాలు దాని ఆటుపోట్లు సాఫల్య వైఫల్యాలు ఉన్నాయి.

పౌర స్పందన వేదిక శాంతి కొరకు చేసిన ప్రయోగం రెండు దశాబ్దాలక్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ రెండు దశాబ్దాలలో ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా బలం పెరిగింది. సామ్రాజ్యవాదానికి దేశంలోని భూస్వామ్య భావజాలానికి లంకె కుదిరి బలపడ్డ కొద్దీ ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదం ఏర్పడింది. భారత రాజ్యాంగం వాగ్ధానం చేసిన సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలు పరీక్షకు గురవుతున్నాయి. ప్రశ్నించబడుతున్నాయి.

ప్రజాస్వామ్య శక్తులకు రాజ్యాంగం ఒక ఆయుధంగా మిగిలింది. ఈ పర్యాయం జరిగే శాంతి సంభాషణ, శాంతి భావన, శాంతి కృషి గతం కంటే మరింత ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. సంపన్న వర్గాల స్వప్రయోజనాలు చాలా బలాన్ని పుంజుకున్నాయి. రాజ్యం ఈ ప్రయోజనాలను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది. గతంలో రాజ్యం కొంతైనా స్పందించింది.

ఇపుడు తన స్పందించే లక్షణాన్ని పూర్తిగా కోల్పోయి ఏదీ వినడానికి సిద్ధంగా లేదు. రాజ్యాంగం తన మీద పెట్టిన బాధ్యతను ప్రమాణాలను గుర్తించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కన్పించడం లేదు. రెండవ సారి చర్చల సమయంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, పొత్తూరు వెంకటేశ్వరరావు, కన్నబిరాన్, తారకం, జయశంకర్ ఇపుడు లేరు. ఇది రెండవ తరం మీద పడింది. ఈ పర్యాయం జస్టిస్ చంద్రకుమార్ గారు చొరవ తీసుకొని పనిచేస్తున్నారు. ఈ రెండు దశాబ్దాలలో స్వార్థపర శక్తులు సంపదను పెంచుకుని చాలా బలపడ్డాయి. వాళ్ళకు వాళ్ళ ప్రయోజనాలు తప్ప ఏ ఇతర కన్సర్న్స్ లేవు. రాజ్యానికి పెట్టుబడికి మధ్య విభజన రేఖ దెబ్బతిన్నది. ఇపుడు పెట్టుబడి రాజ్యం ఏలుతుంటే, రాజ్యా పెట్టుబడిదారీగా ప్రవర్తిస్తున్నది. కార్పొరేట్లు ఏది నిర్ణయిస్తే రాజ్యం దానిని అమలు చేస్తున్నది. గతంలో శాంతి ప్రయత్నానికి మీడియా మద్దతుండేది. ఇపుడు మీడియా ముఖ్యంగా జాతీయ ఇంగ్లీషు మీడియా శాంతి గురించి ప్రస్తావించడం కూడా లేదు. ఇది పూర్తిగా కార్పొరేటీకరణ చెందింది.

దీనికి తోడు యుద్ధ రీతులు మారాయి. రాజ్యం దగ్గర కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇజ్రాయిల్ హిజబుల్లా నాయకులను కిలోమీటర్ల దూరం నుండి టార్గెట్ చేసి చంపగలుగుతున్నది. ఈ మార్పు ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదంగా మారింది.పేదరికం, పేదలు అనే భావన బలహీనపడి ఐడెంటిటీ బలపడ్డది. పేద అన్న భావన అందరినీ కలిపే బదులు కులం బాగా బలపడ్డది. ఎవరి కులం పేదలు తమ గురించి, తమ వాటా గురించి ఉద్యమిస్తున్నారు. ఉద్యమాల సంఖ్య పెరిగింది. కానీ సంఘటిత ఉద్యమం దెబ్బతిన్నది. గతంలో అందరి సమస్యల కొరకు ఉద్యమాలు జరిగాయి. కాని అవే ఉద్యమాలు చీలికలు పేలికలుగా మారినాయి.

పేదలలోనే ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది అన్న చర్చ చాలా విస్తృతంగా జరుగుతున్నది. న్యాయ సాధనకు ఇలాంటి నిర్దిష్టమైన చర్చ అవసరమయిన పేదలకు అందరికి అన్యాయం జరిగిందన్న భావన బలహీనపడడం వలన పౌర సమాజం తన ప్రజాస్వామ్య శక్తిని కోల్పోతున్నది. ఈ క్రమంలో పేదలు మరింత పేదరికంలోకి, సమస్యలలోకి మారిపోతున్నారు. ఆదివాసీలు చరిత్రలో చాలా అన్యాయానికి గురయ్యారు. ఇవాళ వాళ్ళసమస్య తీవ్రతరమై వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడ్డా మిగతా పేదవర్గాలు స్పందించవలసిన స్థాయిలో స్పందించడం లేదు. ఇది కేవలం రాజ్యానికి ఆదివాసీలకు మధ్య పోరాటంగా భావిస్తున్నారు. కానీ ఇవాళ ఆదివాసీలపై జరుగుతున్న నిర్బంధం అక్కడ ఆగదు.

రేపు ఈ అణచివేత ఏ పేద వర్గాలపైన అయినా జరగవచ్చు. పేదల పక్షాన నిలిచే ప్రజా శక్తుల మీద జరగవచ్చు. సంఘటిత ప్రతిఘటనే ఇపుడున్న పరిస్థితులను తట్టుకోగలదు. రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా మనుషులను పట్టుకొని చంపి, చంపిన వారికి రివార్డులు ఇవ్వడం… ఏం చట్టబద్ద పాలన? హింస ఆపాలనే చర్చకు స్పందించకపోవడమేమిటి. పౌర సమాజంలో గత రెండు దశాబ్దాలుగా హింస విపరీతంగా పెరిగింది. మానవసంబంధాలన్నీ సంక్షోభంలో పడిపోతున్నాయి. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను చంపే క్రూరత్వం చూస్తే జీవితాంతం కలిసి ఉండాల్సిన దాంపత్యంలో ఇంత క్రూరత్వం ప్రవేశించడమేమిటి. తల్లులు సొంత బిడ్డలను చంపడమేమిటి.

తల్లి ప్రేమమీద ఎంత గొప్ప సాహిత్యం వచ్చింది. పిల్లలు తల్లిదండ్రులను రాళ్ళతో కొట్టి, కత్తులతో పొడిచి చంపుతున్నారు. ఆస్తి తగాదాలలో అన్నాదమ్ములు ఒకరునొకరు చంపుకుంటున్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు అంతులేకుండా పోతున్నది. నాలుగైదు ఏళ్ళ చిన్నారి పాపల మీద అత్యాచారం ఏమిటి. వాళ్ళ కుతికెలు పిసికి చంపడమేమిటి. చిన్న చిన్న విషయాలకు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడమేమిటి. ఉపాధ్యాయులు పిల్లల మీద అత్యాచారం చేయడమేమిటి. పిల్లలు ఉపాధ్యాయులను పొడిచి చంపడమేమిటి. అసాంఘిక శక్తులు ఉపాధ్యాయుల మీద దాడులు చేయడమేమిటి. ఇదంతా హింస కాదా. ఈ హింసను ఎలా ఎదుర్కొవాలి.

ఈ హింసకి రాజ్యం దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? ఆయుధాల ద్వారాఈ హింసను నియంత్రించగలదా. ఈ మొత్తం హింసకు బస్తర్లో జరిగే హింసకు పైకి ఏ సంబంధం కనిపించకపోయినా ఇది అంతా వ్యవస్థీకృత హింసలో భాగమే. దళితుల మీద, ఆదివాసుల మీద, మహిళల మీద, కుటుంబ సభ్యుల మీద, విశ్వవిద్యాలయాలలో ప్రతిష్టాత్మకమైన ఐఐటిలలో కూడా ఇలాంటి హింసజరుగుతున్నది. ఈ వ్యవస్థీకృత హింసకు పరిష్కారమేమిటి. ఈ చారిత్రక సంక్షోభానికి శాంతి చర్చలు ఒకమార్గం. పౌర సమాజం తాను ప్రయాణిస్తున్న హింసాయుత సమాజాన్ని మానవీకరించుకోవాలి. మానవీయత సమాజపు పొరలలో ఉంటుంది. ఇతరుల కొరకు ఉద్యమించేవాళ్ళు త్యాగాలు చేసేవాళ్ళు ఇతరుల లేదా సమాజ మార్పుకు పాటుపడే వాళ్ళు భవిష్యత్తుపట్ల కొంత విశ్వాసాన్ని పెంచుతున్నారు. రాజ్యం సమస్యల మూలాలలోకి వెళ్ళడానికి ఇపుడు సిద్ధంగా లేదు. సమాజం తన మానవత్వపు మూలాలను వెతుక్కొని ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడమే శాంతియుత సమాజానికి, ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుంది.

 20.07.2025

హైదరాబాద్

One thought on “ప్రజాస్వామ్యం లేకుండా శాంతి, శాంతి లేకుండా ప్రజాస్వామ్యం సాధ్యం కాదు

  1. Buchireddy gangula—-
    ——————————————
    Sir— mana desham lo prajaswaamyam undha. -yekkada

Leave a Reply