వర్షం కురుస్తున్నప్పుడు ఆంధ్రుల రాజధాని ఎలా ఉంది అనే సందేహం దూరంగా ఉన్న తెలుగువారికి రావచ్చు. అమరావతి మునకలో ఉందా, లేదా వర్షపు నీటి వెలుపల ఉందా! ఇవి రెండు పాక్షిక సత్యాలు. ‘నీరు పల్ల మెరుగు ‘ అనే సామెత తెలుగువారిదే. ఇరవై ఎనిమిది గ్రామాలు పూర్తిగా నీటిలో ఉండవు. కొన్ని గ్రామాలు ఉండవచ్చు. ముప్పై రెండువేల ఎకరాల లో రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు భోరున కురిసే వర్షానికి నీరు చేరడం సహజం. దానిని ఒక కాలపు రివాజుగా చూడాలి. వర్షం కురిస్తే భారతీయ నగరాలు జీవనదిలో ఉన్నట్లు ఉన్న దృశ్యాలు సహజం. అమరావతి కూడా దీనికి మినహాయింపు కాదు. అద్భుత నిర్మాణం వెనుక, మహానగరాల పుట్టుకలో అవరోధాలు ఉంటాయి. అమరావతి నామకరణం జరిగి పదేళ్లు దాటాక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ? అని ఆంధ్రుడు ఆరా తీస్తున్నాడు. అమరావతి దాదాపు లక్ష ఎకరాలలో నిర్మాణమౌతుంది. ప్రపంచంలోనే లక్ష ఎకరాలలో ఏరాజధాని నగరం లేదు. ఇదికూడా అరిగిపోయిన చర్చ.ఈ చర్చ ఇక్కడ అవసరం లేదు. ప్రపంచంలోనే కొన్ని లక్షల చదరపు నేల కలిగిన ప్రాంతం మా రాజధాని అని గట్టిగా చెప్పవచ్చు.
అసలు ఈ అమరావతి కథ ఏమిటి ? ఇరవై ఎనిమిది గ్రామాల ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చిన భూమి. ఇందులో పాలకపక్షం తెలుగుదేశం రాజకీయ, ఆర్థిక అనుసరణ ఏమిటి? శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు ఏమిటి? అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నదేమిటి? ఇరవై ఎనిమిది గ్రామాలు కృష్ణానది పరివాహక ప్రాంతాలు. ఇక్కడ భూములు రెండు రకాలుగా ఉంటాయి. జరీబు భూములు అనేక పంటలకు సిద్ధంగా ఉంటాయి. సాధారణ భూములు ఏడాదికి ఒకే పంట వీలుంటుంది. గుంటూరు, విజయవాడ జాతీయ రహదారికి మూలకు విసిరేసినట్లుంటాయి ఈ గ్రామాలు.. పూర్తిగా రైత్వారి గ్రామాలు. వ్యవసాయాధారిత గ్రామాలు. సేద్యం చుట్టూ అల్లుకున్న శ్రమ సంస్కృతి. వ్యవసాయంపై ఆధారపడిన రైతుకూలీలు. వివిధ చేతి వృత్తి కుటుంబాల జీవనసరళి. రెండు మహానగరాల మధ్య, వ్యవసాయ రంగంలో నిఠారుగా నిలబడిన నేల.
2015లో ముప్పై రెండు వేల ఎకరాలు ఇచ్చిన కొద్దిమంది రైతులతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. రైతులును కూడా మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఎకరాలు కలిగిన రైతులు. రెండు, ఒకటి, లేదా ,రెండు ఎకరాల ఉన్న రైతులు. మూడవ తరగతి వ్యవసాయ కూలీ ద్వారా వచ్చిన మిగులుతో అరెకరం లేదా ముప్పావు ఎకరం ఉన్న రైతులు .ఈ మూడవ కేటగిరీలో దళిత ,బహుజన కులాలు ఉన్నాయి .పెద్ద రైతులు వ్యవసాయానికి దూరం జరిగాక కౌలు ద్వారా వచ్చిన రుసుము ఇతరత్రా ఉద్యోగ అవకాశాల వలన వీరు వ్యవసాయంపై ఆధారపడి లేరు .తమ శ్రమ ద్వారా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది దళిత, బహుజన కులాలు. వీరే వ్యవసాయకూలీలుగా, కౌలుదారులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ సంపన్న రైతులును ఆకర్షించింది. మిగతా రైతులు వీరిని అనుసరించక తప్పలేదు. రాజధాని భూసేకరణలో చంద్రబాబుకు కలిసి వచ్చినది 2013 భూసేకరణ చట్టం. ముప్పై రెండు వేల ఎకరాల సేకరణ చంద్రబాబుకు తేలికయింది. ల్యాండ్ పూలింగ్ ఇక్కడ ప్రధాన అంశం. కౌలు, కౌలు దారుడు అదృశ్యమై ప్రభుత్వం కౌలుదారు అయింది. కౌలుకి గ్యారెంటీ వహించేది ప్రభుత్వమే కాబట్టి స్థిర సంపద ఉంటుందనే భావనకు రైతులు వెళ్లారు. ఎలాంటి ఆటంకం లేకుండా చంద్రబాబును చూసి రైతులు భూమి ఇచ్చారనే ప్రచారం వెనుక ఉన్న వాస్తవం ఇది . కౌలుకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది అనే భావనకు రైతులు వెళ్లారు.
సంపన్న రైతులు తమ ఇంటి పక్కనే సచివాలయం, అసెంబ్లీ వస్తుందని 2015లో వీరిని కలిసినప్పుడు ఉత్సాహంగా చెప్పారు. నష్టపరిహారం గా ఇచ్చే 1000 గజాలు, 250 కమర్షియల్ గజాలు తమ భూమిలోనే ఇస్తారు అనే నమ్మకం పెట్టుకున్నారు. పదేళ్ళుగా ఇదే నమ్మకంతో ఉన్నారు. పదేళ్లు గడిచినా రైతులకు ఇస్తాను అన్న 1000 గజాల స్థలం ,కమర్షియల్ కేటాయింపు 250 గజాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఎక్కడ కేటాయిస్తారు అనేది చెప్పలేదు. 2015 నుండి 2018 వరకు అమరావతిలో కొన్ని నిర్మాణాలు జరిగాయి. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, ఖరీదైన అపార్ట్మెంట్ న్యాయమూర్తులకు అపార్ట్మెంట్లు మినహా ఈ కాలంలో ఏనిర్మాణాలు జరగలేదు. రాజధానిని కలిపే సీడ్ రహదారికి దిక్కులేదు .ఇక్కడ ప్రధానమైన అంశం ఇరవై ఎనిమిది గ్రామాలను భౌగోళి కంగా కలిపే రోడ్డు నిర్మాణం జరగలేదు. రాజధాని ప్రాంతాన్ని దగ్గరలో ఉన్న విజయవాడ , గుంటూరు నగరాలను కలిపే ఎలాంటి రహదారి నిర్మాణం జరగలేదు.
రెండు పాలక పార్టీల, సామాజిక వర్గాల వైరుధ్యంగా మారింది. రాజధాని అయినా మిగతా ప్రాంత ప్రజలకు అమరావతి పట్ల విశ్వాసం లేదు .అలా అని జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు కూడా వారు సిద్ధంగా లేరు. 2024 అధికార మార్పిడి తర్వాత రాజధాని పనులు వేగిరం అయినాయి అనే ప్రచారంలో కూడా నిజం లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ప్రధానంగా ఈ ముప్పై రెండువేల ఎకరాలలో ఏ సామాజిక వర్గానికి ఎంత భూమి ఉంది. తెలుగుదేశం నాయకత్వానికి, సానుభూతిపరులకు, లేదా తెలుగుదేశంను అంటిపెట్టుకొని ఉన్న పెట్టుబడిదారులకు ఎంత భూమి ఉంది .వీటికి లెక్కలు కావాలి . ఈ లెక్కలను పౌర సమాజం అడుగుతుంది . చాలావరకు రాజధాని భూములు చుట్టూ సంపన్న వర్గాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. చంద్రబాబు రెండవసారి అధికారంలోకి రాగానే రాజధాని భూముల విలువ మూడు లేదా నాలుగు కోట్లు, కొన్నిచోట్ల ఐదు నుండి ఏడు కోట్లకు పెరిగింది . జగన్ పాలనా కాలం లో కోటి రూ పాయల ధర ఈ భూములు పలకలేదు.2022 లో రాజధాని రైతులను కలిసి నప్పుడు రైతులు చెప్పిందే. మరొక 44 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో భాగంగా తీసుకుంటున్నామని అనగానే భూముల ధరలు హఠాత్తుగా తగ్గాయి. క్రయవిక్రయాల ఊసే లేదు.
రాజధాని నిర్మాణం లో చంద్రబాబు నాయుడు చెప్పే ఊహజనిత కల్పనలు రాజధాని రైతాంగం నమ్మడం లేదు. పెట్టుబడి ఆధారంగా రాజధాని రూపుదిద్దుకోవాలనేది చంద్రబాబు కోరుకుంటున్నది. దానికి భూమి వనరు .ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి విషయంలో ప్రపంచ బ్యాంకును ఆశ్రయించమంది. అప్పు ఇచ్చిన వారి కండిషన్ లో ను 44 వేల ఎకరాలు అడిగి వుంటారు. అప్పుకు గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం వహిస్తుందని హామీ ఇచ్చింది. దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు మొదటి దశలో మంజూరైనాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నిర్మాణం వేగవంతం కారాదని కోరుకుంటున్నది. ఈనాలుగేళ్లలో వీలైనంతగా రాజధాని నిర్మాణ వేగాన్ని తగ్గించాలని కోరుకుంటు న్నది .2024 కి పూర్వ పక్షం చేయడమే. ఇదొక చదరంగం. . ప్రజల నిమిత్తమాత్రులు. పాలనాపరమైన నిర్ణ యాలలో ప్రజల భాగస్వామ్యం లేకుండా సామాజిక వర్గం అండ, అవినీతి ఉంటే అమరావతి ఏనాటికయినా వర్తమా నమే. భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతులలో విశ్వాసం సడలుతుంది. వారికి వుండే కుటుంబ అవసరాలు వారికీ వున్నాయి.
రాజధానిపై విమర్శ పెడితే నోటీసులు ఇవ్వడమే కాదు- అరెస్టు కూడా చేస్తామని తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం బెదిరింపు. ప్రజల కష్టార్జితం పన్నుల రూపంలో రాజధానికి ఖర్చవుతుంది. మలేషియా, సింగపూర్, చైనా ఇవన్నీ కాలం చెల్లిన ముచ్చట్లు. వాస్తవికత ఒకటి ఉంటుంది .దానిపై రేపటి భవిష్యత్తు ఆధారపడుతుంది. రెండు రాజకీయ పార్టీలు గుంటూరు ,విజయవాడ మధ్య ‘శింతేరు’ అనే గ్రామంలో మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది .దీని పైన గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పరిశీలించాయనే వార్తలు వచ్చాయి . దీనిని వదిలేసి వ్యవసాయ భూములను డిస్టర్బ్ చేసారు. అక్కడ పేదలు నివాసాలు ఉన్నాయి. వారికి నచ్చచెప్పడం నష్టపరిహారం తేలికపరిచే అంశం.
ముందు చూపు లేని పాలకవర్గ విధానాలకు అమరావతి తాజా ఉదాహరణ .నేల విడిచి సాము చేసిన ఊహలు, స్వప్నాలు నిజం కావు. ఈలోపు పనులలో కమీషన్లు సహజం. పేదల చివరి రక్తపు బొట్టు కూడా పీల్చివేసే రాజకీయావవరణ ఉంది. రాజధాని రైతులు ఈ పదేళ్ళ కాలంలో ఆశించినది వేరు. వారి త్యాగం లేదని అనలేము. పాలకవర్గాల క్రీడలో వారి ఆశలు, ఆకాంక్షలు వెనక్కి వెళ్లాయి. రాజధానిలో కృత్రిమ అభివృద్ధి కనబడవచ్చు. అమరావతి వర్తమానమే. రాజధానిలో అనేక పాలనా తప్పిదాలు, పొరపాట్లు భవిష్యత్ తరాల ముందు దోషిగా నిలబెడతాయి. ఇవాళ దోషులు ఎవరూ కనబడరు. ఇవాల్టి ఆర్థిక స్థితిలో క్రయ,విక్రయాలకు అవకాశం లేదు . పేద, మధ్య తరగతి ఒక సెంటు భూమి కూడా కొనలేరు. ఉపాధి మార్గాలు చిన్న తరహా పరిశ్రమలు మూతకు గురవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి విలువ మారుతుంది. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కు అవకాశం లేదు.
అమరావతిని విమర్శించకూడదు .అలా విమర్శ పెడితే పోలీస్ కేసులు పెడతామని ప్రభుత్వం బెదిరిస్తుంది. అయితే అమరావతి రైతులకు భవిష్యత్తు అర్థమైంది. వారి మౌనం వెనుక మోసపోయాం అనే భావన ఉంది .అమరావతి పేరు చెప్పి హఠాత్తుగా ధనవంతులైన వారు. రైతుల అమాయకతపై డబ్బులు సంపాదించుకున్నవారు. పాలక పక్ష దళిత ,బహుజన నాయకత్వాలు అమరావతి ప్రజలకు ద్రోహం చేశాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రైతులు ఆర్థికంగా స్థిరపడ్డారు . అమరావతిని గమనించినప్పుడు రెండు విషయాలు స్పష్టం . ఇది రెండు రాజకీయ పార్టీల క్రీడ.ప్రజలు మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వైపు నుండి అమరావతిని అంచనా వేయాలి. ప్రజా సంఘాలు,మీడియా వాస్తవికత నుండి అమరావతిని దర్శించాలి.
పాలక పక్షం నిజాయతీగా పనిచేయాలి . లేకుంటే అమరావతి ఏనాటికైనా వర్త మానమే.